Thursday 28 June 2018

ఎన్నికల సమయం

అవి నా స్కూలు రోజులు. నా స్నేహితుడొకడు సంవత్సరం పొడుగునా చదువుకోడం తప్పించి అన్ని పనులూ చేసేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో.. Imp (important) అంటూ ఏవో ప్రశ్నల్ని సంపాదించే వాడు. పరీక్ష పేపర్ ఔట్ అవుతుందేమోననే ఆశతో చివర్రోజు వరకు వుండేవాడు. పరీక్షల్లో అడిగే ప్రశ్నలు తెలుసుకోడానికి అతను చేసే ప్రయత్నాలు ఆశ్చర్యకరంగా వుండేవి.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ.. ప్రజల సెంటిమెంట్/ఎమోషన్స్ తెలుసుకుని, ఎలాగైనా గెలవాలనే రాజకీయ పార్టీల లక్ష్యం చూస్తుంటే, నా చిన్ననాటి స్నేహితుడు గుర్తొస్తుంటాడు.
ఒకాయన విదేశాల్లో నల్లధనం అంటాడు, సంవత్సరానికో కోటి ఉద్యోగాలు అంటాడు. ఇంకొకాయన ఋణమాఫీలంటాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు. విశేషం ఏమంటే.. తామివన్నీ చెయ్యాలని వీళ్లూ అనుకోరు, చేస్తారని ఓటర్లూ అనుకోరు. అందుకే కొందరు తెలివైన ఓటర్లు ఓటేసేందుకు డబ్బుచ్చుకుంటారు.
అమలు చెయ్య(లే)ని వాగ్దానాల్ని చేసే రాజకీయ నాయకులు, వారిని నమ్మని ప్రజానీకం.. ఇదంతా సైకిల్ చక్రం తిరిగినట్లు ఐదేళ్ల కోసారి వస్తుంటుంది. దీన్నే మనం ముద్దుగా 'ప్రజాస్వామ్యం' అని పిల్చుకుంటున్నాం.
ప్రజలు తమని నమ్మినా, నమ్మకపోయినా రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం కాకుండా మానుకోవు. ఏదోక అంశం తీసుకుని పాదయాత్రలనీ, ధర్నాలనీ, నిరాహారదీక్షలనీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటయ్.
ప్రజలు/ఓటర్లు గుంభన జీవులు. 'వురే రాజకీయ నాయకులూ! మాకు ఫలానా సమస్య ముఖ్యం, యిందుకోసం ఎవరైతే కొట్లాడతారో వారికి మా ఓటు.' అని తేల్చి చెప్పరు (పరీక్షల్లో ప్రశ్నల్లాగే). అంచేత రాజకీయ పార్టీలు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ 'యెందుకైనా మంచిద'ని ప్రతి సమస్యనీ ప్రజల సమస్యగా మార్చడానికి కృషి చేస్తుంటాయ్.
మరప్పుడు మనమేం చెయ్యాలి?
అదేంటి మేష్టారూ! ప్రతొక్కటీ విడమర్చి చెప్పాలా? మన "పవిత్రమైన" ఓటు కోసం కుస్తీపోటీలు పడుతున్న రాజకీయ పార్టీల విచిత్ర విన్యాసాల్ని యే విస్కీనో, ఫిల్టర్ కాఫీనో చప్పరిస్తూ ఎంజాయ్ చెయ్యండి. ఇవ్వాళ సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే వినోదం ఎక్కువగా వుంది!

(fb post)

కథ రాసేద్దామనే దుస్సాహసం

కథ రాసేద్దామనే దుస్సాహసం, పూర్తి చెయ్యలేని అసహయం ---
ఒక చల్లని సాయంకాలం, పక్షుల కిలకిలలు, కోయిల కుహుకుహులతో వొడలు (తినే వడలు కాదు) పులకరించగా.. మనసు ఆనందంతో గంతులేసింది.
ఇట్లాంటి సమయాల్లో ప్రతివ్యక్తీ తనకి నచ్చిన విషయాల్ని ఆలోచిస్తాడు. కిరాయి హంతకుడు తను చెయ్యబొయ్యే హత్యకి స్కెచ్ రచిస్తే, రసికోత్తముడు ముండల కంపెనీ కొత్తపిట్ట గూర్చి ఆలోచిస్తాడు. రాక్షస ప్రేమికుడు చెయ్యబొయ్యే బలాత్కారం గూర్చి ఆలోచిస్తే, తిండిపోతు వెధవ బూందీలడ్డుని తల్చుకుని లొట్టలేస్తాడు.
ఇలా ఒక్కో కేటగిరీ వాడు తమతమ స్పెషాలిటీ సంబంధిత ఆలోచనల్ని చేస్తాడు. ఇంతమందిని పలువిధములుగా పులకింపజేసిన ప్రకృతికి పులకరించకపోడానికి నాకేం తక్కువ? అంచేత నేనూ తీవ్రంగా పులకించేసాను. కానీ పులకించేశాక ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించిన తరవాత 'ఒక గొప్పకథ రాసెయ్యాలి' అని నిర్ణయించేసుకున్నవాడనై.. laptop వొళ్ళో పెట్టేసుకుని (ఆ రోజుల్లో ఫోన్లో రాయడం నాకు తెలీదు).. కథ టైపడం మొదలెట్టాను.
తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రిని మించిన మొనగాడు లేడు (ఉన్నాడని ఎవరైనా చెప్పినా ఒప్పుకోడానికి నేను సిద్ధంగా లేను). రావిశాస్త్రి తనకి తెలిసిన ప్లీడర్లు, దొంగల గూర్చి రాశాడు. అంచేత గురువుగార్ని ఫాలో అయిపోతూ నేనూ డాక్టర్లు, పేషంట్ల గూర్చి ఒక కథ రాయాలని డిసైడ్ అయిపొయ్యాను. రాయడానికి ఒక లైన్ తళుక్కుమంది. 'వార్నీ, కథ రాయడం అంటే ఇంతేనా' అనుకుని టైపుతూ వెళ్లిపొయ్యాను. సాయంకాలం రాత్రిగా మారింది. కొద్దిసేపటికి వేళ్లు నొప్పెట్టి, విసుగ్గా అనిపించింది. 'హాయిగా సింగిల్ మాల్ట్ చప్పరిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చెయ్యక, ఈ కథ రాసే కూలిపని నేనెందుకు చెయ్యాలి?' అనే ధర్మసందేహం కలిగి, టైపడం ఆపేశాను.
కొద్దిసేపటికి 'నన్నేం చేస్తావ్?' అంటూ నే టైపిన కథ ట్రాఫిక్కులో చిక్కుకుపోయిన చిన్నపిల్లాళ్లా నన్ను దీనంగా ఆడిగినట్లనిపించింది. నిజమే! ఇప్పుడీ stillborn baby ని నేనేం చెయ్యాలి? 'డోంట్ వర్రీ, నీకు తర్వాతెప్పుడైనా మార్పులు చేర్పులూ చేసి ప్రాణం పోస్తాలే!' అని సముదాయించి దాన్ని డ్రాఫ్టుగా అవతల పడేశాను.
తరవాత అప్పుడప్పుడూ కథ గూర్చి గుర్తొచ్చినా.. 'కథకులు గొప్పవారు. వ్యక్తుల్నీ, సమాజాన్నీ లోతుగా, సునిశితంగా పరిశీలించిన మేధావులు. నాకు సాధారణ విషయాలు తెలుసుకోడానికే బుర్ర సహకరించదు. అటువంటి నేను కథ రాయడమా!' అని నవ్వుకోడం మినహా, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
అదీగాక - సాయంకాలం పక్షుల కిల కిలాలు, కోయిల కుహుకుహులు నాకు మళ్లీ వినిపించలేదు, మూడూ రాలేదు. కాబట్టి కథని ఎడిట్ చేసే అవకాశం రాలేదు.
ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - ఆ కథని వెదికి గుంజుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేద్దామని. పోస్ట్ చెయ్యడం ఎందుకంటే - దాన్ని ఓ సాయంత్రం కూచుని రాశాను కాబట్టి.. ఎక్కడో ఒకచోట పోస్ట్ చేస్తే కథ 'అనుకుని' నేను చేసిన కూలిపనికి ఒక logical conclusion ఇచ్చేశానన్న తృప్తి కోసం.
ఇప్పటిదాకా నా 'పూర్తికాని కథ' ఆడియో రిలీజ్ ప్రోగ్రాం చదివారు. త్వరలో అసలు కథ చదువుతారు. కథని సరిచేసే ఓపిక లేనందున మీకు అనేక టైపో కనిపించవచ్చు. అందుగ్గానూ నన్ను క్షమించాలని మందుగా.. సారీ, ముందుగా కోరుకుంటున్నాను. ఇక్కడదాకా చదూకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు/కృతజ్ఞతలు (రెంటికీ తేడా తెలీనందున ఫోర్స్ కోసం రెండూ వాడేశాను).

(fb post)