Wednesday, 11 November 2015

ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)


అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం. అవ్విధముగా - ప్రవాహంలో బెండుముక్క కొట్టుకుపోయినట్లు స్నేహితుల్తో అనేక సినిమా చూశాను. అప్పుడప్పుడు ఆ రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటాను, ఆశ్చర్యపోతాను. 

ఒకరోజు 'స్వాతిముత్యం' అనే సినిమాకి వెళ్లాం. హీరో వెర్రిబాగులోడు (పాపం). అతన్ని పెంచి పెద్దచేసిన ముసలామె చచ్చిపోయి అందరూ ఏడుస్తుంటే - ఆకలేస్తుందని అడిగి మరీ అన్నం పెట్టించుకుని తింటాడు. అతగాడు mentally retarded కదా? కాబట్టి అతనలా అన్నం తినడం దర్శకత్వ ప్రతిభే. 

హీరోయిన్ వెధవరాలు. భర్త పోయిన పుట్టెడు దుఃఖంతో (వితంతువులు ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే వుండాలని మన సినీమేధావులు భానుమతి 'బాటసారి' రోజుల్నుండే నిర్ణయించేశారు, మనమూ అలవాటు పడిపోయ్యాం), ఒక ఎల్కేజీ వయసు పిల్లాడితో బ్రతుకు వెళ్లమారుస్తూ వుంటుంది (మళ్ళీ ఇంకోసారి 'పాపం').

రాముడి గుళ్ళో యేదో కార్యాక్రమం జరుగుతుంటే - మన బుర్ర తక్కువ హీరో హడావుడిగా ఆ దుఃఖపు వితంతువుకి తాళి కట్టేస్తాడు. వాస్తవానికి ఒక స్త్రీకి ఎవడో అపరిచితుడు హఠాత్తుగా తాళి కట్టేస్తే నాలుగు బాది పోలీసు రిపోర్టు ఇస్తుంది. కానీ ఇది తెలుగు సినిమా! పైగా - ఆ స్త్రీ ఒక దుఃఖవితంతువాయె! దర్శకుడు హీరోగారిది ఆదర్శంగా highlight చేస్తాడు! హీరోయిన్ కూడా యే వెర్రిబాగులోడైతేనేం తాళి కట్టాడు, అంతే చాలన్నట్లుగా వుంటుంది.

సరే! తెలుగు సినిమా రాజకీయ నాయకుల ప్రజాసేవలాగా అర్ధం పర్ధం లేకుండా వుంటుంది. కావున - సినిమా చూస్తూ కూర్చున్నాను (అంతకన్నా చేసేదేమీ లేదు). ప్రేక్షకుల అదృష్టం బాగుండి హీరోయిన్ చచ్చిపోతుంది. అప్పుడు మన అజ్ఞాన హీరో చాలా సెంటిమెంటల్‌గా అయిపోతాడు (ఇప్పుడు మాత్రం అన్నం తినడు)!

సినిమా ఫస్టాఫ్‌లో ముసలామె చచ్చిపోయినప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! అవును, అలనాడు 'అర్ధాంగి'లో సావిత్రి కూడా తన ప్రేమతో నాగేశ్వర్రావు IQ score పెంచింది. ఈ రోజుల్లో మగవాడికి పెళ్ళైతే వున్న తెలివి తెల్లారిపోతుంది గానీ - ఆ రోజుల్లో వేరుగా వుండేది. అది భర్తల స్వర్ణయుగం. అందుకే - 'పెళ్ళైతే పిచ్చి కుదుర్తుంది' అనే సామెత వచ్చింది.

సినిమా అయిపోంగాన్లే హాలు పక్కనే వున్న హోటల్లో రవ్వట్టు తిన్నాం, బాగుంది.

"సినిమా ఎలా వుంది?" కాఫీ తాగుతూ అడిగాను.

నా స్నేహితులు అనేక సినిమాలు చూసిన విజ్ఞులు. అంచేత నా ప్రశ్నకి ముక్తకంఠంతో సమాధానం చెప్పారు.

"సినిమా ఎలా వుంటే మాత్రం మనకెందుకు? తీసేవాళ్ళు తీస్తారు, చూసేవాళ్ళు చూస్తారు. వాళ్ళేమన్నా మనకి బొట్టూ కాటుక పెట్టి 'మా సినిమా చూడగా రారండీ!' అని పిల్చారా? లేదు కదా? మనకి పనీపాటా లేక సినిమాకొస్తాం. నచ్చితే కళ్ళు తెరుచుకుని సినిమా చూస్తాం, నచ్చకపోతే కళ్ళు మూసుకుని ఓ కునుకు తీస్తాం. అంతే!"

అవును, అంతే! 

(picture courtesy : Google)