Showing posts with label ఘంటసాల. Show all posts
Showing posts with label ఘంటసాల. Show all posts

Sunday, 11 December 2016

ఈ విగ్రహం ఘంటసాలదేనా?!


మా గుంటూరు నాజ్ సెంటర్లో పంచరంగుల్లో ఒక విగ్రహం ఉంది. ఒళ్ళో వీణతో కూర్చుని సంగీత సాధన చేస్తున్న యెవరో పెద్దమనిషి విగ్రహం అది. చాలాసార్లు ఆ విగ్రహం యెవరో తెలిసిన వ్యక్తిదిలా అనిపించేది. ఆవిధంగా అనేకసార్లు చూశాక, చివరాకరికి ఆ విగ్రహం యెవర్దో గుర్తుపట్టాను. అది ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం!

నేను ఘంటసాల పాటల్ని ఇష్టంగా వింటాను. ఘంటసాల ఫోటోలు చాలానే చూశాను. నాకు కంటిచూపు బానే ఉంది, బుర్రా బానే పన్జేస్తుంది. అయినా - ఘంటసాల విగ్రహాన్ని ఎందుకు గుర్తు పట్టలేకపొయ్యాను! 

సినిమా ఒక 'కళ' అంటారు గానీ, వాటిని తీసేవాళ్ళు మాత్రం 'మాది వ్యాపారం మాత్రమే' అనే అరిచి మరీ చెబుతుంటారు. సినిమా అనేది పూర్తిగా దర్శకుడి మీడియం. దర్శకుడి సూచనల మేరకు సన్నివేశానికి తగ్గట్టు పాటని ట్యూన్ చేసుకున్న సంగీత దర్శకుడు.. ఆ పాటని గాయకుల్తో పాడిస్తాడు.  

నువ్వు గొప్ప గాయకుడివి కావచ్చు. కానీ సినిమాకి పాడాలంటే ఆ సినిమాలో పాత్ర త్రాగుబోతో, తిరుగుబోతో, దొంగో.. ఇలా యెవరైనా కావచ్చు.. వారి కంఠం నుండి వస్తున్నట్లుగా పాడాలి. ఇదే సినిమా టెక్నిక్. ఈ కారణాన - రఫీ, కిశోర్, ఘంటసాల వంటివారు మాత్రమే గొప్ప సినిమా గాయకులు కాగలిగారు.  

సినిమా సంగీతానికీ, శాస్త్రీయ సంగీతానికీ చాలా తేడా ఉంటుంది. శాస్త్రీయ సంగీతం వన్ మ్యాన్ షో లాంటిది. అక్కడ ఆ గాయకుడే ఒక బ్రాండ్. నాలాంటి అజ్ఞానికి ఆ పాడే వ్యక్తి చలికి గజగజా వణుకుతున్నట్లుగా, జీళ్ళపాకంలా సాగదీస్తూ పాడుతున్నట్లుగా అనిపించినా.. అక్కడ వినేవాళ్ళు వేళ్ళతో యేవో లెక్కలు వేసుకుంటూ, తల ఊపుతూ ఆనందిస్తుంటారు. మంచిది, యెవరి ఆనందం వారిది!  

సినిమా సంగీతానికి సన్నివేశం ప్రాణం. మంచి గాయకుడు గొప్పగా పాడి - సన్నివేశాన్ని, సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తాడు. ఘంటసాల పాడిన పాటలు, కూర్చిన బాణీల వల్లే కొన్ని సాధారణ సినిమాలు అసాధారణ విజయం సాధించాయి. 

షావుకారు, పెళ్ళిచేసిచూడు, దేవదాసు, మాయాబజార్, లవకుశ, జయభేరి, మూగమనసులు.. ఇలా అనేక సినిమాల్లో ఘంటసాల పాటలే గొప్పబలం. త్రాగుబోతు పాడుకున్న 'కుడియెడమైతే పొరబాటు లేదోయ్', ఉత్తర కుమారుడు పాడిన 'సుందరి నీవంటి దివ్యస్వరూపము' వంటి పాటలు ఘంటసాల కెరీర్లో చాలా ముఖ్యమైనవి. 

అయితే - మన తెలుగువాళ్ళల్లో ఒక జబ్బుంది. వీళ్ళు సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతం వెతుకుతుంటారు. అందుకే వీళ్ళకి 'రసికరాజ తగువారము కాదా', 'శివశంకరి శివానందలహరి' వంటి శాస్త్రీయ సంగీతాన్ని ఆధారం చేసుకున్న పాటల్ని గొప్పపాటలుగా మెచ్చుకుంటారు. కానీ - సినిమా పాటల పర్పస్ ఇదికాదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా పాడటమే సినిమా సంగీతం. 

ఘంటసాల యేవో కొన్ని ప్రైవేట్ సాంగులు, భగవద్గీత లాంటివేవో పాడినా.. నాకవేవీ నచ్చలేదు. నాకు సినిమాలో హీరో ఇష్టం, ఆ హీరోకి పాడిన ఘంటసాల ఇష్టం. నేను ఘంటసాలని 100% సినిమా పాటల గాయకుడు మాత్రమే అభిమానిస్తాను! 

తన సినిమా పాటలతో ఎందరో అభిమానాన్ని సంపాదించిన ఘంటసాలకి ఒక విగ్రహం పెడదామనుకున్నప్పుడు.. ఆయన విగ్రహం యెలా ఉండాలి? ఘంటసాలలాగే ఉండాలి. కానీ - మన తెలుగువాళ్ళు త్యాగయ్య, అన్నమయ్యల విగ్రహాల టైపులో ఘంటసాలకి చేతిలో వీణా, తంబురా పెట్టేసి గౌరవించేశారు! అంటే వీళ్లు సినిమా పాటలు పాడిన ఘంటసాల్ని శాస్త్రీయ సంగీత విద్వాంసుడిగా మార్చేశారు!

సరే! ఈ విగ్రహాలు యేర్పాటు చేసేవాళ్లూ, మీటింగులు పెట్టి ఘంటసాలని పొగిడేవాళ్ళూ 'బోఫోర్స్ బ్యాచ్' అని మా సుబ్బు అంటాడు. కాబట్టి ఘంటసాల విగ్రహం చేతిలో తంబూరా వున్నా లేకపోయినా ఘంటసాల పాడిన సినిమా పాటలకి అభిమానినైన నాలాంటివాళ్ళకీ పొయ్యేదేం లేదు. కాబట్టి ఆ విషయం 'శాస్త్రీయ సంగీత ఘంటసాల' అభిమాన సంఘాలకి వదిలేద్దాం. 

నాకు నచ్చిన ఘంటసాల పాటొకటి ఇస్తున్నాను, ఎంజాయ్ చెయ్యండి. 

(picture courtesy : Google)

Monday, 28 January 2013

ఘంటసాల పాటొచ్చింది.. గేరు మార్చు!


"గురూ గారు!"

"ఏమి శిష్యా?"

"మీరీమధ్య ఘంటసాల భజన చేస్తున్నరెందుకు?"

"పిచ్చివాడా! బ్లాగులున్నదే భజన చేసేందుకు! నాకు నచ్చినవి నా బ్లాగులో రాసుకోకపోతే ఇంకెక్కడ రాసుకోమంటావ్? నీ ఇంటి గోడమీద రాయమంటావా?"

"ఆ పని మాత్రం చెయ్యకండి. మొన్ననే సున్నం కొట్టించాను. మీరీమధ్య 'ఘంటసాలా! ఓ ఘంటసాల!' అంటూ ఒక టపా రాశారు. ఘంటసాల పాట సినిమా కథని ఎలివేట్ చేస్తుందన్నారు. కథని ముందుకు నెడుతుందన్నారు. నాకైతే మీ రాత కొద్దిగా 'అతి' అనిపించింది."

"నీకలా అనిపించిందా శిష్యా! సర్లే! ఇలా వచ్చి నా పక్కన కూర్చో. నీకిప్పుడో యూట్యూబ్ విడియో చూపిస్తాను. శ్రద్ధగా మనసు పెట్టి చూడు. అప్పుడుగానీ నీకు సత్యం బోధపడదు."

"చూడక తప్పదంటారా?"

"తప్పదు గాక తప్పదు. ముందుగా ఈ 'దేవదాసు' పాట చూడు. పార్వతికి పెళ్ళైపోయింది. దేవదాసుకి ఇంక అంతా అంధకారమే! 'నెరవేరని ఈ మమకారాలేమో.. ' అంటూ ఘంటసాల గానం రాబోయే ఘోరమైన, దుర్మార్గమైన ఏడుపు సన్నివేశాలకి ప్రేక్షకుల మూడ్‌ని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఈ పాట లేకుండా దేవదాసు తాగుడు మొదలెట్టేస్తే ప్రేక్షకులకి దేవదాసు పట్ల సానుభూతి అంతగా ఉండేది కాదు."




"చూశావు గదా! సినిమా టెక్నిక్ పట్ల ఎంతో అవగాహన, వాయిస్ మీద గొప్ప కంట్రోల్ ఉంటే తప్ప స్వరంలో అంత దుఃఖం పలకదు శిష్యా! దటీజ్ ఘంటసాల. ఏమంటావు?"

"కాదంటే మీరూరుకోరుగా!"

"ఋజువు చూపినా కూడా నీ బుర్రలో జ్ఞానద్వారాలు తెరుచుకోవట్లేదేమి శిశువా? అయితే ఇప్పుడు 'దొంగరాముడు' పాట చూడు. పాటలోనే కొంతకథ నడిపించేశాడు కె.వి.రెడ్డి. కాబట్టి సన్నివేశాలకి క్లుప్తత వచ్చింది. ఇటువంటి సారోఫుల్, బ్యాక్ గ్రౌండ్ పాటల్ని అనేక సినిమాల్లో ఘంటసాల రోట్లో వేసి చితక్కొట్టేశాడు. చపాతి పిండిలా పిసికేసాడు."



"ఎలా ఉంది?"

"గురూ గారు! నాకు సావిత్రి భలేగుంది."

"శిష్యా! నీకు విషయం మీద ఫోకస్ లేదు. అందుకే ఘంటసాలని వదిలేసి సావిత్రిని చూశావు. ఆడలేడీసుపై నీ దృష్టి మరలే అవకాశం లేకుండా ఇప్పుడు నీకు స్త్రీ పాత్ర లేని 'ఆత్మబంధువు' పాట చూపిస్తాను. చూడు."

"బాబోయ్! ఇప్పుడింకో పాట చూళ్ళేను. ఒప్పుకుంటున్నాను. ఘంటసాల గొప్పగాయకుడు."

"ఈ ముక్క నీ హృదయంలోంచి తన్నుకుంటూ రావాలి, నోట్లోంచి కాదు. ఈ 'ఆత్మబంధువు' పాట చూస్తే ఘంటసాల ఘనతేమిటో నీకే అర్ధమౌతుంది."




"గురూ గారు! నాదో డౌటు. అసలు సిన్మా మధ్యలో ఈ బ్యాక్ గ్రౌండ్ పాట లెందుకు? హాయిగా డ్యూయెట్లతో సిన్మా లాగించెయ్యొచ్చుగా?"

"మంచి ప్రశ్నడిగావు! పూర్వం సిన్మాల్లో కథ ఉండేది. మోటార్ సైకిల్ నడిపేప్పుడు క్లచ్‌తో ఎక్కువసేపు పనుండదు. కానీ మోటర్ సైకిల్ డ్రైవింగులో క్లచ్ అత్యంత ముఖ్యమైనది. అది లేకండా గేర్లు మార్చలేం. క్లచ్ నొక్కి గేరు మార్చినట్లు.. పాత సినిమాల్లో దర్శకులు 'ఘంటసాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్' అనే క్లచ్ నొక్కి కథకి గేర్లు మార్చేవాళ్ళు. నువ్వీ సినిమాలు పూర్తిగా చూస్తేగాని ఈ పాటల పరమార్ధం తెలీదు."

"అద్సరే గానీ.. ఈ పాటలు ఇంత బాగా ఇంకెవరూ పాడలేరంటారా?"

"పాడలేకేం? పాడతారు. అయితే.. ఘంటసాల తప్ప ఇంకెవరు పాడినా ఆ పాట ఏడిపించేట్లు ఉండదు. ఏడిసినట్లుంటుంది. అదీ విషయం."

"ఏంటో గురూ గారు! మీరేమో ఇంత నిక్కచ్చిగా చెబుతున్నారు. ఈ సంగతులే నేను బయట చెబుతుంటే నా స్నేహితులకి కోపమొస్తుంది."

"ఓరి పిచ్చి నాగన్నా! అందరి మనోభావాలు గౌరవిస్తూ కూర్చోడానికి నువ్వేమన్నా కాంగ్రెస్ హై కమాండువా? 'కాఫీ రుచి కషాయం కన్నా మిన్న' అని చెబితే కొందరు కషాయ ప్రేమికుల మనోభావాలు దెబ్బతినొచ్చు. అంతమాత్రాన మన అభిప్రాయాలు చెప్పకుండా ఎలా ఉంటాం?"

"అవును గదా!"

"అవును. ఇకనుండీ నిన్ను ఎవరేమన్నా పట్టించుకోకు. ఘనమైన ఘంటసాల గానం గూర్చి గళమెత్తి గర్జించు. అర్ధమైందా?"

"చిత్తం. నేనలా చెయ్యాలంటే ఇప్పుడు మీరు నన్నొదిలి పెట్టాలి. శెలవు!"


(photos courtesy : Google)