Tuesday 21 June 2016

యోగాసనాలు


"యోగాసనాల వల్ల ఉపయోగం వుందా?" పేషంట్లు తరచుగా అడిగే ప్రశ్న ఇది. 

"చేస్తే చెయ్యండి. చేసినందువల్ల నష్టం లేదు." ఇది నా స్టాండర్డ్ సమాధానం. 

నేనెప్పుడూ ఆసనాలు వెయ్యలేదు. అప్పుడెప్పుడో టీవీలో ఒకసారి చూశాను. ఒక వృద్ధుడు వివిధభంగిమల్లో కాళ్ళూ చేతులూ మడత పెడుతూ, ఘాట్టిగా గాలిపీల్చి వదుల్తున్నాడు. ఆయన అలా చేయడాన్ని ఆసనాలు అన్నాడు గానీ, అవి కేవలం స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు మాత్రమే!

బరువు తగ్గాలంటే రోజువారీగా కేలరీలని ఖర్చు పెట్టాలి. కొంత డైటింగ్ ద్వారా, ఇంకొంత వ్యాయామం ద్వారా కేలరీల్ని మైనస్ చెయ్యొచ్చు. నడవడం, పరిగెత్తడం, టెన్నిస్, స్విమ్మింగ్ మొదలగు ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా కేలరీల్ని ఖర్చు చెయ్యొచ్చు.

యోగాసనాలు చేస్తే ఎక్కువరోజులు బ్రతుకుతారా? ఇందుకు ఋజువుల్లేవు, చాలామంది యోగా గురువులే రోగగ్రస్తులై వున్నారు. ముప్పైయేళ్ళగా క్రమం తప్పకుండా యోగాసనాల్ని వేస్తున్న మా మేనమామ, ఆసనాల వల్ల తన మనస్సు ప్రశాంతంగా ఉందంటాడు. ఏనాడూ ఆసనం వెయ్యని నా మనసు కూడా ప్రశాంతంగానే ఉంటుంది!
       
మనది పేదదేశం. అత్యధికులకి తింటానికి తిండి లేదు. పోషకాహార లోపాల్తో మన పిల్లలు ఆఫ్రికా దేశస్తులతో పోటీ పడుతుంటారు. మెజారిటీ ప్రజలు పొలం పనులు చేసుకుంటారు. పన్లేనప్పుడు బీడీలో, చుట్టలో కాల్చుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి ఆసనాలు అనవసరం.

డబ్బున్నవాడు ట్రాక్ సూట్ వేసుకుని రోజూ జిమ్ముతుంటాడు, ఏరోబిక్సంటూ ఎగురుతుంటాడు. కొందరు తెలివైనవాళ్ళు డబ్బు ఖర్చు కాకుండా వ్యాయామం చేసే ఆలోచన చేస్తారు. దాని ఫలితమే ఉచిత యోగాసనాల క్యాంపులు. ఈ యోగా క్యాంపుల్లో ఎంట్రీ ఫీజు ఒక్కరూపాయి పెట్టినా ఎవరూ వెళ్ళరని మా సుబ్బు చెబుతుంటాడు. 

యోగాసనాలు శరీరానికి చాలా మంచిది అని శాస్త్రబద్దంగా స్టడీ చేశారని కొందరు వాదిస్తారు. అవును, ఆసనాల గూర్చి కొన్ని స్టడీస్ వున్నాయి. నాకయితే అవి 'చేసినట్లు'గా అనిపించలేదు. 'రాసినట్లు'గా తోస్తుంది.  ఇక సైకాలజీ విషయానికొస్తే జాకబ్సన్ అనే ఆయన PMR (progressive muscle relaxation) అనే టెక్నిక్ చెప్పి ఉన్నాడు. కానీ ఆ టెక్నిక్కీ, మన ఆసనాలకీ సంబంధం లేదు. 

ఆసనాలని తెల్లతోలు దేశాలవాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనీ, ఇదొక అంతర్జాతీయ గుర్తింపనీ చంకలు కొట్టుకోనక్కర్లేదు. అజ్ఞానం అంతర్జాతీయం, కానీ మనకి మాత్రం తెల్లతోలు జ్ఞానానికి చిహ్నం! ఈ సంగతి గ్రహించిన ఆధ్యాత్మిక వ్యాపారంగాళ్ళు తెల్లతోలుగాళ్ళని భక్తులుగా ముందు వరసలో కూర్చోబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

నన్ను నా పేషంట్లు అడిగేది 'వైద్యుడి'గా నా అభిప్రాయం మాత్రమే. నా సమాధానం కూడా వైద్యుడిగానే వుండాలి గానీ, నాకు నమ్మకం లేని ఆసనాల గూర్చి సలహా ఎలా ఇవ్వాలి? ఏం ఇవ్వాలి? మన్దేశంలో డాక్టర్లకి 'తెలీదు' అని చెప్పే సదుపాయం లేదు. 

"డోంట్ వర్రీ, వాళ్ళలా అడిగేది మన సమాధానం వినాలనే కుతూహలంతోనే. మందులతో సరైన రెస్పాన్స్ రాకపోతే, ఆ నెపం ఆసనాల మీదకి నెట్టేసే సౌలభ్యం కూడా మనకి వస్తుంది. కాబట్టి ఆసనాలు వేసుకొమ్మని చెబితేనే మనకి సేఫ్." అని నా వైద్యమిత్రులు అంటుంటారు. నిజమే! 

"ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో యోగాసనాలు వెయ్యకపోతే వచ్చే ప్రమాదం కన్నా యోగాసనాల గూర్చి సందేహం వ్యక్తం చెయ్యడం వల్ల వచ్చే ప్రమాదమే ఎక్కువ." అంటాడు సుబ్బు. ఇదీ నిజమే!

(edited version of an earlier post)

Thursday 16 June 2016

పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!


మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే పాలకులు. ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగినవారెవరైనా సరే – ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు, గెలవచ్చు. ప్రజలకి పజ్జెనిమిదేళ్ళు నిండగాన్లే ఓటుహక్కు వస్తుంది, ఈ హక్కుతో వారు ప్రజాప్రతినిథుల్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రభుత్వాల్ని యేర్పాటు చేస్తారు. ఇంత పారదర్శకమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంకోటి వున్నట్లు నాకైతే తెలీదు.

మన్దేశంలో రాజ్యం అనుక్షణం ప్రజల సంక్షేమం గూర్చే తపన పడుతుంటుంది. అందువల్ల ప్రజలు తమగూర్చి తాము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం యేది తినాలో, యేది తినకూడదో పాలకులే నిర్ణయిస్తారు. ఇది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని మీరు అర్ధం చేసుకోవాలి. ఓటేసే హక్కుంది కదాని యేదిబడితే అదితింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాలకులకి ప్రజలు బిడ్డల్లాంటివారు. మనం మన పిల్లల మంచికోసం జాగ్రత్తలు తీసుకోమా? ఇదీ అంతే!

ఇక సినిమాల సంగతికొద్దాం. ఈ దేశంలో సామాన్యుల వినోద సాధనం సినిమా. తినేతిండి విషయంలోనే సరైన అవగాహన లేని ప్రజలకి యేం చూడాలో యేం చూడకూడదో మాత్రం యెలా తెలుస్తుంది? తెలీదు. అందుకే ప్రజలకి మంచి సినిమాలు మాత్రమే చూపించేందుకు పాలకులు ‘సెన్సార్ బోర్డ్’ అని ఒక సంస్థ నెలకొల్పారు. ఇందుగ్గాను మనం ప్రభుత్వాలకి థాంక్స్ చెప్పాలి.

‘సినిమా చూసే విషయంలో ఒకళ్ళు మనకి చెప్పేదేంటి?’ అని ఈమధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అనార్కిస్టులు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? మన మంచి కోసమేగా? ఇదీ అంతే! ఆ తెలుగు సినిమావాళ్ళని చూడండి.. బుద్ధిగా రూల్స్ పాటిస్తూ పాటలు, ఫైట్సు, పంచ్ డైలాగుల్తో మాత్రమే సినిమా తీసేస్తారు. ఒక్క తెలుగు సినిమానైనా సెన్సారువాళ్ళు అభ్యంతర పెట్టారా? లేదు కదా! అంటే ట్రాఫిక్ రూల్సు పాటించనివారి వాహనం సీజ్ చేసినట్లే.. సమాజం, సమస్యలు అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాల్ని మాత్రమే సెన్సారువాళ్ళు ఆపేస్తున్నారు.

అసలు సెన్సార్ బోర్డ్ అంటే యేంటి? అమాయకులైన ప్రజలు యేదిపడితే అది చూసి చెడిపోకుండా వుండేందుకు ప్రభుత్వంవారిచే నియమింపబడ్డ సంస్థ అని ఇందాకే చెప్పుకున్నాం. సెన్సారు బోర్డులో దేశం పట్ల, దాని బాగోగుల పట్లా అవగాహన కలిగినవారు మాత్రమే సభ్యులుగా వుంటారు. వారు మిక్కిలి నీతిపరులు, జ్ఞానులు, మేధావులు. కనుకనే రాముడి కోసం శబరి ఫలాల్ని ఎంగిలి చేసినట్లు, అన్ని సినిమాల్ని ముందుగా చూస్తారు. ఆపై మనం యేది చూడొచ్చో, యేది చూడకూడదో వడపోస్తారు (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, కొద్దిసేపు ఆగుతాను).

ఈ విధంగా దేశసేవలో పునీతమవుతూ ప్రశాంతంగా వున్న సెన్సార్ బోర్డుకి అనురాగ్ కాశ్యప్ అనే తుంటరివాడు తగిలాడు. ఆ అబ్బాయి వర్తమాన సాంఘిక సమస్యల ఆధారంగా వాస్తవిక సినిమాలు తీస్తాట్ట. దేశమన్నాక సమస్యలుండవా? వుంటాయి, వుంటే యేంటి? అవన్నీ చూపించేస్తావా? ఒకప్పుడు సత్యజిత్ రే అని ఓ దర్శకుడు వుండేవాడు, ఆయనా అంతే! భారద్దేశం పేదరికాన్ని ప్రపంచానికంతా టముకు వేసి మరీ చూపించాడు. ఆయనకి ఎవార్డులొచ్చాయి, మన్దేశానికి మాత్రం పరువు పోయింది! సమస్యలు ఎవరికి మాత్రం లేవు? మాంసం తింటామని బొమికలు మెళ్ళో వేసుకుని తిరుగుతామా!

ఆ అనురాగ్ కాశ్యపో, హిరణ్యకశ్యపో.. ఆ కుర్రాడి సినిమాకి సెన్సార్ బోర్డు బోల్డెన్ని కట్స్ చెప్పిందట, సినిమా పేరులో ‘పంజాబ్’ తీసెయ్యమందిట. ఇందులో అన్యాయం యేమిటో మనకి అర్ధం కాదు – సెన్సారు బోర్డు వుంది అందుకేగా! పైగా ఆ కుర్రాడు ఒక ఇంటర్వూలో – “పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత చాలా నష్టపోతుంది. ఒక సమస్యని గుర్తించడంలో సమస్యేంటి?” అని ప్రశ్నించాడు. అంటే ఒక సమస్య వుంటే, దానిమీద యెడాపెడా సినిమాలు తీసేస్తావా? దేశం పరువు బజార్న పడేస్తావా? ఇప్పుడు నీలాంటివాళ్ళ ఆటలు సాగవ్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం వచ్చేసింది.

మా పక్కింటాయనకి ముంజేతి మీద యేదో మచ్చ వుంది, ఆయన దాన్ని ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకుని కవర్ చేసుకుంటాడు. మా ఎదురింటాయన తెల్లజుట్టుకి రంగేసుకుంటాడు! వాళ్ళ అందానికొచ్చిన ఇబ్బందుల్లాంటివే దేశానికీ వుంటాయి. నీ సినిమాలు యే సౌదీ అరేబియాలోనో తీసిచూడు, దూల తీరిపోతుంది. ఎంతైనా – మన్దేశంలో ఫ్రీడమాఫ్ ఎక్స్‌ప్రెషన్ మరీ ఎక్కువైపోయింది, అందుకే దేశాన్ని విమర్శించడం ఈమధ్య ప్రతివాడికి ఓ ఫేషనైపోయింది.

సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు విదేశీ ఏజంట్లు. పవిత్రమైన సెన్సారు వ్యవస్థని కాపాడుకోకపోతే మన దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. హీనమైన పాశ్చాచ్య సంస్కృతిని వొంటబట్టించుకున్న కుహనా మేధావులు మన్దేశంలో చాలా సమస్యలున్నట్లు చూపించేస్తారు, అతంతా నిజమని అమాయక ప్రజలు నమ్మేస్తారు. చివరాకరికి ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తున్న పాలక వర్గాలపైన నమ్మకం కోల్పోతారు. ఇలా జరగకుండా దేశభక్తులమైన మనం ప్రతిఘటించాలి.

భారత సెన్సార్ బోర్డుకి ప్రస్తుత హెడ్ శ్రీమాన్ పెహ్లాజ్ నిహలానిగారు. ఆయన భారతీయ సంస్కృతి పరిరక్షణకి కంకణం కట్టుకున్న వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. సినిమా సెన్సార్ విషయాల్లో చంఢశాసనముండావాడు. అందుకే కాశ్యప్‌గాడికి జెల్ల కొట్టాడు. ఆ మేరకు ఒక సందేశం ఆల్రెడీ ఈ సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాగాళ్ళకి చేరిపోయింది, ఇక ఇట్లాంటి జాతివ్యతిరేక సినిమాలు తియ్యాలంటే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అసలు వీళ్ళెందుకు పాజిటివ్ సినిమాలు తియ్యరు? చాయ్ అమ్మిన ఒక మహానుభావుడు ప్రధాని అయ్యాడు. ఈ ఆలోచనే గొప్ప ఉత్తేజాన్నిస్తుంది! ఇట్లాంటి గొప్ప కథాంశంతో యే వెధవా సినిమా తియ్యడు, ఇది మన దురదృష్టం. 

సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు దేశద్రోహులని కూడా నా అనుమానం. సెన్సారే లేకపోతే విపరీతంగా బూతు సినిమాలు వచ్చేస్తాయి, యువకులంతా రేపిస్టులుగా మారిపోతారు. ఆడవాళ్ళల్లో పతిభక్తి తగిపోతుంది, బరితెగించిపోతారు. సీతామహాసాధ్వి జన్మించిన ఈ పుణ్యభూమి విచ్చలవిడి భూమిగా మారిపోతుంది.

ఇంకో ముఖ్య విషయం – సెన్సార్ బోర్డు వల్లనే సాంఘిక సమతుల్యత రక్షించబడుతూ వస్తుంది. అదే లేకపోతే – దళితుల సమస్యని హైలైట్ చేస్తూ కారంచేడు, చుండూరు మారణకాండల మీద సినిమాలొస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ సంపదల లూటీకి అడ్డుగా వున్న ఆదివాసీల దారుణ అణచివేతపై సినిమాలొస్తయ్. ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతే దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి.

సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. సెడిషన్ యాక్ట్ (1870) లాగే సినిమాటోగ్రాఫ్ చట్టం కూడా నిత్యనూతనమైనది! ఈ పురాతన చట్టాల్ని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, వీరిని పట్టించుకోరాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. మన కంట్లో మనమే ఎలా పొడుచుకుంటాం!

పోలీసులంటే దొంగలకి పడదు. కానీ – పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, సమాజ రక్షకులు. సెన్సార్ బోర్డూ అంతే! అంచేత – తనకి అప్పజెప్పిన బాధ్యతల్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పూజ్య పెహ్లాజ్ నిహలానిగారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్! గో ఎహెడ్, వుయార్ విత్ యు సర్! 

చివరి మాట –

ఈ రచనకి స్పూర్తి – “పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు” అని డిక్లేర్ చేసి ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త!’ కథ చెప్పిన కిరీటిరావు.  

(ప్రచురణ - 'సారంగ' వెబ్ మేగజైన్ 2016 జూన్ 16)