Friday, 26 July 2013

మిస్సమ్మ


'మిస్సమ్మ' నాకు ఇష్టమైన సినిమా, చాలాసార్లు చూశాను. ఒకప్పుడు సరదాగా నవ్వుకోడానికి చూసినా.. ఈమధ్య చూసినప్పుడు కొన్ని సందేహాలు కలిగాయి. అవేమిటో ఇప్పుడు రాస్తాను. 

కొద్దిసేపు మిస్సమ్మ 'కథ' గూర్చి మాట్లాడుకుందాం. మిస్సమ్మ సినిమాకి మాతృక ఒక బెంగాలి కథ. హీరోహీరోయిన్లు నిరుద్యోగులు. ఒకరు హిందూ, ఇంకొకరు క్రిస్టియన్. ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటించడంలో వారు పడే ఇబ్బందులే మనని నవ్విస్తాయి. అందుకు ప్రధాన కారకుడు ఉద్యోగాలిచ్చిన అమాయక జమీందారు. తెలుగుదేశంలో ఇట్లాంటి అమాయక జమీందారు ఉన్నారో లేదో తెలీదు కానీ వంగదేశపు జమీందార్లు మంచివాళ్ళు - 'దేవదాసు' కథలో పార్వతి వృద్ధభర్త కూడా 'మంచి' జమీందారే.

సరే! ప్రేక్షకుల్ని నవ్వించడానికి మాత్రమే అనేక సహాయ పాత్రలు ఉంటాయి. 

- మజా కోసం మోసాలు చేసే హీరో అసిస్టెంట్,

- జోకర్లా ప్రవర్తించే (జమీందారు) మేనల్లుడు,

- సంగీతం, డ్యాన్సుల పిచ్చితో (జమీందారు) మొండికూతురు,

- సీమంతాలు చేసి ముచ్చట తీర్చుకునే (జమీందారు) వెర్రిబాగుల భార్య. 

'మిస్సమ్మ' అనేక eccentric characters తో కేవలం హాస్యం కోసం రాసుకున్న కథ, బూతద్దంతో వెతికినా లాజిక్ కనబడదు. 

మిస్ మేరీకి తన క్రీస్టియన్ మతం అంటేనే విశ్వాసం, వేరే మతాలకి దూరం. ఆ విషయం మేరీ చాలా స్పష్టంగా చెబుతుంది. కానీ ఆమె త్యాగరాజ కృతి పాడటమే కాదు.. శాస్త్రీయ సంగీతం నేర్పించేంత పరిజ్ఞానం కలిగుంటుంది! ఇంతాజేసి - ఆమెకి రుక్మిణి, సత్యభామలు ఎవరో తెలీదు! 

కామెడీని చూసేప్పుడు నవ్వుకుని కొంతకాలానికి మర్చిపోతాం. కామెడీ అయినా - సమాజంలో కనపడే పాత్రలు, వాటి నిత్య జీవిత పోరాటాలతో సృష్టించిన కామెడీకి ఒక iconic status ఉంటుంది. అందుకు ఉదాహరణ చార్లీ చాప్లిన్ సినిమాలు.

'మిస్సమ్మ'లో సామాన్యుడు తన జీవితాన్ని ఐడెంటిఫై చేసుకునే పాయింటేమీ లేదు. నిరుద్యోగాన్ని చూపిస్తారు గానీ అది కథలో ఒక అంశం మాత్రమే. 

మరి - తెలుగువారికి 'మిస్సమ్మ' ఎందుకంతగా గుర్తుండిపోయింది?

'మిస్సమ్మ' 1955 లో విడుదలైంది. అప్పటికి తెలుగు సినిమా బరువైన కుటుంబ కథలతో భారంగా నడుస్తుంది. సినిమాల్లో 'కథాబరువు' మరీ ఎక్కువైపోయి మునిగిపోకుండా కస్తూరి శివరావు, రేలంగిలు కాపాడుతుండేవాళ్ళు.

'పెళ్ళిచేసిచూడు'లో (1952) హాస్యం కోసం జోగారావు ట్రాక్ నడిపిస్తూ వరకట్న సమస్యని ప్రధానం చేశారు. కాబట్టి దీన్ని హాస్యప్రధానంగా తీసిన సందేశాత్మక సినిమాగానే భావించాలి. ఈ కారణాల వల్ల తెలుగులో మొదటి పూర్తి నిడివి కామెడీ 'మిస్సమ్మ' అని నా అభిప్రాయం. 

మిస్సమ్మ వచ్చేవరకూ తెలుగు ప్రేక్షకులకి absurd comedy అంటే తెలీదు. అప్పటివరకూ బరువైన కథాచిత్రాల్లో పాత్రలు పోషించిన ప్రముఖ నటులు.. హాస్యపాత్రల్లో కనపడ్డం తెలుగువారికి నచ్చేసి ఉండొచ్చు.

ఇంతటితో నా మిస్సమ్మ ఆలోచనలు సమాప్తం. 

(picture courtesy : Google)

Saturday, 20 July 2013

సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?


మిత్రులారా! ఈరోజు మీకో రహస్యం చెప్పాలి. నాగూర్చి నేను గొప్పలు చెప్పుకోకూడదు గానీ.. నేను చిన్నప్పట్నించే గొప్పఆలోచనాపరుణ్ని. మానవ సమాజం, సమాజ మనుగడ, వినోదం, విజ్ఞానం, భవిష్యత్తు కార్యాచరణ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై తలమున్కలుగా ఆలోచిస్తుండేవాణ్ని. స్కూల్లో కూర్చుని నేచేసిన నా ఆలోచనలు మచ్చుకు కొన్ని రాస్తున్నాను. చదివి ఆనందించండి.

'సినిమా'.. ఎంత గొప్ప పదం! వినుటకు కడు ఇంపుగా, సొంపుగా యున్నది! అసలీ సినిమా అనునది మానవునికి దేవుడు ప్రసాదించిన ఒక వరం. ఒక గొప్ప అదృష్టం. సినిమాలు చూడ్డం అన్నది నాగరికతకి చిహ్నం. సినిమా అనేది ఒక జాతికి జీవగర్ర (జీలకర్ర కాదు). సినీవీక్షణం ఒక పవిత్ర కార్యం, జీవన పరమావధి. సినిమాలు చూడనివాడి జీవితం వృధా.

అసలీ పురప్రజలు రోడ్ల మీద తిరుగుతూ టైమెందుకిలా వేస్ట్ చేసుకుంటున్నారు? ఊరంతా సినిమా హాళ్ళు కట్టించేస్తే హాయిగా అందరూ సినిమాలు చూసేస్తూ సినిమా హాళ్ళల్లోనే జీవించేవారు గదా! నాన్న జేబునిండా డబ్బులున్నా కూడా రోజుకో సినిమా చూడ్డేంటి? నేను మాత్రం పెద్దైంతరవాత బోల్డంత డబ్బు సంపాదించి రోజంతా సినిమాలు చూస్తూ బతికేస్తాను.

మిత్రులారా! నా ఆలోచనలు ఇంకా రాయాలంటారా? విజ్ఞులు. ఈపాటికి మీకు అర్ధమైపొయ్యుంటుంది. చిన్నట్నించి నేనెంతటి అచంచల ఆలోచనాపరుణ్నో!

ఇప్పుడు కొంచెంసేపు నా సినిమా ముచ్చట్లు. నా చిన్నతనంలో మాకు సినిమా చూడటం అనేది ఏకైక వినోద సాధనం. అందునా మా మధ్యతరగతి జీవితాల్లో సినిమా అనేది ఒక లక్జరీ కూడా. రిక్షాకి, సినిమా టిక్కెట్లకి, అవుట్ బెల్లులో (intermission) తాగే గోళీ సోడా ఖర్చుతో సహా బజెట్ ముందుగానే నిర్ణయించబడేది (సినిమా తియ్యడానికే కాదు, చూడ్డానిక్కూడా బజెట్ కావాలి).

నేను తెలివైనవాణ్నని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. సినిమాలో ఏమీ కొనుక్కోనని (ఇంటి దగ్గర) అమ్మని నమ్మబలికిన నేను.. సినిమా మొదలవ్వంగాన్లే చక్రాలు కొనిపెట్టమని బ్రతిమాలేవాణ్ని, ఏడిచేవాణ్ని (ఏడుపుని ఎఫెక్టివ్ గా వాడుకోవటం ఒక ఆర్ట్). అమ్మ దగ్గర రిజర్వులో బ్లాక్ మనీ (నాన్నకి తెలీకుండా ఇంటిఖర్చుల్లో మిగిల్చుకున్న చిల్లర) ఉంటుందని నాకు తెలుసు.

ఒకవైపు సినిమా తెరపై నడుస్తుండగానే క్యాంటీన్ కుర్రాళ్ళు చక్రాలబుట్టతో హాలంతా తిరుగుతుండేవాళ్ళు (ఎక్కువగా పిల్లలున్నచోటనే తచ్చాడుతుండేవాళ్లు). పదిపైసలకి ఐదు చక్రాలొచ్చేవి. మొత్తానికి చక్రాలు సాధించి, చొక్కా జేబులో (నా లూజు చొక్కా గూర్చి "నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు"  అంటూ ఓ పోస్టు రాశాను) వేసుకుని.. అటు తరవాత బుల్లిబుల్లి తుంపులుగా చేసుకుని.. కొద్దికొద్దిగా చప్పరిస్తూ, నముల్తూ (చక్రాలు హడావుడిగా తినరాదు. తొందరగా అయిపోవును) సినిమా చూసేవాణ్ని.

అసలు ఇంట్లోవాళ్ళు సినిమా ప్రోగ్రాం పెట్టుకోంగాన్లే ఒకరకమైన ఉద్వేగం, ఆనందం. సినిమా తెర తీస్తున్నప్పట్నించే చాలా fascinating గా ఉండేది. ఆ తెర అటూఇటూ పట్టుకు లాగేది మనుషులా? లేక కరంటు మిషనా? అన్నవిషయం గూర్చి చాలా తీవ్రంగా ఆలోచించేవాణ్ని (ఈ విషయంపై స్నేహితులతో మేధోచర్చలు కూడా జరిపేవాణ్ని).

సినిమాకి ముందు న్యూస్ రీళ్ళు వేసేవాళ్ళు. కరువు, వరదలు అంటూ ఏవో వార్తలు చూపించేవాళ్ళు (వీటిని మేం ట్రైల్ పార్టీ అనేవాళ్ళం). అసలు సినిమాకి ముందు కొసరులాగా వచ్చే ఈ రీళ్ళు కూడా నాకు భలే ఇష్టం (ఎంతైనా ఫ్రీ కదా).

ఆ రోజుల్లో నా జీవితంలో మధురానుభవం సినిమా చూడ్డం. అందులో ఇంకా మధురాతి మధురానుభవం రామారావు, రాజనాల కత్తియుద్ధ సన్నివేశాల్ని కనులారా వీక్షించడం. వాళ్ళిద్దరూ లోకేషన్లు మార్చుకుంటూ, (చేతులు పడిపొయ్యేలా) గంటలసేపు యుద్ధం చేసుకునేవాళ్ళు. వాళ్ళెంతసేపు యుద్ధం చేసుకున్నా.. ఇంకొంచెంసేపు చేసుకుంటే బాగుండుననిపించేది.

ఈరోజున నేనా సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది? నాకా రోజుల్లో అమితానందాన్నిచ్చిన ఆ సినిమాల్ని చూడ్డానికి మొన్నామధ్య ప్రయత్నించాను. కొద్దిసేపు కూడా చూళ్లేకపొయ్యాను. కారణమేమై యుండును? నేను విజ్ఞానవంతుడనయ్యానా? వివేకవంతుడనయ్యానా? మేధావినైపొయ్యానా? బాకుల్లాంటి ఈ ప్రశ్నలకి (ఒకే ప్రశ్నని ఎఫెక్టు కోసం మూడురకాలుగా రాశాన్లేండి) సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

చిన్నప్పుడు నాకు సినిమాలు 'తీస్తారని' తెలీదు. తెరమీద కనిపిస్తున్నదే నిజమనుకునేవాణ్ని. రామారావు సావిత్రిలు నిజంగానే భార్యాభర్తలు. సూర్యకాంతం నిజంగానే గయ్యాళి. రాజనాల నిజంగానే చెడ్డవాడు. వాళ్ళమధ్య జరుగుతున్న సంఘటనలన్నీ వాస్తవం. ఇంకో ఆలోచనకి తావు లేదు.

నేను హైస్కూల్లో చదివేప్పుడు నాపక్కన శాస్త్రి కూర్చునేవాడు. వాడు సినిమా విషయాలు చాలా చెప్పేవాడు.

"ఎన్టీరామారావు, సావిత్రి నిజంగానే మొగుడూపెళ్ళాలు. అందుకే రామారావు సావిత్రిని అంత గట్టిగా వాటేసుకుంటాడు. అదే నాగేస్సర్రావుని చూడు.. సావిత్రిని ముట్టుకోవాలంటే బయ్యం. దూరందూరంగా ఉంటాడు. సావిత్రిని ముట్టుకుంటే.. నాగేస్సర్రావు తన పెళ్ళాన్ని ముట్టుకున్నాడని రామారావుకి కోపం వస్తుంది. అప్పుడింక నాగేస్సర్రావు పని ఔట్."

"నిజంగా?"

"నిఝం. తల్లితోడు. మా అన్నయ్య చెప్పాడు." మా శాస్త్రిగాడికి ప్రతిదానికీ ఒట్లెయ్యడం అలవాటు.

నా వెనక బెంచిలో వీరయ్య ఉండేవాడు. వాడి భాష మొరటు. తెలుగు సినీతెర వెనుక రహస్యాలు చూసినట్లే చెప్పేవాడు.

"ఎన్టీవోణ్ని చంపెయ్యడానికి నాగ్గాడు అట్టకత్తి కాంతారావుతో కలిసి ప్లానేశాడు. ఈ సంగతి ముందే కనిపెట్టిన ఎన్టీవోడు కత్తి తీసుకోని గుర్రం మీద స్రీడుగా వస్తంటే బయపడి నాగ్గాడు పారిపోయ్యాడు. కాంతారావు ఎన్టీవొడి కాళ్ళ మీద పడ్డాడు."

నా ముందు బెంచిలో సూరి కూర్చునేవాడు. వాడిక్కూడా గొప్ప సినిమా నాలెడ్జ్ ఉండేది.

"ఉరేయ్! నీకీసంగతి తెలుసా? రామారావు కిష్టుడి వేషం వేసేముందు పూజ చేస్తాడు. అప్పుడు కిష్టుడు రామారావులోకొచ్చేస్తాడు. ఇంకాతరవాత రామారావు చేసేదేముండదు. అంతా ఆ కిష్టుడే చేసేస్తాడు."

సినిమా నటులకీ, పాత్రలకీ తేడా మాకు తెలీదు. మేం చూసే సినిమాలు మద్రాసులో తీస్తారని, సినిమాలో మేం చూస్తున్న ప్రతి సన్నివేశాల్ని క్షుణ్ణంగా ప్లాన్ చేస్తారని మాకు తెలీదు. రామారావు, రాజనాల విఠలాచార్య చెప్పింది శ్రద్ధగా విని.. కత్తియుద్ధం చేసినట్లు నటించి.. ఎవరిళ్ళకి వాళ్ళెల్తారనీ, వాళ్లక్కూడా భార్యాపిల్లలుంటారనేది మా ఊహకందని విషయం.

ఇవన్నీ తెలీదు కనుకనే రాజనాల (పనీపాట లేకుండా) పొద్దస్తమానం హీరోయిన్లని కిడ్నాప్ చేసే పన్లో ఉంటాడని నమ్మేవాళ్ళం. ఈ విలన్ల కుట్రల్ని భగ్నం చేస్తూ హీరోలు ఎంతటి కష్టాలు పడుతున్నారో కదా అని బోల్డు బాధ పడుతుండేవాళ్ళం. విలన్ల పన్నాగాలు హీరోలు ఎక్కడ తెలుసుకోలేరోనని ఆందోళన చెందేవాళ్ళం. కత్తియుద్ధంలో రాజనాల రామారావుని ఎక్కడ లోయలోకి తోసేస్తాడోనని భయపడేవాళ్ళం. రామారావు రాజనాలని ఓడించంగాన్లే ఆనందంతో చప్పట్లు కొట్టేవాళ్ళం.

కాలచక్రం గిర్రున (ఎందుకో అనాదిగా ఈ కాలచక్రం 'గిర్రు'మనే తిరుగుతుంటుంది) తిరిగింది. నేను పెద్దవాడనైనాను. సినిమా చూసి చాలా యేళ్ళయింది. ఇప్పుడు నాకు సినిమా ఎట్లా తీస్తారో తెలుసు. అంచేత అందులో మజా పోయింది. సినీఅభిమానులు ఫొటోగ్రఫీ బాలేదనీ, సంగీతం బాగుందని ఏంటేంటో మాట్లాడుతుంటారు. నాకెందుకే ఇట్లాంటి సంభాషణ రుచించదు.

పాండవవనవాసంలో రామారావు ఆవేశంగా ఊగిపోతూ తొడగొట్టి పాడిన 'ధారుణి రాజ్యసంపద.. ' రామారావు పాళ్లేదనీ, వెనుకనుండి ఘంటసాల పాడాడనీ నాకు తెలీదు. నాకా పద్యం ఎందుకంత ఇష్టమో "ధారుణి రాజ్యసంపద.. ! (బీడీలబాబు కథ)" అనే  టపాలో రాశాను. ఇప్పటితరం పిల్లలు మా అంత అమాయకులుగా ఉన్నారో లేదో తెలీదు (సినిమా ఎంజాయ్ చెయ్యడానికి కొంత అమాయకత్వం అవసరం).

నేను అప్పుడప్పుడు నా అభిమాన నటులంటూ వెనకటి తరం నటుల గూర్చి రాస్తుంటాను. వాళ్ళు గొప్పనటులని మెచ్చుకుంటూ ఉంటాను. నా రామారావు అభిమానంతో "బిరియానీయేనా? కాదు.. కాదు.. పులిహోరే.. !" అంటూ ఒక టపా కూడా రాశాను. ఎన్టీరామారావుకి సాధ్యం కానిదేది లేదని బలంగా నమ్మినవాణ్ని. ఎన్టీఆర్ నా మనసులో ఒక భాగం. అమ్మానాన్నల్లగా ఈ బంధం కూడా ఒక emotional bonding.

ఎన్టీరామారావు సినిమాలు చూసినప్పటి నా మానసికస్థితి వేరు. అప్పుడు నాకు రామారావు ఇచ్చిన మజా.. ఈరోజుల్లో పిల్లలకి మహేశ్ బాబు వంటి పాపులర్ హీరోలు ఇస్తున్నారని నా నమ్మకం. వయసురీత్యా ఒక సినిమా చూసి ఆనందించే స్థితి నేను ఎప్పుడో దాటిపొయ్యాను (ఈ స్థితి నాకేమీ సంతోషకరంగా లేదు).

సినిమా నటుల తరం మారినట్లే ప్రేక్షకులతరం కూడా మారుతుంది. ఏ తరంవారికి ఆతరం సినిమాలు నచ్చుతాయి. ఒకవయసు దాకా మన జీవితాల్లో సినిమా అనేది చాలా ముఖ్యమైనది. అటుతరవాత జీవితంలో సినిమా ప్రాముఖ్యత తగ్గడం మొదలై.. కొంతకాలానికి సినిమా అనే పదమే కనుమరుగైపొతుంది.

అందుకే వయసుడిగినవారు సినిమా ప్రసక్తి వచ్చినప్పుడల్లా తమ చిన్నప్పటి హీరోల్నే ప్రస్తావిస్తుంటారు. అసలు విషయం.. వాళ్ళు సినిమాలు చూడ్డం ఎప్పుడో మానేశారు. ఒకరకంగా ఇదో fixation. ఏసీ హోటళ్ళలకి అలవాటు పడ్డ ఈతరం కుర్రాళ్ళకి మా ఆనందభవన్ నచ్చదు. అట్లాగే మా సినిమాలూ నచ్చావు. మేం కూడా vice versa.

అమ్మాయ్య! ఇప్పుడు నాకు 'సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?' అన్న ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మీక్కూడా వచ్చేసుంటుంది (కష్టపడి ఇక్కడదాకా రాసుకుంటూ వచ్చాను. కాబట్టి మీ తరఫున కూడా నేనే చెప్పేస్తున్నా).

ముగింపు -

గత కొంతకాలంగా నా పిల్లలకి ఏదైనా పాతసినిమా చూపిద్దామని (కనీసం గుండమ్మకథ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను. నావల్ల కావట్లేదు. వారిని బలవంతం చేస్తుంటే.. 'సావిత్రేంటి ఇంతలావుగా ఉంది? రామారావెందుకలా నిక్కరేసుకున్నాడు?' లాంటి చెత్తప్రశ్నలతో నాపై ఎదురుదాడి చేస్తున్నారు. వళ్ళు మండిపోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చన్నీళ్ళ స్నానం చెయ్యడం మించి నే చెయ్యగలిగిందేమీ లేదు.

(ఏవిటో! 'సినిమాలు చిన్నప్పుడే బాగుంటయ్' అనే నా థియరీ కరెక్టనే సంతోషం ఒకవైపు.. నా హీరో ఎన్టీరామారావుని నా పిల్లలకే చూపించలేకపోతున్నాననే దుఃఖం మరోవైపు.. ఎలా రియాక్టవ్వాలో తేల్చుకోలేకున్నాను.)

(photos courtesy : Google)

Wednesday, 17 July 2013

బడిపిల్లలు ఉద్యమకారులేనా?


కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని కోస్తాంధ్రలో మళ్ళీ 'ఉద్యమ సెగలు' మొదలయ్యాయి. నిరసన తెలియజెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం అనేవి ప్రజాస్వామిక హక్కులే. అయితే ఉద్యమాలు చెయ్యవలసింది ఎవరు? రాజకీయ పార్టీలు, లేదా తమకి నష్టం జరుగుతుందని భావించే వ్యక్తుల సమూహం, బడిపిల్లలు కాదు.

పోయిన సంవత్సరం 'సమైక్యాంధ్ర' పేరిట ఒక ఉద్యమం నడపబడింది. బడిపిల్లల్ని యూనిఫాముల్లో, బ్యానర్లు మోయిస్తూ గొర్రెల్ని తోలికెళ్ళినట్లు తీసుకెళ్ళి నిరసనల్లో భాగం చేశారు. 'మానవ హారం' అంటూ పిల్లల్ని ఎండలో గంటలకొద్ది నించోబెట్టారు. నాయకులు ఆవేశంతో ఊగిపోతూ (టీవీల కోసం) ప్రసంగాలు చేశారు. చివర్లో KCR దిష్టిబొమ్మని చెప్పుల్తో కొట్టి తగలబెట్టారు. ఈ తతంగం ఎప్పుడైపోతుందా అని పిల్లలు మండుటెండలో మాడిపోతూ, నీరసంగా ఎదురుచూశారు.

పిల్లల్తో ఈ విధంగా బలవంతపు 'నిరసన' తెలియజెయ్యడం  స్కూలు యాజమాన్యాలకున్న రాజకీయాలే కారణం. అనేక స్కూళ్ళ యాజమాన్యాలకి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు (vested interest కూడా) ఉండటం చేత.. 'ఉద్యమం' కోసం పిల్లల్ని పోగుచేసి.. ఇలా రోడ్ల మీద ప్రదర్శన చేయించారు.

నా చిన్నతనంలో నేను కూడా ఇట్లాంటి హింసకి గురయ్యాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్ళయ్యిందని మాచేత బ్యానర్లు మోయిస్తూ రోడ్లన్నీ తిప్పారు. 'అసలీ స్వాతంత్ర్యం ఎందుకొచ్చిందిరా బాబోయ్!' అని ఏడ్చుకుంటూ ఊరంతా తిరిగాం. మధ్యలో పారిపోవటానికి వీల్లేకుండా సింహంలా హెడ్మాస్టర్, పులుల్లా మేస్టర్లు మాకు కాపలా. పట్టుబడితే అంతే సంగతులు.

'జైఆంధ్ర' ఉద్యమంలో కూడా మాకు ఇవే కష్టాలు. 'ముల్కీ డౌన్ డౌన్' అంటూ వీధులన్నీ తిప్పారు. పోనీ 'ముల్కీ' అంటే ఏంటో చెబుతారా? అంటే అదీ లేదు. జైఆంధ్ర ఉద్యమంలో మాదో కూలి పని. వెట్టి చాకిరి. పిల్లల్ని ఎండల్లో తిప్పడం.. జనాలని చౌకగా పోగేసే ఒక దుర్మార్గ విధానం. ఇన్నేళ్ళైనా పిల్లల పరిస్థితి ఏమాత్రం మారకపోవటం ఆశ్చర్యకరం.

ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రతి అడ్డమైన ప్రభుత్వ అధికార కార్యక్రమాలకి (అనగా మంత్రులు, కలెక్టర్ పాల్గొను కార్యక్రమం) పిల్లలతో ర్యాలీ తీయిస్తారు. ప్రధాన వీధులన్నీ తిప్పుతారు. మొన్నామధ్య ఎయిడ్స్ ని అరికట్టండంటూ పిల్లల్తో ఒక భారీ ప్రదర్శన చేయించారు. మరి పిల్లలకి, ఎయిడ్స్ కీ సంబంధమేంటో తెలీదు.

మా ఊళ్ళో ఘనత వహించిన ఒక స్కూల్లో ఓనరయ్య, ఓనరమ్మలు తమ పుట్టిన్రోజులకి (పొగుడించుకుంటూ) పిల్లల్తో పాటలు పాడించుకుంటారు. వారు నడిచే దారిలో పూలు చల్లింప చేయించుకుంటారు. విద్యార్ధుల తలిదండ్రులు ఇలాంటి హీనమైన, సిగ్గుమాలిన, నీచసంస్కృతికి ఎందుకు సహకరిస్తున్నారో అర్ధం కాదు.

పిల్లలు చాలా సున్నితమైనవారు. అర్భకులు. వారిని ఎండల్లో రోడ్లంట తిప్పడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదు. అందువల్ల వారు dehydration కి గురయ్యే ప్రమాదముంది. దుమ్ము, ధూళి, చెత్తకి expose చెయ్యడం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముంది. మన పట్టణాల్లో ట్రాఫిక్ చాలా అడ్డదిడ్డంగా ఉంటుంది. ఈ ర్యాలీల్లో ఒక పద్ధతిగా లైన్లో వెళ్తున్న పిల్లల్ని.. సిటీ బస్, ఆటో డ్రైవర్లు హారన్లు కొడుతూ వారిని కంగారు పెట్టి పరుగులు తీయిస్తుంటారు. వారికదో పైశాచికానందం.

పిల్లల్ని తమ రాజకీయ కార్యక్రమాలకి వాడుకునే దుష్టసంప్రదాయాన్ని అందరూ వ్యతిరేకించాలి. మనదేశంలో పులులకీ, తోడేళ్ళకైనా రక్షణ అంటూ చట్టాలు చచ్చాయి. కానీ.. పిల్లల రక్షణ కోసం చట్టాలున్నట్లు తోచదు. ఇదొక విషాదం, కానీ వాస్తవం.

(photo courtesy : Google)

Saturday, 13 July 2013

ప్రాణ్


హిందీ సినిమా నటుడు ప్రాణ్ చనిపోయాడు. ప్రాణ్ మనదేశంలో అత్యంత ప్రముఖుడైన దుష్టుడు. తొంభై సంవత్సరాలు దాటి జీవించాడు. బహుశా హిందీ సినిమా ప్రేక్షకులు ఆయన్ని (ఆయన పాత్రల్ని) తిట్టిన తిట్లన్నీ దీవెనలుగా మారి ఇంతటి దీర్ఘాయుష్షు ప్రసాదించాయేమో!

వందేళ్ళక్రితం ప్రజలకి సినిమా అంటే ఏంటో సరీగ్గా తెలీదు. సినిమా అందుబాటులోకి వచ్చిన మొదట్లో చాలారోజులపాటు అంతకుముందు ప్రదర్శించిన నాటకాల్నే సినిమాలుగా మార్చుకున్నారు. కొంతకాలానికి సాంఘిక కథలు సృస్టించడం మొదలెట్టారు.

అయితే ఈ 'సాంఘిక' కథలక్కూడా రామాయణ మహాభారత కథలే మూలం, స్పూర్తి అని నా అభిప్రాయం. మంచి లక్షణాలన్నంటినీ పేర్చి నాయకుడిగానూ, చెడ్డలక్షణాలన్నీ కుప్పపోసి ప్రతినాయకుడిగానూ కథలు రాసుకుని సినిమాలు తీశారు. అనగా విలన్ పాత్రలకి ప్యాంటు, షర్టు తోడిగినా.. వాడికన్నీ రాక్షస లక్షణాలే. అందుకే విలనెప్పుడూ దుర్మార్గుడు, నీచుడు, స్త్రీలోలుడు.

అంచేత ఆ రోజుల్లో దాదాపు అన్నిభాషల్లో ఇట్లాంటి విలన్ పాత్రలుండేవి (అనుకుంటున్నాను). 1950 మరియు 60 లలో తెలుగులో రాజనాల, తమిళంలో నంబియార్, హిందీలో ప్రాణ్ లు దుష్టపాత్రలు పోషించారు. అర్ధశతాబ్దం తరవాత.. ఇప్పుడు మనకా పాత్రలు cartoon characters లా అనిపిస్తాయి కానీ.. ఆ రోజుల్లో అవి కథకి అత్యంత అవసరమైన పాత్రలు.

మన తెలుగు ప్రేక్షకులది బీభత్సమైన టేస్ట్. అంచేత మన అభిరుచికి తగ్గట్లుగా దర్శకులు విలన్ మొహంపై కిందనుండి లైటు వేసి నీడల్ని సృష్టించి భయపెట్టడం.. కనుబొమలు మందంగా, వంకరగా మేకప్ చెయ్యడం వంటి రకరకాల ట్రిక్కులు  ప్రయోగించి.. సాధ్యమైనంత విలన్ మొహాన్ని క్రూరంగా చూపెట్టేవాళ్ళు. తమిళులది మనకన్నా మరీ బీభత్సమైన టేస్ట్.. ఆ విషయం మీకు నంబియార్ని చూస్తే స్పష్టంగా అర్ధమైపోతుంది.

పాపం హిందీలో ప్రాణ్ కి ఇట్లాంటి ఫెసిలిటీలు లేవు. ఆయన పాత్రరీత్యా (ఎక్కువగా) ఫుల్ సూట్లో కనబడేవాడు. మనిషి బాగుంటాడు. అంచేత హిందీ సినిమా విలన్ పాత్రలో క్రూరత్వ ప్రదర్శన కోసం ప్రాణ్ తనదైన కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడు. కళ్ళల్లో తోడేలు వంటి మోసపు చూపు, పెదవులపై వంకరగా నవ్వీనవ్వనట్లు ఒక విషపు నవ్వు చూపిస్తూ మనని భయపెట్టాడు. తద్వారా తనంటే ప్రేక్షకులు అసహ్యించుకునేట్లు చేసుకున్నాడు.

ప్రాణ్ విలన్ పాత్రల కోసం సిగరెట్లని కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ సిగరెట్ల విలనిజం (ముఖ్యంగా) దిలీప్ కుమార్, షమ్మీకపూర్ సినిమాల్లో గమనించవచ్చు. స్టైలిష్ గా లైటర్తో సిగరెట్ వెలిగించుకోవటం.. తన దుర్మార్గపు ప్లాన్ల గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్న భావం ప్రదర్శిస్తూ.. గుప్పుగుప్పున దట్టమైన సిగరెట్ పొగ వదుల్తూ (నిజానికి ఇవన్నీ చిన్నచిన్న ట్రిక్స్) గొప్ప విలనిజాన్ని పండించాడు ప్రాణ్.

ప్రాణ్ నిజజీవితంలో స్మోకరో కాదో తెలీదు కానీ.. తన పాత్రల కోసం మాత్రం దిండ్ల కొద్దీ సిగరెట్లు తాగుంటాడు (ఆ రకంగా చూసుకుంటే.. ఇన్ని సిగరెట్లు తాగి కూడా అన్నేళ్ళు బతకడం విశేషమే). ఆరోజుల్లో ప్రాణ్ కనిపిస్తే తన్నాలన్నంత కోపం, కసితో హిందీ సినిమా ప్రేక్షకులు ఉండేవారని చదివాను. ఇంతకన్నా ఒక నటుడికి గొప్ప compliment ఉంటుందనుకోను!

చివరి తోక :

ప్రాణ్ గూర్చి నా ఆలోచనలు రాద్దామని ఉదయం నుండి తీవ్రంగా ప్రయత్నించి.. ఇప్పటికి హడావుడిగా నాలుగు ముక్కలు రాయగలిగాను. అమ్మయ్య! ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది.

(photo courtesy : Google)

Monday, 8 July 2013

ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్

ముందుమాట :

ఈ పోస్టులో నా చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు రాస్తున్నాను. ఇది పూర్తిగా నా సొంతగోల. ఓ స్నేహితుడి కోసం నేన్రాసుకున్న తీపిజ్ఞాపకం. ఇది నా రాత కాబట్టి.. నాకంటూ ఓ బ్లాగుంది కాబట్టి.. పబ్లిష్ చేస్తున్నాను. మీకు విసుగనిపించవచ్చు. అయినా చదివేస్తాం అంటే.. మీ ఇష్టం!


టీవీలో ఏదో అమితాబ్ బచ్చన్ పాత సినిమా వస్తుంది. ఓ రెండు నిమిషాలపాటు కన్నార్పకుండా అమితాబ్ ని అలానే చూస్తుండిపొయ్యాను. గతమెంత ఘనము! రోజులెంత తొందరగా మారిపోయ్యాయి!

నేనొకప్పుడు ఇదే అమితాబ్ ని చూస్తూ మైమరచి పొయ్యేవాణ్ని. అమితాబ్ రేఖతో రొమేన్స్ చేస్తుంటే పులకరించిపొయ్యేవాణ్ని. అతని ఫైటింగులు చూస్తూ పరవశించిపోయేవాణ్ని. ఇప్పుడు అదే అమితాబ్ ని చూస్తుంటే పులకరింత, పలవరింత కాదు గదా.. కనీసం చక్కలిగింత పెట్టినట్లుగా కూడా లేదు! కారణమేమి?

వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు (ఎవరికైనా అభ్యంతరం ఉంటే గుంటూరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు.). అందుకలదు మా బ్రాడీపేట గ్యాంగ్. మా బ్రాడీపేట సందుల్లో, గొందుల్లో విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం. మా సందు బౌలర్లలో డెనిస్ లిల్లీ, మైఖేల్ హోల్దింగుల్నీ.. గల్లీ బ్యాట్స్ మెన్లలో విశ్వనాథ్, సోబర్సుల్నీ చూసుకుని ముచ్చటనొందేవాళ్ళం.

మాకు విపరీతంగా సినిమాలు చూసే గొప్పఅలవాటు కూడా ఉంది. అప్పటికి మా సినీవీక్షక ప్రస్తానం విఠలాచార్య కత్తియుద్దాలతో మొదలై.. రామారావు ఫైటింగుల మీదుగా పయనించి.. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల వద్దకి చేరుకుంది.

గుంటూర్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా రంగమహాల్లోకి, తక్కువగా విజయలక్ష్మిలోకి వచ్చేవి. ఏ సినిమా ఏ హాల్లోకి వచ్చినా ఒక్కోసినిమా ఒకటికి రెండుసార్లు చూసేవాళ్ళం. మాకదో దీక్ష, నోము, యజ్ఞం, వ్రతం. అమితాబ్ సినిమాలకి మొదట్రోజు జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. స్త్రీల టికెట్ కౌంటర్ వద్ద క్యూ పోట్టిదిగానూ, పురుషుల కౌంటర్ వద్ద క్యూ పొడవుగానూ ఉండేది.

మా రావాయ్ గాడు ("గల్తీ బాత్ మత్ కరో భాయ్!" ఫేం) ఆడవాళ్ళ టికెట్ కౌంటర్ల వద్ద చేతులోని రూపాయిల నోట్లు చూపుతూ, ఊపుతూ.. అత్యంత దీనంగా, జాలిగా 'అక్కా టికెట్! అమ్మా టికెట్!' అంటూ టికెట్లు తీసివ్వమని యాచించేవాడు. వీడి దొంగమొహాన్ని చూసి ఎవరో ఒక మహాతల్లికి గుండె కరిగేది. తత్ఫలితంగా మా చేతిలో టికెట్లు పడేవి.

అమితాబ్ సినిమాల్లో కిశోర్ కుమార్ పాటలుండేవి. అవి మిక్కిలి మధురంగా మనసును మైమరపించేవి. అమితానందంతో అమితాబ్ సినిమాని చూసిన మమ్మల్ని.. సినిమా తరవాత కిశోర్ గానమాధుర్యం ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ట్యూన్లలో హచ్ కుక్కలా వెంటాడేవి. సింగిల్ మాల్ట్ విస్కీలా మత్తెక్కించేవి.

ఇక్కడిదాకా పెద్ద విశేషం కాదు. ఇట్లాంటి అనుభూతులు దాదాపు అన్ని స్నేహబృందాలకి అనుభవమే. అయితే మాకు ఇక్కణ్నించే చాలా పని మొదలయ్యేది. మా బ్రాడీపేట గ్యాంగ్ లో అతి ముఖ్యుడు సూర్యం. హిందీ సినిమాల ప్రేమికుడు.

'పొద్దస్తమానం హిందీ సినిమాలేనా?' అని గింజుకునే నన్ను.. నా జుట్టు (ఆ రోజుల్లో నా తలకి ఫుల్లుగా జట్టుండేది) పట్టుకుని మరీ లాక్కెళ్ళేవాడు. సినిమా చూసిన సూర్యాన్ని కిశోర్ కుమార్ అవహించేవాడు.. పూనేవాడు. వెంటనే తీవ్రాతితీవ్రంగా కిశోర్ కుమార్ పాటల్ని అందుకునేవాడు.


బ్రాడీపేట రెండోలైన్ తొమ్మిదో అడ్డరోడ్డులో ఓంకార్స్ టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాని ఎదురుగా మా సూర్యం ఇల్లు. అది మా బ్రాడీపేట గ్యాంగ్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మేం ఒక ఆర్కెస్ట్రా కూడా డెవలప్ చేశాం. ఆర్కెస్ట్రా లీడ్ సింగర్ సూర్యం.

ఒకడు తుప్పుపట్టిన బుల్ బుల్ ప్లే చేస్తాడు. ఇంకోడు దుమ్ము పట్టిన మౌతార్గాన్. ఇట్లా ఎవరికీ దొరికిన వాయిద్యంతో వాడు రెడీ అయిపోయ్యేవాడు. ఇక్కడ మాది ఇండియన్ ఒలింపిక్స్ స్పూర్తి (ఏం వాయించాం, ఎంత బాగా వాయించాం అన్నది ప్రధానం కాదు.. అసలు ఆర్కెస్ట్రాలో ఉన్నామా లేదా అన్నదే పాయింట్).

ఇప్పుడు కొంచెంసేపు నా గిటార్ గోల. నేనో గిటార్ కొనుగోలు చేసి శిక్షణ నిమిత్తం ఆర్.అగ్రహారంలో ఒక గిటార్ టీచర్ దగ్గర చేరితిని. ఆయన ఎంతసేపటికీ ఏదో నోట్స్ ఇచ్చి (అది నిలువు అడ్డగీతలతో ఉండేది) ప్రాక్టీస్ చెయ్యమనేవాడు. నాకు వేళ్ళు మంట తప్ప ఏదీ పలికి చచ్చేదికాదు.

మొత్తానికి కిందామీదా పడి 'Come September' ప్లే చెయ్యడం నేర్చుకున్నాను. దాన్నే కొంచెం మార్చి 'The Good, the Bad and the Ugly' (అంటూ) ప్లే చేసేవాణ్ణి. కావున మా గ్రూప్ లో నేనే లీడ్ గిటారిస్టునని అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!

ఒక్క ఇంస్ట్రుమెంట్ కూడా తెలీని మా రావాయ్ గాడు అత్యుత్సాహంగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కునే వాడు. ఇంట్లో అటక మీద నుండి పెద్ద బొచ్చె దించి.. దాన్ని బోర్లేసి పుల్లల్తో వీరబాదుడు బాదేవాడు. వాడు మా డ్రమ్మర్! పాట పాడటం రానివాళ్ళు, తమ బొంగురు గొంతులతో లీడ్ సింగర్ కి గొంతు సాయం చేసేవాళ్ళు. వాళ్ళని కోరస్ సింగర్స్ అందురు.

ఆ రోజుల్లో ఇళ్ళల్లో టేప్ రికార్డర్ ఉండటం కాదు.. చూసినవాళ్ళూ తక్కువే (ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఇళ్ళల్లో రేడియో ఉండటమే గొప్ప)! మా సూర్యం ఇంట్లో నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఉండేది. అదిచూసి కొందరు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేవాళ్ళు. (అసలు ఆ టేప్ రికార్డర్ ఉండటం మూలానే మేం ఆర్కెస్ట్రా సిద్ధం చేశాం).

                            (ఐదేళ్ళ క్రితం తీసిన  పై ఫోటో ఒకప్పటి మా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు లేదు. నేలమట్టం అయిపోయింది.) 

మెయిన్ హాల్ పక్కనున్న ఒక చిన్న రూం మా రికార్డింగ్ స్టూడియో. గాయకుడు, వాయిద్యగాళ్ళు ఇరుక్కుని చాపల మీద కూర్చునేవాళ్ళం. ఇంతమంది ఇన్నిరకాలుగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కున్నా ఇంకొందరు మిగిలిపోయ్యేవాళ్ళు. వాళ్ళు self employment scheme quota లో సంగీత దర్శకుల అవతారం ఎత్తేవాళ్ళు.

అనగా.. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, శంకర్ జైకిషన్ స్టయిల్లో చేతులు పైకెత్తి.. పైకికిందకీ ఊపూతూ ట్రూప్ మొత్తం తమ చేతిసన్నల్లో ఉండేట్లు చేసుకునేవారు. ఎవరెవరు ఏ బిట్ ఎలా వాయించాలి అన్నది 'డిస్కస్' చేసుకుని.. ఇంకొద్దిసేపు ముఖ్యగాయకుడైన సూర్యంతో మరింత లోతుగా 'డిస్కస్' చేసి.. 'రెడీ! వన్.. టూ.. త్రీ.. ' అనే countdown తో ఆర్కెస్ట్రా ఫుల్ స్వింగ్ తో మొదలయ్యేది.

ఆర్కెస్ట్రా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ గాయకుడి వాయిస్ ని డామినేట్ చెయ్యరాదు అనే గొప్ప సాంకేతిక విశేషం మాకు అప్పుడే తెలుసు. అంచేత సూర్యాన్ని మైక్రోఫోన్ కి దగ్గరగా కూర్చోబెట్టి పాడించేవాళ్ళం. ఆ సత్తుబొచ్చెల డ్రమ్మర్ గాణ్ణి దూరంగా ఉంచేవాళ్ళం. తప్పదు మరి.. ఒక quality output కోసం ఆ మాత్రం ప్లాన్లెయ్యాలి.

ఈ విధంగా కిశోర్ పాటల్ని రికార్డ్ చేసుకునేవాళ్ళం. పిమ్మట మైసూర్ కేఫ్ లో శంకరనారాయణ పర్యవేక్షణలో ఇడ్లీ సాంబార్ గ్రోలి, కాఫీ సేవించి, క్రేన్ వక్కపలుకుల రుచితో సేద తీరేవాళ్ళం. ఆ తరవాత మేం రికార్డ్ చేసుకున్న పాటల్ని పదేపదే replay చేసుకుంటూ వినేవాళ్ళం. నాకా పాటలు వీనులు విందుగా ఉండేవి. కాకి పిల్ల కాకికి ముద్దు అని అనుకోకండి. ఒట్టేసి చెబుతున్నా. అదొక మధురమైన గానం. అద్భుతమైన ఆర్కెస్ట్రా!

'వాళ్ళు రికార్డ్ చేసిన పాట వింటుంటే పిశాచాలు పాళీభాషలో చేస్తున్న మృత్యుఘోషలా ఉంటుంది. కంకరరోడ్డు మీద చేస్తున్న సైనిక కవాతు వలె ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రా విమానం కూలిపోతున్నట్లుగా భీకర శబ్దాలతోనూ, తోకతెగిన ఊరకుక్క రోదనలా పరమ దరిద్రంగానూ ఉంటుంది.' అని మా శత్రువర్గ దుష్టాధములు ప్రచారం చేసేవాళ్ళు.

ఉత్తమ కళాకారులకి ఆత్మవిశ్వాసమే తరగని పెన్నిధి. విమర్శలకి కుంగిపోరాదు. పొగడ్తలకి పొంగిపోరాదు. ఇవన్నీ కళాకారులమైన మాకు బాగా తెలుసు. అంచేత కువిమర్శలకి తొణకక, బెణకక మా బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయి అనేక ఆణిముత్యాల్ని రికార్డ్ చేసింది.

అనాదిగా కళలకి, పరీక్షలకి చుక్కెదురు. అంచేత ఓ పరీక్షల సమయాన మా బ్యాండ్ చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయి కనుమరుగైపోయింది. ఆ విధంగా తెలుగు కళాప్రపంచం తీరని నష్టానికి గురయ్యింది! 

చివరి మాట :

ఈ పోస్ట్ నా ప్రాణస్నేహితుడు సూర్యం కోసం రాశాను.

'సూర్యం! దిస్ ఈజ్ ఫర్ యూ.'

(గంటి సూర్యప్రకాష్. స్నేహితులకి ప్రేమగా 'సూర్యం'. గత ముప్పైయ్యేళ్ళుగా న్యూజెర్సీ పట్టణంలో మత్తు వైద్య నిపుణుడిగా స్థిరపడ్డాడు. ఈరోజుకీ తన పాటలతో అమెరికావాసుల్ని అలరిస్తున్నాడు.)

చివరి మాటకి చివరి మాట :

ముందుమాట పట్టించుకోకుండా ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారా!? అయినచో మీరు ఉత్తములు. మీకు ఆయురారోగ్యాలు, ధనకనక అష్టైశ్వర్యాలు సంప్రాప్తించుగాక!

శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి. 

(photos courtesy : Google)

Friday, 5 July 2013

ఈజిప్ట్.. ఇంట్లో ఇబ్బందులు


సమయం రాత్రి పదిన్నర. నా డిన్నర్ టైం. టీవీలో ఏదోక ప్రోగ్రాం చూస్తూ, పిల్లలతో కబుర్లు చెబుతూ భోంచెయ్యటం నాకు చాలా ఇష్టం. ఇప్పుడొక ఇంగ్లీష్ చానెల్ వార్తలు చూస్తున్నాను. ఈజిప్టు జనాలు కైరో రోడ్ల మీద చీమలగుంపుల్లాగా మూగి ఉన్నారు.

నేను ఆ దృశ్యాన్ని చూసి ఉత్తేజితుణ్నయాను. సెల్ ఫోన్లో తీవ్రంగా మెసేజెస్ పంపిస్తున్న మా అమ్మాయికి (బలవంతంగా) ఆ జనసమూహానికి, ఆ కోలాహలానికి కారణాన్ని ఉత్సాహంగా వివరించాను. న్యూస్ చూసేప్పుడు నాకీ గూగుల్రావు డ్యూటి అలవాటు.. ఇష్టం కూడా.
               
ఇంతలో స్టడీరూంలోంచి మా అబ్బాయి బుడుగు వచ్చాడు. నా గుండెల్లో రాయి పడింది. వీడి ప్రశ్నలకి సమాధానం చెప్పటం కష్టం. సాధారణంగా మా బుడుగు సందేహాలు ఒకే విషయం చుట్టూ తిరుగుతుంటాయి.

"న్యూస్ రీడర్లకి న్యూస్ చదివేప్పుడు 'టూ' (రెండు వేళ్ళు) వస్తే ఏంచేస్తారు? ధోని బ్యాటింగ్ చేసేప్పుడు 'టూ' వస్తే ఏంచేస్తాడు?" ఇట్లా తన ప్రశ్నలన్నీ వన్/టూల మధ్య పరిభ్రమింపచేస్తుంటాడు.
                 
హాల్లోకొస్తూనే టీవీలో కైరో జనాల్ని చూస్తూ అడిగాడు.

"నాన్నా! ఇంతమంది రోడ్ల మీదున్నారు. వీళ్ళకి 'టూ' వస్తే ఎట్లా?"

ప్రశ్న ఊహించిందే. మా వాణ్ని ఉరిమి చూస్తూ అన్నాను.

"నాకు తెలీదు."

సందేహం లేదు. వీడు పూర్వజన్మలో ఏ పాయిఖానాల ఇనస్పెక్టరో అయ్యుంటాడు .
                 
సోఫాలో నాపక్కనే టీవీ చూస్తూ కూర్చున్నాడు బుడుగు.

"మనకెందుకు జనాలు ఇట్లా రోడ్ల మీదకి రారు నాన్నా? వస్తే ఎంత బాగుంటుంది!" హఠాత్తుగా అన్నాడు.

బుడుగుని చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.

'కైకా! అన్నది నువ్వేనా? విన్నది నేనేనా?' అంటూ అలనాడు బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో గుమ్మడి జమునతో అన్న డైలాగ్ మదిలో మెలిగింది.
               
బుడుక్కి ఇంత మంచి సందేహం కలగటం ఇదే మొదటిసారి. చిన్నపిల్లాడికి ఎంత పెద్ద ఆలోచన! నాకు సంతోషంగా అనిపించింది. బుడుగు ఎవరు? నా కొడుకు. హీ ఈజ్ మై సన్. కొడుక్కి తండ్రి ఆలోచనలు రాక ఎలా ఉంటయ్? ఇంత చిన్నవయసులో ఎంత గొప్ప ఆలోచనాపరుడయ్యాడు! సందేహము వలదు. ఇతగాడు భవష్యత్తులో భగత్ సింగవుతాడు. కాదుకాదు, అల్లూరి సీతారామరాజవుతాడు. బుడుగు మై సన్, ఆ గలే లగ్ జా!

(ఇప్పుడు బుడుక్కి కొంచెం పాలిటిక్స్ చెబుతాను.)
                           
"మనకీ త్వరలో కైరో రోజులు వస్తాయి బుడుగు. అవినీతిపరుల్ని తరిమికొడదాం. మతతత్వవాదులకి గుణపాఠం చెబుదాం. ఈ దేశంలో ప్రజలకి ప్రశ్నించే తత్వం పెరగాలి. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారిగా ఉండక తప్పదు. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం మనక్కూడా తప్పకుండా వస్తుంది." ఆయాసపడుతూ ఆర్. నారాయణమూర్తి స్టైల్లో అన్నాను.
                       
బుడుక్కి నా భాష అర్ధం అయినట్లు లేదు. నన్ను విచిత్రంగా చూశాడు. ఆ తరవాత ఏదో ఆలోచిస్తున్నట్లుగా కొద్దిసేపు టీవీ చూశాడు.

"నాన్నా! మనుషులు రోడ్ల మీద చీమల్లా ఉన్నారు. అక్కడ స్కూళ్ళు కూడా చాల్రోజులుగా మూసేసుంటారు. మనం కూడా అట్లా రోడ్ల మీదకొస్తే ఎంత బాగుండు! అప్పుడు మనకీ స్కూళ్ళు మూసేస్తారు. హాయిగా ఇంట్లో టీవీ చూసుకోవచ్చు. ఇంచక్కా గ్రౌండ్ కెళ్ళి క్రికెట్ ఆడుకోవచ్చు. రోజూ స్కూలుకెళ్ళాలంటే సుత్తి కొడుతుంది."
                         
హతవిధీ! ఇదా వీడి గోల! ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకేదో కాలి మరొకడు ఏడిచాట్ట! అనవసరంగా.. ఒక్కక్షణం ముందు పులిబిడ్డకి తండ్రిగా గర్వపడ్డానే! ఈ వెధవ నా నెత్తిన చన్నీళ్ళు కుమ్మరించాడు. యూజ్లెస్ ఫెలో! పొద్దస్తమానం స్కూలెగ్గొట్టే ప్లాన్లే గదా!
                         
"రేపు హాయ్ లాండ్ కి వెళ్దాం నాన్నా. అక్కడ వాటర్ వరల్డ్ బాగుంటుంది." అడిగాడు బుడుగు.

గర్బిణీ స్త్రీ వలే వీడూ.. వీడి కోర్కెలూ. నాకు చిర్రెక్కింది.

"హాయ్ లాండ్ కా? నిన్నా? ఛస్తే తీసుకెళ్ళను. తీసుకెళ్ళనుగాక తీసుకెళ్ళను." గట్టిగా అరుస్తున్నట్లుగా అన్నాను .
                       
నా అనవసర కోపప్రదర్శనకి అందరూ సైలంట్ అయిపొయ్యారు. కొద్దిసేపు నిశ్శబ్దం. మూతి ముడుచుకుని బుడుగు పక్కరూంలోకి వెళ్ళాడు.

"మీరెందుకు తీసుకెళ్ళనని అంత గట్టిగా చెప్పారు? పిల్లలతో మాట్లాడే పద్ధతదేనా? తరవాతెప్పుడైనా తీసుకెళ్తానని సాఫ్ట్ గా చెప్పొచ్చుగా." నా భార్య సుభాషితాలు.

తన ఫోన్ మెసెజిలకి అడ్డం వచ్చినందుకు మా అమ్మాయి కూడా కసి తీర్చుకుంది.

"నాన్న ఎప్పుడూ ఇంతేనమ్మా. టీవీ వార్తలు చూడమని విసిగిస్తారు. అక్కడెక్కడో, వాళ్లెవళ్ళో రోడ్ల మీదకొస్తే ఇక్కడ మనకేంటి?"

నాభార్య 'అవునుగదా!' అన్నట్లుగా నావైపు చూసింది.
                       
ఛీ.. ఛీ.. వెధవ కొంప, వెధవ బ్రతుకు. ప్రశాంతంగా భోజనం కూడా చెయ్యనివ్వరుగదా!

(photo courtesy : Google)

Wednesday, 3 July 2013

డాక్టర్ దిగ్విజయ్ సింగ్


నా భార్య నాలుగోనెల గర్భవతి. డాక్టర్ ఇప్పుడే ఆవిడకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాడు.


"అమ్మాయా? అబ్బాయా?"డాక్టర్ నన్ను ఇబ్బందిగా చూశాడు."ఫీటస్ జెండర్ రివీల్ చెయ్యకూడదని మాకు రూల్స్ ఉన్నాయి." అన్నాడు.


"డాక్టర్ గారు! ఎన్నోయేళ్ళుగా సంతానం కోసం తపన పడుతున్నాం. నా భార్యకి 2004 లో ఆరోనెల్లో ఎబార్షన్ అయ్యింది. 2009 లో నాలుగోనెల్లోనే ఎబార్షన్ అయ్యింది. ఇప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ నిలబడుతుందో, లేదో తెలీదు." అన్నాను.


"మీకు అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?" నవ్వుతూ అన్నాడు డాక్టర్."నాకు ఎవరైనా ఒకటే. బేబీ సక్రమంగా పుడితే చాలు. ఇంతకీ అమ్మాయా? అబ్బాయా?"డాక్టర్ చిన్నగా నవ్వాడు."అమ్మాయికి రోడ్ మేప్ సిద్ధం చేసుకోండి.""అంటే?""గౌన్లు, ఫ్రాకులు రెడీ చేసుకోండి. పేరేం పెట్టాలో కూడా ఆలోచించుకొండి."నాకర్ధమైంది. లోపలుంది అమ్మాయే! ఈ డాక్టర్ ఎంత మంచివాడు.!ఈ హాస్పిటల్లో ఇంతకుముందు డాక్టర్ ఆజాద్ ఉండేవాడు. ఈ మాత్రం కూడా ఎప్పుడూ చెప్పిన పాపాన పోలేదు."అంటే అబ్బాయి కాదుగా ?" కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను.డాక్టర్ మళ్ళీ నవ్వాడు."అబ్బాయిక్కూడా రోడ్ మేప్ సిద్ధం చేసుకోండి."ఇప్పుడు ఆ నవ్వు నాకర్ధం కాలేదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది."అమ్మాయీ కాదు, అబ్బాయీ కాదు. మరి లోపలున్నదెవరు? అసలు ప్రెగ్నెన్సీ అయినా ఉందా? లేదా?" చికాగ్గా అన్నాను.ఇప్పుడు మళ్ళీ నవ్వాడు డాక్టర్."వెల్. ఎవరైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. అన్నింటికీ రోడ్ మేప్ తయారు చేసుకోండి."అన్ని ప్రశ్నలకి ఒకే తరహా ప్లాస్టిక్ నవ్వు. ప్రతిదానికీ రోడ్ మేపంటాడు. అసలీ ఈ రోడ్ మేపుల గోలేంటబ్బా?మనసులో ఏదో అనుమానం. ఇంతకీ ఈ డాక్టర్ పేరేంటి?డాక్టర్ టేబుల్ మీదున్న ఆయన నేమ్ ప్లేట్ చూశాను.డాక్టర్ దిగ్విజయ్ సింగ్!(photo courtesy : Google)

Monday, 1 July 2013

'దేవదాసు' విజయానికి కారణాలేమిటి?

నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళయింది. తెలుగు పత్రికల్లో ఒకటే కథనాలు. నాకవి చదువుతుంటే నవ్వొస్తుంది, ఈ సినిమాలో నాగేశ్వర్రావు చుక్కమందు కూడా తాగకుండా నటించాట్ట (నాకైతే ఆయన ఫుల్లుగా తాగి నటించినా అభ్యంతరం లేదు)! అసలీ అరవైయ్యేళ్ల గోలేంటి? బహుశా షష్టిపూర్తి సన్మానమేమో! 

ఏదైతేనేం, తెలుగు సినీప్రేమికులు దేవదాసుని గుర్తు చేసుకుని తన్మయత్వం చెందుతున్న సందర్భాన దేవదాసు గూర్చి నేనూ నా ఆలోచనలు రాస్తున్నాను. అయితే 'నాగేశ్వరరావు సినిమా షూటింగులో గడ్డపెరుగు తిని నటించాడా? గొడ్డుకారం తిని నటించాడా?' లాంటి చవకబారు వివరాలకి పోదల్చుకోలేదు.

అరవైయ్యేళ్ల క్రితం (1953) ఈ దేవదాసు సినిమా ఎందుకంత విజయం సాధించింది? ఇప్పుడు నేన్రాయబోయే అంశాలు మొత్తం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ రాస్తాను. దేవదాసు సినిమాకి ఆధారం బెంగాలీ పాపులర్ రచయిత శరత్‌చంద్ర చటర్జీ రాసిన 'దేవదాసు' అనే నవల.

నేను చిన్నప్పుడు శరత్ బాబు సాహిత్యం (దేశీ ప్రచురణలు) చదివాను. అప్పుడే దేవదాసు నవల కూడా చదివాను. వివరాలు సరీగ్గా గుర్తులేదు కానీ.. సినిమాలో ఉన్నంత నాటకీయత నవలలో ఉండదని గుర్తు (ఇప్పుడు మళ్ళీ చదివే ఓపిక లేదు).

అయితే నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను. నవల చదవాలంటే కష్టంగానీ.. సినిమా చూడ్డం చాలా సుఖం. హాల్లో కూర్చుంటే మన ప్రమేయం లేకుండానే వెనక కన్నాల్లోంచి తెరమీద సినిమా పడిపోతుంది. కాబట్టి నా అభిప్రాయాలు అక్కినేని నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా కథకి మాత్రమే పరిమితం.

దేవదాసు సినిమాకి ముందు ఆరేళ్ళ క్రితం బ్రిటీష్ వాడి నుండి మనకి రాజకీయంగా అధికార మార్పిడి జరిగింది. సమాజంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఆనాడు మన సమాజంలో కులం, మతం, డబ్బు చుట్టూ చాలా ఖచ్చితమైన గోడలు, లక్ష్మణరేఖలు ఉన్నాయి. సామాజిక స్థితిగతులు గోడక్కొట్టిన మేకులా స్థిరంగా వున్నాయి. 

ప్రేక్షకుడు అన్నవాడు ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడడు, వాడు సమాజానికి ప్రతిబింబం. అంచేత  సాధారణ ప్రేక్షకుడు సమాజ చట్రం నుండి బయటపడి ఆలోచించగలిగే స్థితి, స్థాయిలో వుండడు. ఆనాడు అత్యధికులు నిరక్షరాస్యులు అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి (అయితే అక్షరాస్యతకి, ప్రోగ్రెసివ్ థింకింగ్‌కి సంబంధం వుంటుందనే భ్రమ నాకు లేదు).

ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం.. కథ మొదట్నుండి చివర్దాకా సాంఘిక కట్టుబాట్లని గౌరవిస్తూ (ప్రమోట్) చేస్తూ ఉంటుంది. జమీందారు కొడుకైన దేవదాసు పక్కింటి పేదపిల్లతో స్నేహం చేస్తాడు. దేవదాసు పెద్దకులంవాడు, డబ్బున్నవాడు. కావున నేచురల్‌గా పార్వతి దేవదాసుకి సరెండర్ అవ్వాలి, అయితీరాలి (కాకుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు).

జమీందార్ల పిల్లలు చదువుకోటానికి పట్నం పోవటం అనేది బ్రిటిష్ ఇండియాలో చాలా కామన్. కావున శరత్ కూడా కథ అలాగే రాసుకున్నాడు. దేవదాసు కూడా పట్నం పొయ్యి ఏవో చదువులు వెలగబెడతాడు. జట్కాబండి తోలుకుంటూ (పాట పాడుకుంటూ) ఊళ్లోకి వచ్చి పార్వతికి ఏదో నగ ప్రెజెంట్ చేసి తన ఖరీదైన ప్రేమని ప్రదర్శించుకుంటాడు (ఎంతైనా జమీందారు బిడ్డ కదా).

ఇలా కొంతకాలం శరత్ బాబు నాయికానాయకుల మధ్య స్వచ్చమైన ప్రేమని పూవులు పూయనిస్తాడు, కాయలు కాయనిస్తాడు. భవిష్యత్తులో వారి ప్రేమ అమరం కావాలంటే ఆ మాత్రం సన్నివేశాలు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. వీళ్ళ ప్రేమ పెళ్లిగా మారాలంటే పెద్దల అనుమతి కావాలని, అది అసాధ్యమని శరత్‌కి కథ మొదట్లోనే తెలుసు. అయినా ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడతాడు.

(కథని ముందుకు నెట్టడం కోసం) వొకానొక బరువైన సమయంలో దేవదాసు తండ్రి దగ్గర పెళ్లి ప్రసక్తి తెస్తాడు. ముసలి జమీందారు తమ వంశం పరువు, మర్యాద గూర్చి ఒక లెక్చర్ ఇస్తాడు. పాపం! ఆ ముసలాయన మాత్రం కొడుకు ప్రేమని ఎలా ఒప్పుకుంటాడు? ఛస్తే ఒప్పుకోకూడదు. మధ్యతరగతి ప్రేక్షకులు దేవదాసు తండ్రి సమస్యని ఎంతో సానుభూతితో అర్ధం చేసుకుంటారు.

మనది పవిత్ర భారద్దేశం. ఈ పుణ్యభూమిలో తండ్రిమాటకి కట్టుబడి ఒక యుగపురుషుడు అడవుల బాట పట్టాడు. ఇట్టి భూమిలో దేవదాసు తండ్రిమాట చచ్చినట్లు వినాల్సిందే, వినకపోతే జనాలకి నచ్చదు. అంచేత ప్రేక్షకుల కోరిక మన్నించి దేవదాసు పార్వతిని వదులుకుని పట్నం పోతాడు.

పట్నంలో భగవాన్ అనే ఒక సకలకళావల్లభుడు దేవదాసుకి స్నేహితుడు. అతని ప్రోద్బలంతో దేవదాసు తాగుడు మొదలెడతాడు (తాగుడు చెడ్డ అలవాటు, దేవదాసు వంటి సచ్చీలునికి స్వతహాగా ఇటువంటి దుర్బుద్ధి పుట్టరాదు). భగవాన్ అనేవాడు హీరోకి తాగుడు అలవాటు చెయ్యడానికి, వేశ్య దగ్గరకి తీసుకెళ్లడానికి రచయితచే సృష్టించబడ్డ వో అర్భకుడు.

దేవదాసు మీద ప్రేమని చంపుకోలేని పార్వతి అర్ధరాత్రి దేవదాసు ఇంటికొచ్చి తనని ఎక్కడికైనా తీసుకుపొమ్మంటుంది. దేవదాసు భయకంపితుడై పోతాడు (అవును - సమాజం, సంప్రదాయం దేవదాసు ఉఛ్వాసనిశ్వాసలు), పార్వతి ప్రపోజల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాడు. ధర్మబద్దుడైన దేవదాసు ఇప్పుడు మనకింకా నచ్చుతాడు.

దేవదాసు తిరస్కృతికి గురైన పార్వతి తన తండ్రి వయసున్న జమిందార్ని వివాహం చేసుకుంటుంది (ఆ రోజుల్లో పార్వతి వంటి చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోటానికి డబ్బున్న ముసిలి వెధవలు గుంటనక్కల్లా కాచుక్కూర్చుని వుండేవాళ్ళు). పార్వతి ఆ ముసలి జమీందారు పిల్లల్ని సన్మార్గంలో పెడుతుంది. పార్వతి ఎంతటి మహాఇల్లాలు! పవిత్ర భారతీయ ధర్మాన్ని పాటించిన పతివ్రతా శిరోమణి! పార్వతి ఇప్పుడు మనకింకా నచ్చుతుంది.

ఈ తాగుబోతు దేవదాసుని చంద్రముఖి అనే వేశ్య కూడా ఇష్టపడుతుంది. ఆవిడ వేశ్య అయినప్పటికీ ఉన్నత హృదయురాలు. అందువల్లనే ఆ వేశ్యామణి దేవదాసు పరిచయం వల్ల తన వృత్తి, బ్రతుకు హీనమైందని తెలుసుకుంటుంది. (ఆనాటికీ, ఈనాటికీ జనులు తమ శారీరక అవసరాల కోసం వేశ్యల వద్దకు వెళ్ళెదరు, కానీ ఆ వృత్తి మాత్రం ఎప్పటికీ హీనమైందే). ఈ పాయింట్ కూడా ప్రేక్షకకులకి బాగా పడుతుంది.

ఇప్పుడు శరత్ పాఠకుల్ని ఏడిపించటానికి కావలసిన దినుసులన్నీ సమకూర్చుకున్నాడు, రంగం సిద్ధం చేశాడు. ఈ దేవదాసు కథలో అందరూ ఉత్తములే, ఉన్నత హృదయులే, సమాజ చట్రంలో ఇరుక్కుపోయిన విధివంచితులు. లలాటలిఖితాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు (శరత్ కథలన్నీ ఇట్లాంటి జీళ్ళపాకాలే)? 

సైకియాట్రిస్టులు త్రాగుడు అలవాటుని alcohol dependence syndrome అంటారు, త్రాగుణ్ని ఒక రోగంగానే చూస్తారు. దేవదాసు మొదట్లో పార్వతిని మర్చిపోవటానికి (తన పిరికితనం వల్ల జరిగిన నష్టం మర్చిపోటానికి) త్రాగడం మొదలెట్టినా.. తర్వాత్తర్వాత ఆ అలవాటుకి బానిసైపొయ్యాడు. (దేవదాసు త్రాగుడు మొత్తం పార్వతి ఖాతాలో వేసేస్తాడు శరత్).

తాగుబోతు భగ్నప్రేమికులకి ప్రొటాగనిస్ట్ ఈ దేవదాసు. తాగుడు అలవాటుని దేవదాసు కథ రొమేంటిసైజ్ చెయ్యటం వల్ల తెలుగు సమాజానికి నష్టం జరిగిందని నా అనుమానం. అందుకే ప్రతివెధవ ప్రేమకోసం వెంపర్లాడ్డం (సాధారణంగా ఈ ప్రేమికుల జాతి చదువులో drop outs అయ్యుంటారు), ఆ ప్రేమ విఫలమైందని తాగుడు పంచన చేరడం చూస్తుంటాం ('ప్రేమించిన' అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసేకన్నా ఆల్కహాల్ చెడతాగి, లివర్ చెడి చావడం మంచిదే).

క్లైమేక్స్‌లో ప్రేక్షకుల్ని మరింత తీవ్రంగా యేడిపించటానికి శరత్ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు - చచ్చేముందు ఒక్కసారైనా తనకి సేవ చేసుకునే అదృష్టం కల్పించమని పార్వతి దేవదాసుని వేడుకొంటుంది (ఎందుకో తెలీదు). దేవదాసు చావటానికి ముందు భీకరమైన వర్షంలో దుర్గాపురం ప్రయాణం చేసి, చివరాకరికి ఓ చెట్టుకింద దిక్కులేని చావు చస్తాడు.

అరవయ్యేళ్ళనాడు - నాటి కులాలు, కట్టుబాట్లను గౌరవించుటచేతనూ.. ప్రతిపాత్రా పాత్రోచితంగా పరమపవిత్రంగా ప్రవర్తించుటచేతనూ.. ఆ రోజుల్లో చదువుకున్నవారికి బెంగాలీ బాబుల్లాగా 'సున్నితం'గా ఆలోచించటం గొప్ప ఫ్యాషన్ అయినందుననూ.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలని బలంగా తాకింది.

ఎగువ మధ్యతరగతి సెక్షన్ ప్రతినిధిగా - తమ వర్గంవారి ఆలోచనలకి తగ్గట్టుగా శరత్ బాబు ఒక పవిత్రమైన, హృద్యమైన, విషాదకరమైన కథ వండాడు. ఈ కథ మనకి గొప్ప నీతిని చెబుతుంది - ఈ సమాజంలో మనం ఏమీ మార్చలేం, మనకి కావలసిందేదీ పొందలేం. సమాజ కట్టుబాట్లని మనం యెలా కాదనగలం? మనం చేయగలిగిందల్లా.. మన చేతకానితనానికి యేడ్చుకుంటూ బ్రతకటమే! అందుకే ఈ సినిమా అంత విజయం సాధించిందని నా అభిప్రాయం. అసలీ సినిమాలో జనాలకి బాగా నచ్చిన పాయింట్ - పార్వతి, దేవదాసు పెళ్లి చేసుకోలేకపోవటం!

ఇంతటితో - 'దేవదాసు సినిమా విజయానికి కారణాలేమిటి?' అనే నా ఆలోచనలు సమాప్తం. 

(posted in fb 22/6/2017)