Monday, 31 July 2017

దేవుడున్నాడా? లేడా?


తొమ్మిదో క్లాసు చదివేప్పుడు ఫస్ట్ మార్కు కోసం నాకూ, పుచ్చా పవన్‌గాడికీ మధ్య తీవ్రమైన పోటీ వుండేది. పవన్‌గాడిని మార్కుల్లో యెలాగైనా వోడించాలనే కుట్రబుద్ధితో నెల్రోజులపాటు పరమ నిష్టాగరిష్టుడనై దేవుణ్ని ప్రార్ధించాను, పూజించాను, వేడుకున్నాను. కానీ ఈసారి పరీక్షల్లో నా మార్కులు దారుణంగా తగ్గిపొయ్యాయి.

ఆనాడు నాకు జ్ఞానోదయం అయ్యింది - 'దేవుడున్నాడా? లేడా? వొకవేళ దేవుడున్నా, ఆ దేవుడికి నాపట్ల ఆసక్తి లేదు, ఉపయోగపడే ఉద్దేశం లేదు. నాకు ఉపయోగపడని దేవుడి గూర్చి నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి?' - ఆరోజు నుండి దేవుణ్ని పట్టించుకోడం మానేశాను.

అయితే కొన్నాళ్లుగా మదీయ మిత్రుడు .. "ఆ దేవదేవుడు కరుణామయుడు, వొక్కసారి నీ కోరిక తీర్చలేదని పక్కన పెట్టేస్తావా? సెకండ్ ఛాన్స్ యివ్వావా? నీ తొమ్మిదోక్లాసు పవిత్ర హృదయాన్ని బయటకి లాగు, దేవుణ్ని భక్తితో ప్రార్ధించి కావల్సింది కోరుకో." అని చెప్పసాగాడు. నాకు మావాడి లాజిక్ నచ్చింది.

నా చదువైపోయింది, ప్రాక్టీసూ బానే వుంది. ఇంకేం కోరుకోను? ఆలోచించగా - నా దగ్గర సింగిల్ మాల్ట్ స్టాక్ నిండుకుందని గుర్తొచ్చింది. ప్రస్తుతం నాకిదే అవసరం, అదేదో దేవుణ్నే అడిగి చూద్దాం.

"దేవుడా! నాకు రెండు Glenmorangie 18 ప్రసాదించు, రేప్పొద్దున్నే అవి హాల్లో టీపాయ్ మీద వుండేలా చూడు." రాత్రి పడుకోబొయ్యే ముందు పవిత్రంగా, తీవ్రంగా దేవుణ్ని ప్రార్ధించాను.

తెల్లారింది -

ఆశ్చర్యం! హాల్లో టీపాయ్ మీద రెండు సింగిల్ మాల్టులు!

'దేవుడున్నాడు! అయ్యో ఇంతకాలం దేవుణ్ని నిర్లక్ష్యం చేశానే! దేవుడా! ఈ దుష్టపాపిని మన్నించు.' అని పరితప్త హృదయంతో పశ్చాత్తాపపడబోతుండగా -

హోల్డాన్!

ఇవి సింగిల్ మాల్టులే గానీ, బ్రాండ్ మాత్రం Glefiddick cask collection!

యెందుకిలా జరిగింది? నా ప్రార్ధన దేవుడికి సరీగ్గా వినబళ్లేదా? దేవుడికి ఇంగ్లీషు రాదా? దేవుడికి బ్రాండ్ కాన్షస్‌నెస్ లేదా?

మహిమగల దేవుడైతే యేదడిగితే అదే ఇవ్వాలి. అంతేగానీ దొండకాయలడిగితే బెండకాయలిచ్చినట్లు, నేనడిగింది కాకుండా ఇంకోటి ఇవ్వడంలో దేవుడి అంతరార్ధం యేవిఁటి?

కాబట్టి -

విషయం మళ్లీ మొదటికొచ్చింది.

'దేవుడున్నాడా? లేడా?'

(fb post)

Sunday, 9 July 2017

డా.వి.చంద్రశేఖరరావు


డాక్టర్ వి. చంద్రశేఖరరావు నాకు గుంటూరు మెడికల్ కాలేజిలో క్లాస్మేట్, 'చంద్రశేఖర్‌'గా పరిచయం. కారణం తెలీదు, అతన్ది లేట్ ఎడ్మిషన్. అందువల్ల ఎనాటమీలో నా బాడీమేట్ (ఒకే శవంపై డిసెక్షన్ చేసేవారిని బాడీమేట్స్ అంటారు) అయ్యాడు.

చంద్రశేఖర్ ఒకేడాది మెడికల్ కాలేజీ మేగజైన్ బాధ్యతల్ని చూశాడు. యెవరో రావిశాస్త్రిట, గొప్పతెలుగు రచయితట, ఇంటర్వ్యూ చేస్తానన్నాడు! 'కనీసం వొక్క పేజిలోనైనా నవ్వొచ్చేట్లు చూడరా' అన్నాను. అనుకున్నట్లే మేగజైన్‌లో ఒక్కనవ్వు కూడా లేదు!

మా కాలేజీలో జయప్రకాష్ నారాయణ అనే అతను సివిల్స్ రాసి ఐయేఎస్ అయ్యాడు. దాంతో ఈ సివిల్స్ రోగం కొందరికి గజ్జిలా పట్టుకుంది. ఒకపక్క దేశానికి డాక్టర్ల కొరత వుంది, ఇంకోపక్క వీళ్లిలా మెడికల్ సీట్లు వేస్ట్ చెయ్యడం సరికాదని నా అభిప్రాయం. ఆ రోగం మా చంద్రశేఖరుకీ పట్టి అదేదో రైల్వే ఉద్యోగంలో చేరాడు.

మా క్లాస్మేట్ సమూహం గమ్మత్తైనది. వీరికి కొన్నివిషయాలు బాగా తెలుసు, ఇంకొన్ని విషయాలు బొత్తిగా తెలీదు. ఈ బొత్తిగా తెలీని విషయాల్లో తెలుగు సాహిత్యం ఒకటి. నేను మా బ్యాచ్‌లో ఆవఁదం వృక్షాన్ని!

"మీకు తెలుసా? మన రైల్వే చంద్రశేఖర్ కథలు రాస్తున్నాట్ట!" వొక క్లాస్మేట్స్ పార్టీలో అన్నాను.

"ఎందుకు?" అందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యపోయారు.. నేను బిత్తరపొయ్యాను. 

ఆపుడప్పుడు నా హాస్పిటల్‌కి వచ్చేవాడు, తన పుస్తకం యేదోటి ఇస్తుండేవాడు. మా సంభాషణ యెక్కువగా స్నేహితుల గూర్చే వుండేది.

చంద్రశేఖర్ కథలు కొన్ని చదివాను గానీ, నాకవి సాధారణ కథలుగా అనిపించాయి, అటుతరవాత వాణ్నెప్పుడు చదవడానికి ప్రయత్నించలేదు. 

నా క్లాస్మేట్, నా స్నేహితుడు చంద్రశేఖర్ మరణానికి బాధ పడుతూ.. 

గుంటూరు మెడికల్ కాలేజి 1976 బ్యాచ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాను. 

(fb post)