Sunday 13 December 2015

రావిశాస్త్రి చేసిన మేలు


"నువ్వు కథలేమన్నా రాశావా?"

"లేదు."

"రాయొచ్చుగా?"

నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత్తిలోనే స్నేహాలుంటయ్. కొందరు డాక్టర్లని తెలివైనవారిగా భావిస్తారు. నేనైతే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే - నాకు తెలిసి అనేకమంది డాక్టర్లలో వృత్తిపరమైన నైపుణ్యం తప్ప ఇంకే విషయంలోనూ పెద్దగా అవగాహన లేదు.

నా స్నేహితులకి నేను రాస్తానని తెలుసు గానీ - ఏం రాస్తానో తెలీదు. అంచేత 'కథల్రాస్తున్నావా?' అంటూ మర్యాద కోసం అడుగుతుంటారు. ఇంకొందరు నాకు కథలు రాసేంత తెలివున్నాకూడా రాయకుండా నా ప్రతిభని వృధా చేస్తున్నానని అనుకుంటారు! ఇలా అడిగిన వాళ్ళ చదువరితనంపై నాకేమీ భ్రమల్లేవు. వాళ్ళు - చిన్నప్పుడు చదివిన చందమామ తప్ప ఇంకేదీ చదివుండరు, సెలవు చీటి మించి ఇంకేదీ రాసుండరు. కాబట్టి వాళ్ళ ప్రశ్నకి చిరునవ్వే సమాధానంగా ఊరుకుంటాను.  

హైస్కూల్ రోజుల్లో నేను వారపత్రికలు చదివేవాణ్ని. అదే సాహిత్యం అనే భ్రమలో కూడా వుండేవాణ్ని. అంచేత ఎప్పటికోకప్పుడు నేను కూడా కొన్ని కథలు రాయకపోతానా అన్న మిణుకు మిణుకు ఆశతో వుండేవాణ్ని. కొంతకాలానికి రావిశాస్త్రి చదివాను. గుండె గుభిల్లుమంది! ఇంకా నయం - కథ రాసి నా అజ్ఞానాహంకారముల్ని లోకానికి చాటుకున్నాను కాదు! ఆవిధంగా తెలుగు పాఠకులు అదృష్టవంతులయ్యారు.

నేను కథ రాయకపోవడం వల్ల తెలుగు పాఠకులకే కాదు, నాకూ చాలా లాభించింది! లేపోతే ఉత్సాహంగా అనేక కథలు రాసి సమయం వృధా చేసుకునేవాణ్ని! అవును - నాకు విలువైన జీవితానుభవం లేదు (సినిమాలు, షికార్లు, హోటళ్ళు - జీవితానుభవం కాదు). సాహిత్యంతో పరిచయం లేదు (వారపత్రికల (అ)జ్ఞానం సాహిత్యానుభవం కాదు). కావున కడుపు నిండిన సరదా కథలేవో కొన్ని వండగలిగేవాణ్నేమో గానీ - 'మంచికథ' మాత్రం ఖచ్చితంగా రాయగలిగేవాణ్నికాదు.

రావిశాస్త్రి వల్ల నాకింకో మేలు కలిగింది. నేనప్పటిదాకా చదివిన కథలన్నీ పరమచెత్తని కూడా గ్రహించే జ్ఞానం అబ్బింది. అంచేత అర్జంటుగా తెలుగు కథలు చదవడం మానేశాను, నా సమయాన్ని మరింత ఆదా చేసుకున్నాను. అయితే కథల్రాయడం వల్ల ప్రయోజనం లేదా? పాఠకుల సంగతేమో గానీ, రచయితకి మాత్రం ప్రయోజనమే!

నాలుగేళ్ల క్రితం నాకో డాక్టర్ అనుసరిస్తున్న అరాచక, భీభత్స వైద్యంపై చాలా కోపం వచ్చింది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలను? బాగా ఆలోచించాక ఆ డాక్టరాధముణ్ని ఒక కథతో కొట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి చాలాసేపు మేలుకుని కథొకటి టైప్ కొట్టాను. మర్నాడు నా కథ చదువుకొని బిత్తరపొయ్యాను - పరమ చెత్త! కానీ ఆశ్చర్యంగా ఆ క్షణం నుండి నాకా డాక్టర్ మీద కోపం పోయింది! ఇది రచయితగా నాకు చేకూరిన కథా ప్రయోజనం అనుకుంటున్నాను!

అటుతరవాత నా కథ గూర్చి ఈ నాలుగేళ్ళలో నాలుగు నిమిషాలు కూడా ఆలోచించలేదు. కానీ.. కానీ.. ఎవడి మీదో కోపం వచ్చి ఏదో రాసినా - అది నా కీబోర్డులో నా వేళ్ళ మీద గుండా జాలువారిన కథ! కావున నా కథని అలా చిత్తుప్రతిగా వదిలెయ్యడం సరికాదు. ఇది ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయినంత రాక్షసత్వంతో సమానం! అంచేత ఆ కథని నా బ్లాగులో పబ్లిష్ చెయ్య నిర్ణయించాను. చెత్తలో చెత్త - కలిసిపోతుంది!

(picture courtesy : Google)

Tuesday 1 December 2015

రచయితలూ! మీ "స్పందన" ఎక్కువైపోతుంది


మనుషుల్లో రకాలున్నట్లే రచయితల్లోనూ అనేక రకాలు. కొందరు రచయితలకి రచనా వ్యాసంగం ఒక వృత్తి. వారు మార్కెట్ ట్రెండుని బట్టి రాస్తుంటారు. సినిమావాళ్ళు ప్రేక్షకుల అభిరుచిని ఫాలో అయిపోతున్నట్లు వీళ్ళూ పాఠకుల నాడిననుసరించి రాస్తుంటారు. ఇక్కడ రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ మధ్య సంబంధం ఉత్పత్తిదారుడికీ, వినియోగదారుడి మధ్య గల సంబంధం మాత్రమే.

ఇంకోరకం రచయితలున్నారు. వీరికి రచన అనేది ఒక passion - పాఠకుల స్పందన, విమర్శకుల feedback కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. కొన్నేళ్లుగా ఆన్లైన్ మేగజైన్లు వచ్చాయి. రచయితలకి పాఠకులకి మధ్య దూరం బాగా తగ్గింది. రచయితలకి ఇదో లక్జరీ. అయితే ఈ పద్ధతికి side effects వస్తున్నాయని నా అభిప్రాయం. రచయితలు పాఠకుల్తో constant dialogue లో వుంటున్నారు. వేదికలెక్కి తమ రచనల 'నేపధ్యం' అంటూ ఉపన్యాసాలిస్తున్నారు!

తమ రచనల పట్ల రచయితల వ్యవహార శైలి ఎలా వుండాలో రావిశాస్త్రి 'రత్తాలు - రాంబాబు' రాసినప్పుడు స్పష్టంగా చెప్పేశాడు. 'రత్తాలు - రాంబాబు' తీవ్రమైన విమర్శకి గురైన సందర్భంలో రావిశాస్త్రి వెలిబుచ్చిన అభిప్రాయాల్ని యధాతధంగా ఇక్కడ ఇస్తున్నాను -

1.విమర్శ విడిచిపెట్టి విమర్శకుల మీద వ్యక్తిగతంగా విసుర్లు విసరడం మంచిది కాదని నా అభిప్రాయం.

2.కథ రాసేక, దాన్ని మరింక విడిచిపెట్టక, దాని మానాన దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు దాన్ని సాకుతూ సంరక్షించుకొంటూ సమర్ధించుకొంటూ నెత్తిన పెట్టుకుని తిరగడం నాకు ఇష్టం లేదు.

3.నిజానికి దగ్గరగా ఉంటె కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది.

4."రత్తాలు - రాంబాబు" నవల గురించి ఏమైనా తెలియాలంటే అది నవల వల్లే తెలియాలి కాని, నావల్ల కాదు.

రావిశాస్త్రి చెప్పిన ఈ విషయాన్నే డాక్టర్ కేశవరెడ్డి ఒక నవల ముందుమాటలో కోట్ చేశాడు. కానీ - 'మునెమ్మ'పై విమర్శలకి మాత్రం ఆయన సంయమనం కోల్పోయాడు. ఆయనకి 'చూపు' కాత్యాయిని విమర్శ బాధించింది. నాకైతే కాత్యాయిని చేసిన విమర్శ వ్యక్తిగతం అనిపించలేదు. మరి కేశవరెడ్డి ఎందుకంతగా offend అయ్యాడో అర్ధం కాదు.

రచయితలు తమ రచనల పట్ల సెన్సిటివ్‌గా వుండటం నేనర్ధం చేసుకోగలను. కానీ - టెక్నాలజీ వల్ల కలిగిన సౌలభ్యంతో వాళ్ళో ట్రాప్‌లో పడిపోతున్నారు. రచయితలూ! చెక్ యువర్సెల్ఫ్. రచన పబ్లిష్ అవ్వంగాన్లే మీ పాత్ర ముగిసింది. మీ రచన గూర్చి చర్చ జరగాల్సింది పాఠకుల్లో మాత్రమే! అంచేత మీరు మాట్లాడకపోవడమే మంచిది. 'నేనా ఉద్దేశంతో రాయలేదు, నా రచనని ఇలా అర్ధం చేసుకోవాలి' - లాంటి చర్చలు చేస్తే రచయితగా మీరు విఫలం అయినట్లే!

(picture courtesy : Google)