Thursday, 25 August 2011

అన్నా హజారే"సుబ్బూ! కొందరు కాఫీ మాత్రమే తాగుతారు, దేశం గూర్చి అస్సలేమీ పట్టించుకోరు." వ్యంగ్యంగా అన్నాను.
             
ప్రశాంతంగా కాఫీ సేవిస్తున్న సుబ్బు నావైపు ఆశ్చర్యంగా చూశాడు. 
               
"ఏం లేదు, దేశమంతా అన్నాహజారే ఉద్యమంతో అట్టుడిగిపోతుందిలే. విషయం నీదాకా వచ్చినట్లులేదు." నవ్వుతూ అన్నాను.

 సుబ్బు ఒకక్షణం ఆలోచించి చెప్పసాగాడు.

"మిత్రమా! మనం రైలుని ఉదాహరణగా తీసుకుంటే విషయం ఈజీగా అర్ధమవుతుంది. రైల్లో ఏసీ పెట్టెలుంటయ్, జెనరల్ పెట్టెలూ వుంటాయి. ఏసీ పెట్టెవాడికి ఏసీ సరీగ్గా పన్జెయ్యట్లేదనీ, దిండు గలీబుల మీద మరకలున్నయ్యనీ చిరాకు పడుతుంటాడు. జెనరల్ పెట్టెవాడు తాగటానికి నీళ్ళు లేవనీ, ఉచ్చకంపు కొడుతుందనీ అరుస్తుంటాడు. ఒక తరగతివాడి ప్రాణసంకటం వేరొక తరగతివాడికి వినోదం. అవడానికి అందరూ ప్రయాణీకులే, కానీ ఒకడి గోల మరొకడికి పట్టదు. అదేవిధంగా మనదేశంలో పౌరసమాజంలో అనేక తరగతులున్నయ్. ఒక తరగతివాళ్ళు - వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకీ, అక్రమాలకీ కడుపు మండి.. తమ నాయకునిగా అన్నాహజారేని పెట్టుకుని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, మంచిదే కదా! ఇందులో ఎవరికి మాత్రం అభ్యంతరం వుండాలి? అడగనీ!"            

 "అంటే - అన్నాహజారే ఉద్యమంతో నీకు సంబంధం లేదా?" అడిగాను.
           
"ఉద్యమం నాకు సంబంధం లేని అంశాల మీద జరుగుతుంది. నాకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, పొలం లేదు. అంచేత - అన్నాహజారే లేవనెత్తిన విషయాలతో నాకు సంబంధం లేదు." అన్నాడు సుబ్బు.    
           
"ఇది ఘోరమైన ఆలోచనా విధానం. నాదాకా వస్తేగానీ తెలీలేదు అన్నట్లుంది." విసుక్కుంటూ అన్నాను. 
             
"ఇందులో ఘోరం ఏముంది! దున్నేవాడిదే భూమనో, ధాన్యం గిట్టుబాటు ధర పెంచాలనో - ఇంకో రెండు డిమాండ్లు అన్నాహజారే చేత చెప్పించు. అక్కడున్నవాళ్ళల్లో ఎంతమంది నిలబడతారో చూద్దాం. నీరా రాడియాతో పాటు బర్ఖాదత్ లాంటి వాళ్ళని అరెస్టు చెయ్యాలని కూడా హజారేతో చెప్పించు. రాంలీల మైదానంలో ఎన్ని టీవీ కెమెరాలు ఇరవై నాలుగ్గంటల లైవ్ కవరేజ్ కోసం మిగిలుంటాయో. ఇది నేను అన్నాహజారేని విమర్శించటానికి అనటం లేదు. ఎవడి దుకాణం వాడిది. రకరకాల దుకాణాలు, రకరకాల ఖాతాదారులు. కందిపప్పు ధర పెరిగిందని ఒకడు ఏడుస్తుంటే, విమానప్రయాణం పెనుభారమైందని ఆక్రోశించేవాడు ఇంకొకడు. ఎవడికివాడే తనది మాత్రమే న్యాయమైన డిమాండనీ, దేశమంతా తన సమస్య గూర్చే ఆలోచించాలంటాడు. సాధారణంగా ఈ కందిపప్పూ, విమానాల మధ్య పరస్పర సహకారం ఉండదు. ఎందుకంటే వీరిద్దరిదీ రాజకీయంగా పరస్పర విరుద్ధ వైఖరి. ఈ వైఖరే అన్ని ప్రభుత్వాలకి శ్రీరామరక్ష." అన్నాడు సుబ్బు.

"కేంద్రప్రభుత్వం దిగొచ్చింది. అన్నాహజారేనా! మజాకానా!" నవ్వుతూ అన్నాను.
           
"ఇటువంటప్పుడు రాజ్యం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. అసలు సమస్య ఏమిటో దానికి తెలుసు. ఆ సమస్య పరిష్కరించే ఉద్దేశం రాజ్యానికి వుండదు. కానీ - పరిష్కరిస్తున్నట్లు నటించడమే రాజ్యానికున్న ప్రస్తుత కర్తవ్యం. ఇక్కడ ఎవరి లెక్కలు వారికున్నయ్ - టేవీ చానెళ్ళవారికీ, అన్నా హజారేతో సహా!" అన్నాడు సుబ్బు.
             
"గ్రేట్ ఎనాలిసిస్, ఇవ్వాళ నీ పెసరట్టులో ఏదో కలిసింది." మెచ్చికోలుగా అన్నాను. 
             
చిరునవ్వుతో ఖాళీ కప్పు  టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"నేవెళ్ళాలి. దారిలో అమ్మకి మందులు కొనుక్కెళ్ళాలి. ఇప్పటికే లేటయ్యింది." అంటూ నిష్క్రమించాడు  సుబ్బు.

(photo courtesy : Google)                 

Wednesday, 24 August 2011

ప్రాణంబుల్ ఠావున్దప్పె

సోమవారం, సమయం మధ్యాహ్నం వొంటిగంట. ఆస్పత్రంతా హడావుడిగా వుంది. సాధ్యమైనంత త్వరగా కేసులు డిస్పోజ్ చేస్తున్నాను.

కన్సల్టేషన్ చాంబర్లో నా యెదురుగా ఓ మధ్యవయసు ఇల్లాలు. ముక్కు తుడుచుకుంటూ నిశ్శబ్దంగా రోదిస్తుంది.

"నేను బ్రతకను, చచ్చినా బ్రతకను. అసలు నేనెందుకు బ్రతకాలి? చావే నాకు గతి. మా అత్తో సూర్యాకాంతం, నన్ను రాచి రంపాన పెట్టడమే ఆ ముసల్దాని పని. నా మొగుడో చేతగాని సన్నాసి. నాకు వైద్యం వద్దు, చావడానికి విషం కావాలి."
                     
ఇంతలో - బయట వెయిటింగ్ హాల్లో 'దబ్బు'న  శబ్దం. పెద్దగా కేకలు, అరుపులు, ఆర్తనాదాలు.

అడ్డు పడుతున్న నర్సుని తోసేసుకుంటూ ఆరడగుల భారీమనిషి సుడిగాలిలా లోపలకి దూసుకొచ్చాడు. అతను కొన్నాళ్లుగా నా పేషంట్, పేరు రాంబాబు. లోపలకొచ్చి నా యెదురుగా నిలబడి, నావైపు తీక్షణంగా చూడసాగాడు. వెయ్యి వడగాల్పుల ఆ చూపు పదునైన కత్తిలా, మృత్యుకౌగిలిలా వుంది.  

క్షణకాలం నాకేమీ అర్ధం కాలేదు. అర్ధమయ్యాక భయమేసింది, కాళ్ళల్లో వణుకు మొదలైంది. ఇప్పుడెలా? కనీసం పారిపోయే అవకాశం లేదు. రాంబాబు బలిష్టుడు, బరువు వందకిలోల పైమాటే. నాలాంటి అర్భకుణ్ణి వొకే వొక్క గుద్దుతో చంపగల ధీశాలి. నా మనసంతా బరువుగా అయిపొయింది. రౌడీగాడు చివరాకరికి తోటి రౌడీచేతిలో చచ్చినట్లు - నా చావు నా పేషంట్ చేతిలోనే రాసిపెట్టి వుందన్నమాట! 

మిత్రులారా! సెలవు, సెలవు, సెలవు. భగవాన్! నా తప్పులు మన్నించు. ఓసారి శంకర విలాస్‌లో టిఫిన్ చేసి బిల్లెగ్గొట్టాను, మెడికల్ కాలేజ్ లైబ్రరీలో పెథాలజీ బుక్కొకటి జాతీయం చేశాను. ఇవన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నానంటే - చేసిన పాపం చెబితే పోతుందంటారు, అందుకే పొయ్యేముందు నా జీవితంలోని చీకటి కోణాలు చెబుతున్నా. దేవుడా! నీవెంత నిర్దయుడవి! సినిమా టికెట్ చింపినంత ఈజీగా నేటితో నా టికెట్ చింపేస్తున్నావా?

సరే! నా చావెలాగూ ఖాయమైపోయింది, అదేదో నొప్పి లేకుండా వస్తే బాగుండు (ఇలా కోరుకోవడం మినహా ఇప్పుడు నాదగ్గర ఆప్షన్ లేదు). అంచేత - చావుకి సిద్ధమై కసాయివాని ముందు నిలబడ్డ గొర్రెలా టెన్షన్‌గా రాంబాబుని చూస్తూ అలా వుండిపొయ్యాను.

ఇంతలో -

రాంబాబు రెండుచేతులూ జోడించి వినయంగా నమస్కరించాడు! 

"గుడ్మార్నింగ్ డాక్టర్!" 

ఇది కలా, నిజమా? మండుతున్న అగ్నిగుండంలోంచి చల్లని స్విమ్మింగ్ పూల్‌లోకి దూకినంత హాయిగా అనిపించింది. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్నవాడికి కేసు కొట్టేసినంత రిలీఫ్‌గానూ అనిపించింది. 
                 
"మీరు నాయందు దేవుడు డాక్టర్. ఇన్నాళ్ళూ నా మెదడులో మైక్రోచిప్ పెట్టి నా ఆలోచనలల్ని పాకిస్తాన్ వాళ్ళకి ప్రసారం చేస్తున్న దుర్మార్గుడు దొరికేశాడు. వాడెవడో కాదు, నా అన్నే. డబ్బు మనిషిని యెంత హీనానికైనా దిగజార్చేస్తుంది." అన్నాడు రాంబాబు.    
                   
ముక్కు తుడుచుకుంటూ ఇల్లాలు కుర్చీలోంచి లేవబోయింది.

"లేవకు, కూర్చో అక్కా! ఈ డాక్టర్ దేవుడు. నువ్విక్కడే వైద్యం చేయించుకో. ఎంతోమంది డాక్టర్ల దగ్గిర మందులు వాడాను, మైండంతా గజిబిజిగా ఉండేది. ఈ డాక్టర్ చేతిచలవతో నా మైండ్ క్లీన్‌గా అయిపోయింది." అన్నాడు రాంబాబు.
                 
సో, రాంబాబుకి నామీద దాడిచేసే ఉద్దేశ్యం లేదు. ధైర్యం పుంజుకున్నాను.  

"రాంబాబు, నీతో మాట్లాడాలి" వణుకుతున్న గొంతుతో అన్నాను. 
                 
రాంబాబు నాకు మళ్ళీ నమస్కారం చేశాడు.

"నాకు జబ్బు పూర్తిగా నయమైపోయింది డాక్టర్. నాకిక మీ మందులు అవసరం లేదు. మా అన్నని బాగా కొట్టాను. ఒక దేశద్రోహిని శిక్షించకుండా వదిలితే అది దేశద్రోహమంత నేరం." అంటూ ఒక్కఉదుటున బయటకెళ్ళిపోయాడు.    
                 
ఆలోచనా రహితంగా అలా కూర్చుండిపొయ్యాను. 

నర్సు చెప్పింది - "రాంబాబు అన్న పారిపొయ్యాడు, అతన్ని వెతుక్కుంటూ రాంబాబూ వెళ్లిపొయ్యాడు."
                 
హమ్మయ్య! చల్లబడ్డ కాళ్ళూ, చేతుల్లోకి నిదానంగా రక్తప్రసరణ మొదలయ్యింది. ఏసీలో పట్టిన చెమట చల్లగా అనిపిస్తుంది. వేగంగా కొట్టుకున్న గుండె నిమ్మళిస్తుంది. భయంతో తడారిన గొంతుని చల్లని నీళ్లతో తడుపుకున్నాను. 

గుండెల్లోకి తుపాకీగుండు దూసుకెళ్లినా, కంఠాన్ని కత్తితో కసుక్కున కోసినా యెవీఁ అవకపోతే యెలా వుంటుందో ఇప్పుడు నాకలా వుంది! 
               
"నేను బ్రతికి ప్రయోజనవేఁంటి? చిటికెడు విషం ఇప్పించండి, పీడా వదిలిపోతుంది." ముక్కు తుడుచుకుంటూ మళ్ళీ మొదలెట్టింది ఇల్లాలు.

అబ్బబ్బ! అసలు చావు తప్పింది గానీ ఈ ఇల్లాలితో చచ్చే చావు ఛస్తున్నాను!!

(సంఘటన - వాస్తవం, 'రాంబాబు' పేరు - కల్పితం.)

(posted in fb on 17/07/2017)  

Sunday, 21 August 2011

ఆధ్యాత్మికత - దోసె


"పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్ళేప్పుడు ఏమీ తీసుకెళ్ళలేవు. ఈ నడుమ కాలానికి నీకెందుకింత తాపత్రయం?"  

ఉదయాన్నే మెళుకువొచ్చి, ఏంచెయ్యాలో తోచక  టీవీ పెట్టంగాన్లే టీవీలోంచి ఓ గడ్డపు స్వామీజీ సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు. గుండె ఝల్లుమంది. 

"జీవితం బుద్బుధప్రాయం. కోపతాపాలు జయించినవారే అనిర్వచనీయమైన ఆనందం పొందగలరు. ప్రశాంత మనసుతో లోకాన్ని జయించండి." 

'అవున్నిజం' అనుకుంటూ ఛానెల్ మార్చాను. మార్చిన చానెల్లో కూడా ఇంకో గడ్డం స్వామీజీ అబిభాషణ -

"సమస్త రోగములకు జిహ్వాచాపల్యమే కారణం. రుచి అన్న పదాన్ని జయించండి. శరీరమనే ఈ కట్టెని నిలుపుటకు ఇన్ని రుచులు అవసరమా?" 

చాల్చాలు, నాకు అద్భుత జీవిత సత్యాలు అర్ధమైపోయాయి. ఈరోజు నాజీవితంలో సుదినం. ఉదయాన్నే లేవడం నా అదృష్టం, గొప్ప జీవితసత్యాలు గ్రహించాను. ఈక్షణం నుండే కోపం, ఆకలి వంటి పదాలకి విడాకులిచ్చేస్తున్నాను. పోతే పోనీ సతుల్, సుతుల్, హితుల్. వస్తే రాని కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాల్. ఏమైనా కాని ఏమొచ్చినా కాని ఇక జీవితంలో కోపగించను గాక కోపగించను. 

'తివిరి ఇసుక నుండి.. ' పద్యం పాడుకుని, చివరి పాదం 'ఎవరు ఎంతకష్టపడిననూ ఈ జ్ణానికి కోపమ్ము తెప్పించలేరు' అని పూరించుకున్నాను.      
                        
ఒక్కసారిగా గుండెలనిండా గాలి పీల్చి వదిలి పరిసరాలు పరికించి చూశాను. మనసంతయూ ఆనందడోలికలలో తేలియాడుతున్నట్లుంది. ఏమి ఈమాయ! ఎంత ప్రశాంతంగా యున్నది!! ఎంత హాయిగా యున్నది!! ఇకనుండి టీవీలో స్వామీజీలకిమల్లే నేనుకూడా కోపమనే చీకటిని వదిలి ప్రశాంతమనే వెలుగులో, చిరునవ్వే ఆయుధంగా బతకాలి. 

నా జీవితంలో సంభవించిన ఈ పెనుమార్పులు ఫ్లాష్ న్యూస్‌గా నా స్నేహితులకి తెలియజెయ్యాలి. కోపతాపాల్లేని జీవితం ఎంతటి ఆనందమయమో వారందరికీ చెప్పి ఒప్పించి, వారిని కూడా నా శాంతిమార్గంలోకి తీసుకురాకపోతే స్నేహానికి విలువలేదు. ఇకనుండీ అందరికీ నాలో ఓ చిత్తూరు నాగయ్య, ఓ గుమ్మడి కనిపిస్తారు.
                          
"సార్! టిఫిన్ తెచ్చా. టేబుల్ మీద పెడుతున్నా." అన్న మాటకి ఇహలోకంలోకి వచ్చాను. అతను నా దగ్గర కొత్తగా చేరిన డ్రైవర్. ఆనందభవన్ నుండి తెచ్చిన మసాలాదోశ పార్సెల్ని వినయంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.  
                       
అన్నట్లు చెప్పడం మరచాను. ఇవ్వాళ మసాలాదోశ తినాలని నిన్నరాత్రే నిర్ణయించుకున్నాను. ఉదయాన్నే ఆనందభవన్‌కెళ్ళి మసాలాదోశ తెమ్మని పురమాయించాను. ఈలోపుగా టీవీ గడ్డం స్వామీజీలు జీవితరహస్యాలు చెప్పేశారు.   

చేతులు వాష్ చేసుకుంటూ ఒకక్షణం ఆలోచించాను.  

'బుద్బుధప్రాయమైన జీవితానికి ఈ మసాలాదోశ అవసరమా? ఈ అశాస్వత శరీరానికి తుచ్ఛమైన జిహ్వాచాపల్యమేల? అర్జంటుగా ఈ మసాలాదోశని త్యజించాలి. నా నిగ్రహశక్తికి పరీక్ష మసాలాదోశతోనే ప్రారంభం. 

అయితే ఒక చిన్న ధర్మసంకటం - 
                     
ఇవ్వాళ మసాలాదోశ తినాలనేది నాకు జ్ఞానోదయం కాకముందు తీసుకున్న నిర్ణయం. కావున ఇక్కడ వ్రతభంగమేమీ కలుగలేదని నా అభిప్రాయం. అయినా - తెచ్చుటకు డ్రైవరెవ్వడు? తినుటకు నేనెవడిని? అంతా పైవాడి లీల. ఈరోజు నేను మసాలాదోశ తినవలెనని ఎప్పుడో నిర్ణయమైపోయుంటుంది. తుచ్చ మానవులం - కాదన్డానికి మనమెవ్వరం? 

అయినప్పటికిన్నీ - మిత్రులారా! నాజీవితంలో ఇదే చివరి మసాలాదోశ అని హామీ ఇస్తున్నాను. ప్రేయసిని కడసారి చూసుకుంటున్నట్లు అపురూపంగా, ఆప్యాయంగా నా 'చివరి మసాలాదోశ' పార్సెల్ విప్పాను.
                         
గుండెల్లో గునపం దిగిందా? నెత్తిమీద పిడుగు పడిందా? పార్సెల్ చుట్ట లోపల ఉంది మసాలాదోశ కాదు. ప్లెయిన్ దోశ. ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొచ్చింది. ఆవేశంతో, ఆగ్రహంతో మొహమంతా వెచ్చగా ఆవిర్లు. 

ఈ బక్కపీచు, చెరుగ్గడ డ్రైవరుగాడికి మెదడు మోకాల్లో ఉందా? చెవిటిముండాకొడుకు. దరిద్రుడు, పంది, దున్న, ఎద్దు, కుక్క. దరిద్రుణ్ని కుక్కల్తో కరిపించాలి, పందుల్తో పీకించాలి.  
                      
డ్రైవర్‌ని రమ్మని కబురంపించాను. బిక్కుబిక్కుమంటూ వచ్చాడు. నన్ను చూడంగాన్లే భయపడ్డట్టు వెనక్కి తగ్గాడు. 

"ఏమయ్యా! నీకు బుర్ర లేదా? నేను చెప్పిందేమిటి, నువ్వు తెచ్చిందేమిటి?" 
                     
నా మాటలకన్నా నా ఉగ్రరూపం అతన్ని భయపడేలా చేసుండాలి. 

"పొరపాటయింది సార్" ఏదో నసుగుతున్నాడు. 

దొంగ రాస్కెల్! నాకు కోపం నషాళానికంటింది. ఎదురుగా ఉన్న దోశని విసిరి నేలకేసి కొట్టాను. దోశ, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి, అరిటాకులు.. చిందరవందరగా గచ్చుమీద పడ్డాయి. క్షణంలో డ్రైవర్ మాయమైపోయాడు.
                       
ఆగ్రహం క్రమేపి దుఃఖంలోకి మారింది. అయ్యో! మసాలాదోశ తిందామని ఎంత ఆశపడ్డాను! మసాలా అట్టు తల్చుకోంగాన్లే నోట్లో నీరూరుతుంది. బంగాళదుంపకూరని అట్టుముక్కతో చుట్టి కొబ్బరీ, అల్లం చట్నీలతో కలిపి నోట్లోకి నెడితే - నాసామిరంగా, ఆ రుచిని ఏమని వర్ణించను? కొలిస్తే స్వర్గానికి బెత్తెడు దూరం! 

మిత్రులారా! ఆనందభవన్ మసాలాదోశ నన్ను రారమ్మని పిలుస్తుంది. ఇంక నేను ఆగలేను. నేనిప్పుడే ఆనందభవన్ కి వెళుతున్నా. టాటా! బై బై!

మీకు చెప్పదలచిన విషయం నేనేమీ మర్చిపోలేదు. కోపాన్నీ, జిహ్వాచాపల్యాన్నీ జయించే చిట్కాలు మీకు నేను చెప్పవలసి ఉంది . అది నా బాధ్యత. 

కానీ - అర్జంటుగా మసాలాదోశ తినకపోతే చచ్చేట్టున్నాను! తర్వాత తీరిగ్గా చెబుతాలే!!

Saturday, 13 August 2011

భాష - పెసరట్టు


"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ కూర్చీలో కూలబడ్డాడు సుబ్బు. 

టీవీలో తెలుగు భాష కమ్మదనంపై యేదో ప్రోగ్రామ్ వస్తుంది.  
              
"సుబ్బూ! తెలుగు భాషకి అన్యాయం జరిగిపోతుంది, మనం తెలుగుని రక్షించాలి." అన్నాను.   
              
"తెలుగు భాషని ఉద్ధరించేంతగా మనం ఎదగలేదు నాయనా. అయినా తెలుగు భాష మనం రక్షించేంత దుస్థితిలో ఉందా?" ఆశ్చర్యపొయ్యాడు సుబ్బు.  
             
"ఉందనే భాషాభిమానులు అంటున్నారు." అన్నాను.     
             
"వాళ్లంతే అంటార్లే. యే భాషైనా సత్తా ఉంటే నిలబడుతుంది, లేకపోతే పడుకుంటుంది. ఎన్ని మీటింగులు పెట్టి ఎంత గొంతు చించుకున్నా చచ్చేదాన్ని బ్రతికించలేవు, బ్రతికేదాన్ని చంపలేవు. మనని ఉప్మాపెసరట్టు తినమని ఎవడన్నా శాసిస్తున్నాడా? అయినా తింటూనే వున్నాంగదా!" అన్నాడు సుబ్బు. 
              
"తెలుగు గొప్పభాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్." గర్వంగా అన్నాను.   
              
"నాకు ఇటలీ భాష తెలీదు. ప్రతిమనిషికి తనకంటూ ఒక భాష ఉంటుంది. దాన్నే మాతృభాషనో, పితృభాషనో అంటారు. ఫలానా భాష గొప్పదని మనమెలా నిర్ణయిస్తాం? సపోజ్ మనం ఒరిస్సాలో పుడితే అప్పుడు 'ప్రపంచంలో ఒరియా భాషే గొప్పభాష' అని చంకలు గుద్దుకునేవాళ్ళం కాదా?" అన్నాడు సుబ్బు.

"దేశభాషలందు తెలుగుభాష లెస్స అన్నారు రాయలవారు, నేను కాదు." నవ్వుతూ అన్నాను. 

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ -

"రాయలవారు భాషల్ని యే ప్రాతిపదికన గ్రేడింగ్ చేశాడో నాకు తెలీదు. 'ఫలానా మా భాష మీ తెలుగుభాష కన్నా లెస్సు' అన్నవాడు నాకెప్పుడూ కనపళ్ళేదు. నాకు మాత్రం ఉప్మాపెసరట్టు కడుపులో పడితే కాకి అరుపు కూడా కోయిల పాటలా మధురంగా వినిపిస్తుంది." అన్నాడు సుబ్బు.   
              
"సుబ్బు! తమిళుల భాషాభిమానం చూసి సిగ్గు పడదాం." అన్నాను. 
              
"అరవ తంబిలది భాషా దురభిమానం, భాషా తాలిబానిజం. వాళ్ళే మన తెలుగువారిని చూసి పరభాషా సహనం అలవరుచుకోవాలి." 
              
"తెలుగు భాష తేనె కన్నా తియ్యనైనదని అంటున్నారు భాషాప్రేమికులు." అన్నాను.
              
"నిజమా! అలాగైతే షుగర్ రోగుల్ని తెలుగు భాషకి దూరంగా వుండమను!" నవ్వాడు సుబ్బు. 

"సుబ్బు! తెలుగు భాషోద్దారకులు నిస్వార్ధజీవులు." 

"అవునేమో! కాదన్డానికి మనమెవరం? కాకపోతే మన బాచిగాడి బాబాయ్ లాంటి భాషోద్దారకుల్ని చూస్తుంటే అలా అనిపించదు. ఆయన తెలుగుభాషని 'రక్షించటం' కోసం వ్యాసాలు రాస్తాడు, ఉపన్యాసాలు చెపుతాడు. తన పిల్లలకి మాత్రం శ్రద్ధగా ఇంగ్లీషు చదువులు చెప్పించి అమెరికాలో స్థిరపడేట్లుగా గట్టి కృషి చేశాడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.
              
"ఆయన తన పిల్లలకి వారికిష్టమైన చదువు చెప్పించాడనుకోవచ్చుగదా!" అన్నాను.  
              
"అవునా! తన పిల్లలనే ప్రభావితం చెయ్యలేనివాడు సమాజాన్ని ఎలా ఉద్దరిస్తాడు? అసలు విషయమేమంటే.. తెలుగుభాషని నెత్తికెత్తుకోవడం ఆయనకి బాగా గిట్టుబాటయ్యింది." అన్నాడు సుబ్బు. 

"సుబ్బు! ఒక సమాజాభివృద్ధికి భాష ఎంతగా ఉపయోగపడుతుందో నీకు తెలీదు. నీదంతా వితండవాదం." చిరాగ్గా అన్నాను. 

"అయామ్ నాటే లింగ్విస్ట్, ఒప్పుకుంటున్నాను. కానీ సందులు, సమాసాల పండిత తెలుగు భాష సమాజంలో నిచ్చెన మెట్ల వ్యవస్థని కాపాడ్డానికి భలే బాగా ఉపయోగపడింది. అందుకే ఇవ్వాళ కొన్నివర్గాలు భాషగూర్చి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక 'భాషంటే తల్లితో సమానం' అంటూ నీళ్లు నములుతున్నారు." అన్నాడు సుబ్బు.
              
"తెలుగుభాష గూర్చి ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను చంపేస్తాను." విసుక్కున్నాను.
              
"ఏమిటోయ్ - ఇందాకట్నించీ భాషా, గీషా అంటూ తెగ నీతులు చెపుతున్నావ్. అదేమన్నా చెరువా ఎండిపోవటానికి? ఏ భాషైనా దమ్ముంటేనే నిలబడుతుంది. తన భాషని ఉద్దరించమని బ్రిటీషోడు నిన్ను దేబిరించాడా? నీ పొట్టకూటికి ఆ భాష అవసరం కాబట్టి నేర్చుకున్నావ్. కేవలం భాష మీద ప్రేముంటే సరిపోతుందా? నీ పిల్లలిద్దరితో తెలుగు ఎమ్మే చేయించు, ఆకలిచావు చస్తారు." అంటూ కాఫీ తాగటం ముగించాడు సుబ్బు. 
              
"ఎనఫ్ సుబ్బు! డోంటాక్ రబ్బిష్!" అన్నాను.
              
"చివరగా ఒకమాట చెబుతా విను! వ్యవహారిక భాష అనేది సామాన్యుల నోళ్ళలో అద్భుతంగా గుబాళిస్తూనే ఉంటుంది. ఇప్పుడు పండిత భాషకే పొయ్యేకాలం వచ్చింది. పోతేపోనీ, దానివల్ల ఎవరికి నష్టం? ఒకవేళ నిజంగానే తెలుగుభాష అంతరించిపోయిందనే అనుకుందాం. అప్పుడు తెలుగుకి బదులుగా వేరొక కొత్తభాష వాడుకలోకి వస్తుంది గదా! మనకేంటి నష్టం? ఆ కొత్తభాషలోనే మనం మన ఉప్మాపెసరట్టుని పిలుచుకుందాం. భాష మారినా పదార్ధం మారదు గదా." అంటూ నిష్క్రమించాడు మా సుబ్బు.     
              
గాలివాన వెలసినట్లయింది. భాషని పెసరట్టు స్థాయికి దించేసిన సుబ్బు ధోరణికి బుర్ర తిరిగిపోయింది. తెలుగుభాష తననితాను సుబ్బువంటి అరాచక శక్తుల్నుండి రక్షించుకుంటుందని ఆశిస్తున్నాను!  

(fb post on 15 Dec 2017) 

Wednesday, 10 August 2011

లండన్ తగలబడుతుంది


"రవణ మావాఁ! అయిదే అయిదు నిమిషాల్లో నీ ముందుంటా. మంచి కాఫీ తాగుతూ నీకో శుభవార్త చెప్పాలి." ఫోన్లో నా ప్రియమిత్రుడు సుబ్బు. 

'వార్నాయనో! శుభవార్త అంటున్నాడు! కొంపదీసి ఈ వయసులో పెళ్ళిగిళ్ళీ అంటూ ఏదైనా సాహస కార్యం తలబెడుతున్నాడా!' ఆశ్చర్యపొయ్యాను.

సుబ్బు - నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నది అయిదేళ్ళ వయసులో. మా సుబ్బు ఎర్రగా, పొట్టిగా, బొద్దుగా వుండేవాడు. మావాణ్ని 'రుబ్బురోలు, గుమ్మడికాయ, గ్లోబ్' అంటూ వివిధ నామధేయాల్తో ఏడిపించేవాళ్ళు. పదోక్లాసు బోర్డువాళ్ళు మా సుబ్బుపై కక్షగట్టి పదేపదే అడ్డుపడ్డారు. దాంతో నేను మా సుబ్బుని వదిలేసి ముందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. మా సుబ్బు ఇంటరు దాటదామని తీవ్ర ప్రయత్నం చేశాడు గానీ - వల్ల కాలేదు. 

మా సుబ్బుతో నా స్నేహం ఈనాటికీ అవిచ్చిన్నంగా, డైలీ సీరియల్లాగా కొనసాగుతూనే వుంది. సుబ్బు నా రైట్ హేండని నేననుకుంటాను. నేనే తన రైట్ హేండని సుబ్బు ఫీలవుతాడు. ఎవడికి ఎవడు ఏ హేండయినా, మేమిద్దరం మాత్రం ఘోరమైన ఆప్తమిత్రులం - ఇది మాత్రం చచ్చేంత నిజం. 

సుబ్బుది బోర్లించిన గాంధీగారి సిద్ధాంతం. చెడు మాత్రమే వింటాడు, చెడు మాత్రమే చూస్తాడు, చెడు మాత్రమే మాట్లాడతాడు. మనిషి ఎంత మంచివాడో నోరంత చెడ్డది. సుబ్బుని యే అమ్మాయి చేసుకుంటుందో ఇబ్బంది పడుతుందనుకునేవాణ్ని. అదృష్టవశాత్తు మా సుబ్బు పెళ్ళి చేసుకోలేదు. తలిదండ్రులకి ఒక్కడే సంతానం. కూర్చుని తినేంత ఆస్తిపాస్తులున్నయ్.

మావాడు వైనంగా, ప్రశాంతంగా తింటాడు. తీరిగ్గా నాలుగైదు పేపర్లు తిరగేస్తాడు. గంటలకొద్దీ గుడ్లప్పగించి టీవీ వార్తలు ఫాలో అవుతాడు. కష్టపడి రోజూ రెండుపెట్టెల సిగరెట్లు ఊదేస్తాడు. నన్ను కలిసి కాఫీ తాగుతూ నాలుగు హడావుడి కబుర్లు చెప్పడం మావాడి హాబీ.  

ఆలోచిస్తుండగానే, సుబ్బు సుడిగాలిలా వచ్చాడు. 

"రవణ మావాఁ! లండన్ తగలడిపోతోంది. ఇక్కడ నువ్వింత ప్రశాంతంగా ఉన్నావేంటి? " మావాడి మోహం మతాబాలా వెలిగిపోతుంది. 
               


'ఏదో శుభవార్త చెబుతానని లండన్ గూర్చి మాట్లాడుతున్నాడేంటబ్బా!' అని ఆశ్చర్యపోతూ - 

"అవును సుబ్బు! ఇది చాలా ఘోరం." అన్నాను. 

"ఛస్.. నీకసలు బుద్ధుందా? బ్రిటోషోడు మన్ని రెండొందల యేళ్ళు లూటీ చేశాడుగదా. వాడి కొంప తగలడుతుంటే ఆనందించక ఘోరం ఆంటావేంటి! మన ఉసురు ఇన్నాళ్ళకి తగిలింది ఆ దౌర్భాగ్యుడికి." అన్నాడు సుబ్బు. 

"నువ్వు విషయాన్ని రాజకీయంగా మాట్లాడు సుబ్బూ. అంతేగానీ - పిల్లి శాపనార్ధాల టైపులో మాట్లాడకు." విసుగ్గా అన్నాను. 

"ఏవిటోయ్ నీ బోడి రాజకీయం. నేనేమీ హిందూ పేపరుకి ఎడిటోరియల్ రాయట్లేదు. నీ మర్యాదస్తుడి కామెంట్లు నీదగ్గరే ఉంచుకో. అమ్మా, అమ్మా, తెల్లతోలు గాడ్దెకొడుకులు. ఇట్లాంటి లూటీలు, దహనాలు మన అలగా దేశాల్లోనే సాధ్యమన్నట్లు ఎంత పోజు దొబ్బేవాళ్ళు. తిక్క కుదిరింది పాలిపోయిన పాచిమొహం సన్నాసులకి."

ఈలోపు కాఫీ వచ్చింది. ఆవేశంతొ కాఫీ గబగబా తాగేశాడు. 

"వచ్చిన పని అయిపోయింది. మళ్ళీ రేపు కలుస్తాలే. లండన్ శుభవార్త నీ చెవిలో వేసేదాక నాకు కాలూచెయ్యి ఆడలేదు." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు నా ప్రియమిత్రుడు సుబ్బు. 

(photos courtesy : Google)              

Tuesday, 9 August 2011

ఒక దోమ కధ


శనివారం రాత్రి. సమయం పది గంటలు. పేషంట్లతో విసుగ్గా వుంది. తల దిమ్ముగా, ఆకలిగా, నీరసంగా ఉంది. ఇంతలో 'గూయ్'మంటూ ఎక్కణ్ణించో ఎగురుకుంటూ వచ్చిందొక దోమ. చూస్తుండగానే ఎడమచేతి మీద వాలి కసుక్కున కుట్టింది. చురుక్కున మండగా 'అబ్బ' అంటూ కుడిచేత్తో 'ఫట్' మని దోమని కొట్టాను.

నా హత్యాయత్నం నుండి బయటపడ్డ ఆ దోమ రూమంతా చక్కర్లు కొట్టి నా మొహం ముందుకొచ్చి, నిలబడినట్లు పోజ్ పెట్టి 'గూయ్'మంటూ చాలెంజ్ చేస్తున్నట్లుగా నా కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూడసాగింది.

ఆఫ్టరాల్ ఒక దోమ నన్ను చాలెంజ్ చేస్తుందా! నాకు కోపం వచ్చింది. టేబుల్ మీదున్న మెడికల్ జర్నల్ తీసుకుని దాన్ని కొడదామని అనుకుంటుండగా.. ఆ దోమ నన్ను కోపంగా చూస్తూ "ఆగు. ఇప్పుడెందుకు నన్ను చంపాలనుకుంటున్నావ్?" అని ప్రశ్నించింది.

ఆశ్చర్యం - దోమ మాట్లాడుతుంది! 

"ఇందాక నిన్ను కుట్టాను. అప్పుడు నన్ను చంపాలనుకోటం నీ హక్కు. ఇప్పుడు నేను నిన్ను కుట్టలేదు. కుట్టకపోయినా నువ్వు నన్ను ఎందుకు హత్య చెయ్యాలనుకుంటున్నావ్? ఇది నా దోమహక్కులకి భంగం కలిగించటం కాదా?" ఆ దోమ రెట్టిస్తూ అడిగింది.

ఇదేదో మానవహక్కుల ఉద్యమకారుల రక్తం తాగి హక్కులు ఒట్టబట్టించుకున్న దోమవలేనున్నది.

"ఓ అలాగా! అయితే విను. ఈ ఆఫీస్ నాది. ఇందులో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే పూర్తి స్వేఛ్చ నాకుంది. నువ్వు నా పర్మిషన్ లేకుండా లోపలకొచ్చావు. పైగా నువ్వు దోమవు. మా మనుషులని కుట్టి బాధించటమే కాక మమ్మల్ని అనేక రోగాల బారి పడేస్తావు. నిన్ను చంపక ముద్దెట్టుకోమంటావా?" వెటకారంగా అన్నాను.

నా ప్రశ్నకి దోమ ఒకక్షణం ఆలోచించి.. దీర్ఘంగా నిట్టూర్చింది. ఆపై నిదానంగా చెప్పసాగింది.

"నిజమే! నేనో దోమని. మీ మునిసిపాలిటీ వాళ్ళు కల్తీ దోమలమందు కారణాన.. విజయవంతంగా మా అమ్మ గుడ్డులోంచి బైటకొచ్చాను. ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చానో నాక్కూడా మీ మనుషులకిమల్లే జీవించే హక్కు ఉంటుంది. నువ్వైతే పెసరట్లూ , బిరియానీలు తింటావ్. మా దోమలకి మనుషులని కుట్టి రక్తం పీల్చుకుని బ్రతకమని ఆ ఈశ్వరుడే నిర్ణయించాడు. శివుడాజ్ణ లేనిదే చీమైనా కుట్టదన్నారు. మా శరీర పోషణకి తప్పదన్నట్లు మీ నుండి రక్తాస్వాదన చేస్తున్నామేగానీ మా దోమజాతి మీ మానవుల్లా శాడిస్టులు కారు."

"ఆపు నీ మెట్టవేదాంతం. సరే ఇంతలా వేడుకుంటున్నావు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తా. తలుపు తెరుస్తున్నాను. నా మనసు మారకముందే పారిపో." చికాగ్గా అన్నాను.

దోమకి రోషమొచ్చింది.

"నాకేమీ నీ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. బయట ఉక్క పోస్తుంది. ఇక్కడ ఏసీ రూం చల్లగా ఉంది. అందుకే లోపలకొచ్చా. అయినా నువ్వు డాక్టరువి. మనలో మనం పరస్పరం సహకరించుకోవాలేగానీ కలహించుకోరాదు. మేం లేకపోతే మీ డాక్టర్లకి చాలా నష్టం. మేం కష్టపడి మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికన్‌గున్యా వ్యాధులు వ్యాప్తి చేస్తాం. మీ రంతా ఆ టెస్టూ, ఈ టెస్టూ అంటూ రోజుల తరబడి వైద్యం నానబెడుతూ బోలెడు డబ్బులు పోగేసుకుంటున్నారు. మీ ఆస్తుల్లో మాక్కూడా వాటా ఉంది. అన్నం పెట్టిన చేతిని నరుకుతాననటం నీ అల్పబుద్ధికి నిదర్శనం." అంటూ చిన్న లెక్చర్ ఇచ్చింది.

"ఓరేయ్ దోమగా! నా ఆస్తిలో వాటా అడుగుతున్నావ్. నీవంటి రక్తపిశాచితో ఇప్పటిదాకా మాట్లాడటమే దండగ. నీ దరిద్రపుగొట్టు లాజిక్కులతో నన్ను వొప్పించాలని చూడకు. అసలు నీ బ్రతుకే...." ఈసడించుకోబొయ్యాను.

"హ.. హ.. హా! మమ్మల్ని రక్తపిశాచిలంటున్నావ్! మేం పొట్ట నింపుకోటానికే రక్తం తాగుతాం. మరి మీరో? దురాశతో ఒకళ్ళనొకళ్ళు నరుక్కోటల్లేదా? మీ రాజ్యంతో పోలిస్తే మేమెంతటి సాధుస్వభావులమో అర్ధమౌతుంది." అని విసురుగా అంది.

సందేహం లేదు, ఇది కమ్యూనిస్టు దోమే. 

ఇంతలో నైట్ డ్యూటీ స్టాఫ్ లోపలకొచ్చాడు. నాకెదురుగా, మొహానికి దగ్గరగా ఎగురుతున్న దోమని చేతిలోనున్న కేస్ షీటుతో ఒక్కదెబ్బ వేశాడు. దోమకి మాడు పగిలింది. "చచ్చాన్రో దేవుడా!" అంటూ ఆర్తనాదం చేస్తూ బయటకి పారిపోయింది.

అర్ధగంట తరవాత - తలకి కట్టుతో దోమ కనబడింది.

"మిత్రమా! దెబ్బ బాగా తగిలినట్లుంది." జాలిగా పలకరించాను.

"నీకు నాతో శాంతి చర్చలు జరపటం ఇష్టం లేదు. తరతరాలుగా మా జాతిని నాశనం చెయ్యటానికి కుట్రలు పన్నుతున్న మీ మనుషులతో చర్చలు అర్ధరహితం. కాబట్టి ఇకనుండి దొరికినవాణ్ణి దొరికినట్లు రక్తం పీల్చి పడెయ్యటమే నా ప్రణాళిక." కోపంగా అంటూ నా మెడమీద వాలి, కసిగా కసుక్కున కుట్టి పారిపోయింది దోమ.

మెడమీద సర్రున మండింది.

'ష్.. అబ్బా! ఈ దోమ ముండకి బుర్ర పగిలినా తొండంలో పవర్ మాత్రం తగ్గలేదు.'  

(picture courtesy : Google)                                         

Saturday, 6 August 2011

దీపం పురుగుల అజ్ఞానం!


"డాక్టరుగారు! నా భార్య నోరు మంచిది కాదు, రోజూ ఏదో ఒక విషయంలో తగాదా. ఆమె తిట్టే తిట్లకి చచ్చిపోవాలనిపిస్తుంది." ఓ భార్యాబాధితుని ఆక్రందన. అతన్ని జాలిగా చూశాను. ఇవ్వాళ నాకిది మూడో ఆక్రందన. 

సైకియాట్రీ ప్రాక్టీసులో భార్యాబాధితుల కేసులు ఎక్కువే. సైకియాట్రిస్టుల స్థిరమైన సంపాదనకి కారణమైన భార్యల పట్ల మాకు ప్రత్యేకమైన అభిమానం వుంది. అంచేత - సైకియాట్రిస్టులంతా కలిసి 'భార్య'కి అంతర్జాతీయ స్థాయిలో సన్మానం చేయాలని కోరుకుంటున్నాను!
                
వర్షాకాలంలో తెగ హడావుడి చేసే దీపం పురుగులు గుర్తున్నాయా? ఈ దీపం పురుగులు దీపం చుట్టూ తిరిగితిరిగి, సీతమ్మవారు అగ్నిప్రవేశం చేసినట్లుగా ఒకటొకటిగా దీపం (మంట) లోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాయి. తనకన్నా ముందు తోటిపురుగొకటి మంటల్లో మలమల మాడి చావడం చూస్తూకూడా క్రమశిక్షణగా, ఓ కర్తవ్యనిర్వహణగా, బుధ్ధిగా అగ్నికి ఆహుతి అవుతుంటాయి. బుర్రలేని దీపప్పురుగుల కథకి నవ్వొస్తుంది కదూ. ఒక్కక్షణం ఆగండి. ఈ suicide squad పురుగులన్నీ మగజాతివని నా నమ్మకం.
                 
కాలేజీరోజుల్లో ఇంటెదురు మేడమీద అవధాని అనే ఒక బహుకుటుంబీకుడు అద్దెకుండేవాడు. ఆయన అత్యంత పీలగా అస్థిపంజరానికి తోలు కప్పినట్లుండేవాడు. నిరాశగా, నిర్లిప్తంగా, గాజుకళ్ళ శూన్యదృక్కులతో ప్రాణమున్న శవంలా వుండేవాడు.  

అవధాని భార్యామణి లావుగా, పొట్టిగా ఉంటుంది. ఆవిడ గొంతు మైక్ కనిపెట్టక ముందటి రోజుల్లోదని నా నమ్మకం. ఆవిడ స్టోన్ చౌకబారు రికార్డింగ్ డ్యాన్సు మైకుకన్నా బిగ్గరగా, బండగా, కఠినంగా వుంటుంది. ఆవిడకి వంటపని, ఇంటిపనితో పాటు మొగుణ్ణి తిట్టే పని కూడా చాలా ఎక్కువగా వుండేది. ఆవిడ చిన్నప్పుడే ప్రపంచంలో వున్న తిట్లన్నీ పచ్చడిగా రుబ్బేసి గారెల్లో  నంజుకుని తినేసిందేమోనని నా అనుమానం.  

మొదట్లో అవధాని చెవిటోడేమోననుకున్నా, కానీ కాదు! భార్య ఎంత తిట్టినా దించిన తల ఎత్తడు. చిన్నప్పుడే ఏదైనా యాక్సిడెంటయ్యి అవధాని చీమూ, నెత్తురూ కోల్పోయాడేమో! మగజాతికి తలవంపులు తెస్తున్న దిష్టిబొమ్మలాంటి అవధానిని అసహ్యించుకునేవాడిని. అవధాని భార్యని హత్య చేసి జైలుకెళదామని ఎన్నొసార్లు అనుకున్నాను, ధైర్యం లేక మానుకున్నాను. 
               
కాలం ఎంత తొందరగా కరిగిపోయింది! ఇప్పుడు నేను అవధాని వయసు వాడనయినాను. చిత్రం! నాకిప్పుడు అవధానిలో జీవితాన్ని కాచి వడబోసిన ఒక తత్వవేత్త కనిపిస్తున్నాడు. హిట్లర్ తెలివైనవాడు కాబట్టే పెళ్ళి చేసుకున్న మరుక్షణం ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్దుల్ కలాం పెళ్ళి చేసుకున్నట్లయితే కలలు కనడం మాని.. వంటపని, ఇంటిపని చూసుకునేవాడని అనుకుంటుంటాను. 
               
ఆ మధ్య ఓ నిరాశావాది - భార్యతో సంతోషాన్ని పంచుకుందామనుకునేవాడిని ఎడారిలో ఎండమావుల కోసం వెదుక్కునే కలల బేహారితో పోల్చాడు. భార్యాపీడితుడై, ఆపై నిర్వికార జీవితాన్ని వెళ్ళబోస్తున్న ఓ జ్ఞాని ఈమధ్య ఇలా శెలవిచ్చాడు. "కుక్క 'భౌ.. భౌ' మనును.  పిల్లి 'మ్యావ్.. మ్యావ్' మనును. భార్య చీపురుకట్ట తిరగేయును. ఇది ప్రకృతి ధర్మం నాయనా!" ఇతగాడి జీవితం మరీ కుక్కలు చింపిన విస్తరి బాపతులా ఉంది!
              
మరి ఇంతమంది ఇన్నిరకాలుగా బాధలు పడుతూ కూడా పెళ్ళెందుకు చేసుకోవటం? ఎందుకంటే దీపం పురుగుల్లాగానే మగాళ్ళు కూడా అజ్ఞానులు కనుక! ఇప్పుడు నవ్వుకోండి.. దీపం పురుగుల అజ్ఞానానికి!

(picture courtesy : Google)

Tuesday, 2 August 2011

మిర్చిబజ్జీలు.. ఒక దారుణ హత్యాకాండ!


బంగాళాఖాతంలో వాయుగుండం, రెండ్రోజులుగా ఒకటే వర్షం.. ఎడతెరిపి లేకుండా సినిమా వానలా ఝాడించి కొడుతుంది. వాతావరణం చలిచలిగా, మబ్బుమబ్బుగా, స్తబ్దుగా ఉంది. 

ఇట్లాటి సమయాల్లో కవులు కవితలు రాస్తారు, నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు తినాలనిపించింది. ఈ చల్లని సమయంలో 'మిరపకాయ బజ్జీలు తిననివాడు దున్నపోతైపుట్టున్!' అనే నాకు తెలిసిన న్యూనుడి నా భార్యకి కూడా నచ్చుటచే వంటిల్లు బజ్జీలతో సిద్ధమైంది.

అసలు 'బజ్జీ' అన్న పేరే సెక్సీగా లేదూ! బజ్జీ లేని భోజనం కర్ణుడు లేని భారతంలాంటిదని నా నమ్మకం. బజ్జీలు అనేక రకాలు - ఘాటైన మిర్చిబజ్జీలు, కమ్మటి వంకాయ బజ్జీలు, రుచికరమైన బంగాళదుంప బజ్జీలు, మెత్తటి అరటికాయ బజ్జీలు, కరకరలాడే ఉల్లిపాయ బజ్జీలు.. ఇలా రాసుకుంటూ పోవచ్చు.

చదువుకొనే రోజుల్లో స్నేహితుల్తో సాయంకాలాలు మిరపకాయ బజ్జీలు తినడం, గోళీసోడా తాగుతూ కబుర్లు చెప్పుకోవడం.. నిన్నమొన్నలా అనిపిస్తుంది. మిరపకాయ బజ్జీ నోట్లో కెళ్ళంగాన్లే రాముడులాంటివాడు రావణుళ్లా వీరావేశంతో ఊగిపోయేవాడు.. మిర్చి ఘాటు ప్రభావం! కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల గ్రూపులు.. అమెరికా అనుకూల, ప్రతికూల గ్రూపులు.. గవాస్కర్, విశ్వనాథ్ క్యాంపులు.. కాదేది వాదనకనర్హం?!    

నా పిల్లలకి బజ్జీ విశిష్టతనీ, ప్రాచుర్యాన్నీ.. మరీ ముఖ్యంగా బజ్జీలకి నాయకుడైన మిర్చిబజ్జిగాడి రుచిని వివరించి.. ఓ రెండు మిర్చిబజ్జీలు ఆరగించితిని. కంట్లోంచీ, ముక్కులోంచి నీళ్ళు కారుతుండగా, నోరు కారంతో మండిపోయింది. 'ఉఫ్ఫ్ ఉఫ్ఫ్' అనుకుంటూ, చల్లని నీళ్ళతో కడుపులో సంభవించిన అగ్నిప్రమాదాన్ని నివారుస్తూ, భోరున కురుస్తున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా.   

అప్పుడు నా కంటపడిందో దారుణ దృశ్యం. పిల్లలిద్దరూ మిరపకాయ బజ్జీలని తోళ్ళూడగొట్టి, మిరపకాయల్ని వేరే ప్లేట్లో పడేసి, బజ్జీ పిండిభాగాన్ని టొమేటో సాస్‌తో నంజుకుంటూ - 

"నాన్నోయ్! బజ్జీలు భలే బాగున్నయ్!" అన్నారు. 

నా మనసు చివుక్కుమంది, గుండె బరువెక్కింది. మిరపకాయల్లేని ఆ శనగపిండి తోళ్ళని బజ్జీలంటారేమిటి!  పైగా వాటి పక్కన రక్త పిశాచిలా భీతి గొలుపుతూ బోడి టొమేటో సాసొకటి! ప్లేట్లో - తోళ్ళు కోల్పోయిన మిరపకాయలు, రైలు యాక్సిడెంటయ్యాక వరుసగా పడుకోబెట్టిన నగ్నశవాల్లా దయనీయంగా పడున్నాయ్. 

ఏమిటీ దుస్థితి? బజ్జీలని ఇలా హత్య చెయ్యొచ్చునా? తెలుగుభాష  కోసం ఉద్యమాలు చేస్తున్నారు, తెలుగువంటకాల కోసం ఉద్యమం చేపట్టాలేమో! బజ్జీలు తిన్డం కూడా చేతకాని ఈ కొత్తతరం అజ్ఞానుల కోసం కోచింగ్ సెంటర్లు అవసరమేమో! 

(to post in fb)