Friday 30 May 2014

ప్రశ్నిజం


వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం, మండుటెండ, వేడిగాలి. 

అబ్బా! సెగలు, పొగలు, నిప్పుల కొలిమిలో నిల్చున్నట్లు, బొగ్గుల కుంపట్లో పడుకున్నట్లు.. ఇవ్వాళ ఇంత వేడిగా వుందేమిటి!

ఆకాశం ప్రశాంతంగా ఉన్నట్లు దొంగనిద్ర నటిస్తుంది, పైన ఒక్క మబ్బు తునక లేదు. నేల మండిపొతుంది, చెట్లు కాలిపోతున్నాయి, చేమలు మాడిపోతున్నాయి.. అసలు భూదేవే కాలిపోతున్నట్లుంది.

'దేవుడా! నన్ను కాపాడు, నేను నీ బిడ్డని, నామీద కోపమొచ్చిందా తండ్రీ? నీకే కోపమొస్తే నేనెవర్ని వేడుకోవాలి. రక్షించు తండ్రీ! రక్షించు.' వందోసారి దేవుణ్ని వేడుకున్నాడా వృద్దుడు.

అతనో యాచకుడు. ఎన్నోయేళ్ళుగా ఆ రోడ్డు పక్కనున్న వేపచెట్టు కింద అడుక్కుంటున్నాడు. కొన్నాళ్ళక్రితం ఆ రోడ్డు వెడల్పు చేయ నిశ్చయించిన మునిసిపాలిటీ వారు దశాబ్దాల వయసున్న ఆ వేపచెట్టుని కొట్టేశారు. ఆ విధంగా మానవజాతి అభివృద్ధి కొరకు ఒక వృక్షం హత్య చేయబడింది. (ఎవరూ చావకపోతే అభివృద్ధి సాధ్యం కాదు).

ఆ రోజునుండీ అతను నీడ కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆ చుట్టుపక్కలా ఎక్కడా చెట్టు లేదు, కనీసం నీడ కూడా లేదు. ఆ పక్కగా కొన్ని దుకాణాలున్నాయి. కానీ - ఆ దుకాణాలవారు తమ దుకాణం ముందు వృద్ధుని బిక్షాటన దుకాణాన్ని ఒప్పుకోలేదు.

అతనికి నెత్తిన నీడ కరువైంది. కొన్నిరోజులుగా కడుపుకి తిండి కూడా కరువైంది. అంచేత - ప్రస్తుతం నీడలేక, తిండి లేక, దాహంతో అల్లాడిపోతున్నాడు.

రోడ్డుపై జనసంచారం లేదు. ఆ వృద్ధుని శరీరం ఎండకి కాలిపోతుంది, వణికిపోతుంది. నీరసంతో కళ్ళు మూసుకు పోతున్నాయి, క్రమేపి ఒరిగిపోతున్నాడు.

దాహం.. నోరెండిపొతుంది, దాహం.. నాలుక పిడచకట్టిపోతుంది, దాహం.. నరాలు తోడేస్తున్నాయి, ఆకలి.. కళ్ళ ముందు చీకట్లు, ఆకలి.. గుండెల్లో నిప్పులు.

ఇంక దేవుడు తనని కాపాడడని అర్ధమైపోయింది.

'దేవుడా! నన్ను నీలో కలిపేసుకో. నాకిక ఆకలి కేకలు, దాహపు మాల్గులు, రోగపు నాదాలు, ఆర్తనాదాలు.. ఏమీ లేకుండా చేసెయ్యి.' వృద్దుడు మౌనంగా ప్రార్ధించాడు.

కొద్దిసేపటికి వేటగాని దెబ్బకి ఒరిగిపోయిన జింకలా, నిదానంగా రోడ్డు మీదకి పడిపొయ్యాడా వృద్ధుడు. అక్కడి దుకాణాల వాళ్ళు ఆ వృద్దుడు ఎండకి మండుతూ ఒరిగిపోవడం చూస్తూనే వున్నారు, కానీ - వాళ్ళెవరూ అతన్ని పట్టించుకోలేదు.

ఆ దుకాణదారులు కొన్నాళ్ళపాటు తమ దుకాణాలు మూసేసి కుటుంబాలతో సహా సంపూర్ణ దక్షిణ భారత దేశ పుణ్య క్షేత్రాల్ని భక్తిగా దర్శించుకుని ఇవ్వాళే దుకాణాల్ని తెరిచారు, అంచేత వాళ్ళు తీవ్రమైన వ్యాపార హడావుడిలో వున్నారు

ఇంతలో అటువైపుగా నలుగురు యువకులు వచ్చారు, వారికి సుమారు ఇరవయ్యేళ్ళు వుండొచ్చు. వారి టీ షర్టుల మీద చె గువేరా బొమ్మ ముద్రించి వుంది. వారు తెలుగు సినిమా హీరో అభిమానుల్ట. ఆ హీరోకి రాజకీయ జ్ఞానం దండిగా వుందిట. ఈమధ్యే ఏదో పుస్తకం కూడా రాశాట్ట. ఆ యువకులు తమ హీరో పిలుపు స్పూర్తిగా - ప్రస్తుతం దేశసేవ చేసే పన్లో వున్నారు.

ఆహా! ఏమి మన సౌభాగ్యము! సినిమాలు తీసి యువతని అభిమాన మత్తులో ముంచి నాలుగు డబ్బులు చేసుకుందామనుకునే స్వార్ధపరులున్న ఈ రోజుల్లో ఒక సినిమా హీరో - యువకుల్ని సామాజికంగా, రాజకీయంగా ఉత్తేజ పరుచుటయా! గ్రేట్!

ఆ యువకులు నేలకొరిగిన వృద్దుడిపై ఒంగి చూస్తూ, ఒకరి తరవాత ఇంకొకరు ప్రశ్నల వర్షం కురిపించారు.

"ఓ పెద్దాయనా! ఎవర్నువ్వు? ఎందుకిలా ఎండలో పడిపొయ్యావు?"

"నీరసంగా వుందా?"

"దాహంగా వుందా?"

"ఆకలిగా వుందా?"

ఆ వృద్దుడికి మాట్లాడే ఓపిక లేదు. నీరసంగా, దీనంగా వాళ్ళని చూశాడు. అతని మొహం ప్రేత కళ పడింది. 

అయితే - అన్ని ప్రశ్నలడిగిన ఆ యువకులు, ఆ తరవాత అతన్ని పట్టించుకోలేదు. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోసాగారు.

"ప్రస్తుతానికింతే! ఈ ముసలాయన మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ - మన హీరో ప్రశ్నించమనే చెప్పాడు. ఆ ప్రశ్నించే పనిని విజయవంతంగా పూర్తి చేశాం."

"అవును, ప్రశ్నలడగమన్నాడే గానీ సమాధానం వినమని మన హీరో తన పుస్తకంలో రాయలేదు."

"ఆయన ప్రస్తుతం సినిమా షూటింగులో ఉన్నాడు, వచ్చాక ఇంకో పుస్తకం రాస్తాళ్ళే! అప్పుడది ఫాలో అవుదాం."

"ఆ పుస్తకం పేరు 'జవాబిజం' అవ్వచ్చు."

"అప్పటిదాకా ఇలా ప్రశ్నిస్తూ ఉండటమే మన రాజకీయ కార్యాచరణ."

"అవునవును, ఇవ్వాల్టికి ఈ ముసలాయన్తో కలిపి మొత్తం పదిమందిని ప్రశ్నించాం."

ఇలా మాట్లాడుకుంటూ ముందుకు సాగారు ఆ యువకులు.

ముగింపు :

రాయడానికి పెద్దగా ఏం లేదు.. కొంతసేపటికి ఆ వృద్దుడు చనిపొయ్యాడు. అంతే!

Sunday 25 May 2014

మోడీ విమర్శకుల్లారా! ఖబడ్దార్


"ఒరే సూడో సెక్యులరిస్టూ! నీకు దమ్ముంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గూర్చి రాయి." సవాలు విసిరాడు నా మిత్రుడు.

నా మిత్రుడు ఆరెస్సెస్ సభ్యుడు, మోడీకి వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తాడు. రాజకీయంగా ఈ అభిప్రాయాలు కలిగి వుండటం అతని హక్కు. ఆ హక్కుని ఎవరైనా గౌరవించాల్సిందే, ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు.

కొందరు అమాయకులు మనకి భావ ప్రకటనా స్వేచ్చ ఉందని అనుకుంటారు. కానీ ఆ స్వేచ్చ వంకాయ కూర గూర్చో, సినిమాల గూర్చో రాసినప్పుడు మాత్రమే ఉంటుంది. రాజకీయ భావాలకి మాత్రం స్వేచ్చ ఉండదు, ఈ స్వేచ్చ దేవతా వస్త్రాల్లాంటిది. (రాజకీయాలంటే రోజూ తెలుగు పత్రికలు రాసే జగన్, చంద్రబాబుల నామస్మరణ, విమర్శల పరంపర కాదు).

బాల్ థాకరే చనిపోయినప్పుడు ముంబాయిలో సెలవు ప్రకటించడాన్ని ఒక యువతి ఫేస్ బుక్ లో ప్రశ్నించింది, ఇంకో అమ్మాయి ఆ అభిప్రాయానికి లైక్ కొట్టింది. ఏవో సెక్షన్ల కింద ఇద్దర్నీ అరస్టు చేశారు. వాస్తవానికి ఆ అమ్మాయిలు లేవనెత్తిన ప్రశ్న విలువైనది, వివరంగా చర్చించదగ్గది. కానీ, దైవసమానుడైన థాకరే గూర్చి ప్రశ్నించడమే నేరంగా ముంబాయి పోలీసులు భావించారు.

ప్రొఫెసర్ U.R. అనంత మూర్తికి నరేంద్ర మోడీ రాజకీయాలు నచ్చవు. అందుకు ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆ కారణాలు అందరికీ నచ్చాలని లేదు కూడా. మోడీ గనక ప్రధాని అయితే తాను దేశం వదిలేస్తానన్నాడు. ఇదేమీ నేరపూరితమైన ప్రకటన కాదు. అనంత మూర్తి రాజకీయ అభిప్రాయాల గూర్చి చర్చ ఎంత జరిగిందో తెలీదు కానీ..  ఆయన్ని ఎగతాళి చెయ్యడం, కించపరచడం మాత్రం ఒక ఉద్యమంలా సాగింది. పాపం, ఇవ్వాళ అనంతమూర్తి పోలీసువారి రక్షణలో ఉన్నాడు!

మనకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగింది. ఇందువల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల, ఎమర్జన్సీలో ఇందిరాగాంధీలా రాజకీయ వ్యతిరేకుల్ని అణిచెయ్యడం కుదరకపోవచ్చు (అనుకుంటున్నాను). అలాగే - కార్పోరేట్ మీడియా వండి వారుస్తున్న వార్తల్ని మాత్రమే చదివి ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాల్సిన దుస్థితి తప్పింది.

అయితే - ఇదే ఇంటర్నెట్ అనేక ముసుగు వీరుల్ని కూడా తయారు చేసింది. ఈ వీరులు తమకి నచ్చని భావాలు వ్యక్తం చేసినవారిని హీనంగా తిడతారు. ఆ రాసిన వ్యక్తిని చికాకు పెట్టడమే వీరి ఉద్దేశం. ఇదొక 'పధ్ధతి' ప్రకారం జరుగుతున్న కుట్ర. గత కొన్ని నెలలుగా రాజకీయంగా తమ నాయకుణ్ని వ్యతిరేకించిన వారిని ఎంత ఛండాలమైన భాషలో వీరు తిట్టారో చూస్తే ఆందోళన కలుగుతుంది. 

నేనామధ్య ఒక పాపులర్ తెలుగు నటుడి సినిమా చూశాను. నాకా సినిమా నచ్చలేదు, అదే అభిప్రాయం నా బ్లాగులో రాసుకున్నాను. కానీ - అప్పుడు నామీద తిట్ల పురాణంతో వేరేచోట ఒక చర్చ నడిచింది. నాకు కోపం, ఆశ్చర్యం కలిగాయి. అయితే ఈ సినీనటుల అభిమానం ఉన్మాద స్థాయిలో ఉంటుందనీ, వారి 'మనోభావాలు' దెబ్బ తిన్నప్పుడు పిచ్చికుక్కల స్థాయిలో మొరుగుతారనీ అర్ధం చేసుకున్నాక పట్టించుకోవటం మానేశాను.

మొన్న ఎన్నికల సందర్భంగా జగన్, చంద్రబాబుల్ని తిట్టడంలో రెండు కులాల మధ్య భీభత్సమైన బూతుల పోటీనే జరిగింది.

అంచేత - ఇప్పుడు నేను మోడీపై ఏదన్నా రాస్తే, అందులో పొరబాటున (నా ఖర్మ కాలి) మోడీ భక్తులకి నచ్చందేదైనా ఉంటే, వారితో తిట్టించుకునే ఓపిక లేదు.

అదే నా స్నేహితుడితో అన్నాను.

"నేను నరేంద్ర మోడీ గూర్చి ఎందుకు రాయడం? మీ ఆరెస్సెస్ వాళ్ళతో కలిసి 'జై శ్రీరాం! శిరో మార్!' అంటూ కవాతు కర్రల్తో నా బుర్ర రాం కీర్తన పాడించటానికా? అందుకే ఒప్పేసుకుంటున్నాను - నాకు నరేంద్ర మోడీ గూర్చి రాసేంత దమ్మూ, ధైర్యం లేదు. నన్నొదిలెయ్! అయినా - నీ అభిమాన నాయకుడు అద్భుత విజయం సాధించాడు. మీ సంఘ పరివారం మోడీ విమర్శకుల్ని భయపెట్టడంలో కూడా గొప్ప విజయం సాధించింది. ఈ విజయాల్ని ఎంజాయ్ చెయ్యక నాతో ఈ చాలెంజ్ లేమిటి?" నవ్వుతూ అన్నాను.

ముగింపు :

నా మిత్రుడు నా సమాధానానికి ఒప్పుకోలేదు. నేను నరేంద్ర మోడీ గూర్చి ఏదోకటి రాయాల్సిందేనని పట్టు పట్టాడు. ఓకే! ఇదుగో రాస్తున్నా.. చదువుకో మిత్రమా!

'శ్రీశ్రీశ్రీ నరేంద్ర మోడీగారు కారణ జన్ములు, అవతార పురుషులు. శ్రీ మోడీగారు భారత దేశ రాజకీయాల్లో కోహినూర్ వజ్రం వంటివారు. జై నరేంద్ర మోడీ! జైజై నరేంద్ర మోడీ!! మోడీ విమర్శకులారా! ఖబడ్దార్. మా మోడీగార్ని ఎవరన్నా ఏమైనా అంటే డొక్క చించుతాం జాగ్రత్త!

ఇట్లు,

ఒక నరేంద్ర మోడీ అభిమాని.'

ఇది చదివిన నా స్నేహితుడు గర్వంగా, తృప్తిగా తలాడించాడు (నేను బతికిపోయ్యాను).  

ఉపసంహారం :

ఇది రాస్తుంటే నా భార్య వచ్చి చూసింది. "ఏంటి మోడీ గూర్చి రాస్తున్నారా? మీకు మాడు పగిలిందే!" అంటూ సంతోషంగా పక్క రూములోకి వెళ్ళింది. ఆవిడకి మొదట్నుండీ నా బ్లాగ్రాతలు ఇష్టం లేదు, అంచేత - నెట్లో నన్ను ఎవరైనా (ఎందుకైనా సరే) తిడితే ఆవిడకదో తుత్తి! అంటే - మోడీ గూర్చి రాస్తే తిట్లు గ్యారెంటీ అని ఆవిడక్కూడా ఒక అవగాహన ఉందన్నమాట!

(picture courtesy : Google)

Thursday 22 May 2014

అభివృద్ధి


"ఓయ్ రైతులూ! ఇక్కడ అణు విద్యుత్తు కేంద్రం కడుతున్నాం. అర్జంటుగా మీరు పొలాలు ఖాళీ చెయ్యండి, మీకు నష్టపరిహారం భారీగా వచ్చేలా ఏర్పాటు చేస్తాలే!"

"ఓయ్ కొండజాతి మనుషులూ! మీ కొండల్లో వున్న ఖరీదైన ఖనిజం తవ్వుకోడానికి ఓ కార్పొరేట్ కంపెనీకి అనుమతిచ్చాం. అర్జంటుగా మీరు కొండలు ఖాళీ చెయ్యాలి, మీకు నష్టపరిహారం భారీగా వచ్చేలా ఏర్పాటు చేస్తాలే!"

"ఓయ్ జాలర్లూ! ఇక్కడ షిప్ యార్డు కడుతున్నాం. అర్జంటుగా మీరు సముద్రం ఖాళీ చెయ్యాలి, మీకు నష్టపరిహారం భారీగా వచ్చేలా ఏర్పాటు చేస్తాలే!"

"ఏంటీ? మీ భూములు వదులుకోరా? కొడకల్లారా! 'ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కాండిరా బాబూ!' అని మర్యాదగా చెబ్తే మీకు అర్ధం కాదురా? ఇదే చైనాలో అయితే మిమ్మల్ని పిట్టల్లా కాల్చిపారేసేవాళ్ళు, పీడా వదిలిపొయ్యేది." నాయకుడుగారు కోపగించుకున్నారు. 

"అయ్యా! నేను టౌను ప్లానింగ్ ఆఫీసర్ని. మీరు మీ ఇంటిముందున్న కార్పోరేషన్ స్థలాన్ని కూడా ఆక్రమించేశారు, అంచేత - రోడ్డు ఇరుకైపొయ్యింది. సిటీ అభివృద్ధి కోసం మీ ప్రహరీ గోడని ఓ మూడంగుళాలు వెనక్కి జరుపుకుంటే ప్రజలకి ఇబ్బంది ఉండదు."

"ఎలా కుదుర్తుంది? కుదర్దు. నా గోడ వెనక్కి జరిపి నువ్వు జరిపే బోడి అభివృద్ధి నాకక్కర్లేదు. నువ్వు నా మూడంగుళాల్లో ఆనకట్టే కడతావో, విమానాశ్రయమే తెప్పిస్తావో నాకనవసరం. నా గోడ మాత్రం అంగుళం కూడా వెనక్కి జరగదు, ఏం పీక్కుంటావో పీక్కో. ఓయ్ ఆఫీసరూ! నా సంగతి నీకింకా తెలీదు, ఒక్క ఫోను కొట్టానంటే సస్పెండైపోగలవు. జాగ్రత్త!" నాయకుడుగారు మళ్ళీ కోపగించుకున్నారు. 

(photo courtesy : Google)

Saturday 17 May 2014

ఎన్నికల ధర్మం


అది ఎన్నికలానందస్వామి వారి ఆశ్రమం. ఆశ్రమం అంటే 'లవకుశ'లో వాల్మీకి మహర్షి టైపు పూరిపాకల ఆశ్రమం అనుకునేరు.. కాదు. అక్కడ అన్నీ విశాలమైన పాలరాతి కట్టడాలు, బహుళ అంతస్తుల సముదాయాలు.. ఆశ్రమమంతా కూడా సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్. ఆశ్రమానికి ఒకవైపు విశాలమైన పంట పొలాలు, ఆ పొలంలో పండించిన ధాన్యాన్ని, కూరగాయల్ని మాత్రమే ఆశ్రమవాసులు వండించుకుంటారు. ఇంకోవైపు మరింత విశాలమైన పండ్ల తోటలు, ఆ తాజాఫలాల్నే ఆశ్రమవాసులు భుజిస్తారు.

అక్కడి ఆశ్రమవాసులు అత్యంత ధనికులు. వయసులో తెగ సంపాదించేసి, సంపాదన యెడల విసుగు పుట్టి, పిమ్మట జీవితం పట్ల వైరాగ్యం కలిగి (డబ్బు సంపాదించినవాడికే వైరాగ్యం కలుగును), ఆపై ఆస్తుల్ని పిల్లలకి పంచేసి (ఇది చాలా ముఖ్యం).. 'తుచ్చమైన ఈ మానవ జీవితానికి అర్ధం ఏమిటి?' అనే జీవిత సత్యాన్ని కనుగొనుటకు స్వామివారి దగ్గర శిష్యలుగా చేరారు. వారికి స్వామివారి పద్ధతులు తెగ నచ్చేసి ఆశ్రమానికి తెగ డొనేషన్లు ఇచ్చేశారు (డొనేషన్లు ఇవ్వలేనివారు స్వామివారి కృపకు అనర్హులు). ఆ సత్యశోధకులకి నిత్యమూ స్వామివారి ప్రవచనములు వినుటయే తప్ప.. వేరే పన్లేదు (ఈ దేశంలో కోట్లాదిమందికి కూలి చేస్తేగానీ కడుపు నిండదు, అందుకే - వారికి వైరాగ్యం కలిగేంత జ్ఞానం ఉండదు).

డాక్టర్లలో గుండెజబ్బులకి, మెదడుజబ్బులకి స్పెషలిస్టులు ఉంటారు. ప్లీడర్లలో సివిల్, క్రిమినల్ కేసులకి స్పెషలిస్టులు ఉంటారు. దొంగల్లో పట్టపగలు దొంగలు, అర్ధరాత్రి దొంగలు అంటూ స్పెషలిస్టులుంటారు. అదే విధంగా - స్వామీజీలలో కూడా స్పెషలిస్టులుంటారు. ఎన్నికలానందస్వామి వారిది ఎలక్షన్ల స్పెషాలిటీ, ఆయన పేరు కూడా అలా వచ్చిందే. ఈ రంగంలో వారిది థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్.

మునిసిపాలిటీ వార్డు మెంబర్ నుండి మంత్రుల దాకా స్వామివారి శిష్యులున్నారు. వారంతా ఆయన చెప్పిన పార్టీలో చేరతారు (ఒక ఊరు చేరడానికి బస్సెక్కుతాం, రైలెక్కుతాం, ప్లేనెక్కుతాం.. దేంట్లో ప్రయాణించినా గమ్యం చేరడం ముఖ్యం. చట్టసభ అనే గమ్యాన్ని చేరడానికి రాజకీయ పార్టీలనేవి వాహనాల వంటివని స్వామివారి శిష్యుల అభిప్రాయం), చెప్పిన సమయానికి నామినేషన్ వేస్తారు, చెప్పిన సమయానికి ప్రచారం ప్రారంభిస్తారు. నిన్న ఆంద్రదేశంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. గెలిచిన శిష్యులు స్వామివారి దర్శనానికి వరస కట్టారు. పొద్దున్నుండి ఒకళ్ళ తరవాత ఒకళ్ళు స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు.

వినాయకరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మునిసిపల్ చైర్మెన్ గా రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయనకిది మూడోసారి, ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారు. ఆయనకి నమ్మకాలు ఎక్కువ, అందుకే ఆయన పేరు Viinaaayka Ravuu గా రాసుకుంటాడు.. తెలుగు పేరుకి ఇంగ్లీషు అక్షరాల అలంకారాలేవిటి అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే, అదో శాస్త్రం! ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వినాయకరావు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వచ్చాడు.

అది స్వామివారి పూజా సమయం. ఆ సమయంలో ఆయన్ని డిస్టర్బ్ చెయ్యడం దేనికని, పూజామందిరం పక్కగా ఉండే స్వామివారి ఏకాంత మందిరంలో వెయిట్ చేయ్యసాగాడు వినాయకరావు. ఆ మందిరం విశాలంగా ఉంది, నేల మీద పరిచిన ఎర్రటి తివాచీ గదిని నెత్తుటితో కడిగినట్లుగా అందంగా, భయంకరంగా ఉంది. ఈ నెత్తుటి మడుగులోంచి పొడుచుకొచ్చిన దెయ్యప్పిల్లల్లా ఒక పక్కగా మెత్తటి సోఫాలున్నాయి. గది మధ్యలో వెండితో చేసిన పెద్ద సింహాసనం ఆ దెయ్యప్పిల్లలకి తండ్రిలాగా ఉంది. ఆ గది మిక్కిలి ఖరీదుగా ఉంది, భయం కొలిపేదిగానూ ఉంది. ఆ గది ఆధ్యాత్మికతకి నిలయంగా లేదు, దొంగల ముఠాలు దోచుకున్న సొమ్ము వాటాలేసుకునే హెడ్డాఫీసులా ఉంది.

వినాయకరావు ఒక సోఫాలో కూర్చున్నాడు. ఆయన ఎత్తుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, లావుగా కూడా ఉంటాడు. విశాలమైన నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టు, చేతివేళ్ళకి రకరకాల రంగురాళ్ళ ఉంగరాలు.. చూడ్డానికి రాజకీయవేత్తకి, అధ్యాత్మికవేత్తకి పుట్టిన అక్రమ సంతానంలా అగుపిస్తాడు. ఆతను చూపులకి బహుసౌమ్యుడు, చేతల్లో బహుక్రూరుడు. అతని భాష చాలా కల్చర్డ్ గా ఉంటుంది, ఆలోచనలు అతి అన్ కల్చర్డ్ గా ఉంటాయి.

వినాయకరావుకి ధన బలం ఉంది, కుల బలం ఉంది, కండ బలం ఉంది, మంది బలం ఉంది. తద్వారా - రాజకీయ బలం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని బలాలు ఉన్న వ్యక్తి సంతోషంగా ఉంటాడు. కానీ - ఇప్పుడు వినాయకరావు అంత సంతోషంగా లేడు.. అన్యమస్కంగా ఉన్నాడు. అసలాయన వాలకం ఎన్నికల్లో గెలిచినట్లు లేదు - డిపాజిట్ కోల్పోయినట్లుంది. చిటికెన వేలుతో తన నియోజక వర్గాన్ని శాసించగలిగే వినాయకరావు దిగాలుగా ఉన్నాడు!

అందుకు కారణమేమి? వినాయకరావు ఒక్కగానొక్క కూతురు, పెళ్లై అమెరికా వెళ్ళిపోయింది (రాజకీయ నాయకుడి సంతానం - అయితే రాజకీయ నాయకులయినా అవుతారు, లేదా అమెరికాలోనైనా స్థిరపడతారు). ఒక్కగానొక్క కొడుకు, కొడుకుది అచ్చు తన పోలికే. రూపంలోనే కాదు గుణంలో కూడా! అంచేత చిన్న వినాయకరావు కూడా మందు, మగువల సాంగత్యంతో జీవిత సత్యాన్ని కనుగొనే ప్రయత్నంలో తల మున్కలయ్యాడు.

ఆ విధంగా అన్నివిధాలుగా తన వారసుడిగా ఎదుగుతున్న పుత్రరత్నాన్ని గాంచిన వినాయకరావు మిక్కిలి గర్వించాడు. ఈసారి ఎన్నికల్లో - కొడుకుని అసెంబ్లీకి పంపి, తను పార్లమెంటుకి వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ - విధి బలీయమైనది. కొన్నాళ్ళక్రితం - వన్ ఫైన్ డే ఫుల్లుగా మందుకొట్టి, అత్యంత ఖరీదైన కారుని అత్యంత వేగంగా నడిపిన కారణాన యాక్సిడెంటై అసువులు బాశాడు ( విధి క్రూరమైనది కూడా).

వినాయకరావు పుట్టెడు పుత్రశోకంతోనే ఎన్నికల్లో పోటీ చేశాడు (తప్పదు మరి.. ఒక్కసారి టిక్కెట్టొదులుకుంటే మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు). ఈసారి ఎగస్పార్టీవాడు ఏదో పారిశ్రామికవేత్తట, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేశాడు. వినాయకరావుకి చిర్రెత్తింది. డాక్టర్లు చచ్చేదాకా వైద్యవృత్తిలోనే ఉంటారు, ప్లీడర్లు ప్లీడరీ వృత్తిలోనే ఛస్తారు. కానీ ఈమధ్య నాలుగు డబ్బులు సంపాదించిన ప్రతి ముండాకొడుకు రాజకీయ నాయకులకి కాంపిటీషన్ కొచ్చేస్తున్నాడు.. రాజకీయం మరీ చవకైపొయ్యింది. అంచేత - పోయినసారి కన్నా ఈసారి మెజారిటీ కొంత తగ్గినా, మొత్తానికి గెలుపొందాడు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పబ్లిక్ పరీక్షల్లాంటివి. అందుకే గెలుపెప్పుడూ గొప్ప కిక్కునిస్తుంది. కానీ చెతికందొచ్చిన కొడుకు లేకుండా పొయ్యాడు. ఎన్నికలు, ఫలితాలు.. ఈ వాతావరణం కొడుకుని మరీమరీ జ్ఞప్తికి తెస్తున్నాయి వినాయకరావుకి. అంచేత - మనసులో బాధ, దుఃఖం తుఫానులో కారుమబ్బుల వలె ఆవహించి.. నైరాశ్యంలో కూరుకుపొయ్యాడు.

ఎన్నికలానందస్వామి వారి పూజ అయిపోయినట్లుంది.. ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు. వినాయకరావు స్వామివారిని చూడంగాన్లే లేచి నిలబడి నమస్కరించాడు. స్వామివారు గుండ్రంగా, గుండుగా తొక్కు తీసిన పనసపండులా ఉన్నాడు. ఆయన శరీరం నిన్ననే పాలిష్ చేసిన బలార్షా టేకు చెక్క వలె తళతళలాడుతుంది. ఆయన మొహం అప్పుడే కోసిన దోసకాయలా నవనవలాడుతుంది. స్వామివారు గది మధ్యలోనున్న వెండి సింహాసనంపై ఆశీనులయ్యారు. అది వారి ఉచితాసనం (అనగా - శిష్యులు ఉచితంగా ఇచ్చిన ఆసనం అని అర్ధం).

వినాయకరావు సోఫాలో తల దించుకుని కూర్చున్నాడే గానీ ఏమీ మాట్లాడలేదు. అతను అశాంతిగా ఉన్నాడని గ్రహించారు స్వామివారు. ఇజ్రాయిల్లో వర్షాలు పడకపోతే అమెరికా వాడు కలత చెందినట్లు, స్వామివారి తన భక్తుని బాధని గాంచి ఆందోళన చెందారు.

"ఏం చిన్నా? ఈసారి కూడా గెల్చావు కదా! అలా ఉన్నావేం?" అంటూ ప్రేమగా పలకరించారు.

ఎన్నికలానందస్వామి వారు డబ్బు, పలుకుబడి ఉన్న భక్తుల్ని మాత్రమే ఆప్యాయంగా 'చిన్నా!' అని సంబోధిస్తారు. అవేమీ లేనివాళ్లని అసలేవీ సంబోధించరు - కుసింత బూడిద మాత్రం ప్రసాదిస్తారు.

స్వామివారి పలకరింపు - ఎస్సైగారు దొంగగాడి కష్టాల్ని సానుభూతిగా కనుక్కుంటున్నట్లుగా అనిపించింది వినాయకరావుకి. కావున - ఒక్కసారిగా బేలగా అయిపొయ్యాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా, కష్టంగా కూడదీసుకుంటూ అన్నాడు.

"దొంగనోట్లు మార్చాను, మానభంగాలు చేశాను, హత్యలు చేయించాను. డబ్బు కోసం, పదవి కోసం, పలుకుబడి కోసం నే చెయ్యని అక్రమం లేదు. నేను మహాపాపిని. నా పాపాలు నన్ను కాల్చేస్తున్నాయి. నాకందరూ ఉన్నారు, కానీ ఒంటరిని. నాకన్నీ ఉన్నాయి, కానీ ఏవీ నావి కావు. భయంగా ఉంది స్వామీ. నా బ్రతుకే ఒక బొంకు. ఈ ఎన్నికలు, అది నేను గెలవడం అంతా మోసం. ఎందరి ఉసురు పోసుకున్నానో? నా బిడ్డ నాక్కాకుండా పొయ్యాడు...... " ఇంక మాట్లాడలేక నిశ్శబ్దంగా రోదించసాగాడు వినాయకరావు.

అడవిలో అర్ధరాత్రిలా, పేదవాడి నీరసంలా.. గదంతా నిశ్శబ్దం. కొంతమందికి కొన్ని నప్పవు, అవి మనం చూళ్ళం. ఉదాహరణకి గుమ్మడి ఫైటింగులు, అమెరికావాడి నీతులు ఎబ్బెట్టుగా ఉంటాయి. వినాయకరావు దుఃఖం కూడా స్వామివారికి అలాగే అనిపించింది.

అర్ధమైందన్నట్లుగా తల పంకిస్తూ.. స్వామివారు చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు.

"చిన్నా! జీవితం బుద్బుదప్రాయం, నీ బిడ్డడికి నూరేళ్ళు నిండాయి, వెళ్ళిపొయ్యాడు. మన్చేతిలో ఏముంది? ఏమీ లేదు - అంతా దైవనిర్ణయం. ఇకపోతే - నువ్వు అన్యాయం, పాపం అంటూ ఏవో చెబుతున్నావు. నాకైతే నువ్వు చేసిన పాపలేమిటో బోధపడటం లేదు." అన్నారు.

దుఃఖిస్తూనే ఆశ్చర్యపొయ్యాడు వినాయకరావు.

"ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి పర్పస్ ఒకటి ఉంటుంది చిన్నా! ఇప్పుడు నువ్వు కూర్చున్న సోఫా ఎంత మెత్తగా ఉన్నా, అది డైనింగ్ టేబుల్ గా పనికిరాదు. అలాగే - సకల జీవచరాలకి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మం ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించటమే ఆ జీవి పరమార్ధం. నేల నుండి సారాన్ని గ్రహించి గడ్డి పెరుగుతుంది, గడ్డిని తిని జింకలు, దున్నలు జీవిస్తాయి. ఆ జింకల్ని, దున్నల్ని తిని పులులు జీవిస్తాయి. ఆ పులుల్ని వేటగాడైనా చంపేస్తాడు, లేదా అవే కొంతకాలానికి అవే చస్తాయ్.. ఎట్లా చచ్చినా నేలలో కలిసిపోవాల్సిందే. అంటే నేల నుండి పుట్టింది అనేక రకాలుగా రూపాంతరాలు చెంది తిరిగి ఆ నేలలోనే కలిసిపోయింది. ఇదొక సృష్టి చక్రం!" అంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నట్లుగా ఆగారు.

కొద్దిసేపటికి కళ్ళు తెరిచి వినాయకరావుని చూస్తూ మళ్ళీ చెప్పసాగారు స్వామి.

"చిన్నా! ఇప్పుడు నీ సంగతే చెబుతాను. నువ్వు స్వశక్తితో అంచెలంచెలుగా పైకొచ్చిన వ్యక్తివి. నీ అవకాశాల కోసం ఇతరుల్ని హింసించావు, మోసగించావు. నువ్వేది చేసినా నీ భవిష్యత్తు కోసమే చేశావు, సరదా కోసం చెయ్యలేదు. మెడికల్ సీటు కోసం విద్యార్ధి కోచింగు తీసుకుని ఎమ్సెట్ పరీక్ష రాస్తాడు, తనకే డాక్టర్ సీటు రావాలని కోరుకుంటాడు. రాజకీయ నాయకుడికి ఎలక్షన్లో పార్టీ టిక్కెట్ సంపాదించడం, పోటీ చెయ్యడం కూడా ఎమ్సెట్ వంటిదే! నువ్వు చేసింది తప్పైతే ఎమ్సెట్ పరీక్ష కూడా తప్పే! పులి ఆహారం కోసం జింకని చంపడం న్యాయం, అదే పులి అదే జింకని వినోదం కోసం చంపడం మాత్రం పాపం.. నువ్వలాంటి పాపాలేవీ చెయ్యలేదు."

'అవును కదా!' అనుకున్నాడు వినాయకరావు.

"నువ్వు నిజాయితీగా ఉన్నావనుకుందాం. నీ పార్టీవాళ్లు 'ఫండ్స్' తీసుకోకుండా నీకు టిక్కెట్టు ఇస్తారా? ఇవ్వరు. కార్యకర్తల్ని రోజు కూలీ ఇచ్చి ప్రచారం చేయిస్తావ్. నీ పార్టీ సిద్ధంతాన్నో, నీ నాయకత్వాన్నో చూసి వాళ్ళేమన్నా ఫ్రీగా సర్విస్ చేస్తారా? చెయ్యరు. ఎలక్షన్ల ముందు ఓట్లు కొనడానికి పార్టీ ముఖ్యులకి డబ్బు పంపిణీ చేస్తావ్. వాళ్ళేమన్నా నిజాయితీగా డబ్బు పంచుతారా? పంచరు. మధ్యలో ఎవరికి అందినంత వాళ్ళు కాజేస్తారు." అంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నారు స్వామివారు.

స్వామివారిలో భగవద్గీతని ప్రవచిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని గాంచాడు వినాయకరావు.

"ఈ ప్రజలు అత్యాసపరులు. నువ్వు నిజాయితీగా ప్రజాసేవ చెయ్యాలంటారు. కానీ - ఎలక్షన్లో డబ్బు లేకుండా పన్జరగదు. పోనీ - నువ్వు నిజాయితీగా 'నా నియోజకవర్గ ప్రజలారా! ఎన్నికల కోసం నాకింత ఖర్చయ్యింది, ఇంత తీసుకుంటున్నాను.' అని చెబితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నీకు ప్రజాధనం నీ ధనంగా మార్చుకోడానికి మించి వేరొక మార్గం ఉందా? లేదు."

'అవునవును!' అనుకున్నాడు వినాయకరావు.

"చిన్నా! నే చెబుతున్నా విను! నువ్వు అవినీతికి పాల్పడలేదు, భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో కాబోయే ఖర్చు కోసం నిధులు సమకూర్చుకున్నావు, ఎన్నికల సమయంలో ఆ నిధులు ఉపయోగించావ్. నేలలోంచి పుట్టిన జీవి చివరాకరికి మళ్ళీ నేల్లోనే కలిసిపోయినట్లు.. ప్రజల సొమ్ము అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ ప్రజల వద్దకే చేరింది. ఇది ఎన్నికల ధర్మం, ప్రజాస్వామ్య చక్రం." అన్నారు స్వామివారు.

"కానీ.. కానీ.. నేను రిగ్గింగులు చేయించాను, ప్రత్యర్ధులపై దొంగ కేసులు పెట్టించాను, ఒకట్రెండు మర్డర్లు చేయించాను." గిల్టీగా అన్నాడు వినాయకరావు.

స్వామివారు దరహాసంతో ఇలా సెలవిచ్చారు.

"చిన్నా! దేవుడు గుళ్ళో ఉంటేనే పూజలందుకుంటాడు. రాజకీయ నాయకుడు పదవిలో ఉంటేనే రాణిస్తాడు. నాయకుడు ఎన్నికల్లో గెలవకపోతే ప్రజలు వాణ్నో చిత్తుకాయితంలా చూస్తారు. చిత్తుకాయితాల్ని కనీసం తూకానికైనా అమ్ముకోవచ్చు, ఓడిన నాయకుడు అందుక్కూడా పనికి రాడు. అదే ప్రజలు గెల్చిన నాయకుడికి బ్రహ్మరథం పడతారు. కావున ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే నీ ధర్మం. వేటాడే పులి ధర్మాధర్మాల గూర్చి బేరీజు వేస్తూ కూర్చుంటే ఆకలి చావు చస్తుంది. కావున - నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయాన్యాయాల ప్రసక్తి అనవసరం. నీ గెలుపు అడ్డం అనుకున్నవాడి మీద దొంగ కేసు పెట్టించడం కూడా ధర్మమే. అడ్డం కానప్పుడు మాత్రం దొంగ కేసు పెట్టించడం చాలా అన్యాయం, అటువంటి పాపపు పనులు నువ్వు చెయ్యకు."

వినాయకరావు మొహంలో కొద్దిగా కళ కనిపించింది.

"కానీ నావల్ల కాంట్రాక్టర్లు, మాఫియా తప్ప లాభపడిన వారెవ్వరూ లేరు. ప్రజల కనీసావసారాల కోసం కనీసంగా కూడా పాటు పళ్ళేదు." సందేహంగా అన్నాడు వినాయకరావు.

స్వామివారు మొహం చిట్లించారు.

"ప్రజల గూర్చి ఆలోచించాలా? ఎందుకు!? పేషంట్ల గూర్చి డాక్టర్లు ఆలోచిస్తున్నారా? కక్షిదారుల గూర్చి న్యాయవాదులు ఆలోచిస్తున్నారా? కస్టమర్ల గూర్చి వ్యాపారస్తులు ఆలోచిస్తున్నారా? శాంతిభద్రతల గూర్చి పోలీసులు ఆలోచిస్తున్నారా? లంచాలు మింగకుండా ఆఫీసర్లు పని చేస్తున్నారా? వాళ్ళెవ్వరికీ లేని వృత్తిధర్మం మీ రాజకీయ నాయకులకి మాత్రం ఎందుకు?"

వినాయకరావు భ్రమలు తొలగిపోయ్యాయి. ఆయన స్వామివారి పాదాలకి మొక్కాడు.

"చిన్నా! నీకు దిష్టి తగిలింది, అందుకే ఇట్లాంటి రాకూడని ఆలోచనలు వస్తున్నాయి. సాధారణంగా ఇట్లాంటి ఆలోచనలు రచయితలకి వస్తుంటాయి! వాళ్లొట్టి పనికిమాలినవాళ్ళు. కావునే - ఏ కథో, కవితో రాసుకుని ఆత్మానందం పొందుతారు." దరహాసంతో అన్నారు స్వామివారు.

వినాయకరావు చిరునవ్వు నవ్వాడు.

"చిన్నా! కొన్నాళ్ళపాటు ప్రశాంతంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకో, దేవుడికి తలనీలాలు సమర్పించు. నెత్తిమీద ఉన్నది నాలుగు వెంట్రుకలే కదాని మొహమాటపడకు! దేవుడు కరుణామయుడు, చిన్నవిషయాలు పట్టించుకోడు. హుండీలో కానుకలు వెయ్యి, గట్టిగా ప్రార్ధించు. ఎన్నికల్లో 'నువ్వు చేశాననుకుంటున్న' పాపం పరిహారం అయిపోతుంది." అంటూ కర్తవ్యాన్ని బోధించారు స్వామివారు.

వినాయకరావుకి ఇప్పుడు హుషారుగా ఉంది. హాయిగా నవ్వసాగాడు.

"చిన్నా! నువ్వు తెలివైనవాడివి, చురుకైనవాడివి. ముందుముందు మంచి భవిష్యత్తు ఉన్నవాడివి. ఈసారి నీకు మంత్రి పదవి ఖాయం. ముఖ్యమంత్రితో చెప్పి మంత్రివర్గంలో మంచి శాఖొహటి ఇప్పిస్తా. ఇహ ప్రశాంతంగా ఉండు." అంటూ చిన్నగా నవ్వుతూ అన్నారు స్వామివారు.

స్వామివారు ఎన్నికల్ని ఎందుకు అంతలా స్పెషలైజ్ చేశారో అర్ధమైంది వినాయకరావుకి.

"సరే స్వామి! ఇంక సెలవు. ఆ వందెకరాల ప్రభుత్వ భూమి మీ ఆశ్రమం పేరుకి మార్చేలా కృషి చేస్తాను." అన్నాడు వినాయకరావు.

స్వామివారు చిరునవ్వు నవ్వారు.

"చిన్నా! ఆ విషయం ఆల్రెడీ ముఖ్యమంత్రితో మాట్లాడాను, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింతరవాత ఆయన చేసే మొదటి సంతకం మన ఫైల్ మీదే!"

"స్వామీ! యువార్ గ్రేట్!" అంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాడు వినాయకరావు.

disclaimer :

అంతా కల్పితం.. పాత్రలు కూడా. ఎవరినీ ఉద్దేశించి రాయలేదు.

(picture courtesy : Google)

Wednesday 7 May 2014

ఎన్నికల కత


అది దట్టమైన అడవి. ఆ అడవిలో మహావృక్షాలున్నయ్, అవి దయ్యాలు జుట్టు విరబోసుకున్నట్లుగా ఉన్నయ్. సెలయేళ్ళున్నయ్, అవి ఒంపులు తిరుగుతూ ప్రశాంతంగా, బద్దకంగా ప్రవహిస్తున్నయ్. ఆ పచ్చిక బయళ్ళు, ఆ లేత చెట్లు.. భూదేవి అప్పుడే ప్రసవించినట్లు తాజాగా ఉన్నాయి, అందంగా కూడా ఉన్నాయి. 

ఇప్పుడా అడవిలో కొన్నిగంటలుగా రెండు సింహాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది, నిప్పులవాన కురుస్తున్నట్లు భూమ్యాకాశాలు దద్దరిల్లిపోతున్నయ్. అది వాటిమధ్య ఆధిపత్య పోరాటం. సింహం అనగా సన్నని నడుము, అందమైన జూలు, ఠీవియైన నడక.. అంటూ కవులు రొమేంటిసైజ్ చేస్తారు గానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆ పోరాటం చూసినట్లైతే - 'ఈ పోరాటం ప్రళయ భీకరమైనప్పటికీ అతి మనోహరం. వజ్రసమాన కాయంతో, ఉక్కు పంజాతో రెండు బంగారు కొండలు ఢీకొన్నట్లు, ఉత్తుంగ తరంగాల వలె పైకెగెసి పడినట్లు.. ' అని రాసుకుంటూ పొయ్యేవాళ్ళు కాదు. మరేం చేసేవాళ్ళు? పుస్తకం, కలం ఆక్కడే పడేసి పారిపొయ్యేవాళ్ళు.. అక్కడ వాతావరణం అంత భీభత్సంగా ఉంది!

ఆ పోరాడే సింహాలకి అనుచరులైన నక్కలు, తోడేళ్ళు కూడా రెండు జట్లుగా విడిపొయ్యి అరుచుకుంటున్నాయి, కరుచుకుంటున్నాయి. ఈ యుద్ధాన్ని వీక్షిస్తున్న కుందేళ్ళు, జంగు పిల్లులు, జింకలు, అడవి దున్నలు.. మొదట్లో భయపడ్డా, ఆ తరవాత వాటికి ఇదంతా వినోదంగా అనిపించింది. అంచేత - అవి చప్పట్లు కొడుతూ భలే ఎంజాయ్ చెయ్యడం మొదలెట్టాయి. ఏ సింహం గెలుస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నయ్, పందేలు కూడా కాసుకోసాగాయి. 

కొంతసేపటికి - ఆ యుద్ధం చాపకింద నీరులా ప్రేక్షక జంతువుల్లోకి కూడా పాకింది. కావున - అవి తమలో తాము చెరో సింహం పార్టీలుగా విడిపొయ్యి, గోలగోలగా అరుచుకోసాగాయ్. కొద్దిసేపటికి - కుందేళ్ళు, కుందేళ్ళతో, జింకలు జింకలతో, దున్నలు దున్నలతో కలబడుకోనారంభించాయ్. వాతావరణం సరదా సరదాగా ఉంది, హడావుడిగా ఉంది, అడవికేదో జబ్బు చేసి దారుణ దావానలంలో మండిపోతున్నట్లుగా కూడా ఉంది. 

మరి కొంతసేపటికి యుద్ధం ముగిసింది. ఓడిపోయిన సింహం తోక ముడుచుకుని పారిపోయింది, దాంతోపాటు ఓడిపోయిన పార్టీ తోడేళ్ళు, నక్కలు కూడా పారిపొయ్యాయి. వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇప్పుడంతా పార్టీ మూడ్! కుందేళ్ళు, జింకలు, దున్నలు గెలిచిన ఆ సింహాన్ని భుజాల కెత్తుకుని 'హుర్రే' అంటూ ఆనందంతో ఊరేగాయి. జింకలు పులి డేన్స్ చేశాయి, దున్నలు డిస్కో డేన్స్ చేశాయి. ఊరేగింపు ముగిసింది. 

'ప్రియమైన అడవి వాసులారా! ఇక మీకు సెలవు.'

ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపొయ్యారు. 

అలుపు తీరిన కొద్దిసేపటికి సింహంకి ఆకలి దంచెయ్యసాగింది. సింహం పరివారానికీ ఆకలిగా ఉంది.. అవును మరి, అవి కూడా గెలిచిన ఆనందంలో డేన్సులు చేసి అలసిపోయ్యి ఉన్నాయి కదా! అంచేత - ఆ సింహం కొన్ని కుందేళ్ళని, జింకల్ని, దున్నల్ని పిలిపించుకుంది. 

ఆపై - సింహం, దాని బంధువర్గం ప్రేమగా, ప్రశాంతంగా వాటి పీక కొరికి.. ధారగా కారుతున్న చిక్కటి వెచ్చని రక్తాన్ని స్కాచ్ విస్కీలాగా చప్పరిస్తూ తాగేశాయి. ఆ తరవాత - నిదానంగా మాంసాన్ని పీక్కు తిననారంభించాయి. అవి తినంగా మిగిలిన మాంసాన్ని తోడేళ్ళు, నక్కలు హడావుడిగా మింగసాగాయి. 

చచ్చి గుట్టగా పడున్న ఆ జంతువుల్లో ఓ జింకపిల్ల కొనఊపిరితో ఉంది, అది భారంగా డొక్క లెగరేస్తూ ఆయాసపడుతూ సన్నగా ఊపిరి పీలుస్తుంది. అయితే ఆ జింక పిల్ల బాధతో గిలగిల్లాడకుండా, వెక్కివెక్కి ఏడుస్తుంది!

ఒక దున్న లెగ్ పీసుని ఇష్టంగా పీక్కుతింటున్న సింహానికి జింకపిల్ల ఏడుపు ఆశ్చర్యంగా అనిపించింది. 

'జింకోత్తమా! ఏల ఈ ఏడుపు?' అని ఆసక్తిగా ప్రశ్నించింది. 

అంతట ఆ జింక పిల్ల వెక్కుతూనే ఇలా అంది.

"మృగరాజా! ఇవ్వాళంతా నీ గెలుపు కోసం నేనెంతగానో కృషి చేశాను, పరితపించాను. నీ కోసం నా తోటి జింకల్తో గొడవపడ్డాను. ఇప్పుడు నన్నీ విధంగా చంపి తింటున్నావు, ఇది నీకు న్యాయం కాదు." అంది. 

సింహానికి జింక పిల్ల యెడల జాలి కలిగింది.

"మిత్రమా! నీ ప్రశ్నకి సమాధానం చెబ్తా విను. నాది సింహం జన్మ. లంచ్ అండ్ డిన్నర్ కోసం అడవిలో జంతువుల్ని భోంచెయ్యడం మాజాతికి జన్మతో వచ్చిన హక్కు, అలాగే - మాకు ఫుడ్డుగా మారడం మీ జాతి డ్యూటీ. మనకీ విధులన్నీ నిన్నూ, నన్నూ పుట్టించిన ఆ దేవుడే ఇచ్చాడు, దీన్నే ప్రకృతి ధర్మం అని కూడా అంటారు. నీవు నీ జీవించే హక్కు గూర్చి ఎంతైనా వాదించు, ఒప్పుకుంటాను - అందులో బోల్డంత లాజిక్ ఉండొచ్చు, న్యాయం కూడా ఉండొచ్చు. కానీ - న్యాయం వేరు, ధర్మం వేరు. నేను నిన్ను చంపడం అన్యాయం అవ్వొచ్చు, కానీ - అధర్మం కాదు." అంది సింహం.

జింకపిల్లకి నోరెండిపోతుంది, భరింపలేని బాధతో మెదడు మొద్దుబారింది. నోరు పెగుల్చుకుని, మాట కూడగట్టుకుంటూ, నెమ్మదిగా అడిగింది.

"నేను.. నేను.. నీ అభిమానిని."

"అవును, ఆ విషయం నాకు తెలుసు. కానీ మైడియర్ మిత్రమా! ఇవ్వాళ జరిగిందంతా మా సింహాల మధ్య ఆధిపత్య పోరు. అనగా మిమ్మల్ని భక్షించే హక్కు కోసం జరిగిన పోరు. అసలు మా యుద్ధంతో నీలాంటి అర్భక ప్రాణులకేం పని!? మా పోటీ మీకు న్యాయం జరగడానిక్కాదు, మీ మంచికీ కాదు. అంచేత - మాలో ఎవరు గెలిచినా మీకు ఒరిగేదేమీ ఉండదు. మీరు మా చేత చంపబడటానికే పుట్టారు. ఆ సూక్ష్మాన్ని గ్రహింపలేని నువ్వు, నీ స్నేహితులు బుద్ధిహీనులై, అమాయకంగా మా పోరాటంలో దూరారు, అందుకు నీకు నా సానుభూతి తెలియజేస్తున్నాను."

జింకపిల్లకి మగత కమ్ముకొస్తుంది, కళ్ళు మూత పడుతున్నయ్. దానికి తన కుటుంబం, ఎత్తుగా ఒత్తుగా పచ్చని గడ్డితో కళకళలాడే తన ఇల్లు, ఇంటి పక్కగా గలగలా పారే సెలయేరూ.. తను, తన చెల్లెళ్ళు పోటీ పడుతూ అమ్మ పొదుగులోంచి పాలు తాగుతున్న దృశ్యం.. ఆ సమయంలో అమ్మ ప్రేమగా తమ శరీరాల్ని ప్రేమగా నాకుతూ 'నా చిట్టిపొట్టి కన్నలారా! నా పొదుగులో పాలన్నీ మీకోసమే, హాయిగా కడుపు నిండా తాగండి నాన్నా!' అని మృదువుగా, లాలనగా చెప్పిన దృశ్యం.. అప్పుడు తను - 'భగవంతుడు ఎంతటి దయామయుడు! సృష్టిలోని ఆనందాన్నంతా మూటగట్టి మా ఇంట్లోనే ఉంచాడు' అని సంతసించిన వైనం జ్ఞాపకం వచ్చాయి. ఇంతలో - దూరంగా కళ్ళు జిగేల్మనే పెద్ద వెలుగు! ఏవిటా వెలుగు? దేవుడా? దేవుడే అయ్యుంటాడు. 

'హే భగవాన్! నాకు తెలిసి నేనే తప్పూ చెయ్యలేదు, తెలీక చేసిన తప్పుల్ని క్షమించు తండ్రీ! మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను జింకగా మాత్రం పుట్టించకు." అంటూ దేవుణ్ని ప్రార్ధించింది జింకపిల్ల. 

ఇంతలో సింహం జింకపిల్ల చెవులో నెమ్మదిగా చెప్పింది.

"మిత్రమా! ఒకేఒక్క క్షణం.. కొంచెం నొప్పిగా ఉంటుంది.. ఓర్చుకో.. అయామ్ సారీ!" అంటూ జింకపిల్ల మెడని పూర్తిగా కోరికేసింది. అంతట ఆ జింకపిల్ల విగతజీవియై తల వేళ్ళాడేసింది.

ఉపసంహారం :

క్రమేపి అడవులు, అడవిలో జీవులూ అంతరించి పోసాగాయి. ప్రకృతి ధర్మాన్ని కాపాడటం దేవుని డ్యూటీ. అంచేత జనారణ్యంలో కూడా సింహాల్ని, అవి దోచుకుందుకు (వేట నిషేధింపబడిన కారణాన) అర్భక ప్రాణుల్ని కూడా ఆ దేవదేవుడు సృష్టించాడు, గాడీజ్ గ్రేట్!

ముగింపు :

ఇవ్వాళ ఆధిపత్యం కోసం సింహాలు యుద్ధం చేసుకుంటున్న రోజు.. దీన్నే ఎన్నికల రోజు అని కూడా అంటారు!

అంకితం :

నాకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ - రావిశాస్త్రి దేవుడేమోననే అనుమానం మాత్రం ఉంది. అట్టి రావిశాస్త్రి పాదపద్మములకి.. 

(picture courtesy : Google)

Monday 5 May 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 4


సినిమాల్లోంచి సమాజంలోకి - 3 లో మన ఆలోచనల్లో రాచరిక లక్షణాల గూర్చి రాశాను. ఇవ్వాళ - మన 'సమాజంలో స్త్రీపురుషులు సమానులేనా?' అన్న పాయింటుతో కొన్ని ఆలోచనలు రాస్తాను.   

రాచరిక, ఫ్యూడల్ వ్యవస్థల్లో మగసంతానానికి ఎంతో విలువుంది. పురాణాల్లో కూడా రాజులు కొడుక్కోసం యజ్ఞాలు చేశారే గానీ, కూతురు కోసం చేసిన దాఖలా లేదు (నాకు తెలిసి). అంచేత - నేటి యువరాజే రేపటి రాజు, నేటి రాజకీయ నాయకుడి పుత్రుడే రేపటి ఎమ్మెల్యే, నేటి హీరో కొడుకే రేపటి హీరో. విషయం ఇంతుంది కాబట్టే గర్భిణీ స్త్రీల పొట్ట స్కానింగ్ అంత (అన్)పాపులర్ అయ్యింది.

స్త్రీలు పురుషుల కన్నా పరమ తక్కువ, ఈ పాయింట్ ప్రూవ్ చెయ్యడం కోసం ఎన్ని సినిమాల్నైనా కోట్ చెయ్యొచ్చు. పాత సినిమాల్లో 'ఏవండి! మీకు దణ్ణం పెడతాను, మీకు భార్యలా కాకపోయినా కనీసం మీ పాదాల దగ్గర ఇంత చోటైనా ఇవ్వండి, పనిమనిషిలా మీకు సేవ చేసుకుంటాను' మార్కు ఏడుపుగొట్టు డైలాగులు బోల్డెన్ని! భర్త ఎంతమంది ముండలెంట తిరిగినా, తిరిగితిరిగి చివరికి తన దగ్గరకే వస్తాడని పాత హీరోయిన్ల (ప్రేక్షకుల) నమ్మకం.

అవును మరి! పెళ్ళంటే నూరేళ్ళ పంట గదా! (ఏవిటోయ్? మన పవిత్ర హిందూ సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావు? అయినా - ఈ సెంటిమెంటు మగాళ్ళకి బాగానే వర్కౌట్ ఆయిందిగా? అది మన మగాళ్ళకి గోల్డెన్ పీరియడ్. ఇంక ఆపు నీ ఏడుపు) నాకైతే మాత్రం ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే ఆ వీర పతిభక్తి డోకొచ్చేంత రోతగా ఉంటుంది.

మిత్రులారా! ఇన్ని మాటలేల? సినిమా కథల్లో స్త్రీ వివక్ష నాగార్జునా సిమెంటంత ధృఢమైనది, మన్నిక గన్నది. ఒక బాక్సాఫీసు ఫార్ములాగా పేరు గాంచినది. అంచేత - ఆ సినిమాల్ని వాటి మానాన వదిలేసి.. ఇవాల్టికి సినీజీవుల్ని ఉదాహరణగా తీసుకుంటాను. తెలుగువాడు సెల్ ఫోన్లు వాడతాడు, కానీ - ఆలోచనలు మాత్రం గ్రహం బెల్ టెలీఫోన్ కనిపెట్టినప్పటి కాలం నాటివి. ఇంటర్నెట్ పుణ్యామాని 'అంతర్జాతీయ పురాణ పురుషులు' కూడా అవతరించారు, ప్రస్తుతం వీరు సోషల్ మీడియా ద్వారా పవిత్ర హిందూ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తున్నారు.

ఎన్టీఆర్ మొదటి భార్య చనిపోయింది, కొన్నాళ్ళకి లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకునేందుకు ఎన్టీఆర్ కి పూర్తి స్వేచ్చ ఉంది. ఇది పూర్తిగా ఇద్దరు వ్యక్తులకి సంబంధించిన వ్యక్తిగత విషయం. వారి చర్యని విమర్శించే హక్కు ఎవరికీ లేదు, ఉండరాదు కూడా. కానీ మన తెలుగు సమాజం ఎన్టీఆర్ రెండోపెళ్లి పట్ల నెగెటివ్ గా స్పందించింది. 

మొదటి భర్తకి విడాకులు ఇచ్చినందుకు లక్ష్మీ పార్వతిని ఒక విలన్ గా చూసింది. ఈ కారణాన - ప్రజల్లో ఆవిడ పట్ల ఉన్న దురభిప్రాయాన్ని చంద్రబాబు రాజకీయంగా కేష్ చేసుకున్నాడు. ఆవిడ రాష్ట్రంపై రాజకీయ పెత్తనం చేస్తున్నట్లు ప్రచారం చేశాడు, అధికారాన్ని కైవసం చేసుకోవటంలో విజయం సాధించాడు. ప్రజలకి లక్ష్మీపార్వతిపై చులకన భావం ఆల్రెడీ మైండ్ లో రిజిస్టరై ఉండటం చంద్రబాబుకి కలిసొచ్చింది.

అసలు - లక్ష్మీపార్వతి పట్ల తెలుగువాళ్ళకి అంత చులకన భావం ఎందుకు? అందుకు కారణాలు రెండు. ఒకటి - ఆవిడ భర్తని 'వదిలేసిన' భార్య (ఈ పవిత్ర పుణ్యభూమిలో భర్తలు భార్యని ఎందుకైనా వదిలెయ్యొచ్చు, భార్యలు మాత్రం భర్తని ఎందుకైనా సరే వదిలెయ్యరాదు), రెండు - ఆర్ధిక తారతమ్యం. అందుకే - లక్ష్మీపార్వతి తెలుగు సమాజం నుండి వ్యతిరేకతని ఎదుర్కొంది. కావునే - ఎన్టీఆర్ మరణంతో ఆవిడ ఇబ్బందులు పడ్డప్పుడు - 'తిక్క కుదిరింది' అని సంతోషించిన ఆడవాళ్ళున్నారు. అదే ఎన్టీఆర్ ఏ టాటా చెల్లెల్నో, బాటా మేనకోడల్నో రెండో వివాహం చేసుకున్నట్లైతే మన తెలుగువాడి ఆత్మగౌరవం ఉప్పొంగి మురుక్కాలవలా వరదలై ప్రవహించేది.

సమాజానికి తగ్గట్లుగా ఎన్ని ముసుగులేసినా, మన 'పెద్దమనుషుల' మనసులోని అసలు భావాలు చాలాసార్లు బయటకి తన్నుకొస్తాయి. బీసీ, యస్సీ కులాల పిల్లలు అగ్రకులం పిల్లల్ని ప్రేమిస్తేనో / పెళ్లి చేసుకుంటేనో.. తక్కువకులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని 'వల'లో వేసుకున్నారని అంటారు. ఆ తక్కువ కులంవాళ్ళ పేదరికం వారి 'దురాలోచన'కి తిరుగులేని ఋజువుగా నిలబడుతుంది. మన తెలుగునాట ఒకప్పుడు అమ్మాయిల మౌనపోరాటాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆ పోరాటాలు చేసిన యువతులు, అబ్బాయి కన్నా 'తక్కువస్థాయి' వారు. అంచేత మన అగ్రకుల మేధావులకి వారి పోరాటం నచ్చలేదు.

ఈ కులమత భావనలకి విరుద్ధంగా తెలుగులో సాహిత్యం అయితే ఉందిగానీ, ఆ సాహిత్యం ఆయా రచయితలకి అవార్డులు, పురస్కారాలకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ సాహిత్య సభలు ఆయా పండితుల కరతాళ ధ్వనుల కోసమే గాని, సమాజానికి ప్రయోజనం ఉన్నట్లు తోచదు. ఈ రచయితలకీమధ్య అమెరికా చాన్సులు కూడా బాగానే తగుల్తున్నాయి, వారికి అభినందనలు, థాంక్స్ టు అమెరికా తెలుగు సంఘాలు. తెలుగునాట సమాజం బాగుపడక పోయినా రచయితలైనా బాగుపడుతున్నారు, సంతోషం.

ఈ సంగతులు రాయడానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు, చాలా కొద్దిగా ఆలోచిస్తే చాలు. ఈ భీకర వేసవిలో కూడా రోజూ ఐదొందలు దాకా మందు, బిరియానిలకి ఖర్చు చేసే 'ధనవంతుల'నీ.. ఒక మంచిపుస్తకానికి కనీసం పది రూపాయిలు కూడా ఖర్చు చేసి కొనలేని 'పేదవారి'నీ.. ఎందెందు చూసినా అందందే కాంచగలము. ఓపిక ఉన్నవాళ్ళు పుస్తకాల షాపులు, బార్లలో సర్వే నిర్వహించుకోవచ్చు. కావున - సాహిత్యం, సమాజం.. దేన్దారి దానిదే అని నా నమ్మకం.

సమాజాన్ని అర్ధం చేసుకోటానికి పనికొచ్చే ఇంకో ఉదాహరణ హీరో కృష్ణ కూతురు ఉదంతం. ఆ అమ్మాయి హీరోయిన్ వేషాలు వేద్దామని ముచ్చట పడింది. కానీ దురదృష్టవశాత్తు - ఆ అమ్మాయి 'గొప్పవంశం'లో పుట్టిన ఆడపడుచు. అంచేత ఆ అమ్మాయి తీసుకున్న కెరీర్ నిర్ణయం మన అభిమాన పంఖాలకి నచ్చలేదు. ఆ అమ్మాయి సినిమాల్లోకి రావడం కుదర్దంటే కుదర్దాన్నారు! కాదనే ధైర్యం చెయ్యలేక ఆ అమ్మాయి ఆ ఉద్దేశం మానుకుంది. ఆ పంఖాధములే కృష్ణ కొడుకుని హీరోగా నెత్తిన పెట్టుకుని మోశారు, అతనికి 'ప్రిన్స్' అని ముద్దు పేరు కూడా పెట్టుకుని పులకించిపొయ్యారు. రాజులు పొయ్యారు, రాజ్యాలూ పొయ్యాయి.. మరీ ప్రిన్సులు పొయ్యేదెన్నడో!

ఇలా జెండర్ బయాస్ గూర్చి చాలాసేపు రాస్తూ పోవచ్చు, కానీ నే చెప్పదల్చుకున్న పాయింట్ చెప్పేశాను కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే - 'సినిమాల్లోంచి సమాజంలోకి' అంటూ విషయాన్ని చూయింగ్ గమ్ లాగా సాగదీస్తూ, బుడగలూదుతూ నాలుగు భాగాలు రాశాను. ఇంక ఈ టాపిక్ నాక్కూడా బోర్ కొట్టేసింది, కావున.. సెలవు.

(picture courtesy : Google)