Saturday, 26 November 2011

శ్రీరామరాజ్యం


"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. టీవీలో బాపు 'శ్రీరామరాజ్యం' కమర్షియల్ నడుస్తుంది. 

టీవీ వైపు చూస్తూ "ఈ బాపుకి ఎంత ఓపిక! అరిగిపోయిన రికార్డులా రామాయణాన్ని తీస్తూనే ఉన్నాడు గదా!" అన్నాడు సుబ్బు.

"ఓపికుంది, తీస్తున్నాడు. మనకెందుకు చెప్పు!" నవ్వుతూ అన్నాను.

"నాకు తెలుగు సినిమా దర్శకుల్ని చూస్తుంటే హోటల్లో అట్టుమాస్టర్లు గుర్తొస్తారు. మన ఆనందభవన్లో అట్టు మాస్టర్ ముత్తు గుర్తున్నాడా? నలభయ్యేళ్ళుగా అట్లు పోస్తున్నాడు. మనిషి కాలిన పెనంలా, ఎండిపోయిన చుట్టలా వుంటాడు. దించిన తల ఎత్తకుండా దీక్షగా బుల్లిగిన్నెలో పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా అట్లు పోస్తూనే ఉంటాడు." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?" 

"ముత్తు అట్లకాడతో స్టీలు మగ్గులోంచి నూనె అట్టుమీదకి జల్లటం ఎంతో కళాత్మకంగా వుంటుంది! పిండిచెయ్యిని నీళ్ళబొచ్చెలో ముంచి - కొన్నిట్లో బంగాళదుంప మసాలా, కొన్నిట్లో ఉల్లిపాయలు గుప్పిటతో ఎంతో పొందికగా పెడతాడు. మళ్ళీ నూనెని అట్లకాడతో ఇంకోరౌండ్ జల్లి, అట్టుని లాఘవంగా చుట్టి పక్కనున్న పెద్ద సత్తుప్లేట్ మీద పెట్టి, అట్లకాడతో టకటకమంటూ శబ్దం చేస్తాడు. ఆ టకటక - 'ఆర్డర్ రెడీ!' అని సర్వర్‌కి తెలియజేసే కోడ్." అన్నాడు సుబ్బు.

"విషయానికి రా." విసుక్కున్నాను.

"వస్తున్నా! వస్తున్నా! అట్లు పోయ్యటంలో గొప్ప ప్రతిభాశీలి అయిన ముత్తుకి ఇడ్లీలు వెయ్యడం రాదు! పొద్దస్తమానం అట్లుపోస్తూ, పక్కనే ఉండే ఇడ్లీమాస్టర్‌తో కబుర్లాడుతుంటాడు, కానీ ముత్తుకి ఇడ్లీ గూర్చి తెలీదు!" అన్నాడు సుబ్బు. 

"అవునా?!" ఆశ్చర్యపొయ్యాను. 

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు - "తెలుగు సినిమారంగం 'ముత్తు'ల మయం!"

"యెలా?" ఆసక్తిగా అడిగాను.  

"విఠలాచార్య ఒకేరకమైన సినిమాలు పుంజీలకొద్దీ తీశాడు. అన్నిసినిమాల్లో అవే గుర్రాలు, అవే కత్తులు! హీరో యెవరైనా - పులులు, పిల్లులు, కప్పలు మాత్రం రెగ్యులర్ ఆర్టిస్టులు. ఆయన జానపద సినిమాలు అనే 'అట్లు' పోసీపోసీ కీర్తిశేషుడయ్యాడు." అన్నాడు సుబ్బు.

"అవును, ఆయన్ని 'జానపద బ్రహ్మ' అంటారు." అన్నాను.

"కె.ఎస్.ఆర్.దాస్ లెక్కలేనన్ని 'డిష్షుం డిష్షుం' సినిమాలు తీశాడు. ఆయన దగ్గర ఇంకా పిండి మిగిలే ఉంది. కానీ - ఆయన అట్లు తినడానికి ప్రేక్షకులు అనే కస్టమర్లు మాయమయ్యారు, అంచేత నేచురల్‌గానే నిర్మాత అనే పెనం దొరకలేదు."

"అవును, ఆయన సినిమాల్ని ఫైటింగుల్తో చుట్టేశాడు!" అన్నాను.

"ఇంక రాంగోపాల్ వర్మ! గాడ్‌ఫాదర్ సినిమాని తిరగేసి తీశాడు, బోర్లించి తీశాడు, మడతపెట్టి  తీశాడు, చితక్కొట్టి తీశాడు, పిసికి పిసికి తీసాడు, ఉతికి ఉతికి తీశాడు! ఒకే పిండి, ఒకే అట్టు. రకరకాలుగా పేర్లు మార్చి కస్టమర్లని మోసం చేస్తుంటాడు."

"ఒప్పుకుంటున్నాను." నవ్వుతూ అన్నాను.

"బాపు రమణల స్పెషాలిటీ 'రామాయణం' అనే దోసెలు. రమణ మెత్తగా పిండిరుబ్బి బాపుచేతికి అందిస్తే, బాపు గుండ్రంగా అట్టు పోసేస్తాడు. ఒకసారి ముత్తుని - అట్టు కొంచెం పెద్దదిగా, స్పెషల్‌గా వెయ్యమని అడిగాను. మొహం చిట్లిస్తూ 'నా వల్లకాదు! చెయ్యి వణుకుద్ది, వాటం కుదరదు.' అని విసుక్కున్నాడు ముత్తు."

"నిజమా!" ఆశ్చర్యపోయాను.

"అవును. మలయాళ దర్శకుడు అరవిందన్ ఆంధ్రా అడవుల్లో చెంచుదొరల్తో 'కాంచనసీత' అనే సినిమా కొత్తదనంతో వెరైటీగా తీశాడు. కొత్తరకంగా ఆలోచించాడని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. కానీ - బాపురమణలు ముత్తుకి సోదరులు, కొత్తఐడియాలు వచ్చే అవకాశం లేదు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో, కానీ - బాపు రమణలు ప్రతిభావంతులు." అన్నాను.

"కాదని నేనన్లేదే! కానీ నువ్వో విషయం గ్రహించాలి. దోసెలన్నీ ఒకటే. అట్లే వృత్తులన్నీ ఒక్కటే. నీ వైద్యవృత్తి క్షురకవృత్తి కన్నా గొప్పదేమీకాదు. కానీ మనం కొన్ని ప్రొఫెషన్లకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. అలాగే విఠలాచార్య, కె.ఎస్.ఆర్.దాస్, వర్మ, బాపురమణలు ఒకేగొడుగు క్రిందకొస్తారు. కానీ మనం దేవుడి సినిమాలు తీసేవాళ్ళనే గొప్పవారంటాం. ఇక్కడ మతవిశ్వాసాలు కూడా ప్లే చేస్తాయి." అన్నాడు సుబ్బు.

"నీ ఎనాలిసిస్ బాగానే ఉంది. మరి 'శ్రీరామరాజ్యం' చూడవా?" అడిగాను.

"ఆ సినిమా తీసింది కుర్రాళ్ళ కోసం. మన్లాంటి ముసలాళ్ళ కోసం ఎన్టీరామారావు 'లవకుశ' ఉందిగా!" అన్నాడు సుబ్బు.

"బాపురమణలు తెలుగువాళ్లవడం మన అదృష్టం." నేనివ్వాళ సుబ్బుని ఒప్పుకోదల్చుకోలేదు.

"నేను మాత్రం కాదన్నానా? బాపురమణలకి రామాయణమే జీవనాధారం. అదే కథని నలభయ్యేళ్ళుగా నమ్ముకున్నారు. రామాయణాన్ని తీసేవాడు దొరక్కపొతే ఆ కథకే ప్యాంటూ, చొక్కా తొడిగి సోషల్ పిక్చర్లు చుట్టేశారు.. రామకోటి రాసినట్లు!"

"ఈ విషయం ఇంకెక్కడా అనకు, వాళ్ళ భక్తులు తంతారు." నవ్వుతూ అన్నాను.

సుబ్బు కాఫీ తాగటం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు.

"వాళ్ళకి ఫైనాన్స్ చేసేవాడు దొరికాడు, నటించేవాడూ దొరికాడు. అట్టు పోసేశారు. ఇష్టమైనవాడు చూస్తాడు, లేపోతే లేదు. ఎవడి గోల వాడిది. ఉప్మాపెసరట్టు అందరికీ నచ్చాలని లేదుకదా." అన్నాడు సుబ్బు.

"మొత్తానికి నీ అట్టు థియరీ బాగానే వుంది." నవ్వుతూ అన్నాను.

"థాంక్యూ! ముత్తు అట్లు పోస్తూనే ఉన్నాడు, బాపురమణలు రామాయణం తీస్తూనే వున్నారు!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు. 

(updated & posted in fb on 1/2/2018)

Thursday, 24 November 2011

ఫ్రాయిడ్ కష్టాలు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

ఎదురుగా వున్న టేబుల్‌పై పుస్తకాల్ని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు. ఆవి సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ పుస్తకాలు.

"ఏంటీ! ఈ రోజుల్లో కూడా ఇవి చదివేవాళ్ళున్నారా!" ఆశ్చర్యపోయాడు సుబ్బు.

"నేనున్నాను, నీకేమన్నా ఇబ్బందా?" అన్నాను.

"నాకేం ఇబ్బంది! కాకపోతే ప్రపంచం మారిపోతుంది. తెలుగునేలంతా జగన్, చంద్రబాబు అని కలవరిస్తుంది. నువ్వేమో జనజీవన స్రవంతికి దూరంగా ఏవో పురాతన పుస్తకాల్లో కొట్టుకుంటున్నావు." జాలిగా చూస్తూ అన్నాడు సుబ్బు.

"అంటే మనకి ఫ్రాయిడ్, రస్సెల్ ఇర్రిలెవెంట్ అంటావా?" అన్నాను.

"అవును. మన వూరు గుంటూరు, ఇక్కడ వుంటేగింటే చంద్రబాబు నాయుడుకి పనుంటుంది గానీ ఫ్రాయిడ్ కేమి పని! అసలీ ఫిలాసఫర్స్ గుంటూర్లో పుట్టుంటే వీళ్ళకథ వేరుగా ఉండేది. అదృష్టవంతులు కాబట్టి ఇంకేదో దేశంలో పుట్టి బతికిపొయ్యారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! డోంటాక్ రబ్బిష్." విసుక్కున్నాను.

సుబ్బు మాట్లాడలేదు.

ఇంతలో కాఫీ వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలెట్టాడు సుబ్బు.

"కొద్దిసేపు ఫ్రాయిడ్, రస్సెల్ గుంటూర్లో పుడితే ఏమయ్యేదో ఆలోచిద్దాం. ఇద్దర్నీ ఇంగ్లీషు మీడియం స్కూల్ అనే యేదోక దుకాణంలో చేర్పించేవాళ్ళు, పాఠాలు బట్టీ పట్టరు కాబట్టి మార్కులు తక్కువొచ్చేవి. ఇంక స్కూల్లో టీచర్లు, ఇంట్లో తలిదండ్రులు హింసించడం మొదలెట్టేవాళ్ళు."

"అంతేనంటావా?" సాలోచనగా అడిగాను.

"అంతే! టెన్త్ పాసయ్యాక ఇంటర్ చదువుకి ఇద్దరు మేదావుల్నీ కార్పొరేట్ కాలేజీలో పడేసేవాళ్ళు. అక్కడ ప్రతివారాంతం, ప్రతిదినాంతం, ప్రతి గంటాంతం, ప్రతి నిముషాంతం పెట్టే టెస్టులు రాయలేక చచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్లకి రెండే ఆప్షన్లు ఉండేవి." అంటూ ఆగాడు సుబ్బు.

"ఏంటవి?" ఆసక్తిగా అడిగాను.

"ఒకటి మనవాళ్ళ ఇంటర్ రుద్దుడుకి తట్టుకుని నిలబడి, ఇంజనీరింగ్‌లో కుక్కలా చదివి, అమెరికాలో ఉద్యోగం సంపాదించి, డాలర్లు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు, స్థలాలు కొనడం. ఆస్తుల్నిప్పుడు మనూళ్లోనే కొంటున్నార్లే - తెలంగాణా దెబ్బకి." అంటూ నవ్వాడు సుబ్బు.

"రెండో ఆప్షన్?"

"ఏముంది. ఒత్తిడికి తట్టుకోలేక ఇద్దరూ రోడ్లెమ్మడ తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు మీ సైకియాట్రిస్టులు, విజయానికి వెయ్యిమెట్ల వ్యక్తిత్వ వికాసంగాళ్ళు పండగ చేసుకుంటారు." అంటూ కాఫీ తాగడం ముగించాడు సుబ్బు.

"సుబ్బూ! మనం పనికిరాని బడుద్దాయిల్ని తయారు చేస్తున్నామని నీ అభిప్రాయమా?" విసుక్కున్నాను.

"నేనా మాటన్లేదు. మనం విద్యార్ధుల్ని రొబోల్లాగా ఒకే షేప్‌లో వుండేట్లు ఒక సిస్టం తయారు చేసుకున్నాం. ఈ సిస్టం ఉద్యోగానికి తప్ప తెలివైనవాణ్ని ప్రోత్సాహించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు. ఎందుకంటే మన విద్యకి పరమార్ధం ఉద్యోగం. ఆ ఉద్యోగం అమెరికాలో అయితే మరీ మంచిది. అందుకే అమెరికాలో డిమాండ్ ఉన్న కోర్సులకే ఇక్కడా డిమాండ్. చైనావాడు అమెరికాకి చౌకరకం బొమ్మల్ని అమ్ముతాడు, మనం చౌకగా మేన్ పవర్ని ఎగుమతి చేస్తున్నాం." అన్నాడు సుబ్బు.

"ఒప్పుకుంటున్నాను, నేనిలా ఆలోచించలేదు." అన్నాను.

"ఆలోచించి మాత్రం నువ్వు చేసేదేముంది? మళ్ళీ ఇంకో ఇంగ్లీషు పుస్తకం చదువుకుని బుర్ర పాడుచేసుకోటం తప్ప. మేధావులకి తమచుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడో ఎక్కడో ఎవరో రాసిన అంశాలని అధ్యయనం చేస్తారు, తీవ్రంగా మధనపడతారు. వాళ్ళు కన్ఫ్యూజయ్యి, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరకంగా నువ్వు నిఖార్సైన మేధావివి." అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు.

నేనూ నవ్వాను.

టైమ్ చూసుకుని లేచాడు సుబ్బు. "నీకో విషయం చెబ్తాను. చంద్రబాబు ట్రై చేస్తే ఫ్రాయిడ్ అర్ధమవుతాడు. కానీ ఫ్రాయిడ్‌కి మాత్రం చచ్చినా చంద్రబాబు అర్ధం కాడు!"

"మరిప్పుడు ఏం చెయ్యాలి?" దిగులుగా అడిగాను.

"మనం చెయ్యడానికేముంది. అసలు ఏదన్నా చెయ్యాలని ముఖ్యమంత్రే అనుకోటల్లేదు. అందుకని నువ్వు హాయిగా పేషంట్లని చూసుకో. వస్తా, ఇప్పటికే లేటయింది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

టేబుల్ మీద నుండి ఫ్రాయిడ్, రస్సెల్ నన్ను చూస్తూ వెక్కిరింతగా నవ్వుతున్నట్లనిపించింది!    

Sunday, 20 November 2011

కొడవటిగంటి కుటుంబరావు 'ఐశ్వర్యం'


"మనమంతా సంకేతాలని పట్టుకుని బతుకుతాం. భగవంతునిపై భారం వేసి వాళ్లకి ఒక గుడో, అందులోఉండే విగ్రహమో, ఒక పటమో సంకేతం. మనిషి యొక్క కొనుగోలుశక్తికి సంకేతం డబ్బు. సంకేతాల వెనక ఉండే వాస్తవ విషయాన్ని అర్ధం చేసుకున్నవాణ్ని సాధారణంగా లోకం అర్ధం చేసుకోదు." 

కొడవటిగంటి కుటుంబరావు 'ఐశ్వర్యం' నవలలో డాక్టర్ కనక సుందరం ద్వారా ఈ మాటలు చెప్పిస్తాడు. 

మానవసంబంధాల్లో డబ్బుపాత్ర చాలా ముఖ్యమైనది. డబ్బు మూలంగా కొన్ని సంబంధాలు బలపడవచ్చు. కొన్ని తెగిపోవచ్చు. ఈ డబ్బు (ఐశ్వర్యం)ని మూలఅంశంగా తీసుకుని మానవసంబంధాలని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన ఐశ్వర్యం తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైనది.

ఈ నవలలో ప్రధాన పాత్రలు నాలుగు.

1.నరసింహం : లాయరు. బెజవాడలో ప్రాక్టీస్ చేస్తూ బాగా డబ్బు గడించాడు. డబ్బే ఒక మనిషి విలువని నిర్ణయిస్తుందని నమ్మిన వాడు.

2.డాక్టర్ కనక సుందరం : లాయర్ నరసింహం కొడుకు. ప్రజలకి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో డాక్టర్ అయిన ఆదర్శవాది. ఈపాత్ర రచయిత వాయిస్ కూడా.

3.కనక సుందరం కూతురు నర్సు (నరసమ్మ) : తండ్రి ఆదర్శభావాలనీ, నిరాడంబర జీవితాన్నీ మౌనంగా అనుసరిస్తుంటుంది. కానీ కూతురుకి తన జీవనవిధానం పట్ల ద్వేషం ఉందన్న విషయం డాక్టర్ కనకం తెలుసుకోలేకపోతాడు.

4.సూర్యం : డాక్టర్ దగ్గరకి పేషంటుగా వెళ్లి.. ఆయన ప్రభావానికి లోనై.. స్నేహితుడుగా ఉంటూ.. మధ్యలో మిస్టర్ నర్సుగా  (నర్సు భర్తగా) మారిపోతాడు. ఈ నవలలో 'నేను' అంటూ సూర్యం వైపు నుండి కధనాన్ని నడిపిస్తాడు కుటుంబరావు.

ఈ నాలుగు ప్రధానపాత్రల ద్వారా కుటుంబరావు తను చెప్పదలచుకున్న విషయాన్ని తనదైన సింపుల్ స్టైల్లో చెప్పేస్తాడు. డబ్బే ప్రధానంగా భావిస్తూ లక్షలు గడించిన తండ్రంటే కొడుక్కి ఎలర్జీ. డబ్బు సంపాదించటం చేతకాక.. తన ఐశ్వర్యాన్ని అసహ్యించుకుంటున్నాడని కొడుకంటే తండ్రికి ద్వేషం. ఈ ప్రపంచంలో డబ్బు విలువని గుర్తించని వాడెవడూ మనిషి కాదని నరసింహం నమ్మకం. కొడుకు విలువలని ఈసడించుకుంటాడు. ఈయన బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీని ఇష్టపడతాడని సూర్యం పాత్ర ద్వారా వెక్కిరిస్తాడు కుటుంబరావు (ఇది నాకు భలే నచ్చింది). 

వృద్ధాప్యంలో, ఒంటరితనంతో తన మనమరాలైన నర్సుని చేరదీస్తాడు. నర్సులో తాత గుణమే ఉంది. తండ్రి నిరాడంబర ప్రపంచంలోంచి ఐశ్వర్యంలోకి వచ్చి పడటంతో మనకి అసలు నర్సు కనపడుతుంది. ఏ డబ్బయితే తండ్రీ కొడుకుల్ని వేరుచేస్తుందో.. అదేడబ్బు తాతామనమరాళ్ళని కలుపుతుంది. డబ్బుకున్న శక్తీ, మానవసంబంధాలపై దాని ప్రభావం ఆద్యంతమూ చర్చించిన నవల 'ఐశ్వర్యం'.

కుటుంబరావు శైలి గూర్చి వందలమంది వేలసార్లు రాశారు. ఆయన శైలి ఒక జర్నలిస్టిక్ స్టైల్లో ఉంటుంది. స్వచ్చమైన బిస్లరీ వాటర్ తాగుతున్న భావన కలుగుతుంది. సంభాషణలు బాగా తక్కువ. ఒక క్లిష్టమైన సబ్జక్ట్ ఎంచుకుని చందమామ కథలా సింపుల్ గా రాసి పడేయటం అబ్బురపరుస్తుంది. కుటుంబరావు రచనల్లో సమాజంపై డబ్బు ప్రభావం చాలాసార్లు చర్చించబడింది. కానీ.. డబ్బునే ప్రధాన అంశంగా తీసుకుని రాయటం వల్ల 'ఐశ్వర్యం' విశిష్టమైనది.

కుటుంబరావు ఒక మంచికథని రాసేద్దామనే ఉద్దేశ్యంతో రాసిన రచయిత కాదు. తన రాజకీయ ఫిలాసఫీని చెప్పటానికి కల్పనా సాహిత్య (ఫిక్షన్) ప్రక్రియని ఎన్నుకోన్నాడు. విషయాన్ని బొమ్మల భారతంలా, చందమామ కథలా సరళీకరణ చేస్తూ సగటు తెలుగు పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించినవాడు. నాకు కుటుంబరావు సాహిత్యం చదువుతుంటే చిన్నప్పటి లెక్కల మాస్టర్లు గుర్తొస్తారు. ఫైవ్ పండిట్స్ గైడ్లూ గుర్తుకొస్తాయి. మనని ఆలోచింపచెయ్యటమే ఆయన రచనల ఉద్దేశ్యం. ఆపనిలో విజయవంతమయ్యాడు కాబట్టే ఈనాటికీ ఆయన రచనలు సుప్రసిద్ధం.

రావిశాస్త్రి దగ్గర గుంపులుగా కనబడే సిమిలీలు కుటుంబరావు దగ్గర వెతికినా కనబడవు.. తను చెప్పదలచుకున్న విషయం తప్ప. నాలాంటివాడిని దృష్టి లో ఉంచుకుని కొన్ని సిమిలీలు (వల్లంపాటి వెంకటసుబ్బయ్య రావిశాస్త్రి శిల్పచాతుర్యాన్ని ఒక బలహీనతగా విమర్శించినా.. నామిని రావిశాస్త్రిని నిందించినా నేను పట్టించుకోను) రాస్తే బాగుండుననిపిస్తుంది. కానీ కుటుంబరావు ఒక లెక్కల మాస్టారు, పొదుపరి. స్టెప్పులు లెక్కేసుకుని, ఆన్సర్ తెప్పించేసి విషయాన్ని ముగించేస్తాడు. అందుకే ఆయన కుటుంబరావయ్యాడు!

డాక్టర్ కనక సుందరం తండ్రి గూర్చి చెబుతూ "మానాన్న రకంవాళ్ళు నాకు బాగా తెలుసు. వాళ్ళు తము నమ్మే ప్రతిదీ ఉద్యమం అనుకుంటారు. తమతో ఏకీభవించనివారితో కత్తి కడతారు. మానాన్నను మెప్పించటానికో, ఆయన డబ్బు కోసమో నేను కూడా ఇర్రేషనల్ గా ఉండనా? ఒకడి పెళ్ళాన్ని చాటుగా ప్రేమించటం సాధ్యమైనప్పుడు, ఒక వితంతువును బహిరంగంగా ప్రేమించటం ఎందుకు అసాధ్యం కావాలి?" అంటాడు. 

డాక్టర్ కనకం తన నిరాడంబర జీవితం గూర్చి మాట్లాడుతూ భాసుడి చారుదత్తం నాటకాన్ని ఉదహరిస్తాడు. సాహిత్యం గూర్చి ఖచ్చితమైన అభిప్రాయాలు చెబుతాడు. "మన సమాజంలో కిందతరగతులవాళ్ళు పుస్తకాలు చదవరు. వాళ్ళ వాస్తవజీవితానికి అనుగుణమైనదేదీ సాధారణంగా పుస్తకాలలో వుండదు."

ఈ నవల మొదటిసారి చదివినప్పుడు (తెలుగు వారపత్రికల్లో ప్రచురితమయ్యే కథల flat characters కి అలవాటు పడినందువల్ల) నాకు నర్సు ప్రవర్తన అర్ధం కాలేదు. నా ఆత్మయ మిత్రుడు డా.శరత్, నేనూ కలిసి తెల్లవార్లూ కాఫీలు, సిగరెట్లతో ఆలోచిస్తేగానీ విషయం బోధపళ్ళేదు. 

శరత్ కి సూర్యం ('నేను' క్యారెక్టర్) అంటే ఇష్టం. శుభ్రంగా కనకం సాహిత్యాభిమానాన్నీ, నరసింహం ఐశ్వర్యాన్నీ ఎంజాయ్  చేశాడని! శరత్ సరదాగా అనేవాడు కుటుంబరావు చాలా డేంజరస్. ప్రశాంతంగా కనబడే కోనేరు లాంటివాడు. కాని తాడిచెట్టంత లోతయినవాడని. అప్పుడు వెంటనే నేను 'రావిశాస్త్రి అలలతో అల్లకల్లోలంగా ఉండే మహాసముద్రం' అనేవాణ్ణి.

కేతు విశ్వనాథ రెడ్డి (అద్భుత) సంపాదకత్వాన విశాలాంధ్రా వాళ్ళు ప్రచురించిన తరవాత (దాదాపు) ముప్పైయ్యేళ్ళకి 'విరసం'వారు కృష్ణాబాయి, చలసాని ప్రసాద్ సంపాదకత్వంలో కుటుంబరావు సాహిత్యాన్ని ఇప్పుడు (ఇంతకుముందే ఎందుకు చేయలేదబ్బా!) వెలువరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎనిమిది సంపుటాలు వెలువడ్డాయి. 'ఐశ్వర్యం' తొమ్మిదో సంపుటం లో ఉండొచ్చు (విరసంవాళ్ళు రచనాకాలాన్ని ఆధారం చేసుకుని సంపుటాలు పబ్లిష్ చేస్తున్నారు).

(photo courtesy : Google)

Thursday, 17 November 2011

నేను మేధావినే.. నా?

టీవీలో ఏదో చర్చాకార్యక్రమం, తీవ్రమైన వాదన నడుస్తుంది. పాయింటు లేకుండా అరుచుకునే ప్రోగ్రాం చూసే ఓపిక లేదు నాకు. ఇవ్వాళ అనుకోకుండా కొద్దిసేపు ఒక చర్చ చూశాను. వారిలో ఒక వ్యక్తి నా దృష్టిని ఆకర్షించాడు. అతగాడు - కొద్దిగా పెరిగిన గడ్డం, ఇంకొద్దిగా నెరిసిన తల, భుజం మీద ఉన్నిశాలువా.. ఒక యాంగిల్లో అక్కినేని టైపు భగ్నప్రేమికుళ్ళా వున్నాడు. ఆయన ఆంధ్రా మేధావుల సంఘానికి అధ్యక్షుడట!

'మేధావుల సంఘం' - పేరెంత సెక్సీగా ఉంది! ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్న ఈరోజుల్లో మేధావిగా గుర్తింపు పొందటం చాలా కష్టం. దానికి ఎంతో మేధస్సూ, మరెంతో కృషి అవసరం. ఇవన్నీ లేకుండా కేవలం ఒక సంఘసభ్యుడిగా చేరి మేధావిగా మారిపోవటం ఎంత సులభం, ఎంత సుఖం! అర్జంటుగా నేనూ ఈ సంఘం సభ్యుడిగా చేర్తాను, మేధావిగా రెడీమేడ్ కీర్తి సంపాదిస్తాను.

డాక్టర్ల సంఘం, ఆటోడ్రైవర్ల సంఘం అంటూ వృత్తి సంఘాలున్నాయ్. ఆర్యవైశ్య సంఘం, కమ్మ సంఘం అంటూ కులసంఘాలున్నాయ్. ఈ సంఘాల్లో చేరాలంటే అర్హత గూర్చి పేచీ లేదు. అయితే మేధావుల సంఘం అనంగాన్లే ఇబ్బంది వస్తుంది. 'నువ్వు మేధావివి కాదు' అంటే ఎవరూరుకుంటారు?

సర్లే! ఏదోకటి. నేను మేధావినా కాదా అన్న మీమాంస నాకేలా? అదేదో సభ్యత్వం ఇచ్చేవాళ్ళు నిర్ణయించుకుంటారు. నా ఎమ్డీ సర్టిఫికేట్ కాపీ జేబులో కుక్కాను. నాకు బుర్ర తక్కువ అని డౌటొచ్చినప్పుడల్లా ఈ సర్టిఫికేట్ నన్ను కాపాడుతుంది (పేరు పక్కన ఎమ్డీ ఉన్నంత మాత్రాన బుర్ర ఎమ్టీ కాకూడదని లేదులేండి). ఎందుకైనా మంచిదని నా ఎంబీబియ్యెస్ సర్టిఫికేట్ కాపీ కూడా తీసుకున్నాను. సమాజంలో కొందరికి ఎమ్డీ కన్నా ఎంబీబియ్యెస్ ఎక్కువన్న అభిప్రాయం ఉంది. ఎంతైనా రెండక్షరాల కన్నా నాలుగక్షరాలు ఎక్కువ కదా!

తీరా బయల్దేరే ముందు డౌటొచ్చింది. ఆంధ్రా మేధావుల సంఘం వాళ్ళు 'మాక్కావాల్సింది నీ మేధావిత్వం, సర్టిఫికెట్లు కాదు.' - అంటే! మేధావిత్వానికి వాళ్ళదగ్గర వున్న కొలబద్ద యేంటి? జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారా? మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? తెలీదు. మెక్సికో రాజధాని చెప్పు? అస్సలు తెలీదు! పేపర్ లీకైతే బాగుణ్ణు. తలకి మిషన్లూ గట్రా తగిలించి మీటర్ రీడింగ్ తీస్తారా? వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు, అవన్నీ నాకెందుకు? నేను మాత్రం ఇవ్వాళ ఖచ్చితంగా మేధావుల సంఘంలో చేరబోతున్నాను, దట్సాల్!

ఇంతలో మస్తిష్కంలో మెరుపు మెరిసింది (అంటే గొప్ప ఐడియా వచ్చిందని అర్ధం). మనగూర్చి మనం చెప్పుకునేకన్నా ఎదుటివారితో చెప్పిస్తేనే గదా వేల్యూ! పైగా ఇది నాకు చాలా సులువైన పని కూడా. నేను మేధావినని వెయ్యిమందితో చెప్పించగలను.

అప్పటికే లేటయ్యిందని హడావుడిగా ఆస్పత్రికి వెళ్తున్న నా భార్యని ఆపి అడిగాను - "ఈ లెటర్ తీసుకొచ్చినవాడు మేధావి అని ఒక సర్టిఫికేటివ్వు."

సందేహం లేదు, గవర్నమెంట్ డాక్టర్ కావున నా భార్య సర్టిఫికేట్ బ్రాండెడ్ సిమెంటంత స్ట్రాంగ్‌గా వుంటుంది. నా భార్య నాకేసి ఎగాదిగా చూసింది, ఒక్కక్షణం ఆలోచించింది - "సారీ! నేను దొంగ సర్టిఫికెట్లివ్వను." అంటూ వెళ్ళిపోయింది.

హతాశుడనయ్యాను. ఎంత అవమానం! కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించింది. చరిత్రలో ఏ భర్తకీ భార్య చేతిలో ఇంత అవమానం జరక్కూడదు. ఈ అవమాన భారం భరింపలేను. 'ఎవరక్కడ? చితి పేర్పించండి'.

"సార్! స్విచ్చిలన్నీ మార్చేశాను. ఇంక మీకు ఇబ్బందుండదు."

నిదానంగా తల పైకెత్తి చూశాను. ఎదురుగా ఎలెక్ట్రీషియన్ నిలబడున్నాడు. మస్తిష్కంలో మళ్ళీ మెరుపు (మళ్ళీ ఇంకో గొప్ప ఐడియా)! సొంతభార్య సర్టిఫికేట్‌కి విలువేముంది? ఈ శ్రామికవర్గ ప్రతినిధితో సర్టిఫికేట్ తీసుకుంటే తిరుగేముంది?

"సర్లే! ఈ కాయితం మీద నేను తెలివైనవాణ్ణని రాసి సంతకం పెట్టు."

ఎలెక్ట్రీషియన్ సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు - "ఆ విషయం నాకు తెలుసు సార్!"

"అవును కదా! ఆ సంగతే రాసివ్వు." విసుగ్గా అన్నాను.

"నేను తెలివైనోణ్ణని నేనే రాసుకుంటే ఏం బాగుంటుంది సార్!" మళ్ళీ సిగ్గు, మెలికలు.

"నేనన్నది నీగూర్చి కాదు, నాగూర్చి! ఈ డాక్టర్ గొప్పమేధావి అని రాసి సంతకం పెట్టివ్వు."

సిగ్గు మాయమైంది - "అదేంటి సార్! అట్లెట్లా రాసిస్తా. నేను రాయలేను."

"అంటే నాకు నీఅంత తెలివి లేదంటావా?" కోపంగా అడిగాను.

"సార్! మీరు పెద్దవారు, ఏమనుకోకండి. మిమ్మల్ని రెండేళ్ళనించి చూస్తున్నాను. మీకు చోక్ అంటే తెలీదు, స్టార్టర్ అంటే అర్ధం కాదు. కనీసం యే స్విచ్చి దేనికో కూడా గుర్తుండదు." అంటూ జారుకున్నాడు.

ఆరి దుర్మార్గుడా! ఇన్నాళ్ళు నువ్వు నన్నో బుర్ర తక్కువ్వాడిగా అనుకుంటున్నావా! నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తల దిమ్ముగా వుంది, నీరసంగా సోఫాలో కూలబడ్డాను.

"సార్! కాఫీ." అంటూ టీపాయ్ మీద కాఫీకప్పు పెట్టింది వంటమనిషి. అమ్మయ్య! నా బాధ వెళ్ళబోసుకొటానికో మనిషి దొరికింది. ఆ వంటావిడ నాకు నా పగిలిన గుండె అతికించుకునేందుకు దొరికిన ఫెవికాల్ గమ్ములా కనబడింది.

"చూడమ్మా! నేను మేధావినేనా? కాదా?"

ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టింది - "మేధావి అంటే ఏంటో నాకు తెలీదు."

ఈ వంటమనిషి నాపై గల అపార గౌరవంతో మాట్లాడ్డానికి మొహమాట పడుతున్నట్లుంది. అవును మరి! ఆమె భర్తకి వైద్యం చేసి తాగుడు మాన్పించాను, మొన్నామధ్యనే జీతం పెంచాను.

అంచేత కృతజ్ఞతా భారంతో ఒంగిపోతూ - 'మీరు దేవుళ్ళాంటోరు సార్! ఈ ప్రపంచంలో మీకన్నా గొప్ప మేధావి ఎవ్వరూ లేరు.' అని పొగడొచ్చు. కానీ నాకు పొగడ్తలు గిట్టవు. అందుకే -

"చూడమ్మా! నన్ను పొగడకు. నీ మనసులో మాట ఉన్నదున్నట్లు నిర్మొహమాటంగా చెప్పెయ్!" అన్నాను.

వంటావిడ బెరుకుగా - "తప్పుగా మాట్లాడితే మన్నించండి! ఎన్నోఏళ్ళుగా మీ ఇంట్లో పన్జేస్తున్నాను. మీరు చాలా మంచివారు, అమాయకులు. కానీ మీకు బెండకాయకీ, దొండకాయకీ తేడా తెలీదు. పూరీ కూరకీ, చపాతి కుర్మాకీ తేడా తెలీదు. పొద్దస్తమానం యేదో ఆలోచిస్తూ పరధ్యానంగా వుంటారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మేడంగారు లేకపోతే మీకు చాలా కష్టం సార్!" అని అంటుండగా -

నాకు స్పృహ త... ప్పిం.... ది.

ఉపసంహారం :

గౌరవనీయులైన పాఠకులకి నమస్కారం!

ఈ రాతలు రాస్తున్నవాడికి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. వున్నట్లుండి 'నేను మేధావిని, నేను మేధావిని.' అంటూ ఎగిరెగిరి పడుతున్నాడు. వైద్యశాస్త్రంలో ఇదో అరుదైన కేసుగా డాక్టర్లు భావిస్తున్నారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జంటూ అయితే మళ్ళీ తన రాతలతో మిమ్మల్ని హింసిస్తాడని హామీ ఇస్తున్నాం, సెలవు. 

Saturday, 12 November 2011

అమ్మ.. నేను.. కొన్ని పెళ్ళికబుర్లు


అమ్మయ్య! చిరంజీవి కొడుక్కి పెళ్ళి కుదిరిందిట, ఆనందమానందమాయే! ఇంక నాక్కొన్నాళ్ళు రిలీఫ్! థాంక్స్ టు తెలుగు టీవీ చానెల్స్.

ఏవిఁటీ అర్ధంపర్ధం లేని రాతలు? సినిమావాళ్ళ పెళ్ళైతే నీకెందుకానందం?!

అమ్మ అన్నయ్య దగ్గర ఉంటుంది. షుగరు, బిపి, మోకాళ్ళ నొప్పుల వగైరా జబ్బులు అమ్మతో వుంటాయి. అమ్మని పలకరించాలంటే మా చుట్టాల్లో చాలామందికి భయం. ఎవరైనా దొరికితే చాలు - అమ్మ తన జబ్బులు, బాధలు, మందులు.. చెప్పుకుంటూనే పోతుంది. అదో ఎల్పీ రికార్డ్! ఘంటసాల పాడిన భగవద్గీత వంటి ఆ రికార్దుని నేను రోజూ వింటూనే వుంటాను. ఎవరైనా సరే! తన వేసే రికార్డు మొత్తం చచ్చినట్లు వినాల్సిందే. ఓపిగ్గా విన్నవాడు ఉత్తముడు, వినలేనివాడు అధముడు. 

అది పెద్ద హాలు, మధ్యన పెద్ద సోఫా. ఆ సోఫాలో పెదరాయుడు స్టైల్లో అమ్మ, ఎదురుగా టీవీ, చేతిలో మంత్రదండంలా రిమోట్! ఈ పెదరాయుడికి అనుచరగణం ఇద్దరు. సోఫా పక్కనే గచ్చుమీద కూర్చునే వెంకటమ్మ - ఇంటిపని చేస్తుంది. వంటగది గుమ్మానికి జారగిలిపడే చిట్టెమ్మ - వంటపని చేస్తుంది. వీళ్ళు టీవీ సీరియళ్ళని సీరియస్‌గా చూస్తూంటారు. వీళ్ళకితోడుగా ఆమధ్యదాకా 'సన్నీ' అనబడు ఒక శునకుడు కూడా వుండేవాడు, వాడు వృద్ధాప్య కారణంగా కొంతకాలం క్రితం కాలం చేశాడు! టీవీ సీరియళ్లు రాని (లేని) సమయంలో అమ్మకి నొప్పులు, నీరసం, గుండెదడ!

అవి అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటున్న రోజులు.

నా రోజువారీ డ్యూటీలో భాగంగా డ్యూటిఫుల్‌గా అమ్మని అడిగాను. "అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?"

అమ్మ నన్ను పట్టించుకోలేదు. 

"చిట్టెమ్మా! తొందరగా రా! పెళ్ళికి పవన్ కళ్యాణ్ వచ్చాడు చూడు! పక్కన భార్య లేకుండా ఒక్కడే చేతులూపుకుంటూ వచ్చాడేంటి?"

"అమ్మా! నొప్పులెలా ఉన్నాయి?" మళ్ళీ అడిగాను.

"వెంకటమ్మా! చిరంజీవి రెండో కూతుర్ని పిలవలేదనుకుంటా. పాపం! ఆ అమ్మాయి కూడా వస్తే బాగుండేది."

"అమ్మా! నొప్పులు.. " అసహనంగా నేను. 

"పెళ్ళికూతురు మెరిసిపోతుంది కదూ. అబ్బో! అబ్బో! ఏం నగలు! ఏం అలంకారాలు!"

ముగ్గురూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. మొదట్లో నాకు చిరాకేసినా, ఆ తరవాత నేనూ వాళ్ళతో కలిసిపొయ్యాను!

"చిరంజీవి రెండో కూతురు మొగుణ్ణి పవన్ కళ్యాణ్ కాల్చేస్తానని సవాల్జేసిండంట! పాపం రావాలంటే ఆళ్ళకి బయ్యం గదా!" వెంకటమ్మ సమాచారం.

"లేదు వెంకటమ్మా! కాలుస్తాడనే తుపాకీని పోలీసోళ్ళు తీసేసుకున్నారు." చిట్టెమ్మ అదనపు సమాచారం.

ఈ విషయాల్లో వీళ్ళు నాకన్నా జ్ఞానవంతులనే సంగతి అర్ధమయ్యింది. మా ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్లే ఎన్నెన్నో విశేషాలు ముచ్చటించుకున్నారు.

చీరలు, నగలు ఎక్కడ కొన్నారు? రేటెంత? పెళ్లి జరుగుతున్న స్టేజ్ వెడల్పెంత? పొడుగెంత? వంట ఎంతమందికి? ఎన్నిరకాల స్వీట్లు? యేయే ఊళ్ళనించి తెచ్చారు? వంటల్లో వాడిన నూనేంటి? తాలింపు గింజలెన్ని? ఎవరెవర్ని పిలిచారు? వాళ్ళ డ్రస్సులేంటి?

అమ్మ తన నొప్పి, నీరసం, గుండెదడ మర్చిపోయింది. అసలు నన్నే మర్చిపోయింది! హమ్మయ్య!

అల్లు అర్జున్ పెళ్ళైపోయింది. అమ్మకి నొప్పులు, నీరసం మొదలయ్యాయి. తన పాత ఎల్పీ రికార్డుని దుమ్ము దులిపి ప్లే చెయ్యటం మొదలెట్టింది.

కొన్నాళ్ళకి నా అదృష్టం బాగుండి జూ.ఎన్టీఆర్ పెళ్లి కుదిరింది. కొన్నాళ్ళ పాటు ఆ పెళ్ళీకబుర్లు. ఆరోజు జూ.ఎన్టీఆర్ పెళ్లి జరుగుతుంది.

యధావిధిగా డ్యూటిఫుల్‌గా అడిగాను - "అమ్మా! షుగర్ మాత్రలు వేసుకుంటున్నావా?"

"చిట్టెమ్మా! అర్జంటుగా రా! ఎన్టీఆర్ తల్లిని చూడు."

వంట మధ్యలో వదిలేసి పరుగున వచ్చింది చిట్టెమ్మ. "మనిషి బాగుంది మామ్మగారు! హరికృష్ణని ఎందుకు చేసుకుందో?"

"చాలా మంచమ్మాయిలా ఉంది. కాబోయే కోడలంటే ఎంత ప్రేమ! లక్షలు పెట్టి చీరలు కొంటుంది!" అమ్మ కళ్ళల్లో మెరుపు.

"అమ్మా! షుగర్ మాత్రలు.. " అడిగాను. 

"వెంకటమ్మా! పెళ్ళికూతురు ఎంత ముద్దోస్తుందో! అల్లు అర్జున్ భార్యకన్నా హైటా?" అమ్మ సందేహం. 

"లేదమ్మగారు! ఎన్టీఆర్ పొట్టి, అందుకనీ అమ్మాయి ఎత్తుగా అవిపిస్తుంది." వెంకటమ్మ అబ్జర్వేషన్.

అల్లు అర్జున్ పెళ్ళికీ, ఎన్టీఆర్ పెళ్ళికీ కల పోలికల గూర్చి కొంతసేపు మేధోమధనం కొనసాగింది.

"అమ్మా! షుగర్.. " గొణిగాను. 

"చిట్టెమ్మా! పెళ్లికి బాలకృష్ణ రాడన్నావ్? వచ్చాడు చూడు." అమ్మ అరిచింది.

"బాబాయ్ వస్తేగానీ తాళి కట్టనన్నాట్ట పెళ్లికొడుకు. అందుకే వచ్చినట్లున్నాడు." చిట్టెమ్మ సంజాయిషీ.

నేను మాట్లాడ్డం ఆపేసాను, అమ్మ పెళ్లి విషయాలు ఫాలో అవుతూ అలా టీవీ చూడ్డం నాకు ముచ్చటేసింది.

ఈవిధంగా జూ.ఎన్టీఆర్ కొన్నాళ్ళపాటు అమ్మకి నొప్పులు, నీరసం పోగొట్టాడు. థాంక్యూ జూ.ఎన్టీఆర్!

ఆ తరవాత కొంతకాలం నన్ను సత్యసాయిబాబా కాపాడాడు. బాబా చనిపోయాడా? లేదా? ఆస్తి ఎవరికి వెళ్తుంది? ముగ్గురూ తీవ్రమైన చర్హలు సాగించారు. అయితే సాయిబాబా విషయం తొందరగానే తేల్చేశారు. బాబాని డా.సఫాయ సాయంతో రత్నాకర్ చంపేశాడు! ఆ తరవాత డబ్బుల పంపకంలో ఇద్దరికీ తేడా వచ్చింది. ఇట్లా అనేక మలుపులతో ఒక క్రైమ్ స్టోరీ చెప్పారు! ఈవిధంగా మీడియాక్కూడా తెలీని అద్భుత రహస్యాలు బయటపడ్డాయి!

నేను తెలివిగా అమ్మని తెలంగాణా ముగ్గులోకి లాగుదామని ప్రయత్నించాను. కానీ నా కుట్ర ఫలించలేదు. అమ్మకి తెలంగాణా మీద ఆసక్తి లేదు, సోనియాగాంధీ అంటే మాత్రం చాలా ఇష్టం. ఆ ఇష్టానిక్కారణం.. సోనియాగాంధీ తెల్లగా వుంటుంది, చీరలు బాగుంటాయి, నడక హుందాగా ఉంటుంది! భర్త చనిపోయినా అత్తగారి కొంపలోనే వుంటుంది. అంచేత - సోనియాగాంధీ తెలంగాణా ఇస్తేనే మనం తీసుకోవాలి, లేకపొతే లేదు. అంతే!

నాకు అమ్మ జబ్బుల ఎల్పీ రికార్డ్ తప్పట్లేదు, టీవీలవాళ్ళు మాత్రం ఏంచేస్తారు? పొద్దస్తమానం అందరికీ మళ్ళీమళ్ళీ పెళ్లి చెయ్యలేరుగా! పోన్లేండి! ఇప్పుడు చిరంజీవి కొడుక్కి పెళ్ళవుతుంది. కొన్నిరోజులు ఆవిడ కాళ్ళనొప్పులకి సెలవు! 

ఈ హీరోల పెళ్ళిళ్ళు కవర్ చేసినందువల్ల చానెళ్ళవాళ్ళకి వొచ్చే లాభం నాకు తెలీదు గానీ.. నాకు మాత్రం హాయిగా, ప్రశాంతంగా వుంటుంది - అదీ సంగతి!

(కొన్నాళ్ళకి ఆదివారం 'ఆంధ్రజ్యోతి' లో పబ్లిష్ అయ్యింది, డేట్ గుర్తు లేదు) 

Thursday, 10 November 2011

గుండెలు మార్చు గోఖలే


అనుకున్నంతా అయ్యింది! మావాడు మళ్ళీ ఇంకోగుండె మార్చాడు. మనం సాధారణంగా కార్లు మారుస్తాం, ఇల్లు మారుస్తాం. కొద్దిమంది అదృష్టవంతులు భార్యల్ని కూడా మార్చేస్తారు. పాపం! ఇవేవీ మార్చలేని మా గోఖలే (మాధవపెద్ది గోఖలే కాదు) గుండెల్ని మారుస్తున్నాడు. కొంతమందంతే, మనం వాళ్ళని ఏమాత్రం మార్చలేం!

గుండెమార్పిడి ఆపరేషన్ చొక్కా మార్చినంత వీజీగా, విజయవంతంగా చేసేస్తున్నాడు. నిన్న ఆరోసారి గుండె మార్చాట్ట! గుండెలు తీసిన బంటు అంటారు, మా గోఖలే మాత్రం గుండెలు మార్చే బంటు! 

గోఖలే! కంగ్రాచులేషన్స్ మై బాయ్!

(picture courtesy : Google)

Sunday, 6 November 2011

నా 'ఖడ్గతిక్కన' ఖష్టాలు

మనుషులు అనేక రకాలు. కొందరు మంచివాళ్ళే కాదు, మొండివాళ్ళుగా కూడా వుంటారు. నా క్లాస్మేట్ మరియూ మదీయ మిత్రుడు అయిన మూర్తి అటువంటి అరుదైన మంచిమొండివాడు. అవతలవాళ్ళు చెప్పేది అర్ధం కాకపోయినా, డామినేట్ చేస్తున్నారన్న అనుమానం కలిగినా మరింత మొండిగా అయిపోతాడు. ఈ వొక్కవిషయంలో తప్పించి మా మూర్తి మంచివాడు, మృదుస్వభావి, స్నేహశీలి - అఫ్కోర్స్ మొండిశీలి అని ఇందాకే చెప్పాను! కొందరు మూర్తిని 'ఖడ్గతిక్కన' అనేవాళ్ళు. నాకు మావాడి ధోరణి అలవాటైపోయింది, పట్టించుకునేవాణ్ని కాదు. ఒక్కోసారి మా మూర్తి మొండిదనం నాక్కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేది.

ఇప్పుడంటే మెడికల్ కాలేజీలు కులాల గోలల్లో పీకల్లోతు కూరుకుపొయ్యున్నాయి గానీ, మా రోజుల్లో దేశ రాజకీయాల చర్చల్తో వాతావరణం హాట్‌హాట్‌గా ఉండేది. నాకు రాజకీయాలు తగుమాత్రంగా తెలుసు, మూర్తికి మాత్రం యెంతమాత్రం తెలీదు. ఆరోజు లీలామహల్లో జేమ్స్ బాండ్ సినిమా చూడాలని మా ప్లాన్. లైబ్రరీ నుండి కాలేజ్ క్యాంటీన్‌కి వెళ్లాం. అక్కడ రాజకీయ చర్చలతో, సిగరెట్ పొగతో గందరగోళంగా వుంది. మేం క్యాంటీన్‌లోకి అడుగుపెట్టంగాన్లే, మమ్మల్ని చూస్తూ -

"బ్రదర్స్! కంపూచియాపై అమెరికా దురాక్రమణని ఖండించండి." అని అరిచాడొకడు.

మా మూర్తి ఠక్కున అన్నాడు - "నేను ఖండించను."

వెంటనే ఆవైపు నుండి ఆవేశంగా ఒక ఉపన్యాసం మొదలైంది. "అమెరికా సామ్రాజ్యవాదం.. పెట్టుబడిదారి ఆర్ధికవ్యవస్థ .. " కొంత అర్ధమయింది. చాలా అర్ధం కాలేదు. అయిదు నిముషాల తరవాత ఉపన్యాసం అయింది. మూర్తి సూటిగా చూస్తూ స్థిరంగా, నొక్కివక్కాణిస్తూ అన్నాడు - "నేను ఖండించను." మళ్ళీ ఉపన్యాసం మొదలైంది. నాకేమో తొందరగా కాఫీ తాగి బయటపడాలని ఉంది. జేమ్స్ బాండ్ సినిమా టైటిల్స్ మిస్సైపోతాననే భయం, అవంటే నాకు చాలా ఇష్టం.

'బాబ్బాబూ! ఖండించరా.' అంటూ చెవిలో దీనంగా వేడుకున్నా. మూర్తి మనసు పాషాణం, ఇసుమంతయిననూ కరగలేదు! మావాడితో ఒప్పించాలని వారి పట్టుదల. అలా ఓ అరగంటపాటు వీడితో ఖండింపజెయ్యాలనే విఫలయత్నం కొనసాగింది. వాళ్ళు ఎన్నిరకాల ఆర్గ్యుమెంట్లు చెప్పినా మావాడిది ఒకటే సమాధానం.

"నేను ఖండించను."

సినిమా ప్రోగ్రాం అటకెక్కింది. క్యాంటీన్ నించి బయటకి వచ్చాక విసుక్కున్నాను.

"రాజకీయాల్లో నీకంత పట్టుదల ఎందుకు? "

"నేనంతే! చాలా పట్టుదల కలవాణ్ణి." గర్వంగా అన్నాడు.

నేనేం మాట్లాళ్ళేదు, కొంచెంసేపు ఆగి నెమ్మదిగా అడిగాడు రమణమూర్తి.

"సర్లే గానీ, ఇంతకీ కంపూచియా అంటే ఏమిటి?"

ఒక్కక్షణం వాడడిగింది నాకర్థం కాలేదు. అర్ధమయ్యాక కోపం, ఏడుపు ఒకేసారి వచ్చాయి!


అటు తరవాత.. సాధ్యమైనంత మేరకు మూర్తిని మేనేజ్ చేసుకుంటూ బండి లాక్కోస్తున్నాను. అన్నిరోజులూ మనవి కావు, కొన్నిసార్లు దురదృష్టం పిచ్చికుక్కలా వెంటాడుతుంది.

ఆరోజు మెడిసిన్ కేస్ ప్రెజంటేషన్‌లో ప్రొఫసర్‌తో తీవ్రంగా తిట్టించుకున్న మూర్తిని హాస్పిటల్ క్యాంటిన్లో శాయశక్తులా ఓదారుస్తున్నా.

"నీ కేస్ ప్రెజంటేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంది. మన ప్రొఫెసర్‌కే నీస్థాయి లేదు. అందుకే ఆయనకి నీ కేస్ అర్ధంకాక నానామాటలన్నాడు!"

"అంతేనంటావా!" మూర్తి కళ్ళల్లో మెరుపు. హమ్మయ్యా! నా ఓదార్పుమాటలు బానే పన్జేస్తున్నయ్.

ఈలోగా ఇద్దరు జూనియర్లు స్టూడెంట్లు మా పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆరెస్సెస్ సానుభూతిపరులని నాకు తెలుసు.

"ఏంటి! మీ రాముడి గుడి ఎందాకా వచ్చింది?" అంటూ సరదాగా పలకరించాను.

వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపొయ్యి - "మన హిందువులది సిగ్గులేని జాతి, రాముడి గుడి తలుపులు తెరవక పోవటాన్ని ఎందుకు ఖండించరు?" అన్నారు.

'ఖండన' అన్నమాట చెవిన పడంగాన్లే మా మూర్తి ఖయ్యిమన్నాడు.

"ఖండించను, ఎందుకు ఖండించాలి? నాకు గుడి తలుపులు తెరవక్కరలేదు. అవి ఎప్పటికీ మూసే ఉంచాలి. అర్ధమయ్యిందా? మూసే ఉంచాలి." ఒక్కోఅక్షరం వొత్తిపలుకుతూ అన్నాడు.

ఆ జూనియర్స్ బెదిరిపొయ్యారు, చల్లగా జారుకుని వేరే టేబుల్ చూసుకున్నారు.

నాకు మా మూర్తి ప్రవర్తన మొరటుగా అనిపించింది.

"మూర్తీ! వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి. ఏదో మర్యాదగా పలకరిస్తే అట్లా కరుస్తావే?"

ఈసారి నామీద ఎగిరాడు.

"నేను నీలా కాదు, గంగిరెద్దులా ప్రద్దానికి తలూపను. నాకు సొంత బుర్ర ఉంది. సొంత అభిప్రాయాలున్నాయ్."

"నీకు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ చెప్పే పద్ధతే బాలేదు." అన్నాను.

ఒక్కక్షణం ఆలోచించి అన్నాడు రమణమూర్తి.

"ఇంతకీ వాళ్ళు చెప్పేది మనూళ్ళో వున్న రామనామ క్షేత్రం సంగతేగా? దాని తలుపులు ఎప్పుడు మూశారు? ఏమన్నా రిపేర్లు చేస్తున్నారా?"

తల పట్టుకున్నాను.

'ఓరి నాయనోయ్! వీడి పాండిత్యం డేంజరపాయం స్థాయికి చేరుకుంది.'

అటు తరవాత మావాణ్ని మరింత పకడ్బందీగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. 

Friday, 4 November 2011

తికమక - మకతిక


మా ఊరు గుంటూరు. మా గుంటూరు గతుకుల రోడ్లకీ, డబ్బా సినిమా హాళ్ళకీ ప్రసిద్ధి. మా గుంటూరియన్స్‌కి (ఇలా రాయడం నాకిష్టం, భలే స్టైల్‌గా వుంటుంది) తెరమీద బొమ్మలు ఆడ్డం చాలా వింతగా, ఆశ్చర్యంగా వుంటుంది. మేం వచ్చిన ప్రతి సినిమానీ నొరు తెరుచుకు చూస్తాం. కొత్త సినిమా రిలీజు కాకపోతే పాత సినిమాల్నే ఎంతో ఆసక్తిగా మళ్ళీమళ్ళీ చూస్తాం. సినిమా చూడ్డం మాకో యజ్ఞం, యాగం (ఈ రెంటికీ తేడా నాకు తెలీదు. అయినా ఫోర్సు కోసం రాస్తున్నాను).

నాకూ, నా స్నేహితులకీ చూడ్డానికి కొత్తసినిమాలేవీఁ మిగలనందున ఆరోజు 'సంపూర్ణ రామాయణం' అనే పంచరంగుల చిత్రానికి వెళ్ళాం. సినిమా మొదలై అప్పటికి పదినిమిషాలైంది. మిత్రబృందం చీకట్లో తడుముకుంటూ కుర్చీల్లో సర్డుక్కూర్చున్నాం. పాతసినిమా కాబట్టి ఆట్టే జనాలు లేరు. కూర్చున్నాక పక్కకి తిరిగిచూసి గతుక్కుమన్నాను. చచ్చాన్రా బాబు! ఇప్పుడెలా? హడావుడిలో చూసుకోకుండా ఇరుక్కుపొయ్యానే!

ఎందుకు చచ్చావ్? ఎక్కడ ఇరుక్కుపొయ్యావ్?

నేను గుంటూరు బ్రాడీపేటలో పుట్టాను, అక్కడే పెరిగాను. స్నేహితుల్తో క్రికెట్ ఆడుకోవటం, సినిమాలు చూడ్డం, పరీక్షలప్పుడు మాత్రమే చదువుకోవటం నా అలవాట్లు. వీలైనంతమేరకు హోటళ్ళలో తింటూ, హోటల్ పరిశ్రమని పోషించడం నాకున్న ముఖ్యవ్యాపకం. నదీప్రవాహంలో చెత్త కూడా ప్రయాణం చేస్తుంది. అలాగ - నేను కూడా స్నేహితుల్తో పాటు ప్రయాణం చేస్తూ గుంటూరు మెడికల్ కాలేజీలోకి వచ్చి పడ్డాను.

నా స్నేహితులు భారద్దేశ జనాభాలాగా, నానాజాతి సమితి లాగా - ఒక్కొక్కరు ఒక్కోటైపులో వుండేవారు. మాలో రామ్ బుద్ధిమంతుడు. చదువుల్లో ఫస్ట్, మిగిలిన విషయాల్లో లాస్ట్. అతగాడికి టెక్స్ట్ బుక్స్ తప్ప మిగిలిన విషయాలూ ఓ పట్టాన అర్ధమయ్యేవి కాదు, అలా అర్ధం కానివాటిల్లో అతి ముఖ్యమైనది సినిమా. సినిమా చూస్తూ తనకొచ్చే డౌట్లతో పక్కన కూచున్నవాడి బుర్రని డీప్ ఫ్రై చేస్తాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు నేను మావాడి పక్కన పడ్డాను, అదీ కథ!

కొద్దిసేపటికి రామ్ ప్రశ్నల పరంపర మొదలైంది.

"ఎవరతను?" శోభన్‌బాబుని చూపిస్తూ అడిగాడు.

"రాముడు."

"ఆ ముసలాయన ఎవరు?" ఇంకో ప్రశ్న.

"గుమ్మడి, కాదు.. దశరధుడు."

"ఆవిడ?"

"కైకేయి."

నాకు సినిమా మీద ఇంటరెస్ట్ పోతుంది. రామ్ ప్రశ్నల వరద నన్ను ముంచేస్తూనే ఉంది. రాముణ్ని అడవులకి పంపమని కైక అడిగే సీన్ వచ్చింది. దశరధుడు భోరున యేడుస్తున్నాడు.

"కైక! అన్నది నువ్వేనా? విన్నది నేనేనా?" అంటూ నేలమీద కూలబడ్డాడు.

"ఆయన ఏడుస్తున్నాడెందుకు! గెడ్డం దురద పుడుతుందా?" ఇంకో ప్రశ్న.

"లేదు."

"దశరధుడు డ్రాయర్ వేసుకున్నాడేంటి! ఆరోజుల్లో కూడా డ్రాయర్లున్నాయా?" ఇంకో ప్రశ్న.

సమాధానం యేం చెప్పాలో తెలీలేదు. సినిమాలో కైక వల్ల దశరధుడు యేడుస్తుంటే ఇక్కడ నేను మావాడి ప్రశ్నలకి యేడ్చాను.

నాకు దేవుడంటే నమ్మకం లేదు. కానీ ఆరోజు ఫ్రస్ట్రేషన్‌లో దేవుణ్ని ప్రార్ధించాను. 'దేవుడా! నాకీ ప్రశ్నల రాక్షసుడి బాధ లేకుండా ప్రశాంతంగా సినిమా చూసే అదృష్టాన్ని ప్రసాదించు!'

దేవుడు నా ప్రార్ధన విన్నాడు!

శ్యామ్ నా క్లాస్మేట్. అప్పుడప్పుడు మాతో కలిసేవాడు. సినిమా చూస్తూ రామ్ కొనసాగిస్తున్న హింసాకాండ గూర్చి కొంత ఐడియా వుంది. ఆరోజు శ్యామ్ మాతో 'శంకరాభరణం' సినిమాకి వచ్చాడు. హడావుడిగా మా సీట్లు రామ్ పక్కన ఉండకుండా మేనేజ్ చేసేసుకున్నాం. పాపం, రామ్ పక్కన శ్యామ్ ఇరుక్కుపోయాడు. స్నేహితుడు సుడిగుండంలో చిక్కుకున్నా కాపాడుకోలేని నిస్సహాయుల్లా మేం శ్యామ్ వంక జాలిగా చూశాం.

సినిమా మొదలైంది. రామ్ వైపు నుండి ప్రశ్నల వర్షం శ్యామ్ వైపు కురవటం మొదమైంది. రామ్ ప్రశ్నలకి శ్యామ్ తొణక్కుండా, యేమాత్రం తగ్గకుండా సమాధానాలు చెబుతూనే వున్నాడు. వాళ్ళ సంభాషణ నాకూ వినిపిస్తుంది.

"ఆ ముసలాయన పాడుతున్నాడెందుకు?"

"ఆయన శంకరాభరణం శంకరశాస్త్రి. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. పోలీసుల కళ్ళు గప్పడానికి శాస్త్రీయ సంగీతం పాడుతుంటాడు."

"ఈ పొడుగాటి అమ్మాయి ఎవరు? ఎందుకలా డ్యాన్స్ చేస్తుంది?"

"మంజుభార్గవి పెద్ద సీబీఐ ఆఫీసర్. శంకరశాస్త్రి క్రిమినల్ ఏక్టివిటీస్‌ని దర్యాప్తు చేస్తుంది. డ్యాన్సర్‌గా మారువేషం వేసింది. ఇది తెలుసుకున్న శంకరశాస్త్రి మంజుభార్గవిని చంపేస్తాడు. అదే ఈ సినిమాకి ట్విస్ట్. డోంట్ మిసిట్, జాగ్రత్తగా చూడు."

సినిమా అయిపొయింది. అందరం లేచాం, రామ్ సీట్లోంచి లేవట్లేదు. సినిమా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాడు, అయోమయంగా చూస్తున్నాడు. కొద్దిసేపటికి సీట్లోంచి లేచి నిదానంగా బయటకి వచ్చాడు.

"ఒరే శ్యామ్! ఇదన్యాయం. నువ్వు ఇచ్చిన లీడ్స్ ఆధారంగా సినిమా చూశా. మంజుభార్గవిని శంకరశాస్త్రి చంపే సీన్ కోసం ఎదురుచూస్తూ కూచున్నా. సినిమా ఒక్కముక్క అర్ధం కాలేదు. తెలీకపొతే తెలీదని చెప్పాలిగానీ మిస్లీడ్ చెయ్యటం ఘోరం."

"ఏవిటోయ్ నీకు చెప్పేది? అంత పెద్దతెర మీద పేద్దగా సౌండ్ పెట్టి వాళ్ళు బొమ్మేస్తుంటే సినిమా ఎందుకర్ధం కాదు? చూడ్డం చేతకాదా?" నవ్వుతూ అన్నాడు శ్యామ్. రామ్ ఏమీ మాట్లాళ్ళేదు.

అప్పట్నుండీ ఎవర్నీ యే ప్రశ్నలూ అడక్కుండా బుద్దిగా సినిమా చూస్తూ, సొంతంగా సినిమాలు అర్ధం చేసుకోనారంభించాడు రామ్. మేం 'అమ్మయ్యా!' అనుకున్నాం.

(సంఘటన వాస్తవం, పేర్లు మాత్రం మార్చాను.)

(picture courtesy : Google)

Wednesday, 2 November 2011

డా.రావ్ కష్టాలు


ముప్పైయ్యేళ్ళ క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీయస్ పట్టా పుచ్చుకున్నాడు డాక్టర్ రావ్.పి.పచ్చిపులుసు. పట్టాపై అతని పూర్తిపేరు పచ్చిపులుసు పిచ్చేశ్వరరావు అని ఉంటుంది. పిచ్చేశ్వర్రావు అత్యంత ప్రతిభాసంపన్నుడు, సునిశిత మేధోశాలి.

మన మాయదారి దేశం ఇంతటి ప్రతిభావంతుల్ని గుర్తించదు. కావున - మేధావులందర్లాగే మన పిచ్చేశ్వర్రావూ అమెరికా సంయుక్త రాష్ట్రాల వారి పంచన చేరాడు. అమెరికావాళ్ళు మనపేర్లని నిలువుగా చీల్చి, జరాసంధుని శరీరభాగముల్లాగా మళ్ళీ కలుపుతారు, అది వాళ్ళ ఆచారం. అంచేత మన పిచ్చేశ్వర్రావులో 'పిచ్చేశ్వర' మాయమైపోయింది. ఇప్పుడు పిచ్చేశ్వర్రావు, సారీ! రావ్.పి.పచ్చిపులుసు - మానసికరోగ వైద్యంలో నిపుణుడు.

మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించటం చేత అతనికి డబ్బంటే మొహం మొత్తింది. అతగాడు మానసిక రోగాల గూర్చి అనేక పరిశోధనలు చేసాడు, రాశాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సుల్లో, యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. అనేక ఎవార్డులు, రివార్డులు సాధించాడు. ఈవిధంగా డా.రావ్ ప్రశాంతంగా, ఆనందంగా జీవనం కొనసాగిస్తూ హాయిగా వున్నాడు. 

*                         *                                *                          *

ఇదంతా యెందుకు రాస్తున్నట్లు? విసుగ్గా వుంది.

లేదు లేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒకరోజు డా.రావ్ ఓ సభకి వెళ్ళాడు. అది ఒక అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు మహాసభ. అక్కడందరూ పట్టు పంచెలు, పట్టు చీరల్తో హడావుడి హడావుడిగా వున్నారు. ఆ వాతావరణం రావుని పరవశింపజేసింది. వారి ముద్దుముద్దు తెలుగు మాటలకి ఉత్తేజితుడైనాడు డా.రావ్.

డిప్పగుల కసిభూషణశర్మ కూనిరాగాల అవధానాన్ని అసాంతమూ ఆస్వాదించాడు, అవధులు దాటిన ఆనందంతో ఆనంద భాష్పాలు కార్చాడు. 

'నీ దేశం, నీ ఊరు, నీ తల్లి, నీ భాష పిలుస్తుంది.. రా! రా!' అంటూ ఒకే వాక్యాన్ని ఖండఖండాలుగా నరికుతూ, డప్పు కొడుతూ పూనకం వచ్చినవాళ్ళా ఫడేల్ ఫణీంద్ర అరిచాడు.. సారీ! పాడాడు. అతని కేకల్ని 'గజల్' అని అంటార్ట! ఆ అరుపుల్ని విని డా.రావ్ ఆవేశభరితుడైనాడు. తట్టుకోక మిసెస్ రెడ్డిని వాటేసుకుని బావురుమన్నాడు, పొరబాటు గ్రహించి లెంపలేసుకుని 'సారీ' చెప్పాడు.

ఆ సమావేశంతో డా.రావులో నూతనోత్తేజం ఉరకలెత్తింది.

"తెలుగుజాతి మనది, నిండుగా వెలుగుజాతి మనది." అంటూ ఆవేశంగా పాడుకున్నాడు.

"పుణ్యభూమి నా దేశం నమో: నమా!" అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు.

"మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. " అంటూ ఆనందపరవశుడయ్యాడు

*                          *                                  *                           *

ఇంటికేళ్ళంగాన్లే హడావుడిగా తన మదీయ మిత్రుడు, గుంటూరు మెడికల్ కాలేజ్ క్లాస్మేటూ అయిన వెంకట్రావుకి ఫోన్ చేసాడు.

"గుంటూరులో నేనో సైకియాట్రీ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాను, ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడాలి."

వెంకట్రావు ఎంబీబీఎస్‌తో చదువాపేశాడు. సొంతవూరైన గుంటూర్లోనే జనరల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

స్నేహితుని ప్రపోజల్‌కి ఆశ్చర్యపోయి - "తొందరపడకు... " అంటూ ఏదో చెప్పబోయ్యాడు.

"తొందరా! నథింగ్ డూయింగ్, ఇప్పటికే ఆలస్యమైంది. నా తెలుగుజాతి.. తెలుగుభాష.. తెలుగు గాలి.. తెలుగు నేల.. " అంటూ రోప్పసాగాడు డా.రావు.

వెంకట్రావుకి విషయం అర్ధమైంది. "అలాగే! సాధ్యమైనంత త్వరలో అన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వు మాత్రం రోప్పకు." అన్నాడు.

*                              *                                 *                             *

చెప్పిన విధంగానే తక్కువ సమయంలోనే డా.రావ్ ఆస్పత్రి ఏర్పాట్లు పూర్తి చేశాడు వెంకట్రావు.

"ఎన్నాళ్ళో వేచిన ఈ ఉదయం" అని పాడుకుంటూ తట్టాబుట్టా సర్దుకుని గుంటూరు వచ్చేసాడు డా.రావ్.

భార్యాపిల్లలు 'ముందు నువ్వు తొందరగా వెళ్ళు, వెనక మేం నిదానంగా వస్తాం.' అని అక్కడే ఉండిపోయారు. మనసులో మాత్రం  'డటీ ఇండియా, డటీ పీపుల్.' అనుకున్నారు.

గుంటూర్లో ఆస్పత్రి ఓపెనింగ్ అట్టహాసంగా అద్దిరిపోయింది. సన్నాయి వాయిద్యం, వేదపండితులు, వేదమంత్రాలు.. చాలా హడావుడిగా జరిగింది. ఆనందాన్ని తట్టుకోలేక వెంకట్రావుని పట్టుకుని భోరున ఏడ్చేశాడు డా.రావ్, స్నేహితుణ్ని జాలిగా చూస్తూ ఓదార్చాడు వెంకట్రావు.

(డా.రావ్ పరిచయం పూర్తయింది. ఇక నుండి ప్రాక్టీస్ కబుర్లు)

(picture courtesy : Google) 

Tuesday, 1 November 2011

అయ్యా! పిల్లలు గలోణ్ణి


అది దర్శకేంద్రుడు తీస్తున్న లేటెస్టు సినిమా షూటింగు. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి లారీలు. లారీల్నిండా యాపిల్సూ, ద్రాక్షాలు, బంతిపూలు! ఒక లారీలోంచి ప్రొడ్యూసర్ కనకారావు బామ్మర్ది అడావుడిగా "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

దర్శకేంద్రులవారు గడ్డం నిమురుకుంటూ తీస్తున్న వర్షం పాట గూర్చి ఆలోచిస్తున్నారు. ప్రొడ్యూసర్ కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకేంద్రుడు మళ్ళీ గడ్డం నిమురుకుంటూ "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు ఈరోయిన్ బొడ్డుమీద ద్రాక్షాకాయ గుత్తులు, పొట్టమీద యాప్లీసు కాయలు, చెస్ట్ మీద బంతిపూల సీన్లు తియ్యాలకదండీ. మీరు రోడ్డుమీద దొర్లించటానికి మూడులోడ్లు బత్తాకాయలు ఎనకమాల వత్తన్నాయండి." అన్నాడు కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.


అది దర్శకరత్న తీస్తున్న లేటెస్టు సినిమా షూటింగ్. ఓ పక్కగా కూర్చుని రీముల కొద్దీ డైలాగులు రాస్తున్నాడు దర్శకుడు. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి లారీలు. లారీల్లో పాడె, కుండ, బొగ్గులు, తెల్లగుడ్డ! ఒక లారీలోంచి ప్రొడ్యూసర్ కనకారావు బామ్మర్ది అడావుడిగా "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

దర్శకరత్న హెవీగా ఆలోచిస్తూ హెవీ సీన్నొకదాన్ని రాస్తూనే వున్నాడు. ప్రొడ్యూసర్ కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకుడు తల పైకెత్తి - "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు శవాన్ని మోసే సీను తీస్తారుగా! ఇంతకీ శవాన్ని కూర్చోపెట్టి స్నానం చేయిస్తారా? పడుకోబెట్టా? శోకాలు పెట్టటానికి వందమంది సరిపోతారా? శవాన్ని దహనం చేసే సీనుకి ఒకలారీ కట్టెలు చాలా?" అనడిగాడు కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.


అది కళాతపస్వి తీస్తున్న లేటెస్టు సినిమా షూటింగ్. తియ్యాల్సిన సీన్ గూర్చి కెమెరామెన్ తో చర్చిస్తున్నాడు తపస్వి. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి లారీలు. లారీల్లో పట్టుచీరలు, పట్టుపంచలు, పసుపు కుంకుమలు, వీణ, ఫ్లూటు, గజ్జెలు! ఒక లారీలోంచి ప్రొడ్యూసర్ కనకారావు బామ్మర్ది అడావుడిగా "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

ప్రొడ్యూసర్ కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకుడు ఆశ్చర్యంగా - "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు వీణ పాట, గజ్జెల డ్యాన్సింగులు తీస్తారుగా! ఇంతకీ హీరో గుడ్దోడా? హీరోయిను గుడ్డిదా? ఎవరైతే నాకెందుకులేండి! పూజార్లు ఎనకాల లారీలో వస్తన్నార్లెండి. ఆళ్ళు సరిపోకపోతే మా బామ్మర్దిని మళ్ళీ పంపాల." అన్నాడు కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.


కనకారావు ఆవిధంగా పెద్దదర్శకులతో హిట్లూ మరియూ ఫట్లూ తీసి, వార్ధక్య కారణమున విశ్రాంతి తీసుకొనసాగెను. ఇప్పుడు కనకారావు కొడుకు జూ.కనకారావు సినిమాలు తీస్తున్నాడు. మరిప్పుడు అతగాడేం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు?

అది తెలుగు సినిమాల ఫ్యాక్షనిస్టు దర్శకుడి లేటెస్టు సినిమా షూటింగ్. ప్రోడ్యూసర్ మన జూ.కనకారావు. ఇంతలో దుమ్ము రేపుకుంటూ స్పీడుగా వచ్చి ఆగాయి రెండొందల సుమోలు. ఒక సుమోలోంచి జూ.కనకారావు బామ్మర్ది "బావా! ప్రాపర్టీ రెడీ!" అంటూ దిగాడు.

ప్రొడ్యూసర్ జూ.కనకారావు దర్శకుడికి నమస్కరించాడు. "మన సినిమాకి కావాల్సినియ్యన్నీ తెప్పించాను, ఇంక మీదే ఆలీసెం."

దర్శకుడు మొహమాటంగా - "ఇవన్నీ ఎందుకు?" అన్నాడు.

"అదే సార్! మీరు సుమోలు గాల్లోకి లేపుతారుగా! ఇవి చాలకపోతే ఇంకా తెప్పిస్తా, బడ్జెట్ గూర్చి ఆలోచించమాకండి." అన్నాడు జూ.కనకారావు.

"ఈ సినిమాలో అట్లాంటి సీన్లు లేవు." అన్నాడు దర్శకుడు. 

దర్శకుడి చేతులు పట్టేసుకున్నాడు జూ.కనకారావు - "అయ్యా! పిల్లలు గలోణ్ణి. నాపొట్ట కొట్టమాకండి!" దీనంగా అన్నాడు కనకారావు.

(picture courtesy : Google)