Saturday, 31 August 2013

లవకుశుల కష్టాలు


"పిల్లలూ! ఈ పాట చూడండి. వారు లవకుశులు. శ్రీరాముని కొడుకులు. ఆవిడ వారి తల్లి సీత."

"లవకుశులు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదేం?"

"వాళ్ళు ఆశ్రమవాసం చేస్తున్నారు. అదే వాళ్ళ యూనిఫామ్."

"ఓహో అలాగా!"

"సీతాదేవి మనసుకి కష్టం కలిగింది. అందుకే ఆవిడ దుఃఖంగా ఉంది. పసిపిల్లలైన లవకుశులు తల్లిని ఓదారుస్తున్నారు. ఈ పాట చాలా బాగుంటుంది. ముందు పాటని శ్రద్ధగా చూడండి. ఆ తరవాత మీకు ఏమర్ధమైందో చెప్పండి."

<

"పిల్లలూ! పాట మొత్తం చూశారుగా?"

"ఓ!"

"ఇప్పుడు ఆ పాట గూర్చి నాలుగు ముక్కలు చెప్పండి."

"లవకుశులు చాలా పేదవాళ్ళు. అందుకే పూరి గుడిసెలో ఉంటున్నారు. పేదవారైనప్పటికీ మంచి ఇంగ్లీషు మీడియం స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకుంటున్నారు. రోజూ అర్ధరాత్రి దాకా స్టడీ అవర్స్ ఉన్నాయి. వారు కష్టపడి చదువుతూ వీక్లీ టెస్టులు, డైలీ టెస్టులు రాస్తున్నారు. ఒకసారి వాళ్లకి వీక్లీ టెస్టులో వందకి 0.00001 మార్కులు తక్కువొచ్చాయి. స్కూల్ హెడ్ వాళ్ళని వెంటనే తక్కువ సెక్షన్ కి మార్చేశారు."

"!!!!"

"తన పిల్లల్ని సెక్షన్ మార్చారన్న వార్త వినంగాన్లే శ్రీరామునికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన్ని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. భర్త ఆస్పత్రి పాలైతే పిల్లల చదువులకి ఫీజులు ఎవరు కడతారు? అందుకే సీతాదేవి ఏడుస్తుంది."

"!!!!!"

"ఏడవకమ్మా! మాకు తగ్గిన ఆ 0.00001 మార్కులు మళ్ళీ సాధిస్తాం. తిరిగి మొదటి సెక్షన్లోకి వచ్చేస్తాం అంటూ తల్లిని ఓదారుస్తున్నారు. అదీ ఈ పాట కథ. మాకు సీతాదేవి ఎందుకు ఏడిచిందో అర్ధమైంది. కానీ ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారో మాత్రం అర్ధం కావట్లేదు!"

చివరి మాట :

క్లినికల్ సైకాలజిస్టులు Thematic Apperception Test (TAT) చేస్తుంటారు.ఈ పోస్టు రాయడానికి ఆ టెస్ట్ చేసే విధానం వాడుకున్నాను.

(picture courtesy : Google)

Thursday, 29 August 2013

'వేతనశర్మ' ఉద్యమం

ఒక సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఒక సమాజాన్ని అడవిగా భావించుకుని, మనుషుల్ని అడవిలో నివసించే జంతువులుగా మార్చి ఊహించుకుంటే.. సమాజాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం సులువుగా ఉంటుంది. అందుకే 'పంచతంత్రం' కథలు ఈనాటికీ నిత్యనూతనంగా ఉంటాయి. బహుశా అందుకేనేమో జార్జ్ ఆర్వెల్ జంతువుల్ని పాత్రలుగా చేసుకుని 'ఏనిమల్ ఫామ్' రాశాడు.

ఒక అడవిలో రక్షణ కోసం (జీవించే హక్కు కోసం) జంతువులు ఉద్యమం చేస్తుంటాయి. అందులో జింకలు ఉంటాయి. వాటి పక్కనే అవే స్లోగన్లిస్తూ పులులు కూడా ఉంటాయి. దూరం నుండి చూసేవారికి ఆ రెండు జంతువుల ఐకమత్యం చూడ ముచ్చటేస్తుంది. కానీ వాటి ఉద్యమ లక్ష్యం ఒకటి కాదు.

పులులకి కావలసింది వేటగాడి నుండి రక్షణ. జింకలకి రక్షణ కావలసింది వేటగాళ్ళ నుండే కాదు.. పులుల నుండి కూడా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ సంగతి తెలీని అమాయక జింకలు.. తమలో పులుల్ని కూడా కలిపేసుకుని ఉద్యమం చేస్తాయి. ఉద్యమం విజయవంతమైన తరవాత పులులు జింకల్ని ప్రశాంతంగా భోంచేస్తాయి.

'వేతనశర్మ కథ'. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన ఈ కథ ఎంతో ప్రసిద్ధి గాంచింది. ప్రస్తుతం ఉద్యమాల సీజన్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో 'వేతనశర్మ కథ' గుర్తు చేసుకోవడం సందర్భోచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అందువల్ల ఇంతకుముందు నేన్రాసిన రావిశాస్త్రి 'వేతనశర్మ కథ'  మరొక్కసారి చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను.  

(photo courtesy : Google)

మహానాయకులు - ట్రాఫిక్ సిగ్నళ్ళు

"సుబ్బూ!"

"ఊఁ"

"మన రాజకీయా పార్టీలకి గొప్ప ఎజెండా ఉంటుంది. మరెంతో గొప్ప నాయకులుంటారు. అయినా మన బ్రతుకులు ఎందుకిలా తగలడ్డయ్యంటావ్?"

"సిటీల్లో ప్రతి కూడలిలో ట్రాఫిక్ లైట్లుంటాయ్. అయినా యాక్సిడెంట్లు ఎందుకు జరుగున్నయ్యంటావ్?"

"సుబ్బూ! అర్ధం లేకుండా మాట్లాడి విసిగించకు."

"మనూళ్ళో ముఖ్యమైన కూడళ్ళలోనూ ట్రాఫిక్ సిగ్నళ్ళు ఉంటాయి. కానీ వీటిని ఎవరూ పట్టించుకోరు. వాటి మానాన అవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు చూపిస్తుంటాయి. మన మానాన మనం వాహనాల్ని అడ్డదిడ్డంగా నడిపేస్తుంటాం. పొరబాటున ఎవడన్నా అమాయకుడు ఎర్రలైటు చూసి ఆగినట్లైతే.. వెనకనుండి వాణ్ని గుద్దేస్తారు. అనగా ట్రాఫిక్ లైట్లని పట్టించుకోకపోవడంలో మన జనాలకి ఒక యూనిటీ ఉంది, క్రమశిక్షణా ఉంది."

"అవును సుబ్బూ!"

"జనాలు ట్రాఫిక్ సిగ్నళ్ళని లెక్కచెయ్యక పోవడంలో చూపించిన యూనిటీ, క్రమశిక్షణా నాకు మన రాజకీయ పార్టీ కార్యకర్తల్లోనూ కనిపిస్తుంది. అన్ని కూడళ్ళల్లోనూ ట్రాఫిక్ లైట్లు ఉన్నట్లే అన్ని రాజకీయ పార్టీలకి ఒకప్పటి మహానాయకులు ఉంటారు. ఆ పాతతరం నాయకులకి గొప్ప సిద్ధాంతాలూ ఉండేవి. కానీ మన జనాలు ట్రాఫిక్ లైట్లని పట్టించుకొనట్లే ఆ నాయకుల సిద్ధాంతాల్ని సొంత పార్టీ కార్యకర్తలే పట్టించుకోరు."

"సుబ్బూ ! మరీ జనరలైజ్ చేస్తూ చెబుతున్నావ్. అర్ధం కావట్లేదు."

"ఓకే. ఉదాహరణకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బ్యాక్ గ్రౌండులో మహాత్మా గాంధి, నెహ్రూ బొమ్మలు ప్రముఖంగా కనిపిస్తుంటయ్. కానీ ఆ నాయకుల బొమ్మలకి, అక్కడ జరుగుతున్న సమావేశాలకి ఏ మాత్రం పొందిక ఉండదు. ఆ బొమ్మలు మన ట్రాఫిక్ లైట్లలాగే నిస్సహాయ సాక్షులుగా ఉండిపోతాయి."

"నిజమే సుబ్బూ!"

"తెలుగు దేశం పార్టీ మహానాడు సమావేశాల్లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిస్తుంటాయి. ఆ బొమ్మల సాక్షిగా, తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన అనేక ప్రజాసంక్షేమ పథకాల్ని ఎత్తేసింది. మొన్న మహానాడులో రాష్ట్ర విభజనకి అనుకూలంగా TDP తీర్మానం చేసింది. బ్యాక్ గ్రౌండులో ఎన్టీఆర్ బొమ్మ వెలవెలపోయింది. అనగా అక్కడ ఎన్టీఆర్ స్పూర్తి ఉండదు. బొమ్మ మాత్రమే ఉంటుంది."

"మరప్పుడు ఆ బొమ్మలెందుకు సుబ్బూ?"

"పిచ్చివాడా! ఆ బొమ్మలే లేకపోతే ఈ పార్టీలకి credibility crisis వస్తుంది. మనం పట్టించుకోవట్లేదని ట్రాఫిక్ సిగ్నల్స్ అవతల పడేస్తే ఊరికి ఎంత నష్టం! పనికిరాని ఆ ట్రాఫిక్ సిగ్నళ్ళు, ఉత్సవ విగ్రహాల్లా ప్రపంచానికో గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఈ సెంటర్లో ట్రాఫిక్ ఒక పద్దతిగా, క్రమశిక్షణ పాటిస్తుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తాయి. దూరం నుండి చూసేవాళ్ళకి కన్నుల పండుగగా కూడా ఉంటుంది. ఆ విధంగా ట్రాఫిక్ లైట్లు పురజనులకి మానసికానందాన్ని కలిగిస్తాయి."

"అంటే ట్రాఫిక్ సిగ్నళ్ళూ, దివంగత పార్టీ నాయకుల బొమ్మలు ఒకటే నంటావా సుబ్బూ?"

"నేనైతే మాత్రం అవుననే అనుకుంటున్నాను. "

(picture courtesy : Google)

Tuesday, 27 August 2013

CPM ఎక్కడ?


నిన్న 'హిందూ'లో CPM కార్యదర్శి రాఘవులు బొమ్మని చూసి ఆశ్చర్యపొయ్యాను. పిమ్మట చాలా రోజుల తరవాత పేపర్లో ఆయన బొమ్మని చూసినందుకు సంతోషించాను. ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో CPM బొత్తిగా వెనకబడిపోయింది.

'మేం భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అనుకూలం, రాష్ట్ర విభజనకి వ్యతిరేకం. రాష్ట్రాన్ని విడగొట్టేట్లైతే మేం అడ్డుపడం' అని ఒక ప్రకటన చేసేసి ఆ పార్టీ నాయకులు ఇంట్లో కూర్చున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన రాజకీయ విధానం. రాష్ట్రాలు కలిసే ఉండటం, కొత్త రాష్ట్రాలు ఏర్పడటం, ఉన్న రాష్ట్రాల్ని విభజించడంపై CPM లో విధానపరమైన చర్చ జరిగినట్లు నాకు అనిపించడంలేదు.

భాషాప్రయుక్త రాష్ట్రాలే విధానం కలిగిన కలిగిన CPM, హిందీ రాష్ట్రాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలిపేసే ఉద్యమానికి శ్రీకారం చుడుతుందా? మరప్పుడు గూర్ఖాలాండ్ ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? కేవలం BJP చిన్న రాష్ట్రాలకి అనుకూలం కావున, CPM దానికి వ్యతిరేక విధానం తీసుకుందా? నేనైతే అలా అనుకోవట్లేదు.

దేశజనాభా పెరిగిపోతుంది. ప్రాంతీయంగా ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయి. రేపు విదర్భ విషయంలో కూడా జాతీయ పార్టీగా ఒక అభిప్రాయం, నిర్ణయం తీసుకోవలసిన అవసరం CPM కి ఉంది. ప్రజల విస్తృత ప్రయోజనాల రీత్యా, మారుతున్న కాలానికి అనుగుణంగా తమ రాజకీయాలు స్పష్టంగా నిర్వచించవలసిన అవసరం ఆ పార్టీకి ఉంది.

ఇదేమీ లేకుండా.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటూ పిడివాదన తలకెత్తుకుంటే.. భవిష్యత్తులో ఆ పార్టీ కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. రాజకీయ అభిప్రాయాలు, నిర్ణయాలు గోడక్కొట్టిన మేకులా స్థిరంగా ఉండవు. కాలానుగుణంగా మార్పు అనేది రాజకీయాల్లో సహజం. ఇది ఆ పార్టీ నాయకత్వం ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది. అసలు ప్రజల అభిమానాన్ని చూరగొనే విషయంలో (తాము అనుకుంటున్న) బూర్జువా పార్టీలతో పోటీ పడే ఉద్దేశ్యం CPM కి ఉందా? లేదా?

మన రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి గొప్ప చరిత్ర ఉంది. ఎందఱో మహానాయకుల్ని దేశానికి అందించిన ఘనచరిత్ర కమ్యూనిస్టు పార్టీది. సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు.. ఈ లిస్టు పెద్దది. ఎంతో చరిత్ర కలిగిన CPM ఇవ్వాళ రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు సంభవిస్తుంటే.. సాక్షీభూతంగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం మినహా.. ప్రజలని రాజకీయంగా కనీస స్థాయిలోనైనా ప్రభావితం చెయ్యలేని స్థితిలో కునారిల్లుతుంది. ఇదొక విషాదం.

పోస్టు సీరియస్ గా అయిపోతుంది. కావున సరదాగా ఒక జోక్ రాస్తాను. ఒకప్పుడు CPM పార్టీకి ధరలు పెరిగినప్పుడల్లా నిరసన ప్రదర్సనలు చేసే ఆనవాయితీ ఉండేది. ఈ ప్రదర్శనలకి చిరాకు పడ్డ కాంగ్రెస్ పార్టీ, రోజువారీగా ధరలు పెంచడం మొదలెట్టింది. రోజూ నిరసన తెలియజెయ్యడం ఏ పార్టీకైనా కష్టం కావున.. CPM ఆ పని నుండి వైదోలిగింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ CPM పై క్షేత్ర స్థాయిలో విజయం సాధించింది. పార్లమెంటరీ రాజకీయాల్లో ఎత్తుకు పైయ్యెత్తు వేసేవారిదే విజయం. రాజ్యం వీర భోజ్యం.

నేను ఇంతకు ముందు "కమ్యూనిస్టు కాకి జ్ఞానోదయం" అంటూ వ్యంగ్యంగా ఒక పోస్టు రాశాను. కామెంట్ల వర్షాన్ని ఎదుర్కొన్నాను. ఈ పోస్టులో మాత్రం అస్సలు వ్యంగ్యం లేదని మనవి చేసుకుంటున్నాను. రాఘవులు నిజాయితీని, నిబద్దతని ఎవ్వరూ ప్రశ్నించలేరు. నాకు వ్యక్తిగతంగా రాఘవులు అంటే గౌరవం. కానీ ప్రజలకి దూరంగా జరిగిపోయ్యి సిద్ధాంతాలతో పార్టీ నడపడం ఈ రోజుల్లో సాధ్యపడదు. ఈ విషయం CPM ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


(photo courtesy : Google)

Monday, 26 August 2013

చరిత్ర మార్చుకున్న ఆంధ్రప్రదేశ్


"మావాఁ! ఒకపక్క సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. నువ్వేమో తాపీగా చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నావు."

"ఉరే అల్లుడూ! నేనేమీ నీకు లాగా ఇంజినీరింగ్ చదువుకుని పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యట్లేదు. ఏదో పదో క్లాసు వెలగబెట్టి వ్యవసాయం చేసుకుంటున్నాను. నా చుట్ట నన్ను కాల్చుకోనీ."

"చదువుకోకపొతే మాత్రం నువ్వు మనిషివి కాదా? నీకు మాత్రం బాధ్యత ఉండదా? అమరజీవి పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్రప్రదేశ్ ని ముక్కలుగా చేసి, హైదరాబాదుని తెలంగాణా వాళ్ళు కాజేస్తున్నారు. మనం మన హైదరాబాదుని కాపాడుకోవాలి."

"అల్లుడూ! ఇలా చెబుతున్నానని ఏమనుకోమాక. చిన్నప్పుడు నేనూ సాంఘిక శాస్త్రం చదువుకున్నాను. మా పుస్తకాల్లో పొట్టి శ్రీరాములు 1952 లోనే మరణించారని రాశారు. ఆయన మద్రాసు రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడాలని నిరాహార దీక్ష చేశాడు. అసువులు బాశాడు. ఇప్పుడు దీక్షలు చేసేవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా సెలైన్ కడుతున్నారు. పొట్టి శ్రీరాములు విషయంలో ఆనాటి పోలీసులు, డాక్టర్లు ఊరుకున్నారు. కారణం తెలీదు."

"మావాఁ! ఇప్పుడు ఉద్యమం చేస్తున్న రాజకీయ నాయకులకి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకి నీపాటి జ్ఞానం లేదనుకోకు."

"అంతమాట నేనంటానా అల్లుడూ?"

"మావాఁ! పాఠ్యపుస్తకాలు ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్లు వస్తుంటాయి. సబ్జక్టు కూడా మారుతుంటుంది. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందనేవాళ్ళు. మరిప్పుడు భూమి గుండ్రంగా ఉందని రాయట్లేదూ?"

"అల్లుడూ! సైన్స్ మారుతుంటుంది గానీ.. చరిత్ర ఎట్లా మారుతుంది?"

"అక్కడే పప్పులో కాలేశావు మావాఁ! ఏదీ నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకం ప్రకారం ప్రధానమంత్రి ఎవరో చెప్పు?"

"ఇందిరాగాంధీ."

"మరిప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రా? మన్మోహన్ సింగు కదా!"

"నిజవే అల్లుడూ!"

"మావాఁ! నీది మిడిమిడి జ్ఞానం. నీకు చరిత్ర తెలీదు. చెప్పినా అర్ధం చేసుకోలేవు. సైన్స్ సబ్జక్టు లాగే సోషల్ సబ్జక్టూ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. లేటెస్ట్ సోషల్ టెక్స్ట్ బుక్ ప్రకారం పొట్టి శ్రీరాములు హైదరాబాద్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ 1956 లో అమరజీవి అయ్యాడు."

"నిజంగా!"

"ఇది పచ్చి నిజం. ఆయన ప్రాణ త్యాగ ఫలితంగానే హైదరాబాదుతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ మహానుభావుని ఆత్మ బలిదానం మనం వృధా పోనియ్యరాదు. అర్ధమైందా? చుట్ట కాల్చడం అయ్యిందిగా. ఇంక ఉద్యమ దిశగా నడువు."

"వార్నీ! ఈ మధ్య కాలంలో చరిత్ర మరీ ఇంత దారుణంగా మారిపోయిందా అల్లుడూ? సర్లే! అర్జంటుగా చెంబుకెళ్ళాల. ముందు నువ్వెళ్ళు. పని పూర్తి చేసుకుని ఎనకమాలగా నేనొచ్చెస్తా."


(photos courtesy : Google)

Friday, 23 August 2013

స్త్రీల పట్ల వివక్ష


సుబ్బు కాఫీ త్రాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు.

"సుబ్బూ! స్త్రీ శక్తి స్వరూపిణి. ఆదిపరాశక్తి." అన్నాను.

"గాడిద గుడ్డేం కాదు? దీన్నే 'లిప్ సర్విస్' అంటారు మిత్రమా." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అనగానేమి?" అడిగాను.

"పెదాలపై మాట ఒకటి, మనసులో భావం మరొకటి అని అర్ధం. భావజాలాన్ని మార్చుకోకుండా వాగాడంబరాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనమేమి?" అన్నాడు సుబ్బు.

"కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పవా?" చికాగ్గా అన్నాను.

"ఇవ్వాళ ఉద్యమాల్లో తమకి నచ్చని పురుష రాజకీయ నాయకులకి స్త్రీ వేషాలు వేసి ఊరేగిస్తున్నారు. అంటే సమాజంలో స్త్రీ స్థానం తక్కువ అని బహిరంగంగా ప్రకటించటమే." అన్నాడు సుబ్బు.

"దాందేముంది సుబ్బు! వాళ్లకి ఆ రాజకీయ నాయకుని పట్ల ఉన్న కోపంతో జెండర్ మార్చి వేషధారణ చేసి ప్రదర్శిస్తున్నారనుకోవచ్చు." అన్నాను.

"మరప్పుడు సోనియా గాంధీకి ప్యాంటూ, చొక్కా వేసి నిరసన తెలియజెయ్యాలి గదా? ఎందుకలా చెయ్యరు?" అడిగాడు సుబ్బు.

"నిజమే! ఎందుకలా చెయ్యరు?" ఆశ్చర్యపొయ్యాను.

"ఎందుకనగా.. మన సమాజంలో ఈ నాటికీ స్త్రీ కన్నా పురుషుడు అధికుడు అన్న భావం ఉండటం చేత. అందుకే పురుష రాజకీయ నాయకులకి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి తమ అసంతృప్తిని తెలియజేస్తారు. రాజకీయాల్లో ఉన్న స్త్రీకి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి నిరసన తెలియజెయ్యడం మాత్రం ఇంతవరకూ జరగలేదు." అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ! మరి ఈ విషయంలో ఇంతమటుకూ స్త్రీ సంఘాలు నిరసన తెలియజెయ్యలేదే?" అడిగాను.

"ఎవరి వాదన వారు చేసుకోవాలనుకోడానికి ఇదేమీ ఆస్థి తగాదా కాదు. ఒక సమాజ భావజాలానికి సంబంధించిన అంశం. స్త్రీలకి చదువులు, ఉద్యోగాలు అనవసరం అని కొందరు స్త్రీలే వాదిస్తారు. అలాగే స్త్రీల సమస్యల గూర్చి తపన పడ్డ గుడిపాటి చలం స్త్రీ కాదు. ఎవరి ఉద్యమం వాళ్ళే చేసుకోవాలంటే.. అప్పుడు పసిపిల్లలు, వృద్ధుల తరఫున ఎవరు ఉద్యమిస్తారు?" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నువ్వు చెప్పింది ఒప్పుకుంటున్నాను." అన్నాను.

"మన చిన్నప్పటితో పోలిస్తే ప్రజల తలసరి ఆదాయం పెరిగిందే గాని.. తలలో ఆలోచనలు పెరగలేదనిపిస్తుంది. అతి చిన్న విషయమే అయినా.. ఒక చర్య ద్వారా తమలోని వికృత భావాజాలాన్ని బయట పెట్టుకుంటున్నారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ఈ విషాదాన్ని నేను తట్టుకోలేను. రాత్రికి దినకర్ పంపిన glenfiddich తో ఈ సమాజం పట్ల మన నిరసన తెలియజేద్దాం." నవ్వుతూ అన్నాను.

"ఓ! తప్పకుండా." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Thursday, 22 August 2013

మానసిక రోగులూ మనుషులే


'ఫలానా నాయకుడికి పిచ్చెక్కింది.'

'ఫలానా నాయకుడిని పిచ్చాసుపత్రిలో చేర్పించి మా ఖర్చుతో వైద్యం చేయిస్తాం.'

ఈ మధ్య కొందరు రాజకీయ నాయకుల భాషలో ఇలాంటి కొత్త 'తిట్లు' వచ్చి చేరాయి. ఇంకొందరు ఒకడుగు ముందుకెళ్ళి ప్రభుత్వాసుపత్రిలోని మానసిక వైద్య విభాగాధిపతికి 'ఫలానా నాయకుడికి మానసిక వైద్యం అవసరం' అంటూ మీడియా సాక్షిగా వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు!

ఇది చాలా అభ్యంతరకరమైన ధోరణి. సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దుర్మార్గమైన ధోరణి. మానసిక రోగులు నేరస్థులు కాదు. బీపీ, షుగర్ పేషంట్ల లాగా సైకియాట్రీ పేషంట్లు కూడా ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. మానసిక వైద్యం అనేది వైద్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బు వస్తుంది. మానసిక జబ్బులు మెదడులో కల న్యూరోట్రాన్మిటర్లలో సంభవించే రసాయన మార్పుల వల్ల వస్తున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

అసలు ఏ రోగంతో బాధపడేవారి గురించైనా ఎగతాళిగా ఎవరూ మాట్లాడరాదు. విజ్ఞత కలిగిన వారెవరైనా మానసిక వైద్యం చేయించుకుంటున్న వారి పట్ల సానుభూతిగానే ఉంటారు. మరి మన పొలిటికల్ సెక్షన్‌కి మానసిక రోగుల పట్ల ఎందుకింత పరిహాసం? ఎందుకింత బాధ్యతా రాహిత్యం? ఇది వారి అవగాహన లోపమా? లేక నిర్లక్ష్యమా? 

అసలే మన దేశంలో మానసిక రోగాల పట్ల అవగాహన తక్కువ. సామాన్య ప్రజలు ఈ రోజుకీ దెయ్యాలు, భూతాలు, చేతబడి వంటి నమ్మకాలతో తమ విలువైన సమయాన్ని, డబ్బుని నష్టపోతున్నారు. మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే సమాజం తమని 'పిచ్చివాడు' అనే ముద్ర వేస్తుందేమోనని భయపడుతున్నారు.

అందుకే ఏపీ సైకియాట్రిక్ అసోసియేషన్ మానసిక వైద్యం పట్ల ప్రజల అవగాహన మెరుగు పరచడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మానసిక వైద్యులు కూడా ఈ రంగంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. తద్వారా ఇప్పుడిప్పుడే సామాన్య ప్రజలలో అవగాహన కొంత మెరుగవుతుంది.

మన నాయకులు మాత్రం తమ రాజకీయ భాషలో 'పిచ్చి', 'పిచ్చెక్కింది' వంటి అనాగరిక పదాలు వాడుతూ సమాజానికి నష్టం చేకూరుస్తున్నారు. ఈ రకమైన 'పిచ్చి' భాష మానసిక వైద్యం పొందుతున్న వారికి ఆవేదన కలిగిస్తుంది. ఈ భాష ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకి విరుద్ధం కూడా. కావున ఇట్లాంటి భాష మాట్లాడకుండా కఠినమైన నిబంధనలు విధించడమే కాకుండా... ఇలా మాట్లాడ్డం నేరంగా పరిగణించేలా కూడా వెంటనే చట్టంలో మార్పు తేవాలి.

- యడవల్లి రమణ

(ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజిలో పబ్లిష్ అయ్యింది)

(picture courtesy : Google)

కాకిగోల


"రవణ మావా!"

"ఊఁ"

"ఈ మధ్య కాకులు పెద్దగా కనబడట్లేదేంటి?'

"నేనూ నిన్నటిదాకా అలాగే అనుకున్నాను సుబ్బు. కానీ పొద్దున్న టీవీ చూశాక కాకుల ఎడ్రెస్ తెలుసుకున్నాను."

"టీవీల్లో కాకులా!"

"అవును. ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా ఈ మధ్య ఒకటే కాకిగోల. టీవీల వాళ్లకి వార్తలు లేక ఏవో పనికిమాలిన చర్చా కార్యక్రమాలు పెడుతుంటారు. అక్కడ చర్చ ఉండదు. ఏవో పిచ్చికేకలుంటాయి. మనకి ఏవీ అర్ధం కాదు."

"వాళ్ళ ఉద్దేశ్యం కూడా మనకి అర్ధం కాకూడదనే రవణ మావా!"

"తెలుగు టీవీల్లో చర్చా కార్యక్రమాలు చాలా నాసిగా ఉంటాయి. రాజకీయాల్లో, మీడియాలో పన్లేని నిరుద్యోగులతో ఇవి నిర్వహిస్తున్నట్లుగా అనిపిస్తుంది."

"నేనైతే ఈ ప్రోగ్రాములు చూడను. కాబట్టి నాకు తెలీదు. అయితే ఈ వాగుళ్ళకి, కాకిగోలకీ కల సంబంధమేమి?"

"కాకులు కూడా టీవీ చర్చల్లాగే గోలగోలగా అరుస్తుంటాయి సుబ్బూ."

"నీ పోలిక సరికాదు. కాకులు కష్టజీవులు. కాకి అనే జీవి లేకపోతే మన పర్యావరణం దెబ్బ తింటుంది. కాకుల భాష మనకి అర్ధం కాదు కాబట్టి మనం వాటి అరుపుల్ని 'కాకిగోల' అని హేళనగా అనుకుంటాం. కానీ కాకుల అరుపుకి చాలా స్పష్టమైన అర్ధం ఉంటుంది. అవి వాటి భాషలో ఒకదానికొకటి హెచ్చరించుకుంటాయి. తమలో ఒకరు చనిపోతే సామూహికంగా సంతాప సందేశాన్ని ప్రకటిస్తాయి."

"అవును. కాకుల్లాగే జంతువులు కూడా సంఘజీవులే సుబ్బూ."

"అంతేకాదు. మనుషుల్లో మంచితనం ఉండదు. అయినా 'మానవత్వం' అనే పదం సృష్టించుకున్నాం. కాకులకి మంచితనం అనేది ఒక సహజగుణం. అయినా తెలుగు భాషలో 'కాకిత్వం' అనే పదం లేదు. తెలుగు భాషలో తమకి జరిగిన అన్యాయం కాకులకి తెలీదు. తెలిసినట్లైతే అవి మనని ముక్కుతో పొడిచి చంపేసేవి!" అన్నాడు సుబ్బు.

"ఓకే. ఒప్పుకుంటున్నాను. మరప్పుడు కాకిగోల అని ఎందుకంటాం సుబ్బూ?"

"ఇట్లాంటి పదప్రయోగాలు తెలుగు భాషలో ఒక పెద్ద లోపం. ఉదాహరణకి 'క్రూరమృగం' అంటాం. నిజానికి ఏ మృగం కూడా క్రూరమైంది కాదు. ఒకరకం జాతి జంతువులు, ఆకలి వేసినప్పుడు ఇంకోరకం జాతి జంతువుల్ని కష్టపడి వేటాడి చంపుకుని తింటాయి. అది ప్రకృతి ధర్మం. అలా చెయ్యకపోతే అవి ఆకలితో చస్తాయి. ఇందులో క్రూరత్వం ఏముంది? చంపడం అనే ఒక్క అంశాన్ని తీసుకుని, దానికి మన value judgement జోడించి 'క్రూరమృగం' అంటున్నాం."

"అవున్నిజం."

"ఈ మధ్య జర్నలిస్టులకి సైతం పైత్యం ఎక్కువైంది. అందుకే రేపిస్టులకి 'మృగాడు' అని బిరుదులిస్తున్నారు. ఇట్లా నీచోపమానాలకి జంతువుల పేర్లు వాడుకోవటం వాటి మనోభావాలు దెబ్బ తియ్యడమే కాదు.. వాటి  హక్కుల ఉల్లంఘన క్రిందకి కూడా వస్తుంది."

"ఓకే. నా 'టీవీ చర్చలు ఒక కాకిగోల' స్టేట్మెంటుని వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రశ్న నేనడుగుతున్నాను. కాకులు ఎందుకని పెద్దగా కనబట్లేదు? ఏమై ఉంటాయి సుబ్బూ?"

"నాకైతే ఫ్రిజ్ లొచ్చి కాకుల్ని దెబ్బకొట్టాయని అనిపిస్తుంది."

"ఎలా?"

"సింపుల్. ఇంతకుముందు అంట్లు కడిగేప్పుడు మిగిలిన అన్నం అవతల పడేసేవాళ్ళం. కాకులకి అలా విసిరేసిన మెతుకులే విందుభోజనం. ఇప్పుడు చద్దన్నాలు ఫ్రిజ్జుల్లొ పెట్టుకుని మనమే తినేస్తున్నాం. ఇది గ్రహించిన కాకులు, మన దరిద్రానికి జాలిపడి, మన ఇళ్ళ వైపు రావడం మానేశాయి."

"అవునా సుబ్బూ!"

"అవును. కానీ కాకులు మనవైపు రాకపోతే నష్టపొయ్యేది మనమే. కాకులు కాదు. ఇంతటితో మన కాకిగోల ఆపేద్దాం."


(photos courtesy : Google)

Tuesday, 20 August 2013

జరుగుతున్న కథ


పైనేదో మర్డర్ జరిగినట్లు నెత్తుటి గడ్డలా ఎర్రగా ఉంది ఆకాశం. ఫ్యాక్షనిస్టు సినిమాల్లో విలన్ కొంపలా విశాలంగా ఉందా ఇల్లు. హాలు మధ్యనున్న ఓ పేద్ద సోఫా.. ప్రజల రక్తం తాగే దుర్మార్గపు రాజు కూర్చునే సింహాసనంలా ఉంది. దానిపైనున్న ఆకారం రావు గోపాలరావు లాంటి ఆ ఊరి ప్రెసిడెంటుది.

ప్రెసిడెంటు చుట్ట తాగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎదురుగా అల్లు రామలింగయ్య లాంటి జోగినాధం వినయంగా వంగిపోతూ నించునున్నాడు. వాతావరణం కడు గంభీరంగా ఉంది.

"జోగినాధం! ఏంటి ఊళ్ళో హడావుడి?" చుట్ట పొగ గుప్పున వదుల్తూ అడిగాడు ప్రెసిడెంటు.

ఇబ్బందిగా కదిలాడు జోగినాధం.

"చిత్తం. ఏదో చిన్నపాటి గొడవే లెండి. ఆ ఈరిగాడి కొడుకుల ఆస్థి తగాదా ఈనాటిదా? యాభయ్యారేళ్ళుగా నలుగుతుంది. తమరు ధర్మప్రభువులు.  ప్రజల కోరికపై ఎంతో ధర్మబద్దంగా ఆస్థి పంపకాలు కావించారు. ఇప్పుడా ఇల్లు తమ్ముడి వైపు పోయిందని అన్న నానా యాగీ చేస్తున్నాడు."

"అదేంటి జోగినాధం? ఈ సమస్య చాల్రోజుల్నించి పెండింగులో ఉందనీ, మనం చెప్పినట్లు నడుచుకుంటామని అన్నది వాళ్ళే కదా?" చిటపటలాడాడు ప్రెసిడెంటు.

"చిత్తం. కూలెదవలు కదండీ? పూటకో మాట మారుస్తారు. రెండ్రోజులు కడుపు కాల్తే వాళ్ళే దారికొస్తారు." భరోసాగా అన్నాడు జోగినాధం.

ఇంతలో హడావుడిగా వచ్చాడు సాక్షి రంగారావు లాంటి పంతులు.

"అయ్యా అయ్యా దొరవారు! ఘోరం జరిగిపోతుంది. రేపు రాబోయే ఎలక్షన్లో లబ్ది పొందడం కోసమే మీరు తప్పుడు తీర్పు చెప్పారని ఆ నాగభూషణం మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లా అయితే మనకి ముందుముందు కష్టమే సుమండీ." అంటూ నశ్యం ఎగబీలుస్తూ దీర్ఘం తీశాడు పంతులు.

'నువ్వు నోర్మూసుకో' అన్నట్లు పంతులు వైపు గుడ్లురుమి చూశాడు జోగినాధం. విషయం అర్ధం కాక బుర్ర గోక్కున్నాడు పంతులు.

"నాయాల్ది. ఆ భూషణం గాణ్ని యేసెయ్ మంటారా దొరా?" కర్ర తీసుకుని లేచాడు ఆర్. నాగేశ్వర్రావు లాంటి బాబులు గాడు.

"నువ్వూరుకోవో. ఎప్పుడు ఏది చెయ్యాలో అదే చెయ్యాల. ఇప్పుడు కాదు.. ముందుముందు నీకు చాలా పనుందిలే." అంటూ బాబులు గాణ్ని ముద్దుగా విసుక్కున్నాడు ప్రెసిడెంటు.

ఆపై ఆరిపోయిన చుట్ట వెలిగించుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు.

'అంటే ఊళ్ళో నాగభూషణం నాయకత్వంలో నామీదే ఎగస్పార్టీ తయారవుతుందన్న మాట. విషయం అందాకా వచ్చిందా! ఇప్పుడేం చెయ్యాలి?'

"మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మీరు వాళ్ళ గూర్చి పట్టించుకోకండి. వాళ్ళ మొహం, వాళ్ళెంతా? వాళ్ళ బతుకులెంతా?" కళ్ళజోడు పైకి లాక్కుంటూ అన్నాడు జోగినాధం .

జోగినాధం వైపు సాలోచనగా చూసాడు ప్రెసిడెంటు.

ఆ విధంగా తీవ్రంగా యోచించిన ప్రెసిడెంటు కొద్దిసేపటికి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి భయపడ్డాడు పంతులు. ప్రెసిడెంటు నవ్వులో సంతోషం లేదు. లేడిని చంపబోయ్యే ముందు పులిలో కనిపించే క్రూరత్వం ఉంది. ప్రెసిడెంటు నవ్వులో అమాయకత్వం లేదు. ముక్కుపుడక్కోసం ముక్కుపచ్చలారని చిన్నారిని నలిపెయ్యబొయ్యే కసాయివాడి కఠినత్వం ఉంది.

దొరవారు కొద్దిసేపు వారి నీచదుర్మార్గపు నవ్వు నవ్వి జోగినాధం వైపు సర్దాగా చూశారు.

"జోగినాధం! నీకో పని చెబుతున్నాను. జాగర్తగా విను. కొన్నాళ్ళపాటు నువ్వు నా గడప తొక్కరాదు." అన్నాడు ప్రెసిడెంటు.

తుఫానులో చిక్కుకుపోయిన కుక్కపిల్లలా గజగజలాడిపొయ్యాడు జోగినాధం.

"అయ్యా ఆయ్యా! తమ చల్లని పాదాల నీడన బతుకుతున్నాను. కావాలంటే ఇక్కడే ఇప్పుడే కత్తితో పొడిచేసి చంపెయ్యండి. అంతేగాని నాకంత పెద్ద శిక్ష విధించకండి." బావురుమంటూ దొరగారి కాళ్ళపై పడిపొయ్యాడు జోగినాధం.

ప్రెసిడెంటు మళ్ళీ నవ్వాడు. తన శిష్యుడైన నక్క చూపిస్తున్న వినయానికి మెచ్చిన తోడేలు నవ్వులా ఉందా నవ్వు.

"నీ స్వామి భక్తి నాకు తెలీదా జోగినాధం? అగ్గిపుల్లే కదాని ఆర్పకుండా పడేస్తే అడివంతా అగ్గెట్టేస్తది. రాజకీయాల్లో అన్ని వైపులా కాచుకుని ఉండాలి. జాగర్తగా లేకపోతే రేపా కూలెదవలే కొంప ముంచుతారు. అంచేత నే చెప్పొచ్చేదేంటంటే.. నువ్వూళ్ళోకెళ్ళి ఆ గొడవల్లో దూరు. ఆవేశపడు. అవసరమైతే నన్నో నాలుగు తిట్టు. ఏదోక రకంగా ఆ కూల్జనాల విశ్వాసం సంపాదించు. వారిపై పట్టు సంపాదించి వారికి నాయకుడివైపో, నాగభూషణాన్ని పడగొట్టెయ్."

జోగినాధం మళ్ళీ ప్రెసిడెంటు కాళ్ళ మీద పడ్డాడు.

"ఆహాహా! తమరి బుర్రే బుర్రండి. లక్షల కోట్ల ఆలోచన చెప్పారు."

"అర్ధమైందిగా జోగినాధం? ఈ ఊళ్ళో నాకు ఎగస్పార్టీ ఉండకూడదు. ఉన్నా అది నా మనిషే అయ్యుండాల. అంచేత మన ప్లాన్లో ఎక్కడా తేడా రాకూడదు. ఈ క్షణం నుండి నువ్వూ నేనూ ఎగస్పార్టీ వాళ్ళం. నీకూ నాకు మధ్యన పచ్చ గడ్దేస్తే అది సర్రున మండాలా. ఎప్పటికప్పుడు అక్కడ కూపీలన్నీ పంతుల్తో నాకు చేరెయ్యి." గర్వంగా మీసాలు దువ్వుకుంటూ అన్నాడు ప్రెసిడెంటు.

"చి.. చి.. చిత్తం" వంగివంగి నమస్కారం చేస్తూ నిష్క్రమించాడు జోగినాధం.

పంతులుకి భయం వేసింది. అతనికి భయంకర కీకారణ్యంలో, అంతకన్నా భయంకరమైన క్రూరమృగాల మధ్యన ఉన్నట్లుగా అనిపించింది.

(picture courtesy : Google)

Saturday, 17 August 2013

రూప్ తెరా మస్తానా'ఆరాధన'. ఈ సినిమా అనేక రకాలుగా ప్రత్యేకమైనది. 1969 లో హిందీ సినిమా ప్రేమికుల్ని ప్రేమ మైకంలో ముంచెత్తింది. ప్రేమ కథా చిత్రాలకి సరికొత్త ఒరవడి సృష్టించింది. ఒక సూపర్ స్టార్ ఆవిర్భానికి, ఇంకో సూపర్ సింగర్ పునర్జన్మకి కారణమైందీ సినిమా. ఈ వివరాలన్నీ ప్రత్యేకంగా ఇక్కడ నేను రాయనక్కర్లేదు. వికీ చూస్తే చాలు. తెలిసిపోతుంది.

ఈ సినిమా ఆనాడు గుంటూరు విజయలక్ష్మి థియేటర్లో అమ్మానాన్నల్తో చూశాను. హిందీ సినిమాలు నాకు ఆట్టే అర్ధం కాకపోయినా.. ఆ సినిమాలు పంచరంగుల్లో (ఆ రోజుల్లో కలర్ సినిమాల్ని అలాగే పిలిచేవాళ్ళు) ఉంటాయి కావున నాకు నచ్చేవి. పాటలు కూడా బాగుండేవి.

ఆరాధన సినిమాలో హీరోహీరోయిన్లు వర్షంలో తడుస్తారు. ఆ తరవాత చలి కాచుకుందుకు మంట వేసుకుంటారు. అప్పుడు 'రూప్ తెరా మస్తానా' అనే పాట ఫుల్ స్వింగులొ మొదలవుతుంది. పాట విండానికి చాలా బాగుంటుంది. కానీ విషయమే అర్ధం కావట్లేదు. ఆ అబ్బాయి అమ్మాయి కళ్ళల్లోకి అదేపనిగా ఎందుకలా చూస్తున్నాడు? ఆ అమ్మాయి అతన్నుండి ఎందుకలా చూపు తిప్పుకుంటుంది? హాల్లో జనాలేమో వేడి నిట్టూర్పులు. అసలేం జరుగుంతుందిక్కడ? ఏంటో, ఏమీ తెలిసి చావట్లేదు.

అందుకే ఈ విషయాన్ని అమ్మనడిగాను. అమ్మ కసురుకుంది.

"నోర్మూసుకుని సినిమా చూడు. నీవన్నీ దరిద్రపు డౌట్లు."

నా డౌటు అమ్మ దృష్టిలో ఎందుకంత దరిద్రపుదయిందో కొన్నేళ్ళకి గానీ అర్ధం కాలేదు! ఇట్లాంటి అడగకూడని ప్రశ్నలు వేసి అమ్మని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. ఇదే తరహా సీన్ ఆ తరవాత ప్రేమనగర్ అనే తెలుగు సినిమాలో కూడా చూశాను. కనీసం డౌట్ కూడా రానంతగా చండాలంగా ఉంటుందా సీన్!

కొన్ని పాటలు కొన్నాళ్ళు బాగుంటాయి. ఇంకొన్ని పాటలు చాన్నాళ్ళు బాగుంటాయి. అరుదుగా మరికొన్ని పాటలు ఎప్పుడు విన్నా బాగుంటాయి. అత్యంత అరుదుగా అతికొన్ని పాటలు విన్నకొద్దీ ఇంకాఇంకా బాగుంటాయి. స్కాచ్ విస్కీకి లాగా వీటి విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. 'రూప్ తెరా మస్తానా' స్కాచ్ విస్కీ కెటగిరీలొకి వస్తుందని నా అభిప్రాయం.

ఈ పాట రికార్డ్ చేసి నాలుగు దశాబ్దాలు దాటింది. SD బర్మన్ కి మాత్రమే ఈ పాటకి ఇంత గొప్ప ట్యూన్ ఇవ్వగలడు. కిశోర్ కుమార్ మాత్రమే ఈ పాటని ఇంత అద్భుతంగా పాడగలడు. ఆ రోజుల్లోని సంగీత దర్శకులు, గాయకులు గొప్ప ప్రతిభావంతులనే విషయం చెప్పడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. వినికిడి సరీగ్గా ఉంటే చాలు. అందుకే నేనా విషయాల జోలికి పోను.

ఆనాడు ఈ పాట కోసం వాడిన musical instruments చాలా ఆధునికమైనవి. ఆర్కెస్ట్రేషన్ కూడా ఈరోజే రికార్డ్ చేశారా అన్నంత ఫ్రెష్ గా ఉంటుంది. అంచేత ఆ రోజుల్లో ఈ పాట 'వెల్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్' అనిపిస్తుంది. ఇది నాకు ఆసక్తిని కలిగించింది. అప్పటిదాకా లెక్కలేనన్నిమెలోడీల్ని అలవోకగా మన మీదకి వదిలిన సంగీత గని SD బర్మన్, ఉన్నట్లుండి ఇంత మోడర్న్ పాట ఎలా చెయ్యగలిగాడు? ఇదేదో ఆలోచించదగ్గ విషయమే!

అందువల్ల ఈ పాట మీద రీసెర్చ్ మొదలెట్టాను. ఆరాధన సమయానికి SD బర్మన్ వృద్ధుడు. కావున ఆ సాక్సఫోన్లు, కాంగో డ్రమ్స్ ఆయనకి అంతగా పరిచయం ఉండకపోవచ్చు. ఎవరో కుర్రాడు ఈ పాటకి ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసి ఉంటాడు. ఎవరా కుర్రవాడు? ఇంకెవరు? RD బర్మన్. అవును. ఈ పాట ఇంత బాగా రావడానికి కారకుడు జూనియర్ బర్మన్ అయ్యుంటాడు.

సీనియర్ (తండ్రి) డాక్టర్లు ఆపరేషన్లు చేసేప్పుడు జూనియర్ (కొడుకు) డాక్టర్ల సహకారం తీసుకుంటారు. ఇందుకు కారణాలు రెండు. ఒకటి తమ పని భారం తగ్గించుకోవడం, రెండు కొడుక్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఇదే ప్రిన్సిపుల్ బర్మన్ ద్వయానిక్కూడా ఎందుకు వర్తింప చెయ్యరాదు? యురేకా! ఎంత గొప్ప ఇన్వెన్షన్! శభాష్! ఎంతైనా నేను చాలా తెలివైనవాడిని.
ఒకసారి సినీ సంగీత విమర్శకులు VAK రంగారావు గారితో చాలాసేపు కబుర్లు చెప్పే అదృష్టం నాకు కలిగింది. ఆయన సి. రామచంద్రకి వీరాభిమాని. SD బర్మన్ కి అభిమాని. ఆయన బర్మన్ సంగీత ప్రతిభ గూర్చి ఆనందంగా చెబుతుండగా.. నేను వెంటనే నా బర్మన్ నాలెడ్జ్ దుమ్ము దులిపాను (హమ్ కిసీ సే కమ్ నహీ).

"రూప్ తెరా మాస్తానా పాట  అంత గొప్పగా రావడానికి కారకుడు పంచమ్. సచిన్ దా కి ఆధునిక వాయిద్యాలపై అంతగా.. "

అయన నా మాటకి అడ్డు తగిలాడు.

"ఎవరు చెప్పారు?"

"ఎవరూ చెప్పలేదు. నేనే కనుక్కున్నాను." గర్వంగా చెప్పాను.

"యు ఆర్ రాంగ్. ఆ పాటలో RD కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఉంది. కానీ SD సంగీత జ్ఞానం ముందు RD ఒక లిల్లీపుట్."

నాకు రంగారావు గారు చెప్పేది అర్ధం కాలేదు. కానీ ఆయన నా పరిశోధనని తప్పు పట్టడం నచ్చలేదు.

"పంచమ్ లిల్లీపుట్ కావచ్చు. కానీ ఆ డ్రమ్స్.. " చెప్పబోయ్యాను.

"మీరు చెబుతున్న ఆ 'గొప్ప' సంగీత వాయిద్యాలని అక్కడ, అలా ప్రయోగింప చేసింది SD బర్మన్. ఆయనకి ఇష్టం లేకపోతె RD బర్మన్ చెయ్యగలిగిందేమీ లేదు. SD బర్మన్ ఈజే జీనియస్." గట్టిగా బల్ల గుద్దినట్లు అన్నారు రంగారావు గారు.

ఇప్పుడర్ధమైంది. ఈయన RD బర్మన్ కి ఈ పాటలో పైసా వాటా కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అంచేత ఆయన SD బర్మన్ అభిమానాన్ని ఆయనకే ఉంచేసి నా రీసెర్చ్ ఫైండింగ్ నా దగ్గరే ఉంచేసుకున్నాను.


యూట్యూబ్ నుండి ఆ పాట ఇస్తున్నాను. ఎంజాయ్ ద సాంగ్.
(photos courtesy : Google) 

Monday, 12 August 2013

ఎందుకిలా జరిగింది?


ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వ్యక్తి కన్నా సమాజం గొప్పది. ఏ వ్యవస్థకైనా సర్వకాల, సర్వావస్థలలో సమాజహితం మించిన పరమార్ధం లేదు. అలాగే రాజకీయాలు వ్యక్తి మనుగడకి, సమాజ పురోగతికి నిరంతరంగా దోహదపడుతూ ఉంటాయి.. ఉండాలి కూడా. ఏ దేశంలోనైనా రాజకీయాలకి ఇంతకు మించిన పవిత్ర కార్యాచరణ మరొకటి లేదు.

అమెరికావాడు అందలంలో విహరించినా, ఆఫ్రికావాడు అడుక్కు తింటున్నా అందుకు కారణం రాజకీయాలే. రాజకీయాలు రెండే రకాలు. ఒకటి ప్రజలకి మంచి చేసేవి, రెండు ప్రజలకి చెడు చేసేవి. ఇవన్నీ చాలా ప్రాధమికమైన విషయాలైనా, ప్రస్తుతం ఆంధ్రదేశంలో గోడల మీద రాసుకునే సుభాషితాల స్థాయికి దిగజారిపొయ్యాయి. ఏ సమాజానికైనా ఇంతకు మించిన విషాదం మరొకటి ఉంటుందనుకోను.

ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో (చాలామంది) తెలంగాణా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని గట్టిగా నమ్ముతున్నారు. మంచిది. డిసెంబర్ తొమ్మిది ప్రకటన లాగానే ఆచరణలో ఆగిపోయిందనే అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? తెలంగాణావారు ఖచ్చితంగా ఊరుకోరుగదా. వాళ్ళు మళ్ళీ ఉద్యమం మొదలెడతారు. అంటే పరిస్థితి కొద్దిరోజుల క్రితం జరిగిన CWC ప్రకటన స్థితికి వెళ్తుందే గానీ.. 1956 పరిస్థితి మాత్రం రాదు.

ఇప్పుడు ఇంత తీవ్రంగా స్పందిస్తున్న మన కోస్తాంధ్ర ప్రజలు ఆనాడు అవసమైనప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈ ప్రశ్న నన్ను వేధిస్తుంది. తెలంగాణా ఏర్పాటే మా ఏకైక లక్ష్యం అంటూ ఏర్పడ్డ ఒక రాజకీయ పార్టీతో ఒకసారి కాంగ్రెస్, ఇంకోసారి తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నప్పుడు మనం నిద్ర పొయ్యామా? ఈ రెండు ప్రధాన పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణా అంశం చొప్పించినప్పుడు మనం పెద్దగా పట్టించుకోలేదెందుకు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల మ్యానిఫెస్టోలు, పొత్తులు ఒక రాజకీయ అంగీకారానికి అత్యంత ముఖ్యమైనవని ఆనాడు ఎందుకు మర్చిపొయ్యాం? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి, మన ప్రాంత ప్రయోజనాలకి దెబ్బగొట్టే విధంగా అవతలవారితో అవగాహన కలిగించుకుంటున్నప్పుడు మనం ఎందుకు ప్రశ్నించలేదు? పైగా తెలంగాణావారి ఓట్లు దండుకోడానికి మన నాయకుడు వేసిన చాణక్యుని ఎత్తుగడగా, గొప్ప రాజకీయ క్రీడగా మురిసిపోలేదా? అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలని మనం పట్టించుకోలేదన్న మాటేగా?

ఇప్పుడు రోడ్ల మీద కొచ్చిన వారు 'హైదరాబాదు మాది. దాన్ని మేమే అభివృద్ధి చేశాం.' అంటున్నారు. ఆ అభిప్రాయం కలిగి ఉండటం ఎంతమేరకు సబబు అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. ఇప్పుడు హైదరాబాద్ మీద ప్రేమ కలిగి ఉన్నవారికి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో ఎంతోవేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటే (రాజకీయంగా ఒక్కో అడుగు తెలంగాణా వైపు పడుతుంటే) మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? కనీసస్థాయిలో కూడా (కేంద్రప్రభుత్వానికి ఒక హెచ్చరికగా) ఉద్యమం ఎందుకు చెయ్యలేదు? నాయకులపై, వారి లాబీయింగ్ పై (ప్రజాస్వామ్యంలో 'లాబీయింగ్' అన్నది ఒక నీచమైన పదం) అచంచల విశ్వాసంతో మొద్దునిద్ర పోవడం ఏరకమైన రాజకీయ కార్యాచరణ?

'ఒక పార్టీ అధికారంలో రావడానికో, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికో మా హైదరాబాదు విషయంలో మేం రాజీపడే ప్రసక్తి లేదు. హైదరాబాద్ మాది. ఈ హైదరాబాదు అంశంపై మాకు ఖచ్చితమైన హామీ ఇస్తేనే మీకు మా ఓటు. లేదా మీరూ, మీ నాయకులు పొయ్యి ఏ గంగలోనైనా దూకండి.. మాకనవసరం.' అనే స్పష్టమైన వైఖరి మొదట్నుండి తీసుకుని ఉండాల్సింది. సీట్ల కోసం తెలంగాణావాద పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకి మన ఆంధ్రా ప్రాంతంలో డిపాజిట్లు కూడా రాకుండా చేసి చుక్కలు చూపించి ఉండాల్సింది. డెమాక్రసీలో ఓటుతోనే కదా బుద్ధి చెప్పేది? మనకి ఇంతకు మించి వేరే మార్గం ఉందా?

ఆ రకంగా చేసినట్లైతే దేశానికి, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చి ఉండేవాళ్ళం కాదా? ('హైదరాబాదు విషయంలో ఆంధ్రావారితో రాజకీయం చేస్తే మాడు పగులుతుంది' అని). రాజకీయ పార్టీలు శూన్యంలో రాజకీయాలు చెయ్యవు. వారికి మన ప్రాంతప్రజల ఆకాంక్ష కుండ బద్దలు కొట్టినట్లు అర్ధమైనట్లయితే, వారి వ్యూహప్రతివ్యూహాలు అందుకు తగ్గట్టుగా రచించుకునేవారు. కానీ మనం ఏనాడూ అటువంటి స్పష్టమైన, నిర్దిష్టమైన పొలిటికల్ మెసేజ్ ఏ ఎలక్షన్లోనూ ఇవ్వలేదు. పైగా తెరాసతో పొత్తు పెట్టుకున్న పార్టీలక్కూడా దండిగా సీట్లు కట్టబెట్టాం.

'లేదు. లేదు. కేంద్రం తెలంగాణా ఇస్తుందని మేం అనుకోలేదు. అందుకే ఖాళీగా ఉన్నాం.' అంటే దాన్ని రాజకీయ అలసత్వం అంటారు. రాజకీయంగా ఏదీ 'అనుకోరాదు'. ముందే నిరసన తెలిజేస్తూ ఉండాలి. అదొక పవిత్రమైన విధి. అలా చెయ్యకపోవటం వల్లనే ఇప్పుడు నష్టం జరిగింది. అందుకే ఎవరైనా, ఎక్కడైనా తమ రాజకీయ అభిప్రాయాల్ని (మన హక్కులకి భంగం కలుగుతుందని అనుమానం కలిగినా చాలు) వీలైనంత గట్టిగా, బలంగా ప్రపంచానికి తెలియజెయ్యాలి. అలా చెయ్యకపోతే మన భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి.

మన ఆంధ్రా ప్రాంతం వాళ్ళు పార్టీలకి అతీతంగా ఎప్పుడైనా అట్లాంటి కార్యక్రమాలు చేశారా? చెయ్యలేదని నేను అనుకుంటున్నాను ( ఏం చేసినా మన నాయకులకి కలిగే లాభనష్టాలు లెక్కలెసుకునే చేశాం). చెయ్యవలసినప్పుడు ఏమీ చెయ్యకుండా ఆలస్యంగా మేలుకోవడం.. ఇల్లు కాలుతున్నప్పుడు ఫైర్ ఇంజన్ కోసం హైరానా పడటం వంటిది. అసలు ఇల్లే అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లైతే ఈనాడు మనకీ దుస్థితి దాపురించేది కాదు. పరిస్థితి ఇంత అగమ్యగోచరంగా ఉండేదికాదు.

(photo courtesy : Google)

Saturday, 10 August 2013

ఇంకా పాత పాటేనా!


"నువ్వు నేరం చేశావని నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా?" జడ్జి సార్వభౌమరావు కళ్ళద్దాల్లోంచి ముద్దాయిని చూస్తూ అడిగాడు.

అదొక క్రిమినల్ కేసు. ఆ కేసు విచారణ చాలా రోజులపాటు సాగింది. నిందితుడు సుబ్బయ్య. ప్రముఖ క్రిమినల్ లాయర్ మూర్తి డిఫెన్సు తరఫున వాదించాడు. ఆవేశంగా, బలంగా బల్ల గుద్ది మరీ కేసు వాదించాడు మూర్తి. ప్రాసిక్యూషన్ చార్జ్ షీటు పకడ్బందీగా ఫైల్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఎంతో పట్టుదలగా వాదించాడు. అనేక మంది సాక్షులు ఎక్జామినేషన్, క్రాస్ ఎక్జామినేషన్ చెయ్యబడ్డారు. ప్రాసిక్యూషన్, డిఫెన్సుల వాదప్రతివాదాలతో కోర్టు గదంతా సెగలుపొగలు గక్కింది!

జడ్జి గారి 'గిల్టీ' అన్న తీర్పు వినంగాన్లే నిందితుడు సుబ్బయ్య హతాశుడయ్యాడు. దిగాలుగా తన ప్లీడరు కేసి చూశాడు. ప్లీడర్ మూర్తి తన జూనియర్తో కాజువల్ గా ఏదో మాట్లాడుతున్నాడు. సుబ్బయ్యకి ఇప్పుడు విషయం బోధపడింది. తను మోసపొయ్యాడు. ఈ కేసులో మొదట్నుండి తనకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. సాక్షులు సాక్ష్యం చెప్పినప్పుడే జడ్జి సార్వభౌమరావు తనని నేరస్తుడని నమ్మేసి ఉంటాడు. మరిన్నాళ్ళు ఈ డిఫెన్సు ప్లీడరు అంతలా బల్ల గుద్దుతూ వాదించాడెందుకు? కేసులో పస లేదని.. ఖచ్చితంగా మనమే గెలుస్తామని నమ్మ బలికాడెందుకు?

నీకు శిక్ష పడే అవకాశం ఉంది. అని సూచనాప్రాయంగానైనా వాస్తవం చెప్పినట్లైతే మానసికంగా సిద్ధపడి ఉందునే! ఎంతో నమ్మాను. అడిగినంత ఫీజూ ఇచ్చాను. అయినా తనకి అసలు విషయం చెప్పకుండా కథ నడిపాడే! ఇది నమ్ముకున్న క్లయింటుని నట్టేట ముంచడం కాదా?

జడ్జి సార్వభౌమరావు సుబ్బయ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ అడిగాడు.

"నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా?"

సుబ్బయ్య తన ప్లీడర్ వంక చూశాడు. ప్లీడర్ మూర్తి ముఖం అటువైపు తిప్పుకున్నాడు.

"ఉందయ్యా" చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు ముద్దాయి.

"చెప్పు" అడిగారు జడ్జ్ గారు.

"నేను అమాయకుడిని. నాకేం తెలీదు" స్థిరంగా అన్నాడు సుబ్బయ్య. ఆ ముక్క అక్కడ ఆ బోన్లో నిలబడి అలాగే అనడం సుబ్బయ్యకి వందోసారి.

జడ్జి సార్వభౌమరావు మొహం చిట్లించారు. ఆపై విసుక్కున్నారు. ఆ తరవాత హడావుడిగా తీర్పు చదివి వినిపించారు. శిక్ష విని ఖిన్నుడయ్యాడు సుబ్బయ్య. సుబ్బయ్యపై పెట్టిన సెక్షనుకది గరిష్టమైన శిక్ష. ఆకాశం విరిగి మీద పడినట్లు, విచ్చుకున్న భూమిలో కూరుకుపోయి పాతాళానికి జారిపోతున్నట్లుగా అనిపించింది సుబ్బయ్యకి.

సుబ్బయ్య దూరపు బంధువు కాంతయ్య. అతనికి కోర్టు వ్యవహారాల్తో పరిచయం ఉంది.

"ఏం సుబ్బయ్య? జడ్జి గారు ఏదైనా చెప్పుకొమ్మన్నప్పుడు నీ మీద ఆధారపడి అనేకమంది ప్రాణాలున్నాయని చెప్పొచ్చుగా. కనీసం చావుబతుకుల మీదున్న మీ నాన్న గూర్చైనా ఒకముక్క చెబితే శిక్ష తగ్గించి చెప్పేవాడుగా?" అడిగాడు కాంతయ్య.

"అలా బ్రతిమాలాలని నాకు తెలీదు సుబ్బయ్య మావా. మా ప్లీడరు ఒక్కమాట మీదనే ఉండమన్నాడు." దీనంగా అన్నాడు సుబ్బయ్య.

కాంతయ్యకి సుబ్బయ్యని చూసి జాలేసింది.

"నీకు నీ ప్లీడరు సరైన సలహా ఇవ్వలేదు సుబ్బయ్యా. నేను నిరపరాధిని అనే మాట కేసు వాదనలు నడుస్తున్నప్పుడు మాత్రమే పదేపదే చెప్పాలి. ఎప్పుడైతే జడ్జి నువ్వు నేరస్తుడవన్నాడో అప్పుడు నీ 'నిరపరాధి' అన్నమాటకి చెల్లు చీటీ వచ్చేసింది. కోర్టువారు సెక్షన్ల బట్టి శిక్ష వేస్తారు. అయితే ఆ సెక్షన్లోనే ఎంత శిక్ష వెయ్యొచ్చునో జడ్జికి విచక్షణాధికారం ఉంటుంది. అందువల్ల జడ్జిని తక్కువ శిక్ష వెయ్యమని ప్రాధేయపడినట్లైతే తగ్గించేవాడు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ అమాయకుణ్ణి అంటూ పాత పాట ఎత్తుకున్నావో.. అప్పుడు జడ్జి నీకిచ్చిన అవకాశం కోల్పోయావు. ఒక రకంగా జడ్జి తీర్పుని నువ్వు తప్పు పట్టావు. అందుకే ఆయన అంత చిరాకు పడ్డాడు." విడమర్చాడు కాంతయ్య.

"అసలిదంతా ఆ ప్లీడరు మూర్తి చేసిన మోసం. తప్పకుండా మనమే గెలుస్తాం. నువ్వు మాత్రం అమాయకుణ్ణి, నాకేం తెలీదు అన్న మాట మీదే నిలబడు అన్నాడు" పళ్ళు కొరికాడు సుబ్బయ్య.

 కాంతయ్య దీర్ఘంగా నిట్టూర్చాడు.

చివరి మాట :

ఈ బుల్లి రాతలో పాత్రల పేర్లన్నీ రావిశాస్త్రి రచనల నుండి తస్కరించబడినవి.

(అందుకు నాకు బహు ఆనందముగా యున్నది.)

సుబ్బయ్య : అల్పజీవి
సార్వభౌమరావు : నిజం
ప్లీడరు మూర్తి : మాయ
కాంతయ్య : బల్ల చెక్క

కృతజ్ఞతలు :

ఆప్తమిత్రుడు మరియూ హైకోర్టు న్యాయవాది అయిన గోపరాజు రవితో నిన్న ఫోన్లో కొద్దిసేపు మాట్లాడాను. దాని ఫలితమే ఈ పోస్టు.

చివరి తోక :

ఈ పోస్టు చదువుతున్నప్పుడు ఇవ్వాల్టి ఆంధ్రా రాజకీయాలు గుర్తొస్తే సంతోషం.

(photo courtesy : Google)

Thursday, 8 August 2013

ఘంటసాల = మొహమద్ రఫీ


మంచి పాట అనగానేమి? నాకు తెలీదు. అయితే మంచి పాటలకి రంగు, రుచి, వాసన ఎలా ఉంటాయో మాత్రం తెలుసు. అవన్నీ ఒక్క ఘంటసాల పాటల్లోనే ఉంటాయి. పోస్టు కార్డు మీద మా ఇంటి ఎడ్రెస్ ఎంత ఖచ్చితంగా రాయొచ్చో.. అంతే ఖచ్చితత్వంతో మంచి పాటలకి కేరాఫ్ ఎడ్రెస్ ఘంటసాల అని రాయొచ్చునని నమ్ముతున్నాను.

నాకింకో నమ్మకం కూడా ఉంది. సంక్రాంతి పండక్కి అమ్మ చేసే అరిసెలు అత్యంత రుచికరంగా ఉంటాయి. అవి తింటుంటే 'జీవితమే మధురము' అనిపించేది. అప్పటికి నాకు పీచు మిఠాయి, సాయిబు కొట్లో నిమ్మ తొనల రుచి కూడా పరిచయమే గానీ.. అవేవీ అరిసెలకి సరి రావు. అందువల్ల సృష్టిలో అరిసెల కన్నా రుచికరమైనదేదీ లేదని గట్టిగా నమ్మాను.

ఒక విషయాన్ని తిరుగులేని వాస్తవంగా అంగీకరించినప్పుడు.. ఇంకే విషయాన్ని ఒప్పుకోటానికి ఇష్టపడం. ఇందుకు కారణం మన అభిప్రాయమే నిజమైనది అనే ఆత్మవిశ్వాసం లేదా అహంకార పూరిత అజ్ఞానం కారణం కావచ్చు. నాకీ రెండూ మెండుగా ఉన్నాయి కావున.. ఈ భూమండలము నందు ఘంటసాల దరిదాపుల్లోకొచ్చే గాయకుడు లేడనీ.. అమ్మ చేతి వంటతో పోల్చదగిన మధురమైన వంటకం మరేదీ లేదనీ (బల్ల గుద్దకుండానే) వాదించేవాణ్ని.

ఇలాంటి స్థిరమైన అభిప్రాయంతో ప్రశాంతంగా జీవిస్తున్న నా జీవితంలో ఓ రోజు ఉన్నట్లుండి కలకలం రేగింది. ఒక (శుభ) దుర్దినాన నాన్న బజార్నుండి నేతి మైసూరుపాకం కొనుక్కొచ్చాడు. ఘుమఘుమలాడుతున్న ఆ మైసూరుపాకం నుండి ఒక ముక్క తుంచి నా నోట్లో పెట్టింది అమ్మ. ఏమి ఈ రుచి! ఇంత అద్భుతముగా యున్నదేమి! నా ప్రమేయం లేకుండానే మైసూరుపాకం ముక్క నోట్లో కరిగిపోయి పొట్టలోకి జారిపోయింది. అదంత తొందరగా కరిగిపోయినందుకు మిక్కిలి విచారించాను. ఇంకోముక్క నోట్లో వేసుకున్నాను. ఈ సృష్టిలో ఇంత గొప్ప రుచి ఉన్నట్లు ఇన్నాళ్ళు నాకెందుకు తెలీలేదు? తెలీనందుకు కించిత్తు చింతించాను. అటు తరవాత మైసూరుపాకం నాకిష్టమైన పదార్ధాల లిస్టులోకొచ్చి చేరింది.

నా చిన్నప్పుడు బావిని, బావిలో నీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. భూమికి బొక్క పెడితే నీళ్ళెందుకొస్తాయబ్బా! అని తీవ్రంగా ఆలోచించేవాడిని. అమ్మ నీళ్ళు తోడుతున్నంతసేపు ఆ బావిలో నీళ్ళని చూస్తూ సంబర పడుతుండేవాణ్ని. ఒకసారి రామకోటి ఉత్సవాల సందర్భంగా అగ్రహారంలో ఉన్న రామనామ క్షేత్రంకి వెళ్లాను. అక్కడ అందరూ దేవుడికి మొక్కుతుంటే.. నేను మాత్రం గుడి మధ్యలోనున్న కోనేరుని ఆశ్చర్యంగా చూస్తుండిపొయ్యాను. ఒక్కసారిగా వంద బావులు కలిపి చూసిన భావన కలిగింది.. భీతి కూడా కలిగింది. అందుకే అమ్మ చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాను.

ఆ తరవాత కృష్ణ పుష్కరాలకి బెజవాడ వెళ్లాను. అక్కడ కృష్ణానదిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపొయ్యాను. ఈ ప్రపంచంలో ఇన్ని నీళ్ళున్నాయా! నాకు కృష్ణమ్మ సృష్టిలోని అనంత జీవకోటికి తల్లిగానూ.. స్నానమాచరిస్తున్న భక్తులు ఆవిడ బిడ్డల్లాగానూ అగుపించారు. నాకానాడు ఒక సత్యం బోధపడింది. ఈ అనంతవిశ్వంలో మనం రేణువులం మాత్రమే. మనం బ్రతకడం కోసం దేవుడే నీరు, నిప్పు, ఆహారం.. ఇత్యాది రూపాల్లో మనకి అందుబాటులో ఉంటాడు.. కనిపెట్టుకునీ ఉంటాడు.. వెధవ్వేషాలేస్తే బుద్ధీ చెబుతాడు.


నేను మొదటిసారి మైసూరుపాకం తిన్నపుడు, మొదటిసారి కృష్ణానదిని చూసినపుడు కలిగిన అనుభూతే.. ఆ తరవాత మొదటిసారి మొహమద్ రఫీ పాట విన్నప్పుడు కలిగింది. చాలా ఏక్సిడెంటల్ గా మొహమద్ రఫీ వినడం తటస్థించింది. అది బైజూ బావ్రా సినిమాలోని 'ఓ దునియా కే రఖ్ వాలే' పాట. పరాకుగా వినడం మొదలెట్టిన నేను.. కొన్ని క్షణాల తరవాత ఆసక్తిగా వినడం మొదలెట్టాను. పాట వింటున్నకొద్దీ ఆర్ద్రతకి గురైనాను. సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు. ఆ రాళ్ళ సంగతేమో కానీ నేను మాత్రం పూర్తిగా కరిగి నీరైపొయ్యాను. సంగీతంలో ఓనమాలు కూడా తెలీని నేను అంతటి భావోద్వేగానికి గురవ్వడం నాకే ఆశ్చర్యం కలిగించింది.

ఆ రోజు రఫీ నాలో కలిగించినవ అలజడి ఇంతంత కాదు. అంతలోనే ఏమూలో ఒక చిన్న అనుమానం. స్వీట్ల దుకాణంవాడు రుచి కోసం ఇచ్చే శాంపిల్ ముక్క మంచిది ఇస్తాడు. తీరా ప్యాక్ చేసేప్పుడు నాసిరకం సరుకు కట్టి మోసం చేస్తాడు. ఆ మోసం ఇంటికెళ్ళి చూస్తేగానీ అర్ధం కాదు. అంచేత అనుమాన నివృత్తి కోసం రఫీ పాడిన మరికొన్ని పాటలు విన్నాను. సందేహం లేదు.. ఈ రఫీ సామాన్యుడు కాదు. ఇతగాడు మన ఘంటసాల సహాపంక్తిన కూర్చుండబెట్టడానికి అన్ని విధాల అర్హుడు.

అటుతరవాత నాలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. ఈ ప్రపంచంలో కృషి ఉంటే ఏదైనా సాధించగలం అంటారు. కానీ కృషి ఉన్నా సాధించలేనివి కొన్ని ఉన్నాయి. దాన్నే వృధాప్రయాస అని కూడా అంటారు. సముద్రంలో నీటిని కొలవలేం. ఆకాశానికి హద్దు కనుక్కోలేం. ఘంటసాల, రఫీల ప్రతిభని అంచనా వెయ్యలేం. ఇవన్నీ చెయ్యబూనటాన్నే 'వృధాప్రయాస' అంటారని అనుకుంటున్నాను.


నీలాకాశం, చల్లని వెన్నెల, చిరుజల్లు, కోయిలమ్మ గానం, పసివాని నవ్వు.. ఇవన్నీ సృష్టిలో భగవంతుని అద్భుతాలు. వీటిని ఆస్వాదించడానికి టైం లేనివాడు బ్రతికి ప్రయోజనం లేదు. తుచ్చమానవజాతి యొక్క బ్రతుకు ఎడారిలో ఇసక కొండల్లా నిస్సారంగా, నిస్తేజంగా మారిపోయ్యే ప్రమాదాన్ని నివారించడానికి ఆ దేవుడిచే మనకోసం పంపబడ్డ 'గంధర్వులు ఆన్ స్పెషల్ డ్యూటీ' రఫీ అండ్ ఘంటసాల అని నా నమ్మకం.

వీళ్ళిద్దరూ సినిమాల్లో పాడినందుకు నిర్మాతల దగ్గర ఏంత సొమ్ము తీసుకున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం వారికి ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనంతగా ఋణపడిపోయాను. సైకియాట్రిస్టులు మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు మార్గాలు ఎంచుకోమంటారు. రఫీ, ఘంటసాలల పాటలు వింటూ ఉండడం అనేది మానసిక ప్రశాంతతకి నేషనల్ హైవే వంటిదని నమ్ముతున్నాను.

నువ్వు చక్కగా చదువుకున్నావా? గుడ్. మంచి ఉద్యోగం చేస్తున్నావా? వెరీ గుడ్. సమాజహితం గూర్చి కూడా ఆలోచిస్తున్నావా? వెరీవెరీ గుడ్ (అనాదిగా మంచి చదువుతో సమాజహితానికి లంకె కుదురుతుంది గానీ 'మంచి' వ్యాపారంతో లంకె కుదరదు). నువ్వు ఘంటసాల, రఫీల పాటలు వినడం లేదా? అయితే నీ బ్రతుకు వృధా. అర్జంటుగా ఎందులోనన్నా దూకి చావు!


ఇప్పుడు నన్నెంతగానో  ఆనందింపచేసిన 'బైజూ బావ్రా' పాట గూర్చి రాస్తాను. నౌషాద్ సంగీతం వహించిన ఈ సినిమా 1952 లో విడుదలైంది. భరత్ భూషణ్, మీనాకుమారి హీరో హీరోయిన్లుగా చేశారు. (కొంతకాలం పాటు బైజూ బావ్రా అనేది మన జయభేరి సినిమాకి హిందీ వెర్షన్ అనే భ్రమలో ఉన్నాను).

అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్ సేన్. ఆ రాజ్యంలో తాన్ సేన్ అనుమతి లేనిదే ఎవరూ పాడరాదు. అలా పాడినందున బైజూ తండ్రిని భటులు కొడతారు. ఎప్పటికైనా తాన్ సేన్ మీద ప్రతీకారం తీర్చుకోమని బైజూని కోరుతూ తండ్రి మరణిస్తాడు. బైజూ ఒక పడవ నడిపేవాని కూతురు గౌరీ (మీనాకుమారి) తో ప్రేమలో పడతాడు. బైజూ సంగీత గురువు తన శిష్యుడు శోకంతో ఉన్నప్పుడు అద్భుతంగా పాడటం గమనిస్తాడు. బైజూని వెతుక్కుంటూ వచ్చిన గౌరీని పాము కాటేస్తుంది.

గౌరీ మరణించిందనుకుని దుఃఖంలో దేవుణ్ని ఉద్దేశిస్తూ పాడటం మొదలెడతాడు బైజూ. గొప్ప కళాకారుల జీవితాలకి కష్టాలు, కన్నీళ్లు అంటిపెట్టుకునుంటాయి. బహుశా ఇదొక ఆనివార్యమైన స్థితేమో. (రాజుల మెప్పు కోసం రాజప్రసాదాల్లో మంద్రస్థాయిలో శాస్త్రీయ కూనిరాగాలు తీసే కడుపునిండిన కళాకారులు ఇందుకు మినహాయింపు).

మీరు నేను "నందుని చరిత - ఘంటసాల ఘనత" అంటూ రాసిన పోస్ట్ చదివే ఉంటారు. అక్కడ కాశీ కూడా అంతే! ఆవేశం, ఆవేదన కలిగి గొంతు పగల కొట్టుకుంటూ పాడతాడు. ఇక్కడ బైజూ కూడా దుఃఖంతో రోదిస్తూ పాడిన పాట 'ఏ దునియా కె రఖ్ వాలే'. దేవుణ్ని వేడుకుంటూ, కించిత్తు నిందిస్తూ, రోదిస్తూ.. పిచ్చివాడిలా (అన్నట్లు 'బావ్రా' అంటే పిచ్చివాడు అని అర్ధం) తిరుగుతూ పాడిన పాట ఇది.

ఇంతకుముందు "మధుబాల డార్లింగ్" అనే పోస్టులో 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అనే పాటకి నేను చేసిన అనువాదంలో చాలా తప్పులు దొర్లాయి. అందుకు కారణం నెట్లో ఆ పాటకి ఇచ్చిన ఆంగ్ల అనువాదం! అసలు భాష తెలీకుండా కొసరు భాషలోంచి తర్జుమా చేస్తే ఇట్లాంటి అనర్ధాలే సంభవిస్తాయి. కావున ఈసారి తెలుగు అనువాదం చేసే సాహసం చెయ్యను. మీరే అర్ధం చేసుకొండి.


ఇప్పుడు నౌషాద్ ఆలి గూర్చి రెండు ముక్కలు. నౌషాద్ మనం మెచ్చిన అనేకమంది సంగీత దర్శకులకి అభిమాన సంగీతకారుడు. ఉదాహరణకి మన ఎస్. రాజేశ్వరరావుకి నౌషాద్ అంటే అమితమైన ఇష్టం. నౌషాద్ బాణీలు ఎక్కువగా శాస్త్రీయ సంగీత వరసల్ని ఆధారం చేసుకుని ఉంటాయి. నౌషాద్ సంగీతంలో నాకు మరీమరీ నచ్చే అంశం ఆయన orchestration. ఆయన వాడే ప్రతి instrument గాయకుల గొంతుతో (vocals) పెనవేసుకుపోతుంది. ఇది నాకు చాలా విశేషంగా తోస్తుంది. ఈ పాట జాగ్రత్తగా వింటే మీరు కూడా నా పాయింట్ ఒప్పేసుకుంటారు.

'బైజూ బావ్రా' లోని ఈ పాట స్థాయి భారతదేశంలో అతితక్కువ పాటలకి మాత్రమే ఉందని నా నమ్మకం. ఈ పాట ఇక్కడ ఇస్తున్నాను. ఎంజాయ్ ద సాంగ్.(photos courtesy : Google)

Monday, 5 August 2013

ఎందుకు?


హైదరాబాదు మన కోస్తా ప్రాంతం నుండి విడిపోయినందుకు మనం చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నాం. అందుకే మన కుర్రాళ్ళు రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. ఆవేశంతో ఊగిపోతూ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఈ చైతన్యం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది.

మన ప్రజలు, మన ప్రాంతం, మన భాష అంటూ ఆలోచిస్తూ.. నష్టం జరిగిందని భావిస్తే రియాక్ట్ అవ్వడం చాలాచాలా మంచిది (అది ఎంత ఆహేతుకమైనా ఆ స్పాంటేనియస్ రియాక్షన్ ని నేను సమర్దిస్తాను). ఆనందించదగ్గది. ప్రపంచంలో ఏ జాతికైనా ఇటువంటి లక్షణం కలిగి ఉండటం చాలా అవసరం. ఇది ఆ జాతి ఉన్నతికి ఎంతగానో దోహదం చేస్తుంది.

అందుకే ఎమోషనల్ గా ఆలోచిస్తే నా ప్రాంతానికి హైదరాబాదేం ఖర్మ? ముంబాయి, న్యూయార్క్ మహానగరాలు కూడా కావాలనిపిస్తుంది. ఇట్లా వాదించడం నాకు ఇష్టంగానే ఉంటుంది గానీ కష్టంగా ఉండదు. కానీ మన ఇష్టం వేరు.. రాజకీయ అవగాహన, ఆలోచన, అంచనాలు వేరు.

అయితే.. మన యువతకి 'ప్రశాంత' సమయంలో ఇంకేం పట్టదా? ఏమీ కనిపించవా? వినిపించవా? ఎందుకంత అలసత్వం, అంతులేని బాధ్యతా రాహిత్యం? గత కొన్నిరోజులుగా ఈ ప్రశ్నలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇబ్బంది పెడుతున్నాయి.

నిత్య జీవితంలో సాధారణ జీవనానికి ఎన్ని కష్టాలు! మనిషి మనిషిగా, గౌరవంగా బ్రతికే పరిస్థితుల నుండి ఎంతగా దిగజారిపోతున్నాం! డాక్టర్లు పేషంట్లని పీల్చేస్తారు. ప్లీడర్లు క్లయింట్లని మింగేస్తారు. ఒంటరి ఆడపిల్లకి కనీస రక్షణ కల్పించలేని దిక్కుమాలిన సమాజం సృష్టించుకున్నాం. అడవిలో పులుల కన్నా ప్రమాదకరంగా తయారవుతున్నాం. ఏం? వీళ్ళెవరూ మన ప్రాంతం వాళ్ళు కాదా? అప్పుడీ కుర్రాళ్ళు ఆవేశపడరెందుకు!

'ప్రశాంత' సమయంలో మన అభిమాన హీరోల (కుల) ర్యాలీలు అద్భుతంగా నిర్వహిస్తాం. ఓటుకి ఎవడెంత ఇచ్చాడనేది ఉత్సాహంగా చర్చించుకుంటాం. ఏం? ఇవన్నీ మన ప్రాంతానికి నష్టం కలిగించట్లేదా? కేవలం హైదరాబాద్ మనది కాదన్నప్పుడే ఎందుకీ ఆవేశం? అసలు మనకి ఉన్న ప్రాంతాన్ని సరీగ్గా పరిరక్షించుకుంటున్నామా? ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకుంటున్నామా? లేదు కదా! ఎందుకు?

కారంచేడు, చుండూరులతో ప్రపంచ పటాన్ని ఎక్కాం. ఎంత సిగ్గుచేటు! మరి మరణించిన ఆ దళితులు మన ప్రాంతంవారు కాదా? ఒక కులం ఇంకో కులం మీద దాడి చెయ్యడం, పశువుల కన్నా హీనంగా చంపెయ్యడం ఘోరం, అమానుషం అని ఖండిస్తూ ఎప్పుడైనా ర్యాలీలు చేశామా? లేదు కదా. ఎందుకు?

నకీలీ విత్తనాలు, పురుగు మందులు, గిట్టుబాటు కాని రేట్లతో ఎంతమంది రైతులు చచ్చిపొతున్నారు? ఎంతమంది కిడ్నీలు అమ్ముకుంటున్నారు? మనం అప్పుడు ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ రైతుల పక్షాన ఎన్ని ర్యాలీలు తీశాం? వారి మరణానికి గల కారణాన్ని వెతికి వెతికి పట్టుకుని పీక పిసికి చంపేంత కోపం మనకి ఎందుకు రాలేదు! ఏం? ఆ మరణించిన రైతులు మన ప్రాంతంవారు కాదా?

ఇవ్వాళ హైదారాబాద్ కోసం చెలరేగిన ఆవేశంలో పది పైసలైనా దాచుకుందాం. అలసత్వాన్ని, అరాచాకత్వాన్ని ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, ఎదిరిద్దాం.. మాట వినకపోతే పాతరేద్దాం. ఇప్పుడు ప్రశ్నించుకోవలసింది మనం ఏ ప్రాంతం వాళ్ళమని కాదు.. మనమందరం ఒక జాతిగా, సామూహిక శక్తిగా ఎలా పురోగమించాలని మాత్రమే. అప్పుడు మనం కోల్పోతున్నామనుకుంటున్న ఒక కాంక్రీట్ జంగిల్ పెద్ద నష్టమేమీ కాదు. నాకైతే మన యువతపై అంతులేని ఆశలున్నాయి. ఈ ఆశ దురాశ కాదనే నమ్మకం కూడా ఉంది.

(photo courtesy : Google)

Saturday, 3 August 2013

ఔను! నేను బ్లాగ్ రాయడం మానేశాను


'బ్లాగా! అంటే ఏంటి?'

ఈ మధ్యకాలంలో నేను అనేకసార్లు ఎదుర్కొన్న ప్రశ్న ఇది. మొదట్లో బ్లాగంటే ఏంటో చెప్పటానికి ప్రయత్నించేవాణ్ని. తరవాత ఈ ప్రశ్న కొద్దిగా చికాగ్గా ఉండేది. తరవాత్తరవాత మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను.

అయితే ఇప్పుడో కొత్త సమాధానం ఇస్తున్నాను.

"బ్లాగంటే ఏంటో నాకూ సరీగ్గా తెలీదు. అప్పుడెప్పుడో ఒకట్రెండు రాశాను. అంతే! ఇప్పుడు నేను బ్లాగ్ రాయడం మానేశాను."

ఏమిటోయి నీ బ్లాగ్గోల? ఎందుకోయి ఈ అబద్దాలు?

వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు మెడికల్ కాలేజిలో మా బ్యాచ్ చాలా పాపులర్. అందుకు మా బ్యాచిలో ఎక్కువమందిమి గుంటూరు, విజయవాడ, హైదరాబాదుల్లో స్థిరపడటం ఒక కారణం. అంచేత మా క్లాస్మేట్ల పార్టీలు ఎక్కువగా జరుగుతుంటయ్. ఈ పార్టీలకి పెద్ద కారణం ఉండదు. అసలు విషయం.. హాయిగా, సరదాగా, మత్తుగా కబుర్లు చెప్పుకోవడానికి ఈ పార్టీల వంకతో కలుస్తుంటాం.

మనం ఎంత తెలివైన వాళ్ళమైనా జీవితంలో ఒక్కోసారి ఘోర తప్పిదం చేస్తుంటాం. అది మన ప్రారబ్దం. ఒక బలహీన క్షణాన నేనూ అట్లాంటి తప్పే ఒకటి చేశాను. ఒక పార్టీలో నా స్నేహితుడికి సెల్ ఫోన్లో నా బ్లాగ్రాతొకటి (సాంబారు.. ఒక చెరగని ముద్ర) చూపించాను.. చదివి వినిపించాను. అతగాడు శ్రద్ధగా విన్నాడు. బాగుందని మెచ్చుకున్నాడు. మిక్కిలి సంతసించితిని.

నాల్రోజుల తరవాత ఆ స్నేహితుడి ఫోన్.

"బిజీగా ఉన్నావా?"

"లేదులే. ఏంటి సంగతి?"

"ఏంలేదు. నా OP (అనగా out patients అని అర్ధం) ఇప్పుడే అయిపోయింది. నీదగ్గరకొస్తాను. మళ్ళీ వినిపించకూడదూ?"

"ఏంటి వినిపించేది?"

"అదే. మొన్నేదో సాంబారంటూ వినిపించావుగా!"

"ఓ! నువ్వు చెప్పేది నా బ్లాగ్గూర్చా?"

"ఓహో! దాన్ని బ్లాగంటారా?"

"అవును. నీకు నా బ్లాగ్ ఎడ్రెస్ చెబుతాను. నువ్వే చూసుకోరాదూ?"

"అదేంటి! బ్లాగులకి ఎడ్రెస్ కూడా ఉంటుందా! సర్లే. ఆ ఎడ్రెస్సేదో చెప్పు."

నే చెప్పబోతుండగా..

"ఇప్పుడే ఒక ఎమర్జెన్సీ కేసొచ్చింది. మళ్ళీ చేస్తాను." ఫోన్ కట్టయింది.


తరవాత పార్టీలో ఆ మిత్రుడే పార్టీలో నా  బ్లాగ్రాత గూర్చి మిగిలినవారికి చెప్పాడు.

కొందరు ఆశ్చర్యపొయ్యారు.

"కంప్యూటర్లో తెలుగ్గూడా రాస్తారా! ఎలా రాస్తారు?"

ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాను. "లేఖిని అని ఒక టూల్ ఉంది. అదొక.. "

ఈలోపు వాళ్ళల్లోవాళ్ళు మాట్లాడుకోడం మొదలెట్టారు.

"మీ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ ఇంకా రాలేదే? మినిస్టర్తో చెప్పించకపోయినావు? నీకు బాగా తెలుసుగా!"

ఆ విధంగా టాపిక్ మారింది. లేఖిని పోయింది.


ఆ తరవాత ఇంకో పార్టీలో ఇంకో మిత్రుడు.

"ఏంటి నువ్వు అదేదో బ్లాగులని రాస్తావుటగా?"

"అవును."

"ఎందుకు రాయటం?"

ఇబ్బందిగా అన్నాను. "పని లేక.. "

"అవున్లే. ప్రాక్టీస్ తగ్గిపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావ్? మొత్తానికి పన్లేక రాస్తున్నావన్నమాట!"

"అదికాదు. 'పని లేక' అనేది.. "

నా సమాధానం వినిపించుకోకుండా "హైదరాబాదులో స్థలాల రేట్లు పడిపోతయ్యంటావా? ఎంతైనా నువ్వు తెలివైనోడివి. బెజవాడంతా కొని  పడేశావు." అంటూ పక్కవాడితో మాట్లాట్టం మొదలెట్టాడు.


మరికొన్నాళ్ళకి ఇంకో పార్టీలో ఇంకో స్నేహితుడు.. తీవ్ర స్వరంతో అడిగాడు.

(మా పార్టీల్లో సెకండాఫ్ కొంచెం తీవ్రమైన వాతావరణం ఉంటుంది.)

"ఈమధ్య నువ్వు బ్లాగులంటూ ఏవో రాస్తున్నావంట?"

"అవును."

"అవెట్లా చదవాలి?"

"సింపుల్. గూగుల్ సెర్చ్ లోకి వెళ్లి.. "

"గూగుల్ సెర్చా! దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి?"

"నీకు నెట్ కనెక్షన్ ఉంది కదా?"

"ఉంది. కానీ కంప్యూటర్లోకి చూస్తుంటే నాకు కళ్ళు లాగేస్తాయి."

"మరప్పుడు నీకు చెప్పి ప్రయోజనమేమి?"

"మరదే ఎగస్ట్రాలంటే. అడిగిందానికి ఆన్సర్ చెప్పు. లేదా తెలీదని చెప్పేడువు." మావాడు ఆవేశపడ్డాడు.

తప్పు అతనిది కాదు. అందుకు వేరే కారణముంది!


ఇంకో పార్టీలో ఇంకో స్నేహితుడు.

"ఇప్పుడు చెప్పు. బ్లాగంటే ఏంటి?"

"బ్లాగా!" ఒక క్షణం తీవ్రంగా ఆలోచించాను. ఆపై కొద్దిసేపు బుర్ర గోక్కున్నాను.

"సారీ! గుర్తు రావట్లేదు. బ్లాగంటే ఏంటో మర్చిపోయ్యాను."

"మరి నువ్వు రాస్తున్నావని ఎవడో చెప్పాడు?"

"నాగూర్చి ఎవడో చెప్పేదేంటి? నే చెప్పేదే నిజం. బ్లాగంటే ఏంటో నాకూ సరీగ్గా తెలీదు. అప్పుడెప్పుడో బజ్జీలు, సాంబారంటూ ఒకట్రెండు పోస్టులు రాశాను. అంతే! ఇప్పుడు నేను బ్లాగ్ రాయడం మానేశాను. వదిలేయ్!" అన్నాను.

"ఓ! అలాగా?"

హమ్మయ్య! ఏవిటిది? ఇప్పుడు మనసు ప్రశాంతంగా, హాయిగా అయిపోయింది! నాకిప్పుడు నా స్నేహితులకి ఏం సమాధానం చెప్పాలో బాగా అర్ధమైంది. ఇలాగే కంటిన్యూ అయిపోతే మంచిదని కూడా అర్ధమైంది!


(pictures courtesy : Google)

Thursday, 1 August 2013

జై సమైక్యాంద్రా


"ఉరే సుబ్బిగా! ఎప్పుడూలేంది ఇయ్యాల పొద్దుగూకులు బజార్లెంట బొచ్చెపోలీసులు తిరుగుతా వుండారేందిరా?"

"వార్నీ! నీకింకా తెలవదా? తెలంగాణా ఇచ్చేసారుగా."

"తెలంగాణానా! అంటే యేంది?"

"సోనియాగాందీ మన్దేసాన్ని నిలువునా సీల్చేసి తెలంగాణా ఇచ్చేసింది. ఐదరాబాదుని మనకాణ్నించి ఇడగొట్టింది."

"ఐదరాబాదా! అంటే యేంది?"

"ఐదరాబాదంటే రాజదాని నగరం. మన పెద్దోళ్ళు ఆల్డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టారంట. ఇప్ప్డడా తెలంగాణావోళ్ళు అయ్యన్ని నూకి మన్ని ఎనక్కి పంపించేస్తన్నారు."

"అమ్మ నీయమ్మ. మరీ ఇంతన్నేయమా! అయితే ఆళ్ళిప్పుడు నా బియ్యం కారుడు లాక్కుంటారా?"

"లాక్కోరు"

"ఆపరేసినీ కారుడు?"

"ఆరోగ్యస్రీ కార్డా? లాక్కోరు."

"కూల్డబ్బులు తగ్గిస్తారా?"

"అయ్యెందుకు తగ్గిస్తారు. తగ్గీరు."

"మరి నా డొక్కు సైకిలు?"

"దాన్నెవడు తీసుకుంటాడ్రా పిచ్చనాయాలా! దానికసలు సైనే సరీగ్గా లేదు!"

"ఓసోస్. పిచ్చనాయాలువి నువ్వేరా! నీదంతా అత్తిరిబిత్తిరి యవ్వారం. బొచ్చెపోలీసుల సంగతేందిరా అనడిగితే ఏందో తెలంగాణా అంటావు, ఐదరాబాదంటావు. మళ్ళీ మనయ్యన్నీ మనకాడే ఉంటయ్యంటావు. తెలీకపోతే తెలీదని సెప్పు. అంతేగానీ యెదవ కబుర్లు సెప్పమాక."

"నీయమ్మ నీతో మాట్టాడితే మెంటలెక్కుద్దిరా బాబూ! అరేయ్ ఎవుడ్రా అక్కడా? కూసింత ఆగండి.. నేనూ వస్తన్నా. జై సమైక్యాంద్రా!"

(photo courtesy : Google)