Thursday, 28 May 2015

చట్టం అను ఒక దేవతా వస్త్రం!


‘చుండూరు హత్యల కేసులో క్రింది కోర్టులో శిక్ష. కొన్నేళ్ళకి హైకోర్టులో కేసు కొట్టివేత.’
‘బాలీవుడ్ సూపర్ స్టార్‌కి క్రింది కోర్టులో జైలుశిక్ష. నిమిషాల్లో హైకోర్టు బెయిల్ మంజూరు. రెండ్రోజుల తరవాత అదే కోర్టు శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.’
‘తమిళనాడు ముఖ్యమంత్రిపై క్రింది కోర్టులో జైలుశిక్ష. కొన్నాళ్ళకి హైకోర్టులో అవినీతి కేసు కొట్టివేత.’
‘చట్టం కొందరికి చుట్టం’ – ఇటీవల కోర్టు తీర్పుల తరవాత ఈ సత్యం అందరికీ అర్ధమైపోయింది. ఒకప్పుడు ఈ సత్యానికి పట్టు వస్త్రం కప్పబడి సామాన్యులకి కనబడేది కాదు. ఆ తరవాత ఆ వస్త్రం పల్చటి సిల్కు వస్త్రంలా మారి కనబడీ కనబడనట్లుగా కనబడసాగింది. ఇవ్వాళ ఆ పల్చటి వస్త్రం దేవతా వస్త్రంగా మారిపోయింది! ఇకముందు ఎవరికీ ఎటువంటి భ్రమలూ వుండబోవు. ఇదీ ఒకరకంగా మంచిదే. ఈ వ్యవస్థలో సామాన్యుడిగా మనం ఎక్కడున్నామో, మన స్థాయేంటో స్పష్టంగా తెలిసిపోయింది.
శ్రీమతి ముత్యాలమ్మగారు నాకు జ్ఞానోదయం కలిగించే వరకూ – నేనూ “చట్టం ముందు అంతా సమానులే” అనే చిలక పలుకులు పలికిన మధ్యతరగతి బుద్ధిజీవినే. ముత్యాలమ్మగారు నారిమాన్, పాల్కీవాలాల్లాగా న్యాయకోవిదురాలు కాదు. ఆవిడ దొంగసారా వ్యాపారం చేస్తుంటారు, ఒక కేసులో నిందితురాలు. నేర పరిశోధన, న్యాయ విచారణలోని లొసుగుల గూర్చి – రావిశాస్త్రి అనే రచయిత ద్వారా ‘మాయ’ అనే కథలో విడమర్చి చెప్పారు. ‘ఆరు సారా కథలు’  చదివాక అప్పటిదాకా నాకున్న అజ్ఞానానికి మిక్కిలి సిగ్గుపడ్డాను.
క్రింది కోర్టుల్లో శిక్ష పడటం, పై కోర్టులు ఆ కేసుల్ని కొట్టెయ్యడం.. ఈ కేసుల్లో ఒక పేటర్న్ కనిపిస్తుంది కదూ? ‘మన న్యాయవ్యవస్థ పకడ్బందీగా లేకపోతే క్రింది కోర్టుల్లో శిక్షెలా పడుతుంది?’ అని విజ్ఞులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి నా దగ్గర శాస్త్రీయమైన, సాంకేతికమైన సమాధానం లేదు. ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా తనకున్న పరిమితులకి లోబడే ఆలోచించగలడు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కాబట్టి, వైద్యం వెలుపల విషయాల పట్ల కూడా డాక్టర్లాగే ఆలోచిస్తుంటాను, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పరిమితి, ఆక్యుపేషనల్ హజార్డ్!
ఇప్పుడు కొద్దిసేపు హాస్పిటల్స్‌కి సంబంధించిన కబుర్లు –
ఆనేకమంది డాక్టర్లు చిన్నపట్టణాల్లో సొంత నర్సింగ్ హోములు నిర్వహిస్తుంటారు. వీరికి అనేక ఎమర్జన్సీ కేసులు వస్తుంటయ్. అప్పుడు డాక్టర్లు రెండు రకాల రిస్కుల్ని బేరీజు వేసుకుంటారు. ఒకటి పేషంట్ కండిషన్, రెండు పేషంట్‌తో పాటు తోడుగా వచ్చిన వ్యక్తుల సమూహం. సాధారణంగా డాక్టర్లకి దూరప్రాంతం నుండి తక్కువమందితో వచ్చే పేషంట్‌కి వైద్యం చెయ్యడం హాయిగా వుంటుంది. వెంటనే ఎడ్మిట్ చేసుకుని వైద్యం మొదలెడతారు.
అదే కేసు ఆ హాస్పిటల్ వున్న పట్టణంలోంచి పదిమంది బంధువుల్తో వచ్చిందనుకుందాం. అప్పుడు పేషంటు కన్నా డాక్టర్లకే ఎక్కువ రిస్క్! ఎలా? విపరీతంగా విజిటర్స్ వస్తుంటారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. ఒకటే ఫోన్లు, ఎంక్వైరీలు. తమ నియోజక వర్గ ప్రజల రోగాల బారి పడ్డప్పుడు వైద్యులకి ఫోన్ చేసి ‘గట్టిగా’ వైద్యం చెయ్యమని ఆదేశించడం రాజకీయ నాయకులకి రోజువారీ కార్యక్రమం అయిపొయింది. అందరికీ సమాధానం చెప్పుకోడంతో పాటు డాక్టర్లకి కేస్ గూర్చి టెన్షన్ ఎక్కువవుతుంది.
పొరబాటున కేస్ పోతే – పేషంట్‌తో పాటు వచ్చిన ఆ పదిమంది కాస్తా క్షణాల్లో వెయ్యిమందై పోతారు. పిమ్మట హాస్పిటల్ ఫర్నిచర్ పగిలిపోతుంది. డాక్టర్ల టైమ్ బాగోకపొతే వాళ్ళక్కూడా ఓ నాలుగు తగుల్తయ్. పిమ్మట బాధితుల తరఫున ‘చర్చలు’ జరిగి సెటిల్మెంట్ జరుగుతుంది. అంచేత డాక్టర్లకి క్రిటికల్ కండిషన్లో వచ్చే లోకల్ కేసులు డీల్ చెయ్యాలంటే భయం. అందుకే వారీ కేసుల్లో వున్న రిస్క్‌ని ఎక్కువచేసి చెబుతారు. ‘మెరుగైన వైద్యం’ పెద్ద సెంటర్లోనే సాధ్యం, అంత పెద్ద రోగానికి ఇక్కడున్న సాధారణ వైద్యం సరిపోదని కన్విన్స్ చేస్తారు (కేసు వదిలించుకుంటారు). ఆ విధంగా వైద్యం చేసే బాధ్యతని ‘పైస్థాయి’ ఆస్పత్రులకి నెట్టేస్తారు.
మహా నగరాలకి కాంప్లికేటెడ్ కేసులు అనేకం వస్తుంటాయి. డాక్టర్లు హాయిగా వైద్యం చేసుకుంటారు. కేసు పోయినా – ఎలాగూ బ్యాడ్ కేసే అని పేషంట్ తరఫున వారికి తెలుసు కాబట్టి వాళ్ళ హడావుడి వుండదు. ఎవరన్నా ఔత్సాహికులు గొడవ చేద్దామన్నా, ఆ కార్పోరేట్ ఆస్పత్రికి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి వారి అండ ఉన్నందున ‘శాంతిభద్రతలు’ కాపాడే నిమిత్తం పోలీసులు ఆ గుంపుని వెంటనే చెదరగొట్టేస్తారు. అంచేత పేషంట్ బంధువులు ‘ఖర్మ! మనోడి ఆయువు తీరింది.’ అని సరిపెట్టుకుని కిక్కురు మనకుండా బిల్లు చెల్లించి బయటపడతారు.
వైద్యవృత్తి వెలుపల వున్నవాళ్ళకి నే రాసింది ఆశ్చర్యం కలిగించవచ్చును గానీ, ఇది రోజువారీగా జరిగే పరమ రొటీన్ అంశం. ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ కూడా వున్నాయి. పెద్ద కేసుల్ని పెద్దవాళ్ళే డీల్ చెయ్యాలి. దుర్వార్తల్ని చెప్పాల్సినవాడే చెప్పాలి. రాజు నోట ఎంత అప్రియమైనా తీర్పు భరింపక తప్పదు. అదే తీర్పు గ్రామపెద్ద చెబితే ఒప్పుకోరు, వూరుకోరు. ఈ హాస్పిటళ్ళ గోలకి నే రాస్తున్న టాపిక్‌తో కల సంబంధం ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుంటుంది.
“బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.” అంటాడు బాలగోపాల్. (‘రూపం – సారం’ 47 పేజి – ‘రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగా యంత్రం’). ఈ పాయింటుని ప్రస్తుత సందర్భానికి నేనిలా అన్వయించుకుంటాను – కొన్ని కేసుల్లో బాధితులు పేదవారు, అణగారిన వర్గాలవారు. వారిపట్ల ప్రజలు కూడా సానుభూతి కలిగి వుంటారు. బాధితుల్ని కఠినంగా ఆణిచేస్తే ప్రజల్లో ప్రభుత్వాల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం వుంది. అందువల్ల కొన్నిసార్లు (రాజ్యానికి) కేసులు పెట్టకుండా వుండలేని స్థితి వస్తుంది. శిక్షలు విధించకుండా వుండలేని స్థితీ వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా క్రింది కోర్టుల శిక్షలు, పై కోర్టుల కొట్టివేతలు!
చిన్నపాటి హాస్పిటల్స్‌కి వున్నట్లే – కింది కోర్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. అక్కడ న్యాయమూర్తులు శిక్ష వెయ్యడానికి కొద్దిపాటి ఆధారాల కోసం చూస్తారు. శిక్ష వెయ్యకపోతే బాధితులు ఆందోళన చెయ్యొచ్చు, తద్వారా తాము కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావొచ్చు. ఆపై ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్రింది కోర్టుల్లో ముద్దాయిలకి శిక్ష వెయ్యకపోతే ఇబ్బంది గానీ, వేస్తే ఎటువంటి ఇబ్బందీ వుండదు! అందువల్ల కేసు కొట్టేసే బాధ్యతని ఉన్నత స్థానాలకి నెట్టేస్తారు! హైకోర్టులో మాత్రం కేసుల పరిశీలన పూర్తిగా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి జరుగుతుంది. వారిపై ఎటువంటి వొత్తిళ్ళూ వుండవు. శిక్ష ఖరారు చెయ్యడానికి ఉన్నత న్యాయస్థానం వారికి కేసు పటిష్టంగా, పకడ్బందీగా వుండాలి. తప్పించుకోడానికే పెట్టిన కేసులు తొర్రల్తోనే వుంటాయి కాబట్టి సహజంగానే ఉన్నత న్యాయస్థానంవారు కొట్టేస్తారు.
ఇక్కడితో నే చెప్పదల్చుకున్న పాయింట్ అయిపొయింది. కింది కోర్టుల్లో శిక్ష పడ్డాక, ఆ శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో ఖరారు కాకపోవడానికి ఎన్నో కారణాలు వుండొచ్చు. నాకు తోచిన కారణం రాశాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నా ఆలోచన పూర్తిగా తప్పనీ, నాకు న్యాయవ్యవస్థపై కొంచెం కూడా అవగాహన లేకపోవడం మూలాన అపోహలతో ఏదేదో రాశానని ఎవరైనా అభిప్రాయ పడితే – ఆ అభిప్రాయాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే – నేను ముందే చెప్పినట్లు నాది ‘వైద్యవృత్తి’ అనే రంగుటద్దాలు ధరించి లోకాన్ని అర్ధం చేసుకునే పరిమిత జ్ఞానం కాబట్టి!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2015 May 28)

Wednesday, 20 May 2015

సూర్యకాంతం సృష్టించిన సమస్య


కాలం నిరంతరంగా ముందుకు సాగిపోతుంది. సమాజం కాలానుగుణంగా మారుతుంటుంది. మార్పు అనేది సమాజ ధర్మం, సహజ గుణం. అదేవిధంగా మారుతున్న కాలాన్ననుసరించి, సమాజంలో మనం వహించాల్సిన పాత్ర కూడా మారుతూ ఉంటుంది. 

సమాజ చలన సూత్రాలు కూడా క్లిష్టంగా ఉంటాయి. అందుక్కారణం ఈ సమాజంలో మతం, కులం, వర్గం, వర్ణం, ప్రదేశం అంటూ అనేక వేరియబుల్స్ ఉండటం. అందువల్ల సమాజాన్ని ఒకే యూనిట్‌గా చేసి ఆలోచించడం సరైన విధానం కాదు. 

ఉదాహరణకి - కొన్ని కుటుంబాల్లో మద్యం పేరేత్తితేనే తప్పు. ఇంకొన్ని కుటుంబాల్లో మద్యం సేవించడం స్టేటస్ సింబల్. మరికొన్ని కుటుంబాల్లో మద్యం తాగడం కాఫీ తాగినంత చిన్న విషయం. అదే విధంగా ఆహారపు అలవాట్లు కూడా. ఇవన్నీ చిన్న విషయాలు. వీటిల్లోనే ఇంతలా తేడా వుంటే ఇక జీవన విలువల్లో ఇంకెంత వైరుధ్యాలు ఉండాలి!?

మధ్యతరగతి కుటుంబాల్లో మగపిల్లాడి కోసం (ఈనాటికీ) తపించిపోతారు. ఆడపిల్లకి లేని అనేక ప్రివిలేజెస్ అనుభవిస్తూ మగవాడు పెరిగి పెద్దవాడవుతాడు. ఉద్యోగం సంపాదించి ఒక 'ఇంటివాడు' అవుతాడు. ఇక అప్పట్నుండి అత్తాకోడళ్ళ సంవాదం మొదలౌతుంది. ఇందుకు ప్రధాన కారణం తరాల అంతరం.

అత్త తన కొడుకు కోడలితో ప్రవర్తించే తీరుని పెళ్లైన కొత్తలో తన భర్త తనతో ప్రవర్తించిన తీరుతో బేరీజు వేసుకుని ఆలోచిస్తుంది. తన భర్త కొడుకులా రొమేంటిక్ గా ఉండేవాడు కాదు. సినిమాలు, షికార్లు కాదు గదా - కనీసం సరదాగా కూడా మాట్లాడింది లేదు. ఒకప్పటి తన భర్త ప్రవర్తనతో పోల్చుకుంటే ఇవ్వాల్టి తన కొడుకు ప్రవర్తన చికాగ్గా అనిపిస్తుంది. ఈ విషయం మీద కుటుంబరావు చాలా కథలు రాశాడు. 

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ వ్యక్తైనా ఒక విషయం అర్ధం చేసుకోవాలంటే అతని రెఫరెన్స్ పాయింట్ - "నేను". 'నా'కన్నా డబ్బు ఎక్కువ ఖర్చు చేసేవాడు జల్సారాయుడు, దుబారా మనిషి. 'నా'కన్నా తక్కువ ఖర్చు చేసేవాడు లోభి, పిసినిగొట్టు. ఇలా ప్రతి విషయంలోనూ ఈ "నేను" రిఫరెన్స్ గా ఉంటుంది. ఈ పాయింటు మీద ముళ్ళపూడి చాలా జోకులు రాశాడు.

ఒక పట్టణంలో ఓ సీనియర్ డాక్టర్ వుంటాడు. ఆయన ఎప్పట్నుండో జనరల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. క్రమేణా ఊరితో పాటు డాక్టర్లూ పెరిగారు. అదే ఊరికి ఓ కుర్ర స్పెషలిస్టు డాక్టర్ వస్తాడు. కొంతకాలానికి కుర్ర డాక్టర్ పేరుప్రఖ్యాతుల్లో సీనియర్ డాక్టర్ని మించిపోతాడు. సీనియర్ డాక్టర్ ఒకప్పటి తన ప్రాముఖ్యత తగ్గడానికి కారకుడుగా కుర్ర డాక్టర్ పట్ల విముఖత పెంచుకుంటాడు. వాస్తవానికి ఇందులో కుర్ర డాక్టర్ ప్రమేయం ఏమీ ఉండదు. సరీగ్గా అతాకోడళ్ళదీ ఇదే సమస్య.

ఇప్పుడు సూర్యకాంతం గూర్చి రెండు ముక్కలు. సూర్యకాంతం మంచినటి. 1950 లలో కుటుంబ కథలతో తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు ధరించిన సూర్యకాంతం తెలుగు ప్రజల్ని మెప్పించింది. తద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ తరవాత గయ్యాళి అత్తగా ఆవిడకి స్టార్డమ్ వచ్చిపడింది.

1960 ల కల్లా సూర్యకాంతం గయ్యాళి అత్త పాత్ర ఒక బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది. సినిమా రచయితలు సులభ సాధనాలని వదులుకోరు గదా! కథా వంటకంలో కూరలో కారం వేసినట్లు.. సూర్యకాంతం పాత్రకి ప్రాధాన్యతనిస్తూ కథలు వండారు. ఈ చర్య సినిమా విజయాలకి బాగానే తోడ్పడింది గానీ, తెలుగు (మధ్యతరగతి) సమాజానికి మాత్రం నష్టం చేకూర్చింది.

మీరు 1960 సినిమాలు చూడండి. ఆ సినిమాల్లో మైనస్ సూర్యకాంతం పెద్దగా కథ ఉండదు. సావిత్రిని ముప్పతిప్పలు పెట్టటానికి దర్శకులు సూర్యకాంతాన్ని వాడుకున్నారు. ఆ రకంగా దుష్టత్వానికి ప్రతీకగా మారిన సూర్యకాంతం పాత్రలు మనకి అత్తల పట్ల భయం, ఏవగింపు కలిగించేట్లుగా చేశాయి. అలా ఒక మంచినటి ప్రతిభావంతంగా పోషించిన పాత్రల వల్ల తెలుగు సమాజంలో సోషల్ డైనిమిక్స్ ప్రభావితం అయ్యాయి.

సినిమా ఒక వినోద సాధనం. సగటు తెలుగు ప్రేక్షకుని చదువు హైస్కూల్ స్థాయి. వీరికి చిరంజీవి ఒక్క గుద్దుతో వందమందికి నెత్తురు కక్కిస్తే చూడ్డానికి కార్టూన్ సిన్మాలా సర్దాగా ఉంటుంది. ఈ నెత్తురు కక్కుడు నిజజీవితంలో సాధ్యమని అనుకునే అమాయకులెవరూ లేరు. 

శాస్త్రీయ సంగీతం నిర్లక్ష్యం చెయ్యబడిందని శంకరశాస్త్రి గొంతు చించుకుని కుంభవృష్టి తెప్పించాడు. సినిమా హాలు బయటకొచ్చిన మరుక్షణం ప్రేక్షక దేవుడు శంకరశాస్త్రి కురిపించిన భోరువర్షాన్ని మర్చిపోయాడు. ఈ శాస్త్రీయ సంగీత గోల చిరంజీవి ఫైటింగులా సినిమా హాలు వరకే పరిమితం. కానీ సూర్యకాంతం పాత్రల ప్రభావం సినిమా హాళ్ళని దాటుకుని తెలుగువారి ఇళ్ళల్లోకి వచ్చేసింది.

అత్తలు ప్రతి ఇంట్లో ఉంటారు. కోడళ్ళు అత్తలో సూర్యకాంతాన్ని దర్శిస్తారు. తలిదండ్రులు కూడా కూతుర్ని కాపురానికి పంపేప్పుడు 'మీ అత్త ముండతో జాగ్రత్త తల్లీ' అని మరీమరీ చెప్పి పంపిస్తారు. ఆ పిల్లకి ఈ హెచ్చరికల్తో టెన్షన్ మరింత పెరుగుతుంది. శత్రుదేశంలోకి అడుగెడుతున్న సిపాయిలా బిక్కుబిక్కున అత్తారింట్లోకి అడుగెడుతుంది.

అత్తకి కూడా కోడలంటే అభద్రత, అనుమానం. 'ఇన్నాళ్ళూ కొడుకు నా సొంతం. ఇవ్వాళ ఈ పిల్లకి కూడా వాటా వచ్చేసింది. నా ప్రాముఖ్యత తగ్గిపోనుందా?' మనసులో బోల్డన్ని సందేహాలు. కోడలి ప్రతి చర్యా నిశితంగా పరిశీలిస్తుంది. కఠినంగానూ ఉంటుంది. తన ప్రవర్తనని జస్టిఫై చేసుకోడానికి సూర్యకాంతాన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటుంది ('నేను' సూర్యకాంతంలా గయ్యాళిని కాదు).

అంటే - అత్తాకోడళ్లిద్దరూ తమకి తెలీకుండానే సూర్యకాంతం ప్రభావానికి లోనవుతున్నారు. తమని తాము స్టీరియో టైప్ చేసుకుని, ఎదుటివారిని కూడా అలానే చూడ్డానికి మైండ్‌ని కండిషన్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒకరిపట్ల మరొకరు మనసులో ముందే 'ప్రీ ఫిక్స్' అయిపోయ్యారు. ఇందువల్ల ఇద్దరికీ నష్టమే.

చిన్న ఉదాహరణ. కోడలు ఇల్లు చిమ్ముతుంది. గచ్చుపై ఎక్కడో కొద్దిగా ధూళి ఉండొచ్చు. అది అత్తకి నచ్చదు. చిన్న విషయమే కదాని ఆ పెద్దావిడ ఊరుకోదు. అదేదో పని ఎగ్గొట్టడానికి కోడలు వేస్తున్న ఎత్తుగా భావిస్తుంది. అంచేత కొత్తకోడలుకి పని చేతకాదని తేల్చేస్తుంది. కోడలు ఆ విమర్శని తట్టుకోలేదు (మహామహా రచయితలే విమర్శల్ని తట్టుకోలేరు. ఇంక కోడలు కుంక ఏపాటి!). 'నేను పని బాగానే చేస్తున్నాను. అమ్మ చెప్పినట్లు ఈ ముసల్ది కేవలం తన ఆధిపత్య ప్రదర్శన కోసమే నానా యాగీ చేస్తుంది.' అనుకుని చిటపటలాడిపోతుంది.

నిందితుడికి శిక్ష పడేదాకా నిరపరాధే. మంచిదని నిరూపింపబడేదాకా ఏ అత్తైనా సూర్యకాంతమే. సోషల్ సైకాలజీలో 'ఒబీడియన్స్ కాన్సెప్ట్' అని ఒకటుంది. ఉదాహరణకి జైలు అధికారులు ఖైదీలు తమపట్ల మిక్కిలి వినయంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండకపోతే వారికి కోపం వస్తుంది. అప్పుడు వారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తారు (అత్యంత క్రూరమైన జైలుహింస గూర్చి కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ఒక నవల్లో వొళ్ళు గగుర్పాటు కలిగేట్లు వివరంగా రాశాడు). దీన్నే 'ఏక్టింగ్ ఔట్' అంటారు. ఈ విషయాన్ని సోషల్ సైకాలజిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా.

వాస్తవానికి జైల్లో శిక్షననుభవించేవారు జైలు అధికారులకి శత్రువులు కారు, అలాగే అత్తాకోడళ్ళు కూడా. వారు మారుతున్న తరాలకి ప్రతీకలైన వేర్వేరు వయసుల స్త్రీలు. ఒకర్నొకరు అనుమానంగా చూసుకోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఐతే సూర్యకాంతం తెలుగువారి కుటుంబ జీవితాల్లో అనుమానాలు రేకెత్తించి సమస్యలు సృష్టించిందని నా అభిప్రాయం.

(photo courtesy :Google)