Friday 30 December 2011

ఈ ప్రపంచమే ఓ క్షౌరశాల!




గంగిగోవు పాలు గరిటెడైననూ చాలు, ఆ గరిటెడు జుట్టు పెరుగుట చేత ఓ క్షౌరశాలలో అడుగెట్టాను. ఈ క్షౌరశాలల్లోకి అడుగెట్టాలంటే నాకు సిగ్గు, బిడియం. పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం ఎవరికయినా తలవంపులే గదా! అందుకు నన్ను నేనే నిందించుకోవాలి.

అనగనగా నాకు ఒత్తుగా జుట్టున్నరోజుల్లో - మాఇంటి దగ్గర్లో ఒక బ్యాంక్ ఉద్యోగస్తుడొకాయన వుండేవాడు. పేరు శాస్త్రి, వయసు నలభైకి అటూఇటుగా. మన్‌మోహన్ దేశాయ్ సిన్మాల్లో తప్పిపోయిన సోదరుల్లా - అత్యంత కాకతాళీయంగా మేమిద్దరం తరచూ క్షౌరశాలలో తారసపడుతుండేవాళ్ళం.

శాస్త్రిది దాదాపు పూర్తి బట్టతల. అతగాడి తల - ఇత్తడి చెంబుపై చిత్తడి మొక్కలు మొలిచినట్లు అక్కడో వెంట్రుకా, ఇక్కడో వెంట్రుకగా వుండేది! క్షవరం చేయించుకున్నంతసేపూ, క్షురకునికి ఏవో జాగ్రత్తలు చెప్తుండేవాడు. ఆపై - చెప్పినట్లు చెయ్యట్లేదని ఒకటే సణుగుతుండేవాడు. 'నీ నాలుగు వెంట్రుకలకి అన్ని జాగ్రత్తలవసరమా? అసలు నీకిక్కడేం పని!' అన్నట్లు విచిత్రంగా, ఆశ్చర్యంగా, ప్రశ్నార్ధకంగా, చికాగ్గా అతన్ని చూస్తుండేవాణ్ని. నా చూపు శాస్త్రిని బాగా ఇబ్బంది పెట్టుండాలి. అందుకే అటు తరవాత నేనెప్పుడైనా కనిపించగాన్లే - ఏదో పనున్నట్లు హడావుడిగా వెళ్లిపొయ్యేవాడు.

కాలం కౄరమైనది, విధి విచిత్రమైనది, చెరపకురా చెడేవు. ఈ జీవిత సత్యాలు నాకు అర్ధమయ్యే సమయానికి నా తలక్కూడా శాస్త్రి స్థితొచ్చేసింది! అసలు మానవదేహమే అశాశ్వతము గదా! మళ్ళీ ఈ అశాశ్వత దేహానికి అంతకన్నా అశాశ్వతమైన ఈ జుట్టెందుకు? ఈ బట్టతల ఒక్క మానవ మగాళ్ళకేనా? దేవుడు మాగాళ్ళకుండదా? ఏమో! దేవుళ్ళకి మాత్రం బట్టతల్లేదని ఎలా తెలుస్తుంది? వాళ్ళెప్పుడైనా కిరీటాలు తీస్తేగదా!

సరే! మళ్ళీ విషయానికొస్తాను. పట్టపగలయితే కుర్రవెధవల వాడి చూపుల తాకిడి (ఈ చూపులకున్న నానార్ధాలు, పవర్ నాకు బాగా తెలుసు) తక్కువుంటుందని, మధ్యాహ్న సమయాల్లో - 'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్!' అని పాడుకుంటూ చాటుమాటుగా నా క్షవర కార్యక్రమాలు కానించేస్తున్నాను.

తలపై కత్తిరించు ప్రదేశము తక్కువ కావున కత్తెరకి పని తక్కువ. కాబట్టి డబ్బులు కూడా తక్కువేమో అనుకున్నాను, కానీ కాదుట! నెత్తిమీద జుట్టుతో నిమిత్తం లేకుండా క్షవరానికింత అని స్టాండర్డ్ రేటు వుంటుంది. వాస్తవంగా జుట్టు ఎంత తక్కువుంటే, సొమ్ములు అంత ఎక్కువ వసూలు చెయ్యడం న్యాయమని మా క్షురకుని అభిప్రాయం! ఎందుకంటే - వున్న కొద్ది వెంట్రుకల్నీ అత్యంత ఏకాగ్రతతో, నిపుణతతో సర్దుబాటు చెయ్యాలి కదా!

ఈ సత్యం తెలిసుకున్న నాకు - అలనాడు శాస్త్రి క్షురకునికి అన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పేవాడో, అంతలా ఎందుకు సణిగేవాడో అర్ధమయ్యింది. 'సారీ శాస్త్రి! క్షౌరశాలలో నా క్షుద్రదృక్కులతో నిన్ను క్షోభపెట్టితిని. అందువల్లనే నాకూ కేశక్షయము సంప్రాప్తించింది. క్షంతవ్యుడను, క్షమాహృదయంతో నన్ను క్షమింపుము.'
                     
నాకు క్షవరం చేయించుకోవటం భలే ఇష్టం! ఒక చేతిలోని దువ్వెనతో దువ్వుతూ, రెండోచేతిలోని కత్తెరని లయబద్దంగా ఆడిస్తూ, కొంచెం కొంచెం జుట్టు కత్తిరిస్తూ - నాకు ప్రతి క్షురకునిలోనూ ఒక అమరశిల్పి జక్కన కనిపిస్తాడు, ప్రతి కత్తెర శబ్దంలోనూ ఒక ఇళయరాజా వినిపిస్తాడు.

క్షురక వృత్తి ప్రత్యేకమైనది. ఎంతటి మారాజునయినా తలదింపే శక్తి ఈ వృత్తికుంది. పైగా వారిచేతిలో కత్తెరా, కత్తీ ఉంటాయి. అందువల్ల అందరూ భయభక్తులతో తల దించుకోవాలి. 'ఎవరికీ తల వంచకు' అంటూ ఘంటసాల స్టోన్లో గర్జించిన ఎన్టీవోడిక్కూడా క్షురకుని ముందు తలవొంపులు తప్పవు గదా!

'తల'కి మాసిన మానవాధములకు తైలసంస్కారాన్ని ప్రసాదించే ఈ వృత్తి ఎంతటి పవిత్రమైనది! క్షవరము అనగా జుట్టు కత్తిరించుట. పైకమునకు జుట్టు కత్తిరించుట క్షౌరవృత్తి. కానీ - జుట్టు కత్తిరించకనే క్షవరము చేయు వృత్తులు అనేకం. 

'జుట్టు కత్తిరించకుండా క్షవరమా! కొన్ని ఉదాహరణలిమ్ము.' 
           
డాక్టర్లు లేని రోగములకు ఇన్వస్టిగేషన్లు, ప్రొసీజర్ల పేరున క్షౌరము చేయుదురు. కొందరు అత్యాశపరులైన డాక్టరుబాబులైతే ఏకంగా గుండే గీసేస్తారు. ఆపై ఆ గుండే గీయకపోతే నువ్వు చచ్చేవాడివని దబాయిస్తారు. క్షమించాలి! నాక్కూడా ఒక క్షౌరశాల వున్న కారణాన - వ్యాపార రహస్యాల్ని ఇక్కడ ఇంతకన్నా బయటపెట్టలేను, ప్రొఫెషనల్ ఎథిక్స్!
               
రాజకీయ నాయకులు 'ప్రజాసేవ' అనే క్షవరం చేస్తారు. ఈ క్షురకర్మని నిర్వర్తించుటలో - 'స్కీములు, స్కాములు' అంటూ ఒక్కొక్కరిది ఒక్కో పధ్ధతి. గవర్నమెంటు ఉద్యోగులు 'అమ్యామ్య' పేరుతో క్షవరం చేస్తారు. వీరి క్షౌరశాల తిరుమలలోని కళ్యాణకట్ట కన్నా పెద్దదిగా యుండునని అభిజ్ఞువర్గాల భోగట్టా. వీరి లీలలు అనంతం. ఈ క్షురకాగ్రేశర చక్రవర్తుల చరిత్ర రాసుకొంటూ పోతే మన సమయం క్షవరం అవుతుంది!
           
మిత్రులారా, ఈ ప్రపంచమే ఓ పెద్ద క్షౌరశాల. అందు మనమందరమూ క్షురకులమే! ఇచ్చట నిరంతరముగా, అత్యంత లాఘవముగా 365 రోజులూ క్షౌరశాలలు నిర్వహించబడును. క్షురకర్మలు చేయబడును. ఇది కలియుగ ధర్మము! అయినా - 'క్షవరం చేయుటకు నీవెవ్వరు? చేయుంచుకొనుటకు వాడెవ్వడు? అంతా నేనే!' అని గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు (రిఫరెన్స్ అడగొద్దు)! 

ప్రపంచం విశాలమైందే కాదు, మోసాలపుట్ట కూడా! ప్రతిక్షణం ఒకళ్ళనొకళ్ళని క్షవరం చేసుకుంటూ జీవించడం మానవ నైజం. ఇట్టి దుర్మార్గ మానవ సమాజంలో - ఎటువంటి అన్యాయం చెయ్యకుండా ఫిక్సెడ్ ధరలకి క్షవరం చేస్తున్న క్షురకులకి అభినందనలు. మీరే లేకుంటే జుట్టు పెరిగిపొయ్యి దురదలు పుట్టి గోక్కోలేక చాలామంది చచ్చేవాళ్ళు, థాంక్స్ వన్సెగైన్! 

(updated/posted in fb on 31/1/2018)     

Wednesday 28 December 2011

ఇచ్చట అభివృద్ధి చేయబడును

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"యేమి నాయనా! ఇప్పుడే వస్తున్నానని అరగంట లేటుగా వచ్చావ్?" నవ్వుతూ అడిగాను.

"హోల్డాన్! నేరం నాదికాదు, ట్రాఫిక్‌ది. మెయిన్ రోడ్డు వెడల్పు చేస్తున్నార్ట, మొత్తం తవ్విపడేశారు, ట్రాఫిక్ జామ్. అభివృద్ధి పేరిట విధ్వంసం చేసెయ్యడం మనవాళ్ళ స్పెషాలిటీ." వ్యంగ్యంగా అన్నాడు సుబ్బు.

"రోడ్డు వెడల్పు చేస్తుంటే మంచిదేగా? విధ్వంసం అంటావేంటి!" ఆశ్చర్యంగా అడిగాను.

ఇంతలో వేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మనతోపాటే ఉండేది మన దేహం. వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు తెల్లబడుతుంది, చర్మం ముడతలు పడుతుంది, నరాలు గిడసబారతాయి. మన ఊరు కూడా మనదేహం వంటిదే. శరీరానికి వయసొచ్చినట్లే ఊరిక్కూడా వయసొస్తుంది. మనం పిల్లల్ని కని సంతతిని పెంచుకున్నట్లే ఊరు కూడా జనాభాని పెంచుకుంటుంది. మన పెద్దల్ని గౌరవించినట్లే ఊరినీ గౌరవించాలి. ఇంట్లో మనుషులు ఎక్కువైపొయ్యారని వృద్ధులని బయటకి తరిమేస్తామా? నా దృష్టిలో రోడ్లు వెడల్పు చెయ్యడం వృద్ధుల్ని బయటకి గెంటటంతో సమానం."

"సుబ్బు! నాగరికత పెరుగుతుంది, మనిషి అవసరాలు మారుతున్నయ్. అందుకు తగ్గట్టుగా ఊరు కూడా మారాలి గదా!" అన్నాను.

"మిత్రమా! ఏది నాగరికత? ఇరుకు రోడ్లల్లో కార్లని నడపటం నాగరికతా! కార్లు, మోటార్ సైకిళ్ళ పరిశ్రమలకి రాయితీలిస్తారు. వందరూపాయిల డౌన్ పేమెంట్‌తో మోటర్ సైకిళ్ళూ, కార్లు అంటగడుతున్నారు. ప్రభుత్వాలకి పరిశ్రమలు ముఖ్యం, పన్ను వసూళ్ళు ముఖ్యం. అంతేకానీ ట్రాఫిక్‌ని తట్టుకోలేక 'కుయ్యో! మొర్రో!' మంటూ చేసే ఊరు ఆర్తనాదాలు ఎవరికీ పట్టదు. మనిషి కన్నా ఊరు ఎందులో తక్కువ? ఒకప్పుడు సైకిళ్ళు, రిక్షాల బరువుని అవలీలగా, హాయిగా మోసిన ఊరి నెత్తిన మోయరాని భారాన్ని మోపుతున్నారు. ఈ అనవసరపు బరువు మొయ్యలేక ఊరు ఒంగిపోతే ఆ బరువు తగ్గించే మార్గం వదిలేసి.. ఆ బరువు మోసేందుకు టానిక్కులిస్తున్నారు." ఆలోచిస్తూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! సమాజం స్థిరంగా ఉండదు, మార్పు దాని సహజగుణం." అన్నాను.

"నిజమే, వొప్పుకుంటున్నాను. కానీ ఆ మార్పు అడ్డదిడ్డంగా వుండకూడదు. పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా చేసే మార్పులు, చేర్పులకి ఒక శాస్త్రీయవిధానం వుండాలి. ఊరి విశిష్టతని కాపాడాలి, మానవీయకోణంలో ఆలోచించాలి. ముందుగా కారు వెనక సీట్లో బద్దకంగా, ఒరిగిపోతూ కూర్చునేవాళ్ళ కోణం నుండి ఆలోచించడం మానెయ్యాలి. వాహనాలతో రోడ్లని ఓవర్‌లోడ్ చేసి రోడ్లు వెడల్పు చేస్తాననటం తలక్రిందుల వ్యవహారం."

"మన నాయకులు రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేసేస్తామంటున్నారు!" అన్నాను.

"అసలు ఒక పట్టణంలా ఇంకో పట్టణాన్ని అభివృద్ధి చేస్తాననటమే హాస్యాస్పదం. ప్రపంచంలో ప్రతి పట్టణానికీ ఒక చరిత్ర వుంటుంది. ఆయా పట్టణాలు ఆయా ప్రజల అవసరాల మేరకు రూపాంతరం చెందాయి. ఎవరి అవసరాలు, ఇష్టాలు వారివి. అభివృద్ధి అంటే వృద్ధురాలు చీరకి బదులు మిడ్డీ వెయ్యటం కాదు, ఆమె ఆరోగ్యంగా వుండేట్టు చూడటమే అభివృద్ధి." అంటూ కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"మొత్తానికి ఈ రోడ్ల వెడల్పు నిన్ను బాగానే బాధ పెడుతుందే!" నవ్వుతూ అన్నాను.

"వెడల్పాటి రోడ్లమీద స్పీడ్ బైకులతో చక్కర్లు కొట్టటం థ్రిల్ నివ్వవచ్చు. రోడ్డుపక్కన నిలబడి బజ్జీలు తింటూ, ఆ ఘాటుకి కన్నీరు కారుస్తూ, గోళీసోడా తాగడం ఇంకా గొప్ప థ్రిల్. ఈ రోడ్డు వెడల్పు మన బజ్జీల సంస్కృతిని కూడా ధ్వంసం చేసేస్తుంది." అంటూ టైం చూసుకున్నాడు సుబ్బు.

"ఇది పిజ్జాలు బర్గర్ల కాలం సుబ్బూ! కొన్నాళ్ళకి బజ్జీలు, గోళీసోడాలు అంతరించిపోతాయ్." అన్నాను.

"అవును, కార్ల కోసం ఊరు మాయం. పిజ్జాల కోసం బజ్జీలు, గోళీసోడాలు మాయం. పాలకులు దీన్నే ముద్దుగా అభివృద్ధి అంటారు, మనం విధ్వంసం అంటాం. వస్తాను." అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.   

Sunday 25 December 2011

రెండుకళ్ళ సమాజం

ఈరోజు సుబ్బు ఇంకా రాలేదు. హాస్పిటల్లో ఒక్కోకేసు నిదానంగా చూస్తున్నాను. కొద్దిసేపటి క్రితం సూసైడ్ ఎటెమ్ట్ చేసిన ఒకావిడ కేసు చూశాను, ఆవిడ భర్త ధోరణికి విసుగేసింది. మనసేం బాగుండలేదు. కేసులేవీ చూడాలనిపించట్లేదు. ఈ సుబ్బు ఎక్కడ చచ్చాడో, తొందరగా వస్తే బాగుణ్ణు. సుబ్బుతో కప్పుడు కాఫీ కబుర్లు చెప్పుకుంటే గానీ రిలీఫ్‌గా వుండేట్లు లేదు.

"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ సుడిగాలిలా లోపలకొచ్చాడు సుబ్బు.

అమ్మయ్యా! సుబ్బు వచ్చేశాడు. 

డల్‌గా వున్న నన్ను చూసి ఆందోళనగా "ఏంటలా ఉన్నావ్! ఒంట్లో బాలేదా?" అడిగాడు సుబ్బు. 

"ఒంట్లో బాగానే ఉంది, మనసే బాలేదు. ఇప్పుడే ఒక కేసు చూశాను. ఒక దరిద్రుడు ఇంకో స్త్రీ మోజులో పడి భార్యని హింసిస్తున్నాడు. పాపం ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. రాన్రాను సమాజం ఇంత నికృష్టంగా తయారవుతుందేమిటి సుబ్బూ!" బాధగా అన్నాను.

"ఓస్ ఇంతేనా! నీ ఖాతాలో ఇంకో కొత్తకేసు, కంగ్రాట్స్!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ప్లీజ్. నీ క్రూడ్ హ్యూమర్ కట్టిపెట్టవా." చికాగ్గా అన్నాను.

సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.

"మిత్రమా! ప్రతిమనిషీ తనకితాను 'నేనెవర్ని? నాకేం కావాలి?' అని ప్రశ్నించుకోవాలి. కన్ఫ్యూజన్ వుండరాదు. నువ్వు వృత్తిరీత్యా మానసిక వైద్యుడవు. మానసిక రోగాన్ని పోగొట్టటానికి డబ్బు తీసుకుని వైద్యం చేస్తావు. నువ్వేమీ సమాజసేవ చెయ్యట్లేదు. ఎక్కువ కేసులొస్తే ఎక్కువ సంపాదిస్తావు. నీ రోగులేమీ ఆకాశంలోంచి వూడిపడరు. అందువల్ల సమాజంలో ఎక్కువమందికి మానసిక రోగాలు రావాలని కోరుకోవాలి, అది నీ వృత్తిధర్మం." అన్నాడు సుబ్బు. 

"అయితే?" అడిగాను.  

"కావున పరాయి స్త్రీ మోజులో పడ్డ నీ పేషంట్ భర్త నీకు మిత్రుడే కానీ శత్రువు కాదు. అతని వల్లనే ఇవ్వాళ నీకో కొత్తకేసు వచ్చిందని గుర్తుంచుకో. సాధ్యమైనన్ని ఎక్కువ జంటల్లో తగాదాలు రావాలని కొరుకో. మంచి ర్యాంకుల కోసం పిల్లలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాలని కోరుకో. అప్పుడే నీ ప్రాక్టీస్ మూడుపువ్వులు ఆరుకాయలుగా వుంటుంది."

ఇంతలో వేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ మళ్ళీ చెప్పసాగాడు సుబ్బు.

"ప్రపంచంలో ఏ దేశమైనా ఆరోగ్యంగా, ప్రశాంతంగా కళకళలాడుతూ వుందనుకో. అప్పుడు కొన్ని వృత్తులు మట్టికొట్టుకుపోతాయి. రోగాల్లేవు కాబట్టి హాస్పిటల్ వ్యాపారాలు దివాళా తీస్తాయి, అక్కడ పన్జేసే డాక్టర్లు నిరుద్యోగులైపోతారు. నేరాలు, ఘోరాలు లేకపోతే పోలీసులకి పనుండదు. లిటిగేషన్లే ప్లీడర్లకి జీవనాధారం." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"సమస్యలు లేని సమాజం కావాలని కోరుకోవాల్సింది రాజకీయ వ్యవస్థ. ఆ విషయాన్ని వాళ్ళే నొక్కి వక్కాణిస్తుంటారు. వాస్తవానికి వారికి సమస్యలంటే చాలా ఇష్టం. వారి ప్రయోజనాల కోసం నిరుద్యోగం ఉండాలి, రైతుల ఆర్తనాదాలు ఉండాలి, ఆకలి చావులుండాలి. అప్పుడు మాత్రమే వారికి గిట్టుబాటు." అంటూ ఆగాడు సుబ్బు. 

"సుబ్బు! నువ్వు దారుణంగా మాట్లాడుతున్నావ్. నీ లెక్కప్రకారం నేను సమాజహితం గూర్చి మాట్లాడరాదు - conflict of interest వుంది కాబట్టి, అంతేనా?" అన్నాను.

"ఎందుకు మాట్లాడరాదు? భేషుగ్గా మాట్లాడొచ్చు. ఇట్లాంటి సమయాల్లో మనం రెండుకళ్ళ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకోవాలి. నీకు వృత్తి, ప్రవృత్తి అనేవి రెండుకళ్ళు! ఆస్పత్రిలో ఉన్నంతసేపూ డాక్టరువి కాబట్టి వృత్తిధర్మాన్ని అనుసరించి మానసిక రోగాలు ఎక్కువైపోవాలని కోరుకోవాలి. సమాజానికి హితం నీకు అహితం, తప్పు లేదు. ఇదే నీ మొదటి కన్ను." అన్నాడు సుబ్బు. 

"మరి రెండో కన్ను?" ఆసక్తిగా అడిగాను.  

"ఆస్పత్రి గుమ్మం దాటి బయటకి పోంగాన్లే మొదటి కన్ను మూసెయ్యి, రెండో కన్ను తెరువు. అనగా - నీ వృత్తిని సంచీలో పడేసి, ప్రవృత్తిని బయటకి తియ్యి. గుండెల నిండా గర్వంగా గాలి పీల్చుకో. ఇప్పుడు నువ్వు ఈ దేశం పట్ల భాధ్యత కలిగిన భీభత్సమైన పౌరుడివి. సమాజహితమే నీ లక్ష్యం, సమాజోన్నతే నీ ధ్యేయం. మెరుగైన సమాజం కోసం ఒక టీవీ ఛానెల్ సాక్షిగా చాలామంది తీవ్రంగా పరిశ్రమిమిస్తున్నారు, వారితోపాటు నువ్వూ నడుం కట్టు. ఆ టీవీల్లో కనిపించి నీతులు చెప్పేవాళ్ళకన్నా నువ్వేం తీసిపొయ్యావు? ఇది నీ రెండోకన్ను." అన్నాడు సుబ్బు. 

"ఇంటరెస్టింగ్" అన్నాను. 

"ఈ రెండుకళ్ళు నీవే. నీకు ఈ రెండు కళ్ళూ ముఖ్యమే. పరస్పర విరుద్ధమైన రెండు లక్ష్యాలు కలిగి వుండటం, రెండుకళ్ళు కలిగి వుండటంతో సమానం! అర్ధమైందా?" అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"ఏంటో సుబ్బూ! నీకు ప్రతిదీ ఎగతాళే. నా బాధని అర్ధం చేసుకోవు, నీ ధోరణి నీదే." భారంగా నిట్టూర్చాను.

"నీబాధ నేనెప్పుడో అర్ధం చేసుకున్నాను. రావిశాస్త్రి రాశాడు గదా - డాక్టర్లు, ప్లీడర్లు అడవిలో పులికన్నా అదృష్టవంతులు. పులి ఆహారాన్ని వెదుక్కుంటూ అడవంతా తిరుగుతుంది. మీకు మాత్రం ఆహారమే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. మీరు ఆ ఆహారాన్ని తృప్తిగా భోంచేసి, 'బ్రేవ్'మంటూ త్రేన్పుతూ, మాగన్నునిద్ర ముంచుకొస్తుండగా, ఆవలిస్తూ, బద్దకంగా - అహింస గూర్చి, వేదాల గూర్చి, భాషాపరిరక్షణ గూర్చి, అవినీతి గూర్చి, సమసమాజం గూర్చి ఉపన్యసిస్తుంటారు." అంటూ టైం చూసుకుంటూ లేచాడు సుబ్బు. 

"ఓ! నువ్వా రూట్లో వచ్చావా!" నవ్వుతూ అన్నాను.  

"ఇవ్వాళ మీడియాలో కడుపు నిండిన (నింపుకున్న) మేధావులకి మంచి గిరాకి ఉంది. వాస్తవమేమంటే - మీరు మీ తిండి కొద్దిగా తగ్గించుకుంటే దానికన్నా మించిన సమాజసేవ లేదు. కానీ పొరబాటున కూడా మీరలా చెయ్యరు. నే వెళ్తున్నా మై డియర్ కడుపు నిండిన మేధావీ!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు. 

Thursday 22 December 2011

మెగాస్టార్ భిక్షాపాత్ర


అమ్మయ్య! ఎట్లాగయితేనేం - సెక్యూరిటీ కన్నుగప్పి, ఆ స్టార్ హోటల్లోకి దూరాను. చల్లగా ఏసీ, మెత్తగా తివాచీలు, నున్నగా తెల్లటి గోడలు.. స్వర్గంలా వుంది. లాబీలో వెళ్తున్నవాళ్ళు నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిల్లిలా ఓ గదిలోకి జారుకున్నాను. ఇంతలో ఎవరో గదిలోకి వస్తున్న అలికిడి. ఒక్క గెంతున కర్టన్ల చాటుకి దాక్కున్నాను.

గదిలోకి వచ్చిన వ్యక్తిని చూసి నమ్మలేకపొయ్యాను. ఆయన మామూలు మనిషి కాదు - సినిమా యాక్టర్ చిరంజీవి! నాదెంత అదృష్టం! లక్షలమంది 'అన్నయ్యా' అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ దేవుళ్ళా ఆరాధించే వ్యక్తి బస చేసిన గదిలోకి దూరగలిగాను. రూమ్ బాయ్ కాఫీ తెచ్చాడు. చిరంజీవి కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అవును మరి! తెలుగు ప్రజల ఉన్నతికై అనుక్షణం పరితపించే వ్యక్తి అలాగే ఆలోచిస్తాడు. 

కర్టన్ చాటునుండి బయటకొచ్చి చిరంజీవి ఎదురుగా నిలబడ్డాను. నన్ను చూడంగాన్లే ఆశ్చర్యపోయాడు చిరంజీవి. ఆశ్చర్యపోడా మరి! మాసిన తల, పెరిగిన గడ్డం, ముడతలు పడ్డ నల్లటి చర్మం, ఎండిన డొక్కలు, తొర్రిపళ్ళు, రంగు వెలిసిన మొలత్రాడు, మురికిపట్టిన చిల్లుల గోచీ, కుంటి నడక, కుడిచేతిలో సొట్టలు పడ్డ సత్తు బొచ్చె, బొచ్చెలో రెండు రూపాయి బిళ్ళలు. ఇదీ నా అవతారం. కుక్కల్లో గజ్జికుక్కలు హీనమైనవి. మనుషుల్లో అడుక్కునేవారు హీనులు. అట్టి హీనులు నక్షత్ర్రాల హోటలు రూములోకి ఎలా రాగలరు?   
                           
భిక్షాటన నాకు ఎన్నో యేళ్ళుగా అలవాటైన వృత్తి, నిద్రలో లేపినా అడుక్కోగలను. గొంతు సరిచేసుకుని, సత్తుబొచ్చె పైకీకిందకీ ఆడిస్తూ, రూపాయి బిళ్ళల్ని శబ్ధం వచ్చేలా ఎగరేస్తూ "ఆకలేస్తంది దొరా! అన్నం తిని నాల్రోజులయ్యింది బాబయ్యా! దరమం సెయ్యి దొరా!" అంటూ రాగయుక్తంగా ఓండ్ర పెట్టాను. 

చిరంజీవి ఒక్కక్షణం నాకేసి చూశాడు. పక్కనే నిలబెట్టి ఉన్న పెద్ద సూట్‌కేసుని గది మధ్యకి లాగాడు. నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. 'అమ్మయ్య! నా దరిద్రం వదిలిపోయింది. ఈ దరమ ప్రభువు ఇచ్చే సొమ్ముతో నా దశ తిరిగిపోద్ది.' అనుకుంటూ వుండగా -
                                            
చిరంజీవి సూట్‌కేసు తెరిచాడు, అందులో ఒక బొచ్చె - అచ్చు నా సత్తు బొచ్చెలాంటిదే వుంది. ఆ బొచ్చెని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. "అమ్మా పదవి, అయ్యా పదవి! కేంద్రమంత్రయినా, రాష్ట్రమంత్రయినా ఏదయినా పర్లేదు. పదవి లేక చచ్చిపొయేట్లున్నాను. అమ్మా, అయ్యా.. " అంటూ భోరున విలపించసాగాడు.

బిత్తరపొయ్యాను. కొద్దిసేపటికి యేం జరుగుతుందో అర్ధమైంది. వార్నీ! ఈ చిరంజీవి కూడా నాలాగానే అడుక్కునేవాడా!? నాది వొట్టి దరిద్రం అయితే, ఈయన దరిద్రానికే దరిద్రంలాగా వున్నాడు. ఇంకా అక్కడే వుంటే నా చిల్లుల గోచీగుడ్డ లాక్కుంటాడేమోననే భయంతో, ప్రాణాలు (గోచీగుడ్డ) అరచేతిలో పెట్టుకుని (పట్టుకుని) ఒక్క ఉదుటున బయటికి ఉరికా!  

Wednesday 21 December 2011

సప్తపది


'నెమలికి నేర్పిన నడక ఇదీ' అంటూ టీవీలో సప్తపది సినిమా పాటొస్తుంది. పాతరోజులూ, అప్పటి స్నేహితులూ గుర్తొచ్చి నవ్వుకున్నాను. నాకు పాతసినిమాలు గొప్ప నోస్టాల్జియా.

ఇప్పుడంటే టీవీలు, కంప్యూటర్లు వచ్చేశాయిగానీ, చిన్నప్పుడు మాకు సినిమాలే వినోదం. సినిమా చూడ్డం అనేది ఓ గ్రూప్ ఏక్టివిటీ. పరీక్షలప్పుడు చదువుకోవడం, పరీక్షలు లేనప్పుడు సినిమాలు, షికార్లు, కబుర్లు. ఇదే మా జీవితం.

స్నేహితుల గ్రూపుల్లో నోరున్నోడిదే రాజ్యంగా వుంటుంది. ఈ నోరున్నుడే ఫలానా సినిమాకి వెళ్లాలని నిర్ణయించేస్తాడు. అంచేత కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా చచ్చినట్లు యేదో సినిమాకి వెళ్లాల్సివచ్చేది. కానీ వీళ్ళ ఉక్రోశం, ఆగ్రహానికి సినిమా బలయ్యేది.  

అలా బలైన సినిమాల్లో 'సప్తపది' కూడా ఒకటి. 

ఆ రోజు కొంతమంది అప్పటికే రెండుసార్లు చూసేసిన శ్రీదేవి సినిమా మళ్ళీ చూడాలని ప్లాన్ వేశారు. కానీ నోరున్న నాయకుడొకడు సప్తపది చూడాల్సిందేనన్నాడు. తీవ్ర వాదప్రతివాదాల తరవాత - 'సప్తపది'కే వెళ్ళాం.

శ్రీదేవి సినిమా బ్యాచ్ వాళ్ళు సప్తపది సినిమా చూస్తున్నంతసేపూ కుళ్ళుకు చచ్చారు. తమ చెత్త కామెంట్లతో సినిమాని చీల్చి చండాడ్డం ప్రారంభించారు.

"శంకరాభరణం సింగిల్ పిలకతో సూపర్ హిట్టైంది. ఇది మూడుపిలకల సినిమా, ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో!"

"వీడెవడ్రా నాయనా! వీడికి భార్యలో దేవత కనిపిస్తుంది! రేపు మన పనీ ఇంతేనా!?" ఒకడి ధర్మసందేహం.

"ఇంతోటి సినిమాకి అమరావతి గుడెందుకు? మనూళ్ళో శివాలయం సరిపొయ్యేది."

"పాటలు బాగున్నాయి, హరికథా కాలక్షేపంలాగా!"

"పొద్దస్తమానం ఎలకపిల్ల హీరోయిన్తో గుడి చుట్టూతా కూచిపూడి నాట్యం వేయిస్తున్నారు. శ్రీదేవి డాన్స్ ఒక్కటుంటే ఎంత బాగుండేది!" ఒక శ్రీదేవి డై హార్డ్ ఫ్యాన్ ఆవేదన!

"ష్.. మాట్లాడొద్దు, సినిమా అర్ధం కావట్లేదు." ఆ సినిమాకి కారకుడైన నాయకుడు విసుక్కున్నాడు.

"అర్ధం కావట్లేదా! ఇది ఖచ్చితంగా అవార్డు సినిమానే." కసిగా సమాధానం.

సినిమా చివరికొచ్చింది. 

"ఈ సినిమా బ్రామ్మల సినిమా. ఒక పెళ్ళయిన బ్రామ్మలమ్మాయిని లేవదీసుకుపోవటానికి దళితుడు రెడీ అయ్యాడు. పూజారిగారు దొడ్డమనసుతో పంపించారు. ఇదేకథని రివర్స్ చేసి దళితవాడలో ఒక బ్రామ్మల కుర్రాడు దళిత యువతిని లేవదీసుకుపోయేట్లుగా.. అందుకు దళితులందరూ దొడ్డమనసుతో ఒప్పుకుంటున్నట్లుగా తీయొచ్చు. కానీ దర్శకుడు పొరబాటున కూడా అలా తీయడు. ఆయన ఎజండా వేరు." ఒక కంచె ఐలయ్య అబ్జర్వేషన్!

సినిమా అయిపోయింది. అందరం బయటకొచ్చాం. ఆ సినిమా చూద్దామని ఉబలాటపడ్డ నాయకుడి మొహం మాడిపోయుంది! 

నాకెప్పుడూ సినిమా కంటెంట్ ముఖ్యం కాదు, సినిమానెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. చాలాసార్లు సినిమా పేరు తెలీకుండా సినిమా చూశాను! సినిమా అనేది స్నేహితులతో కలిసి జస్ట్ టైమ్ పాస్, ఫన్ - అంతే! 

Thursday 15 December 2011

మద్యపానం = ఆసనాలు

లింగమూర్తి నా చిన్ననాటి స్నేహితుడు. హైదరాబాదులో ఉద్యోగం . ఈమధ్య తాగుడు ఎక్కువ చేశాట్ట. రోడ్ల మీద ఎక్కడబడితే అక్కడ పడిపోతున్నాట్ట.

'నీ మాట వింటాడేమో, ఒకసారి చెప్పి చూడు." అన్న మరో చిన్ననాటి స్నేహితుడి సలహాపై మా లింగమూర్తికి ఫోన్ చేశాను.

"ఏమిరా లింగం! బుద్ధుందా లేదా? తాగి ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నావట." విసుక్కున్నాను.

"తాగటం నిజం. ఒళ్ళు గుల్ల అన్నది మాత్రం అబద్దం." మత్తుగా అన్నాడు లింగమూర్తి.

"ఆహా! అయితే తాగి ఒళ్ళు బాగుచేసుకుంటున్నావా?" వెటకారంగా అన్నాను.

"కరెక్ట్! నేనేమీ తాగుబోతునయ్యి తాగట్లేదు. ఆరోగ్యసూత్రాలు పాటించటానికే తాగుతున్నాను." ముద్దగా అన్నాడు లింగమూర్తి.

"నీకు  మందెక్కువైంది. తరవాత మాట్లాడతాలే." అన్నాను.

"నాకు మందెక్కువ అవడం కాదు, నీకు బుర్ర తక్కువైంది. ఒక మెయిల్ పంపిస్తున్నా, చూసి నువ్వూ జ్ఞానాన్ని సంపాదించుకో." అంటూ పెద్దగా నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు లింగమూర్తి.

కొద్దిసేపటికి లింగమూర్తి నుండి ఒక మెయిల్ వచ్చింది.
---------------------------------------------------------

మద్యపానం ఆరోగ్యానికి చాలా మంచిది. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలే మద్యపానం వల్లకూడా కలుగుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

శవాసనం  
శరీరం  పూర్తిగా  రిలాక్స్  అవుతుంది.


బలాసనం 
మానసిక ప్రశాంతత  కలిగించే  ఆసనం!


సేతుబంధ  సర్వాంగాసనం 
మెదడుకి  రక్తప్రసరణ  పెంచుతుంది!


మర్జయాసనం 
వీపు, నడుమునకి   బలాన్నిస్తుంది!


హలాసనం 
వెన్ను నొప్పికీ, నిద్ర లేమికీ  ఎంతో  మంచి  ఆసనం!


డాల్ఫినాసనసం 
కాళ్ళకీ, చేతులకీ, బుజాలకీ  మంచిది!


శలంభాసనం 
వీపు, కాళ్ళు, చేతులకీ  మంచిది!


ఆనందబలాసనం 
నడుముకి  మంచిది!


మలాసనం 
వీపు, మోకాళ్ళకి  మంచిది!


కావున మిత్రులారా! పొద్దున్నే లేచి ఆసనాలు, గీసనాలు అంటూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా, ఆనందంగా పీకల్దాకా మందు కొట్టేసి అంతే ప్రయోజనాన్ని పొందండి!

Monday 12 December 2011

'శంకరాభరణం'పై బాలగోపాల్


"మీర్రాస్తున్న ఇంగ్లీషు హాయిగా వుంది, తెలుగు మాత్రం కష్టంగా వుంటుంది. తెలుగుని కొంచెం సింప్లిఫై చెయ్యొచ్చుగా?" అప్పుడెప్పుడో యేదో సందర్భంలో బాలగోపాల్‌ని అడిగాను.

"నేను చెప్పదలుచుకున్న విషయం రాసేస్తాను. అది అందరికీ అర్ధం అయ్యేట్లుగా రాయలని అనుకోను." బాలగోపాల్ ముక్తసరి సమాధానం.

కట్ చేస్తే -

ఓ నెల్రోజుల క్రితం బాలగోపాల్ సాహిత్య వ్యాసాల సంకలనం 'రూపం సారం' కొన్నాను. వీటిలో కొన్ని ఆల్రెడీ చదివేసినవే. పాతికేళ్ళ క్రితం చేరా, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని వెనుక పేజీల్లోకి పంపారు! కె.శ్రీనివాస్‌తో (కొత్త) ముందుమాట రాయించారు! కారణం తెలీదు. 

'రూపం సారం'లో బాలగోపాల్ రాసిన శంకరాభరణం, మాభూమి సినిమా రివ్యూలు చదివాను. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో చదువుకోడానికి హాయిగా వున్నాయి. అంటే - నేనీ వ్యాసాలు చదవకుండా బాలగోపాల్‌కో గొప్పసలహా ఇచ్చానన్నమాట!

'రూపం సారం'లో శంకరాభరణం చిత్రసమీక్ష చదువుతుంటే భలే నవ్వొచ్చింది. బాలగోపాల్ ఇంత సరదాగా కూడా రాయగలడని ఇప్పటిదాకా నాకు తెలీదు. సమీక్షలో కొంతభాగం ఇక్కడ ఇస్తున్నాను, చదవండి. 

---------------------------------------------

శంకరాభరణం - సినిమా సమీక్ష :

ఈ సినిమా బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల కొరకు తీయబడిన సినిమా. నేను యిక్కడ 'బ్రాహ్మణుల'ని అంటున్నది కులం చేత బ్రాహ్మణులయిన వాళ్ళను మాత్రమే కాదు. 'భారతీయ సంస్కృతి' గా పిలవబడుతున్నదానికి వారసులుగా తమను తాము భావించుకుంటున్న వారందర్నీ. అంటే భారతీయ విద్యాభవన్ తరహా ఆలోచనా విధానం కలిగిన వారందర్నీ.

కథ క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంగీతం పిచ్చి ఉన్న ఒక బ్రాహ్మణుడి కథ. శంకరాభరణం రాగం పాడడంలో అతను సుప్రసిద్ధుడు. ఈ బ్రాహ్మణుడు సంగీతం కోసం ఏమైనా చేస్తాడు. సంగీతాన్ని ప్రేమించే ఒక వేశ్య కూతురి పక్షం వహించి ఆమె కోసం సంఘబహిష్కరణకి కూడా సిద్ధపడతాడు. వాళ్ళు నిజంగానే వెలివేస్తే ఆ కోపాన్నంతా తన ఇష్టదైవం మీద చూపించి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షాన్ని కురిపిస్తాడు. అపస్వరం పాడిందని తన కుమార్తె పెళ్ళిని దాదాపు చెడగొట్టినంత పని చేస్తాడు. ఆమెకు సాయం చేయబోయినందుకు పెళ్ళికొడుకును కూడా బిక్కచచ్చిపోయేలా చేస్తాడు.

మొత్తం సినిమాలో ఒక సందేశం మన చెవులను పోటెత్తిస్తుంది. సంగీతం, కళలు ఉన్నది కామోద్రేకాల్ని రెచ్చగొట్టటానికి కాదు. లేబర్ క్లాస్ (ఆంధ్రులకి ఇష్టమైన మాటలో చెప్పాలంటే) అశ్లీల అభిరుచులను సంతృప్తి పరచడానికి కాదు. అవి ఉన్నది 'అద్వైత సిద్ధి'కి, 'అమరత్వ లబ్ధి'కి. ఈ సినిమా కొందరికోసమే అన్నభావం కలిగించే ప్రయత్నం మొదటినుంచి చివరిదాకా కనిపిస్తుంది. ఎవరో కామెంట్ చేసినట్లు ఇది 'వాళ్ళకు' (అలగా జనానికి) అర్ధమయ్యే సినిమా కాదు.

--------------------------------

'శంకరాభరణం' గూర్చి బాలగోపాల్ వివరంగా రాశాడు. ఆసక్తి ఉన్నవాళ్ళు balagopal.org లో ఇంగ్లీషులో కూడా చదువుకోవచ్చు. 

Wednesday 7 December 2011

స్వర్గంలో భానుమతి, సావిత్రి.. నేను కూడా!



అదొక విశాలమైన హాలు. పొడవాటి రంగురంగుల కర్టెన్లు. జమీందార్ల కొంపల్లో మాత్రమే కనిపించే సింహాసనం సోఫాలు, సోఫాలాంటి కుర్చీలు. అందమైన చీరల్లో మరింత అందమైన ఆడవాళ్ళు, తెల్లటి వస్త్రాల్లో మగవాళ్ళు. ఆ వాతావరణం సందడి సందడిగా, హడావుడి హడావుడిగా ఉంది.

హాలు మధ్యన పెద్ద పట్టుతివాచీ. దానిపై మందపాటి ముఖమల్ పరుపు. ఆ పరుపుపై కూర్చున్న ఒక స్త్రీ అచ్చు భానుమతి గొంతుతో గీతం ఆలపిస్తుంది. ఆమె చుట్టూతా కూర్చున్నవారు శ్రద్ధగా ఆమె గానాన్ని వింటూ తల పంకిస్తున్నారు.

'సావిరహే తవదీన.. '

ఏవిటిదంతా? నేనిక్కడికెలా వచ్చాను? అటుగా వెళ్తున్న ఒక తెల్లబట్టల పెద్దమనిషిని వాకబు చేశాను. ఆయన సమాధానం విని హతాశుడనయ్యాను. 

ఇది భూలోకం కాదు - స్వర్గంట! ఐదునిమిషాల క్రితమే నేను బాల్చీ తన్నేశాన్ట! యేమిటీ దారుణం? ఇది కల కాదు గదా? అసలేమైంది చెప్మా? కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించాను.

ఆ! గుర్తొచ్చింది. ఇవ్వాళ అరికాలు దురద పెడుతుంటే ఓ కార్పోరేట్ ఆస్పత్రి డాక్టరు దగ్గరకెళ్ళాను. ఆ డాక్టరు నా అరికాలుని ఆరు నిమిషాలు పరీక్షించి, ఆరువేల రూపాయల టెస్టులు చేసి, ఆరువందల రూపాయల ఇంజెక్షను పొడిచాడు. ఆ ఇంజెక్షను వికటించిందా? వికటించే వుంటుంది, లేకపోతే ఇక్కడికెలా వొచ్చి పడతాను? అయ్యో! అంటే.. అంటే.. ఇప్పుడు నేను చచ్చిపోయానా!

బాధతో గుండె బరువెక్కింది. దుఃఖంతో కొంచెంసేపు విలపించాను. అయ్యో! చావడంలో కూడా నాదెంత దరిద్రపుగొట్టు చావు! ఏదో గుండెజబ్బులాంటి రోగంతో చస్తే గౌరవం గానీ, మరీ చీప్‌గా అరికాలు దురదకి చావటం ఎంత సిగ్గుచేటు! నా శవాన్ని చూడ్డనికొచ్చిన వారి ముందు నా పరువు పోయుంటుంది. సర్లే! ఎట్లాగూ చచ్చానుగా, ఇంక పరువుతో పనేముంది!

'కానీ - పుట్టి బుద్ధెరిగి ఎప్పుడూ పాపాలే చేశాను గానీ, పుణ్యం ఎప్పుడూ చెయ్యలేదే! యమభటులేమైనా పొరబాటున స్వర్గంలో పడేశారా?' అనే సందేహం కలిగింది. కొంతసేపటికి దుఃఖం తగ్గి, మనసు తేలికయ్యింది. ఇక్కడేదో బాగానే ఉన్నట్లుంది. పరిసరాలు పరికించి చూశాను. అక్కడి వాతావరణానికి నిదానంగా అలవాటు పడసాగాను. 

ఇంతకీ అంత మధురంగా పాడే ఆ గాయని ఎవరబ్బా!

'దగ్గరకెళ్ళి చూస్తే తెలుస్తుందిగా' అనుకుంటూ అలా వెళ్ళాను. ఆవిడ నిజంగానే భానుమతి! మహారాణిలా ఠీవీగా, విలాసంగా, హుందాగా.. మంద్రస్థాయిలో పాడుతుంది. అక్కడివారు ఆ పాటకి ఆనంద పరవశులవుతున్నారు. భానుమతి ఒక పాట తరవాత మరో పాట పాడుతూనే ఉంది.

'ఒహొహొ! పావురమా'

'పిలచిన బిగువటరా'

'ఎందుకే నీకింత తొందర'

'మనసున మల్లెల మాలలూగెనే'

'ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన'

'ఓ బాటసారి"

'నేనే రాధనోయి'

అహాహా! ఏమి ఈ గాత్రమాధుర్యము! జన్మ ధన్యమైంది! పోన్లే - చస్తే చచ్చాగానీ, గారెల బుట్టలో పడ్డా! అన్నట్లు ఈ స్వర్గంలో గారెలు దొరుకుతాయా? అసలిక్కడ వంటిల్లు అంటూ వుందా? ఆకలేస్తే ఉగ్గిన్నెతో అమృతం తాగిస్తారా!

ఇంతలో ఒక బూరె బుగ్గల చిన్నది - అక్కడున్న ఆడవాళ్ళని పేరుపేరునా పలకరిస్తూ, కాఫీ, టీ ఏర్పాట్లు పర్వవేక్షిస్తుంది. అబ్బా! ఎవరీ అందాలరాశి? ఎంత సుందరముగా యున్నది! కొంచెం దగ్గరగా వెళ్లి చూద్దాం. ఆఁ.. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఆ అమ్మాయి.. ఆవిడ.. సా.. వి.. త్రి!

ఆనందంతో ఒళ్ళు పులకరించింది. నా శశిరేఖ, మేరా పార్వతి, మై మిస్సమ్మ.. వావ్! చచ్చిపోతే సావిత్రి కనిపిస్తుందంటే ఎప్పుడే చచ్చేవాణ్ణిగా! బొద్దుగా, ముద్దుగా, అమాయకంగా ఎంత బాగుంది! ఒరే అరికాలు డాక్టరు! థాంక్స్ రా బాబు థాంక్స్!

ఇంతలో పిడుగు పడ్డట్లు ఒక పెద్ద అరుపు.

"వొసే సావిత్రీ! నా కాఫీలో చక్కెర ఎక్కువెయ్యమని చెప్పానా లేదా? ఈ కాఫీ నీ మొహంలేగే వుంది, ఏడుపుగొట్టు మొహమా! తెలివితక్కువ దద్దమ్మ!"

పుఱ్ఱచేత్తో విసెనకర్రతో టపాటపా విసురుకుంటూ రుసరుసలాడింది సూర్యకాంతం. సావిత్రి భయంతో వణికిపోయింది.

"ఆ కాఫీ మీక్కాదు, అది కన్నాంబగారి కాఫీ." అంటూ కళ్ళనీళ్ళెట్టుకుంది.

నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఇంత కోపం నాకు భూలోకంలో కూడా ఎప్పుడూ రాలేదు. స్వర్గంలో మర్దర్ కేసుకి శిక్షలున్నాయా? ఈ సూర్యకాంతాన్ని మర్దర్ చెయ్యటానికి - ఏ రాజనాలకో, ఆర్.నాగేశ్వర్రావుకో సుపారీ ఇవ్వాలి. ఏరీ వాళ్ళు?

చప్పట్లతో హాలంతా మారుమోగింది. భానుమతి కచేరీ పూర్తయింది. శ్రోతలు భానుమతిని మెచ్చుకుని, నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళే హాలు బయటకెళ్ళారు. ఇప్పుడు హాల్లో కొద్దిమందిమి మాత్రమే మిగిలాం.

"నమస్కారం భానుమతమ్మగారు! నేను మీ అభిమాన రేణువుని. 'మల్లీశ్వరి'ని లెక్కలేనన్నిసార్లు చూశాను. ఆ సినిమాలో మీరు హీరో, మీ పక్కన ఎన్టీరామారావు హీరోయినని మా స్నేహితులు అంటారు." వినయంగా అన్నాను.

భానుమతి నన్ను ఆపాదమస్తకం పరికించింది. ఆనక గంభీరంగా తల పంకించింది. ఆవిడకి నేను తన అభిమానిగా పరిచయం చేసుకోటం చాలా సంతోషాన్నిచ్చినట్లుంది. మనసులోని ఆనందాన్ని బయటకి కనబడనీయకుండా గుంభనంగా నవ్వుకుంది.

"మల్లీశ్వరి సినిమాకి హీరోని, హీరోయిన్ని కూడా నేనే! ఆ రామారావు కేవలం సహాయనటుడు." గర్వంగా తలెగరేస్తూ అన్నది భానుమతి.

అవునన్నట్లు తలూపుతూ అర్జంటుగా వొప్పేసుకున్నాను.

"అమ్మా! మీ అత్తగారి కథలు లేకపోతే చక్రపాణి, కుటుంబరావులు దీపావళి యువ సంచికలు అమ్ముకునేవాళ్ళా? మీ కథలు పంచదార గుళికలు." మరింత ఒంగిపోతూ అన్నాను. 

భానుమతి బహుత్ ఖుష్ హువా! ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ -

"ఒరే బడుద్దాయ్! మాటలు బాగానే నేర్చావు. నాకు పొగడ్తలంటే నచ్చవు. కానీ నువ్వన్నీ నిజాలే చెబుతున్నావనుకో!" అన్నది భానుమతి.

ఇంతలో సావిత్రి భానుమతికి తళతళలాడుతున్న గాజు గ్లాసులో బత్తాయి రసం ఇచ్చింది. నేను గుడ్లప్పగించి సావిత్రికేసి చూస్తుండిపోయాను. భానుమతి ఒక క్షణం నన్ను గమనించింది.

"సావిత్రీ! రా చెల్లీ! ఇలా నాకు దగ్గరగా వొచ్చి కూర్చో. వీడు ఇప్పటిదాకా నన్ను పొగిడాడు. నువ్వు రాంగాన్లే నిన్ను చూస్తూ నీలుక్కుపొయ్యాడు. మళ్ళీ చచ్చాడేమో వెధవ! వీడికి నువ్వంటే చచ్చేంత ఇష్టంట, నీగూర్చి చాలా రాస్తుంటాడు."

"నిజమా! నాకు తెలీదక్కా!" ఆశ్చర్యంగా అంది సావిత్రి.

"ఓసి మొద్దుమొహమా! నీకు ఏం తెలిసి చచ్చింది గనక! ఆ దేవుడు నీకు గొప్ప నటనా ప్రతిభనిచ్చాడు గానీ, మట్టిబుఱ్ఱనిచ్చాడే బంగారం." అంటూ ముద్దుముద్దుగా సావిత్రిని విసుక్కుంది భానుమతి.

చటుక్కున తల ఎత్తి, నావైపు సూటిగా చూస్తూ "ఏమిరా! నా గూర్చి ఎప్పుడు రాస్తున్నావ్?" అంటూ హూంకరించింది భానుమతి.

"చి.. చి.. చిత్తం. త్వరలోనే.. తప్పకుండా.. ర.. రాస్తాను." వణికిపొయ్యాను.

భానుమతి కిలకిల నవ్వింది.

"నీ మొహం, నువ్వు రాయలేవులే. మీ మగాళ్లు నా నటనని అభిమానిస్తారు, నా పాట కోసం చెవి కోసుకుంటారు, నా రచననల్ని ఇష్టపడతారు. కానీ నన్ను ప్రేమించే దమ్ములేని దద్దమ్మలు. మీకు సావిత్రిలా అమాయకంగా, సబ్మిసివ్‌గా ఉండే వెర్రిమొహాలంటేనే ఇష్టం. సావిత్రిలో కనిపించే వల్నరబిలిటీని ఇష్టపడతారు. నేను వీరనారీమణిని. నా దగ్గర మీరు సావిత్రి దగ్గర వేసే వేషాలేస్తే బుర్ర చితక్కొట్టేస్తాను, గుడ్లు పీకేస్తాను, పీక పిసికేస్తాను. అందుకే నీకు నాగూర్చి రాయాలంటే వెన్నులో వణుకు."

భానుమతి చెబుతుంటే సావిత్రి కుందనపు బొమ్మలా, చెక్కిలిపై అరచెయ్యి ఆనించి, శ్రద్ధగా వింటూ తన చక్రాల్లాంటి కళ్ళతో 'నిజమా!' అన్నట్లు సంభ్రమంగా చూస్తూంది.

ఇంతలో మళ్ళీ ఇంకో పెద్ద పిడుగు!

"వొసే సావిత్రీ! కాఫీ నా మొహాన పడేసి ఏమిటే నీ మంతనాలు? పెత్తనాలు పక్కన పెట్టి నాకు నిద్రొచ్చే దాకా కాళ్ళొత్తు, నిద్రమొహం దానా! చూశావా ఛాయాదేవొదినా! నన్ను ఇక్కడ కూడా చెడ్డదాన్ని చెయ్యాలని కాకపోతే ఒక్కపనీ సరీగ్గా చేసేడవదు." పక్కనున్న చాయాదేవితో నిష్టూరంగా అంది సూర్యకాంతం. చాయదేవి మూతి వంకర్లు తిప్పుతూ ఆ పక్కకి వెళ్ళిపోయింది.

సూర్యకాంతం గావుకేకలతో స్వర్గం దద్దరిల్లింది. సావిత్రి ఉలికిపాటుతో ఎగిరిపడి సూర్యకాంతం దగ్గర పరిగెత్తుకెళ్ళింది.

భానుమతి నవ్వుతూ అంది. "ఇక్కడికి రాకముందు నాకూ అర్ధమయ్యేది కాదు - ఎందుకీ మగవాళ్ళు సావిత్రంటే పడి చస్తారు? నన్ను చూసి భయంతో వణికిపోతారు? మొన్నామధ్య ఒక గడ్డపాయన.. అదేనోయ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.. దీంట్లోని మతలబు విడమర్చి చెప్పాడు."

"ఫ్రాయిడ్ మీతో మాట్లాడాడా!" ఆశ్చర్యపొయ్యాను.

"ఏంటోయ్ వెర్రి పీనుగా! అంత ఎక్స్‌ప్రెషనిచ్చావ్! నా పాటలు వినటానికి ఫ్రాయిడేం ఖర్మ! ఎరిక్ ఎరిక్సన్, ఎడ్లెర్, ఎరిక్ ఫ్రామ్, సార్త్ర్ కూడా ఎగబడతారు. ఫ్రాయిడుకి నా 'దులపర బుల్లోడా' పాట ఎంత ఇష్టమో తెలుసా? నిన్న సూర్యకాంతం పెట్టిన దొసావకాయ తిని, ఆవఘాటుకి ఉక్కిరిబిక్కిరై చచ్చాడు." అంటూ పెద్దగా నవ్వింది.

ఇంతలో హడావుడిగా లూజు చొక్కా ఇన్ షర్ట్ చేసుకుని కుర్రాళ్ళా కనిపిస్తున్న పెద్దాయన లోపలకొచ్చాడు. అతను.. ఆయన దేవానంద్! తల పైకికిందకీ ఊపుతూ, పల్చటి పెదాల్లోంచి నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతూ అడిగాడు.

"నమస్కార్ భానుమతి బెహన్! ఆప్ జర మేరా సురయా కా ఎడ్రెస్ బతాయియే!"

భానుమతి దేవానంద్‌తో హిందీలో ఏదో మాట్లాడుతుంది. భానుమతి నుండి పారిపోడానికి ఇదే సరైన సమయం. చడీచప్పుడు చెయ్యకుండా చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాను. 

updated 4/3/18

Sunday 4 December 2011

అమృత మూర్తులు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు సుబ్బు. తాపీగా టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ని తిరగెయ్యసాగాడు.

"అమృతమూర్తికి అశ్రునివాళి. హి.. హి.. హీ! వెరీ గుడ్!" అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు. 

"సుబ్బు! అందులో నవ్వడానికేముంది?" అడిగాను.

"ఇంగ్లీషులో సింపుల్‌గా 'హోమేజ్' అనేసి ఊరుకుంటారు. కానీ తెలుగులో అక్షరాలు ఎక్కువ, భావాలూ ఎక్కువే. అమృతమూర్తిట, అశ్రునివాళిట! ఏదో నాటకంలో పద్యంలా లేదూ?"

ఇంతలో వేడికాఫీ పొగలుగక్కుతూ వచ్చింది.

"సుబ్బు! ఆయనెవరో పొయ్యాడు. పోయినాయన కోసం డబ్బుపోసి కుటుంబ సభ్యులు పత్రికల్లో ప్రకటన ఇచ్చుకున్నారు. వాళ్ళేం రాసుకుంటే మనకెందుకు?" అన్నాను. 

"నిజమే, మనకెందుకు? కావాలంటే కారణజన్ముడు, పురుషోత్తముడు, లోకోద్ధారకుడు అని ఇంకో నాలుగు తోకలు తగిలించుకోమందాం. సర్లే గానీ, అశ్రునివాళి దాకా ఓకే. కానీ 'అమృతమూర్తి' పదం రిలెటివ్ కదా!" అన్నాడు సుబ్బు. 

"ఎలా?" అడిగాను. 

"అమృతం అనగా తీయగా నుండునది, మేలు చేయునది. ఎవరికి తియ్యగా ఉంటుంది? ఎవరికి మేలు చేస్తుంది? అది తాగేవాడిబట్టి వుంటుంది. రాజకీయ నాయకుడో, డాక్టరో, ఉన్నతాధికారో.. నిజాయితీగా, సమాజహితంగా జీవిస్తే వాళ్ళు సమాజానికి అమృతమూర్తులు. కానీ అతని నిజాయితీ మూలంగా ఇంట్లోవాళ్ళు కొన్నిసుఖాలు కోల్పోతారు, కాబట్టి అతగాడు ఇంట్లోవాళ్లకి అమృతమూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్లకి అతనో గరళమూర్తి కూడా అవ్వొచ్చు." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"మా పక్కింటి వడ్డీల వెంకటయ్య సంగతేమయ్యింది? వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసేవాడు. గడ్డితిని ఆస్తులు పోగేసాడు. చివర్రోజుల్లో ఎంత తీసుకున్నాడు! ఆయన ఆస్తి కోసం కొడుకులు తన్నుకు చచ్చారు, అంతా కలిసి తండ్రికి తిండి పెట్టకుండా చంపేశారు. చావంగాన్లే వెంకటయ్య కొడుకులకి అమృతమూర్తయిపోయాడు. అందుకే రోజుల తరబడి పేపర్లల్లో ప్రకటనల ద్వారా కొడుకులు తమతండ్రి అమృతమూర్తని ఘోషించారు!" అన్నాడు సుబ్బు. 

ఖాళీ కప్పుని టేబుల్ మీద పెట్టాడు.

"గాలి జనార్ధనరెడ్డి ఆయన కుటుంబానికి అమృతమూర్తి, సమాజానికి కాదు. గాంధీ రిజిడ్ ఫిలాసఫీ వల్ల ఆయన కుటుంబం ఇబ్బంది పడింది. వారి దృష్టిలో గాంధీ అమృతమూర్తి కాకపోవచ్చు." అన్నాడు సుబ్బు.

"ఓ పన్జేద్దాం. మనం చచ్చేముందు మన ఫోటోల కింద ఈ అమృతమూర్తిని తగిలించొద్దని మనవాళ్లకి చెప్పి చద్దాం. సరేనా?" నవ్వుతూ అన్నాను.

"మనకాభయం లేదు. నువ్వూ నేనూ చస్తే మనకి పేపర్ ప్రకటన కూడానా! మనకంత స్థాయి లేదు. అందుకు మనం భారీగా నాలుగు తరాలకి సరిపడా సంపాదించాలి. అది మనవల్ల కాదు కాబట్టి మనం చచ్చాక అమృతమూర్తులం అయ్యే ప్రమాదం లేదు!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీకు బొత్తిగా పని లేకుండా పోతుంది. ఆయనెవరో పోయ్యాడని వాళ్ళవాళ్ళు ఏదో రాసుకుంటే దానికింత విశ్లేషణ అవసరమా?"

"అస్సలు అవసరం లేదు. కానీ కబుర్లు చెప్పకుండా కాఫీ తాగితే తాగినట్లుండదు నాకు. ఇదో రోగమేమో. సర్లే! సాయంకాలం క్లబ్బులో పార్టీ వుంది, వస్తున్నావుగా?""

"మర్చిపొయ్యాను. మన మూర్తి వచ్చాడు కదూ!"

"వార్నీ దుంపదెగ, మూర్తిగాడి పార్టీ మర్చిపోయ్యావా!? మూర్తి ఫ్రమ్ అమెరికా విత్ గ్లెన్ ఫిడిచ్. అమెరికా నుండి అమృతం తెచ్చిన మన మూర్తే అసలైన అమృతమూర్తి!" అంటూ పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.  

Saturday 26 November 2011

శ్రీరామరాజ్యం


"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు. 



టీవీలో బాపు 'శ్రీరామరాజ్యం' కమర్షియల్ నడుస్తుంది. 

టీవీ వైపు చూస్తూ "ఈ బాపుకి ఎంత ఓపిక! అరిగిపోయిన రికార్డులా రామాయణాన్ని తీస్తూనే ఉన్నాడు గదా!" అన్నాడు సుబ్బు.

"ఓపికుంది, తీస్తున్నాడు. మనకెందుకు చెప్పు!" నవ్వుతూ అన్నాను.

"నాకు తెలుగు సినిమా దర్శకుల్ని చూస్తుంటే హోటల్లో అట్టుమాస్టర్లు గుర్తొస్తారు. మన ఆనందభవన్లో అట్టు మాస్టర్ ముత్తు గుర్తున్నాడా? నలభయ్యేళ్ళుగా అట్లు పోస్తున్నాడు. మనిషి కాలిన పెనంలా, ఎండిపోయిన చుట్టలా వుంటాడు. దించిన తల ఎత్తకుండా దీక్షగా బుల్లిగిన్నెలో పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా అట్లు పోస్తూనే ఉంటాడు." అన్నాడు సుబ్బు.

"అవును, అయితే?" 

"ముత్తు అట్లకాడతో స్టీలు మగ్గులోంచి నూనె అట్టుమీదకి జల్లటం ఎంతో కళాత్మకంగా వుంటుంది! పిండిచెయ్యిని నీళ్ళబొచ్చెలో ముంచి - కొన్నిట్లో బంగాళదుంప మసాలా, కొన్నిట్లో ఉల్లిపాయలు గుప్పిటతో ఎంతో పొందికగా పెడతాడు. మళ్ళీ నూనెని అట్లకాడతో ఇంకోరౌండ్ జల్లి, అట్టుని లాఘవంగా చుట్టి పక్కనున్న పెద్ద సత్తుప్లేట్ మీద పెట్టి, అట్లకాడతో టకటకమంటూ శబ్దం చేస్తాడు. ఆ టకటక - 'ఆర్డర్ రెడీ!' అని సర్వర్‌కి తెలియజేసే కోడ్." అన్నాడు సుబ్బు.

"విషయానికి రా." విసుక్కున్నాను.

"వస్తున్నా! వస్తున్నా! అట్లు పోయ్యటంలో గొప్ప ప్రతిభాశీలి అయిన ముత్తుకి ఇడ్లీలు వెయ్యడం రాదు! పొద్దస్తమానం అట్లుపోస్తూ, పక్కనే ఉండే ఇడ్లీమాస్టర్‌తో కబుర్లాడుతుంటాడు, కానీ ముత్తుకి ఇడ్లీ గూర్చి తెలీదు!" అన్నాడు సుబ్బు. 

"అవునా?!" ఆశ్చర్యపొయ్యాను. 

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు - "తెలుగు సినిమారంగం 'ముత్తు'ల మయం!"

"యెలా?" ఆసక్తిగా అడిగాను.  

"విఠలాచార్య ఒకేరకమైన సినిమాలు పుంజీలకొద్దీ తీశాడు. అన్నిసినిమాల్లో అవే గుర్రాలు, అవే కత్తులు! హీరో యెవరైనా - పులులు, పిల్లులు, కప్పలు మాత్రం రెగ్యులర్ ఆర్టిస్టులు. ఆయన జానపద సినిమాలు అనే 'అట్లు' పోసీపోసీ కీర్తిశేషుడయ్యాడు." అన్నాడు సుబ్బు.

"అవును, ఆయన్ని 'జానపద బ్రహ్మ' అంటారు." అన్నాను.

"కె.ఎస్.ఆర్.దాస్ లెక్కలేనన్ని 'డిష్షుం డిష్షుం' సినిమాలు తీశాడు. ఆయన దగ్గర ఇంకా పిండి మిగిలే ఉంది. కానీ - ఆయన అట్లు తినడానికి ప్రేక్షకులు అనే కస్టమర్లు మాయమయ్యారు, అంచేత నేచురల్‌గానే నిర్మాత అనే పెనం దొరకలేదు."

"అవును, ఆయన సినిమాల్ని ఫైటింగుల్తో చుట్టేశాడు!" అన్నాను.

"ఇంక రాంగోపాల్ వర్మ! గాడ్‌ఫాదర్ సినిమాని తిరగేసి తీశాడు, బోర్లించి తీశాడు, మడతపెట్టి  తీశాడు, చితక్కొట్టి తీశాడు, పిసికి పిసికి తీసాడు, ఉతికి ఉతికి తీశాడు! ఒకే పిండి, ఒకే అట్టు. రకరకాలుగా పేర్లు మార్చి కస్టమర్లని మోసం చేస్తుంటాడు."

"ఒప్పుకుంటున్నాను." నవ్వుతూ అన్నాను.

"బాపు రమణల స్పెషాలిటీ 'రామాయణం' అనే దోసెలు. రమణ మెత్తగా పిండిరుబ్బి బాపుచేతికి అందిస్తే, బాపు గుండ్రంగా అట్టు పోసేస్తాడు. ఒకసారి ముత్తుని - అట్టు కొంచెం పెద్దదిగా, స్పెషల్‌గా వెయ్యమని అడిగాను. మొహం చిట్లిస్తూ 'నా వల్లకాదు! చెయ్యి వణుకుద్ది, వాటం కుదరదు.' అని విసుక్కున్నాడు ముత్తు."

"నిజమా!" ఆశ్చర్యపోయాను.

"అవును. మలయాళ దర్శకుడు అరవిందన్ ఆంధ్రా అడవుల్లో చెంచుదొరల్తో 'కాంచనసీత' అనే సినిమా కొత్తదనంతో వెరైటీగా తీశాడు. కొత్తరకంగా ఆలోచించాడని విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. కానీ - బాపురమణలు ముత్తుకి సోదరులు, కొత్తఐడియాలు వచ్చే అవకాశం లేదు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో, కానీ - బాపు రమణలు ప్రతిభావంతులు." అన్నాను.

"కాదని నేనన్లేదే! కానీ నువ్వో విషయం గ్రహించాలి. దోసెలన్నీ ఒకటే. అట్లే వృత్తులన్నీ ఒక్కటే. నీ వైద్యవృత్తి క్షురకవృత్తి కన్నా గొప్పదేమీకాదు. కానీ మనం కొన్ని ప్రొఫెషన్లకి లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. అలాగే విఠలాచార్య, కె.ఎస్.ఆర్.దాస్, వర్మ, బాపురమణలు ఒకేగొడుగు క్రిందకొస్తారు. కానీ మనం దేవుడి సినిమాలు తీసేవాళ్ళనే గొప్పవారంటాం. ఇక్కడ మతవిశ్వాసాలు కూడా ప్లే చేస్తాయి." అన్నాడు సుబ్బు.

"నీ ఎనాలిసిస్ బాగానే ఉంది. మరి 'శ్రీరామరాజ్యం' చూడవా?" అడిగాను.

"ఆ సినిమా తీసింది కుర్రాళ్ళ కోసం. మన్లాంటి ముసలాళ్ళ కోసం ఎన్టీరామారావు 'లవకుశ' ఉందిగా!" అన్నాడు సుబ్బు.

"బాపురమణలు తెలుగువాళ్లవడం మన అదృష్టం." నేనివ్వాళ సుబ్బుని ఒప్పుకోదల్చుకోలేదు.

"నేను మాత్రం కాదన్నానా? బాపురమణలకి రామాయణమే జీవనాధారం. అదే కథని నలభయ్యేళ్ళుగా నమ్ముకున్నారు. రామాయణాన్ని తీసేవాడు దొరక్కపొతే ఆ కథకే ప్యాంటూ, చొక్కా తొడిగి సోషల్ పిక్చర్లు చుట్టేశారు.. రామకోటి రాసినట్లు!"

"ఈ విషయం ఇంకెక్కడా అనకు, వాళ్ళ భక్తులు తంతారు." నవ్వుతూ అన్నాను.

సుబ్బు కాఫీ తాగటం పూర్తిచేసి కప్పు టేబుల్ మీద పెట్టాడు.

"వాళ్ళకి ఫైనాన్స్ చేసేవాడు దొరికాడు, నటించేవాడూ దొరికాడు. అట్టు పోసేశారు. ఇష్టమైనవాడు చూస్తాడు, లేపోతే లేదు. ఎవడి గోల వాడిది. ఉప్మాపెసరట్టు అందరికీ నచ్చాలని లేదుకదా." అన్నాడు సుబ్బు.

"మొత్తానికి నీ అట్టు థియరీ బాగానే వుంది." నవ్వుతూ అన్నాను.

"థాంక్యూ! ముత్తు అట్లు పోస్తూనే ఉన్నాడు, బాపురమణలు రామాయణం తీస్తూనే వున్నారు!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు. 

(updated & posted in fb on 1/2/2018)

Thursday 24 November 2011

ఫ్రాయిడ్ కష్టాలు

"మిత్రమా! కాఫీ, అర్జంట్!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

ఎదురుగా వున్న టేబుల్‌పై పుస్తకాల్ని ఆసక్తిగా చూడ్డం మొదలెట్టాడు. ఆవి సిగ్మండ్ ఫ్రాయిడ్, బెర్ట్రండ్ రస్సెల్ పుస్తకాలు.

"ఏంటీ! ఈ రోజుల్లో కూడా ఇవి చదివేవాళ్ళున్నారా!" ఆశ్చర్యపోయాడు సుబ్బు.

"నేనున్నాను, నీకేమన్నా ఇబ్బందా?" అన్నాను.

"నాకేం ఇబ్బంది! కాకపోతే ప్రపంచం మారిపోతుంది. తెలుగునేలంతా జగన్, చంద్రబాబు అని కలవరిస్తుంది. నువ్వేమో జనజీవన స్రవంతికి దూరంగా ఏవో పురాతన పుస్తకాల్లో కొట్టుకుంటున్నావు." జాలిగా చూస్తూ అన్నాడు సుబ్బు.

"అంటే మనకి ఫ్రాయిడ్, రస్సెల్ ఇర్రిలెవెంట్ అంటావా?" అన్నాను.

"అవును. మన వూరు గుంటూరు, ఇక్కడ వుంటేగింటే చంద్రబాబు నాయుడుకి పనుంటుంది గానీ ఫ్రాయిడ్ కేమి పని! అసలీ ఫిలాసఫర్స్ గుంటూర్లో పుట్టుంటే వీళ్ళకథ వేరుగా ఉండేది. అదృష్టవంతులు కాబట్టి ఇంకేదో దేశంలో పుట్టి బతికిపొయ్యారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! డోంటాక్ రబ్బిష్." విసుక్కున్నాను.

సుబ్బు మాట్లాడలేదు.

ఇంతలో కాఫీ వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ చెప్పడం మొదలెట్టాడు సుబ్బు.

"కొద్దిసేపు ఫ్రాయిడ్, రస్సెల్ గుంటూర్లో పుడితే ఏమయ్యేదో ఆలోచిద్దాం. ఇద్దర్నీ ఇంగ్లీషు మీడియం స్కూల్ అనే యేదోక దుకాణంలో చేర్పించేవాళ్ళు, పాఠాలు బట్టీ పట్టరు కాబట్టి మార్కులు తక్కువొచ్చేవి. ఇంక స్కూల్లో టీచర్లు, ఇంట్లో తలిదండ్రులు హింసించడం మొదలెట్టేవాళ్ళు."

"అంతేనంటావా?" సాలోచనగా అడిగాను.

"అంతే! టెన్త్ పాసయ్యాక ఇంటర్ చదువుకి ఇద్దరు మేదావుల్నీ కార్పొరేట్ కాలేజీలో పడేసేవాళ్ళు. అక్కడ ప్రతివారాంతం, ప్రతిదినాంతం, ప్రతి గంటాంతం, ప్రతి నిముషాంతం పెట్టే టెస్టులు రాయలేక చచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్లకి రెండే ఆప్షన్లు ఉండేవి." అంటూ ఆగాడు సుబ్బు.

"ఏంటవి?" ఆసక్తిగా అడిగాను.

"ఒకటి మనవాళ్ళ ఇంటర్ రుద్దుడుకి తట్టుకుని నిలబడి, ఇంజనీరింగ్‌లో కుక్కలా చదివి, అమెరికాలో ఉద్యోగం సంపాదించి, డాలర్లు సంపాదించి హైదరాబాద్ చుట్టుపక్కల పొలాలు, స్థలాలు కొనడం. ఆస్తుల్నిప్పుడు మనూళ్లోనే కొంటున్నార్లే - తెలంగాణా దెబ్బకి." అంటూ నవ్వాడు సుబ్బు.

"రెండో ఆప్షన్?"

"ఏముంది. ఒత్తిడికి తట్టుకోలేక ఇద్దరూ రోడ్లెమ్మడ తిరుగుతుండేవాళ్ళు. అప్పుడు మీ సైకియాట్రిస్టులు, విజయానికి వెయ్యిమెట్ల వ్యక్తిత్వ వికాసంగాళ్ళు పండగ చేసుకుంటారు." అంటూ కాఫీ తాగడం ముగించాడు సుబ్బు.

"సుబ్బూ! మనం పనికిరాని బడుద్దాయిల్ని తయారు చేస్తున్నామని నీ అభిప్రాయమా?" విసుక్కున్నాను.

"నేనా మాటన్లేదు. మనం విద్యార్ధుల్ని రొబోల్లాగా ఒకే షేప్‌లో వుండేట్లు ఒక సిస్టం తయారు చేసుకున్నాం. ఈ సిస్టం ఉద్యోగానికి తప్ప తెలివైనవాణ్ని ప్రోత్సాహించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే మోడల్ కాదు. ఎందుకంటే మన విద్యకి పరమార్ధం ఉద్యోగం. ఆ ఉద్యోగం అమెరికాలో అయితే మరీ మంచిది. అందుకే అమెరికాలో డిమాండ్ ఉన్న కోర్సులకే ఇక్కడా డిమాండ్. చైనావాడు అమెరికాకి చౌకరకం బొమ్మల్ని అమ్ముతాడు, మనం చౌకగా మేన్ పవర్ని ఎగుమతి చేస్తున్నాం." అన్నాడు సుబ్బు.

"ఒప్పుకుంటున్నాను, నేనిలా ఆలోచించలేదు." అన్నాను.

"ఆలోచించి మాత్రం నువ్వు చేసేదేముంది? మళ్ళీ ఇంకో ఇంగ్లీషు పుస్తకం చదువుకుని బుర్ర పాడుచేసుకోటం తప్ప. మేధావులకి తమచుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల ఆసక్తి ఉండదు. ఎప్పుడో ఎక్కడో ఎవరో రాసిన అంశాలని అధ్యయనం చేస్తారు, తీవ్రంగా మధనపడతారు. వాళ్ళు కన్ఫ్యూజయ్యి, అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆరకంగా నువ్వు నిఖార్సైన మేధావివి." అంటూ పెద్దగా నవ్వాడు సుబ్బు.

నేనూ నవ్వాను.

టైమ్ చూసుకుని లేచాడు సుబ్బు. "నీకో విషయం చెబ్తాను. చంద్రబాబు ట్రై చేస్తే ఫ్రాయిడ్ అర్ధమవుతాడు. కానీ ఫ్రాయిడ్‌కి మాత్రం చచ్చినా చంద్రబాబు అర్ధం కాడు!"

"మరిప్పుడు ఏం చెయ్యాలి?" దిగులుగా అడిగాను.

"మనం చెయ్యడానికేముంది. అసలు ఏదన్నా చెయ్యాలని ముఖ్యమంత్రే అనుకోటల్లేదు. అందుకని నువ్వు హాయిగా పేషంట్లని చూసుకో. వస్తా, ఇప్పటికే లేటయింది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

టేబుల్ మీద నుండి ఫ్రాయిడ్, రస్సెల్ నన్ను చూస్తూ వెక్కిరింతగా నవ్వుతున్నట్లనిపించింది!    

Edited and posted in fb