Friday 23 January 2015

స్త్రీలకి చీరే శ్రీరామరక్ష!


"మన్ది హిందూదేశం."

"........ "

"ఇది పరమ పవిత్రమైన భూమి."

"....... "

"ఆడది ఆదిపరాశక్తి."

"........ "

"ఈ దేశంలో స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తాం."

"........ "

"స్త్రీల అందమంతా వారి చీరకట్టులోనే వుంది."

".......... "

"చీర మన భారతీయ సాంప్రదాయం."

"............ "

"స్త్రీలకి చీరే శ్రీరామరక్ష."

".......... "

"చీర కట్టిన స్త్రీని ఒక్కడు కూడా రేపు చెయ్యడు. చేస్తే నన్ను చెప్పుచ్చుకు కొట్టండి!"

"............ "

"బాపు బొమ్మకి చీరే అందం"

"............ "

"విశ్వనాథ్ సినిమాలకి చీరే ప్రాణం."

"............ "

"రోజులు మారిపోతున్నాయి, ఆడాళ్ళు మరీ బరితెగించిపోతున్నారు."

"............ "

"లేకపోతే ఆ డ్రస్సులేవిఁటీ ఛండాలంగా!"

"........... "

"జేసుదాసు అన్నాడంటే అనడా మరి?"

"......... "

"నన్నడిగితే చీర కట్టని ఆడదాన్ని షూట్ చేసి పారెయ్యాలంటాను."

"........... "

"దేశానికిప్పుడు మంచిరోజులొచ్చేశాయి. మన్ని రక్షించడానికి దేవుళ్ళా మోడీ వచ్చాడు! మోడీ మన్‌మోహన్‌లా ముంగి కాదు, అసలుసిసలైన మగాడు! ఆడాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచుతాడు!"

"............ "

"మేస్టారూ! ఇందాకట్నుండీ నేనే మాట్లాడుతున్నాను. మీరేంటి ఒక్క ముక్కా మాట్లాడరు!"

"ఏం మాట్లాడమంటారు? మీరు మాట్లాడుతున్నారుగా!"

"అవుననుకోండి! మీరసలేం మాట్లాడకపోతేనూ!"

"అయ్యా! మీరు 'శ్రీరామసేన' సభ్యులా?"

"రామరామ! ఆ పేరెప్పుడూ విన్లేదండీ!"

"తొగాడియా శిష్యులా?"

"మిరపకాయ తొడాలు తెల్సండీ! తొగాడియా తెలీదు."

"సాక్షి మహరాజ్?"

"బాపు రమణల 'సాక్షి' చూశాను, అంతే!"

"ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండీ, మీరేం చేస్తుంటారు?"

"ఇందులో అనుకోటానికేవుఁందండీ! 'పడవల పిచ్చయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? ఆ దుకాణం మాదేనండీ! 'పడవల పుల్లయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? అది మా బాబాయ్ కొడుకుల్దండీ! మాది చీర్లేపారవఁండీ! మా బాబాయోళ్ళది రెడీమేడ్ దుస్తుల యాపారవఁండీ! ఆళ్ళు కోట్లకి పడగలెత్తారండీ! మనం మాత్రం యిక్కడే వుండిపొయ్యావఁండీ!"

"అయ్యో!"

"ఏజేస్తావఁండీ? టైం బ్యాడండీ! ఇవ్వాళ ఆడలేడీసులు చీర్లు కట్టం తగ్గించేశారు కదండీ! మనం యాపారంలో దెబ్బైపొయ్యావఁండీ! మోడీ రావాలి - అప్పుడు గానీ ఈ ఆడముండలు చీర్లే కట్టాలని రూల్రాదని మా బామ్మర్ది చెప్తుంటాడండీ."

"ఓ! మీ సమస్య ఇప్పుడర్ధమైంది. మీ కోరిక నెరవాలని కోరుకుంటున్నాను."

"థాంక్సండీ!" 

(to post in fb)

Wednesday 21 January 2015

రచయితలకి రక్షణ లేదా?


పెరుమాళ్ మురుగన్ అనేది స్వచ్ఛమైన తమిళ పేరు, ఇంకే భాషలోనూ వుండదు. పేరుకి తగ్గట్టుగానే పెరుమాళ్ మురుగన్ కూడా తమిళంలోనే రచనలు చేశాడు, ఇంకే భాషలోనూ రాయలేదు. నాలుగేళ్ళ క్రితం పెరుమాళ్ మురుగన్ రాసిన తమిళ రచనని ఈమధ్యే ఇంగ్లీషులోకి అనువదించారు - అదే ఆయన కొంప ముంచింది.

ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం రాసిన ఈ పుస్తకానికి ఇప్పుడెందుకు నిరసన? వారి అభ్యంతరం అనువాదం పట్లనేనా? కారణం ఏదైనా - పెరుమాళ్ మురుగన్ ఇంకెప్పుడూ రచనలు చెయ్యనని ఒక ప్రకటన ఇచ్చాడు. ఆల్రెడీ మార్కెట్లో వున్న పుస్తకాల్ని కూడా ఉపసంహరించుకున్నాడు. ఇదంతా జిల్లాస్థాయి అధికారుల అధ్వర్యంలో బలవంతంగా జరిగిందని పత్రికలు రాశాయి .

రచయితలు నానావిధాలు. ఆవకాయ దగ్గరనుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టులపైనా సరదాగా కాలక్షేపం కోసం రాసేవాళ్ళు కొందరైతే - మరికొందరు మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాల గూర్చి మురిసిపోతూ పులకించిపోతూ రాస్తుంటారు. తద్వారా కొంతమంది అభిమానుల్ని సంపాదించుకుని - వాడవాడలా తమవారితో పొగిడించుకుంటూ, శాలువాల సన్మానాలు చేయించుకుంటూ సత్కాలక్షేపం చేస్తుంటారు. ప్రభుత్వాల దృష్టిలో ఈ శాలువా రచయితలే జాతి పరిరక్షకులు!

కొందరు రచయితలకి సమాజంలోని స్టేటస్ కో నచ్చదు, అసమానతల్ని అసహ్యించుకుంటారు. ఈ సమాజం ఇలా ఎందుకుందని మధనపడతారు. అందుగ్గల కారణాల్ని విశ్లేషిస్తూ సీరియస్ సాహిత్యాన్ని సృష్టిస్తారు. సాహిత్యం ప్రజల బాగు కోసమేనని వారి నమ్మకం. వీరు అవార్డుల్ని పట్టించుకోరు, పైగా వాటికి దూరంగా వుంటారు. ప్రభుత్వాలకి ఈ బాపతు రచయితలంటే భలే అనుమానం.

డబ్బు కోసం రాసుకునే రచయితల సంగతేమో గానీ - తాము నమ్మిన విషయాల్ని నిక్కచ్చిగా రాసే రచయితలు - తమ రచనల పట్ల చాలా పేషనేట్‌గా వుంటారు. చాలా సీనియర్ రచయితలు కూడా ఫలానా మీ రచనలో ఫలానా లైన్లు బాగున్నయ్యంటే చిన్నపిల్లాళ్ళా ఆనందిస్తారు. కొందరు రచయితలయితే తమ పుస్తకాల్ని కన్నపిల్లల్లా సాకుతుంటారు. ఈ నేపధ్యంలో - ఒక రచయిత తనకు తానుగా మరణ శాసనం రాసుకున్నాడంటే - అతనెంత ఆవేదన చెందాడో అర్ధం చేసుకోగలను.

రచయితలెప్పుడూ సాఫ్ట్ టార్గెట్లే. అందుకే మతం ముఠాలు, కులం గ్రూపులు వీరినే లక్ష్యంగా ఎంచుకుంటాయి. ఉదాహరణకి - సల్మన్ రష్దీ రాసిన పుస్తకం తమ మతవిశ్వాసాలకి విరుద్ధంగా వుందనీ, నిషేధించాలని కొన్ని ముస్లిం సంస్థలు ఆందోళన చేశాయి. మైనారిటీ వోట్లకి ఎక్కడ గండి పడుతుందోనన్న భయంతో కేంద్రప్రభుత్వం హడావుడిగా 'సటనిక్ వెర్సెస్' పుస్తకాన్ని నిషేధించింది! 

సల్మన్ రష్దీ అంతర్జాతీయ రచయిత కాబట్టి ఆయన ఏదోక దేశంలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒక చిన్న ఊళ్ళో నివసించే రచయితకి ఆ అవకాశం వుండదు, ఇంకా చెప్పాలంటే ఆ రచయితకి దిక్కూదివాణం వుండదు. అందుకు మంచి ఉదాహరణ - ఈ పెరుమాళ్ మురుగన్‌. ఆయనేదో రాశాడు. ఆయన్రాసింది ఒక మతంవాళ్ళకి నచ్చలేదు. ఓ పదిమందిని కూడేసి ఆయన పుస్తకాల్ని తగలబెట్టించారు, ఊళ్ళో బంద్ జరిపించారు. ఆయన భయపడి పారిపొయ్యాడు. జిల్లాధికారులకి ఇదంతా ఒక లా అండ్ ఆర్డర్ న్యూసెన్స్‌గా అనిపించి చిరాకేసింది. అధికార దర్పానికి - జీవిక కోసం ఏ స్కూలు మేస్టర్లుగానో, పోస్టు మేస్టర్లుగానో పన్జేస్తున్న రచయితలు నంగిరిపింగిరిగాళ్ళలాగా కనిపిస్తారు. అంచేత వాళ్ళాయన్ని చర్చలకంటూ పిలిపించి - బెదిరించి ల్యాండ్ సెటిల్‌మెంట్ చేసినట్లు ఏవో కాయితాల మీద సంతకం పెట్టించుకున్నారు. ఇదంతా చాలా సింపుల్‌గా జరిగిపోయింది.

కొందరికి 'ఒక రచయిత రాసింది కొందరికి నచ్చలేదు, ఆయన్ని బ్రతిమాలో బెదిరించో రచనల్ని ఆపించేశారు, ఇదసలే విషయమేనా?' అనిపించొచ్చు. ఇంకొందరికి 'రచయిత వ్యతిరేక గ్రూప్ విజయం సాధించింది, పెరుమాళ్ ఓడిపోయాడు' అనిపిస్తుంది. కానీ రచయిత పెరుమాళ్ నిజంగా ఓడిపోయ్యాడా? నేనైతే - తమిళ సమాజం ఓడిపోయిందనుకుంటున్నాను.

'రచయితలు ఎవరి మనసునీ నొప్పించకుండా రాయొచ్చు కదా?' నిజమే! రచయితలకైనా, ఇంకెవరికైనా - ఏ వర్గాన్నీ, వ్యక్తినీ కించపరిచే హక్కు లేదు. కానీ - ఒక రచన వల్ల ఫలానావారి మనోభావాలు దెబ్బతిన్నాయని నిర్ణయించేదెవరు? రాజకీయ పార్టీలా? మత సంస్థలా? కులం గ్రూపులా? మరి రాజ్యంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ మాటేమిటి? ఆ స్వేచ్ఛని పరిరక్షించాల్సింది ఎవరు? పరిధి దాటితే శిక్షించాల్సింది ఎవరు? రాజ్యాంగబద్ధ స్వేచ్చ పరిరక్షిస్తూనే ఆ స్వేచ్చ దుర్వినియోగం కాకుండా చూడ్డానికి రాజ్యాంగబద్ధమైన సంస్థలు (న్యాయస్థానాలు గట్రా) వున్నాయి కదా! మరప్పుడు ప్రభుత్వాలు - రచయితల్ని కొన్ని గ్రూపులకి ఆహారంగా వేసి చోద్యం చూస్తున్నట్లుగా ఎందుకంత ఉదాసీనంగా వ్యహరిస్తున్నాయి?

ఇక్కడ ప్రేమకథలు రాసుకోవచ్చు, క్షుద్రరచనలు చేసుకోవచ్చు, సరసంగా సరదాగా మనసుని గిలిగింతలు పెట్టే అందమైన మాటల పొందికతో కవిత్వం రాసుకోవచ్చు. వాళ్లకోసం 'పద్మ' అవార్డు కూడా ఎదురు చూస్తుంటుంది కూడా! కానీ - సమాజాన్ని సీరియస్‌గా కామెంట్ చేస్తూ ఒక రచన చేస్తే మాత్రం రిస్కే! 

ఇవ్వాళ గురజాడ 'కన్యాశుల్కం' రాసే పరిస్థితి వుందా? లేదనుకుంటున్నాను. ఆ నాటకం తమ మనోభావాల్ని దెబ్బతీసిందని ఒక కులం వాళ్ళు గురజాడ ఇంటి ముందు ధర్నా చెయ్యొచ్చు, విజయనగరం బంద్‌కి పిలుపునివ్వచ్చు. గురజాడక్కూడా పెరుమాళ్‌కి పట్టిన గతే పట్టొచ్చు!

ఒక వాదన వుంది - 'ఇతర దేశాలతో పోలిస్తే మన్దేశం చాలా నయం, ఈ మాత్రం స్వేచ్చాస్వాతంత్రాలు లేని దేశాలు ఎన్ని లేవు?' నిజమే! నాకీ వాదన విన్నప్పుడు నా కజిన్ గుర్తొస్తాడు. వాడు సరీగ్గా చదివేవాడు కాదు. మార్కులు ఐదూ పది కన్నా ఎక్కువొచ్చేవి కావు. 'ఏవిఁటోయ్ ఇంత తక్కువొచ్చాయ్?' అనడిగితే - 'మా బెంచీలో అందరికన్నా నాకే ఎక్కువొచ్చాయి!' అని గర్వంగా చెప్పేవాడు. ప్రభుత్వం నడిపే సాంఘిక సంక్షెమ హాస్టళ్ళల్లో ఆహారం పరమ అధ్వాన్నంగా వుంటుంది. 'వాళ్లకి ఇళ్ళల్లో తినడానికి తిండే వుండదు, వాళ్ళ మొహాలకి ఇదే ఎక్కువ.' అని ఈసడించుకునే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు నాకు తెలుసు.

అచ్చు ఇదే వాదన్ని హిందూమతానికి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా చేస్తుంటారు. వాళ్ళు ముస్లిం మతాన్ని చూపిస్తూ - 'నువ్వెళ్ళి ఇవే మాటలు ముస్లిం దేశాల్లో చెప్పు. నీ తల తీసేస్తారు' అంటారు. నిజమే! ఒప్పుకుంటున్నాను. సౌదీలో రాజ్యానికి వ్యతిరేకంగా బ్లాగుల్రాసిన కుర్రాణ్ని ఎంత కౄరంగా హింసిస్తున్నారో చదువుతుంటే ఒళ్ళు గగుర్బొడుస్తుంది! మనం చేసే దరిద్రప్పన్లని సమర్ధించుకోడానికి మనకన్నా దరిద్రులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ వుండనే వుంటారు!

రాజకీయ నాయకులు, ఉద్యమకారులు సంఘటితంగా ఒక గ్రూపుగా వుంటారు గానీ - రచయితలెప్పుడూ ఒంటరిగాళ్ళే! అందుకే వాళ్ళు ఈజీ టార్గెట్లవుతారు. వాళ్ళు మందబలానికి, భౌతిక దాడులకి భయపడతారు. అప్పుడు - 'అసలెందుకు రాయడం? హాయిగా తిని పడుకోవచ్చుగా' అనిపిస్తుంది. అవును - ఇప్పుడు జరగబోతుందదే!

సమాజం - మతపరంగా, కులపరంగా స్పష్టమైన డివిజన్‌తో విడిపోవడం పాలకులకి ఎప్పుడూ లాభదాయకమే. అప్పుడే వారు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల్ని నిరాటంకంగా చక్కబెట్టుకోగలరు. రాజ్యానికి ఇబ్బంది కలిగించే రచయితలు - చైనాలోలాగా మాయమైపోడానికో, పాకిస్తాన్లోలాగా కాల్చబడ్డానికో మరికొంత సమయం పట్టొచ్చేమో గానీ - రచయితలకి చెడ్డరోజులు తరుముకుంటూ వచ్చేస్తున్నాయనేది నా అనుమానం. నా అనుమానం నిజమవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను.

(picture courtesy : Google)

Friday 16 January 2015

బీజేపీ ముసుగు


"పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. ఇవ్వాళ మీడియా వాళ్ళు మమ్మల్ని 'ఫ్రింజ్ గ్రూప్' అంటూ అవమానిస్తున్నారు." అంటూ ఈమధ్య నా మిత్రుడు తన ఆవేదన వెళ్ళబుచ్చాడు, అతను చాలా యేళ్ళుగా ఆరెస్సెస్‌లో ముఖ్యుడుగా వున్నాడు. నాకతని పట్ల జాలి కలిగింది. పాపం! ఆతను ఎన్నికలప్పుడు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.

బీజేపీ అనే రాజకీయ పార్టీకి సిద్ధాంత మూలాలు ఆరెస్సెస్‌లో వున్నాయి, ఆరెస్సెస్ బీజేపీని రిమోట్‌ కంట్రోల్ చేస్తుంటుంది. ఇక్కడ మనం జనతా పార్టీ ప్రభుత్వంలోంచి బయటకొచ్చేప్పుడు వాజ్‌పాయి, అద్వానీలు 'తాము ఆరెస్సెస్ వారైనందుకు గర్విస్తున్నామని' చెప్పిన విషయం గుర్తు తెచ్చుకోవాలి.

పాకిస్తాన్ ముస్లిముల దేశమనీ, భారద్దేశం హిందువుల దేశమనీ - ఆరెస్సెస్ అభిప్రాయం. ఆరెస్సెస్ క్రైస్తవ మిషనరీలాగా కేవలం మతవ్యాప్తి చేసే సంస్థ కాదు. ఆరెస్సెస్ 'హిందూ రాష్ట్ర్' అనే ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో పని చేస్తున్న సంస్థ. మన ప్రధాని ఈ ఆరెస్సెస్ స్కూల్లోంచే పాఠాలు నేర్చుకుని వచ్చాడు.

ఆరెస్సెస్ అనే వృక్షానికి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, శ్రీరామసేన, హిందూ మహాసభ.. ఇట్లా పలు పేర్లతో అనేక పిలకలున్నాయి. ఈ సంస్థల్లో ఎంతో నిబద్ధతతో పన్జేసే కార్యకర్తలున్నారు. ప్రపంచంలో మతాన్ని ఆధారంగా చేసుకుని నడిచే ఏ సంస్థలోనైనా సభ్యులు మొండిగా వుంటారు.

మొన్న ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి రావడానికి ఆరెస్సెస్ ఎంతగానో శ్రమించింది. అందుకో ఉదాహరణ వారణాసి ఎన్నికలు. ఎన్నికలకి చాలా ముందునుండే ఆరెస్సెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం మొదలుపెట్టారు. పక్కా ప్రణాళికతో పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈర్ష్య పడేంతగా కష్టపడ్డారు.

మోడీ 'అభివృద్ధి' స్లోగన్‌ని నమ్మో, కాంగ్రెస్ అవినీతికి విసిగిపోయ్యో - ప్రజలు కేంద్రప్రభుత్వాన్ని మోడీ చేతిలో పెట్టారు. ప్రభుత్వం రాజ్యంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఒక సంస్థ. దానికి నియమాలు, నిబంధనలు వుంటాయి. అందువల్ల ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి రాజ్యంగ సంస్థలపై నమ్మకం వున్నా, లేకపోయినా - తప్పనిసరిగా ఒక పద్ధతిగా పన్జెయ్యాలి. కాబట్టి సహజంగానే ప్రభుత్వం నడిపేవాళ్లకి కొన్ని ఇబ్బందులుంటాయి.

బీజేపి విజయం కోసం శ్రమించిన సాధువులు, సన్యాసులు, సన్యాసినులకి ఈ సంగతులు పట్టవు, వారికివి అనవసరం కూడా. వారికి తమ మతతత్వ ఎజెండా అమలే పవిత్ర కార్యం. ఒకరకంగా వారిది ముక్కుసూటి వ్యవహారం. 'వాజ్‌పేయి సమయంలో సంపూర్ణ మెజారిటీ లేదని రాముడి గుడి కట్టకుండా తప్పించుకున్నారు, ఇప్పుడు మనకి అడ్డేమిటి?' అనేది వీరి వాదన.

మొదట్నుండీ - హిందుత్వవాదులకి హిట్లర్, గోడ్సేలు ఇష్టులు. అలాగే - వారికి భారద్దేశం మొత్తాన్ని హిందూత్వ దేశంగా మార్చేద్దామనే ఆశయం వుంది. ఉదాహరణకి - హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కని జనాభా సంఖ్య పెంచుకోవాలనేది వారు ఎప్పట్నుండో ఈ దేశానికి ఇస్తున్న గొప్ప సలహా. ఇవ్వాళ హిందుత్వ పార్టీ అధికారంలోకి రాంగాన్లే ఈ విషయాలకి మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది, అంతే!

వాజ్‌పేయి ఒక ముసుగు మాత్రమేననీ, తమ లక్ష్యం వేరే వుందని (వాస్తవం) చెప్పిన గోవిందాచార్య ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ఇవ్వాళ ఎవరూ కూడా గోవిందాచార్య లాగా తెరమరుగయ్యే ప్రమాదం లేదు. ఎందుకంటే - మోడీ మూలాలు ఆరెస్సెస్‌లోనే వున్నాయి కాబట్టి. ప్రవీణ్ తొగాడియా, అశోక్ సింఘాల్, ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్, సాధ్వి నిరంజన్ జ్యోతి వంటివారిపై చర్య తీసుకునే ఉద్దేశం మోడీకి వుండదు - ఏదో 'షో కాజ్' నోటీసులంటూ షో చేయ్యడం తప్ప. ఎందుకంటే - తామంతా ఒక తానులో ముక్కలే కాబట్టి.

నేడు ప్రజల్ని మోసం చెయ్యడంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపధ్యంలో - మనం సంఘపరివార్ శక్తుల నిజాయితీని అభినందించాలి. వారు మనసులో మాట దాచుకోకుండా - తమ అసలు లక్ష్యం ఏమిటో నిర్మొహమాటంగా చెబుతున్నారు. వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు కావున వినేవారిక్కూడా ఎటువంటి కన్‌ఫ్యూజన్ వుండదు. ఆ మాత్రం స్పష్టత వుంటేనే - తమకేం కావాలో, ఎవరు కావాలో ఈ దేశప్రజలు నిర్ణయించుకోగలుగుతారు.

Wednesday 14 January 2015

శబరిమలై సంప్రదాయ గోడలు


మన ఇంటికి అతిథులు వస్తారు. అందరికీ కాఫీ ఇచ్చి, ఒకరికి మాత్రం మంచినీళ్ళే ఇస్తాం. ఆ మంచినీళ్ళ వ్యక్తి మొదట ఆశ్చర్యపోతాడు, తరవాత చిన్నబుచ్చుకుంటాడు, ఆ తరవాత కోపగించుకుంటాడు. కాఫీ ఆరోగ్యానికి హాని అనీ, అందుకే నీకు ఇవ్వలేదనీ మనం బుకాయించబోయినా అతడు ఒప్పుకోడు. వాస్తవానికి అతనికి కాఫీ తాగే అలవాటు లేదు. అయినా, అందరితో పాటు తనకి కాఫీ ఆఫర్ చెయ్యనందుకు కోపగిస్తాడు. తను కాఫీ త్రాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవల్సింది అతడే గానీ మనం కాదు.

కేరళలో శబరిమలై అనేచోట అయ్యప్ప అనే దేవుడు వున్నాడు. నల్ల దుస్తుల్తో (సీనియర్లు కాషాయ దుస్తుల్తో) దీక్ష తీసుకుని దేవుణ్ణి దర్శించుకుంటారు. సంక్రాంతినాడు జ్యోతి కనబడుతుందిట గానీ - దాన్ని దేవస్థానం బోర్డు ఉద్యోగులే చాలా కష్టపడి వెలిగిస్తారని ప్రభుత్వమే వొప్పుకుంది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ప్రవేశం లేదుట. దీనిక్కారణం ఈ వయసు ఆడవాళ్ళు menstruate అవుతారు. 

ప్రజలు నమ్మకాల్నీ, భక్తినీ ప్రశ్నించడానికి సందేహిస్తారు. 'మనకెందుకులే' అనుకుని అలా ఫాలో అయిపోతూ వుంటారు. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా వుండదు. ఏదోక రోజు నమ్మకాల్నీ, సాంప్రదాయతనీ ప్రశ్నించేవాళ్ళు బయల్దేరతారు. అంటు, మైల, ముట్టు - మొదలైన ముద్దుపేర్లతో menstrual bleed ని చీదరించుకునేవాళ్ళని చీదరించుకుంటూ కొందరు అమ్మాయిలు happy to bleed అనడం మొదలెట్టారు (పిదప కాలం, పిదప బుద్ధులు). 

'ఉరే భక్త స్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా, గర్భాశయంలో తొమ్మిది నెలలు గడిపి, స్త్రీ జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు (ఎంత అన్యాయం!).

కోర్టుక్కూడా న్యాయదేవత వుంది. కానీ ఆ దేవత చూడ్డానికి వీల్లేకుండా కళ్ళకి గుడ్డ కట్టేసి వుంటుంది. గౌరవనీయులైన కోర్టువారు చట్టాల దుమ్ము దులిపి నిశితంగా పరిశీలించారు. వాళ్లకి menstruating women కి వ్యతిరేకంగా యే ఆధారమూ కనబడక - 'bleeding women దేవుణ్ణి ఎందుకు చూడకూడదు?' అని తీవ్రంగా హాశ్చర్యపొయ్యారు. 'ట్రావన్కూరు దేవస్థానం వాళ్ళు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారా?' అంటూ కించిత్తు మధనపడుతూ సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు ఇంకా రావలసి వుంది. 

సమాజం నిశ్చలంగా వుండదు, నిరంతర మార్పు దాని గుణం. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి నిలబడనిదేదైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి తావు లేని సమాజం నిస్సారమైనది, అనాగరికమైనది. అందుకే - 'ఎందుకు?' అన్న ప్రశ్న చాలా ప్రమాదకరమైనది కూడా! ఈ ప్రశ్న వినపడ్డప్పుడల్లా కొందరు గుండెలు బాదుకుంటూనే వున్నారు. ఆ గుండెలు బాదుకునే వాళ్ళు గుండె పగిలి చచ్చేలా సమాజం ముందుకు పురోగమిస్తూనే వుంది. ఇవ్వాళ శబరిమలైలో అగ్గిపుల్ల రాజుకుంది. ఈ అగ్గి పుల్లతోనే ఆరిపోదనీ, ఇది ఇంకెన్నో మంటల్ని రాజేస్తుందనీ ఆశిస్తున్నాను. 

Monday 12 January 2015

'అకారసం'


"రచయితగారూ! నమస్కారం!"

"నమస్కారం!"

"మీ రచనలన్నీ చదివాం, చాలా బాగున్నయ్."

"సంతోషం!"

"మీ ఆలోచనలు మా రచయితల సంఘం ఆలోచనలకి దగ్గరగా వున్నాయి."

"థాంక్యూ!"

"మీరు మా సంఘంలో చేరాలని మా కోరిక."

"మీరు అభ్యుధయ రచయితల సంఘం - 'అరసం' వాళ్ళా?"

"కాదు."

"విప్లవ రచయితల సంఘం - 'విరసం' వాళ్ళా?"

"కాదు."

"హిందూ మతానికి అన్యాయం జరిగిపోతుందని రోజువారీ గుండెలు బాదుకునే జాతీయవాద రచయితలా?"

"కాదు."

"మరి?"

"మా రచయితల సంఘం పేరు - 'అకారసం'."

"పేరెప్పుడూ విన్లేదే!"

"వినకపోవడమేమిటండీ! ఈ మధ్యన మా సంఘం పాపులారిటీ విపరీతంగా పెరిగిపోతుంటేనూ!"

"అలాగా! ఇంతకీ 'అకారసం' అంటే ఏంటి?"

"అర్ధం కాని రచయితల సంఘం."

"పేరు వెరైటీగా వుందే! మీ సంఘ సభ్యుల లక్ష్యం - పాఠకులకి అర్ధం కాకుండా రాయడమా?"

"పాఠకులకి అర్ధం కాకుండా రాయడం ఇప్పుడు ఓల్డు ఫేషనైపోయిందండీ!"

"మరి?"

"రచన చేసిన రచయితక్కూడా అర్ధం కాని రచనల్ని మా సంఘం ప్రమోట్ చేస్తుంది!"

(picture courtesy : Google)

Friday 9 January 2015

'స్వచ్ఛపుస్తక్'


"ఈమధ్య తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరిద్దామనే కోరిక కలిగిందోయ్! ఒక మంచి రచయితని సజెస్ట్ చెయ్యి! చదివి పెడతాను."

"అలాగే! మీ టేస్టేవిఁటో చెబితే.. "

"స్వచ్ఛమైన రచయిత, స్వచ్ఛమైన పుస్తకం!"

"అర్ధం కాలేదు."

"ఓ పన్జెయ్! నీకిష్టమైనవాళ్ళ పేర్లు చెప్పు! చదవాలో లేదో నేను తేల్చుకుంటాను."

"రావిశాస్త్రి బాగా రాస్తాడు."

"నేను తాగుబోతులు రాసిన సాహిత్యం చదవను."

"పోనీ - కుటుంబరావు?"

"కమ్యూనిస్టులు దేశద్రోహులు, వాళ్ళని చదవరాదు."

"చలం?"

"చలంది క్రమశిక్షణ లేని జీవితం."

"శ్రీశ్రీ?"

"నథింగ్ డూయింగ్, శ్రీశ్రీ స్మోకర్."

"గురజాడ అప్పారావు?"

"...... "

"సార్సార్! ఇంకేం మాట్లాడకండి. గురజాడని తీసుకెళ్ళి చదూకోండి, నన్ను విముక్తుణ్ని చెయ్యండి."

"ఎందుకలా తొందర పడతావ్? కొంచెం ఆలోచించనీ! గురజాడకే అలవాటూ లేదని ఎలా చెప్పగలవ్? ఏమో ఎవరు చెప్పొచ్చారు - నశ్యం అలవాటుందేమో!"

"ఒట్టు! నన్ను నమ్మండి! ఆయనకే అలవాటూ లేదుట! పొద్దున్నే యోగాసనాలు కూడా వేసేవాట్ట! చరిత్రలో రాశారు."

"ఈ రోజుల్లో చరిత్రని నమ్మేదెవరు? ఎవరికనుకూలంగా వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఓ పన్జెయ్! గురజాడకి ఏ అలవాటు లేదని రూఢి చేసుకుని నీకు ఫోన్జేస్తాను. అప్పుడాయన పుస్తకాలు పంపీ! నాకు రచన బాగా లేకపోయినా పర్లేదు కానీ - రచయితకి మాత్రం ఆరోగ్యకరమైన అలవాట్లు, ఉక్కు క్రమశిక్షణ వుండాలి! అర్ధమైందా?"

"అర్ధం కాలేదు! అయినా - రచన బాగుండాలి గానీ రచయిత గూర్చి మనకెందుకండి?"

"కావాలి, రచయిత గూర్చే కావాలి! ప్రధానమంత్రి 'స్వచ్ఛభారత్' అంటూ ప్రజల చేతికి చీపుళ్ళిస్తున్నాడు. ఎందుకు?"

"ఎందుకు?"

"ఎందుకంటే - రోడ్లు శుభ్రంగా వుంటేనే ఊరు శుభ్రంగా వుంటుంది కాబట్టి! అందుకే చీపుళ్ళ పథకాన్ని 'స్వచ్ఛభారత్' అన్నారు. రచయితైనా అంతే! ముందు తను స్వచ్ఛంగా వుంటేనే స్వచ్ఛమైన పుస్తకం రాయగలడు! అప్పుడే దాన్ని 'స్వచ్ఛపుస్తక్' అంటారు!"

"స్వచ్ఛపుస్తక్!"

"అవును! ముందు నువ్వా నోరు మూసుకో, ఈగలు దూరగలవు! ఇక నే వెళ్తాను!"  

Wednesday 7 January 2015

సునంద పుష్కర్


నిన్నట్నుండి విసుగ్గా వుంది. వార్తా మాధ్యమాల స్థాయి ఎంతగా దిగజారింది! చివరాకరికి 'హిందూ' స్థాయి కూడా! శశి థరూర్ భార్య హత్య చేయబడిందట! అయితే ఏంటంట? (ఈ విషయంపై ఇంతకుముందు 'పాపం! సునంద పుష్కర్'    అంటూ ఒక పోస్ట్ రాశాను.)

మన్దేశంలో రోజూ అనేక కారణాలతో హత్యలు జరుగుతూనే వుంటాయి. కానీ - శశి థరూరుని భార్య హత్య గూర్చి అన్ని జాతీయ టీవీ చానెళ్ళల్లో చర్చించారు, దాదాపు అన్ని వార్తా పత్రికల్లో బేనర్ ఐటంగా వచ్చింది! మొదట్లో నాకు ఆశ్చర్యంగా అనిపించింది గానీ, తరవాత విసుగ్గా అనిపించింది.

ఒక ప్రముఖ స్త్రీ మరణానికి కొంచెం కవరేజ్ ఊహించవచ్చు. ఎందుకంటే - ప్రజలకి ఆసక్తి కలిగించే అంశాలని కవర్ చెయ్యడం అనేది వార్తాలతో వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపార ధర్మం. కానీ - మరీ ఇంత అన్యాయమా!?  

ఈ వార్తకి సామాజికంగా ప్రాధాన్యత లేదు. పోనీ రాజకీయంగా ప్రాధాన్యం వుందా? ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీకే దిక్కూదివాణం లేదు. అట్లాంటి కాంగ్రెస్ కీకారణ్యంలో శశి థరూర్ అనేవాడు ఓ చిట్టెలుక. ఒక పక్క ముఖ్యమంత్రి స్థాయిలో పన్జేసిన వ్యక్తులే బీజేపీలోకి చేరడానికి సాగిలపడి పొర్లుదండాలు పెడుతుంటే - ఈ చోటా నాయకుడితో బీజేపీకి పనేంటి! లేదు కదా?

నా మటుకు నాకు శశి థరూర్ భార్యని ఎవరు చంపారో బొత్తిగా అనవసరం. అది ఆ నేరం జరిగిన పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చూసుకుంటాడు. ఒకవేళ శశి థరూర్‌కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం వుంటే లోపలేస్తారు, రేపో మాపో శిక్ష వేస్తారు. అప్పుడాయన ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువంతపురం ప్రజల్లో ఒక్కడైనా ఒక్కపూట టీయైనా మానేస్తాడో లేదో తెలీదు. 

పాపం! శశి థరూర్ కూడా చీపుళ్ళతో రోడ్లూడుస్తూ మోడీ గుడ్ బుక్స్‌లో వుంటానికి నానా తిప్పలు పడుతున్నాడు. అతని కష్టానికి ప్రతిఫలం వుంటుందో లేదో తెలీదు గానీ - ఈలోపు సుబ్రహ్మణ్యన్ స్వామి వూరుకునేట్టు లేడు! చూద్దాం ఏమవుతుందో!

Friday 2 January 2015

ప్రజలకి తిక్క కుదరాల్సిందే!


"నాకు రాజకీయాలంటే మంట!"

"ఎందుకు!?"

"ఎందుకా? బాబుని చూడండి! ఎన్నికల ముందు ఋణమాఫీ అన్నాడు, ఇప్పుడేమో అర్ధం కాని ఆల్జీబ్రా లెక్కలేవో చెబుతున్నాడు. ఎంతన్యాయం! ఈ లెక్కలు ఎన్నికలప్పుడు చెప్పొచ్చుగా?"

"ఈ లెక్కలు ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"మీరు చాలా సినికల్‌గా మాట్లాడుతున్నారు. కేంద్రంలో మోడీని చూడండి! ఎన్నికల ముందు దేశాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఇప్పుడేమో చేతికి చీపుళ్ళిచ్చి రోడ్లూడిపిస్తున్నాడు. టీవీల్లో రోజుకో సన్యాసి హిందూ మతానికి అన్యాయం జరుగిపోతుందని గుండెలు బాదుకోడం తప్ప అభివృద్ధి కనుచూపు మేర కనిపట్టం లేదు. 'అచ్చే దిన్' అంటే ఇవేనా?"

"వాళ్ళ దృష్టిలో ఇవే అచ్చే దిన్! ఈ సంగతి ముందే చెబితే జనాలు ఓట్లెందుకేస్తారు?"

"అది మాట తప్పడం కాదా? అందుకే నాకు రాజకీయాలంటే మంట!"

"దాన్దేవుఁంది! ఎన్నికలన్నాక లక్ష చెబ్తారు. అవన్నీ నమ్మాలని వుందా యేవిఁటి? అయినా - ఈ రోజుల్లో ఎన్నికల వాగ్దానాల్ని పట్టించుకునేదెవరు?"

"అయ్యా! ఇంతకీ తమరెవరు?"

"అయ్యో నా మతి మండా! మాటల్లో పడి మర్చేపొయ్యాను సుమండీ! నాపేరు పేరయ్య. పెళ్ళిళ్ళు కుదురుస్తుంటాను. నన్నందరూ పెళ్ళిళ్ళ పేరయ్య అంటారు."

"పేరయ్య గారూ! నమస్కారం! గత కొంతకాలంగా మా అబ్బాయి పెళ్ళి చెయ్యడానికి నానా తిప్పలు పడుతున్నాను. ముల్లోకాలు వెదికినా మావాడికి పిల్లనిచ్చే దౌర్భాగ్యుడు ఒక్కడూ దొరకట్లేదు! కొడుక్కి పెళ్ళి చెయ్యలేని వాజమ్మనని నా భార్య రోజూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అయ్యా! ఇవి చేతులు కావు, కాళ్ళనుకోండి. మావాడి పెళ్ళి మీరే చెయ్యాలి! చచ్చి మీ కడుపున పుడ్తాను!"

"ఇంక మీరు నిశ్చింతగా వుండండి, మీవాడికి బ్రహ్మాండమైన సంబంధం కుదిర్చే పూచీ నాది - సరేనా? ఇంతకీ కుర్రాడేం చేస్తుంటాడో?"

"పది పదిసార్లు తప్పాడండీ! కష్టపడి టీసీఎస్‌లో ఆఫీస్ బాయ్ వుద్యోగం వేయించాను."

"దానికేం! సలక్షణమైన ఉద్యోగం. కాకపోతే కొంత మార్చి చెబ్దాం. మీవాడు ఏమ్సీయే చేశాడనీ, టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా చేస్తున్నాడనీ చెప్పండి. ఆస్తిపాస్తులేమాత్రం వున్నాయేమిటి?"

"సెంటు భూమి కూడా లేదండీ!"

"శుభం! తుళ్ళూరులో పదెకరాలు కొని పడేశానని చెప్పండి."

"కానీ - అవతలివాళ్ళు నమ్మాలి కదండీ?"

"ఎందుకు నమ్మరు! రాజకీయ నాయకుల్ని జనాలు నమ్మట్లేదా?"

"అయ్యా! ఇట్లా అడ్డగోలుగా అబద్దాలు చెబితే రేపు పెళ్ళయ్యాక ప్రాబ్లం కదండి!"

"వెయ్యబద్దాలాడి ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఒక్కసారి ఆ మూడుముళ్ళు పడ్డాక ఎవడైనా చేసి చచ్చేదేవుఁంది గనక! ఇందాక తమరు రాజకీయ నాయకుల గూర్చి గుండెలు బాదుకుంటున్నారు కదా! రేపు పెళ్ళికూతురు తండ్రీ అంతే!"

"అంతేనంటారా?"

"అంతేనండీ బాబూ! అంతే! ఈ రోజుల్లో నిజాయితీ గా వుంటే నీళ్ళు కూడా పుట్టవు సుమండీ! మరి నే వస్తాను, నా కమిషన్ సంగతి మాత్రం మర్చిపోకండేం!"

"అయ్యో! ఎంత మాట? మిమ్మల్ని సంతోషపెట్టడం నా విధి!"

"ఇంకోమాట - నాకు రాజకీయాలు ఆట్టే తెలీదు. ఇందాక నేనన్న మాటలు పట్టించుకోకండి."

"నాకూ రాజకీయాలు ఆట్టే తెలీదు లేండి - ఏదో న్యూస్ పేపరుగాణ్ని, నోరూరుకోక వాగుతుంటాను! రాజకీయ నాయకులన్నాక ఎన్నికల్లో లక్ష వాగ్దానాలు చేస్తారు, అవి తీర్చేవా చచ్చేవా? నన్నడిగితే అసలు జనాలే దొంగముండా కొడుకులంటాను. వేసేది లింగులిటుకు మంటూ ఒక్క ఓటు, అందుకు సవాలక్ష డిమాండ్లు! వాళ్ళకా మాత్రం తిక్క కుదరాల్సిందే!"

"అంతేకదు మరి! వుంటాను."