Thursday 25 October 2012

కల చెదిరింది.. కధ మారింది.. కన్నీరే ఇక మిగిలింది!


ఉదయం  పదకొండు గంటలు. కన్సల్టేషన్  చాంబర్లో  నా  ఎదురుగా  ఓ  అందమైన  యువతి. సుమారు  ముప్పైయ్యేళ్ళు  ఉండొచ్చు. వడ్డాది పాపయ్య  బొమ్మలా  ఒద్దికగా, పొందికగా ఉంది. పాలరాతి శిల్పం, దొండపండు పెదాలు  అంటూ  అనాదిగా  ఆడవారి  అందాన్ని  పొగిడే  పడికట్టు  పదాలు  రాసే  ఓపిక  నాకు లేదు. బ్రీఫ్ గా  చెప్పాలంటే.. కాంచనమాల, మధుబాల, వైజయంతిమాలాల్ని  కలిపి  గ్రైండర్ లో  పడేసి.. రుబ్బి  అచ్చుపోస్తే.. అచ్చు ఆ  యువతి  రూపం  వస్తుంది!
                               
అట్టి  నారీమణికి  ఘోరమైన  ప్రేమ సమస్య. పాపం! ఆఫీసులో  తన  సహచరుడంటే  ఆమెకి  వెర్రి ప్రేమ. అందుకే  భార్యని  వదిలెయ్యమని  అతన్ని  ఒత్తిడి  చేస్తుంది. ఆ  సుందరీమణి  సమస్య  పట్ల  అవసరానికి  మించిన  ఆసక్తి  చూపుతూ, తీవ్రంగా  వింటూ  (అంతకన్నా  తీవ్రంగా  దొంగ చూపులు  చూస్తూ)  ఫ్రాయిడ్ వలే  (లేని) గడ్డాన్ని  నిమురుకుంటూ, అప్పుడప్పుడు  ప్రశ్నలడుగుతూ  కేస్  నోట్  చేసుకుంటున్నాను.

"ఎందుకు? ఎందుకు రవి? నన్నింతలా  వేధిస్తున్నావు? నీ  భార్యని  వదిలేసి  నాతో  లేచి రావటానికి  నీకున్న  ఇబ్బందేంటీ? నాతో  పెట్టుకోకు. నా  సంగతి  నీకింకా  తెలీదు. నీ  పేరు  మీద  ఉత్తరం  రాసి  మరీ  ఛస్తా! నిన్ను చచ్చి సాధిస్తా! నాకు  దక్కని  నిన్ను  ఎవరికీ  దక్కనివ్వను." అంటూ  ఆవేశంతో  నెత్తి  కొట్టుకుంటూ, దుఃఖంతో  భోరున  విలపించసాగింది.

ఆ  ముద్దుగుమ్మ  ఏడుస్తుంటే  నాక్కూడా  ఏడుపొచ్చింది!

'భగవంతుడా! ఎందుకయ్యా  ఈ  అపరంజి బొమ్మకి  ఇంత  కష్టం  సృష్టించావ్! ఆ  కష్టమేదో  పనీపాట  లేకుండా  ఖాళీగా  ఉన్న మా  సుబ్బు గాడికి  కల్పించొచ్చుగా! నో. ఈ  సౌందర్యవతికి  ఏ  కష్టమూ  రాకూడదు. రానివ్వను. వచ్చినా.. రక్షించడానికి  నేనున్నాగా. డార్లింగ్! వలదు వలదు. భయం వలదు. నేనున్నా. నేనున్నాగా  మై డియర్! వై  ఫియర్? ఆ  రవిగాడి  పెళ్ళాన్ని  లేపయ్యమంటావా? అసలా రవిగాణ్ణే  లేపేసి  నాకడ్డు  తొలగించుకుంటే  ఎలా  ఉంటుంది?'
                     
దాదాపు  అరగంటసేపు  ఆ కుందనపు బొమ్మకి  అత్యంత  శ్రద్ధాసక్తులతో  ధైర్యం  చెప్పా. 'అగాధమౌ  జలనిధిలోనా  ఆణిముత్యమున్నటులే.. శోకాల  మరుగున  దాగి  సుఖమున్నదిలే' అంటూ  వెలుగు నీడల్లో  శ్రీశ్రీ  రాసిన  పాటని  నా  మాటగా  మార్చుకుని  ధైర్యం  చెప్పా!

ఆవిడకి  ఎంత  ధైర్యం  వచ్చిందో  తెలీదు గానీ.. నా  మనసు  మాత్రం  తేలికయ్యింది. లోలోపల  నాకు  నేనే  ఒక  ఆమీర్ ఖాన్, మహేష్ బాబులా  ఫీలై పోవడం  మొదలయ్యింది. 'ముత్యాలజల్లు  కురిసె.. రతనాల  మెరుపు  మెరిసె.. వయసూ, మనసూ  పరుగులు  తీసె  అమ్మమ్మా!' అంటూ  మనసంతా  తలపుల  వర్షంతో  తడిసి  ముద్దైపోయింది!
                           
నా  డ్రీమ్ గాళ్  కుర్చీలోంచి  లేచి  నిలబడింది. సందేహిస్తున్నట్లు  నావైపు  చూసింది. (యండమూరి వీరేంద్రనాధ్ తన  నవలల్లో  వెయ్యి చోట్ల  రాసినట్లు) క్షణంలో  వెయ్యోవంతు సేపు  నా  దవడ కండరం  బిగుసుకుంది. ఏం  జరగబోతుంది? క్యా హోతా హై? వాట్  హేపెన్స్?

'పూవులాంటి  తన  మెత్తటి చేత్తో  షేక్ హ్యాండ్  ఇస్తుందా? ఆనందంతో  గట్టిగా  కౌగిలించుకుని  నాలాంటి  డాక్టరు  ఎందెందు వెదకినా  కానరాడు  అని  ఎమోషనల్  అయిపోతుందేమో! ఇవన్నీ  కావెహె. ఏకంగా  ముద్దు  పెట్టుకుని.. కమాన్  డార్లింగ్  లేచిపోదాం  అంటుంది. నో! నెవర్. నా  భార్యకి  అన్యాయం  చెయ్యలేను. చెయ్యను. ప్లీజ్! సమ్బడీ  హెల్ప్ మీ. హే భగవాన్! ఏమిటి  నాకీ  అగ్ని పరీక్ష! ఒక  నాస్తికుడిని  ఇంత  తీవ్రంగా  పరీక్షించుట  నీకు  న్యాయమా?'
                             
కుర్చీలోంచి  లేచిన  ఆ  యువతి  రెండు చేతులు  జోడించింది.

"నమస్కారం  బాబాయ్ గారు! మీరు  నాకు  కొండంత  ధైర్యం  ఇచ్చారు. మీ  మేలు  మర్చిపోలేను. మీరేమనుకోకపోతే  చిన్న మాట. మీరు  అచ్చు  మా  బాబాయిలా  వున్నారు. ఆయన  కూడా  మీకు మల్లే   పొట్టిగా, బట్టతలతో  ఉంటాడు. తెలివైనవాడే  కానీ  కొంచెం  తిక్కమనిషి. నాకు  చాలా  ధైర్యం  చెప్పేవాడు. తను మాత్రం  పిన్ని  పెట్టే  కష్టాలు  తట్టుకోలేక  ధైర్యం  కోల్పోయి.. ఇల్లొదిలి  పారిపోయ్యాడు. అందుకే  మిమ్మల్ని  బాబాయ్  అని  పిలవాలనిపించింది. నమస్తే!" అంటూ  డోర్  తెరచుకుని  నిష్క్రమించింది .        

అరిగిపోయిన  తెలుగు  భాషోపమానలతో  నా  దుస్థితిని  వర్ణిస్తూ.. మొహం మీద  ఈడ్చి తన్నినట్లు.. నెత్తి మీద  పిడుగు  పడినట్లు.. భూమి కంపించినట్లు.. గుండెల్లో  గునపాలు  దించినట్లు.. అంటూ  చాలా  రాయొచ్చు. కానీ  ప్రస్తుతం  నేను  దుఃఖించ వలసియుంది. అంచేత  ఇంతకన్నా  రాయలేను. పోస్ట్  రాస్తూ.. అర్ధాంతరంగా  ముగిస్తున్నందుకు  క్షమించండి (నేను  తీరిగ్గా  ఏడ్చుకోవాలి)!

చివరి తోక : ఈ  కథ  పూర్తిగా  కల్పితం!

(సైకాలజీ  పట్ల  ఆసక్తి  చూపే  నా  స్నేహితుడు  మొన్నామధ్య  కలిసినపుడు  'సైకోథెరపీలో  countertransference  అంటే  ఏమిటి?' అనడిగాడు. అతనికి  సమాధానంగా  కొన్ని  ఉదాహరణలు  చెబుతున్నప్పుడు  ఈ  కథ  ఐడియా  పుట్టింది.)

(picture courtesy : Google)      

Sunday 21 October 2012

కెమెరామెన్ గంగతో రాంబాబు.. ఎంత దారుణం!


"శీను! ఎంతకాడికి అట్టా పడుకునుంటే ఎట్టా గడుసుద్దిరా? ఇంట్లో తాగడానికి మంచిళ్ళు లెవ్వు. అట్టా బాయి కాడికెళ్ళి నాలుగు బుంగలు నీళ్ళు మోసుకురా!" గద్దింపు.

".................................."

"మూడుపూట్లా టయానికి తిని తొంగుంటావు. నీ సెల్లెలు కాడికెళ్ళి బావకి కొద్దిగా బయ్యం సెప్పయ్యా! ఆ యెదవ తాగొచ్చి బిడ్డతల్లని కూడా సూడకుండా మీ సెల్లెల్ని రోజూ తంతన్నాడు." పురమాయింపు.

"..................................."

"రేత్రి నించి మీ నాయన ఉలుకూ పలుకూ లేకండా ఆ ఇదాన మంచాన పడున్నాడు. అసలే షుగరు పేషంటు. నీకు దణ్ణం పెడతా! ముసలయ్యని ఆచారి డాట్టరు కాడికి తీసుకెళ్ళు. నాకు బయమేస్తంది శీనా!" ఏడుపు.

"..................................."

"కూడొండుదామంటే బియ్యం లెవ్వు. ఆడదాన్ని, రోజూ వొక్కదాన్నే కూలీ కెళ్లలేకపోతన్నానయ్యా! ఇయ్యళ నా కాళ్ళు పట్టేసినయ్యి. బాబ్బాబు! ఈ ఒక్క రోజన్నా పన్లోకెళ్లరా!" వేడికోలు.

"...................................."

ఇంతలో బయట్నుండి గావుకేక!

"రేయ్ శీనాయ్! దారుణం జరిగిపోతాంది. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' పోస్టర్లని అళ్ళెవళ్ళో తగలబెడతన్నారంటా! మన పవర్ స్టార్ కి అవమానం జరిగిపోతాంది! అర్జెంటుగా రారా! మన మెగాఫ్యాన్స్ దెబ్బేందే ఇయ్యాళ నా కొడుకులుకి సూపించాలా!"

అప్పటిదాకా దుప్పటి ముసుగేసుకుని తడికె వైపు తిరిగి బద్దకంగా పడుకునున్న శాల్తీ శరవేగంతో బయటకి దూసుకెళ్ళింది!

(picture courtesy : Google)

Saturday 6 October 2012

రంగమ్మ కథ


"ఒసే దరిద్రపుగొట్టు మొహమా! వయ్యారంగా ఎంతసేపు వూడిచ్చస్తావే? స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టవే ముండా!" రంగమ్మ గొంతు గాండ్రించింది.

"ఆ! వస్తన్నా, వస్తన్నా. అయిపోవచ్చింది." చిన్నగా, సన్నగా సమాధానం.

"గంట నించీ అదే మాట చెప్పి చస్తన్నావు గదే శనిద్రప్ముండా!" మళ్ళీ గాండ్రింపు.

రాంబాబుకి చిర్రెత్తింది. చదువుతున్న పుస్తకం విసిరికొట్టి, రెండు చెవులు మూసుక్కూర్చున్నాడు. రాంబాబు అవస్థకి అతని భార్య ఇందిరకి నవ్వొచ్చింది. ఆమెకిదంతా అలవాటైపోయింది.

రాంబాబు బ్యాంక్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు. ఆర్నెల్ల క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకొచ్చాడు. మేడపైన రెండు బెడ్రూముల పోర్షన్. పిల్లల స్కూలుకి బాగా దగ్గర. ఇల్లు కూడా సౌకర్యంగా ఉంది.

ఇల్లు క్రింద భాగం ఇంటి ఓనర్లు ఉంటారు. భార్యా, భర్త. ఆయనకి డెబ్భైయ్యేళ్ళు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య రంగమ్మ. లావుగా, పొట్టిగా, గుండ్రంగా ఉంటుంది. వారి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.

రాంబాబుకి ఆ ఇల్లు నచ్చింది. పెరట్లో పెద్ద మామిడి చెట్టు. ఇంటి చుట్టూతా పిల్లలకి ఆడుకోడానికి కావలసినంత స్థలం. రాంబాబుకి పుస్తకాలు చదివే అలవాటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తాడు.

ఒక ఆదివారం కింద కేకలు, అరుపులు వినిపించాయి. రాంబాబు కంగారుపడ్డాడు. ఇల్లుగలావిడ పనిమనిషిని అరుస్తుందని ఇందిర చెప్పింది.

"ఈ రోజుల్లో పనిమనుషుల్ని ఇంత భయంకరంగా కోప్పడితే ఊరుకుంటారా?" ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

"ఆ అమ్మాయి పనిమనిషి కాదుట. రంగమ్మగారికి పొలం చాలా ఉందిట. వాళ్ళ పాలేరు కూతురు కుమారిని పనికి సాయంగా, తోడు కోసం తెచ్చుకున్నార్ట. ఆ అమ్మాయి అన్ని పనులూ చేస్తుంది. రంగమ్మగారికి కొద్దిగా కోపం." అంది ఇందిర.

"కొద్దిగానా? చాలానే ఉంది!" అంటూ నవ్వాడు రాంబాబు.

కుమారి చీపురుపుల్లలా ఉంటుంది. ఇంటిపనులు చురుకుగా, చకచకా చేసేస్తుంది. తెల్లారక ముందే కసువు చిమ్మేస్తుంది. ముగ్గులు పెడుతుంది. స్నానానికి వేణ్ణీళ్ళ కోసం బాయిలర్ వెలిగిస్తుంది. అంట్లు తోముతుంది. వంట చేస్తుంది. బట్టలుతుకుతుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళకి తినడం, పడుకోవడం తప్ప పనేమీ లేకుండా మరమనిషిలా అన్ని పన్లూ తానే చేసేస్తుంది.

రాంబాబు అప్పుడప్పుడూ బ్యాంక్ నుండి మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడు. ఆ సమయంలో కూడా కుమారి కిటికీలు, గ్రిల్స్ శుభ్రం చేస్తూ కనపడేది. రాంబాబు ఆ అమ్మాయి కనీసం కూర్చునుండగా ఎప్పుడూ చూళ్ళేదు. ఆ అమ్మాయిని చూస్తూ జాలి పడుతూ తన వాటా మెట్లెక్కే వాడు.

రాన్రాను రాంబాబుకి దిగులుగా అనిపించసాగింది. అతనికి రంగమ్మ ఒక రాక్షసిగానూ, కుమారి ఆ రాక్షసి చేపట్టిన రామచిలకలా అనిపించసాగింది. ఏం చెయ్యాలో తోచక - మన సంఘంలో పనిమనిషి పేరున జరుగుతున్న మానవహక్కుల అణచివేత గూర్చి ఇందిరకి ఉపన్యాసం చెప్పడం మొదలెట్టాడు. ఇందిర వింటూనే విసుక్కునేది.

ఒకసారి ఇంటిగలాయనకి జ్వరం వచ్చిందని తెలిసి పలకరించడానికి వెళ్ళాడు. ఆయనసలే బక్కప్రాణి. దీనికితోడు నాలుగైదు లంఖణాలు చేసినట్లున్నాడు.. బల్లిలా మంచానికి అతుక్కుపోయున్నాడు. రాంబాబుని చూసి నీరసంగా నవ్వాడు.

మంచానికి తల దగ్గరున్న చెక్క కుర్చీలో కూర్చునుంది రంగమ్మ. పెద్ద గాజు గ్లాసు నిండా బత్తాయి రసం. చప్పరిస్తూ నిదానంగా తాగుతుంది. ఆ పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు రాంబాబు.

"ఇప్పుడెలా ఉందండి? నీరసంగా ఉందా? మాత్రలు వేసుకుంటున్నారా?" అంటూ అరిగిపోయిన ప్రశ్నలతో ఇంటి ఓనరు కుశలాన్ని తెలుసుకుంటున్నాడు రాంబాబు.

ఇంతలో ఫెడీల్మని పిడుగుపాటు.

"ఒసే దున్నపోతు ముండా! జ్యూసు తాగి గంటయ్యిందే. ఈ గ్లాసెక్కడ పెట్టాలే దేబ్యం మొహమా!" రంగమ్మ అరుపు.

రాంబాబు ఎగ్గిరిపడ్డాడు. కుమారి సైలెంట్‌గా వచ్చి ఖాళీ గ్లాసు తీసుకెళ్ళింది. కొద్దిసేపు నిశ్శబ్దం. రాంబాబు రంగమ్మని అంత దగ్గర్నుండి ఎప్పుడూ చూళ్ళేదు. అతనికి ఇబ్బందిగా ఉంది. రంగమ్మ రాంబాబుని పరీక్షగా చూసింది. కొంతసేపటికి తన కష్టాలు రాంబాబుతో చెప్పకోవడం మొదలెట్టింది.

"అందరికీ నా గొంతు వినిపిస్తుంటుంది. కానీ నేనీ దొంగముండతో ఎంత కష్టాలు పడుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ఒక్కపనీ సక్రమంగా చేసి చావదు. నాతో ఊరికే అరిపిస్తుంటుంది. నువ్వు చెప్పు బాబు! ఈ ముండని అరవటం నాకేమన్నా సరదానా? పని తెలీని సోంబేరి మొహాన్ని తీసుకొచ్చి నా మొహాన కొట్టాడు." అంటూ మొగుణ్ణి కొరకొర చూసింది రంగమ్మ.

రాంబాబుకి ఆవిడ ధోరణికి భయమేసింది. ఏదో గొణిగి పరుగుపరుగున ఇంట్లోకొచ్చి పడ్డాడు.

ఇల్లు సౌకర్యంగా ఉంది. కానీ రంగమ్మ దెబ్బకి రాంబాబు డీలా పడిపొయ్యాడు. తనకేమాత్రం సంబంధం లేని విషయంలో భర్త అంతలా ఇబ్బంది పడిపోతుండటం ఇందిరకి ఆశ్చర్యంగా అనిపించేది, జాలిగా కూడా అనిపించేది. అందుకే అతన్ని ఓదార్చడానికి అప్పుడప్పుడూ ఏవో నాలుగు మంచి మాటలు చెప్పేది.

"ఆ అమ్మాయీ ఏంతక్కువైందేమీ కాదు. ముంగిలా ఉండి సాధిస్తుంటుంది." అని ఒకసారీ -

"రంగమ్మగారు ఊరికే అలా అరుస్తుంది గానీ - ఆవిడది చాలా మంచి హృదయం. మొన్న మన బాచీగాడు ఆడుకుంటుంటే పిలిచి మరీ అరిశలు పెట్టారు." అని ఇంకోసారీ చెబుతుంటుంది.

కానీ రాంబాబు ఇందిర మాటలు నమ్మలేదు. ఆ కబుర్లన్నీ తన ఇబ్బంది తగ్గించడానికి ఇందిర చేస్తున్న బేలన్సింగ్ యాక్ట్‌గా అర్ధం చేసుకున్నాడు. క్రమేపి రాంబాబు మధ్యాహ్నం పూట ఇంటికి రావడం తగ్గించాడు. బ్యాంకులో ఏదో పనుందని ఇందిరకి చెప్పడం మొదలెట్టాడు. ఈ విషయంలో రాంబాబుకీ, ఇందిరకీ గొడవలు కూడా మొదలయ్యాయి.

ఆ రోజు ఆదివారం. కింద ఇంటికి ఉదయం నుండీ వచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు. కొంతసేపటికి ఆటోలో కొందరు రైతు కూలీలు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఆదివారం కావున అప్పటికి ఫిల్టర్ కాఫీ మూడోసారి తాగి, హిందూ పేపర్ చదువుతూ, అంతర్జాతీయ రాజకీయల పట్ల రాంబాబు తీవ్రంగా కలత చెందుచూ మధనపడుచుండగా - ఇందిర హడావుడిగా వచ్చింది.

"రాంబాబు! కుమారి ఆ ఎదురు ఇస్త్రీ పెట్టె బండివాడితో లేచిపోయింది. రంగమ్మగారి బంగారు గొలుసు, ఇరవై వేల రూపాయలు క్యాష్ కూడా కనబడట్లేదుట! ఇన్నాళ్ళూ నంగిలా, ముంగిలా కనబడుతూ భలే నమ్మించింది. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్ధమయి చావట్లేదమ్మా!" అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబుకి ఇందిర చెప్పేది అర్ధం కావటానికి రెండు క్షణాలు పట్టింది. క్రమంగా మనసంతా ఆనందంతో నిండిపోయింది. తనకి బ్యాంక్ ఉద్యోగం వచ్చినప్పుడు కూడా రాంబాబుకి అంత ఆనందం కలగలేదు.

హడావుడిగా లుంగీ నుండి ప్యాంటు, షర్టులోకి మారిపోయి కింద పోర్షన్లోకి వెళ్ళాడు. అక్కడంతా కోలాహలంగా ఉంది. గుమ్మానికివతల దిగాలుగా, తప్పు  చేసినవాళ్ళలా ఒక నడివయసు జంట నేల మీద కూర్చునుంది. బహుశా కుమారి తలిదండ్రులయ్యుంటారు.

రంగమ్మ హాలు మధ్యలో పడక్కుర్చీలో పడుకుని శోకాలు పెడుతుంది. చుట్టూతా చేరిన ఆడంగులు ఆవిడని ఓదారుస్తున్నారు.

"కన్నకూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా. ఏనాడూ ఏదీ తక్కువ చెయ్యలేదమ్మా. రోజుకి నాలుగుసార్లు నాలుగు కంచాలు తినేదమ్మా. చివరకి నా కొంపకే ఎసరు పెట్టిందమ్మా. జెర్రిపోతులాంటి గొలుసమ్మా! నా పుట్టింటి బంగారమమ్మా!" అంటూ చప్పట్లు కొడుతూ నుదురు కొట్టుకుంటూ రంగమ్మ ఏడుస్తుంది.

"పిన్నిగారు! కొంచెం ఎంగిలి పడండి. పొద్దున్నుండి పచ్చిమంచినీళ్ళయినా ముట్టలేదు. అసలే మీరు బీపీ పేషంటు." అంటూ ఎదురింటి శాస్త్రి భార్య రంగమ్మని బ్రతిమాలుతుంది.

అక్కడి వాతావరణం ఎవరో మనిషి చచ్చినట్లుంది. ఇంటి ఓనర్ పెరట్లో మామిడి చెట్టు కింద కుర్చీలో కూర్చునున్నాడు. ఆయన పక్కన కుర్చీ ఖాళాగా ఉంది. రాంబాబు ఆ కుర్చీలో కూలబడ్డాడు.

ఆయన ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయున్నాడు. కొద్దిసేపటికి గొణుగుతున్నట్లుగా అన్నాడు.

"పొద్దస్తమానం కాల్చుకు తింటుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు?"

రాంబాబు ఆశ్చర్యపోయాడు. నమ్మలేనట్లు ఆయన వైపు చూశాడు.

ఆయన నెమ్మదిగా నవ్వాడు. "నాకు తెలుసు మీరు ఇబ్బంది పడుతున్నారని. కానీ నే చెయ్యగలిగింది ఏముంది చెప్పండి? నే కలగజేసుకుంటే ఇంకా రెచ్చిపోతుంది. ఈ దొంగతనం వల్ల డబ్బు పరంగా నాకే నష్టమూ లేదు. ఆ అమ్మాయికి పెళ్ళి బాధ్యత నాదేనని మా పాలేరుకి మాటిచ్చి పన్లో పెట్టుకున్నాను. ఇప్పుడా బాధ్యత తప్పింది. మళ్ళీ ఇంకో మనిషి కోసం వేట మొదలెట్టాలి. మీకు కొన్నాళ్ళు రిలీఫ్." అన్నాడు.

రాంబాబు అక్కడ ఇంకొద్దిసేపు కూర్చుని, ఆయనతో యాంత్రికంగా నాలుగు సానుభూతి వచనాలు పలికి, ఇంటి దారి  పట్టాడు. హాల్లో రంగమ్మ శోకాలు నాన్ స్టాప్‌గా పెడుతూనే ఉంది. ఇప్పుడు ఇందిర కూడా అవిడని ఓదార్చే పటాలంలో చేరింది.

నిదానంగా, హుందాగా మేడ మెట్లెక్కాడు రాంబాబు, ఇంట్లోకి అడుగు పెట్టాడు, తలుపు దగ్గరకేశాడు. ఒక క్షణం ఆగాడు.

"యాహూ! జజ్జనకర జనారే! జనకజనా జనారే! జజ్జనకర జజ్జనకర.. " పెద్దగా అరుస్తూ, ఆనందంతో వికటాట్ఠాసం చేస్తూ - కోయ నృత్యం చెయ్యసాగాడు రాంబాబు. కొద్దిసేపటికి ఆయాసం వచ్చింది. రొప్పుతూ ఫ్రిడ్జ్ లోంచి ఐస్ వాటర్ బాటిల్ ఎత్తి గటగటా తాగేశాడు.

సోఫాలో కూర్చున్నాడు. ఆనందం తన్నుకొస్తుంది. మళ్ళీ పాటందుకున్నాడు.

"భలే మంచి రోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటి రోజు.. "

"ఏదో అనుకున్నాను. నువ్వు పాటలు బాగానే పాడతావే!" అంటూ నవ్వుతూ వచ్చింది ఇందిర.

"ఓ మై డియర్ ఇందూ డార్లింగ్! ఐ లవ్ యూ! సాయంకాలం సినిమా కెళుతున్నాం. బీ రెడీ!" హుషారుగా అన్నాడు రాంబాబు.

ఇందిరా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. ఆమెకి తెలుసు - రాంబాబు ఎందుకంత సంతోషంగా ఉన్నాడో!

(picture courtesy : Google)

Wednesday 3 October 2012

అంతా.. ఈ జగమంతా.. రాజకీయమయం!


"రా సుబ్బూ! భలే సమయానికొచ్చావు. రాజకీయ కారణాలతో రాష్ట్రం విడిపోదట. మన ముఖ్యమంత్రిగారు చెప్పారు. ఇప్పుడే చదువుతున్నాను." అప్పుడే లోపలకొస్తున్న సుబ్బుని చూస్తూ అన్నాను.

సుబ్బు ఎదురుగానున్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.

"మరి ఏ కారణాల వల్ల విడిపోతుందిట?"

"ఆ సంగతి చెప్పలేదు." అన్నాను.

"ఐతే ఇప్పుడు మనం ముఖ్యమంత్రిని చాలా ప్రశ్నలడగాలి. రాజకీయ కారణాలు లేకుండా ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక సంఘటన, ఒక పరిణామం చోటు చేసుకుందా? రెండు ప్రపంచ యుద్ధాలు, మన దేశస్వాతంత్ర్యం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ, ఇందిరా రాజీవ్ గాంధీల హత్య.. అన్నీ రాజకీయాలే కదా! అసలు ఈ సృష్టిలో రాజకీయం కానిదేదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"ఉంది. నా  సైకియాట్రీ  ప్రాక్టీస్!" నవ్వుతూ అన్నాను.

"నీ ప్రాక్టీస్ కూడా రాజకీయమే బ్రదర్. నీవంటి దిగువ మధ్యతరగతివాడు చదువు ద్వారా డాక్టర్ అయ్యే రాజకీయ వాతావరణం మనదేశంలో ఉంది. కొన్నిదేశాల్లో ఈ అవకాశం లేదు. కాబట్టి ఆదేశాల్లో నువ్వు ఇంకేదో చేస్తుండేవాడివి."

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది.

"రవణ మావా! చాలామంది చదువుకున్నవాళ్ళు కూడా రాజకీయాలంటే చంద్రబాబు, కెసియార్ల రోజువారీ తిట్టుడు కార్యక్రమాలు, ఎన్నికలు మాత్రమేనని అనుకుంటారు. కానీ కాదు. రాజకీయ ఆలోచన అనేది ఒక నిరంతర ప్రక్రియ. మంచి రాజకీయాల వల్ల ప్రజాజీవితం బాగుపడుతుంది. చెడ్డ రాజకీయాల వల్ల భ్రష్టు పడుతుంది. ఏది మంచి రాజకీయం అనేదాన్లోనే రకరకాల అభిప్రాయాలున్నాయి." అన్నాడు సుబ్బు.

"అంటే చంద్రబాబుకీ, జగన్ బాబుకీ కల అభిప్రాయబేధాలా?" అడిగాను.

"కాదు. నా దృష్టిలో వాళ్ళిద్దరూ ఒక్కటే. ఇక్కడ మనం 'ఇజం' గూర్చి చెప్పుకోవాలి. కేపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం మొదలైన పొలిటికల్ ఫిలాసఫీలున్నాయి. యిదంతా చాలా కాంప్లికేటెడ్ ఏరియా. ఒక్కోదేశానికి ఒక్కోరకమైన సమస్యలు, పరిస్థితులు. జలుబు, దగ్గులకి అన్నిదేశాల్లో ఒకటే మందు. కానీ రాజకీయాలు చాలా సంక్లిష్టమైనవి. ఒక దేశ ఉన్నతికి కారణమైన పొలిటికల్ మోడెల్ ఇంకోదేశంలో ఘోరంగా విఫలమవుతుంది. అలా అనుకరించబోయిన చాలామంది రాజకీయ నాయకులు బోర్లాపడ్డారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నావు." విసుక్కున్నాను.

"సారీ! అయితే సింప్లిఫై చేస్తాను. విను. కొన్నిదేశాల్లో అక్కడి రాజకీయ నాయకులు అనుసరిస్తున్న రాజకీయ విధానాల వల్ల ఆదేశ ప్రజలు సుఖమయ జీవనం గడుపుతుండగా.. ఇంకొన్ని దేశాల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కొన్ని దేశాల్లో అదీ కుదరక ఆకలితోనో, బాంబు దాడుల్లోనో చస్తున్నారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ పై పెట్టాడు.

"అవును." అన్నాను.

"ఇక్కడ ప్రజలు హాయిగా సినిమాలు చూసుకుంటున్నారు. టీ స్టాల్లో సింగిల్ టీ తాగుతూ నచ్చని రాజకీయపార్టీని నోరారా తిట్టుకుంటున్నారు. పట్టపగలే మందుకొట్టి రోడ్లెమ్మడ పడిపోతున్నారు. కొన్నిదేశాల్లో ఈ లక్జరీ లేదు. ఇలా మన దైనందిన జీవితంలో రాజకీయ ప్రభావం లేని అంశమంటూ లేదు." అన్నాడు సుబ్బు.

"ఒక్క నీ ఉప్మాపెసరట్టు తప్ప." నవ్వుతూ అన్నాను.

"నో! నేనలా అనుకోవడం లేదు. మన రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో పెసరట్టు పేటెన్సీని ఒక MNC కి కట్టబెట్టొచ్చు. అప్పుడు మనకి ఉప్మాపెసరట్టు ఏ KFC లోనో మాత్రమే లభ్యమవుతుంది. ఆనంద భవన్ వంటి హోటళ్ళు రోగాల్ని వ్యాప్తి చేస్తున్నాయని ఒక రిపోర్ట్ ఇంటర్నేషనల్ మేగజైన్ లో పబ్లిష్ అవుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన 'ఆరోగ్య పరిరక్షణ' నిమిత్తం ఆనంద భవన్ మూయించబడుతుంది. ఆ స్థానంలో ఒక ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్, ఫుడ్ కోర్ట్ వస్తుంది. ఆవిధంగా 'శుచికరమైన' ఆహారం తినడం మనకి అలవాటవుతుంది. ఫలితంగా మన భవిష్యత్ తరాలవారికి ఆనంద భవన్ అంటే ఏంటో తెలీకుండా పోతుంది." అంటూ వాచ్ చూసుకుంటూ లేచాడు సుబ్బు.

"మరి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ మాత్రం తెలీదంటావా?" అడిగాను.

"అతను క్రికెట్ ఆడుకుంటూ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలీకపోవచ్చు. తెలిసినా ఏం చెప్పినా చెల్లుబాటయిపోతుందనుకోవచ్చు. అతను ఎందుకలా చెప్పాడో మనమెలా నిర్ణయిస్తాం? ఇవన్నీ ఎలెక్షన్లప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Monday 1 October 2012

బురద పంది.. ఒక అద్భుతజీవి

పొద్దున్నుండీ ఒకటే వర్షం. నా కూతుర్ని కాలేజిలో దించడానికి హడావుడిగా వెళ్తున్నాను. ఇంతలో కారుకి అడ్డంగా పంది, దాని  పిల్లలు. పాపం! ట్రాఫిక్‌లో  తికమకపడుతూ రోడ్డు దాటలేకపోతున్నాయి, కారు ఆపేశాను.

"అబ్బా నాన్నా! అసలే  టైమై పొయ్యింది. పందే  కదా, పోనివ్వచ్చుగా. ఆపేశావే?" నా కూతురు విసుక్కుంది. 

"తప్పు తల్లీ! అలా అనరాదు. పంది చాలా ఉత్తమజీవి. పందుల్ని గౌరవించడం మన సంప్రదాయం." అన్నాను.  చివరి  పందిపిల్ల కూడా రోడ్డు దాటేదాకా ఆగి.. ఆ తరవాతే కారు ముందుకు పోనించాను. నా కూతురు నన్ను విచిత్రంగా చూసింది.. నేను చిన్నగా నవ్వుకున్నాను.

జంతువులు రకరకాలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో జంతువంటే ఇష్టం. చాలామందికి కుక్కలంటే ఇష్టం, కొందరు పిల్లుల్ని పిల్లల్లా పెంచుకుంటారు. మా గుంటూర్లో మానసిక వైద్యానికి పితామహుడైన డా.అమంచర్ల శంకరరావుగారింట్లో వున్న జంతువుల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. ఆయన దగ్గర జంతువుల మందే ఉండేది. డెబ్భయ్యేళ్ళ శంకరరావుగారు వాటితో చిన్నపిల్లాళ్ళా ఆడుకోటం నన్ను అబ్బురపరిచేది.  

నాకు పంది యిష్టమైన జంతువు. ఈ యిష్టానికి అనేక కారణాలున్నాయి. నేను చదువుకున్న స్కూల్ ముందు పెద్ద బురదగుంట వుండేది. దాన్నిండా అనేక పందులూ, పందిపిల్లలు సకల బంధుజనసమేతంగా కాపురం వుండేవి. నాకు  చిన్నప్పట్నించి  చదువు  తప్ప  మిగిలిన  అన్ని  విషయాల్లో  ఆసక్తి  మెండు. అంచేత  ఆ పందులూ, పంది  పిల్లలూ  సహజంగానే  నా  దృష్టిని  మిక్కిలిగా  ఆకట్టుకున్నాయి. అ  విధంగా  ఒక behavioral scientist వలె  పందుల్ని  నిశితంగా  పరిశీలించి  మిక్కిలి  జ్ఞానాన్ని  మూటగట్టుకొంటిని.

పంది కేరాఫ్ ఎడ్రెస్ బురదగుంట. బురదగుంటలో, అర్ధనిమీలి నేత్రాలతో, బుల్లితోకతో ఈగలు, దోమల్ని తోలుకొంటూ.. బద్దకంగా.. విశ్రాంతిగా.. ప్రశాంతమూర్తిగా జీవించే పందిలో నాకు ఒక విశ్వవిజేత కనిపించేవాడు. ప్రశాంతత లేకుండా నిత్యం ఆశాంతితో జీవించే ఏకైక జంతువు మనిషి అని నా నమ్మకం.

'నీకు తింటానికి, ఉంటానికి ఉందిగా? ఇంకా ఏడుపెందుకు?'

'నా సంతానానికి ఈ సుఖం ఉంటుందో ఉండదో? తల్చుకుంటుంటేనే ఏడుపొచ్చేస్తుంది బ్రదర్.'  

'పిచ్చివాడా! నువ్వెంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? చివరాకరికి ఏదోరోజు నువ్వుకూడా మా బురదమట్టిలో కలిసిపోవలసినవాడవే!' అన్నట్లుగా వుండే పంది ముఖంలో నాకు పెద్ద ఫిలాసఫర్ కనిపించేవాడు! కాకపోతే పైసా ఖర్చు లేకుండా చెప్పే ఫిలాసఫీని మనిషి పట్టించుకోడు. అతనికి ఇట్లాంటి విషయాలు బోధపర్చడానికి కాషాయ వస్త్రధారి కావాలి.. చింపిరి తల, బారెడు గెడ్డంతో శిష్యపరివేష్టితుడయ్యుండాలి.. అర్ధం కాని లాజిక్కుతో, మాటల్తో బురిడీ కొట్టించగలవాడైయ్యుండాలి. ఇవేవీ లేని కారణాన పంది ఫిలాసఫీని పట్టించుకునేవాడు లేకపొయ్యాడు.

పంది పిల్లలు యెంత ముద్దుగా ఉంటాయి! బుజ్జి ముండలు, వాటి మూతి కత్తిరించిన కేకులా గమ్మత్తుగా ఉంటుంది. తల్లి పొదుగు వద్ద పాల కోసం కుమ్ముకుంటూ.. అప్పుడప్పుడూ 'కీ' అంటూ.. ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుంది. తల్లి వెంట సుశిక్షితులైన సైనికులవలె తిరుగాడుతుంటాయి. పంది, పంది పిల్లల బంధం ప్రకృతిలోని తల్లీపిల్లల అనుబంధానికి గొప్పచిహ్నం. ఈ బంధం తల్లిని అనుకరిస్తూ పిల్లలు నేర్చుకునే learned behavior కి మంచి ఉదాహరణ.

ఒంటినిండా బురద, ముక్కు బద్దలయ్యే కంపూ పందికి సహజ కవచాలు. తనంతట తాను యెవరి జోలికీ వెళ్ళదు, యెవడన్నా తన జోలికొచ్చాడా.. వాడు వంద లైఫ్ బాయ్ సబ్బులు వాడినా పోని కంపూ, బురదా ప్రాప్తిరస్తు! ఎంత గొప్ప ఫిలాసఫి! ఎంత గొప్పసెల్ఫ్ డిఫెన్స్! జిమ్ కార్బెట్ ఎన్ని పులుల్ని చంపాడో నాకు తెలీదు కానీ ఒక్క పందిని కూడా చంపలేదనీ, చంపలేడనీ ఘంటాపధంగా చెప్పగలను! ఎలాచెప్పగలవ్? సింపుల్ - ఆయన పులుల్ని ఎలా చంపాడో రాసుకున్నాడుగానీ, పందుల్ని ఎలా చంపాడో ఎక్కడా రాసుకోలేదు!
                         
పందిలా తిని పడుకుంటున్నాడని తిడతారు కానీ.. ఎక్కువ తిని అస్సలు పని చేయకపోవడం పంది తెలివికి నిదర్శనం. అనగా జంతువుల్లో లేబర్ లా ఉల్లంఘన ఒక్క పందికే చాతనయింది. ఈమాత్రం తెలివిలేని దద్దమ్మలు గానుగెద్దులు. అందుకే గొడ్డుచాకిరీ చేస్తుంటాయి. పందులలోని ఈ తెలివిని జార్జ్ ఆర్వెల్ కూడా గమనించాడు. అందుకే తన 'ఏనిమల్ ఫామ్'లో పీడించే వర్గానికి ప్రతినిధిగా పందిజాతిని ఎన్నుకున్నాడు.

అసలు పందికి బురదంటే ఎందుకంత ఇష్టం? పంది చర్మంలో స్వేదగ్రంధులు ఉండవు. కావున శరీర ఉష్ణోగ్రతని కాపాడుకోవడానికి చర్మానికి యెప్పుడూ తేమ కావాలి. ఆ తేమ తొందరగా ఆరకుండా ఉండటం కోసం బురదలో పొర్లుతుంటుంది. అంటే బురద వల్ల శరీరం తడి ఆరకుండా ఉంటుంది. ఈ విధంగా పందికి సైన్స్ మీదకూడా పట్టుంది! ఈ సంగతి తెలిసిన తరవాత నాకు పందిపై గౌరవం మరింత పెరిగింది.

పంది వైద్యశాస్త్ర అభివృద్ధికి కూడా తోడ్పడింది, తోడ్పడుతుంది. అనాదిగా మానసిక వైద్యంలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ECT విధానానికి (కరెంట్ షాకులిచ్చే వైద్యం) పందుల ఫ్యాక్టరీలో జరిగిన పరిశీలనే కారణం. ఇప్పుడు పంది గుండెని మనుషులకి అమర్చడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.
                         
దశావతారాల్లో తొమ్మిది అవతారాల గూర్చి నాక్కొన్ని అనుమానులున్నయ్. కానీ వరాహావతారాన్ని మాత్రం అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను. మొన్నామధ్య వో పంది దేవుడి చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణాలు చేసింది, కాబట్టి నమ్మక తప్పదు!
                         
ఈమధ్య  పందుల పెంచే వృత్తిలో వున్న వో పేషంట్ చెప్పిన లాభాలు విని కళ్ళు తేలేశాను. ఈ రహస్యాలు ఎవ్వరికీ చెప్పకురా అబ్బీ! నీకు ఏ అంబానీగాడో పోటీదారుడవుతాడని సలహా ఇచ్చి పంపేసాను.

మిత్రులారా! పంది విశిష్టత గూర్చి నాకు తెలిసిన వివరాలన్నీ మీతో పంచుకున్నాను. పంది గొప్పదనం ఈపాటికి మీక్కూడా అర్ధమైపోయుంటుంది. చివరగా ఒక విజ్ఞప్తి. ఇకముందు ఎప్పుడైనా మీకు పంది తారసపడితే ముక్కు మూసుకుంటూ ఈసడించుకోకండి. గౌరవంగా పక్కకి  తప్పుకోండి! ఎందుకంటే - బురదపంది ఒక అద్భుతజీవి!

(posted in fb on 13 Dec 2017)