Showing posts with label జయలలిత. Show all posts
Showing posts with label జయలలిత. Show all posts

Friday, 17 February 2017

శశికళ చేసిన తప్పు


కాఫీ తాగుతూ ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నాను. కొన్నాళ్లుగా జాతీయ మీడియా తమిళనాడు వార్తల్ని వేడివేడిగా వండి వారుస్తుంది. 

"మిత్రమా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బూ! ముఖ్యమంత్రి అవుదామనుకున్న శశికళ జైలు పక్షి అయింది. ఆమె జైల్లోకి వెళ్లడం చూస్తుంటేనే భలే హేపీగా ఉంది. చివరాఖరికి చట్టం ముందు అవినీతి ఓడిపోయింది." సినిమాటిక్ గా అన్నాను.

ఒకక్షణం ఆలోచించి అన్నాడు సుబ్బు - "నేనలా అనుకోవట్లేదు. జాతీయ మీడియా శశికళని విలన్‌గా ప్రచారం చేస్తుంది, అలా చూపించడంలో వారికి కొన్ని ప్రయోజనాలున్నయ్! కొద్దిసేపు తెలుగు సినిమా టైపు ఆలోచనల్ని పక్కనబెట్టి విషయాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు." 

"సరే! ఎలా అర్ధం చేసుకోవాలో నువ్వే చెప్పు." అడిగాను.

"చాలామంది శశికళ జయలలితని వశబర్చుకుందనీ, ఆమెకి తెలీకుండా భర్తతో కలిసి తెర వెనక చాలా అక్రమాలు చేసిందనీ నమ్ముతున్నారు. అసలు సంగతి - వాళ్లిద్దరూ ఒకర్నొకరు సహకరించుకున్నారు. జయలలితకి ఎమ్జీఆర్ వారసత్వం, సినిమా గ్లామర్ పుష్కలంగా ఉన్నాయి. అయితే కరుణానిధి వంటి బలమైన నాయకుణ్ని ఎదుర్కోడానికి ఇవి మాత్రమే సరిపోవు, నమ్మకమైన 'బ్యాక్ రూమ్ ఆపరేటర్' కావాలి. ఆ బాధ్యతని శశికళ చక్కగా నిర్వహించింది. అంటే జయలలిత అనే మొక్కకి శశికళ అనే యెరువు తోడై చక్కటి ఫలసాయం దక్కింది!" అన్నాడు సుబ్బు. 

వేడివేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు -

"జయలలిత శశికళలది - శంకర్ జైకిషన్, సలీం జావేద్ టైపు హిట్ కాంబినేషన్. ఇప్పుడు జయలలిత చనిపోయింది, అధికారం నాలుగేళ్లపాటు ఉంటుంది. పార్టీకి ముప్పయ్యేడు మంది లోకసభ సభ్యులు, పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళ సహకారం కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. అందుకే కేంద్రం తన చెప్పుచేతల్లో ఉండే తమిళ ప్రభుత్వం కోసం పావులు కదుపుతుంది. ఇక్కడే శశికళ కొంత హోమ్ వర్క్ చేసుండాల్సింది."

"యెలా?" అడిగాను.

"రాజ్యాంగం ప్రకారం మనది ఫెడరల్ స్ట్రక్చర్. కానీ కేంద్రప్రభుత్వానికి విపరీతమైన అధికారాలున్నయ్. రాజకీయంగా తమకి నచ్చని వాళ్ళని తొక్కెయ్యడానికి గవర్నర్ల వ్యవస్థని వాడుకోడం కేంద్రప్రభుత్వాలకి అనాదిగా అలవాటు. ఇది కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చెయ్యడంతో మొదలయింది. రామారావు, నాదెండ్ల భాస్కర్రావుల ఎపిసోడ్ గుర్తుంది కదా?" అడిగాడు సుబ్బు. 

"కానీ రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చాడుగా?" అన్నాను. 

"వచ్చాడు, ప్రజల్లో అతనికున్న విపరీతమైన ఫాలోయింగ్ మూలంగా గట్టెక్కాడు గానీ.. లేకపోతే ఆ దెబ్బకి కోలుకునేవాడు కాదు. ఆ తరవాత రాష్ట్రప్రభుత్వాల్ని కూల్చడం, ఆయా నాయకుల్ని సీబీఐ సాయంతో అవినీతి కేసుల్లో ఇరికించడం కేంద్ర ప్రభుత్వాలకి చాలా సాధారణ విషయంగా అయిపోయింది." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"ఈ మర్మం తెలీని జగన్ కేంద్రంతో ఢీకొని జైలు పాలయ్యాడు. కేంద్రం పవర్ గూర్చి అంచనా ఉన్నందునే చంద్రబాబు, కేసీఆర్ బయటకెన్ని కబుర్లు చెప్పినా లోపల లోపాయికారీగా ఉంటున్నారు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు. 

"అవును." 

"శశికళకి పొలిటికల్ మేనేజ్మెంట్ తెలీలేదు. కేంద్రప్రభుత్వానికి భేషరతు మద్దతు ఇస్తానని, దాని కనుసన్నల్లో ఉంటాననీ సిగ్నల్స్ పంపలేదు. శేఖర్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీల ద్వారా కేంద్రం శశికళని 'హెచ్చరించి'నప్పటికీ ఆమె పట్టించుకోలేదు. కేంద్రానికున్న శక్తిని అంచనా వెయ్యడంలో శశికళ పొరపడింది." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు. 

"ఒప్పుకుంటున్నాను. కానీ తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు కదా?" ఆసక్తిగా అడిగాను. 

"ఇక్కడ నువ్వొక విషయం మిస్ అవుతున్నావ్! ట్రయల్ కోర్టులో శిక్ష పడ్డ కేసుని హైకోర్టు కొట్టేసింది. ఇంత ముఖ్యమైన కేసు అప్పీలుకి వచ్చినప్పుడు సుప్రీం కోర్టు దాన్ని రెండేళ్లుగా నాన్చడం ఆశ్చర్యం! ఫలితంగా - జైల్లో కూర్చోవాల్సిన ఒక వ్యక్తి కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండగలిగింది! అబ్సర్డ్ గా లేదూ? కోర్టు ఇన్నేళ్లు తీర్పుని ఎందుకు పెండింగ్ లో పెట్టింది? శశికళ ముఖ్యమంత్రి అయ్యే సమయంలోనే తీర్పు ఇస్తున్నానని ఎందుకు చెప్పింది?" అన్నాడు సుబ్బు. 

"అంటే?"

"అంటే - శశికళకి ఈ దేశంలో కోర్టుల గూర్చి కూడా అవగాహన లేదని అర్ధం!" నవ్వుతూ అన్నాడు సుబ్బు. 

"నీకున్న తెలివి శశికళకి లేదంటావా?" అడిగాను. 

"లేదని నేనెందుకు అంటాను! ఒక్కోసారి చాలా మంచి క్రికెటర్ కూడా సిల్లీ షాట్ కొట్టి అవుటయిపోతాడు. ఆ విషయం అతనికీ అవుటయ్యాకే తెలుస్తుంది. రాజకీయాలూ అంతే! నేవెళ్తాను." అంటూ నిలబడ్డాడు సుబ్బు. 

"పదిరోజుల్లో తమిళ రాజకీయాలు ఒక కొలిక్కి వస్తాయిలే!" అన్నాను. 

"రావు, రాజశేఖరరెడ్డి మరణం తరవాత కాంగ్రెస్ పార్టీ గతి యేమైందో గుర్తుందిగా? ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా యెవరున్నా కిరణ్ కుమార్ రెడ్డిలా వ్యక్తులకీ, వారి ఆస్తులకీ ఉపయోగం తప్ప పార్టీకి ప్రయోజనం ఉండదు." వెళ్ళబోతూ అన్నాడు సుబ్బు. 

"ప్రజాస్వామ్యంలో ఒక బలమైన నాయకుడు హఠాత్తుగా చనిపోతే అంతే!" అన్నాను. 

"ముందు నువ్వా పుస్తక భాష వదిలేసి వాస్తవ ప్రపంచంలోకి రా! మనం ఇప్పుడున్నది 'ప్రజాస్వామ్యం' అని పిలుచుకుంటున్న రాచరిక పాలనలో! ఆ మాత్రం తెలీదా నీకు?" పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.  

(picture courtesy : Google)

Sunday, 4 December 2016

ఒక జయలలిత అభిమాని ఆవేదన


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి గుండెపోటు, ఆమె అభిమానులు తీవ్రంగా ఏడుస్తున్నారు. ఈ స్థాయిలో ఏడుస్తున్నారంటే వారికి ఆమెంటే ఎంత అభిమానమో అర్ధమవుతుంది. మరీ వారంత కాకపోయినా - నాక్కూడా కొంత బాధగానే వుంది. అందుకు నాకున్న కారణాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి.


ఇప్పటి కుర్రాళ్ళు కత్తిలాంటి కత్రీనా కైఫ్‌ని వేడినిట్టూర్పులతో భారంగా చూస్తున్నట్లే - ఒకప్పుడు నేనూ నోరు తెరుచుకుని జయలలితని తెగ చూసేవాణ్ని. నాదప్పుడు స్కూల్ వయసు కాబట్టి - నా ఎత్తుకు తగ్గట్టు పొట్టిగా, బొద్దుగా, ముద్దుగా వుండే జయలలిత అంటే చాలా ఇష్టంగా వుండేవాణ్ని. 

ఒకటా రెండా! ఎన్నని చెప్పను? జయలలిత బొచ్చెడన్ని సినిమాలు చేసింది. చిక్కడు - దొరకడు, గోపాలుడు - భూపాలుడు, కదలడు - వదలడు, గండికోట రహస్యం వంటి జానపద చిత్రరాజముల్లో ఎంతో హుషారుగా ఎన్టీఆర్‌తో స్టెప్పులేసింది (ఈ కారణాన జయలలిత గొప్ప సాహసవంతురాలని నాకప్పుడే అర్ధమైంది).

'ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకి వచ్చావా?'    అంటూ 'తిక్కశంకరయ్య'లో రామారావుని ఆట పట్టించింది. 'ముత్యాలజల్లు కురిసే' అంటూ 'కథానాయకుడు'లో వర్షంలో తడుస్తూ గెంతులేసింది. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో  అంటూ 'అదృష్టవంతులు'లో క్లబ్బులో నర్తించింది.

ఆవిడ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్ళాక 'పురచి తలైవి' అనీ, 'అమ్మ' అనీ పిలిపించుకుంది. కరుణానిధితో భీభత్సమైన ద్వంద్వయుద్ధం చేసింది. జయలలిత పట్ల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా నేనసలు పట్టించుకోలేదు . ఇందుకు నా జయలలిత అభిమానమే కారణమని నా అనుమానం.

ఒకప్పుడు నన్నెంతో ఆనందింపచేసిన జయలలిత, నేడు అనారోగ్యానికి గురవడం నన్నెంతో బాధిస్తుంది. జయలలిత కోసం దుఃఖించేవారిపట్ల పూర్తి సంఘీభావాన్ని తెలుపుకుంటూ   - 'పుట్టినవాడు గిట్టక మానడు' అని ఘంటసాలగారు భగద్గీతలో  చెప్పిన కొటేషన్ గుర్తు తెచ్చుకుని ఊరట చెందుతున్నాను.   

(photo courtesy : Google)