Showing posts with label స్నేహితులు. Show all posts
Showing posts with label స్నేహితులు. Show all posts

Sunday, 6 November 2011

నా 'ఖడ్గతిక్కన' ఖష్టాలు

మనుషులు అనేక రకాలు. కొందరు మంచివాళ్ళే కాదు, మొండివాళ్ళుగా కూడా వుంటారు. నా క్లాస్మేట్ మరియూ మదీయ మిత్రుడు అయిన మూర్తి అటువంటి అరుదైన మంచిమొండివాడు. అవతలవాళ్ళు చెప్పేది అర్ధం కాకపోయినా, డామినేట్ చేస్తున్నారన్న అనుమానం కలిగినా మరింత మొండిగా అయిపోతాడు. ఈ వొక్కవిషయంలో తప్పించి మా మూర్తి మంచివాడు, మృదుస్వభావి, స్నేహశీలి - అఫ్కోర్స్ మొండిశీలి అని ఇందాకే చెప్పాను! కొందరు మూర్తిని 'ఖడ్గతిక్కన' అనేవాళ్ళు. నాకు మావాడి ధోరణి అలవాటైపోయింది, పట్టించుకునేవాణ్ని కాదు. ఒక్కోసారి మా మూర్తి మొండిదనం నాక్కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేది.

ఇప్పుడంటే మెడికల్ కాలేజీలు కులాల గోలల్లో పీకల్లోతు కూరుకుపొయ్యున్నాయి గానీ, మా రోజుల్లో దేశ రాజకీయాల చర్చల్తో వాతావరణం హాట్‌హాట్‌గా ఉండేది. నాకు రాజకీయాలు తగుమాత్రంగా తెలుసు, మూర్తికి మాత్రం యెంతమాత్రం తెలీదు. ఆరోజు లీలామహల్లో జేమ్స్ బాండ్ సినిమా చూడాలని మా ప్లాన్. లైబ్రరీ నుండి కాలేజ్ క్యాంటీన్‌కి వెళ్లాం. అక్కడ రాజకీయ చర్చలతో, సిగరెట్ పొగతో గందరగోళంగా వుంది. మేం క్యాంటీన్‌లోకి అడుగుపెట్టంగాన్లే, మమ్మల్ని చూస్తూ -

"బ్రదర్స్! కంపూచియాపై అమెరికా దురాక్రమణని ఖండించండి." అని అరిచాడొకడు.

మా మూర్తి ఠక్కున అన్నాడు - "నేను ఖండించను."

వెంటనే ఆవైపు నుండి ఆవేశంగా ఒక ఉపన్యాసం మొదలైంది. "అమెరికా సామ్రాజ్యవాదం.. పెట్టుబడిదారి ఆర్ధికవ్యవస్థ .. " కొంత అర్ధమయింది. చాలా అర్ధం కాలేదు. అయిదు నిముషాల తరవాత ఉపన్యాసం అయింది. మూర్తి సూటిగా చూస్తూ స్థిరంగా, నొక్కివక్కాణిస్తూ అన్నాడు - "నేను ఖండించను." మళ్ళీ ఉపన్యాసం మొదలైంది. నాకేమో తొందరగా కాఫీ తాగి బయటపడాలని ఉంది. జేమ్స్ బాండ్ సినిమా టైటిల్స్ మిస్సైపోతాననే భయం, అవంటే నాకు చాలా ఇష్టం.

'బాబ్బాబూ! ఖండించరా.' అంటూ చెవిలో దీనంగా వేడుకున్నా. మూర్తి మనసు పాషాణం, ఇసుమంతయిననూ కరగలేదు! మావాడితో ఒప్పించాలని వారి పట్టుదల. అలా ఓ అరగంటపాటు వీడితో ఖండింపజెయ్యాలనే విఫలయత్నం కొనసాగింది. వాళ్ళు ఎన్నిరకాల ఆర్గ్యుమెంట్లు చెప్పినా మావాడిది ఒకటే సమాధానం.

"నేను ఖండించను."

సినిమా ప్రోగ్రాం అటకెక్కింది. క్యాంటీన్ నించి బయటకి వచ్చాక విసుక్కున్నాను.

"రాజకీయాల్లో నీకంత పట్టుదల ఎందుకు? "

"నేనంతే! చాలా పట్టుదల కలవాణ్ణి." గర్వంగా అన్నాడు.

నేనేం మాట్లాళ్ళేదు, కొంచెంసేపు ఆగి నెమ్మదిగా అడిగాడు రమణమూర్తి.

"సర్లే గానీ, ఇంతకీ కంపూచియా అంటే ఏమిటి?"

ఒక్కక్షణం వాడడిగింది నాకర్థం కాలేదు. అర్ధమయ్యాక కోపం, ఏడుపు ఒకేసారి వచ్చాయి!


అటు తరవాత.. సాధ్యమైనంత మేరకు మూర్తిని మేనేజ్ చేసుకుంటూ బండి లాక్కోస్తున్నాను. అన్నిరోజులూ మనవి కావు, కొన్నిసార్లు దురదృష్టం పిచ్చికుక్కలా వెంటాడుతుంది.

ఆరోజు మెడిసిన్ కేస్ ప్రెజంటేషన్‌లో ప్రొఫసర్‌తో తీవ్రంగా తిట్టించుకున్న మూర్తిని హాస్పిటల్ క్యాంటిన్లో శాయశక్తులా ఓదారుస్తున్నా.

"నీ కేస్ ప్రెజంటేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంది. మన ప్రొఫెసర్‌కే నీస్థాయి లేదు. అందుకే ఆయనకి నీ కేస్ అర్ధంకాక నానామాటలన్నాడు!"

"అంతేనంటావా!" మూర్తి కళ్ళల్లో మెరుపు. హమ్మయ్యా! నా ఓదార్పుమాటలు బానే పన్జేస్తున్నయ్.

ఈలోగా ఇద్దరు జూనియర్లు స్టూడెంట్లు మా పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆరెస్సెస్ సానుభూతిపరులని నాకు తెలుసు.

"ఏంటి! మీ రాముడి గుడి ఎందాకా వచ్చింది?" అంటూ సరదాగా పలకరించాను.

వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపొయ్యి - "మన హిందువులది సిగ్గులేని జాతి, రాముడి గుడి తలుపులు తెరవక పోవటాన్ని ఎందుకు ఖండించరు?" అన్నారు.

'ఖండన' అన్నమాట చెవిన పడంగాన్లే మా మూర్తి ఖయ్యిమన్నాడు.

"ఖండించను, ఎందుకు ఖండించాలి? నాకు గుడి తలుపులు తెరవక్కరలేదు. అవి ఎప్పటికీ మూసే ఉంచాలి. అర్ధమయ్యిందా? మూసే ఉంచాలి." ఒక్కోఅక్షరం వొత్తిపలుకుతూ అన్నాడు.

ఆ జూనియర్స్ బెదిరిపొయ్యారు, చల్లగా జారుకుని వేరే టేబుల్ చూసుకున్నారు.

నాకు మా మూర్తి ప్రవర్తన మొరటుగా అనిపించింది.

"మూర్తీ! వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి. ఏదో మర్యాదగా పలకరిస్తే అట్లా కరుస్తావే?"

ఈసారి నామీద ఎగిరాడు.

"నేను నీలా కాదు, గంగిరెద్దులా ప్రద్దానికి తలూపను. నాకు సొంత బుర్ర ఉంది. సొంత అభిప్రాయాలున్నాయ్."

"నీకు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ చెప్పే పద్ధతే బాలేదు." అన్నాను.

ఒక్కక్షణం ఆలోచించి అన్నాడు రమణమూర్తి.

"ఇంతకీ వాళ్ళు చెప్పేది మనూళ్ళో వున్న రామనామ క్షేత్రం సంగతేగా? దాని తలుపులు ఎప్పుడు మూశారు? ఏమన్నా రిపేర్లు చేస్తున్నారా?"

తల పట్టుకున్నాను.

'ఓరి నాయనోయ్! వీడి పాండిత్యం డేంజరపాయం స్థాయికి చేరుకుంది.'

అటు తరవాత మావాణ్ని మరింత పకడ్బందీగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. 

Wednesday, 26 October 2011

గాంధీ, నేను, అన్నాహజారే!


"ఒక మాజీ నిరాహారదీక్షకారుడుగా చెప్తున్నాను, అన్నాహజారే చేస్తున్న దీక్ష బహుకష్టం సుమీ!"

"అన్నాహజారే సంగతి మాకు తెలుసు కానీ, నువ్వేంటి నిరాహార దీక్షల్ని ఓన్ చేసుకుంటున్నావ్?"

"నాగూర్చి నేను రాసుకోకూడదు, అయినా రాసుకుంటాను. అసలీ దీక్షల్లో నేను మహాత్మా గాంధీకి జూనియర్ని, అన్నాహజారేకి సీనియర్ని. ఇప్పుడు నాదీక్ష కథ చదివి తరింపుము."

చదూకునే రోజుల్లో నేను మరియూ కొందరు నా మిత్రోత్తములు ఆంగ్ల సంగీతానికి అభిమానులంగా వుండేవాళ్ళం. అప్పుడు మధ్యాన్నం ఒంటిగంట. నేనూ, నా సహ ఆంగ్ల సంగీతాభిమాని గుంటూరు మెడికల్ కాలేజ్ గార్డెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. 

"గురూ! మన లెనన్ని ఎవడో లేపేశాడు." అటుగా వెళ్తూ చెప్పాడో వార్తల వామనరావ్. 

షాకింగ్! ఇద్దరం దుఃఖంలో మునిగిపోయ్యాం. మా ఇద్దరికీ బ్రిటిష్ మ్యూజిక్ గ్రూప్ బీటిల్స్ అంటే ఇష్టం. బీటిల్స్ బ్యాండులో జాన్ లెనన్ అత్యంత ముఖ్యుడు. లెనన్ రాసిన పాటలూ, పాడిన పాటలు గుర్తుతెచ్చుకుని బోల్డు బాధ పడసాగాం. వూరికే బాధపడి వదిలేస్తే ఎలా? లెనన్‌కి తీవ్రమైన నివాళి ఇవ్వాల్సిందే. అంచేత - లెనన్ జ్ఞాపకార్ధం ఒకపూట భోజనం మానెయ్యాలని నిర్ణయించుకున్నాం. లెనన్ గూర్చి కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చుండిపొయ్యం. 

మధ్యాహ్నం మూడు గంటలైంది. ఆకలి నెమ్మదిగా మొదలైంది. ఆ తరవాత స్పీడుగా ఎక్కువైంది. ఇప్పుడు - కడుపులో ఎలకలు కాదు కుక్కలు పరిగెడుతున్నయ్. నీరసంతో తల దిమ్ముగా, తిక్కతిక్కగా ఉంది. సంభాషణ లెనన్ నుండి పక్కకి మళ్ళింది. 

"మిత్రమా! యేదో మన పిచ్చి గానీ - మనం ఒకపూట ఆహారం మానేసినంత మాత్రాన చనిపోయిన లెనన్ తిరిగొస్తాడా?"

"అవును, అయినా మనం ఇప్పుడీ నిరాహార దీక్ష చెయ్యడం అవసరమా? ఇవన్నీ ఔట్‌డేటెడ్ సంతాపాలు. కానీ, ఇప్పుడెలా? కమిటైపోయ్యాంగా!"

నీరసంగా మొహమోహాలు చూసుకున్నాం. ఇద్దరిదీ ఒకే భావన. కవులు ప్రేమకి భాష అవసరం ఉండదంటారు. ఆకలికి కూడా భాష అవసరం ఉండదని ఆరోజే అర్ధమయ్యింది. 

మిత్రుడు ఒక్కక్షణం ఆలోచించాడు.

"మనం భోజనం మాత్రమే మానేద్దామనుకున్నాం. భోజనం అంటే రైస్. కాబట్టి రైస్ కాకుండా ఇంకేదైనా తినొచ్చు."

"కానీ - అలా చేస్తే లెనన్‌కి అన్యాయం చేసినట్లు కాదా?" నా ధర్మసందేహం.

"గాడిద గుడ్డేంకాదు, ఉపవాసం అంటూ భక్తజనులు డజన్లకొద్దీ  నేతిపెసరట్లు తింటంలా? అది తప్పు కానప్పుడు ఇదీ కాదు." బల్ల గుద్దాడు మావాడు.

"ఒప్పుకుంటున్నాను. అయితే మనం ఇడ్లీ మాత్రమే తిందాం, అలా అయితేనే నేను ఒప్పుకుంటాను." బింకంగా అన్నాను.

"ఇడ్లీ తప్ప ఏంతిన్నా గడ్డి తిన్నంత ఒట్టు." ప్రతిజ్ఞ చేసాడు మదీయ మిత్రుడు.

గుంటూరు మెడికల్ కాలేజికీ ఆనంద భవన్‌కీ రైలుకట్టే అడ్డం. అంచేత నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో ఆనందభవన్లో తేలాం. సర్వారావు మనవాడే. అతని తల్లి మెడికల్ వార్డులో ట్రీట్మెంటు తీసుకుంటుంది. పెద్దాస్పత్రిలో, పెద్దడాక్టరుగారి మందీమార్బలంలో చివరి వరసలో సభ్యులం. కౌరవుల్లో నూరోవాడైనా దుర్యోధన సార్వభౌముడి తమ్ముడే! ఆరకంగా మేమూ అతని ద్రుష్టిలో పెద్దమనుషులమే!   

సర్వారావు కృతజ్ఞాతాభిమానములతో మమ్ము పలుకరించెను. ప్రేమానురాగాములు కురిపించెను. అదృష్టవశాత్తు అతగాడి తల్లి కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. లేకపోతే పరిస్తితి ఇంకోరకంగా వుండేదేమో!

"సార్! ఇడ్లీ వాయ ఇప్పుడే దిగింది. కారప్పొడీ నెయ్యీ.. " 

తెచ్చేసుకో, తిని పెడతాం.

"మైసూర్ బజ్జీ రెడీ అయ్యింది, తెస్తున్నా." 

అయ్యో! తప్పకుండా, దానికేం భాగ్యం? గట్టిచట్నీ వేస్తే ఇంకా బాగుంటుందేమో!

"మూడుముక్కల మినపట్టు? మసాలాదోశ?" 

సమన్యాయం మా మతం, రెంటినీ తినడం మా అభిమతం.

"సార్! ఊతప్పం తెమ్మంటారా? పైన జీడిపప్పు స్పెషల్ గా చల్లిస్తాను."

ఏవిటో నీ పిచ్చిఅభిమానం! అదేచేత్తో ఓ నాలుగు నేతిచుక్కలు, క్యారెట్ తురుం కూడా వేయిస్తే ఇంకా బాగుంటుంది కదా!

"ఫిల్టర్ కాఫీ స్పెషల్గా చేయించాను సార్." అంటూ నురుగుతో పొగలు గక్కు కాఫీ. 

ఆహా! కాఫీ ఎంత మధురముగాయున్నది! 

మైడియర్ సర్వారావ్! చిరంజీవ, చిరంజీవ. సుఖీభవ, సుఖీభవ. రాలిపోటానికి సిద్ధంగాఉన్న రెండు నిండుప్రాణాల్ని నిలబెట్టావ్. నువ్వూ, నీతల్లీ, నీ యావత్ కుటుంబము కలకాలం పచ్చగా జీవించండి.  

కమ్మటి కాఫీ తాగి బయటపడ్డాం. మత్తుగా, భుక్తాయాసంగా ఉంది. ఆహా! ఏమి ఈ ఆనందము! మానవునికి ఇంతకన్నా కావలసినదేమి? మనకీ యుద్ధాలు, దుర్మార్గాలు అవసరమా?

మెడికల్కా కాలేజీ వైపు భారంగా అడుగులు వేస్తూండగా మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది. 

"లెనన్ లేని బీటిల్స్ ఉప్పులేని పప్పులాంటిది." అన్నాను.

"అసలా యోకో ఓనో మన లెనన్‌కి శనిలా పట్టింది. ఆమె మూలంగానే బంగారంలాంటి గ్రూప్ విడిపోయింది. ఎప్పుడోకప్పుడు కలవక పోతారా అనుకునేవాణ్ణి." అన్నాడు మావాడు.

ఇంతలో ఇడ్లీ మాత్రమే తినాలన్న నిబంధన గుర్తొచ్చి కెవ్వుమన్నాను. మావాడు విసుక్కున్నాడు - "నువ్వు మరీ చాదస్తంగా మాట్లాడుతున్నావ్. అసలు మనం ఆర్డర్ ఇచ్చామా? ఇవ్వలేదు గదా! ఆ సర్వర్  హడావుడి చేసి మనతో అన్నీ తినిపిస్తే అది మన తప్పెలా అవుతుంది?"

"అయినా మనం తిన్నట్లే గదా!" సందేహంగా అన్నాను.

"ఖచ్చితంగా కాదు! ఆ సర్వర్ తెచ్చి పెడుతుంటే, కాదనలేక మొహమాటం కొద్దీ తిన్నాం. అంతే! అతనక్కడ లేకపొతే నాప్రాణం పోయినా ఇడ్లీ తరవాత ఇంకే ఆర్దరిచ్చేవాణ్ణే కాదు, నన్ను నమ్ము." అన్నాడు మావాడు. 

నిజమే కదా! నాకు మావాడి లాజిక్ నాకు భలేగా నచ్చేసింది. అందుకే పూర్తిగా నమ్మేశాను.

"ఎంతయినా జాన్ లెనన్ లేని లోటు పూడ్చలేనిది." మళ్ళీ జాన్ లెనన్ బాధ మనసుని తొలిచెయ్యటం మొదలైంది. 

అవ్విధముగా -

జాన్ లెనన్ గూర్చి ఆలోచనలతో దుఃఖము పొంగిపొర్లిపోతూ సంతాప సమాలోచనలు కొనసాగుచుండగా భారంగా మా నడక కొనసాగించితిమి. 

నీతి -

బాధ ఎంతైనా పడు, తిండి మాత్రం మానకు!

(photo courtesy : Google)