Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Friday, 3 July 2015

పంచాగ్ని


జీవితం చిత్రమైంది. ఒక్కోదశలో ఒక్కోఅనుభవం హాయిగా వుంటుంది. ఆ తరవాత కొన్నాళ్ళకి అదే అనుభవం చిరాగ్గా కూడా వుండొచ్చు. ఒకప్పుడు నాకు స్నేహితుల్తో కలిసి సినిమా చూడ్డం అనేది గొప్ప అనుభవం. చదువైపొయ్యాక స్నేహితులు తలోదిక్కూ వెళ్ళిపొయ్యారు. ఆ తరవాత సినిమాలు చూడ్డానికి ప్రయత్నించాను గానీ - నా వల్ల కాలేదు. హఠాత్తుగా తెలుగు సినిమాస్థాయి దిగజారిందా? లేక స్నేహితుల్తో చెత్తసినిమాల్ని కూడా సరదాగా చూసేశానా?

ఒకానొకప్పుడు ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే దూరదర్శన్ మాత్రమే వుండేది. దూరదర్శన్‌వాళ్ళు ఎవార్డ్ పొందిన ప్రాంతీయ చిత్రాల్ని ప్రసారం చేసేవాళ్ళు (ప్రభుత్వం అప్పుడప్పుడు మంచిపన్లూ చేస్తుంటుంది). ఆవిధంగా ఒకానొక ఆదివారం మధ్యాహ్నం యాక్సిడెంటల్‌గా ఒక మళయాళం సినిమా చూశాను. సినిమా పేరు 'పంచాగ్ని'.

కథలో ప్రధాన పాత్ర ఇందిర, నక్సలైట్ పార్టీ కార్యకర్త. ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ సెంటెన్స్‌కి తెలుగులో ఇంతకన్నా తేలిక పదం వుంటే బాగుణ్ను) అనుభవిస్తున్న ఖైదీ. ఆవిడ కొన్నాళ్ళకి పెరోల్‌పై బయటకొస్తుంది (ఖైదీలకి సెలవలుంటాయని అప్పటిదాకా నాకు తెలీదు). ఈమధ్య కాలంలో బయటి ప్రపంచం చాలా మారింది, మానవ విలువలూ మారాయి. ఈ మారిన మనుషుల్తో ఇందిర అనుభవాల సమాహారమే ఈ కథ. సినిమా చివర్లో ఇందిర ఇంకో హత్య చేసి మళ్ళీ జైలుకెళ్తుంది. కథకి లింక్ ఇస్తున్నాను, ఓపిక వున్నవాళ్ళు చదూకోవచ్చు.

నాకు ADHD వుందేమోనని నా అనుమానం. ఏ సినిమానైనా మరీ బాగుంటే గానీ కుదురుగా కూర్చొని చూళ్ళేను. 'కొద్దిసేపు చూద్దాంలే' అనుకున్న నన్ను ఈ సినిమా రెండు గంటల పైగా తనతో వుంచేసుకుంది. నన్నిలా తనతో వుంచేసుకునే ఏ సినిమా అయినా మంచి సినిమా అని నా నమ్మకం. అట్లాంటి మంచి సినిమా తీసిన వాడే మంచి దర్శకుడు. తీసినవాడు అకిరా కురసోవా అవ్వచ్చు లేదా సత్యజిత్ రే అవ్వచ్చు - ఎవరికైనా సరే! ఇదే సూత్రం వర్తిస్తుంది.

అటు తరవాత కొన్నాళ్ళకి పీజిలో చేరాను. అక్కడ సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌ నిండా మలయాళీలు! నా సీనియర్ పి.ఎస్.శశిధరన్ (శశి) నాకు సన్నిహితుడయ్యాడు. శశి ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు, తక్కువగా మాట్లాడతాడు. ఓసారి శశితో 'పంచాగ్ని' సంగతి ప్రస్తావించాను. శశి తన భీభత్సమైన మలయాళీ యాసతో సినిమా రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ (MT) గూర్చి యెన్నో వివరాలు చెప్పాడు. అటు తరవాత శశితో కలిసి ఒకట్రెండు మలయాళీ సినిమాలు చూశాను. ఆ సినిమాలేంటో గుర్తు లేవు కానీ - రెండూ మోహన్‌లాల్ సినిమాలే అన్న విషయం మాత్రం గుర్తుంది.

ఎప్పుడో చూసిన సినిమాని గుర్తు తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది (నాకింకా డిమెన్షియా రాలేదన్న సంతోషం కూడా ఇంకో కారణం కావచ్చు). నాకు కొన్నివిషయాలు నచ్చుతయ్, ఇంకొన్ని నచ్చవు. నచ్చేవి నచ్చనివీ కాలానుగతంగా interchangeable. 'అందరికీ ఇంతేనా? నా వొక్కడికి మాత్రమేనా?' అన్నది తెలీదు.

ఇవ్వాళ నేను 'పంచాగ్ని' సినిమాని మొత్తం చూడగలనా? చూసినా సినిమా మళ్ళీ నచ్చుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం నాదగ్గర లేదు. ఒకానొకప్పుడు నాకీ సినిమా నచ్చిందని గుర్తు చేసుకోవడమే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం. కావున -  ఈ పోస్ట్ చదివి పంచాగ్ని సినిమా చూసి.. సినిమా బాలేదనీ, అనవసరంగా సమయం వృధా అయిందనీ ఎవరైనా చింతించిన యెడల - వారికి (ముందుగానే) నా సానుభూతి తెలియ జేసుకుంటున్నాను (ఇది మాత్రం కచ్చితంగా disclaimer).

ముగింపు -

నే చదూకునే రోజుల్లో మళయాళీ బూతు సినిమాలు కృష్ణ సినిమాల కన్నా స్పీడుగా ఠపీఠపీమంటూ వచ్చేవి. రతినిర్వేదం, సత్రంలో ఒక రాత్రి.. ఇలా టైటిల్స్‌తోనే కుర్రకారుని కిర్రెక్కించేవి. ఈ సినిమాలకి మా గుంటూరు రంగమహల్ నూన్ షోలతో నిలయంగా వుండేది. బయట ఎర్రని ఎండవల్లనూ, లోపల వేడి నిట్టూర్పులవల్లనూ - వాతావరణం భగభగా మండిపొయ్యేది!

నా ఆత్మీయ మిత్రుడొకడు బట్టలు తక్కువగానున్న స్త్రీల యెడల మిక్కిలి ఆసక్తి కలిగుండేవాడు. అంచేత రంగమహల్ అతగాడి కేరాఫ్ అడ్రెస్‌గా విలసిల్లేది! ఏ సినిమాలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు 'గిట్టుబాటు సీన్లు' వుండేవో అతనికి కొట్టిన పిండి, దంచిన కారం. ఓసారి 'పంచాగ్ని చూశావా?' అనడిగాను. క్షణకాలం ఆలోచించి 'కామాగ్ని చూశాను. పంచాగ్ని చూళ్ళేదు' అని చెప్పాడు!      

Saturday, 27 June 2015

సుడిగుండాలు


ఈ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు వుంటారు. అంతకంటే ఎక్కువగా సినిమాల్ని పోలిన సినిమాలూ వుంటాయి. ఇది కేవలం కాకతాళీయం మాత్రమేనని సినీజీవులు అంటారు. కొందరు తెలివైనవాళ్ళు 'స్పూర్తి' పొందామని గడుసుగా చెప్పుకుంటారు. చాలాసార్లు ఈ స్పూర్తికీ, కాపీకీ మధ్యన విభజనరేఖ సూదిలో దారంలా కనపడీ కనపడనట్లు వుంటుంది. 

1959 లో 'కంపల్షన్' అనే ఆంగ్ల సినిమా వచ్చింది. ముఖ్యపాత్రని ఆర్సన్ వెల్స్ పోషించాడు (ఈయన పేరు వినంగాన్లే చప్పున గుర్తొచ్చేది 'సిటిజెన్ కేన్'). కథ టూకీగా - అనగనగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒకే కాలేజిలో చదువుకుంటున్నారు, బాగా ధనవంతుల బిడ్డలు. సరదా కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. థ్రిల్ కోసం - పోలీసులకి అంతుపట్టని విధంగా ఒక నేరం చేద్దామనుకుంటారు. 'పెర్ఫెక్ట్ మర్డర్' కోసం ఒక పిల్లాణ్ణి కిడ్నాప్ చేసి హత్య చేస్తారు. అన్నీ పెర్ఫెక్టుగానే చేస్తారు గానీ - ఒక ముఖ్యమైన ఆధారాన్ని హత్య జరిగిన ప్రదేశంలో వదిలేస్తారు. ఆ ఆధారంతోనే వారికి శిక్ష పడే సమయం వస్తుంది. అప్పుడు ఆర్సన్ వెల్స్ నటించిన న్యాయవాది పాత్ర కోర్టు రూములోకి ప్రవేశించి ముద్దాయిల తరఫున తీవ్రంగా వాదిస్తుంది. చివరాకరికి ముద్దాయిలకి పడాల్సిన ఉరిశిక్ష తప్పిపోతుంది! 

ఈ కథ చదువుతుంటే మీకో ప్రముఖమైన తెలుగు సినిమా గుర్తుకు రావాలి. 1969 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'సుడిగుండాలు' అనే సినిమా కథాంశం కూడా ఇదే. ఈ సినిమా కథ 'కంపల్షన్' సినిమాని ఇంతగా పోలి వుండటం 'యాదృచ్చికం' అనుకోవాలంటే కొంచెం ఇబ్బందే! ఆ సినిమా తీసిన వాళ్ళెవరూ ఇప్పుడు లేరు, వున్నా మనకి చెబుతారో లేదో తెలీదు. ఆంగ్ల సాహిత్యం చదువుకుని లేదా ఆంగ్ల చిత్రం చూసుకుని - ఆ స్పూర్తితో కథలు వండటం అనేది ఒక పురాతన విద్య. 

ఏ సినిమాకైనా ప్రధాన కథాంశం ఫలానా అని ముందో ముక్క అనుకుంటారు. ఈ ముక్క చపాతీ ముద్దలాంటిది. అప్పడాల కర్రని ఒడుపుగా తిప్పుతూ ఆ ముద్దకే వెడల్పుగా, గుండ్రంగా చపాతీ షేపు తెప్పిస్తారు. అంటే ఒక సినిమా మంచిచెడ్డలు పిండిముద్దతో మొదలవుతాయి. అట్లాంటి ప్రధాన కథాంశాన్ని కాపీ కొట్టేసి మాది 'స్పూర్తి' మాత్రమే అంటారు సినిమావాళ్ళు. సరే! ఎవరి దృష్టికోణం వారిది!

'సుడిగుండాలు' సినిమా పెద్దగా ఆడకపోయినా, సినీప్రేమికుల్ని అలరించింది. ఒక గొప్ప సినిమాగా కీర్తి నొందింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డునీ పొందింది. ఈ సినిమా తీసి బోల్డంత సొమ్ము నష్టపొయ్యామని దర్శక నిర్మాతలు పలుమార్లు వాపొయ్యారు. అయితే - ఈ సినిమా మాతృక గూర్చి ఎక్కడా (నాకు తెలిసినంత మటుకూ) ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యకరం. బహుశా ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు!

'సుడిగుండాలు'ని నేను మా గుంటూరు లక్ష్మీ పిక్చర్ పేలెస్‌లో చూశాను. అప్పట్లో నేను - ఫైటింగు లేని సినిమా మిరపకాయ లేని బజ్జీ వంటిదనే నమ్మకంతో వుండేవాణ్ని. అంచేత సినిమా నాకు చప్పగా అనిపించింది. చివర్లో న్యాయవాది నాగేశ్వరరావు 'ఈ దేశం ఏమవుతుంది? ఏమవుతుంది?' అంటూ మనకి బరువైన ప్రశ్నలు వేస్తూ, అందుగ్గానూ ఆయన కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ కోర్ట్ రూంలోనే పడిపోతాడు. 'గంటలకొద్దీ వాదించినందున అలసిపొయ్యి కళ్ళు తిరిగి పడ్డాడా? లేక చనిపొయ్యాడా?' అన్నది నాకు అర్ధం కాలేదు. ఆయన అలా పడిపొయ్యి అనేక దశాబ్దాలు దాటినందున - ఇప్పుడు తెలుసుకుని చెయ్యగలిగిందీ ఏం లేనందున, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం!


Sunday, 23 October 2011

సినిమాలు మంచివే! కానీ మనం?



'సినిమాల్లో చెడు ఉండరాదు, బలహీన మనస్తత్వం కలవారు చెడిపోతారు.'

ఇది నేను నా చిన్నప్పట్నించీ వింటున్న సుభాషితం. ఓకే! ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అట్టు తిరగేద్దాం. మరి - సినిమాల్లో మంచిని చూసి బాగుపడినవాళ్ళు ఎందరున్నారు? ఫలానా సినిమాలో ఫలానా పాయింటు నాకళ్ళు తెరిపించింది. కావున - ఫలానా విధంగా నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను, ప్రవర్తిస్తున్నాను. అన్నవాళ్ళు  మీకెక్కడైనా కనిపించారా? నాకైతే కనిపించలేదు.

'దేవదాసు'లో ఎస్వీరంగారావు - అంతస్తు తక్కువ పిల్లని చేసుకుంటే తుపాకీతో కాల్చుకు చస్తానని బెదిరించి మరీ నాగేశ్వర్రావుని సావిత్రి నుండి వేరు చేస్తాడు. ఆ తరవాత దేవదాసు, పార్వతిలు తెలుగువాళ్ళని దారుణంగా ఏడిపించారు. అరవైయ్యేళ్ళ క్రితం ఈ ఫార్ములా సూపర్ హిట్టు. తమ పిల్లలు దేవదాసు, పార్వతిల్లా భ్రష్టుపట్టిపోతారనే భయంతో  పిల్లల ప్రేమని ఒప్పుకునే దయార్ధ్ర హృదయులు ఈరోజుక్కూడా నాక్కనిపించట్లేదు.
                             
నా చిన్నప్పుడు అమ్మ, పక్కింటి పిన్నిగారితో కలిసి ఎన్నో ఏడుపుగొట్టు సినిమాలు చూశాను. 'అన్నా! నీ అనురాగం' అంటూ గుండెలు పగిలే గుడ్డి చెల్లెలి ఆక్రందనల్ని - ఎర్రటికళ్ళతో, మొహం వాచిపోయేలా బిగ్గరగా రోదిస్తూ సినిమాని చూశారు పిన్నిగారు. ఇంటికెళ్ళంగాన్లే బండెడు ఇంటి చాకిరీ సరీగ్గా చెయ్యలేదని తన విధవాడపడుచుని ఇల్లెగిరిపొయ్యేలా కేకలేసింది!

శారద నటించిన 'మనుషులు మారాలి'  సినిమా తెలుగువాళ్ళ హృదయాన్ని పీల్చి పిప్పి చేసింది. శోభన్ బాబు హత్య, ఆపై శారద దుర్భర దరిద్రాన్ని తట్టుకోలేక తన పిల్లల్ని చంపేసుకోవటం.. నాకు తెలిసి తెలుగులో ఇంతకన్నా సీరియస్ సినిమా మరోటి లేదు. జనాలు విరగబడి చూసి యేడ్చేశారు. ఆ సినిమా విజయవంతమై నిర్మాతలకి కాసులు తెచ్చింది గానీ జనాల్లో మార్పు తేలేకపోయింది. 

'రోజులు మారాయి'లో దళిత వర్గానికి చెందిన షావుకారు జానకిని వ్యవసాయ వర్గానికి చెందిన నాగేశ్వర్రావ్  ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఈ దళిత అగ్రవర్ణాల పెళ్ళి అలనాటి 'మాలపిల్ల' దగ్గర మొదలై - 'కాలం మారింది', 'బలిపీఠం' లాంటి సూపర్ హిట్ల మీదుగా చాలా పెద్దప్రయాణమే చేసింది. మనం కూడా సమాంతరంగా కారంచేడు, చుండూరు, నీరుకొండల మీదుగా ఇంకో పెద్దప్రయాణం చేస్తున్నాం!
                           
నేను ఈ ఉదాహరణల్ని సినిమా ప్రభావం సమాజం మీద ఉండదని చెప్పటానికి రాయట్లేదు. ఉంటుందని అన్డానికి తగినంత ఆధారాల్లేవని చెప్పటానికి మాత్రమే రాస్తున్నాను.
                             
సినిమా మన ఈగోని సంతృప్తి పరుస్తుంది. వాస్తవ ప్రపంచంలో మనకున్న తోర్రల్ని పూడ్చి ఆకాశంలో విహరించే ఆదర్శవంతమైన పాత్రల్ని భలే ఇష్టపడతాం. అసలా పాత్రల విలువల పట్ల దర్శక రచయితలకే నమ్మకం ఉండదు. ఆదర్శవంతమైన ఆలోచనలు, సాధ్యంకాని కోరికలు, లేని విలువలు ఆపాదించుకోవటానికి డబ్బుతో కొనుక్కునే సాధనం సినిమా.

ఇవ్వాళ్టికీ వాస్తవ జీవితంలో కులమతాలు, ఆస్తిఅంతస్తులు చాలా ముఖ్యం. కానీ సినిమాల్లో పడవ నడిపే వ్యక్తి ఆమాయక ప్రేమ (మూగమనసులు), నల్లటివాడి కవితాత్మక ప్రేమకథ (చెల్లెలి కాపురం), పనివాడి మొరటు ఆత్మీయత (ఆత్మబంధువు), రిక్షా కార్మికుని కుటుంబ మమకారాలు (శభాష్ రాముడు) ముచ్చట గొలుపుతయ్. అంటే - నిజ జీవితంలో మనకేది ఉండదో అదే సినిమాల్లో చూసుకుని తృప్తినొందుతాం!
                             
కాబట్టి నా పాయింటేంటంటే - జనం చెడిపోతున్నారని ఎవరూ గుండెలు బాదుకోనక్కర్లేదు. మీరూ నేనూ ఈ జనంలో భాగమే. ఎంత గొప్ప సినిమా చూసినా మీరూ నేనూ ఆవగింజంతైనా బాగుపడనట్లే, ఎవరూ కూడా చెడిపోరు. కాకపోతే తెలుగువాళ్ళల్లో కొందరు మేధావులున్నారు. వాళ్ళు సామాన్య ప్రజల కన్నా పైస్థాయివాళ్ళు కాబట్టి - సినిమాల్లో చెడు చూసి జనాలు చెడిపోతున్నారంటూ స్టేట్మెంట్లు పడేస్తారు! 

పోనీ - చిన్నపిల్లలయినా సినిమా ప్రభావానికి లోనవుతారా? ఇదీ అనుమానమే! గుండమ్మకథ పదిసార్లు చూసిన నా అన్న నన్ను ఎన్టీఆర్ నాగేశ్వర్రావుని చూసినట్లు ఆప్యాయంగా చూసుకోకపోగా, నామీద నాన్నకి పితూరీలు చెప్పి తన్నించేవాడు. 'రక్తసంబంధం'లో తీవ్రమైన అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ వుంది. సినిమా చూస్తూ హాల్లో కడవల కొద్దీ కన్నీరు కార్చిన అక్క - నేను తన పెన్సిలూ, ఎరేజరు వాడేస్తున్నాని రాక్షసిలా రక్తమొచ్చేట్లు గిచ్చింది. ఆరకంగా మాదీ రక్తసంబంధమైపోయింది! మరి పిల్లల మీద సినిమాల ప్రభావం ఏంటి?!

సినిమాల ప్రభావం ఉండదని నిరూపించడానికి అన్నీ నెగెటివ్ పాయింట్లు రాస్తున్నాను కదూ! కాబట్టి ట్రాక్ మారుస్తా. చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని కోరికలు కలిగేవి. 'శభాష్ రాముడు' చూసి రామారావులా రిక్షా తొక్కుదామనే కోరికతో తహతహలాడాను, కాలేజీకి వచ్చాక నా రిక్షా తొక్కుడు కోరిక తీరింది. 

కొంచెం పెద్దయ్యాక ఏడుపుగొట్టు ఇల్లాళ్ళు నచ్చడం మొదలెట్టారు. మొగుడు 'ఇంకోదాన్తో పోతాను మొర్రో!' అంటున్నా పట్టించుకోకుండా మొగుడిగాడి కాళ్ళమీద పడి భీభత్సంగా కన్నీరుగార్చే పతివ్రతా శిరోమణులు నా మనసు దోచారు. ఆరోజుల్లో నాకు నచ్చిన డైలాగ్ - "ఏవఁండీ! మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి, కనీసం మీఇంట్లో పనిమనిషిగా ఉండనిస్తూ ఇంత ముద్ద పడెయ్యండి." ఇట్లాంటి సీన్లు చూసినప్పుడల్లా అర్జంటుగా పెళ్లి చేసుకుని ఏడిచే భార్యతో బ్రతిమాలించుకోవాలని తెగ ముచ్చటపడేవాణ్ని. కానీ - పదోక్లాసులో పెళ్లి చేసుకునే సౌలభ్యం, సౌకర్యం లేక ఆగిపొయ్యా! రిక్షా ముచ్చటైతే తీరింది గానీ, ఈ పాదాల దగ్గర చోటు ముచ్చట తీరలేదని ప్రత్యేకంగా రాయడం అనవసరం. 

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - సినిమా చూడ్డం అనేది కేవలం కాలక్షేపం మాత్రమే. అది తీసేవాడికీ తెలుసు, చూసేవాడికీ తెలుసు. మరి తెలీన్ది ఎవరికి? 'సినిమాల్లో చెడు ఉండరాదు. బలహీన మనస్తత్వం గలవారు చెడిపోతారు.' అనేవాళ్లకి. ఇంతకీ ఆ చెడిపొయ్యే బలహీన మనస్తత్వ దుర్భలులు ఎక్కడ వుంటారో, ఎలా వుంటారో వాళ్లెప్పటికీ చెప్పరు. అదే తంటా!

(posed in fb on 3/2/2018)