Sunday, 6 September 2015

రెండు ఫోటోలు - రెండు ఆలోచనలు


ఈ ఫొటోలో చనిపోయిన చిన్నారి బాలుణ్ని చూడండి - గుండె కలచివేయట్లేదూ? ఎర్ర టీషర్టూ, బ్లూ షార్ట్సూ, షూస్, తెల్లని మేనిఛాయతో అచ్చు దొరబాబులా.. పాపం! అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ ఫోటో చూసి చాలమందికి షాకయ్యారు. అందుకే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.


ఇప్పుడీ పాపని చూడండి. మాసిపోయిన బట్టలు, పుల్లల్లాంటి కాళ్ళూ చేతుల్తో నేలపాలైన ఆహారాన్ని ఆబగా నోట్లో కుక్కుకుంటూ ఆకలి తీర్చుకుంటుంది. ఈ రెండో ఫొటో చూస్తే మొదటి ఫొటో అంత షాకింగ్‌గా లేదు కదూ? అవును, మనని రెండో ఫొటో కదిలించదు. అంచేత ఫేస్బుక్కులో ఎవరికీ షేర్ చేసుకోం.

ఎర్రని టీషర్టు తెల్లటి పిల్లవాడు అచ్చు మన పిల్లాడిలాగే వున్నాడు. ఇంకో సౌకర్యం ఆ పిల్లాడు మన దేశానికి చెందినవాడు కాదు. ఆ రాజకీయాలు మనకి అనవసరం. మనకి జెనరల్ నాలెడ్జి, సామాజిక స్పృహ, స్పందించే గుణం వుందని మన ఫేస్బుక్ స్నేహితులకి తెలుస్తుంది. కాబట్టి షేర్ చేసుకుందాం. ఫేస్బుక్కులో అవతలివారూ ఇలాగే ఆలోచిస్తారు. కావున బోల్డన్ని లైకులొస్తాయి! బస్ - ఖేల్ ఖతం, దుకాణ్ బంద్!

వీళ్ళు - రెండో ఫొటో షేర్ చెయ్యాలని అనుకోరు. పొరబాటున షేర్ చేసినా పెద్దగా లైకుల్రావు. ఎందుకని? ఎందుకంటే - అప్పుడు భారద్దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కొన్నివర్గాలు ఇంకా దరిద్రంలోనే ఎందుకు మగ్గిపోతున్నాయి? వారిని బాగుచేస్తామని చెప్పుకుని రాజ్యాధికారం చేపట్టేవారు ఇంకాఇంకా ఎందుకు బలిసిపోతున్నారు? అన్న ఆలోచన చెయ్యాలి. అప్పుడు మనకి చాలా ఇబ్బందికర సమాధానాలొస్తయ్. ఆ సమాధానాల్ని ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మన రాజకీయ సామాజిక ఆర్ధిక అవగాహనపై ఆధారపడి వుంటుంది. 

రెండో ఫోటోలోని పిల్లలు మురికివాడల్లో కనపడుతూనే వుంటారు. ధైర్యం వుండి అడగాలే గానీ - ఆ పాప ద్వారా మనక్కొన్ని నిజాలు తెలియొచ్చు. ఆ కుటుంబం వ్యవసాయం గిట్టుబాటు కాక పూట గడవక బస్తీకి మైగ్రేట్ అయ్యిండొచ్చు. అగ్రకులాల దాడిలోనో, మతకల్లోలంలోనో కుటుంబం దిక్కు లేనిదై అక్కడ తల దాచుకునుండొచ్చు. పచ్చని పొలాల్ని కాంక్రీటు జంగిల్‌గా మార్చే అభివృద్ధిలో స్థానం కోల్పోయిన నిర్భాగ్య కుటుంబం అయ్యుండొచ్చు లేదా గనుల కోసమో, డ్యాముల కోసమో ఆవాసం కోల్పోయిన గిరిజన కుటుంబం కావచ్చు. ప్రభుత్వ పథకాలకి అందకుండా మైళ్ళ దూరంలో ఆగిపోయి ఓటర్లుగా మిగిలిపోయిన జీవచ్చవాలూ కావచ్చు.     

'నువ్వు మురికివాడల్ని రొమేంటిసైజ్ చేస్తున్నావు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొందరు సమిధలవక తప్పుదు. ఇది చాలా దురదృష్టం. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు. టీవీల్లో గంటల తరబడి సాగే ప్రవచనాలు వినడం లేదా?' అంటారా? ఓకే! ఒప్పుకుంటున్నాను. అందుచేత ప్రస్తుతానికి మనకి రెండో ఫోటో అనవసరం. హాయిగా మొదటి ఫోటో షేర్ చేసుకుందాం. మన దయాగుణాన్నీ, వితరణ శీలాన్నీ లోకానికి చాటుకుందాం. 

గమనిక -   

మొదటి ఫోటోలో చనిపోయిన బాబుకి నివాళులు అర్పిస్తూ, ఆ బాబుని మరణాన్ని ఏ మాత్రం తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదని మనవి చేసుకుంటున్నాను.

(photos courtesy : Google) 

Tuesday, 1 September 2015

చంపడమే ఒక సందేశం!


ఈ లోకమందు చావులు నానావిధములు. ప్రపంచంలోని పలుదేశాల్లో పలువురు తిండి లేకో, దోమలు కుట్టో హీనంగా చనిపోతుంటారు. కొన్నిదేశాల్లో రాజకీయ అస్థిరత, యుద్ధవాతావరణం కారణంగా పెళ్ళిభోజనం చేస్తుంటేనో, క్రికెట్ ఆడుకుంటుంటేనో నెత్తిన బాంబు పడి ఘోరంగా చనిపోతుంటారు. ఇంకొన్ని దేశాల్లో మెజారిటీలకి వ్యతిరేకమైన ఆలోచనా విధానం కలిగున్న కారణంగా హత్య కావింపబడి చనిపోతారు. 
నరేంద్ర దభోల్కర్, గోబింద్ పన్సరె, మల్లేశప్ప కల్బుర్గి.. వరసపెట్టి నేల కొరుగుతున్నారు. వీరు వృద్ధులు, వీరికి మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయ్. ఇలా ఒక విషయం పట్ల విరుద్ధమైన అభిప్రాయాలు కలిగుండటం నేరం కాదు. తమ అభిప్రాయాలని స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు రాజ్యంగం మనకి కల్పించింది గానీ అందుకు మనం అనేకమంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి.
సౌదీ అరేబియాలో మతాన్ని ప్రశ్నించడం తీవ్రమైన నేరం. శిక్ష కూడా అత్యంత పాశవికంగా అమలవుతుంది. ఇదంతా వారు తమ రాజ్యాంగంలోనే రాసుకున్నారు. కనుక సౌదీ అరేబియా ప్రభుత్వం ఎటువంటి మొహమాటాలు లేకుండా దర్జాగా, ప్రశాంతంగా, పబ్లిగ్గా తన శిక్షల్ని అమలు చేసేస్తుంది. సౌదీకి అమెరికా మంచి దొస్త్. దోస్తానాలో దోస్త్‌లు ఎప్పుడూ కరెక్టే. అందుకే అమెరికా సౌదీ అరేబియా క్రూరమైన శిక్షల్ని పట్టించుకోదు!
సౌదీ అరేబియా శిక్షలు అనాగరికమైనవనీ, ప్రజాస్వామ్యంలో అటువంటి కఠినత్వానికి తావు లేదని కొందరు విజ్ఞులు భావిస్తారు. అయ్యా! ప్రజాస్వామ్య దేశాల్లో కూడా విపరీతమైన భౌతిక హింస, భౌతికంగా నిర్మూలించే శిక్షలు అమలవుతూనే వుంటాయి. కాకపొతే అవి అనధికారంగా అమలవుతాయి. ఎందుకంటే – ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న ఈ దేశాలకి కూసింత సిగ్గూ, బోల్డంత మొహమాటం!
మతాన్ని ప్రశ్నించిన వారిని చంపడం ఎప్పుడూ కూడా ఒక పధ్ధతి ప్రకారమే జరుగుతుంది, కాకతాళీయం అనేది అస్సలు వుండదు. బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు బ్లాగర్లని వేదికి వెదికి వేటాడి మరీ నరికేస్తున్నారు. పాకిస్తాన్లో పరిస్థితీ ఇంతే. శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రశ్నించినవారూ ఖర్చైపొయ్యారు! ఇక క్రిష్టియన్ మతం హత్యాకాండకి శతాబ్దాల చరిత్రే వుంది. ఇవన్నీ స్టేట్, నాన్ స్టేట్ ఏక్టర్స్ కూడబలుక్కుని చేస్తున్న నేరాలు. అంచేత ఈ నేరాల్ని స్టేట్ విచారిస్తూనే వుంటుంది. సహజంగానే నిందితులెవరో తెలీదు, కాబట్టి కేసులూ తేలవు.
దక్షిణ ఆసియా దేశాల్లో మెజారిటీకి వ్యతిరేకంగా డిఫరెంట్ అభిప్రాయాల్ని కలిగున్నవారిని గాడ్‌ఫాదర్ సినిమా టైపులో పద్ధతిగా ఎలిమినేట్ చేస్తుండడం అత్యంత దారుణం. ఇటువంటి హత్యలు అరుదుగా జరిగే సంఘటనలేనని, వీటికి స్టేట్‌తో సంబంధం లేదని కొందరు వాదించవచ్చు. కానీ – ఈ హత్యలు పౌరసమాజానికి స్టేట్ పంపుతున్న ఒక సందేశంగా చూడాలని నా అభిప్రాయం. ఈ హత్యలు జరిగిన దాని కన్నా ఆ తరవాత దర్యాప్తు సంస్థలు చూపించే నిర్లిప్తతని పరిశీలించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవల్సిందిగా నా విజ్ఞప్తి.
ఇంకో విషయం – ఈ హత్యలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ‘మతాన్ని కించపరిచే ఎవరికైనా ఇదే శిక్ష’ అంటూ హత్యకి సపోర్ట్ చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న వ్యాఖ్యలు వెన్నులో వణుకు తెప్పిస్తున్నయ్! దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!
మరీ హత్యల వల్ల ప్రయోజనం?
సమాజంలో ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు, ప్రాణాలకి తెగించి ఎవరూ రాయరు, మాట్లాడరు. అంచేత వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2015 సెప్టెంబర్ 1)