Showing posts with label బాలగోపాల్. Show all posts
Showing posts with label బాలగోపాల్. Show all posts

Thursday, 28 May 2015

చట్టం అను ఒక దేవతా వస్త్రం!


‘చుండూరు హత్యల కేసులో క్రింది కోర్టులో శిక్ష. కొన్నేళ్ళకి హైకోర్టులో కేసు కొట్టివేత.’
‘బాలీవుడ్ సూపర్ స్టార్‌కి క్రింది కోర్టులో జైలుశిక్ష. నిమిషాల్లో హైకోర్టు బెయిల్ మంజూరు. రెండ్రోజుల తరవాత అదే కోర్టు శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.’
‘తమిళనాడు ముఖ్యమంత్రిపై క్రింది కోర్టులో జైలుశిక్ష. కొన్నాళ్ళకి హైకోర్టులో అవినీతి కేసు కొట్టివేత.’
‘చట్టం కొందరికి చుట్టం’ – ఇటీవల కోర్టు తీర్పుల తరవాత ఈ సత్యం అందరికీ అర్ధమైపోయింది. ఒకప్పుడు ఈ సత్యానికి పట్టు వస్త్రం కప్పబడి సామాన్యులకి కనబడేది కాదు. ఆ తరవాత ఆ వస్త్రం పల్చటి సిల్కు వస్త్రంలా మారి కనబడీ కనబడనట్లుగా కనబడసాగింది. ఇవ్వాళ ఆ పల్చటి వస్త్రం దేవతా వస్త్రంగా మారిపోయింది! ఇకముందు ఎవరికీ ఎటువంటి భ్రమలూ వుండబోవు. ఇదీ ఒకరకంగా మంచిదే. ఈ వ్యవస్థలో సామాన్యుడిగా మనం ఎక్కడున్నామో, మన స్థాయేంటో స్పష్టంగా తెలిసిపోయింది.
శ్రీమతి ముత్యాలమ్మగారు నాకు జ్ఞానోదయం కలిగించే వరకూ – నేనూ “చట్టం ముందు అంతా సమానులే” అనే చిలక పలుకులు పలికిన మధ్యతరగతి బుద్ధిజీవినే. ముత్యాలమ్మగారు నారిమాన్, పాల్కీవాలాల్లాగా న్యాయకోవిదురాలు కాదు. ఆవిడ దొంగసారా వ్యాపారం చేస్తుంటారు, ఒక కేసులో నిందితురాలు. నేర పరిశోధన, న్యాయ విచారణలోని లొసుగుల గూర్చి – రావిశాస్త్రి అనే రచయిత ద్వారా ‘మాయ’ అనే కథలో విడమర్చి చెప్పారు. ‘ఆరు సారా కథలు’  చదివాక అప్పటిదాకా నాకున్న అజ్ఞానానికి మిక్కిలి సిగ్గుపడ్డాను.
క్రింది కోర్టుల్లో శిక్ష పడటం, పై కోర్టులు ఆ కేసుల్ని కొట్టెయ్యడం.. ఈ కేసుల్లో ఒక పేటర్న్ కనిపిస్తుంది కదూ? ‘మన న్యాయవ్యవస్థ పకడ్బందీగా లేకపోతే క్రింది కోర్టుల్లో శిక్షెలా పడుతుంది?’ అని విజ్ఞులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి నా దగ్గర శాస్త్రీయమైన, సాంకేతికమైన సమాధానం లేదు. ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా తనకున్న పరిమితులకి లోబడే ఆలోచించగలడు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కాబట్టి, వైద్యం వెలుపల విషయాల పట్ల కూడా డాక్టర్లాగే ఆలోచిస్తుంటాను, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పరిమితి, ఆక్యుపేషనల్ హజార్డ్!
ఇప్పుడు కొద్దిసేపు హాస్పిటల్స్‌కి సంబంధించిన కబుర్లు –
ఆనేకమంది డాక్టర్లు చిన్నపట్టణాల్లో సొంత నర్సింగ్ హోములు నిర్వహిస్తుంటారు. వీరికి అనేక ఎమర్జన్సీ కేసులు వస్తుంటయ్. అప్పుడు డాక్టర్లు రెండు రకాల రిస్కుల్ని బేరీజు వేసుకుంటారు. ఒకటి పేషంట్ కండిషన్, రెండు పేషంట్‌తో పాటు తోడుగా వచ్చిన వ్యక్తుల సమూహం. సాధారణంగా డాక్టర్లకి దూరప్రాంతం నుండి తక్కువమందితో వచ్చే పేషంట్‌కి వైద్యం చెయ్యడం హాయిగా వుంటుంది. వెంటనే ఎడ్మిట్ చేసుకుని వైద్యం మొదలెడతారు.
అదే కేసు ఆ హాస్పిటల్ వున్న పట్టణంలోంచి పదిమంది బంధువుల్తో వచ్చిందనుకుందాం. అప్పుడు పేషంటు కన్నా డాక్టర్లకే ఎక్కువ రిస్క్! ఎలా? విపరీతంగా విజిటర్స్ వస్తుంటారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. ఒకటే ఫోన్లు, ఎంక్వైరీలు. తమ నియోజక వర్గ ప్రజల రోగాల బారి పడ్డప్పుడు వైద్యులకి ఫోన్ చేసి ‘గట్టిగా’ వైద్యం చెయ్యమని ఆదేశించడం రాజకీయ నాయకులకి రోజువారీ కార్యక్రమం అయిపొయింది. అందరికీ సమాధానం చెప్పుకోడంతో పాటు డాక్టర్లకి కేస్ గూర్చి టెన్షన్ ఎక్కువవుతుంది.
పొరబాటున కేస్ పోతే – పేషంట్‌తో పాటు వచ్చిన ఆ పదిమంది కాస్తా క్షణాల్లో వెయ్యిమందై పోతారు. పిమ్మట హాస్పిటల్ ఫర్నిచర్ పగిలిపోతుంది. డాక్టర్ల టైమ్ బాగోకపొతే వాళ్ళక్కూడా ఓ నాలుగు తగుల్తయ్. పిమ్మట బాధితుల తరఫున ‘చర్చలు’ జరిగి సెటిల్మెంట్ జరుగుతుంది. అంచేత డాక్టర్లకి క్రిటికల్ కండిషన్లో వచ్చే లోకల్ కేసులు డీల్ చెయ్యాలంటే భయం. అందుకే వారీ కేసుల్లో వున్న రిస్క్‌ని ఎక్కువచేసి చెబుతారు. ‘మెరుగైన వైద్యం’ పెద్ద సెంటర్లోనే సాధ్యం, అంత పెద్ద రోగానికి ఇక్కడున్న సాధారణ వైద్యం సరిపోదని కన్విన్స్ చేస్తారు (కేసు వదిలించుకుంటారు). ఆ విధంగా వైద్యం చేసే బాధ్యతని ‘పైస్థాయి’ ఆస్పత్రులకి నెట్టేస్తారు.
మహా నగరాలకి కాంప్లికేటెడ్ కేసులు అనేకం వస్తుంటాయి. డాక్టర్లు హాయిగా వైద్యం చేసుకుంటారు. కేసు పోయినా – ఎలాగూ బ్యాడ్ కేసే అని పేషంట్ తరఫున వారికి తెలుసు కాబట్టి వాళ్ళ హడావుడి వుండదు. ఎవరన్నా ఔత్సాహికులు గొడవ చేద్దామన్నా, ఆ కార్పోరేట్ ఆస్పత్రికి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి వారి అండ ఉన్నందున ‘శాంతిభద్రతలు’ కాపాడే నిమిత్తం పోలీసులు ఆ గుంపుని వెంటనే చెదరగొట్టేస్తారు. అంచేత పేషంట్ బంధువులు ‘ఖర్మ! మనోడి ఆయువు తీరింది.’ అని సరిపెట్టుకుని కిక్కురు మనకుండా బిల్లు చెల్లించి బయటపడతారు.
వైద్యవృత్తి వెలుపల వున్నవాళ్ళకి నే రాసింది ఆశ్చర్యం కలిగించవచ్చును గానీ, ఇది రోజువారీగా జరిగే పరమ రొటీన్ అంశం. ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ కూడా వున్నాయి. పెద్ద కేసుల్ని పెద్దవాళ్ళే డీల్ చెయ్యాలి. దుర్వార్తల్ని చెప్పాల్సినవాడే చెప్పాలి. రాజు నోట ఎంత అప్రియమైనా తీర్పు భరింపక తప్పదు. అదే తీర్పు గ్రామపెద్ద చెబితే ఒప్పుకోరు, వూరుకోరు. ఈ హాస్పిటళ్ళ గోలకి నే రాస్తున్న టాపిక్‌తో కల సంబంధం ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుంటుంది.
“బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.” అంటాడు బాలగోపాల్. (‘రూపం – సారం’ 47 పేజి – ‘రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగా యంత్రం’). ఈ పాయింటుని ప్రస్తుత సందర్భానికి నేనిలా అన్వయించుకుంటాను – కొన్ని కేసుల్లో బాధితులు పేదవారు, అణగారిన వర్గాలవారు. వారిపట్ల ప్రజలు కూడా సానుభూతి కలిగి వుంటారు. బాధితుల్ని కఠినంగా ఆణిచేస్తే ప్రజల్లో ప్రభుత్వాల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం వుంది. అందువల్ల కొన్నిసార్లు (రాజ్యానికి) కేసులు పెట్టకుండా వుండలేని స్థితి వస్తుంది. శిక్షలు విధించకుండా వుండలేని స్థితీ వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా క్రింది కోర్టుల శిక్షలు, పై కోర్టుల కొట్టివేతలు!
చిన్నపాటి హాస్పిటల్స్‌కి వున్నట్లే – కింది కోర్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. అక్కడ న్యాయమూర్తులు శిక్ష వెయ్యడానికి కొద్దిపాటి ఆధారాల కోసం చూస్తారు. శిక్ష వెయ్యకపోతే బాధితులు ఆందోళన చెయ్యొచ్చు, తద్వారా తాము కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావొచ్చు. ఆపై ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్రింది కోర్టుల్లో ముద్దాయిలకి శిక్ష వెయ్యకపోతే ఇబ్బంది గానీ, వేస్తే ఎటువంటి ఇబ్బందీ వుండదు! అందువల్ల కేసు కొట్టేసే బాధ్యతని ఉన్నత స్థానాలకి నెట్టేస్తారు! హైకోర్టులో మాత్రం కేసుల పరిశీలన పూర్తిగా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి జరుగుతుంది. వారిపై ఎటువంటి వొత్తిళ్ళూ వుండవు. శిక్ష ఖరారు చెయ్యడానికి ఉన్నత న్యాయస్థానం వారికి కేసు పటిష్టంగా, పకడ్బందీగా వుండాలి. తప్పించుకోడానికే పెట్టిన కేసులు తొర్రల్తోనే వుంటాయి కాబట్టి సహజంగానే ఉన్నత న్యాయస్థానంవారు కొట్టేస్తారు.
ఇక్కడితో నే చెప్పదల్చుకున్న పాయింట్ అయిపొయింది. కింది కోర్టుల్లో శిక్ష పడ్డాక, ఆ శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో ఖరారు కాకపోవడానికి ఎన్నో కారణాలు వుండొచ్చు. నాకు తోచిన కారణం రాశాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నా ఆలోచన పూర్తిగా తప్పనీ, నాకు న్యాయవ్యవస్థపై కొంచెం కూడా అవగాహన లేకపోవడం మూలాన అపోహలతో ఏదేదో రాశానని ఎవరైనా అభిప్రాయ పడితే – ఆ అభిప్రాయాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే – నేను ముందే చెప్పినట్లు నాది ‘వైద్యవృత్తి’ అనే రంగుటద్దాలు ధరించి లోకాన్ని అర్ధం చేసుకునే పరిమిత జ్ఞానం కాబట్టి!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2015 May 28)

Monday, 12 December 2011

'శంకరాభరణం'పై బాలగోపాల్


"మీర్రాస్తున్న ఇంగ్లీషు హాయిగా వుంది, తెలుగు మాత్రం కష్టంగా వుంటుంది. తెలుగుని కొంచెం సింప్లిఫై చెయ్యొచ్చుగా?" అప్పుడెప్పుడో యేదో సందర్భంలో బాలగోపాల్‌ని అడిగాను.

"నేను చెప్పదలుచుకున్న విషయం రాసేస్తాను. అది అందరికీ అర్ధం అయ్యేట్లుగా రాయలని అనుకోను." బాలగోపాల్ ముక్తసరి సమాధానం.

కట్ చేస్తే -

ఓ నెల్రోజుల క్రితం బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంకలనం 'రూపం సారం' కొన్నాను. వీటిలో కొన్ని ఆల్రెడీ చదివేసినవే. పాతికేళ్ళ క్రితం చేరా, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని వెనుక పేజీల్లోకి పంపారు! కె.శ్రీనివాస్‌తో (కొత్త) ముందుమాట రాయించారు! కారణం తెలీదు. 

'రూపం సారం'లో బాలగోపాల్ రాసిన శంకరాభరణం, మాభూమి సినిమా రివ్యూలు చదివాను. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చదువుకోడానికి హాయిగా వున్నాయి. అంటే - నేనీ వ్యాసాలు చదవకుండా బాలగోపాల్‌కో గొప్పసలహా ఇచ్చానన్నమాట!

'రూపం సారం'లో శంకరాభరణం చిత్రసమీక్ష చదువుతుంటే భలే నవ్వొచ్చింది. బాలగోపాల్ ఇంత సరదాగా కూడా రాయగలడని ఇప్పటిదాకా నాకు తెలీదు. సమీక్షలో కొంతభాగం ఇక్కడ ఇస్తున్నాను, చదవండి. 

---------------------------------------------

శంకరాభరణం - సినిమా సమీక్ష :

ఈ సినిమా బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల కొరకు తీయబడిన సినిమా. నేను యిక్కడ 'బ్రాహ్మణుల'ని అంటున్నది కులం చేత బ్రాహ్మణులయిన వాళ్ళను మాత్రమే కాదు. 'భారతీయ సంస్కృతి' గా పిలవబడుతున్నదానికి వారసులుగా తమను తాము భావించుకుంటున్న వారందర్నీ. అంటే భారతీయ విద్యాభవన్ తరహా ఆలోచనా విధానం కలిగిన వారందర్నీ.

కథ క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంగీతం పిచ్చి ఉన్న ఒక బ్రాహ్మణుడి కథ. శంకరాభరణం రాగం పాడడంలో అతను సుప్రసిద్ధుడు. ఈ బ్రాహ్మణుడు సంగీతం కోసం ఏమైనా చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించే ఒక వేశ్య కూతురి పక్షం వహించి ఆమె కోసం సంఘబహిష్కరణకి కూడా సిద్ధపడతాడు. వాళ్ళు నిజంగానే వెలివేస్తే ఆ కోపాన్నంతా తన ఇష్టదైవం మీద చూపించి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాడు. అపస్వరం పాడిందని తన కుమార్తె పెళ్ళిని దాదాపు చెడగొట్టినంత పని చేస్తాడు. ఆమెకు సాయం చేయబోయినందుకు పెళ్ళికొడుకును కూడా బిక్కచచ్చిపోయేలా చేస్తాడు.

మొత్తం సినిమాలో ఒక సందేశం మన చెవులను పోటెత్తిస్తుంది. సంగీతం, కళలు ఉన్నది కామోద్రేకాల్ని రెచ్చగొట్టటానికి కాదు. లేబర్ క్లాస్ (ఆంధ్రులకి ఇష్టమైన మాటలో చెప్పాలంటే) అశ్లీల అభిరుచులను సంతృప్తి పరచడానికి కాదు. అవి ఉన్నది 'అద్వైత సిద్ధి'కి, 'అమరత్వ లబ్ధి'కి. ఈ సినిమా కొందరికోసమే అన్నభావం కలిగించే ప్రయత్నం మొదటినుంచి చివరిదాకా కనిపిస్తుంది. ఎవరో కామెంట్ చేసినట్లు ఇది 'వాళ్ళకు' (అలగా జనానికి) అర్ధమయ్యే సినిమా కాదు.

--------------------------------

'శంకరాభరణం' గూర్చి బాలగోపాల్ వివరంగా రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు balagopal.org లో ఇంగ్లీషులో కూడా చదువుకోవచ్చు. 

Friday, 28 October 2011

బాలగోపాల్.. కొన్ని జ్ఞాపకాలు


మన సమాజంలో కులం ప్రభావం బలమైనది. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు చదువుతూనే ఉంటాం. మనం ఈ కుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే, ముందుగా సమాజంలో కులంపాత్ర అంచనా వెయ్యగలగాలి. ఇది రాస్తున్నప్పుడు నాకు బాలగోపాల్, ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. 

నాకు చంద్ర (బి.చంద్రశేఖర్, న్యాయవాది, పూర్వాశ్రమంలో పౌరహక్కుల నాయకుడు) మంచి మిత్రుడు. అతని ద్వారా నాకు కె.బాలగోపాల్ పరిచయం. బాలగోపాల్ తరచూ గుంటూరు వస్తుండేవాడు. అప్పుడప్పుడు నా స్కూటర్ తీసుకుని ఊళ్ళో పనులు చక్కబరుచుకునేవాడు. ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి కాఫీ తాగేవాళ్ళం. 

అప్పటికే పౌరహక్కుల ఉద్యమకారుడిగా బాలగోపాల్ సుప్రసిద్ధుడు. ఆయన సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరిచేది. బాలగోపాల్ మొహమాటస్తుడు, పేషంట్లు వెయిట్ చేస్తుంటే తనుకూడా వాళ్ళతోపాటు కూర్చునేవాడు. మొదట్లో నా స్టాఫ్ ఆయన్ని పట్టించుకోలేదు. ఎవరో పేషంటుతోపాటు వచ్చినాయన అనుకుని అలాగే వెయిట్ చేయిస్తూ వుంచేవాళ్ళు. అటుతరవాత నేను బాలగోపాల్ పట్ల చూపించే మర్యాద, గౌరవం గమనించి ఆయన్ని హడావుడిగా కన్సల్టేషన్ రూంలోకి పంపేవాళ్ళు.  

బాలగోపాల్ మొహమాటస్తుడు గదాని మనం మోసపోకూడదు. విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఒకసారి కాజువల్‌గా అన్నాను - 'తెలుగు వ్యాసాలు సంక్లిష్టంగా రాయటంలో మీరు కె.వి.రమణారెడ్డిగారితో పోటీ పడుతున్నారు' అని. 

'మీరు తెలుగు ఇంకొంచెం నేర్చుకోండి.' అంటూ మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పాడు బాలగోపాల్

బాలగోపాల్ నా దగ్గరకి వచ్చినప్పుడల్లా కాఫీ ఇవ్వకుండా పంపేవాణ్ని కాదు. అందుక్కారణం - ఆయన్తో కొద్దిసేపు మాట్లాడే ఆవకాశాన్ని వదులుకోకూడదనే నా స్వార్ధం!  

ఒక కాఫీ సమయంలో హఠాత్తుగా అడిగాడాయన.

"మీదే కులం?"

"మీరు.. ఈ ప్రశ్న.. " ఆశ్చర్యంగా చూశాను.

నా ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా స్థిరంగా, స్పష్టంగా అన్నాడు బాలగోపాల్. 

"ఇక్కడ నేను మీతో బంధుత్వం కలుపుకోటానికి కులం అడగట్లేదు. మనమంతా కులరహిత సమాజం కావాలనుకుంటున్నాం. ముందుగా కులం మనమీద చూపిస్తున్న ప్రభావాన్ని గుర్తించగలగాలి. అప్పుడే గదా దాంట్లోంచి బయటపడగలిగేది. నేను పుట్టుకతో బ్రాహ్మణ్ణి. నా అవగాహన, ఆలోచన కొన్నిసార్లు నా కులానికి గల పరిమితులకి లోబడే ఉంటాయి. అది నా తప్పు కాదు. మనమందరం ఈ చట్రంలోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనని మనం సంస్కరించుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఉదాహరణకి మీరు దళితులనుకుందాం. నాకా విషయం తెలీనప్పుడు మిమ్మల్ని నేను సరీగ్గా అర్ధం చేసుకోలేను. కొంతమంది కులం పేరెత్తితేనే ఏదో తప్పుగా చికాకు పడతారు, కులాన్ని గుర్తించకపోవడం సరికాదు."

ఇంకో సందర్భం -

ఇంకో కాఫీ సమయం.

"సమాజంలో కులప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యకూడదు. నేను కిడ్నాప్ అయ్యానన్న వార్తని పత్రికలు విపరీతంగా కవర్ చేశాయి. పత్రికలు అంతలా కవర్ చెయ్యటం వెనుక కూడా కులప్రభావం ఉండొచ్చు."

"ఎలా?"

"మన పత్రికల్లో ఎడిటర్లు, రిపోర్టర్లు ఎక్కువమంది బ్రాహ్మణులు. నా రాజకీయాలు వాళ్లకి నచ్చకపోయినా, మనవాడేనన్న కులాభిమానం వాళ్లకి ఉండి ఉండొచ్చు." అన్నాడు బాలగోపాల్.

మాటల్లో క్లుప్తత బాలగోపాల్ సొంతం. ఒక్కోసారి ఆయన్తో మాట్లాడుతూ వుండిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆయన చాలా బిజీ - నలిగిన చొక్కాతో, చెదిరిన క్రాఫుతో హడావుడిగా వెళ్లిపోతాడు. బాలగోపాల్ సర్! ఐ సెల్యూట్ యు.  

(photo courtesy : Google)