Showing posts with label సబ్బు. Show all posts
Showing posts with label సబ్బు. Show all posts

Sunday, 4 December 2011

అమృత మూర్తులు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు సుబ్బు. తాపీగా టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ని తిరగెయ్యసాగాడు.

"అమృతమూర్తికి అశ్రునివాళి. హి.. హి.. హీ! వెరీ గుడ్!" అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు. 

"సుబ్బు! అందులో నవ్వడానికేముంది?" అడిగాను.

"ఇంగ్లీషులో సింపుల్‌గా 'హోమేజ్' అనేసి ఊరుకుంటారు. కానీ తెలుగులో అక్షరాలు ఎక్కువ, భావాలూ ఎక్కువే. అమృతమూర్తిట, అశ్రునివాళిట! ఏదో నాటకంలో పద్యంలా లేదూ?"

ఇంతలో వేడికాఫీ పొగలుగక్కుతూ వచ్చింది.

"సుబ్బు! ఆయనెవరో పొయ్యాడు. పోయినాయన కోసం డబ్బుపోసి కుటుంబ సభ్యులు పత్రికల్లో ప్రకటన ఇచ్చుకున్నారు. వాళ్ళేం రాసుకుంటే మనకెందుకు?" అన్నాను. 

"నిజమే, మనకెందుకు? కావాలంటే కారణజన్ముడు, పురుషోత్తముడు, లోకోద్ధారకుడు అని ఇంకో నాలుగు తోకలు తగిలించుకోమందాం. సర్లే గానీ, అశ్రునివాళి దాకా ఓకే. కానీ 'అమృతమూర్తి' పదం రిలెటివ్ కదా!" అన్నాడు సుబ్బు. 

"ఎలా?" అడిగాను. 

"అమృతం అనగా తీయగా నుండునది, మేలు చేయునది. ఎవరికి తియ్యగా ఉంటుంది? ఎవరికి మేలు చేస్తుంది? అది తాగేవాడిబట్టి వుంటుంది. రాజకీయ నాయకుడో, డాక్టరో, ఉన్నతాధికారో.. నిజాయితీగా, సమాజహితంగా జీవిస్తే వాళ్ళు సమాజానికి అమృతమూర్తులు. కానీ అతని నిజాయితీ మూలంగా ఇంట్లోవాళ్ళు కొన్నిసుఖాలు కోల్పోతారు, కాబట్టి అతగాడు ఇంట్లోవాళ్లకి అమృతమూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్లకి అతనో గరళమూర్తి కూడా అవ్వొచ్చు." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"మా పక్కింటి వడ్డీల వెంకటయ్య సంగతేమయ్యింది? వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసేవాడు. గడ్డితిని ఆస్తులు పోగేసాడు. చివర్రోజుల్లో ఎంత తీసుకున్నాడు! ఆయన ఆస్తి కోసం కొడుకులు తన్నుకు చచ్చారు, అంతా కలిసి తండ్రికి తిండి పెట్టకుండా చంపేశారు. చావంగాన్లే వెంకటయ్య కొడుకులకి అమృతమూర్తయిపోయాడు. అందుకే రోజుల తరబడి పేపర్లల్లో ప్రకటనల ద్వారా కొడుకులు తమతండ్రి అమృతమూర్తని ఘోషించారు!" అన్నాడు సుబ్బు. 

ఖాళీ కప్పుని టేబుల్ మీద పెట్టాడు.

"గాలి జనార్ధనరెడ్డి ఆయన కుటుంబానికి అమృతమూర్తి, సమాజానికి కాదు. గాంధీ రిజిడ్ ఫిలాసఫీ వల్ల ఆయన కుటుంబం ఇబ్బంది పడింది. వారి దృష్టిలో గాంధీ అమృతమూర్తి కాకపోవచ్చు." అన్నాడు సుబ్బు.

"ఓ పన్జేద్దాం. మనం చచ్చేముందు మన ఫోటోల కింద ఈ అమృతమూర్తిని తగిలించొద్దని మనవాళ్లకి చెప్పి చద్దాం. సరేనా?" నవ్వుతూ అన్నాను.

"మనకాభయం లేదు. నువ్వూ నేనూ చస్తే మనకి పేపర్ ప్రకటన కూడానా! మనకంత స్థాయి లేదు. అందుకు మనం భారీగా నాలుగు తరాలకి సరిపడా సంపాదించాలి. అది మనవల్ల కాదు కాబట్టి మనం చచ్చాక అమృతమూర్తులం అయ్యే ప్రమాదం లేదు!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీకు బొత్తిగా పని లేకుండా పోతుంది. ఆయనెవరో పోయ్యాడని వాళ్ళవాళ్ళు ఏదో రాసుకుంటే దానికింత విశ్లేషణ అవసరమా?"

"అస్సలు అవసరం లేదు. కానీ కబుర్లు చెప్పకుండా కాఫీ తాగితే తాగినట్లుండదు నాకు. ఇదో రోగమేమో. సర్లే! సాయంకాలం క్లబ్బులో పార్టీ వుంది, వస్తున్నావుగా?""

"మర్చిపొయ్యాను. మన మూర్తి వచ్చాడు కదూ!"

"వార్నీ దుంపదెగ, మూర్తిగాడి పార్టీ మర్చిపోయ్యావా!? మూర్తి ఫ్రమ్ అమెరికా విత్ గ్లెన్ ఫిడిచ్. అమెరికా నుండి అమృతం తెచ్చిన మన మూర్తే అసలైన అమృతమూర్తి!" అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.  

Saturday, 17 September 2011

సబ్బుబిళ్ళ


"కాదేది కవితకనర్హం, కుక్కపిల్లా సబ్బుబిళ్ళా అగ్గిపుల్లా" అన్న మహాకవి శ్రీశ్రీ స్పూర్తితో 'ఋక్కులు' రాశాడు రావిశాస్త్రి. ఆవిధంగా  తెలుగు సాహిత్యంలోకి శ్రీశ్రీ పరిచయం చేసిన సబ్బు స్థానాన్ని పదిలం చేశాడు రావిశాస్త్రి.  వీళ్ళు గొప్పరచయితలు, మేధావులు. నేనేదీ కాదు. అంచేత డైరక్టుగా సబ్బు గూర్చే రాసేస్తున్నాను! 

"నాన్నా! నా సబ్బెందుకు రుద్దుకున్నావు? అది లేడీస్ సోప్." ఇవ్వాళ ఉదయం నే స్నానం చెయ్యంగాన్లే మా అమ్మాయి గద్దింపు. మొదట తెల్లబోయ్యి పిమ్మట ఆశ్చర్యపోయ్యా. సబ్బుల్లో ఆడామగలు ఉంటాయన్న సంగతి నాకీ క్షణం దాకా తెలీదు.   

స్నానాన్ని కనిపెట్టిన వాణ్ని పట్టుకుని తన్నాలనే కోరిక నాకు చిన్నప్పట్నుండీ వుంది. నేను ప్రతిరోజూ ఏడుస్తూ చేసే పని స్నానం చెయ్యటం. కొన్ని జీవితాలంతే! ఇష్టముండదు, కానీ చెయ్యక తప్పదు. పరీక్షలప్పుడూ ఏడుస్తూ చదివేవాణ్ని. ఏ పనయినా ఇష్టపడి చేస్తే కష్టముండదంటారు. నాకీ సుభాషితం అర్ధం కాదు. తిండంటే ఇష్టపడతాంగానీ - స్నానాన్నీ, చదవడాన్నీ ఎలా ఇష్టపడతాం! 

సరే! మళ్ళీ సబ్బులోకొద్దాం. స్నానాన్నే ఏడుస్తూ చేసేవాణ్ణి కాబట్టి నేనేనాడూ సబ్బు గూర్చి ఆలోచించలేదు. ఫలానా సబ్బు వాడితే భలే ఫ్రెష్షుగా ఉంటుందనీ, ఇంకేదో సబ్బు వాడితే ఇంకేదో అయ్యిందనీ చెప్పుకుంటుండగా విన్నాను. సబ్బంటే స్నానమే కాదు, ఆనందాన్నీ కలుగజేస్తుందని నాకప్పుడు అర్ధమైంది. నా కోపం స్నానం మీదే గానీ, సబ్బు మీద కాదు కాబట్టి సబ్బు గూర్చి క్రికెట్ ఎంపైర్లా నిస్పక్షపాతంగా రాస్తానని మనవి చేసుకుంటున్నాను. ఆలోచించగా - రోజూ మన వంటిమీద తను కరిగిపోతూ కూడా గబ్బుని వదిలించే సబ్బు నిస్వార్ధమైనది మరియూ పవిత్రమైనదిగా తోస్తుంది.

కొందరు సబ్బులోళ్ళు తమ సబ్బు వాడితే వొంటిరంగు పాలకన్నా తెల్లగా అయిపోతుందంటున్నారు. అసలీ తెల్లతోలూ, నల్లతోలు ప్రకటనలు వర్ణవివక్ష కిందకొస్తాయి. ఒకప్పటి దక్షణాఫ్రికాలో కన్నా ఇవ్వాళ మన్దేశంలోనే వర్ణవివక్షత ఎక్కువుందని నా నమ్మకం, అందుకే ఈ రంగులు మార్చే సబ్బులు బాగా అమ్ముడుపోతున్నయ్. 

ఆమధ్య సబ్బుల వ్యాపారం చేసే ఓ పెద్దాయన సబ్బురహస్యమొకటి విప్పాడు. 'నాల్రోజులు వాడిన్తర్వాత ఏ సబ్బైనా ఒకటే. వాసనుండదు, నురగ రాదు.' అంటే మామిడిపండుకి గుజ్జుపోయి టెంక మిగిలినట్లన్నమాట! ఇక్కడ మన కార్పొరేట్ కాలేజీల రుద్దుళ్ళకి కుర్రాళ్ళు గుజ్జులేని టెంకలయిపోతున్నారు. 

సబ్బు లేని సమాజాన్ని ఊహించుకోవడం కష్టం. రెండ్రోజులు స్నానం చెయ్యకపోతే ప్రపంచ సుందర్నైనా భరించలేం. ముక్కు మూసుకుని దౌడ్ తియ్యాల్సిందే! మా మేనమామ స్నానాలగదిలోకి ఇలావెళ్ళి అలా వచ్చేసేవాడు. ఒక చెంబు ఒంటిమీదా, రెండు చెంబుల గోడమీదా పోసి స్నానమైందనిపించేవాడు. 

ఒకప్పుడు ఇన్ని సబ్బుల్లేవ్. అనాదిగా సినీతారల అందాలకి కారణం ఒక్క లక్స్ సబ్బు మాత్రమే. తళుకుతళుకు తారలు మా సౌందర్య రహస్యమిదేనని నొక్కి వక్కాణించేవాళ్ళు. 

ఆరొగ్యానికి రక్షా ఇస్తుంది లైఫ్‌బాయ్ (దీనికి కుక్కసబ్బని కూడా అంటారు). లైఫ్‌బాయ్ మన ఆరోగ్యానికి ఎంత రక్షనిచ్చిందో తెలీదుగానీ యెన్నో యేళ్ళుగా హిందుస్తాన్ లీవర్ వారి లాభాలకి మాత్రం రక్షనిస్తుంది. 

గుండ్రటి 'మోతి' సబ్బు పెళ్ళివాళ్ళకి విడిదిలో ప్రత్యేకం. మోతీ రాయికన్నా, పో్లీసువాడి హృదయం కన్నా కఠినమైనది. కొంచెమైనా వాసనుండదు, చచ్చినా నురగ రాదు. వందలమంది స్నానం చేసినా చెక్కు చెదరదు. అరగకుండా కరగకుండా మన్నికకి పేరు గాంచినది మోతీ సబ్బు. 

ఘుమఘుమలాడే సువాసన మైసూర్ శాండల్ సొంతం. లక్స్ కన్నా ఒక పావలా రేటెక్కువని మైసూరు శాండల్ మాఇంట్లో విలాసవస్తువైపోయింది. అక్క పెళ్ళయిన కొత్తలో బాత్రూము్లో మైసూరు శాండల్ సబ్బు చూశాను. హడావుడిగా బట్టలిడిచేసి ఆ సబ్బుని వొంటికేసి రుద్దీరుద్దీ అరగదీసేశాను. 

మా ఇంట్లో ఎక్కువగా లక్స్ సబ్బు వాడేవాళ్ళం. వాసన బాగానే ఉంటుంది, కాకపోతే తొందరగా నానిపోతుంది, మెత్తగా పేస్టులాగా అయిపొతుంది. అది గుర్తున్న నాకు వెనిల్లా ఐస్ క్రీం తినడం ఇష్టం వుండదు, ఎవరన్నా తింటున్నా చూడలేను. రుద్దుకునేప్పుడు చేతిలోంచి జారిపొయ్యే పియర్స్ సబ్బంటే నాకు చిరాకు. 

మాపక్కింటాయన యేదైనా లెక్కగా వుంటాడు. ఆయన హమాం సబ్బుని కత్తితో రెండుగా కోసి, ఆ ముక్కల్ని వన్ బై వన్‌గా వాడేవాడు. ఒకసారి అరిగిపోయిన సగం ముక్కని కాకెత్తుకెళ్ళింది. కాకికి సబ్బెందుకు! తను కూడా తెల్లబడాలనా! కాకిని వెంబడిస్తూ ఆయన వీధులకి వీధులు పరుగులెత్తాడు.

కాబట్టి - మన స్నానం కోసం అరిగిపోతున్న సబ్బుని గౌరవిద్దాం. సబ్బు యొక్క గొప్పదనాన్ని గొంతెత్తి చాటుదాం. సబ్బు గూర్చి రాత ఇంతటితో సమాప్తం.  

(picture courtesy : Google)