Saturday, 29 September 2012

సావిత్రి ఎంతో అందముగా యుండును

"శిష్యా! జీవితాన్ని కాచి వడబోసి ఒక నగ్నసత్యాన్ని కనుక్కున్నా, రాసుకో! సావిత్రి ఎంతో అందముగా యుండును."

"అంత అందంగా ఉంటుందా గురూజీ?"

"అంతింత అందం కాదు, మబ్బంత అందంగా ఉంటుంది."

"మబ్బంతా!?"

"అవును. మబ్బు అందంగా ఉంటుంది, ఎవరికీ అందనంత ఎత్తుగానూ ఉంటుంది. కాలీకాలని పెసరట్టులా ఆ మొహమేంటి! ఓ, అర్ధం కాలేదా? అయితే ఇప్పుడు నువ్వీ మిస్సమ్మ పాట చూడాలి, చూడు!"

"గురూజీ! నాక్కూడా ఈ పాట భలే నచ్చింది."

"నచ్చక చస్తుందా! సావిత్రి అందం అట్లాంటిది. చూశావా! 'వినుటయె కాని వెన్నెల మహిమలు.. అనుభవించి నేనెరుగనయా!' అంటూ చంద్రుడితో చెప్పుకుంటుంది. పాపం! కష్టపడి బియ్యే పాసైంది, అయినా ఏం సుఖం? రవఁణారెడ్డి అప్పు తీర్చడం కోసం పాఠాలు చెప్పుకు బతుకుతుంది. ఏంటలా దిక్కులు చూస్తున్నావ్? ఇంతకీ సావిత్రి అందం గూర్చి నే చెప్పిన నగ్నసత్యం రాసుకున్నావా?"

"గురూజీ! మీరేవీ అనుకోకపోతే నాదో మాట. నాకీ పాటలో సావిత్రి అందం కంటే ఎన్టీరామారావు సిగరెట్ కాల్చడం భలే నచ్చింది. సిగరెట్ అంతలా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చని నాకిప్పటిదాకా తెలీదు. మీరు నన్నొదిలేస్తే అర్జంటుగా ఒక సిగరెట్ కాల్చుకుంటాను, ఉంటాను."

"శిష్యా.. శిష్యా.. ఆగు శిష్యా!"

(fb on 12/6/2017)

Thursday, 27 September 2012

'దేవి శ్రీదేవి.. ' భక్తిపాట కాదు!
నా చిన్నప్పుడు సినిమా పాట వినాలంటే రేడియోనే గతి. యే పాట యే ప్రోగ్రాములో వేస్తారో తెలిసేది కాదు. ఒక్కోసారి బడికెళ్ళినప్పుడు కార్మికుల కార్యక్రమంలో నాకు నచ్చిన పాట వేసేసేవాళ్ళు, అప్పుడు భలే బాధగా వుండేది. ఈ రకంగా నా చిన్నప్పుడు ఇష్టమైన పాట వినడానికి తిప్పలు పడేవాణ్ని.

'సంతానం' సినిమాలో 'దేవి శ్రీదేవి' అంటూ ఘంటసాల పాడిన పాట నాకు చాలా ఇష్టం (సినిమా నేను చూళ్ళేదు). అయితే ఈ 'భక్తిపాట'ని రేడియోవాళ్ళు భక్తిపాటల కార్యక్రమంలో వేసేవాళ్ళు కాదు! అంచేత ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నవారికి సంగీత జ్ఞానం లేదనుకున్నాను!

ఓరోజు స్నేహితుల్తో సినిమా పాటల చర్చ జరుగుతున్నపుడు, ఆకాశవాణి అజ్ఞానాన్ని ప్రస్తావించాను.

"అది భక్తిపాట కాదనుకుంటా. 'నీ కనుసన్నల నిరతము నన్నే హాయిగా ఓలలాడించ రావే' అనికదా ఘంటసాల పాడింది?" అన్నాడొక సినిమా పాటల జ్ఞాని.

"ఆ పాట రాగం, తాళం విన్నాక్కూడా దాన్ని ప్రేమగీతం అంటావేంటి? కవులు భక్తిపాటల్లో కూడా క్రియేటివిటీ చూపిస్తారు. ప్రబంధ కవులయితే దేవతలకి లవ్ లెటర్లు కూడా రాస్తారు." అని మొండిగా వాదించాను.

కొన్నాళ్ళ క్రితం నా అభిమాన 'భక్తిపాట' విందామని యూట్యూబులోకి వెళ్ళాను. వార్నీ - ఇంతాజేసి 'దేవి శ్రీదేవీ' భక్తిపాట కాదు! నాగేశ్వరరావు సావిత్రిని ప్రేమిస్తూ ఘంటసాల స్టోన్లో పాడిన భీభత్సమైన ప్రేమగీతం!

ఇప్పుడీ పాట గూర్చి రెండుముక్కలు. నాకీ పాటలో సావిత్రి పిచ్చగా నచ్చేసింది, సావిత్రి నవ్వు పిచ్చపిచ్చగా నచ్చేసింది. నాగేశ్వరరావు అదృష్టానికి కుళ్ళుకున్నాను. సావిత్రి స్పర్శ తగిలి తలుపు కూడా భలే నటించింది! దటీజ్ సావిత్రి!

(fb post 9/6/2017)

Saturday, 22 September 2012

'అసూబా'ల ఆహార్యం"మాదో అమెరికా తెలుగు సంఘం, అక్కడ తెలుగువాళ్ళ సేవలో తరిస్తున్నాం." అంటూ కొందరు సూటూబూటూరాయుళ్లు ఆంధ్రదేశంలో తిరుగుతుంటారు. వీళ్ళు తెలుగు రాజకీయ పార్టీల సేవకులనీ, కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం అలా తిరుగుతుంటారనీ కిట్టనివారు అంటారు.. నిజానిజాలు తెలీదు. ఈ అమెరికా సూటుబాబుల (ఇకనుండి 'అసూబా') సేవాతత్పరతకు ముగ్ధుడనవుతున్నాను.     
                     
ఇక్కడ మన ఎండల్లో, ఉక్కపోతలో వారు సూట్లేసుకుని చెమటలు కక్కుకుంటూ, కంఠ లంగోటీ (tie) సరిచేసుకుంటూ, వారి సేవా కార్యక్రమాల్ని యేకరువు పెడుతుంటే నాకు వొళ్ళు పులకిస్తుంది, ఆనందభాష్పాలు రాల్తాయి. ఇంత గొప్ప సమాజసేవకులక్కూడా చెమట ధారలు కార్పిస్తున్న మన దుష్టవాతావరణానికి సిగ్గుతో తల దించుకుంటుంటాను.  
                     
ఎదుటివాడు జడుసుకుంటాడని బట్టలేసుకుంటాం గానీ, అసలు మన వాతావరణం బట్టలకి సూటవదు. ఇక్కడ యోగివేమన డ్రెస్సే కరక్ట్. 'అసూబా'లకి సూటూబూటూ వేసుకోవాలని రూలుందా? ఈ వేషాల్ని 'ఆహార్యం' (ఆహారం కాదు) అంటారని యెక్కడో చదివాను.  
                      
నా క్లాస్మేట్లు చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు. ఒకసారి ఒక అమెరికావాసి యేదో పార్టీలో కోటేసుకొచ్చి 'అసూబా'గా తన ఆహార్యం ప్రదర్శించాడు. మన భారతీయులకి సున్నితత్వం ఉండదు, బొత్తిగా అసూయపరులు. ఆరోజు పార్టీలో మా 'అసూబా' అనేక విధాలుగా హింసింపబడ్డాడు. అమెరికాకి వెళ్ళి ఒక మంచి సూటుగుడ్డ కొనుక్కున్నందుకు అభినందించాం. సూట్లో అచ్చు దొరబాబులా ఉన్నావని పొగిడాం. కోటేసుకున్నావు కాబటి నువ్వు కోటేస్సర్రావ్వి అంటూ ముద్దుగా పిలుచుకున్నాం. కొద్దిసేపటికి అతగాడు రెండుచేతులూ జోడించి నమస్కరించి కోటు విప్పి అవతల పడేశాడు.       

పురాణపురుషులక్కూడా ఈ ఆహార్యమే ప్రధానం. విష్ణుమూర్తి పొద్దస్తమానం పాముమీద పడుకుని లక్ష్మీదేవితో కాళ్ళొత్తించుకుంటుంటాడు, అందుక్కారణం ఆయనకి కాళ్ళనొప్పి కాదు. కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి లేకపోతే ఆయ న్నెవరూ గుర్తు పట్టలేరు - అందుకని! పింఛంలేని కృష్ణుణ్ణీ, నాగలి చేతలేని బలదేవుణ్ణీ - ఇలా ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. ఎంత బరువుగా ఉన్నా, మరెంతో దురదగా ఉన్నా ఈ ఆభరణాలూ, వారి ట్రేడ్మార్క్ ఆయుధాలూ మోయక తప్పదు. ఆహార్యం అంటే అదే మరి!
                      
ఈ వేషభాషల గోల పురాణ పురుషులకేం ఖర్మ, వృత్తుల్లో కూడా చాలా ముఖ్యం. వాస్తురత్న, వాస్తుబ్రహ్మలకి మునుల్లాగా పొడుగు జుట్టు, పెద్ద బొట్టు, మెళ్ళో రుద్రాక్షలే ఆహార్యం. ఈ అవతారం లేకుండా ఈశాన్యమ్మూల బరువుందనీ, ఆగ్నేయం లోతుందనీ వారు చెప్పలేరు.. చెప్పినా ఎవడూ పట్టించుకోడు. 

ఎంగెల్స్‌కి ఒకసారి గడ్డం దురదెట్టి గీసేద్దామనుకున్నాట్ట! గడ్డం తీసెయ్యటానికి గతితార్కిక భౌతికవాదం ఒప్పుకోదని మార్క్స్ వాదించాడు. వెధవ గడ్డానికి సిద్ధాంతాల రాద్ధాంతం ఎందుకులెమ్మని ఎంగెల్స్ కేరళీయ వైద్యం లాంటిదేదో చేసుకుని  మూతి దురదని తగ్గించుకున్నాట్ట! ఇది నిజం, ఒట్టు. నన్ను నమ్మండి. నమ్మకపోతే కమ్యూనిస్టు మేనిఫెస్టో రెండో అధ్యాయం, పధ్నాలుగో పేజీ చూడండి!            
                      
రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి తెల్ల టాటా సుమోలే ఆహార్యం. ఆమధ్యన టాటా కంపెనీవాళ్ళు సుమోల ప్రొడక్షన్ ఆపేద్దామనుకున్నారు. కానీ - "ఒరే టాటా! నువ్వు సుమోలని ఆపావో.. అమ్మతోడు. అడ్డంగా నరికేస్తా" అంటూ ఒక ఫ్యాక్షనిస్టు తొడగొట్టి మరీ తన్ టాటాని బెదిరించాట్ట. తన సుమోలకి ఇంత చరిత్ర ఉందని తెలుసుకున్న రతన్ టాటా, ఫ్యాక్షనిస్టు పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు, ఒక సాటి పారిశ్రామికవేత్తగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాట్ట.


నాకు తెలిసిన పోలీసాఫీసర్ ఒకాయన Royal Enfield మోటర్ సైకిల్ని ఎంతో శ్రమకోర్చి నడుపుతుండేవాడు. చూసిచూసి ఒకరోజు ఉండబట్టలేక ఎందుకా దున్నపోతుని వెంటేసుకు తిరడగమంటూ అడిగేశా. అతను పెద్దగా నవ్వి "భలేవాడివే! బుల్లెట్ నడపకపోతే నేరస్తుల గుండెల్లో నిద్ర పోయేదెట్లా? చట్టం, న్యాయం, ధర్మం అనే మూడుసింహాలని కాపాడేదెట్లా?" అన్నాడు. అదీ నిజమే!  
                     
తరచి చూడగా - ఇంతమంది ఇన్నితిప్పలు పడుతూ తమ వేషాలు మోస్తూ ఉండటం మనకీ, వాళ్ళకీ కూడా అవసరమేననిపిస్తుంది. వేషాలు మనకి సౌకర్యంగా ఉండటం కోసం కాదు, కానేకాదు. ఎదుటివాడికి మన స్థాయీ, అంతస్తు తెలియజెయ్యటానికి మాత్రమే! ఇది దేవుళ్ళకే తప్పలేదు, ఆఫ్టరాల్ మన 'అసూబా'లెంత!

(picture courtesy : Google)              

Tuesday, 18 September 2012

నా కళ్ళజోడు కష్టాలు


మీరు రోజులో ఎక్కువ భాగం ఏంచేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం వస్తువులు వెతుక్కుంటూ ఉంటాను. చదువుతున్న పుస్తకం, తాగుతున్న కాఫీ కప్పు, రాస్తున్న పెన్ను.. ఇలా ఒకటేమిటి.. అన్నీ ఎక్కడ పెట్టానో మర్చిపోయి వెతుక్కుంటూ ఉంటాను. జీవితంలో ఇంకెప్పుడూ ఏదీ మర్చిపోకూడదని పట్టుదలగా ఉంటాను. కానీ కొద్దిసేపటికి ఆ పట్టుదలని కూడా మర్చిపోతాను!

నేను ఎక్కువసార్లు.. ఎక్కువసేపు వెతుక్కునేది నా కళ్ళజోడు. నాకీ కళ్ళజోడు వెదుకులాట బాగా అలవాటైపోయింది. ఎంత అలవాటయ్యిందంటే.. ఒక్కోసారి కళ్ళజోడు పెట్టుకుని కూడా కళ్ళజోడు కోసం వెతుకుతుంటాను!

నాకు రెండు కళ్ళజోళ్ళు. ఒకటి సీనియర్. సీనియర్ ఇంటర్ నుండి నన్నంటి పెట్టుకునుంది. కొన్ని వందల సినిమాల్ని స్పష్టంగా చూపించిన నేస్తం. రెండోది నలభైయ్యేళ్ళు దాటినందుకు చిహ్నంగా వచ్చిన చత్వారం. దీన్నే ఆంగ్లంలో రీడింగ్ గ్లాసెస్ అంటారు. నాతో ఎన్నో మంచిపుస్తకాలు చదివించింది. మిమ్మల్ని భయపెట్టే తెలుగులో చెప్పాలంటే మొదటిది దీర్ఘదృష్టి లోపం, రెండోది హ్రస్వదృష్టి లోపం!

రోజూ ఈ కళ్ళజోడు వెతుక్కోడం నాకు చికాగ్గా ఉంటుంది. అంచేత 'ఇక్కడే, ఇందాకే పెట్టాను. ఎవరు తీశారో చెప్పండి.' అంటూ ఇంట్లోవాళ్ళని సతాయించసాగాను. మా అబ్బాయి, అమ్మాయి కళ్ళజోడు వెతికి పెట్టినందుకు ఫీజు వసూలు చెయ్యసాగారు. నాకు కళ్ళజోడు దొరికేదాకా మనశ్శాంతి లేకుండా చేస్తానని గ్రహించిన నా భార్య కూడా ఈ కళ్ళజోడు వెదుకులాటలో ఓ చూపు వెయ్యసాగింది.

క్రమేణా నా కళ్ళజోడు సణుగుడు భరింపరానిదిగా తయారైనట్లుంది.. నా భార్య తన మిత్రుడు మరియూ క్లాస్‌మేట్ అయిన ఒక కంటివైద్యునికి తన గోడు వెళ్ళబోసుకొంది. ఆయన నా పీడా విరుగుడుగా ఒక నల్లటి తాడులాంటిదేదో పంపించాడు. (ఇంకానయం! ఈవిడకి ఏ ప్లీడరో స్నేహితుడైనట్లయిన నాపై గృహహింస కేసు పెట్టించేవాడు.) 

ఈ నల్లతాడుకి రెండువైపులా చిన్నరింగులు. అందులో కళ్ళజోడుకుండే రెండు పుల్లలు దూర్చి fix చెయ్యాలి. పిమ్మట ఆ తాడుని మెళ్ళో హారంగా ధరించాలి.

ఆ కళ్ళజోడు హారం మంగళసూత్రం వలె ధరించిన వెంటనే మెడ భాగం దురద పెట్టసాగింది. 'కొన్నాళ్ళకీ దురద అలవాటైపోతుంది. తియ్యొద్దు.' అని నాభార్య ఆజ్ఞాపించింది. ఆమెని ధిక్కరించు ధైర్యంలేదు.

నా మంగళసూత్రాన్ని భక్తిగా కళ్ళకద్దుకున్నాను. హఠాత్తుగా సతీఅనసూయ, సక్కుబాయిలా ఫీలవడం మొదలెట్టాను. 'ఆడది కోరుకునే వరాలు రెండేరెండు. చల్లని ఇల్లూ.. ' అంటూ పాడుకుందామనే కోరికని బలవంతంగా ఆపుకుని.. నా కళ్ళజోడు వెతుక్కునే ప్రోగ్రాంకి తెర పడినందుకు సంతసించితిని.


నా భార్యకి నేనీ కళ్ళజోడు సూత్రం తీసేస్తాననే అనుమానం కలిగినట్లుంది. 'CPM సీతారాం ఏచూరి, RSS శేషాద్రిచారిలు కూడా ఇట్లాంటి సూత్రాలతోనే టీవీల్లో కనిపిస్తుంటారు. నువ్వు కూడా వాళ్ళలాగే మేధావిలాగా కనిపిస్తున్నావ్.' అంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. నా ఛాతీ గర్వంతో రెండంగుళాలు ఉబ్బింది.

ఆస్పత్రిలో పేషంట్లని చూచుచూ.. ఈ కళ్ళజోడు వ్యవహారం మరచితిని. కానీ పేషంట్లు నా కళ్ళజోడు సూత్రం వైపు ఆశ్చర్యంగా చూడసాగారు. కొందరు నిర్మొహమాటస్తులు తాడు గూర్చి సూటిగా అడిగెయ్యడం మొదలెట్టారు. ఒకడు 'ఆ తాడు లేకపోతే మీక్కనపడదా?' అంటూ అనవసరపు కుతూహలం ప్రదర్శించగా.. ఇంకోడు 'ఆ తాడు కళ్ళజోడు చార్జికి ఎగస్ట్రానా?' అంటూ ఎగస్ట్రాలు.

ఇప్పుడొక ధర్మసందేహం. మరి నా ఈడువారు ఒకే కళ్ళజోడుతో అన్నిచూపులూ చూసేస్తున్నారే! ఇదెలా సాధ్యం? దీనికి సమాధానం ఆనతికాలంలోనే లభించినది. నాల్రోజుల తరవాత జరిగిన ఒక సైకియాట్రీ కాన్ఫరెన్సులో ఈ కళ్ళజోడు కూపీ కూడా ప్రధానాంశముగా చేర్చితిని. 

అక్కడ పిచ్చివైద్య శిఖామణులతో మాట్లాడగా తెలిసింది.. వారు ప్రోగ్రెసివ్ లెన్స్ అనబడే కళ్ళద్దాలు వాడుతున్నారుట. శివరాత్రి నాడు ఒకే టికెట్టుపై రెండు సినిమాలు చూపినట్లు.. ఒకే అద్దంలో రెండు పవర్లు ఉంటాయిట. ఇదేదో బాగానే ఉంది.

నేను మాత్రం తక్కువ తిన్నానా? హమ్ కిసీ సే కమ్ నహీ. నా భార్య స్నేహితుడైన ఆ కంటి డాక్టర్ని సంప్రదించితిని. అతగాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఎదురుగా ఉన్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ గళ్ళల్లో ఏవో అంకెలు కెలికాడు. నాల్రోజుల్లో నా ముఖారవిందాన్ని కొత్తకళ్ళజోడు అలంకరించింది . తిరునాళ్ళలో నాల్రూపాయలకి నల్లకళ్ళజోడు కొనుక్కుని నాగేశ్వర్రావులాగా ఫీలవుతారు. నేను మరీ అంత గర్వపడలేదుగానీ - కించిత్తు ఆనందపడ్డాను.

నా కొత్త కళ్ళజోడు గూర్చి రెండుముక్కలు. దూరం వస్తువుల్ని చూడాలంటే అద్దం పైభాగం నుండి చూడాలట. చదవాలంటే క్రిందిభాగం నుండి చూడాలిట. పైభాగం పాకిస్తాన్.. క్రిందిభాగం ఇండియా. మధ్యలో ఏదేశానికి చెందని కాశ్మీర్ వలే.. ప్లస్సూ, మైనస్సులు కలగలిపిన పవర్. ఇదేదో మాయా అద్దమువలెనున్నదే! భలే భలే! 'కల నిజమాయెగా, కోరికా తీరెగా'.
                               
కానీ ఒక చిక్కొచ్చి పడింది. ఎదుటివారితో మాట్లాడాలంటే క్షవరం చేయించుకునేవాడిలా తల దించాలి. ప్రిస్క్రిప్షన్ రాయాలంటే మోర పైకెత్తాలి. తల ఎత్తీ దించి.. దించీ ఎత్తి.. తొండ మార్కు ఎక్సర్ సైజులు చేయగా, చేయగా మెడనరం పట్టేసింది. సాయంకాలానికల్లా విసుగొచ్చేసింది. ఇక లాభం లేదనుకుని.. నా పాత రీడింగ్ గ్లాసులు పెట్టుకున్నా. ఎంతో హాయిగా ఉంది!

ఈ కొత్తరకం అద్దాలు నాకేల? నాకు రెండుకళ్ళు, రెండు చెవులు. అట్లే.. రెండురకాల దృష్టిలోపాలు. చదవడానికో జోడూ.. దూరంగా చూడ్డానికి మరో జోడు. సో వాట్? ఈ రెండు పవర్లు కలిపి ఒకే కళ్ళజోడులో ఇరికించుకొని.. నేను సాధించేదేమిటి? మెడనొప్పి తప్ప! చంద్రబాబంతటివాడిదే రెండుకళ్ళ సిద్ధాంతం. మరప్పుడు నాకు మాత్రం రెండు కళ్ళజోళ్ళ సిద్ధాంతం ఎందుకుండరాదు?

నాకీ కొత్త లెన్సులూ వద్దు.. ఆ మంగళసూత్రాలూ వద్దు. అసలు కళ్ళజోడు వెతుక్కోడంలో ఎంత ఆనందముంది! భార్యని ఆ మాత్రం ఇబ్బంది పెట్టనియెడల మగవాడి భర్తత్వానికే కళంకం కాదా! కావున.. మితృలారా! ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునదేమనగా.. నేను మళ్ళీ నా పాత కళ్ళజోళ్ళకే షిఫ్ట్ అవుతున్నాను.
       
ముగింపు -

ఈ మధ్య ఒకపెళ్ళిలో మన కంటి డాక్టరు తారసపడ్డాడు. 'మీరు తొందర పడ్డారు. ప్రోగ్రెసివ్ లెన్స్ ఓ పదిరోజులు అట్లాగే ఉంటాయి. తరవాత చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.' అంటూ సెలవిచ్చాడు. తరచి చూడగా.. ఈ కంటి డాక్టరు పక్కనేఉన్న తన స్నేహితుడైన మెడనొప్పి డాక్టరుతో మేచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడేమోనని అనుమానం కలుగుతుంది!

(photos courtesy: Google)  

Tuesday, 11 September 2012

తెలంగాణా.. ఒక సవర్ణదీర్ఘసంధి!


అబ్బబ్బ! మొన్నటిదాకా చిదంబరం. ఇప్పుడు షిండే. మనుషులు మారారుగానీ.. పద్ధతులు మారలేదు. అందరిదీ మా తెలుగు మాస్టారి విధానమే!

'ఎవరా తెలుగు మాస్టారు? ఏమా విధానం?'

నాకు మా మాజేటి గురవయ్య హైస్కూల్లో ఎనిమిది నుండి పది వరకు.. మూడేళ్ళపాటు తెలుగు సబ్జక్టుకి ఒక టీచరే continue అయ్యారు. ఆయన మాకు సంధులు చెప్పేవారు. సంధులలో మొదటిది సవర్ణదీర్ఘసంధి. అది వివరంగా చెప్పేవారు. అందరికీ సూత్రం కంఠతా రావాలి. అది ఆయన policy. మాస్టారు క్లాసుకి రాంగాన్లే అందరం చేతులు కట్టుకుని నించొని.. ఒకళ్ళ తరవాత ఒకళ్ళం సవర్ణదీర్ఘసంధి అప్పచెప్పేవాళ్ళం.

క్లాసుల్లో ఒకళ్ళిద్దరు నిద్ర పొయ్యేవాళ్ళు. కొందరు కిటికీలోంచి కాకుల్ని, కుక్కల్ని చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు. వాళ్ళల్లో ఏదోక దరిద్రుడు సూత్రం సరీగ్గా అప్పచెప్పేవాడుకాదు. ఇంక చచ్చామన్నమాటే! మేస్టారు మళ్ళీ సవర్ణదీర్ఘసంధి వివరంగా చెప్పేవాడు. మళ్ళీ అప్పజెప్పించుకోవడం మొదలు. ఈవిధంగా మాకు భూమి గుండ్రంగా ఎందుకుందో అనుభవపూర్వకంగా అర్ధమైంది. రెండోసంధి గుణసంధి. అది సగంలో ఉండగానే పదోతరగతి పరీక్షలొచ్చాయి. అమ్మయ్య!

ఈ సవర్ణదీర్ఘసంధి బాధ భరించలేక ఒకసారి మా సత్తిగాడు గుణసంధిలోకి రమ్మని మాస్టారుకి మొరపెట్టుకున్నాడు. 'వెధవా! నాకే పాఠాలు చెబుతావా?' అంటూ మాస్టారు సత్తిగాడి వీపు సాపు చేశారు. అప్పట్నించి ఎవరూ నోరెత్తే సాహసం చెయ్యలేకపోయారు. మన తెలుగు మాస్టారుకి సవర్ణదీర్ఘసంధి మాత్రమే వచ్చునని.. అందుకే ఇట్లా manage చేశారని మా సుబ్బు అంటాడు.

నాకీమధ్య మళ్ళీ సవర్ణదీర్ఘసంధి గుర్తొస్తుంది. రాష్ట్రవిభజన గూర్చి కేంద్ర హోమ్ మినిస్టర్లు చేసే ప్రకటనలు 'అప్పురేపు'లా ఒకేవిధంగా ఉంటాయి. వాళ్ళు 'ఏకాభిప్రాయ సాధన' అన్నపుడల్లా నాకు 'సవర్ణదీర్ఘసంధి' అన్నట్లు వినిపిస్తుంది!

రేపోమాపో చంద్రబాబు ఉత్తరం ఇస్తాట్ట. మరి ఒవైసీ ఎప్పుడిస్తాడో? ఎవరోకళ్ళు ఇవ్వకపోయినా సమస్య మళ్ళీ మొదటికే. అందరూ ఉత్తరాలిచ్చినా.. సంతకాలు సరీగ్గా లేవనో, స్టాంపులు సరిపడా అతికించలేదనో తిప్పి పంపొచ్చు. మళ్ళీ fresh గా ఇమ్మని అడగొచ్చు! దటీజ్ సవర్ణదీర్ఘసంధి!

'సమస్య సున్నితమైనది.' కాదన్నదెవరు?

'లోతైనది.' ఒప్పుకున్నాం.

అయితే ఏంటి? ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు, పరిష్కారాలు ప్రజల జీవితాలతోనే ముడిపడే ఉంటాయి. అందుకేగదా మీకు ఓట్లేసి గెలిపించి మా భవిష్యత్తు మీచేతిలో పెట్టింది. సున్నితం, లోతు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పే బదులు తప్పుకోవచ్చుగా!

షిండేగారికి ఎవరో చిన్న రాష్ట్రాల వల్ల నక్సలైట్ల సమస్య పెద్దదైపోతుందని చెప్పారట! మూడేళ్ళనుండి సీమాంధ్ర నాయకులు ఈసంగతి ఇల్లెక్కి అరుస్తున్నారు. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు ఎలుగెత్తి సమాధానం చెబుతున్నారు. కానీ home department కి మాత్రం ఇప్పుడే వినబడుతుందిట! ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలిపేసి నక్సలైట్ సమస్యని అంతమొందిస్తారేమో!

ఏమిటో! అంతా సవర్ణదీర్ఘ సంధి మయం! ఇంతకీ కాంగ్రెస్ దగ్గర గుణసంధి సూత్రం ఉందా? లేక మా తెలుగు మాస్టారిలా....

(photo courtesy : Google)

Monday, 10 September 2012

బ్రోకర్ మాటలు


"తప్పకుండా! అలాగే! చూద్దాం. చేద్దాం. అంతే! అంతే! అలాగే!" అంటూ ఫోన్ పెట్టేశాను.

మనసు చికాగ్గా ఉంది. నాకీ పని చెయ్యడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఒక చిన్న ఆబ్లిగేషన్ వల్ల చెయ్యక తప్పేట్టు లేదు.

'ఇలా ఇరుక్కు పోయానేమిటబ్బా! బయటపడే మార్గంలేదా?' అనుకుంటూ ఆలోచనలో పడ్డాను.

ఎదురుగ్గా గోడ మీద నాన్న ఫొటో.. నన్ను చూసి నవ్వుతున్నట్లుంది.

"బ్రోకరు మాటలు బాగానే చెబుతున్నావే!" అంటున్నట్లుగా కూడా అనిపించింది.

నాన్న చనిపోయి చాలా యేళ్ళయింది. చాలామందికి తమ తండ్రి గూర్చి ప్రేమ, ఉద్విగ్నతతో కూడిన గొప్పజ్ఞాపకాలు ఉంటాయి. 'మా నాన్నగారు' అంటూ పుస్తకాలు కూడా రాస్తున్నారు. నాకంతటి అదృష్టం లేదు. నేనెప్పుడూ నాన్నని గొప్ప వ్యక్తిగా భావించలేదు. మేమిద్దరం మామూలు మనుషులం. భోంచేస్తూ, టీవీ చూస్తూ చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. జోకులేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు వాదించుకునేవాళ్ళం.

నాన్న అతిసాధారణ వ్యక్తి. భోజన ప్రియుడు. స్నేహితులతో కబుర్లు, పుస్తకాలతో స్నేహం ఆయనకి ఇష్టం. నాన్న స్నేహితుల లిస్టులో నేనుకూడా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. ఆయనెప్పుడూ నాదగ్గర తండ్రి హోదా చూపించలేదు. ఆయన చివరిదాకా నాకు స్నేహితుడిగానే ఉండిపొయ్యాడు. ఫలానా పని చెయ్యమనిగానీ, చెయ్యొద్దనిగానీ నాకెప్పుడూ సలహా ఇవ్వక పోవడమే నాన్న నాకు చేసిన గొప్ప మేలు.

"బ్రోకరు మాటలు చెప్పకు." ఇది నాన్న తరచూ వాడే మాట. బ్రోకర్ అనగా 'దళారీ' అని అర్ధం. అయితే నాన్న బ్రోకర్ పదాన్ని dictionary అర్ధంతో ఎప్పుడూ వాడలేదు. ఆయన దృష్టిలో అదో పెద్ద తిట్టు! బ్రోకర్లంటే నిజాయితీపరులు కాదనీ.. సొంతలాభం కోసం నిజాల్ని ట్విస్ట్ చేసే అవకాశవాదులని ఆయన అభిప్రాయం. అసలు నాన్నకి ఈ బ్రోకర్లంటే ఎందుకంత ఎలెర్జీ?

మన సమాజంలో 'బ్రోకర్' పదానికి గౌరవం లేదు. కొందరైతే 'బ్రోకరంటే అమ్మాయిలని set చేసేవాడు' అని కూడా అనుకుంటారు. అందుకే 'అమ్మాయిల బ్రోకర్' అనే మాట పాపులర్. 'మూగమనసులు'  సినిమాలో అల్లు రామలింగయ్య జమునని నాగభూషణానికి 'సెట్' చెయ్యబోతాడు. ఆ ప్రయత్నంలో జమునతో తన్నించుకుంటాడు. భార్యతో తిట్టించుకుంటాడు.

ఈ 'బ్రోకర్' అనే పదానికున్న negative connotation వల్ల.. పెళ్ళిళ్ళ బ్రోకర్లు మేరేజ్ బ్యూరో నిర్వాహకులగానూ, ఇళ్ళస్థలాల బ్రోకర్లు రియల్ ఎస్టేట్ ఏజంట్లుగానూ రూపాంతరం చెందారు (పేర్లు మార్చుకున్నారు). పశ్చిమ దేశాల్లో కార్పోరేట్ డీల్స్ కుదిర్చే బ్రొకర్లకి భారీ కమీషన్లు ముడతాయి. మనది పుణ్య భూమి. ఇచట అఫీషియల్ బ్రోకరేజ్ నిషిద్ధం.

ఇళ్ళస్థలాల బ్రోకర్ ఏం చెబుతాడు? అమ్మేవాడితో.. భూటాన్ లో భూకంపం వచ్చినందున ఇళ్ళస్థలాల రేట్లు దారుణంగా పడిపోయ్యయంటాడు. చచ్చోనోడి పెళ్ళికి వచ్చిందే కట్నంగా ఫలానా రేటుకి, ఫలానా వాడికి అమ్మెయ్యమంటాడు. కొనేవాడికి కొసరు కబుర్లు వినిపిస్తాడు. స్థలం బంగారం అంటాడు. ఇంగ్లాండులో ఇత్తడి రేటు తగ్గినందున నెల లోపే స్థలం రేటు రెట్టింపు అయిపోతుందంటాడు. ఈ రకంగా రెండు పార్టీల దగ్గర రెండురకాల రికార్డులు  వేస్తాడు. డీల్ సెటిల్ చేసి కమిషన్ తీసుకుంటాడు. ఇదంతా మనకి తెలిసిన వ్యవహారమే!

మన రాజకీయ నాయకుల కూడా అచ్చు ఇలాగే చెబుతారు. ఫలానా ప్రాజెక్ట్ దేశానికి తక్షణావసరం అంటారు. ఈ ప్రాజెక్టుతో దేశాభివృద్ధి అమెరికాకి అరంగుళం అంచులోకి వచ్చేస్తుందంటారు. అయితే ఈ 'దేశాభివృద్ధి'లో మతలబు వేరుగా ఉంటుంది. నాలుగ్గోడల మధ్యన పెద్దమనుషుల ఒప్పందాలు జరుగుతాయి. మన ఆస్థులు వాళ్ళే రాసేసుకుని మనకే బ్రోకరేజ్ విదుల్చుదురు! ఇదొక ఆధునిక బ్రోకర్ వ్యవస్థ.

పూర్వం ఏదైనా పత్రికా సంపాదకుడు ప్రభుత్వ పాలసీని సమర్ధిస్తూనో, వ్యతిరేకిస్తూనో ఒక సంపాదకీయం రాస్తే ప్రజలు సీరియస్ గా ఆలోచించేవారు. ఇప్పుడీ రంగం మారిపోయింది. పత్రికాధిపతులే ఎడిటర్లు. వారికి వ్యాపారాలుంటయ్. రాజకీయ ప్రయోజనాలుంటయ్. మనకి మాత్రం పరిశుద్దాత్మతో నీతిబోధనలు ప్రవచించెదరు. మనల్ని ఉత్తమ ఓటరుగా తీర్చిదిద్దుటకు శ్రమించెదరు!

వీరిని ఇంటలెక్చువల్ బ్రోకర్లని అనవచ్చును. ఈ తెగవారు తమ వాదనాపటిమతో, రచనాచాతుర్యంతో మనని బురిడీ కొట్టించి 'భలే చెప్పాడే!' అనిపిస్తారు. కానీ.. వారి అసలు ఉద్దేశం వేరు. వీళ్ళుకూడా నాన్న చెప్పిన బ్రోకర్లే. తమ అసలు రంగు కనబడనీయకుండా రకరకాల ముసుగులు కప్పుకుని మోసం చేసే దొంగబ్రోకర్లు. అసలు బ్రోకర్ల కన్నా ఈ ముసుగు బ్రోకర్లు మహా ప్రమాదకరమైన మాయగాళ్ళు. ఇప్పుడా ముసుగులు కూడా పక్కన పడేస్తున్నార్లేండి!

'ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే కలడు బ్రోకర్.' అని అనిపిస్తుంది. 'ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం బ్రోకర్ల పీడన పరాయణత్వం.' అని కూడా అనిపిస్తుంది. ఒకడు కనబడే బ్రోకరైతే, మరొకడు కనబడని బ్రోకరు. ఒకడిది పొట్ట పోసుకునే వృత్తి అయితే వేరొకడిది పొట్ట కొట్టే వృత్తి.
                                   
ఈ విధంగా 'సర్వం బ్రోకర్ల మయం' కావడానికి కారణం ఏమిటి? సమాజంలో డబ్బు అవసరాలు పెరగడం, డబ్బుతోనే రాజకీయాలు కూడా నడపగలమన్న నమ్మకం పెరిగిపోవడం అయ్యుండొచ్చు. అందుకనే మనం ఇప్పుడు Forbes జాబితా అంటూ డబ్బున్నోళ్ళ పేర్లు ఫాలో అవుతున్నాం. వాళ్ళే మనకి ఆదర్శం.

నాన్నకాలం స్వర్ణయుగం. డబ్బు అవసరాలు తక్కువ. అంచేత ఆ కాలంవారు నిజాయితీగా, నిక్కచ్చిగా బ్రతగ్గలిగారు. ఇవ్వాళ అన్నింటినీ శాసిస్తుంది డబ్బే. 'కోటివిద్యలు డబ్బు కొరకే' అన్నది నేటిసామెత. డబ్బుకోసం అమ్ముడు పోనిదేదీలేదు. నేటి బాలలే రేపటి బ్రోకర్లు. భారంగా నిట్టూర్చాను.

నాన్న ఫోటో వైపు చూస్తూ.. 'సారీ నాన్న!' అనుకున్నాను!

నాన్న నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు!

(photo courtesy : Budugu)

Tuesday, 4 September 2012

'ఆవారా' నుండి ఒకపాట.. కొన్నికబుర్లు

నేను పుస్తకాల్ని సీరియస్‌గా చదువుతాను గానీ సినిమాల్ని మాత్రం కాజువల్‌గానే చూస్తాను. అయితే ఒక్కోసారి సినిమా కూడా నన్ను కట్టి పడేస్తుంది, ఆలోచింపజేస్తుంది. అందుకు 'ఆవారా' ఒక ఉదాహరణ.

'ఆవారా'ని సినిమా పెద్ద హిట్టవ్వడానికి అనేక కారణాలున్నయ్. సినిమా స్వాతంత్రం వచ్చాక దేశపరిస్థితుల్ని అద్దం పట్టింది. యువత వామపక్ష భావాలతో ఉవ్విళ్ళూరుతుంది. ధనిక, పేదల మధ్యన విపరీతమైన తేడా. పేదరికాన్ని, ముఖ్యంగా 'అలగా' జనాన్ని రొమేంటిసైజ్ చెయ్యడం యువతకి నచ్చింది. ఒక political statement కి  ప్రేమకథ పూసి subtle గా ప్రెజెంట్ చెయ్యడం ఈ సినిమా గొప్పదనం.

'ఆవారా'లో రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, నర్గీస్, కె.ఎన్.సింగ్ లు ప్రధాన పాత్రధారులు. నాకు మొదటిసారి ఈ సినిమా చూస్తున్నప్పుడు కొత్తగా అనిపించింది. కారణం lengthy close up shots. మరీ ముఖ్యంగా రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ లు confront అయ్యే సన్నివేశాల్లో (కేమెరా మొహం మీద పెడితే నటించడం కష్టం). సినిమాలో పలుచోట్ల నిశ్శబ్దం కూడా చాలా శక్తిమంతంగా మాట్లాడుతుంది! 

పృధ్వీరాజ్ కపూర్ జడ్జ్ రఘునాథ్ గా నటించాడు. జడ్జ్‌గారికి అలగాజనం పట్ల ఏహ్యభావం. వాళ్ళ బుద్ధులు నీచమైనవనీ, అవి ఎప్పటికీ మారవనీ ఆయనగారి నమ్మకం (ఇదొక మేధోరోగం). అందువల్ల ఆయనకి నర్గీస్ రాజ్ కపూర్‌తో స్నేహం చెయ్యడం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అదే సమయంలో బ్రిటిష్‌వాడి నుండి నేర్చుకున్న(తెచ్చిపెట్టుకున్న) హుందాతనం. మనసులో బురదగుంట ఆలోచనలు, బయటకి dignified restraint (ఈ 'పెద్దమనుషుల' గూర్చి తెలుసుకోవాలంటేఉప్పల లక్ష్మణరావు 'అతడు-ఆమె' చదవండి). 

అలగాజనం, క్లాస్ జనం మధ్యన స్పష్టమైన economical, social, biological గీత గీసిన ఉన్నతవర్గ ప్రతినిధిగా జడ్జ్   రఘునాథ్ ఒకవైపు. ఈ దేశంలో ఉన్న దరిద్రానికీ, దిక్కుమాలిన తనానికి, కసికి (తనెందుకంత మొరటుగా ఉంటాడో రీటాకి చెంపదెబ్బ కొట్టి మరీ చెబుతాడు రాజ్) ప్రతీకగా రాజ్ ఇంకోవైపు.


ఒక ఆవారా (రాజ్) ఇంకో ఆవారా (వీధి కుక్క) తో కబుర్లు చెప్పే సన్నివేశంతో రాజ్ మనస్తత్వం సింబాలిక్‌గా చెబుతాడు దర్శకుడు. "మనుషులు జంతువులు. వారికి - స్నేహం చేసేవారు, ప్రేమించేవారు చాలా అవసరం." అంటూ రాజ్ కుక్కతో కబుర్లు చెబుతాడు. హేట్సాఫ్ టు కె.ఎ.అబ్బాస్!

రాజ్ కపూర్ ఆవారా కేరక్టర్ చార్లీ చాప్లిన్ tramp కి అనుకరణగా ప్రస్తావిస్తుంటారు. రాజ్ కపూర్ tramp ని భౌతికంగా మాత్రమే తీసుకున్నాడనీ.. ఆవారా సైకోడైనమిక్స్ పూర్తిగా 'దేశీ' అని నా అభిప్రాయం. శ్రీ 420, జాగ్తే రహో, జిస్ దేశ్ మే గంగా బెహ్తి హై సినిమాలు విడివిడిగా చూడరాదు, కలిపే చూడాలి. అప్పుడే రాజు (tramp) మనకి అర్ధమౌతాడు. 

'ఆవారా'లో the best song "హం తుఝ్ సె మొహబ్బత్  కె  సనం.. " అని అనుకుంటున్నాను. ఈపాట ఎన్నిసార్లు విన్నా నాకు మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంత మంచి నటుడో ఈపాట చూస్తే తెలుస్తుంది. నాకీ పాట ఎందుకంత నచ్చింది? బహుశా నాలో అంతర్లీనంగా defeatism ఉందేమో! నా personality లో అపరిచితుడుగా దాగున్న ఈ pessimistic trait నాక్కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

రాజు ఒక దొంగ, పెద్దింటి అమ్మాయి రీటాని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమని పొందడానికి దొరలాగా ప్రవర్తిస్తాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇవ్వడం కోసం జడ్జ్ రఘునాథ్ దగ్గర్నుండే హారం కొట్టేస్తాడు. ఆ సంగతి పుట్టినరోజు వేడుకలో బయటపడుతుంది. అతను నిర్మించుకున్న ప్రేమసౌధం కూలిపోతుంది.


ఇష్టపడి, కష్టపడి ఆడిన ఆట ఓడిపోతే ఎలా ఉంటుంది? ఖేల్ ఖతం, దుకాణ్ బంద్. ఇంక మిగిలిందేమిటి? feelings of emptiness. sense of hopelessness. అటువంటి సందర్భాల్లో ఏడుపురాదు. హృదయం ఘనీభవిస్తుంది, గుండె గొంతుకలో కొట్టాడుతుంది. నైరాశ్యం, నిర్వేదం.

ఇదంతా రాయడం సులువు. నటించటం కష్టం. రాజ్ కపూర్ మాత్రం ఈ భావాలన్నింటినీ చక్కగా అభినయించాడు. తన బాధని చిన్ననవ్వుతో మిళితం చేశాడు. ఈ expression నాకు మరీమరీ నచ్చింది. ఈ resigned look కొత్తగా కూడా అనిపించింది. అన్నట్లు ఈ పాటలో రాజ్ కపూర్ చేతిలొ కత్తి కూడా నటించింది!

రాజ్ కపూర్ ఆస్థాన విద్వాంసులు శంకర్ - జైకిషన్, శైలేంద్ర, హస్రత్ జైపురి, ముఖేష్. బర్సాత్ నుండి ఈ టీమ్ కంటిన్యూ అయ్యింది. ముఖేష్ గొంతులో మెలొడీ పెసరట్టులో ఉప్మాలా మెత్తగా, హాయిగా ఉంటుంది. నటుడు రాజ్ కపూర్ కన్నా దర్శకుడు రాజ్ కపూర్ ఎన్నోరెట్లు ప్రతిభావంతుడంటారు. నిజమే కావచ్చు. YouTube లోంచి ఈపాట మీ కోసం. ఎంజాయ్ చెయ్యండి!

(published in fb 3/6/17)

Saturday, 1 September 2012

సినీ హీరోలు.. దర్శకులు.. ప్రేక్షకులు


మా శీనుగాడు ఎన్టీరామారావుకి వీరాశూరాభిమాని. రామారావు సినిమాలన్ని మొదటిరోజు మొదటిఆట చూడాల్సిందే. సినిమా చూస్తున్నంతసేపూ మావాణ్ని ఎన్టీరామారావు పూనేవాడు. రామారావు ఆవేశపడితే శీనుగాడు ఆవేశపడేవాడు. రామారావు ఏడిస్తే శీనుగాడిక్కూడా ఏడుపే! ఒక్కోసారి నాకు చూడ్డానికి తెరమీద బొమ్మకన్నా మావాడి మొహమే బాగుండేది. మా శీనుగాడిది George Bush పాలసీ! రామారావు అభిమానులు వాడికి ఆత్మీయులు. కానివారు పరమశత్రువులు! very simple!

నాకు కిష్టిగాడు ఇంకో స్నేహితుడు. నాగేశ్వర్రావు అభిమాని. నాగేశ్వర్రావుతో పాటూ మావాడు కూడా హీరొయిన్ని ప్రేమించేవాడు. హీరోయిన్ దూరమైన హీరోగారి విరహరోదనలో తానూ పాల్గొనేవాడు. అయితే వీడి అభిమానం శీనుగాడి అభిమానంలా మొరటుగా ఉండేదికాదు. 

ఆరోజుల్లో నాకు వీళ్ళద్దర్నీ చూస్తే ఎగతాళిగా ఉండేది. నవ్వొచ్చేది. ఇప్పుడు నా అభిప్రాయాలు చాలా మారిపొయ్యాయి. వెర్రి అభిమానంతో ఒక సినిమా నటుణ్ణి ఆరాధించేవారిపై ఒకప్పట్లా ఇప్పుడు నాలో తృణీకారభావం లేదు. పైగా అదొక అదృష్టం అనికూడా అనుకుంటున్నాను. 

ఇష్టం లేకుండా ఎవరూ ఏ పని చెయ్యరు. ఆకలితో ఉన్నవాడికి ఐశ్వర్యారాయ్ కన్నా అన్నం చాలా అవసరం. అట్లే.. కడుపు నిండినవాడికి ఐశ్వర్యారాయ్ తో చాలా అవసరం. ఎందుకో నా మెదడులో ఈ 'వీరాభిమాన నాడీవ్యవస్థ' సరీగ్గా develop అవ్వలేదు. చిన్నప్పట్నించి నా అభిమానం ఆ సినిమా వరకే పరిమితం.

నాకు రామారావు, నాగేశ్వర్రావులిద్దరూ ఇష్టం.. అయిష్టం కూడా! ముందు ఇష్టం ఎందుకో రాస్తాను. నాగేశ్వరరావు అత్యుత్తమ నటుడు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన 'దేవదాసు' నటన ఒక top class performance. 'రోజులు మారాయి'లో రైతుబిడ్డ వేణుగా చాలా సహజంగా పాత్రలో ఇమిడిపోయాడు. బాటసారి, విప్రనారాయణ, దొంగరాముడు, మూగమనసులు, పెళ్ళినాటి ప్రమాణాలు, మురళీ కృష్ణ.. ఇదొక endless list. 

ఇక నాకిష్టమైన ఎన్టీరామారావు సినిమాల list పలురకాలుగా ఉంటుంది. ముందుగా నా చిన్నప్పటి list. అగ్గి పిడుగు, బందిపోటు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, కదలడు వదలడు. బుద్ధి వికసించిన తరవాత వీటికొక additional list. జయసింహ, మల్లీశ్వరి, మిస్సమ్మ, రక్తసంబంధం, గుండమ్మకథ, దేవత, దాగుడు మూతలు.. ఇదో చాంతాడు. ఇక రామారావు వేసిన పౌరాణికవేషాలు సరేసరి.

రామారావు, నాగేశ్వర్రావులు మంచిసినిమాల్లో గొప్పపాత్రలు పోషించిన ఉత్తమనటులు. వీరి ప్రతిభకి హేట్సాఫ్! నాకు ఇంతకుమించి వారితో ఏ emotional attachments లేవు. అందుకే వీళ్ళిద్దర్నీ చిన్నప్పుడు అంతగా ఇష్టపడినా.. తర్వాత్తర్వాత వాళ్ళ సినిమాలు నచ్చక పట్టించుకోడం మానేశాను. పాపం! మా శీను, కిష్టిగాళ్ళకి ఆ సౌకర్యంలేదు. తమ అభిమాన నటులు వృద్ధులైనా.. చచ్చినట్లు వారి సినిమాలు చూసేవాళ్ళు.

గతమెంతో ఘనమైన నాగేశ్వ్రర్రావు, రామారావులు డెబ్భైలలో ఏమయ్యారు? ఇద్దరికీ stardom అనే కిరీటం తలకన్నా పెద్దదైపోయింది. ముసలిహీరోని కుర్రాడిగా చూపించడానికి టెక్నీషియన్లకి తలప్రాణం తోకకొచ్చేది. శరీరంలో మార్పు ప్రకృతి సహజం. దాన్ని దాచటానికి ఎవరు తిప్పలుపడ్డా ఎబ్బెట్టుగా ఉంటుంది. 

ఇద్దరూ మహానటులే! అప్పటికే డబ్బు బాగా సంపాదించేసారు. చక్కగా, graceful గా వయసుతగ్గ పాత్రలు వెయ్యొచ్చుగా! ఈ కుర్ర look పాట్లు ఎందుకు? నాకీ పాయింట్ అర్ధంగాక నా మిత్రద్వయాన్ని అడిగేవాణ్ణి. 

శీనుగాడు కోపగించుకునేవాడు. రామారావుని ageless wonder అనేవాడు. నాకు సినిమా చూట్టం చేతకాదని కూడా దబాయించేవాడు. కిష్టిగాడు బయటకి నాతో ఏకీభవించినట్లే ఉండేవాడు. కానీ silent గా నాగేశ్వర్రావు సినిమాలు చూసేసేవాడు. వాళ్లు వారి అభిమాన నటులకి కట్టుబానిసలు! 

ఒకేనటుడు ఒకసినిమాలో అద్భుతం. ఇంకోసినిమాలో వికారం. పాలు, నీళ్ళలా వేరుగా కనిపించేవారు. నాకిదేమి సమస్య? శీనుగాళ్ళా రామారావు వెడల్పు బెల్టుని, bell bottom ప్యాంటుని ఎందుకు ఇష్టపళ్ళేకపొయ్యాను? కిష్టిగాళ్ళా నాగేశ్వర్రావు బుట్టవిగ్గు, తగరపు్ కోటుల్ని ఎందుకు enjoy చెయ్యలేకపొయ్యాను?

సుబ్బుది different వాదన. రామారావు, నాగేశ్వ్రర్రావులకి నటన ఒక వృత్తి. డబ్బులిస్తే కుర్చీ, బల్లతో కూడా duet డ్యూయెట్ పాడగల సమర్ధులు. వారికి లేని గొప్పదనాన్ని, పవిత్రతని ఆపాదిస్తూ ఒక ఉన్నతస్థానంలో కూర్చోబెట్టి.. మన ఊహకి తగ్గట్లుగా ప్రవర్తించాలనుకోడం కరెక్ట్ కాదంటాడు. 

ధనమూలమిదం జగత్ అన్నారు పెద్దలు. దశాబ్దాలపాటు శ్రమించి ఒక స్థానాన్ని చేరుకున్నాక.. ఆ brand image ని సొమ్ము చేసుకోకుండా ఎలా ఉంటారు! ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చేస్తుందదేగదా! డబ్బులిచ్చి మరీ నటించమని బ్రతిమాలుతుంటే నటించాడానికేం? తీసేవాడికి, చూసేవాడికి లేని బాధ నాకేల!

నా దృష్టిలో నటులు కూరగాయల్లాంటివాళ్ళు. మంచి దర్శకుడు మంచి వంటగాడిలాంటివాడు. నాగేశ్వర్రావు, రామారావులు తాజాగా ఉన్నరోజుల్లో  బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్వీప్రసాద్, ఆదుర్తి వంటి ప్రతిభావంతులు వారితో అనేక వంటలు చేశారు. ప్రేక్షకుల జిహ్వచాపల్యాన్ని తీర్చారు. వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నారు. అది వారి అదృష్టం. ఈ గొప్పదర్శకులకే డెబ్భైల ముసలిహీరోల్ని ఇస్తే ఏం చేసేవారు?

అసలక్కడ చెయ్యడానికేముంది? అప్పటికే తెలుగు సినిమాల్లో కథ మాయమైపోయింది. హీరోగారి ఇమేజ్, అభిమానుల సరదాలకి తగ్గట్లు కథలు రాసుకోవటం మొదలైంది. పండిపోయిన, ముదిరిపోయిన కూరల్ని ఏ సాంబారులోనో వదిలినట్లు.. హిందీవాళ్ళు ముసలి హీరోలతో multi starrer అంటూ కలగూరగంప సినిమాలు తీసేవాళ్ళు. మనకా సౌలభ్యం లేదు. అందుకే బి.ఎన్.రెడ్డి శోభన్ బాబుతో సైలెంటుగా 'బంగారు పంజరం'
తీసుకున్నాడు.

ఇప్పుడు మీకో అనుమానం రావొచ్చు. తాజా కూరగాయల్తో వంట చెయ్యడం, మెప్పించడం ఎవరివల్లనైనా అవుతుందని. ఎంతమాత్రమూ కాదు. ముదిరిపోయిన కాయగూరల్తో నలభీములైనా చెయ్యగలిగేదేమీ ఉండదు. అట్లే.. వంట రానివాడికి ఎంత తాజా కూరగాయలిచ్చినా వంట చెడగోట్టేస్తాడు. 

దేవదాసు సినిమాని కె.రాఘవేంద్రరావు ఎలా తీస్తాడు? పట్నం నుండి వచ్చిన దేవదాసుని చూడంగాన్లే సిగ్గుతో పార్వతి పైట జారిపోతుంది. ఇంతలో వర్షం పాట. యాపిల్ పళ్ళ మధ్య చంద్రముఖి. ఆమె బొడ్డుపై బొంగరం. ఈ పార్వతి, చంద్రముఖిల నాభి జఘన ప్రదర్శనా పోటీని అత్యంత రసవత్తరంగా తీస్తాడు. సినిమా super hit కూడా కావచ్చు!

బాపు, రమణలు మిస్సమ్మ తీస్తే ఎలాగుంటుంది? సినిమా అంతా background బాపు గీసిన రామాయణం బొమ్మలు (మిస్ మేరీ ఇంట్లో గోడ మీద సహా)! పొద్దస్తమానం మిస్సమ్మ చెంపలు, కళ్ళ క్లొజప్పులు. సహజత్వం పేరిట చీకట్లో సినిమా. మిస్సమ్మ, ఎం.పి.రావుల మధ్య గోరింటాకు, గజ్జెలు.. అంటూ ఏవో పైత్యవికార చేష్టలతో పాటలు. మధ్యలో కొన్ని రామాయణం పిట్టకథలు. ఎల్వీప్రసాద్ బావురుమనేవాడు!

కె.విశ్వనాథ్ 'రోజులు మారాయి' ఎలా తీసేవాడు? దళితురాలైన హీరోయిన్ క్లాసికల్ డ్యాన్సులు చేస్తుంటుంది. రైతుబిడ్డయిన మన హీరోగారు సంగీత విద్వాంసుడు. అంచేత హీరోయిన్ నృత్యాలకి గొంతు కలుపుతాడు. హీరోయిన్ని చేరదీద్దామని విలన్ సిఎస్సార్ ప్రయత్నిస్తుంటాడు. ఆయన కూడా సంగీత ప్రియుడే! సినిమాలో భూమి సమస్య కాస్తా సంగీతనృత్య సమస్య అయిపోతుంది. దటీజ్ కళాతపస్వి!

మాయాబజార్ దాసరి తీశాట్ట. నేను చూళ్ళేదు. కానీ ఊహించుకోగలను. దాసరి పాత్రలు పేజీల కొద్దీ మాట్లాడుతుంటాయి. దాసరి సినిమా సంభాషణలు తూకం వేస్తే మన గాలి జనార్ధనరెడ్డి అక్రమంగా తవ్వుకుపోయిన ఇనుప ఖనిజం కన్నా ఎక్కువ బరువుంటాయని మా సుబ్బు చెబుతుంటాడు.

ఇప్పుడు దాసరి మాయాబజార్ లో ఒక సీన్ ఊహించుకుందాం. శశిని తన కోడలుగా చేసుకుందామనుకున్న సుభద్ర ఆశలపై బలదేవుడు నీళ్ళు చల్లుతాడు. కౌరవులతో వియ్యానికి plan చేస్తాడు. అప్పుడు సుభద్ర ఏమంటుంది? 

"అన్నయ్యా! నువ్వు చేస్తున్నది అన్యాయం. ఇదేనా నువ్వు తోబుట్టువుకి ఇచ్చే మర్యాద?" కట్! కె.వి.రెడ్డి సుభద్ర ఇక్కడితో ఆపేస్తుంది.

కానీ దాసరి సుభద్రకి ఇంకా డైలాగులున్నాయి. "ఆడదానికి భర్త ప్రత్యక్ష దైవం. పుట్టిల్లు చల్లని గూడు. ఆ ఇంటికి అన్నలు మొండిగోడలు. ఇప్పుడా గోడలే నా కొడుకి పెళ్ళికి మొండిగా, అడ్డు గోడలుగా నిలుస్తుంటే.. ఇక నాకు దిక్కెవ్వరు? ఈ కొంపకి ఆడపడుచుని. అత్తింటివారు పుట్టింటివారైనా.. పుట్టింటివారు అత్తింటివారైనా.. ఇచ్చిన మాట తప్పి అన్యాయం చేస్తూ.. " డైలాగులు ఇంకో నాలుగు పేజీలున్నై. సమయభావం వల్ల రాయలేకపోతున్నా! క్షమించగలరు.

నాకు గుత్తొంకాయ కూర చాలా ఇష్టం. అంతమాత్రాన గుత్తొంకాయలు ఎలాఉన్నా, కూర ఎలా వండినా తినను. వంకాయలు బాగోకపోయినా, రుచి కుదరకపోయినా పక్కన పెట్టేస్తాను.

చివరి తోక..

నే ప్రస్తావించిన దర్శకుల అభిమానులకి 'మనోభావాలు' దెబ్బతింటే.. వారికి నా క్షమాపణలు. మన ప్రముఖ దర్శకుల vision దశాబ్దాలుగా ఒకేవిధంగా ఉందనేదే నా point!

మన ఆలోచనలు, భావాలు (నాతోసహా) సాధారణంగా ఒక మూసలో ఉంటాయి. పెద్దగా variety ఉండదు. కమ్యూనిస్టు కాకరకాయ పులుసులో కూడా గొప్పకమ్యూనిజాన్ని కనగలడు. మతోన్మాది మజ్జిగన్నంలో కూడా మతాన్ని వెతుక్కుంటాడు. ఎవడిగోల వాడిది. అలాగే మన తెలుగు సినిమా దర్శకులు కూడా ప్రతికథలోనూ తమ మూస ఆలోచనలు జొప్పించి.. ఆ సినిమాని తమదైన శైలిలో రక్తి కట్టించారు. వారికి నా అభినందనలు!

(photo courtesy: Google)