Sunday, 19 March 2017

చక్ బెర్రీ


నాకు నిన్నంతా చక్ బెర్రీ మ్యూజిక్‌తో గడిచిపోయింది. చక్ బెర్రీ తొంభయ్యేళ్ళ వయసులో నిద్రలో చనిపొయ్యాడు. రాకెన్ రోల్ సంగీతానికి కేరాఫ్ ఎడ్రెస్ బీటిల్స్, రోలింగ్ స్టోన్స్.. వీళ్ళకి స్పూర్తి చక్ బెర్రీ! నేను హెవీ మెటల్ అభిమానినైనా.. సాఫ్ట్ రాక్ కూడా వింటుంటాను. వయసు మహిమేమో తెలీదు కానీ రాక్ మ్యూజిక్‌ని ఇంతకుముందు కన్నా యెక్కువగా వింటున్నాను! 

యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక నాకు చక్ బెర్రీ మరింత దగ్గరవాడయ్యాడు. ఆయన్ని చూస్తూ పాటలు వినడం గొప్ప అనుభూతి. చక్ బెర్రీ తన సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా అలవోకగా పాడేస్తాడు! గిటారుతో విన్యాసాలు చేస్తూ గమ్మత్తుగా నడిచే చక్ బెర్రీ duck walk యెన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది.

మైడియర్ చక్ బెర్రీ! నీ సంగీతం వింటూ చాలా ఆనందించాను. నువ్వు భౌతికంగా వెళ్ళిపోయినా నీ సంగీతం నన్ను వెంటాడుతూనే వుంటుంది. అందుకోసం నీకు టన్నుల కొద్దీ థాంక్సులు చెప్పుకుంటున్నాను.  

Saturday, 25 February 2017

ప్రొఫెసర్ కోదండరాం


'Appearances are deceptive' అన్నారు పెద్దలు. అందుకు మంచి ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం! ఈయన చూడ్డానికి ఎవర్నైనా సులువుగా నమ్మేసే అమాయకుళ్లా అగుపిస్తాడు. యెదుటివాడు చెప్పేది ఓపిగ్గా వింటాడు. యెంత ప్రవోక్ చేసినా ఆ మొహంలో కోపం కనపడదు. క్లిష్టమైన ప్రశ్నలక్కూడా క్లాస్ రూములో పాఠం చెప్తున్నట్లు ప్రశాంతంగా, నిదానంగా మృదువుగా, చక్కటి పదాలతో సమాధానం చెబుతాడు! కోదండరాంలో ఎడ్రినలిన్ లెవెల్స్ తక్కువని నా అనుమానం.

నాకు కోదండరాం పరిచయం టీవీ ద్వారానే. ఈ మందపాటి కళ్ళజోడు వ్యక్తి మెత్తగా కనిపించే గట్టివాడు అని అప్పుడే గ్రహించాను. సరే! అటు తరవాత తెలంగాణా ఉద్యమంలో కోదండరాం నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే.

తెలంగాణా వచ్చాక - కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణా మేధావుల్లో అధికుల్ని పదవుల్లో నింపేసింది. మిగిలిన కొందర్ని అవార్డులు, రివార్డుల్తో ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. కేసీఆర్‌కి వీరవిధేయత చూపించకపోవడమో మరేదో తెలీదు కానీ కోదండరాం మాత్రం పదవుల్లేకుండా తెలంగాణా రాష్ట్రంలో అలా మిగిలిపొయ్యాడు.

రాజకీయ పార్టీలు గెలవడానికి అడ్డగోలు వాగ్దానాలు చేస్తుంటాయి (అలా చెయ్యటం అనైతికం అని ఎన్నికల కమిషన్ కూడా అనుకోవట్లేదు). తెలివైన ప్రజలు డబ్బులో, బ్రాందీసీసానో తీసుకుని ఓట్లేస్తారు (దేశంలో వీళ్ళే ఎక్కువ అని నా అనుమానం). తెలివి తక్కువ్వాళ్లు నాయకుల మాటలు నమ్మి ఓట్లేస్తారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చేముందు బోల్డన్ని ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మా ఉద్యోగాల సంగతేంటని తెలంగాణా యువత అడుగుతుంది. అసలు మాకు సమైక్య ఆంధ్ర రాష్ట్రానికీ, తెలంగాణా రాష్ట్రానికి తేడా తెలీటల్లేదని ఉస్మానియా విద్యార్థులు వాపోతున్నారు. రోహిత్ వేముల సంఘటనతో దళితులకీ తెలంగాణలో తమ స్థానం అర్ధమైంది.

కొన్నాళ్లుగా ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తున్న కోదండరాం ఇప్పుడు స్పీడు పెంచాడు. నిరుద్యోగుల తరఫున గళం విప్పాడు. నా చిన్నప్పుడు ఈ అసంతృప్తుల్ని ప్రభుత్వాలు పట్టించుకునేవి, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించేవి. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అగత్యం తప్పింది. అధికారంలో ఉన్నవాళ్లు రాజులు, వారి కొడుకులు యువరాజులుగా చలామణి అయిపోతున్నారు.

అంచేత సహజంగానే ప్రభువుల్లో అసహనం పెరిగింది. ఈ అసహనంలో రాష్ట్రప్రభుత్వాలకీ, కేంద్రప్రభుత్వానికీ పోటీ వుంది. ప్రభుత్వాలకి ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా కనపడసాగాయి. తమని ప్రశ్నించేవారు ఉగ్రవాదులుగా నమ్మసాగాయి. కాబట్టి నిరసన తలపెట్టిన కోదండరాంని ఇంట్లోనే అరెస్ట్ చేసేసి, తెలంగాణా ప్రభుత్వం తన ప్రజానీకాన్ని 'కోదండరాం' అనే పెనుప్రమాదం నుండి రక్షించింది.

ఇందుకు ప్రభుత్వం చెపుతున్న కారణాలు గమ్మత్తుగా ఉన్నాయి.

"ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు ఇస్తుంటే కోదండరాం నిరుద్యోగుల్ని రెచ్చకొడుతున్నాడు!"

అంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే ఇక కోదండరాం మాట నిరుద్యోగులు మాత్రం ఎందుకు వింటారు? కోదండరాం వెనక్కి తిరిగి చూసుకుని, తన వెనుక యెవరూ లేకపోతే ఇంట్లోనే వుండిపోతాడు కదా! అప్పుడు ప్రభుత్వానికి ఇంకా హాయి కదా!

"కోదండరాం కాంగ్రెస్ ఏజంట్!"

అయితే ఏంటీ? అదేమన్నా నేరమా? కాంగ్రెస్ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ ఏజంట్లకి నిరసన తెలిపే హక్కు ఉండదా?!

"కోదండరాం సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది, అందుగ్గానూ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు."

సో వాట్? ఈ దేశంలో అందర్లాగానే ఆయనకీ పార్టీ పెట్టుకునే హక్కుంది! ఆ పార్టీ పెట్టుకునేందుకు ఒక ప్లాట్‌ఫాం యేర్పాటు చేసుకుంటున్నాడు! చేసుకోనీండి, ఎవరైనా పార్టీ పెట్టేముందు చేసేదదే కదా!

ప్రస్తుతం తెలంగాణాలో మీడియా అధికారానికి దాసోహం అంటుంది. అందుక్కారణం మీడియా ఆస్తులు హైదరాబాద్‌లో ఉండటం, ఆ హైదరాబాద్ తెలంగాణలో ఉండటం కావచ్చు. యేదియేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కెయ్యడం ప్రభుత్వాలకి ఒక విధానంగా మారిపోయింది.

తెలంగాణా ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న పాటగాళ్లు, రాతగాళ్ళు, గీతగాళ్ల ఎడ్రెస్ ఎక్కడుందో కూడా తెలీడం లేదు. ఇటువంటి సమయంలో కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీయడం సాహసోపేతమైన చర్యగా భావించాలి.

నా ఉద్దేశం - అసలు కోదండరామ్ అవసరం తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యెక్కువగా వుంది. కానీ - మొదట్నుండీ ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు సంపాదనపరులు తప్ప మేధావులు లేరు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల దురదృష్టం!

(picture courtesy : Google)

Friday, 17 February 2017

శశికళ చేసిన తప్పు


కాఫీ తాగుతూ ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నాను. కొన్నాళ్లుగా జాతీయ మీడియా తమిళనాడు వార్తల్ని వేడివేడిగా వండి వారుస్తుంది. 

"మిత్రమా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బూ! ముఖ్యమంత్రి అవుదామనుకున్న శశికళ జైలు పక్షి అయింది. ఆమె జైల్లోకి వెళ్లడం చూస్తుంటేనే భలే హేపీగా ఉంది. చివరాఖరికి చట్టం ముందు అవినీతి ఓడిపోయింది." సినిమాటిక్ గా అన్నాను.

ఒకక్షణం ఆలోచించి అన్నాడు సుబ్బు - "నేనలా అనుకోవట్లేదు. జాతీయ మీడియా శశికళని విలన్‌గా ప్రచారం చేస్తుంది, అలా చూపించడంలో వారికి కొన్ని ప్రయోజనాలున్నయ్! కొద్దిసేపు తెలుగు సినిమా టైపు ఆలోచనల్ని పక్కనబెట్టి విషయాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు." 

"సరే! ఎలా అర్ధం చేసుకోవాలో నువ్వే చెప్పు." అడిగాను.

"చాలామంది శశికళ జయలలితని వశబర్చుకుందనీ, ఆమెకి తెలీకుండా భర్తతో కలిసి తెర వెనక చాలా అక్రమాలు చేసిందనీ నమ్ముతున్నారు. అసలు సంగతి - వాళ్లిద్దరూ ఒకర్నొకరు సహకరించుకున్నారు. జయలలితకి ఎమ్జీఆర్ వారసత్వం, సినిమా గ్లామర్ పుష్కలంగా ఉన్నాయి. అయితే కరుణానిధి వంటి బలమైన నాయకుణ్ని ఎదుర్కోడానికి ఇవి మాత్రమే సరిపోవు, నమ్మకమైన 'బ్యాక్ రూమ్ ఆపరేటర్' కావాలి. ఆ బాధ్యతని శశికళ చక్కగా నిర్వహించింది. అంటే జయలలిత అనే మొక్కకి శశికళ అనే యెరువు తోడై చక్కటి ఫలసాయం దక్కింది!" అన్నాడు సుబ్బు. 

వేడివేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు -

"జయలలిత శశికళలది - శంకర్ జైకిషన్, సలీం జావేద్ టైపు హిట్ కాంబినేషన్. ఇప్పుడు జయలలిత చనిపోయింది, అధికారం నాలుగేళ్లపాటు ఉంటుంది. పార్టీకి ముప్పయ్యేడు మంది లోకసభ సభ్యులు, పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళ సహకారం కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. అందుకే కేంద్రం తన చెప్పుచేతల్లో ఉండే తమిళ ప్రభుత్వం కోసం పావులు కదుపుతుంది. ఇక్కడే శశికళ కొంత హోమ్ వర్క్ చేసుండాల్సింది."

"యెలా?" అడిగాను.

"రాజ్యాంగం ప్రకారం మనది ఫెడరల్ స్ట్రక్చర్. కానీ కేంద్రప్రభుత్వానికి విపరీతమైన అధికారాలున్నయ్. రాజకీయంగా తమకి నచ్చని వాళ్ళని తొక్కెయ్యడానికి గవర్నర్ల వ్యవస్థని వాడుకోడం కేంద్రప్రభుత్వాలకి అనాదిగా అలవాటు. ఇది కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చెయ్యడంతో మొదలయింది. రామారావు, నాదెండ్ల భాస్కర్రావుల ఎపిసోడ్ గుర్తుంది కదా?" అడిగాడు సుబ్బు. 

"కానీ రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చాడుగా?" అన్నాను. 

"వచ్చాడు, ప్రజల్లో అతనికున్న విపరీతమైన ఫాలోయింగ్ మూలంగా గట్టెక్కాడు గానీ.. లేకపోతే ఆ దెబ్బకి కోలుకునేవాడు కాదు. ఆ తరవాత రాష్ట్రప్రభుత్వాల్ని కూల్చడం, ఆయా నాయకుల్ని సీబీఐ సాయంతో అవినీతి కేసుల్లో ఇరికించడం కేంద్ర ప్రభుత్వాలకి చాలా సాధారణ విషయంగా అయిపోయింది." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"ఈ మర్మం తెలీని జగన్ కేంద్రంతో ఢీకొని జైలు పాలయ్యాడు. కేంద్రం పవర్ గూర్చి అంచనా ఉన్నందునే చంద్రబాబు, కేసీఆర్ బయటకెన్ని కబుర్లు చెప్పినా లోపల లోపాయికారీగా ఉంటున్నారు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు. 

"అవును." 

"శశికళకి పొలిటికల్ మేనేజ్మెంట్ తెలీలేదు. కేంద్రప్రభుత్వానికి భేషరతు మద్దతు ఇస్తానని, దాని కనుసన్నల్లో ఉంటాననీ సిగ్నల్స్ పంపలేదు. శేఖర్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీల ద్వారా కేంద్రం శశికళని 'హెచ్చరించి'నప్పటికీ ఆమె పట్టించుకోలేదు. కేంద్రానికున్న శక్తిని అంచనా వెయ్యడంలో శశికళ పొరపడింది." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు. 

"ఒప్పుకుంటున్నాను. కానీ తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు కదా?" ఆసక్తిగా అడిగాను. 

"ఇక్కడ నువ్వొక విషయం మిస్ అవుతున్నావ్! ట్రయల్ కోర్టులో శిక్ష పడ్డ కేసుని హైకోర్టు కొట్టేసింది. ఇంత ముఖ్యమైన కేసు అప్పీలుకి వచ్చినప్పుడు సుప్రీం కోర్టు దాన్ని రెండేళ్లుగా నాన్చడం ఆశ్చర్యం! ఫలితంగా - జైల్లో కూర్చోవాల్సిన ఒక వ్యక్తి కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండగలిగింది! అబ్సర్డ్ గా లేదూ? కోర్టు ఇన్నేళ్లు తీర్పుని ఎందుకు పెండింగ్ లో పెట్టింది? శశికళ ముఖ్యమంత్రి అయ్యే సమయంలోనే తీర్పు ఇస్తున్నానని ఎందుకు చెప్పింది?" అన్నాడు సుబ్బు. 

"అంటే?"

"అంటే - శశికళకి ఈ దేశంలో కోర్టుల గూర్చి కూడా అవగాహన లేదని అర్ధం!" నవ్వుతూ అన్నాడు సుబ్బు. 

"నీకున్న తెలివి శశికళకి లేదంటావా?" అడిగాను. 

"లేదని నేనెందుకు అంటాను! ఒక్కోసారి చాలా మంచి క్రికెటర్ కూడా సిల్లీ షాట్ కొట్టి అవుటయిపోతాడు. ఆ విషయం అతనికీ అవుటయ్యాకే తెలుస్తుంది. రాజకీయాలూ అంతే! నేవెళ్తాను." అంటూ నిలబడ్డాడు సుబ్బు. 

"పదిరోజుల్లో తమిళ రాజకీయాలు ఒక కొలిక్కి వస్తాయిలే!" అన్నాను. 

"రావు, రాజశేఖరరెడ్డి మరణం తరవాత కాంగ్రెస్ పార్టీ గతి యేమైందో గుర్తుందిగా? ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా యెవరున్నా కిరణ్ కుమార్ రెడ్డిలా వ్యక్తులకీ, వారి ఆస్తులకీ ఉపయోగం తప్ప పార్టీకి ప్రయోజనం ఉండదు." వెళ్ళబోతూ అన్నాడు సుబ్బు. 

"ప్రజాస్వామ్యంలో ఒక బలమైన నాయకుడు హఠాత్తుగా చనిపోతే అంతే!" అన్నాను. 

"ముందు నువ్వా పుస్తక భాష వదిలేసి వాస్తవ ప్రపంచంలోకి రా! మనం ఇప్పుడున్నది 'ప్రజాస్వామ్యం' అని పిలుచుకుంటున్న రాచరిక పాలనలో! ఆ మాత్రం తెలీదా నీకు?" పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.  

(picture courtesy : Google)

Friday, 27 January 2017

ఒక బూతు పోస్ట్


బూతు అనగా సెక్స్‌కి సంబంధించిన విషయం. వ్యక్తుల మధ్య జరిగే 'సెక్సువల్ ఇంటర్‌కోర్స్' అనే క్రియని 'బూతు' అని అంటారు. బూతుని రిఫర్ చేస్తూ అనే మాటల్ని 'బూతుమాటలు' అంటారు. మన దేశంలో నగ్నత్వం కూడా బూతుగానే చెలామణి అవుతుంది.. కొన్నిదేశాల్లో నగ్నత్వం బూతు కాదు. ఇవన్నీ కల్చర్‌కి సంబంధించిన అంశాలు.

ఇంటర్‌కోర్స్‌ని చిత్రీకరించే సినిమాల్ని 'బూతుసినిమాలు' అంటారు. వీటినే 'నీలిచిత్రాలు' అనికూడా అంటారు.. ఎందుకంటారో తెలీదు. కొందరు 'పోర్న్' అంటారు. మరికొందరు 'ఎడల్ట్ ఫిల్మ్స్' అంటారు. ఈ బూతుసినిమాలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టే ఇన్ని పర్యాయ పదాలు ఉన్నట్లుగా తోస్తుంది. ఈ తరహా సినిమాలు తియ్యడం కొన్నిదేశాల్లో 'కళారూపం' కిందకి వస్తుంది. కొన్ని అమెరికా రాష్ట్రాల్లో ఎడల్ట్ ఫిల్మ్ 'ఇండస్ట్రీ'కి చట్టబద్దత ఉంది.

బూతు విషయాలు చర్చకి వచ్చినప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు చదువుతారని/చూస్తారని స్పృహ ఉండాలని విజ్ఞులు వాకృస్తారు. పిల్లల విషయంలో నాకెటువంటి భేదాభిప్రాయం లేదు, వారిని ఈ విషయాల నుండి దూరంగా ఉంచాలని నేను గట్టిగా నమ్ముతాను. భారత ప్రభుత్వం వారు కూడా పజ్జెనిమిదేళ్ళ వయసు లోపు వారిని బూతుకి దూరంగా ఉంచాలని చట్టం చేశారు. ఆపై వయసువారు 'ప్రైవేటు'గా బూతు చూడొచ్చు. ఇందుకు చట్ట ప్రకారం ఆడామగ వివక్షత లేదు.

అసలీ పోస్టు రాయడానికి ఇన్స్పిరేషన్ అప్పుడెప్పుడో నేను రాసిన 'సినిమా రేపు'ల పోస్ట్. పిల్లలు, 'ఆడవాళ్ళు' చదువుతారన్న స్పృహ లేకుండా బూతు పోస్ట్ రాశానని ఒకాయన గుండెలు బాదుకున్నాడు. ఆ సచ్ఛీలునికో నమస్కారం.

తెలుగు పాఠకుల్లో మెజారిటీ సనాతనము మరియూ ఉన్నతమైన ఆలోచనలు మాత్రమే చేసే సంస్కారవంతులు. కాబట్టి అట్టి గొప్పవారు నా అపవిత్రమైన పోస్టుని తప్పు పట్టటం నన్నేమీ డిస్టర్బ్ చెయ్యలేదు. కానీ - 'నేనేమన్నా పొరబాటుగా ఆలోచిస్తున్నానా?' అనే సందేహం మాత్రం కలిగింది.

కావున - యెన్నోయేళ్ళుగా నాతో స్నేహం నెరపుతున్న నా స్నేహితురాళ్ళకి ఫోన్ చేశాను. 'అశ్లీలమైన' నా రేపుల పోస్టు గూర్చి వారివద్ద ప్రస్తావించాను. వాళ్ళంతా అప్పటికే నా రేపుల పోస్టు చదివేశార్ట.్ వెంటనే - బూతులు రాసి ఆడవారి మనసుని గాయపరచిన ఈ పాపిని క్షమించమనీ.. ఇకముందేప్పుడు ఇలా రాయననీ పరిశుద్దాత్మతో వేడుకున్నాను.

ఇలా అడిగితే గానీ - 'మేమూ అదే అనుకున్నాం. నువ్వింత చెత్త రాత ఎందుకు రాశావు?' అనో, 'ఛీఛీ! ఇన్నాళ్ళూ నువ్వింత బూతుగాడివని గ్రహించలేకపొయ్యాం.' అనో, 'రాసిందంతా రాశావుగా? ఇప్పుడెందుకీ ఏడుపు?' అనో, 'పాపాత్ముడా! నీకు అక్కచెల్లెళ్ళు లేరా?' అనో.. ఇవన్నీ కాక ఇంకేదైనానో అంటూ మనసులో మాట చెప్పేస్తారని నా వెధవాలోచన! 

అయితే - నా క్షమాపణ నా ఆడస్నేహితులకి నచ్చలేదు.

'పిల్లల మటుకూ అశ్లీలం అంటే ఓకే. కానీ మగవాళ్ళకి లేని అశ్లీలం ఆడవాళ్ళకేముంటుంది? బూతు అనేది మగవాడి exclusive right కాదు.' అని చిరాకు పడ్డారు. 

అమ్మయ్య! ఇప్పుడు రిలాక్స్ అయ్యాను. సిగరెట్ కాల్చగలిగిన హక్కు కలిగి ఉండి కాల్చకపోడం వేరు, అసలు సిగరెట్ కాల్చే హక్కే లేదంటే సిగరెట్ కాల్చనివారిక్కూడా కోపం వస్తుంది. వీళ్ళ 'బూతుహక్కు' కూడా 'సిగరెట్ హక్కు' వంటిదేనని అర్ధమైంది.

ఒక నేరాన్ని అంచనా వేసేప్పుడు వ్యక్తిగతం, సమాజగతం అనే అంశాలుగా బేరీజు వెయ్యాలి. వ్యక్తిగతం కన్నా సమాజగతమైన నేరాలు యెక్కువ ప్రమాదకరం. హత్య, దొంగతనం లాంటివి వ్యక్తిగతమైన నేరాలు. అలాగే 'అక్రమ' సంబంధాలు ('సక్రమ' సంబంధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే 'చట్టపరమైన' సెక్సు సంబంధం) కూడా ఈ కోవకే చెందుతాయి. వీటివల్ల వ్యక్తులకీ, వారి కుటుంబాలకీ నష్టం. సమాజానికి పరిమితమైన నష్టం.

సమాజానికి నష్టం కలిగించే నేరాలు.. దొంగనోట్ల వ్యాపారం, పబ్లిక్ పరీక్షల పేపర్లు అమ్ముకునే వ్యాపారం, రాజకీయమైన అవినీతి, ఓట్ల కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టటం.. ఈ ఘరానా నేరస్తుల లిస్టు చాలా పెద్దది, అది వేరే చర్చ.

మనలో అభిప్రాయాలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని అభిప్రాయాల్ని అనుభవంతో ఏర్పరచుకుంటాం. మిరపకాయ బజ్జీ తింటే కడుపు భగ్గుమంటుంది, ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు భగ్గుమంటాయి.. ఇవన్నీ అనుభవంతో తెలుసుకుంటాం. మేడమీంచి దూకితే కాళ్ళు విరుగుతాయని తెలుసుకోడానికి అనుభవం అవసరం. ఇవేవీ కాకుండా ఆయా సమాజాలకి చెందిన 'నైతికపరమైన' అభిప్రాయాలు మరికొన్ని. ఉదాహరణకి - మన సమాజంలో ఆడవారు 'పరాయి' మగాడితో మాట్లాడటం తీవ్రమైన తప్పు. 

ఇప్పుడు నా బూతు కథల అనుభవాల గూర్చి రాస్తాను. నే చదువుకునే రోజుల్లో 'రమణి' అని ఒక 'శృంగార కథల పత్రిక' బాగా పాపులర్. 'రమణి'లో సెక్స్ కథలు చందమామ కథల్లా నిత్యనూతనం. అనగా పాతసంచికలకి రిపీట్ వేల్యూ ఉంటుందని అర్ధం! ఆ విధంగా బూతుకథా యజ్ఞం అవిజ్ఞంగా కొనసాగించాను. ఆ కథలు అన్నేసి చదివినా నాకెప్పుడూ ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాలనిపించలేదు.

ఇప్పుడు నా బూతు సినిమా అనుభవాలు కొన్ని. 1980 లలో విడియో ప్లేయర్లు ఉన్న ఇళ్ళు తక్కువ. ఆ తక్కువ ఇళ్ళల్లో మా ఇల్లొకటి. అమ్మానాన్న తరచుగా అక్క దగ్గరకి వెళ్తుండేవారు. వాళ్ళు లేని రోజుల్లో నా స్నేహితులు మా ఇంటిని నీలిచిత్రాల అడ్డాగా మార్చేసేవారు. మొదట్లో వారితో పాటు నేను కూడా ఆ చిత్రరాజాల్ని ఉత్సాహంగా చూశాను గానీ.. ఆ తరవాత విసుగేసింది - ఎప్పుడూ ఒకటే గోల!

రాత్రుళ్ళు భీభత్సమైన బూతు సినిమాలు చూసిన నేనూ, నా స్నేహితులూ.. పగలు మెడికల్ కాలేజ్ లైబ్రరీలో తీవ్రంగా చదివేవాళ్ళం, క్లాసమ్మాయిల్తో కేంటీన్లో కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పేవాళ్ళం. ఇప్పుడో ప్రశ్న - అసలు ఈ పోర్న్ ఎందుకు చూశాను? వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఒకటే సమాధానం. చిన్నప్పుడు క్రికెట్ ఎందుకు ఆడానో, సినిమాలెందుకు చూశానో, అవధానిగారి ఇంట్లో దొంగతనంగా మావిఁడి కాయలు ఎందుకు కోశానో.. అదీ అందుకే! 

నాకంటూ ఒక ఎకడెమిక్ కెరీర్ ఉంది కాబట్టి, నా ఆలోచనలు ఎల్లప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉండేవని చెబితే చెల్లిపొవచ్చు.. చాలామంది ఇలా అబద్దాలే చెబుతారు. మనిషి డెవలెప్మెంట్ స్టేజెస్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఇవన్నీ సిటీ బస్ స్టేజీల్లాంటివి. ఒకటి దాటితేనే ఇంకోటి వస్తుంది. కొందరికి చెప్పుకోడం ఇష్టం ఉండదు, నేను చెప్పుకుంటున్నాను - అంతే తేడా!

బూతు సాహిత్యం చదివినా, బూతు సినిమాలు చూసినా మగాడు మృగాడుగా (దుర్మార్గమైన ఈ పదం తెలుగు మీడియా సృష్టి) మారిపోతాడని కొందరు గట్టిగా వాదిస్తారు. వారి సత్యసంధతని, నిజాయితీని శంకించను. యెవరి అభిప్రాయం వారిది. కొందరిది మతపరమైన సమస్యైతే, మరికొందరిది నైతిక సమస్య. ఇంకొందరిది సమాజ శ్రేయస్సు కోరుకునే నిజాయితీతో కూడిన నిజమైన ఆందోళన అయ్యుండొచ్చు.

కానీ - ఈ అభిప్రాయాలన్నీ ఋజువుకి నిలబడని వారి సొంత అభిప్రాయాలనే అనుమానం నాకుంది. అందుకు నా స్వానుభవం కూడా ఒక కారణం. బూతు సాహిత్యాన్ని, నీలిచిత్రాల్ని ఎంజాయ్ చేసిన నేను చెడిపోనప్పుడు.. ఇంకెవరన్నా ఎలా చెడతారు?! 

నా అనుభవాల్ని జనరలైజ్ చెయ్యడం కరెక్ట్ కాదు. కానీ.. మన సమాజంలో పోర్న్ గాంచడం వల్ల చెడిపోతారంటానిక్కూడా ఋజువు కావాలి కదా? అయితే అందుకు కొందరు 'చెడిపోయిన'వారిని ఉదాహరణగా చూపవచ్చు. కానీ వాళ్ళు పోర్న్ వల్లే చెడిపొయ్యారని నిర్ధారించలేం. పోర్న్ చూసినా ఎఫెక్ట్ కాని నన్ను ఎలాగైతే జెనరలైజ్ చెయ్యకూడదో పోర్న్ చూసి చెడిపోయినవాణ్నీ జనరలైజ్ చెయ్యకూడదు.

సైకాలజిస్టులు కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి 'కథార్సిస్' అనే టెక్నిక్ వాడతారు. ఎగ్రెసివ్ పర్సన్ ఒక భీభత్సమైన ఏక్షన్ సినిమా చూస్తూ ఆ హీరోతో తనని తాను ఐడెంటిఫై చేసుకుని తన ఎగ్రెసివ్ ఫీలింగ్స్ నుండి విముక్తి పొందొచ్చు. దీన్నే 'వెంటిలేషన్' అని కూడా అంటారు. అలా కోపవిముక్తుడైన ఆ వ్యక్తి, ప్రవర్తనలో కొంత సౌమ్యుడుగా మారవచ్చు.

ఇప్పుడు ఇదే లాజిక్‌ని పోర్నగ్రఫీకి తీసుకొద్దాం. పోర్న్ వాస్తవం అనుకునే అమాయకుడు ఉండడు. పోర్న్ నటుల ఇమేజెస్ మెదడుని స్టిమ్యులేట్ చేస్తాయి. చూసేవాడు ఆ నటుల్తో ఐడెంటిఫై చేసుకుని ఆనందం పొందుతాడు. ఇది పూర్తిగా ఫేంటసీ, వెంటిలేషన్ ఆఫ్ సెక్సువల్ డ్రైవ్. జాకీ చాన్ ఫైటింగులు చూసినవాడు రోడ్ల మీద జనాల్ని తన్నడు, తన్నినట్లు తృప్తి నొందుతాడు, ఇదీ అంతే.

నేనిదంతా రాస్తుంది నా ఆలోచనలు మీతో పంచుకోవటానికి తప్ప పోర్న్ ప్రమోట్ చెయ్యటానికి కాదు, దానికి ఆల్రెడీ కోట్లాది అభిమానులున్నారు. మీరొక్కసారిగా ఉలిక్కిపడి నాకు నీతిబోధన కార్యక్రమం మొదలేడ్తే నే చేసేదేంలేదు. ఇప్పుడంతా నీతుల కాలం నడుస్తుంది. నీతులు వినేవాళ్ళ కన్నా చెప్పేవాళ్ళే ఎక్కువైపొయ్యారు. బూతు వల్ల తెలుగు సమాజం ఎంతగా చెడిపోయ్యిందో తెలుసుకోటానికి మన దగ్గర సైంటిఫిక్ డాటా లేదని నా అభిప్రాయం. ఋజువు లేకుండా ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది, అంతకుమించి మరేమీ కాదు.

అసలు బూతు అంటే ఏమిటి? 'మనసుని చెడుగా ప్రభావితం చేసి, వ్యక్తిత్వాన్ని చెడగొట్టేది బూతు' అనే విస్తృత నిర్వచనం ఇచ్చేసుకున్నట్లైతే ఈ ప్రపంచంలో మనకి కావలసినంత బూతు ఉండనే ఉంది.

మత చాందసాన్ని ప్రమోట్ చేస్తూ, ఇతర మతాలపై విషం చిమ్మే ఏ పుస్తకమైనా బూతు పుస్తకమే! మనుషుల్ని శతాబ్దాల వెనక్కి తీసుకుపొయ్యే ఏ సాహిత్యమైనా బూతు సాహిత్యమే. సాంప్రదాయాల పేరుతొ తిరోగమన భావాజాలాన్ని ప్రమోట్ చేసే ఏ సినిమా అయినా బూతు సినిమానే.

ఆ విశాల దృష్టితో చూస్తే సినిమాల్లో నగ్నత్వం చూపిస్తే బూతు కాదు. మరి బూతంటే ఏంటి? ప్రేమ పేరుతొ హీరో వేసే వెకిలి వేషాలు బూతు. ఆడపిల్లల్ని హీనంగా తీసిపడేసే హీరో గారి పొగరు బూతు.

పాత సినిమాల్లో కూడా బుట్టల కొద్ది బూతు డైలాగులుండేవి.

'ఏమండి! మీరు ఎంతైనా తాగండి, తిరగండి. కానీ ఈ నిర్భాగ్యురాలికి మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి. కనీసం మీ ఇంట్లో పనిమనిషిగానైనా చోటివ్వండి.'

నో డౌట్.. ఇది మాత్రం పచ్చి బూతు డైలాగ్!

(written on 14th June 2014)

(picture courtesy : Google)