Saturday 28 March 2015

నేడు శ్రీరామనవమి - 'థాంక్స్ టు ఎన్టీఆర్'


చదువు వల్ల జ్ఞానం వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ సుఖమయ జీవనం మాత్రం వస్తుంది. యెప్పుడైతే చదువుకోవడం అవసరమైపోతుందో అందుక్కావలసిన సరంజామా సమకూర్చుకోక తప్పదు, యిందులో ముఖ్యమైనది దేవుడి దయ. యీ అవసరార్ధం నాకు చిన్నప్పుడు దేవుళ్లకి మొక్కడం బాగా అలవాటు.

నేను తొమ్మిదో క్లాసులో వుండగా ఆ దేవుడికే పరీక్షాసమయం వచ్చింది. వున్నట్లుండి చదువులో నాకో గట్టి పోటీదారుడు తగిలాడు. అతగాడు నాకన్నా నాలుగైదు మార్కులు యెక్కువ తెచ్చుకుంటూ నన్ను రెండో స్థానానికి నెట్టెయ్యసాగాడు. వెంటనే - మిలిట్రీవాడు ఫిరంగుల్ని దించినట్లు మరింతమంది దేవుళ్లని రంగంలోకి దించాను.

ఒక్కోవారం ఒక్కో దేవుడు. కుంకుడు రసంతో శుచిగా తలంటుకుని అనేక గుళ్లకెళ్లి కొబ్బరికాయలు కొట్టాను. యెగిరెగిరి (అప్పుడు నాకు గుడిగంటలు సరీగ్గా అందేవికావు) గంటలు మోగించాను. ధ్వజస్తంభాల ముందు మోకరిల్లాను. రోజూ స్వచ్చమైన, నిర్మలమైన, పవిత్రమైన మనసుతో పదేపదే 'స్వామీ! నాకే ఎక్కువ మార్కులొచ్చేట్లు చూడు!' అనే మంత్రాన్ని ఉచ్చరించాను. అప్పుడప్పుడు - 'దేవుళ్లూ! మీరు నా కోరిక తీర్చకపోతే నాకు మీ ఉనికి మీద నమ్మకం పోతుంది, మీ భక్తుణ్ని సంరక్షించుకోండి!' అనే హెచ్చరికలూ జారీ చేశాను!

ఈ విధంగా మనసంతా దేవుళ్లనే నింపుకుని మిక్కిలి పరిశుద్ధాత్మతో, పరిపూర్ణ శ్రద్ధాశక్తులతో పరీక్షలు వ్రాసితిని. యింత ఘోరమైన, కఠోరమైన నిష్టతో పరీక్షలెన్ని రాసినా మార్కులు మాత్రం పెరగట్లేదు. క్లాసులో నా రెండోస్థానం గోడక్కొట్టిన పిడకలా అలా స్థిరపడిపోయింది.

కొన్నాళ్లపాటు తీవ్రంగా ఆలోచించిన మీదట నాకో సత్యం బోధపడింది.

'దేవుడు వున్నాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ వున్నా - ఆ దేవుడికి నాకు సహాయం చేసే ఉద్దేశం లేదు! నాకు సహాయం చెయ్యని ఆ దేవుడు ఎంత గొప్పవాడైతే మాత్రం నాకెందుకు?' 

ఈ జ్ఞానోదయం అయ్యాక, ఆనాటి నుండి దేవుణ్ని పట్టించుకోవటం మానేశాను!

ఇవ్వాళ శ్రీరామనవమి. జీవితమంతా పరీక్షల్లో మార్కుల కోసమే చదివిన నాకు చాలా విషయాలు తెలీదు. ఇలా తెలీని వాటిల్లో రామయణం వొకటి. రాముడి భార్య సీత. భార్యని అనుమానించిన రాముడు తమ్ముడు లక్ష్మణుణ్ని పిలిచి రథంలో సీతని అడవిలో దింపిరమ్మన్నాడు. ఆ తరవాత ఆమెకి ఇద్దరు మగపిల్లలు! యిది 'లవకుశ' సినిమా కథ. నేను లవకుశ చూడ్డానికి ప్రధాన కారణం నా అభిమాన నటుడు ఎన్టీఆర్. ఈ సినిమా చూడకపోయినట్లైతే నాకు రామాయణం తెలిసేది కాదు, అప్పుడు నేనూ మా పిల్లల్లాగా రాముడి తండ్రి భీష్ముడని 'గెస్' చేస్తుండేవాణ్ని! 

అందువల్ల -

'థాంక్స్ టు ఎన్టీఆర్' 

(updated/re-written on 25/3/18)

Friday 27 March 2015

ధోని మూర్ఖత్వం


"చిలక్కి చెప్పినట్లు చెప్పాను. విన్నాడా? లేదే! ఇప్పుడనుభవిస్తున్నాడు."

"ఎవరు?"

"ఇంకెవరు? ఆ ధోని!"

"మీరా! ధోనీకా! ఏంచెప్పారు?"

"అసలా ఆస్ట్రేలియా ఖండమే ఒక శనిగ్రహం. ఇండియాకి దక్షిణాన ఎక్కడో కిందుంది.  ఆ ఖండానికో వాస్తా పాడా! అందులోనూ మనవాళ్ళు బస చేసింది సిడ్నీకి ఆగ్నేయంగా వుండే హోటల్లోనాయె! ఆ హోటల్ మనకి అచ్చిరాదయ్యా ధోనీ, ఈశాన్యం వైపునుండే హోటల్‌కి బస మార్చు అన్జెప్పా. విన్నాడా? లేదే! ఇప్పుడనుభవిస్తున్నాడు."

"కుదర్లేదేమో!"

"కుదరాలి. కేప్టనన్నాక శాస్త్రం చెప్పినట్లు నడుచుకోకపోతే ఎలా? శాస్త్రానికి ఎదురు తిరిగితే మంచినీళ్ళు కూడా పుట్టవు! సెమీ ఫైనల్‌కి ముహోర్త బలం లేదు, ఇండియా వైపు శుక్రుడు వక్ర ద్రుష్టితో చూస్తున్నాడు. శుక్రుణ్ని తప్పించుకోవాలంటే, మ్యాచ్‌లో ఎరుపురంగు దుస్తులు వాడాలని చెప్పాను. విన్నాడా? లేదే! ఇప్పుడనుభవిస్తున్నాడు."

"మన డ్రెస్ బ్లూ కలర్ కదా!"

"అయితేనేం? ప్యాంట్ లోపల కట్ డ్రాయర్లు ఎర్రవి వేసుకోవచ్చుగా? వేసుకోలేదు! అంతా అయ్యాక - ఇప్పుడు ఎంతేడ్చినా ఏం లాభం!"

"అయినా క్రికెట్‌కి వీటితో సంబంధం ఏంటి!?"

"వుంది నాయనా వుంది. ఏదైనా శాస్త్రం ప్రకారం జరగాల్సిందే! గ్రహబలం కలిసి రాకపోతే బౌలర్‌కి బంతి పడదు, బ్యాట్స్‌మన్‌కి బంతి కనిపించదు. ధోనీ మూర్ఖత్వం వల్ల ఇవ్వాళ దేశానికే నష్టం కలిగింది. అదే నా బాధ!"

"ఇంతకీ ఎవరండి తమరు?"

"ఓయీ అజ్ఞానీ! శ్రీశ్రీశ్రీఅండపిండ బ్రహ్మాండ దైవజ్ఞ సిద్ధాంతినే ఎరగవా? నేనెవరనుకున్నావు? తెలుగు ముఖ్యమంత్రులు నా క్లయింట్లు. నా సలహా లేకుండా వాళ్ళు వీపు కూడా గోక్కోరు."

"అలాగా!"

"తెలంగాణా ముఖ్యమంత్రి జాతక రీత్యా హైదరాబాద్ నగరం నడిబొడ్డున నీళ్ళుండటం ఆయన కుటుంబానికి అరిష్టం అన్జెప్పాను, అంతే! ఆయనిప్పుడు హుస్సేన్ సాగర్‌ని పూడ్పించే పన్లో పడ్డాడు. కృష్ణానది తూర్పుదిశగా ప్రవహించడం ఆంధ్రా ముఖ్యమంత్రి పదవికి గండం అన్జెప్పాను, అంతే! ఆయనిప్పుడు కాలవలు తవ్విస్తూ కృష్ణానది ప్రవాహ దిశని మళ్ళించే పన్లో పడ్డాడు. ఏదో క్రికెట్ మీద ఆసక్తి కొద్దీ ధోనీకి సలహాలు చెప్పానే గానీ - అయాం వెరీ బిజీ యు నో!"   

Wednesday 25 March 2015

కష్టమైన ప్రశ్న


"నువ్వీమధ్య తెలుగు న్యూస్ పేపర్లని ఇన్సల్ట్ చేస్తున్నావు."

"నేనా! ఎలా?"

"వాటిని చదవొద్దని చెబుతున్నావుగా?"

"చదవొద్దని చెప్పలేదనుకుంటా! కొనొద్దంటున్నాను."

"అలా చెప్పడం కూడా ఇన్సల్ట్ చెయ్యడమే అవుతుంది."

"ఎలాగవుతుంది? ఎవరైనా ప్రచార కరపత్రాలు ఫ్రీగా ఇస్తే చదువుతారు గానీ, కొనుక్కుని చదువుతారా?"

"అంటే - తెలుగు న్యూస్ పేపర్లు ప్రచార కరపత్రాలా?"

"అవును. అవి ఆయా రాజకీయ పార్టీల ప్రచార కరపత్రాలే కదా!"

"ఒప్పుకుంటున్నాను. కానీ - అన్నీ కాదుగా?"

"కాదా? బాబ్బాబూ! వార్తల్ని వార్తలుగా రాసే తెలుగు పత్రికేదైనా వుంటే చెప్పవా? వెంటనే చందా కడ్తాను."

"ఇది చాలా కష్టమైన ప్రశ్న. వెంటనే సమాధానాం చెప్పాలంటే కుదర్దు. కొద్దిగా టైమివ్వు. ఆలోచించుకుని చెబ్తాను."

"టేక్ యువరోన్ టైమ్." 

Monday 23 March 2015

అతడు సిగరెట్‌ని జయించాడు



అదొక చిన్నగది. అంతంత మాత్రం వెల్తుర్తో - దుమ్ముతో, బూజుతో బహుసుందరంగా వుంది. ఆ గది మధ్యన వయసుడిగిన టీపాయ్, దానిపై కాల్చి పడేసిన సిగరెట్ పీకల్తో ఒక ఏష్ ట్రే. ఆ పక్కనే గోల్ద్‌ఫ్లేక్ కింగ్స్ సిగరెట్ పేకెట్. 

టీపాయ్ ఎదురుగా ఒక పాతకుర్చీ. ఆ కుర్చీలో అతడు! అతడి వయసు సుమారు ముప్పయ్యైదేళ్ళు వుండొచ్చు. తెగులొచ్చి కొరుక్కుపోయిన జొన్నచేల్లా, ఏనుగులు తొక్కేసిన చెరకుతోటలా - అతడి జుట్టు పల్చగా, అడ్డదిడ్డంగా వుంది. అతను పొడవూ కాదు, పొట్టీ కాదు. నలుపూ కాదు, ఎరుపూ కాదు. 

గదిలో ఓ పక్కగా డొక్కుబల్ల, దానిమీద చిందరవందరగా కొన్ని పుస్తకాలు. ఆ పుస్తకాలు ఆధార్ కార్డు లేని అనాధల్లా - దిగాలుగా, దీనంగా వున్నాయి. అతగాడు పుస్తకాలు చదువుతాడు గానీ, వాటి యెడల గౌరవం వున్నవాళ్ళా లేడు.

కొద్దిసేపట్నుండీ అతనా సిగరెట్ పేకెట్‌ని దీక్షగా చూస్తున్నాడు. చూపు సిగరెట్ పేకెట్ మీదనే వుంది కానీ, అతడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొద్దిసేపు - అతడా సిగరెట్ పేకెట్‌ని ప్రియురాలి అందమైన చిరునవ్వుని తొలిసారి గాంచినట్లు మురిపెంగా చూశాడు. మరికొద్దిసేపు - జ్యోతిలక్ష్మి క్లబ్బు డ్యాన్సుని ప్రభాకర్రెడ్డి చూసినట్లు మత్తుగా చూశాడు. ఇంకొద్దిసేపు - కరువు ప్రాంతంవాడు బిర్యానీ వైపు చూస్తున్నట్లు ఆబగా, ఆకలిగా చూశాడు.

అసలు విషయం -

అతడికి నిన్నో పిడుగులాంటి వార్త, చిన్ననాటి స్నేహితుడికి గుండెపోటు! చూడ్డానికి హడావుడిగా ఆస్పత్రికి వెళ్ళాడు. రోగులు, వారి దుఃఖ బంధువులు, హడావుడి నర్సులు, సీరియస్ డాక్టర్లు.. భూలోకంలో యమలోకంలా వున్న ఆ వాతావరణం అతనికి భయం కలిగించింది.

గుండెపోటు స్నేహితుడు నీరసంగా అన్నాడు "నువ్వు సిగరెట్లు మానెయ్ మిత్రమా! నా స్థితి తెచ్చుకోకు." 

ఐసీయూ బయట అతని తల్లి బిగ్గరగా రోదిస్తుంది. "సిగరెట్లు మానైమంటే విన్నాడు కాదు బాబూ! ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు చూడు!" 

ఆ తల్లి రోదన అతనికి వికృతంగా, వికారంగా అనిపించింది. 'మా అబ్బాయి చేత ఆ పాడు సిగరెట్లు కాల్పించిన దొంగ వెధవ్వి నువ్వేరా?' అన్నట్లుగా కూడా అనిపించింది. 

గిల్టీగా, హడావుడిగా, వడివడిగా ఆస్పత్రి నుండి బయటపడ్డాడు.

ఆ రోజుదాకా అతడు నిర్లక్ష్యంగా, కులాసాగా, దిలాసాగా, సరదాగా బ్రతికేశాడు. 'ఆరోగ్యమే మహా భాగ్యం' అని విన్నాడే గానీ, ఏనాడూ ఆరోగ్యం గూర్చి ఆలోచించిన పాపాన పోలేదు. 

అతడు తన స్నేహితుడి దుస్థితికి మిక్కిలిగా చింతించాడు. సిగరెట్ అలవాటుని అర్జంటుగా మానెయ్యాలని ఆ క్షణానే నిర్ణయించేసుకున్నాడు. 

అనుకున్నాడే గానీ - ఆచరించడం అనుకున్నంత సులభంగా అనిపించట్లేదు. నిన్నట్నుండి సిగరెట్లు కాల్చకపోడం మూలానా నాలుక పీకేస్తుంది. నోరంతా బండ బారినట్లుగా, రక్తప్రసరణ ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది.

అతడు నిదానంగా సిగరెట్ పాకెట్ ఓపెన్ చేసి ఒక సిగరెట్ బయటకి తీశాడు. చూడ్డానికి - తెల్లగా, పుల్లలా, అందంగా.. ముద్దొస్తుంది బుజ్జిముండ! సిగరెట్‌కి చివర్నున్న ఫిల్టర్ దర్జాగా దొంగోట్లతో గెల్చిన ఎమ్మెల్యేలా గర్వంగా చూస్తుంది. 

సిగరెట్‌ని కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు మధ్యన వుంచుకున్నాడు. సిగరెట్‌ని చూస్తూ ఆలోచించసాగాడు. ఈ సిగరెట్టు తనకెంత సేవ చేసింది! తను కాలి బూడిదైపోతూ కూడా, తన బ్రతుకు బుగ్గి చేసేవాడికి గొప్ప సుఖాన్నిచ్చే ఈ సిగరెట్టు ఎంత నిస్వార్ధమైనది! ఎంత త్యాగశీలి! 

అతడు దీర్ఘంగా నిట్టూర్చాడు. 'ధూమపానము వల్ల త్వరత్వరగా, వడివడిగా చచ్చెదరని వైద్యశాస్త్రములెల్ల అవిరామముగా ఘోషించుచున్నవి. అట్టి మహమ్మారి అలవాటు యెడల నీవింత ప్రీతిపాత్రమైన ఆలోచనలని దరిజేరనీయరాదు. ఇట్టి ధోరణి నిక్కముగా నీకు నష్టము కలుగజేయును.'

అతడు తల విదిలించాడు. 'ఐ గేవప్ స్మోకింగ్. నో సెకండ్ థాట్స్!' అనుకున్నాడు. అంతలోనే మళ్ళీ ఆలోచనలు!

'సిగరెట్ వల్ల ఉపయోగమేమి? పొగాకులోని నికోటిన్ అను రసాయన పదార్ధము నరముల్ని, అందుగల న్యూరోట్రాన్మిటర్లని శ్రేష్టమైన వాషింగ్ పౌడర్ వలే శుభ్రము చేయును, తద్వారా ఆలోచనల్ని పదును పెట్టును.'

'నిజమా! అందుకు సాక్ష్యమేమి?'

'ఎవిడెన్స్ ఈజ్ ప్లెంటీ! ఈ సిగరెట్టు సాయంతో దోస్తవస్కీని దోసెలాగా నమిలెయ్యలేదా? కాఫ్కాని కాఫీలా తాగెయ్యలేదా? ఈ సిగరెట్టే లేకపోతే - వాళ్ళ సంగతటుంచు, కనీసం జేమ్స్ హేడ్లీ చేజ్ అయినా నీకర్ధమయ్యేవాడా? కాదుకదా!'

ఈ సిగరెట్ పాఠకులకే కాదు, రచయితల మనోవికాసానిక్కూడా ఎంతగానో తోడ్పడింది! సిగరెట్ తాక్కపోయినట్లైతే శ్రీశ్రీ 'మహాప్రస్థానం' రాసేవాడుకాదు! కేశవరెడ్డి 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్' రాసేవాడు కాదు! 'లవబుల్ గాడ్' అంటూ మిల్స్ ఎండ్ బూన్ టైపులో ఇంకేదో రాసేవాడు! 'రాజు - మహిషి' రావిశాస్త్రితో రాయించడానికి లెక్కలేనన్ని సిగరెట్లు మూకుమ్మడిగా ఆత్మాహుతి చేసుకున్నాయట!  

రాజకీయ నాయకుడికి అవినీతి ఆరోపణలు శోభనిస్తాయి. అలాగే సాహిత్యానికి సిగరెట్టు సొగసునిస్తుంది. అంచేత - గొప్ప సాహిత్యం పుట్టుక, పెరుగుదలలకి ప్రత్యక్ష కారణం ధూమపానమేనని చరిత్రకారులు, సాహిత్య విమర్శకులు, ఇంకా అనేకమంది జ్ఞానులు, విజ్ఞానులు, అజ్ఞానులు కోడై కూస్తున్నారు, నొక్కి వక్కాణిస్తున్నారు. వారి మాటలు నీవు ఆలకింపుము, ఆచరింపుము, సజ్జనుడవు కమ్ము.

అతడు భారంగా నిట్టూరుస్తూ తలని రెండు చేతుల మధ్య పట్టుకున్నాడు. ఒక్కో పదం స్పష్టంగా ఒత్తి పలుకుతూ తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా అనుకున్నాడు. 

'నేను స్మోకింగ్ మానేశాను.'

చేతిలోనున్న ఆ వెలిగించని సిగరెట్‌ని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఆపై ఆ సిగరెట్ ముక్కు దగ్గర తీసుకుని వాసన చూశాడు. కమ్మని పొగాకు వాసన అతని ముక్కుపుటాల్ని మిక్కిలి ఆనందపరిచింది. 

'ఆహాహా! ఏమి ఈ సువాసన!' 

మళ్ళీ ఆలోచనల కందిరీగలు -

'ఇప్పుడీ సిగరెట్ మానేసి తను సాధించేదేముంది? పక్కింటి పంకజాక్షి మొగుడు రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు కాల్చి నూరేళ్ళు బతకలేదా? సిగరెట్ వాసనంటేనే పడని ఎదురుంటి ఏనుగులాంటి ప్లీడరు గుండెపోటుతో గువ్వలా ఎగిరిపోలేదా? ఎవరెంత కాలం, ఎలా బతుకుతారో నిర్ణయించేది ఆ పైవాడే కానీ - మానవుడు కాదు, కాజాలడు. ఈ నగ్నసత్యం వేదాల్లో కేపిటల్ లెటర్సుతో రాయబడింది. కావున - అనవసర భయాల్తో సిగరెట్టు మానేసి ఈ జీవితంలో వున్న ఆ కొద్ది సుఖాన్ని పోగోట్టుకోలేను!'

అతడు స్టైలుగా పెదాల మధ్య సిగరెట్ పెట్టుకున్నాడు, అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ మంటని సిగరెట్ కొనదాకా తెచ్చాడు. సిగరెట్ వెలిగించకుండా.. అలా కాలుతున్న అగ్గిపుల్లతోనే (మళ్ళీ) ఆలోచన్లో పడ్డాడు.

'లేదులేదు! స్మోకింగ్ ఖచ్చితంగా చావుకి పాస్‌పోర్ట్ వంటిది. కాదంటూ శుష్కవాదన నెత్తినెత్తుకోవడం ఆత్మవంచన. తనిన్నాళ్ళూ స్మోకింగ్‌ని ఎంజాయ్ చేశాడు, ఇప్పుడు మానేసే టైమొచ్చేసింది. ఇకనైనా సిగరెట్లు మానేసి ఆరోగ్య సూత్రాలు పాటించడం నాకూ, నా కుటుంబానికి మంచిది.'

అగ్గిపుల్ల మంట చివరిదాకా వచ్చి వేలుకి తగిలి చురుక్కుమంది. ఆ వేడికి 'స్' అనుకుంటూ పుల్లని పడేశాడు. ఇప్పుడతనో నిర్ణయానికొచ్చాడు. నిదానంగా ఆ సిగరెట్‌ని ముక్కలుగా తుంచేసి ఏష్ ట్రేలో పడేశాడు. సిగరెట్ పేకెట్‌ని కిటికీలోంచి బయటకి గిరాటేశాడు. అతని మనసు ప్రశాంతంగా వుంది!

అవును! అతడు సిగరెట్‌ని జయించాడు!           

(picture courtesy : Google)

Thursday 19 March 2015

మా గోఖలే


సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్.. ఇవన్నీ పండగలు. ఈ రోజులు ఆయా మతాలవారికి మాత్రమే పర్వదినాలు. నిన్న మా గుంటూర్లో అన్ని మతాలవారికి పండగ దినం. కారణం - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ  జరిగింది!

హిమాలయ పర్వతం ఎక్కడం, సముద్రాల్ని ఈదడం లాంటివాటిని సాహస కార్యాలంటారు. వీటిల్లో రికార్డులు కూడా వుంటాయిట! అయితే ఆయా రికార్డుల్తో పేదప్రజలకి వొనగూరే ప్రయోజనమేంటో నాకు తెలీదు. కానీ - గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడం మాత్రం ఖచ్చితంగా సాహసకార్యం, భవిష్యత్తులో పేదప్రజలకి ఎంతగానో ఉపయోగపడే కార్యం. ఈ సాహసానికి టీమ్ లీడర్ మిత్రుడు డాక్టర్ గోఖలే. ఈ లక్ష్యంలో గోఖలేకి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నాను.

'గుంటూరు మెడికల్ కాలేజి'. ఈ పేరు వినంగాన్లే నాతోసహా చాలామంది నా మిత్రులకి ఎంతో కృతజ్ఞతా భావం. మా కాలేజి నాలాంటి అనేకమంది పేదవార్ని వైద్యులుగా తయారుచేసింది. మా ట్యూషన్ ఫీజు సంవత్సరానికి అక్షరాలా నలభై రూపాయిలు! పొరబాటున - ఒక నాలుగు వేలు ఎడ్మిషన్ ఫీజుగా కట్టమన్నట్లైతే నేను డాక్టర్నైయ్యేవాణ్ని కాదు!

ఈ.ఎన్.బి.శర్మగారు, సి.మల్లిఖార్జునరావుగారు, సి.సావిత్రిగారు, వెంగళరావుగారు మొదలైన ప్రొఫెసర్లు మాకు విద్యాదానం చేసిన దాతలు. వారు గుర్తొచ్చినప్పుడు మా మనసు కృతజ్ఞతా భారంతో బరువైపోతుంది. వాళ్ళు ప్రభుత్వం నుండి తీసుకున్న జీతం అణువంతైతే, మాకు ఇచ్చిన శిక్షణ కొండంత. వారి నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం నన్ను ఆశ్చర్యపరుస్తుంది (నాకు మా టీచర్ల గొప్పతనం చదువుకునేప్పుడు తెలీదు). 

సరీగ్గా ఇదే భావన - మా గుంటూరు మెడికల్ కాలేజి అనేకమంది పూర్వ విద్యార్ధులక్కూడా వున్నట్లుంది. అందుకే వాళ్ళు (ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డవారు) మా కాలేజికి ఏదో రకంగా సేవ చేద్దామని తపన పడుతుంటారు. ఆ తపనలోంచి పుట్టిందే పొదిల ప్రసాద్ మిలినీయం బ్లాక్. ఈ బ్లాక్ తల్లికి పిల్లలు ఇచ్చిన బహుమతి వంటిది. 

ఇవ్వాళ గోఖలే టీమ్ ప్రభుత్వరంగంలో మొదటిసారిగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడానికి ఎంతోమంది అనేక రకాలుగా కృషి చేశారు. ఈ కృషి ఏ ఒక్కరిదో, ఏ ఒక్కనాటిదో కాదు. ఎంతోమంది ఎన్నాళ్ళుగానో పడిన శ్రమ పురుడు పోసుకుని 'ఓపెన్ హార్ట్ సర్జరీ' అనే బిడ్డని కన్నాయని నా నమ్మకం.

ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. రాజకీయ నాయకులు నిజాయితీగా వుంటే దేశం బాగుపడుతుంది. అలాగే - ఏ రంగంలోనైనా కావల్సింది నిజాయితీ, పట్టుదల, కృషి. ఇవన్నీ కలిగిన వారు మాత్రమే మొక్కవోని దీక్షతో ముందుకెళ్తుంటారు. స్పీడ్ బ్రేకర్లని ఎదుర్కోడం, దాన్నించి పాఠం నేర్చుకోవడం.. ఇవన్నీ వారికో చాలెంజ్. ఈ లక్షణాలు నా మిత్రుడు గోఖలేలో పుష్కలంగా వున్నాయి. 

ఈ ప్రయాణంలో మా గోఖలేకి అతని భార్య డాక్టర్ లక్ష్మి సహకారం ఎంతో వుందని నాకు తెలుసు. ఆవిడకి అప్పుడే పుట్టిన పిల్లలకి వైద్యం చెయ్యడంలో నైపుణ్యం వుంది. అంతేకాదు - ఎప్పుడో పుట్టిన గోఖలే మనసుని ఆనందంగా, ప్రశాంతంగా వుంచడంలో కూడా నైపుణ్యం వుంది. డాక్టర్ లక్ష్మికి అభినందనలు!

చాలామందికి డబ్బు సంపాదించడంలో ఆనందం వుంటుంది. అతి కొందర్లో ప్రజలకి సేవ చెయ్యడంలో ఆనందం వుంటుంది. ఆ 'అతికొందర్లో' మా గోఖలే కూడా ఒకడు. గుండె ఆపరేషన్ల ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్ళని దాటేస్తున్న నా మిత్రుడు గోఖలే - ఇలాంటి అనేక ప్రజాహిత కార్యాలు తలపెట్టాలనీ, అందుగ్గానూ వాడికి తగినంత 'గుండె ధైర్యం' లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Thursday 12 March 2015

మిస్టర్ అర్నబ్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!


మనిషి పుట్టుకతో జంతువు. అయితే ఈ జంతువుకి ఆలోచన ఎక్కువ. ఆలోచనల ద్వారా - అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పయనించడం అనేది మనిషి చచ్చేదాకా కొనసాగే ప్రక్రియ. ఈ జ్ఞానాజ్ఞాములు సమతూకంలో వుంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని నా అభిప్రాయం. అజ్ఞానం ఎక్కువైతే సమాజానికి నష్టం, విజ్ఞానం ఎక్కువైతే మనిషికి నష్టం!

కొన్నిసార్లు జ్ఞానం ఆనందాన్నిస్తుంది, ఇంకొన్నిసార్లు అజ్ఞానమే సుఖాన్నిస్తుంది. అంచేత - ఈ జ్ఞానాజ్ఞానాల్లో ఎవరికేది కావాలో వారే నిర్ణయించుకోవాలి! నాకింత గొప్ప అవగాహన వుండడం వల్ల సుఖమయ జీవనం కోసం కొన్ని పన్లు మానేశాను. ఉదాహరణకు - నేను తెలుగు పత్రికలు చదవను, తెలుగు న్యూస్ చానెల్స్ చూడను. ఈ 'మానెయ్యడం' వెనక -  గొప్ప థియరీ అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు ఈ పన్లు చేస్తుంటే చిరాగ్గా వుండేది, మానేశాక ప్రశాంతంగా వుంది - అంతే! తద్వారా నచ్చని పని చెయ్యకపోవడంలో ఎంతో ఆనందం వుందని గ్రహించాను!

అలాగే - 'టైమ్స్ నౌ' అనే ఇంగ్లీషు న్యూస్ చానెల్ చూడ్డం మానేశాను. ఆ చానెల్‌కి ఎడిటర్ అర్నబ్ గోస్వామి అనే ప్రబుద్ధుడు. అతగాడు రాత్రిళ్ళు 'న్యూస్ అవర్' అంటూ ఒక చర్చల దుకాణం నడుపుతాడు. అయితే - అక్కడ చర్చలేమీ జరగవు. అక్కడంతా ఆ యాంకరాధముడి అరుపుల ప్రహసనం. ఆ అరుపుల్నే ప్రశ్నలు అనుకోమంటాడు! ఎవరికీ కూడా తన భీభత్స ప్రశ్నలకి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడు!

అన్నట్లు - అర్నబ్ గోస్వామిగారు గొప్ప దేశభక్తుడు కూడా! అతని దేశభక్తి వర్షాకాలం మురుక్కాలవ వలే పొంగి పొర్లిపోతుంటుంది. ఒక్కోసారి పూనకం స్థాయికి చేరుకొని - వేపమండల్తో కొడితే గానీ దిగదేమోనన్నంత ఉధృత స్థాయికి చేరుకుంటుంది. అప్పుడతను - తనకి నచ్చని అభిప్రాయాలు చెప్పే గెస్టుల్ని తిడతాడు, వాళ్ళు దేశద్రోహులంటూ మండిపడతాడు (గిచ్చడం, కొరకడం లాంటివేమన్నా చేశాడేమో నాకు తెలీదు)!

చాలారోజుల తరవాత (నా ఖర్మ కాలి) - అర్నబ్ గోస్వామి విన్యాసాలు వీక్షించే మహద్భాగ్యం మరొకసారి లభించింది. ఆరోజు - అతగాడు ఢిల్లీ రేప్ సంఘటన మీద ఒక బ్రిటీష్ యువతి తీసిన డాక్యుమెంటరీపై తీవ్రమైన కోపంతో ఊగిపోతున్నాడు. ఆ విదేశీయురాలు భారద్దేశం రూల్సుని పాటించలేదని చిందులేస్తున్నాడు. ఆవేశంలో నరాలు చిట్లి చస్తాడేమోనని భయపడ్డాను.. ఆ తరవాత కొద్దిసేపటికి ఆశ్చర్యపొయ్యాను.

ఏ దేశంలోనైనా, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కలవాడైనా, 'ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్' అంటూ తపన పడతాడు. అయితే ఈ మహాజ్ఞాని ఆ డాక్యుమెంటరీని కేంద్రప్రభుత్వం నిషేధించడాన్ని సమర్ధిస్తాడు! ఆ నిషేధాన్ని ప్రశ్నించేవారిని తీవ్రస్థాయిలో కేకలేస్తున్నాడు. అతని దేశభక్తి ఉన్మాద స్థాయికి చేరింది! అంటే - ఇన్నాళ్ళైనా మనవాడి రోగం నిదానించలేదన్న మాట!

ఈ అర్నబ్ గోస్వామి సర్కస్ షోని క్రమం తప్పకుండా చూసే వాళ్ళు కూడా వున్నారు! కారణమేమి? ఎవరి కారణాలు వారివి. కొందరికి ప్రశాంతమైన చర్చలు ఇష్టం వుండదు. వారికి - తగాదాలు, తిట్టుకోడాలు, గందరగోళాలంటే ఇష్టం. వీళ్ళు - రోడ్డు మీద చిన్నపాటి తగాదాల్ని గుంపులుగుంపులుగా చేరి ఆసక్తిగా చూసే బాపతు. ఇంకొందరు సర్కస్ ప్రియులు! మరికొందరికి కోతి చేష్టలంటే భలే ఇష్టం!

'న్యూస్ అవర్' ప్రోగ్రాం WWE పోటీల్ని మరిపిస్తుంది. అక్కడా ఇంతే - పోతుల్లంటి వస్తాదులు ఒకర్నొకరు తీవ్రంగా దూషించుకుంటారు, ద్వేషించుకుంటారు, చాలెంజిలు విసురుకుంటారు. ఆ టెంపోని ఒక స్థాయికి తీసుకెళ్ళాక కొట్టుకుంటారు (కొట్టుకున్నట్లు నటిస్తారు). ఈ తగాదాలు జనాకర్షకంగా వుండేట్లు రాయడానికి ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటర్లు వుంటారు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, ఫక్తు వ్యాపార సంస్థ. వాళ్ళ తన్నులాట ఎంత ఎక్కువమంది చూస్తే వారికంత గిట్టుబాటు.

అర్నబ్ గోస్వామి కూడా WWE సూత్రాన్నే నమ్ముకున్నట్లుగా వుంది. అతనికి తన ప్రోగ్రాంని ఇష్టపడేవారు, అసహ్యించుకునేవారూ.. ఎవరైనా పర్లేదు - వ్యూయర్‌షిప్ వుంటే చాలు! అందుకోసం వార్తల్ని వీధిపోరాట స్థాయికి దించేసి విజయం సాధించాడు. 'ద నేషన్ వాంట్స్ టు నో' అంటూ దబాయిస్తాడు - అదేదో దేశమంతా పన్లు మానుకుని అతని ప్రోగ్రామే చూస్తున్నట్లు! 'ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి' అంటూ ఏవో కాయితాలు చూపిస్తూ ఊపుతుంటాడు (ఎప్పుడు ఊపినా అవే కాయితాలని మా సుబ్బు అంటాడు)! 

'వార్తలు - వీధిపోరాట చర్చలు' అనే వినోద కార్యక్రమంతో గోస్వాములవారూ, తద్వారా టైమ్స్ నౌ చానెల్ వారూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. వారి వినోద వ్యాపారం రిలయన్స్ వారి వ్యాపారంలాగా విజయవంతంగా కొనసాగుతుంది. చర్చల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన సీరియస్ వార్తల్ని సైతం యాక్షన్ థ్రిల్లర్ స్థాయికి దించేసిన ఈ చౌకబారు కార్యక్రమం చూడకపోవడం నాకు హాయిగా వుంది!  మీక్కూడా ఆ హాయి కావాలా? అయితే - అది మీ చేతిలోనే వుంది!  

'మిస్టర్ అర్నబ్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!'

Thursday 5 March 2015

సిటీ బ్యూటిఫుల్


నిన్న డాక్టర్ కేశవరెడ్డి 'సిటీ బ్యూటిఫుల్' చదివాను. సీరియల్‌గా వచ్చినప్పుడు ఈ నవల మొత్తంగా చదివానని అనుకున్నాను గానీ.. కొన్ని భాగాలు మిస్సయ్యానని చదువుతుంటే అర్ధమైంది. 'సిటీ బ్యూటిఫుల్' సీరియల్‌గా చదవడానికి అస్సలు బాగోదు, ఏకబిగిన చదివితేనే మజా!

ఈ మధ్యన వరసగా 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్', 'మూగవాని పిల్లనిగ్రోవి', 'చివరి గుడిసె', 'మునెమ్మ'ల్ని చదివేశాను. పల్లె వాతావరణంతో నాకు పరిచయం లేదు, దళితుల జీవితం పట్ల కనీస అవగాహన లేదు. అంచేత ఆ నవలల్ని అర్ధం చేసుకుంటూ నిదానంగా చదవాల్సి వచ్చింది. అయితే 'సిటీ బ్యూటిఫుల్' మెడికల్ స్టూడెంట్ కథ కావడం కారణాన - ఇబ్బంది పడకుండా హాయిగా చదివేశాను.

ఇప్పుడు 'సిటీ బ్యూటిఫుల్' గూర్చి కొన్ని ఆలోచనలు -

దేవీదాస్‌ని చదువుతుంటే ఫిలిప్ గుర్తొచ్చాడు. సోమర్సెట్ మామ్ 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్' ప్రధానపాత్ర ఫిలిప్. మెడిసిన్ చదువు మధ్యలో ఆగిపోతున్నందుకు ఫిలిప్ కూడా దేవీదాస్ లాగే క్షోభ పడతాడు. ఫిలిప్ తన క్లబ్ ఫుట్ (వంకర పాదం) గూర్చి బాధ పడితే, దేవీదాస్ ఎడమచేతి వాటం గూర్చి చికాగ్గా వుంటాడు. కొద్దిసేపు 'క్రైమ్ ఎండ్ పనిష్‌మెంట్'  కూడా రాస్కల్నికోవ్‌ కూడా గుర్తొచ్చాడు. కానీ రాస్కల్నికోవ్‌ది మరీ దుర్భరమైన అసహాయ స్థితి.

డాక్టర్ కేశవరెడ్డి గొప్ప స్టోరీ టెల్లెర్. చార్ల్స్ డికెన్స్, జాక్ లండన్ వంటి ప్రతిభావంత రచయితలకి మల్లె కేశవరెడ్డీ మనని సులువుగా కథలోకి లాక్కెళ్ళిపోతాడు. అలా లాక్కెళ్లి మనల్ని పాత్రల మధ్యన వదిలేస్తాడు. అంచేత - ఆయా పాత్రలతో పాటుగా మనం కూడా ఏడుస్తాం, నవ్వుతాం, కోపగించుకుంటాం. బీ కేర్ఫుల్! ఈ గొప్పరచయితలు మనల్ని తమ అధీనంలోకి తీసుకుని పెట్టే అవస్థలు అన్నిన్ని కావు!

'సిటీ బ్యూటిఫుల్' కొన్ని గంటల పాటు సాగిన దేవీదాస్ ఆలోచనల సమాహారం. అవి చదువుతూ అనుభవించాల్సిందే గానీ - ఆ ఉద్వేగాన్ని 'ఫలానా' అంటూ వివరించడం కుదరదు. నా దృష్టిలో - ఈ రచన 'అంపశయ్య'తో పోల్చదగ్గ మాస్టర్ పీస్. ఇంకా చెప్పాలంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ (ఇంతకన్నా వర్ణించడానికి నాదగ్గర భాష లేదు).

'సిటీ బ్యూటిఫుల్‌' చదివేప్పుడు ఒక విషయం నాకర్ధం కాలేదుమెడికల్ కోర్సు మొదట్లో ఎనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ అనే మూడు సబ్జక్టులు వుంటాయి. వీటిని ప్రి - క్లినికల్ సబ్జక్టులు అంటారు. తరవాత ఆస్పత్రిలో రెగ్యులర్ పోస్టింగ్ (బెడ్‌సైడ్ టీచింగ్ కోసం) వేస్తారు. అంటే - ఎనాటమీ పాసయ్యేదాకా స్టూడెంట్‌కి ఆస్పత్రితో ఏ సంబంధమూ వుండదు. అందువల్ల ప్రి - క్లినికల్ బ్లాకులు ఆస్పత్రికి సంబంధం లేకుండా విడిగా, దూరంగా వుంటాయి (గుంటూరు మెడికల్ కాలేజి కేంపస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కేంపస్‌లు వేరువేరుగా వుంటాయి).

'సిటీ బ్యూటిఫుల్‌'లో ఎనాటమీ డిపార్ట్‌మెంట్ హాస్పిటల్ ఆరో అంతస్తులో వున్నట్లుగా వుంది, ఇది నాకర్ధం కాలేదు. కేశవరెడ్డి ప్రస్తావించిన పాండిచేరీ హాస్పిటల్ నేనెప్పుడూ చూళ్ళేదు. అంచేత - పాండిచేరీ గవర్నమెంటు సర్వీసులో స్థిరపడ్డ నా స్నేహితుడు డాక్టర్ రమణమూర్తికి ఫోన్ చేశాను. అతని సమాచారం మేరకు - కేశవరెడ్డి చదివిందీ, నవల్లో ఆయన రాసిందీ - JIPMER గూర్చి. అక్కడ ఎనాటమీ డిపార్ట్‌మెంట్ అలానే వుంటుందిట, ఇంకా అలానే వుందిట!

ఇంకో సమాచారం - ఆ రోజుల్లో కెమిస్ట్రీ కూడా ఒక సబ్జక్టుగా (PPF - 'ప్రి ప్రొఫెషనల్ కోర్స్' అనేవాళ్ళు) వుండేది. అటు తరవాత డెబ్భైలలో ఈ కోర్స్ ఎత్తేశారు (నేనూ ఈ కోర్స్ చదవలేదు). కావున - డెబ్భైల తరవాత డాక్టర్ కోర్సులో చేరినవారికి దేవీదాస్, లావణ్యల 'కెమిస్ట్రీ ఆఫ్ లవ్' ఇన్ కెమిస్ట్రీ లేబ్ అర్ధం అయ్యే అవకాశం లేదు.

'సిటీ బ్యూటిఫుల్' చదివే సాధారణ పాఠకుల కోసం (విషయం సులభంగా అర్ధమవడానికి) మెడికల్ కోర్సు గూర్చి కొద్దిపాటి సమాచారం ఇస్తే బాగుండేది. కారణం - 'మూగవాని పిల్లనగ్రోవి' చదివేప్పుడు వ్యవసాయం సంగతులు తెలీక నేను చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి ఇబ్బందే మెడికల్ కోర్స్ తెలీని పాఠకులకి ఈ నవల చదివేప్పుడు కలుగుతుందని నా అనుమానం.

(picture courtesy : Google)