Thursday 25 April 2013

శంషాద్ బేగం.. ఒక లేడీ రౌడీ సింగర్


ఇవ్వాళ 'హిందూ'లో గాయని శంషాద్ బేగం మరణవార్త చదివి ఆశ్చర్యపొయ్యాను. ఆవిడ ఇంకా ఉందని అనుకోలేదు. ఎప్పుడో చనిపోయిందనుకున్నాను. ఒక వ్యక్తి మరణం గూర్చి ఇంత దుర్మార్గంగా ప్రస్తావించడం తప్పే, క్షమించండి. సూర్యుడు పడమరన మాత్రమే అస్తమిస్తాడని తెలీకపోవడం, ఆ తెలీనివాడి తప్పే అవుతుందిగానీ, సూర్యుడుది కాదు. ఫిల్టర్ కాఫీ అత్యంత మధురంగా ఉండునన్న సత్యం గ్రహించలేకపోవడం, ఆ గ్రహింపలేనివాడి గ్రహపాటే అవుతుంది గానీ, ఫిల్టర్ కాఫీది కాదు. 

'శంషాద్ బేగం మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది, ఆ గానసరస్వతి లేని లోకం చిన్నబోయింది. ఆ స్వరమాధుర్యం దేవుడు ప్రసాదించిన వరం, ఆ గానం నిత్యనూతనం. చిరకాలంగా ఆబాలగోపాలానికి అనిర్వచనీయ ఆనందాన్ని కలిగించిన శంషాద్ బేగం ఇక లేరు అన్న వార్త విని సంగీతాభిమానులు ఖిన్నులయ్యారు.' అంటూ పడికట్టు పదాలతో.. ఏడుస్తూ..  శంషాద్ గూర్చి సంతాపం రాయబోవట్లేదు. శంషాద్ బేగంకి వయసైపొయింది. పోయింది. ఈ సందర్భంగా శంషాద్ పాటొకటి ఇస్తున్నాను. చూడండి.


మనం ఒక వ్యక్తిని చూడంగాన్లే అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. నీటుగా ఉండేవాడు మంచివాడనీ, నాటుగా ఉండేవాడు రౌడీ అనీ.. ఇట్లా. కొందరైతే పేదవారంతా దొంగలేననీ, అలగాజనాన్ని నమ్మరాదనీ కూడా నమ్ముతారు.. ఇది వారి వర్గతత్వ రోగాన్ని సూచిస్తుందేమోగానీ.. మరి దేన్నీ సూచించదు. తెలుగుకవులకి మాత్రం రిక్షా తొక్కువాడు పీడితుడిగా, కారు నడుపువాడు పీడకుడిగా భావిస్తారు. అలా భావిస్తేనే వారికి నమస్కారాలు, పురస్కారాలు లభిస్తాయి. మరికొందరినైతే వ్యక్తి యొక్క అందచందాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇందుకు కారణం బహుశా మన మైండ్ లో ముద్రించుకు పోయిన 'స్టీరియోటైపి' కావచ్చు. ఇది అందరికీ తెలిసిన సంగతే.

నా మైండ్ గొంతుల్ని కూడా స్టీరియోటైప్ చేసేసింది. లతా మంగేష్కర్, లీల, సుశీల.. నాకు చాలా ఇష్టం. వీరి గొంతులో మాధుర్యం, తీపిదనం, లాలిత్యం నన్ను కట్టిపడేస్తాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వలె కనులు మూసుకుని నా స్వప్నసుందరిని గాంచుతూ.. ఆనందపారవశ్యం చెందెదను. నా సుందరి అందాలరాసి, ముగ్ధ, బేల, అమాయకురాలు, పరాయి పురుషుణ్ణి పరాకుగానైనా దరిచేరనీయని గుణవంతురాలు.

భానుమతి, డి.కె.పట్టమ్మాళ్, బెజవాడ రాజారత్నం, శంషాద్ బేగం.. నాకు వీళ్ళ వాయిస్ అంటే భయం. ఇవి చాలా క్లీన్ వాయిస్ లు. వీరి వాయిస్.. వోకల్ కార్డ్స్ ని చీల్చుకుంటూ ఒక సుడిగాలిలా, ఒక సునామీలా.. ఊపిరి తిత్తుల ఫుక్ థ్రాటిల్ తో.. ఫడేల్మని ప్రళయ గర్జన చేస్తూ బయటకొస్తుంది. అసలు వీరి గొంతే ఇలా ఉండగా.. పాడే విధానం మరింత విలక్షణంగా.. చాలా డైనమిక్ గా ఉంటుంది. నాకైతే దందా చేస్తున్న రౌడీ వార్నింగ్ ఇస్తున్నట్లుంటుంది.


మరీ ముఖ్యంగా.. శంషాద్ బేగం పాట వింటుంటే.. 'ఈ ప్రపంచం నాది. దీన్ని నేను శాసిస్తున్నా! ఇక్కడ నా మాటే ఒక వేదం.' అంటూ గర్వంగా డిక్లేర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే అయితే పర్లేదు. ఇంకా.. 'నాతో వేషాలేస్తే మాడు పగలకోడ్తా' అంటూ ముఖం మీద ఈడ్చి తంతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

'నీ మొఖం! నీదంతా అతితెలివి. ఆడలేడీసు గొంతులన్నీ ఒకటే. వారికి అవకాశాలొచ్చాయి. దేవుడిచ్చిన స్టోన్ తో పాడారు. దానికంత విశ్లేషణలు ఎందుకు? ఈ మధ్య నీకు ఆడాళ్ళంటే భయం పెరిగిపోతుంది. జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. బీ హేపీ!'

'అంతేనంటారా? అలాగైతే ఓకే!'

(photos courtesy : Google)

Wednesday 24 April 2013

మనుషులు - మమతలు


అవి మేం చదువుకునే రోజులు . ఆ రోజుల్లో 'బీజీస్' అనే పేరుతో పాటలు పాడే ఒక గ్రూప్ చాలా పాపులర్. వాళ్ళ పాటల్ని మేం శ్రద్ధగా ఫాలో అయ్యేవాళ్ళం. బీజీస్ మ్యూజిక్ తో 'సాటర్డే నైట్ ఫీవర్' అనే సినిమా వచ్చింది. హడావుడిగా బెజవాడ లీలామహాల్లో వాలితిమి.

ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే మాకు బెజవాడే గతి. ఇంగ్లీషు సినిమాలు గుంటూరుకి తాపీగా, అరిగిపోయిన రీళ్లతో.. ఉరుములు, మెరుపుల రీరికార్డింగుతో వచ్చేవి. ఆ స్పెషల్ ఎఫెక్టుల్ని తట్టుకోలేని మేం బెజవాడ పొయ్యి మరీ నవరంగ్, లీలామహల్ మరియూ ఊర్వశిని పోషించేవాళ్ళం.

బీజీస్ మ్యూజిక్ కోసం 'సాటర్డే నైట్ ఫీవర్' కి వెళ్ళిన మమ్మల్ని.. ఆ సినిమా హీరో జాన్ ట్రెవోల్టా తన నడుం ఊపుడు డ్యాన్సులతో పిచ్చెక్కించాడు. దాంతో ఆ సినిమాని అలవోకగా మూడుసార్లు చూసి పడేశాం. పిమ్మట జాన్ ట్రెవోల్టా నటించిన తదుపరి చిత్రం 'గ్రీజ్' కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాం.

ఈ లోపు ఏదో పని మీద మద్రాస్ వెళ్లాను. అక్కడ 'గ్రీజ్' ని బ్లూ డైమండ్ లో ఒకేరోజు మూడుసార్లు చూసేశాను. ఎలాగనగా.. ఆ హాల్లో ఒకే సినిమా వరసగా, ఆపకుండా వేసేస్తుంటారు. మనం ఎప్పుడైనా లోపలకి వెళ్ళొచ్చు.. వెళ్లిపోవచ్చును కూడా. ఆ విధంగా ఒకే టికెట్టుతో 'గ్రీజ్'ని మూడుసార్లు గిట్టించితిని. తరవాత అదే 'గ్రీజ్'ని స్నేహితులతో కలిసి బెజవాడలో యధావిధిగా మళ్ళీ చూసి.. నా విద్యుచ్ఛక్తి ధర్మాన్ని.. సారీ.. నా విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించితిని.

మీ కోసం అలీవియా న్యూటన్ జాన్, జాన్ ట్రెవోల్టాలు కలిసి పాడుతూ (వాళ్ళిద్దరూ గాయకులు కూడా) నటించిన యూట్యూబ్ పాట ఇస్తున్నాను. చూసి తరించండి. అన్నట్లు ఈ పాట సినిమా చివర్లో వస్తుంది.




ఇప్పుడు నా మనసంతా భారంగా అయిపోయింది. 'గ్రీజ్' నా జీవితంలో అత్యంత ముఖ్యమైన దినాల్లోని ఒక తియ్యని జ్ఞాపకం. ఈ పాట చూస్తుంటే నాకు నా మెడిసిన్ చదువు, నా మైసూర్ కేఫ్ ('మైసూర్ కఫే' అనినచో నా జ్ఞాపకాల్లో తేడా వచ్చును) రోజులు గుర్తొస్తాయి. అలివియా న్యూటన్ జాన్ అందానికి మూర్చపోయిన నా స్నేహితుడు.. ట్రెవోల్టా డ్యాన్సుని ప్రాక్టీస్ చెయ్యబోయి నడుం పట్టేసిన ఇంకో స్నేహితుడు గుర్తొస్తాడు. ఇప్పుడు కొద్దిసేపు 'గ్రీజ్' ని పక్కన పెడదాం.

మొన్ననే ఓ గెస్ట్ హౌజ్ లో మా క్లాస్మేట్స్ పార్టీ జరిగింది. విదేశాల్లో స్థిరపడ్డ మిత్రులు మాతృభూమికేతెంచినప్పుడు ఇట్లాంటి జన్మభూమి పార్టీలు జరుపుకుంటుంటాం. నాకీ పార్టీలు చాలా ఎనెర్జీనిస్తాయి. ఒకప్పటి మా హార్ట్ త్రోబ్ లు, బ్రోకెన్ హార్టుల గూర్చి కబుర్లు.. ప్రేమగా తిట్లు.. ఇవన్నీ వింటూ.. ద్రవపదార్ధాలు సేవిస్తూ.. ఓ ముప్పైయ్యేళ్ళు వెనక్కి వెళ్తాం. చిత్రంగా మధ్యలో జరిగిపోయిన ముప్పైయ్యేళ్లు మర్చిపోతాం. ఐదేళ్ళపాటు ఒక ప్రొఫెషనల్ కోర్స్ కలిసి చదువుకుని.. తరవాత విడిపోయి.. కొన్నాళ్ళకి కలుసుకున్న స్నేహితులందరికీ ఈ భావనే ఉంటుందా!?

నా క్లాస్మేట్స్ ని కలుసుకోడంలో నాకెందుకంత ఆనందంగా ఉంటుంది? వాళ్ళ కంపెనీ అంత ఉత్సాహాన్ని ఎందుకిస్తుంది! మానవ మేధస్సు కంపార్టమెంటలైజ్ అయ్యుంటుంది. ఒక వ్యక్తి, ప్రదేశం, సంఘటన.. మన మదిలో అనేక ఇతర విషయాలతో కలగలసిపోయి ఒక పెద్ద పెయింటింగ్ లా ముద్రించుకుని ఉంటుంది. ఇదోరకమైన పావ్లావ్ కండిషనింగ్. చిన్ననాటి స్నేహితుల ముఖాలు, వారి మాటలు.. మనని ఆటోమేటిగ్గా గతంలోకి తీసుకెళ్తాయి. అందుచేతనే మన వయసు.. టైమ్ మిషన్లో వేసి తిప్పినట్లు.. తగ్గిపోతుంది.

ఇందుకు ఇంకో ఉదాహరణ నా సినిమా అనుభవాలు. ఈ విషయంపై "సప్తపది (నా సినిమా జ్ఞాపకాలు)" అంటూ ఇంతకు ముందు ఓ టపా కూడా రాశాను. నాకు నా స్నేహితులతో సినిమా చూడ్డమే ఒక గొప్ప అనుభూతి. అది అత్యంత చెత్త సినిమా అయ్యుండొచ్చు. అసలిక్కడ సినిమా ముఖ్యం కాదు. అది కేవలం ఒక వెహికల్ మాత్రమే. ఒక సినిమా జ్ఞాపకం.. దానితోపాటు అనేక ఇతర జ్ఞాపకాల్ని లాక్కొస్తుంది. ఈ జ్ఞాపకాల కలనేత ఒక మధురానుభూతి.

ఇప్పుడు మళ్ళీ 'గ్రీజ్'లోకి వెళ్దాం. ఆ రోజుల్లో అలీవియా న్యూటన్ జాన్, జాన్ ట్రెవోల్టాల మధ్య తీవ్రమైన ప్రేమ వ్యవహారం నడిచిందని మా రావాయ్ గాడు చెప్పేవాడు. వాడికి సినిమావాళ్ళ మధ్య ప్రేమలు, స్పర్ధల పట్ల అమితాసక్తి. అసలిట్లాంటి కబుర్ల కోసమే ఆ రోజుల్లో 'స్టార్ డస్ట్' లాంటి మేగజైన్లు ఉండేవి.

సరే! ఇప్పుడీ విడియో చూడండి. మా క్లాస్మేట్స్ మీటింగు లాగానే మన జంట కూడా ఏదో సందర్భంలో కలుసుకున్నారు. చాలా రోజుల తరవాత ఇట్లా కలుసుకుని ఆనందపడిపోయ్యే ఆనవాయితీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుంది.




దశాబ్దాల తరవాత కూడా అలీవియా న్యూటన్ జాన్, జాన్ ట్రెవోల్టాల కళ్ళల్లో ఎంత ఆనందం.. ప్రేమ! తమకెంతో ఇష్టమైన పాట పాడుకుంటూ 'గ్రీజ్' రోజుల్లోకి వెళ్ళిపొయ్యారు. దటీజ్ నోస్టాల్జియా! ఇందాకట్నుండి నే చెప్పే పాయింట్ ఇదే!

(photo courtesy : Google)

Saturday 20 April 2013

ఆనంద నిలయం.. ఎంతో ఆహ్లదకరం!


అతను బార్లో పూటుగా తాగాడు. నాటుగా తిన్నాడు. నీటుగా లేచాడు. తూలుతూ బార్ బయటకొచ్చాడు. ఆ పక్కగా ఆపి ఉన్న ఆటోని పిలిచాడు. ఆటోవాలా తెగ సంతోషించాడు. 'ఈ తాగుబోతెదవ దగ్గర ఫుల్లుగా నొక్కేద్దాం!' అనుకున్నాడు. ఆశ్చర్యం! అతగాడు తూలుతూనే ఆటోవాలాతో గీచిగీచి బేరం చెయ్యసాగాడు. చివరాకరికి ఆటోవాలానే ఓడిపొయ్యాడు. చచ్చినట్లు మామూలు రేటుకే బేరం ఒప్పుకున్నాడు. బార్లో బోల్డు ఖర్చు చేసిన ఒక తాగుబోతు ఆటో దగ్గర అంతలా బేరమాడేమిటి? ఆశ్చర్యంగా ఉంది కదూ!

మనిషి జిరాఫీలా అరున్నరడుగులున్నా.. దున్నపోతులా నూటరవై కిలోలున్నా.. అతన్ని శాసించేది మాత్రం కొబ్బరికాయంత మెదడు మాత్రమే! అందులోనే మన ఆలోచనల కంట్రోలింగ్ సెంటర్ నిక్షిప్తమై ఉంటుంది. అర్ధరూపాయి మాట కోసం అరవై కోట్ల ఆస్తులొదిలేసుకున్న పెదరాయుళ్ళూ.. అదే అర్ధరూపాయి కోసం కుత్తకలు కోసే కత్తుల రత్తయ్యలు.. ఇలా మనుషుల ఆలోచనలని రకరకాలుగా శాసించేది ఈ మెదడే! హిట్లర్ లాంటి దౌర్భాగుల్ని, గాంధీ (సోనియా గాంధి కాదు) వంటి ఉన్నతుల్ని సృష్టించింది కూడా ఈ మెదడే!


మెదడులో మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేందుకు 'ప్లెజర్ సెంటర్' ఉంటుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. బ్రహ్మ మన నుదుటిరాత రాసినట్లు.. ప్లెజర్ సెంటర్లలో కూడా ఫలానా అని 'రాసిపెట్టి' ఉంటుంది. మన తాగుబోతుకి ప్లెజర్ సెంటర్లో 'తాగుడు' అని రాసిపెట్టి ఉంది. కాబట్టే బార్లో బారెడు బిల్లు బోలెడు సంతోషంగా చెల్లించాడు. తాగుడికే అంత ఖర్చు చేసిన వాడికి డబ్బంటే లెక్కుండదనుకుని ఆటోవాలా పప్పులో కాలేశాడు! ఆ తాగువాడు తాగుడుకి మాత్రమే ఖర్చు చేస్తాడు. అంతా ప్లెజర్ సెంటర్ మహిమ! ఈ ప్లెజర్ సెంటర్ న్యూరో ఎనాటమి ఒక భారతం. అదిక్కడ అనవసరం (అసలు సంగతి.. సైన్స్ విషయాలు తెలుగులో రాయడం నాకు రాదు).

ఇందాకట్నుండి ప్లెజర్ సెంటర్ అని రాసినప్పుడల్లా.. నాకదేదో మసాజ్ పార్లర్లాగా, పబ్బులాగా ధ్వనిస్తుంది. అంచేత 'ప్లెజర్ సెంటర్' ని తెలుగులోకి అనువాదం చేసి రాస్తాను. 'ప్లెజర్' అనగా ఆనందం. 'సెంటర్' అనగా కేంద్రము. 'ఆనంద కేంద్రము'. నాకు ఇది కూడా నచ్చలేదు.. ఏదో 'పాలకేంద్రము'లా అనిపిస్తుంది. అంచేత ఇకనుండి 'ఆనంద నిలయం' అంటూ (పన్లోపని.. మా ఆనందభవన్ కూడా గుర్తొచ్చేలా) స్వేచ్చానువాదం చేసి రాస్తాను.

ప్రతి మనిషి మెదడులో ఈ ఆనంద నిలయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే.. ఒక్కో ఆనంద నిలయానికి ఒక్కో థీమ్ ఉంటుంది. అయితే ఈ థీమ్ యొక్క మంచీచెడూ, నైతికానైతికత అనేది చూసేవాడి దృష్టి, సమాజ విలువల్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు మచ్చుకు కొన్ని ఆనంద నిలయాల థీమ్స్ పరిశీలిద్దాం.

సుఖమయ జీవనానికి డబ్బు చాలా అవసరం. అయితే.. అవసరాలకి మించి ఎంతో ఎక్కువగా సంపాదించిన తరవాత కూడా.. చాలామందికి డబ్బు సంపాదన పట్ల శ్రద్ధ తగ్గక పొగా.. ఇంకా పెరుగుతుంది! ఇలా మరింత శ్రద్ధగా డబ్బు సంపాదనకి పునరంకితమవ్వడం చూస్తే.. డబ్బు సంపాదన కూడా టెండూల్కర్ పరుగుల దాహం వంటిదని అర్ధమౌతుంది. అంటే వారి ఆనంద నిలయం డబ్బు సంపాదన!

మా మేనమామ మంచి ఆస్తిపరుడు. పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. ఆయన శరీరం డెబ్భైయ్యేళ్ళ క్రితంది. వేసుకునే బట్టలు పదేళ్ళ క్రితంవి. గీసుకునే బ్లేడు మూడేళ్ళ క్రితంది. రుద్దుకునే టూత్ బ్రష్షు రెండేళ్ళ క్రితంది. ఇప్పుడు మీకు జంధ్యాల సినిమా, కోట శ్రీనివాసరావు జ్ఞప్తికొస్తే అది మా మేనమామ తప్పేగానీ.. జంధ్యాలది కాదు. బుద్ధి లేక.. మొన్నామధ్య బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోమని ఆయనకి సలహా ఇచ్చాను. 'ఎందుకు? డబ్బు దండగ. షుగరుంటే ఒంటేలుకి చీమలు పడతయ్యి గదా!' అన్నాడు. పిసినారితనమే మా మేనమామ ఆనంద నిలయం!


నాకో అన్నయ్య ఉన్నాడు. ఆయనకో ముఖ్యస్నేహితుడున్నాడు. అతను చాలా మంచివాడు. అయితే గత నాలుగున్నర దశాబ్దాలుగా ప్రతిరోజూ పేకాడతాడు. పేక లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు వంటిదని అతని ప్రగాఢ నమ్మకం. అతని భాష కూడా పేక భాషే! ఎదైనా డబ్బు టాపిక్ వచ్చినప్పుడు ఐదు ఫుల్ కౌంట్లంటాడు. లేదా పది మిడిల్ డ్రాపులంటాడు. చంద్రునికో మచ్చలా ఆయనకి 'పేకాట' అనేది ఒక మచ్చ. కాకపోతే ఈయన మచ్చ పెద్ద సైజు పిడకంత ఉంటుంది. ఆ పిడకే ఆయనకి ఆనంద నిలయం.

నా స్నేహితుడొకడు మితభాషి. బాగా చదువుకున్నవాడు. ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతోద్యోగి. అయితే అతని ఆనందనిలయం 'పరాయి స్త్రీ' లలో దాగుంది. అతని పరాయి స్త్రీల సాంగత్య యత్నం ఒక యజ్ఞం స్థాయిలో ఉంటుంది. అందుకోసం ప్రాణాలకి కూడా తెగిస్తాడు. మొన్నామధ్య వడదెబ్బతో ఆస్పత్రిలో చేరాడు. ఎల్లప్పుడూ చల్లని ఏసీ (అదీ ప్రభుత్వ సొమ్ముతో) ఉండే మావాడికి వడదెబ్బ!

ఆస్పత్రికి పరామర్శగా వెళ్ళిన నాకు రహస్యంగా చెప్పాడు. అతగాడికి ఎప్పాయింట్మెంట్ ఇచ్చిన ఒక స్త్రీ రత్నం కోసం.. ఎర్రటి ఎండలో బస్టాండు ముందు తిండితిప్పలు మానేసి మరీ పడిగాపులు కాశాడు. ఆ స్త్రీ రత్నం రాలేదుగానీ.. మావాడికి జ్వరం మాత్రం వచ్చింది. నా స్నేహితుడికి ప్రేమగా, ఆప్యాయంగా పళ్ళరసం తాగిస్తున్న అతని భార్యని చూస్తే జాలేసింది!

ఆనంద నిలయాలు అంటూ వ్యసనాల్ని కూడా హైలైట్ చేస్తూ రాస్తున్నానని మీరనుకోవచ్చు. అయితే మన మెదడు.. సమాజం మంచిచెడ్డలు నిర్ణయించక ముందే అభివృద్ధి చెందింది. దానికి సభ్యత, సంస్కారం వంటి క్లిష్టమైన పదాలు అర్ధం కావు. కానీ అది మనని శాసిస్తుంది. ఫ్రాయిడ్ ఈడ్, సూపర్ ఈగో అంటూ కొంతమేరకు విశ్లేషించాడు గానీ.. ఇప్పుడెవరు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు.

మనకి నచ్చని ఆనంద నిలయాల్ని వ్యసనం అన్న పేరుతో చిన్నచూపు చూస్తాం. స్టాంప్ కలెక్షన్, కాయిన్ కలెక్షన్ వంటి వాటిని ఏ చూపూ చూడం. అయితే సాహిత్యసేవ, ప్రజాసేవ, కళాసేవ వంటి వాటిని గ్లోరిఫై చేస్తాం. కొందరు వారిని ఆరాధిస్తారు కూడా. కానీ ఇవి కూడా వ్యసనాలకి 'ఆదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్' గా నాకు అనిపిస్తుంది.

శ్రీశ్రీని గుప్పిలి బిగించి దమ్ము లాగుతూ, పెగ్గు మీద పెగ్గు మీద బిగిస్తూ 'మహాప్రస్థానం' రాయమని మనం అడిగామా? లేదే! మరాయన ఎందుకంత కష్టపడిపోతూ 'మహాప్రస్థానం' రాశాడు? మనం వద్దన్నా శ్రీశ్రీ రాయడం ఆపేవాడా? ఖచ్చితంగా ఆపేవాడు కాదు. పైగా.. 'నీదీ ఒక బ్రదుకేనా? కుక్కా, నక్కా.. సందులో పంది!' అంటూ తన పాళీతో మన కంట్లో పొడిచేవాడు!


ఆ మాటకొస్తే గద్దర్ ని పాటలు పాడమని మాత్రం ఎవరడిగారు? పాడొద్దంటే మాత్రం ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఆవేశం ఉప్పొంగగా.. 'అరెరె.. ఈ పాట నాదిరా.. ఆ గోచి నీదిరా! ఈ పల్లె నాదిరో.. ఆ బ్లాగు నీదిరో!' అంటూ స్టేజి ఊగిపొయ్యేట్లు చిందులెయ్యడా? దటీజ్ ఆనంద నిలయం!

ఆయన ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి నాయకుడు. తొమ్మిదేళ్ళపాటు కనీసం నిద్ర కూడా పోకుండా అలుపెరుగని ప్రజాసేవ చేశాడు. 'నాకు ప్రజాసేవలో తనివి తీరలేదు. ఇంకా చేస్తాను. ఇంకోక్క అవకాశం ఇవ్వండి. ప్లీజ్!' అంటూ ఈ వృద్ధాప్యంలో, ఈ మండుటెండలో వేల కిలోమీటర్లు నడవటమేమిటి! ఆ ప్రజానాయకుడి తపన కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆయన చేతిలో ఏమీ లేదు. అంతా ఆనంద నిలయంలోనే ఉంది!

కావున మిత్రులారా! ప్రతి మెదడుకీ ఓ ఆనందనిలయం ఉంటుంది. అది ఆ వ్యక్తికి శిలాశాసనం. ఆయా సమాజాల్లోని కట్టుబాట్లు, సంస్కృతిని అనుసరించి ఆ ఆనందనిలయాల మంచిచెడ్డలు నిర్ణయించడతాయని మొదట్లోనే చెప్పాను. అయితే వ్యక్తి ఇష్టాయిష్టాల్ని గౌరవించడంలో సమాజానిక్కూడా కొన్ని సమస్యలుంటాయి. నా స్నేహితుడు స్త్రీ సేవ చెయ్యని యెడల.. సమాజసేవ చేసేవాడేమోనని నేననుకుంటుంటాను. అలాగే వైస్ వెర్సా.

మొన్నామధ్య నా వైద్య స్నేహితుడొకడు నన్ను వందోసారి అడిగాడు.

"నీ బ్లాగ్ చదవాలంటే ఏం చెయ్యాలి?"

"నీకో నమస్కారం. నా బ్లాగ్ చదవద్దు." అన్నాను.

స్నానం చెయ్యడానిక్కూడా టైమ్ లేనంత బిజీ ప్రాక్టీసున్న అతను నా బ్లాగ్ చదవడం అసంభవం. కానీ గత కొంతకాలంగా అతను నన్నలాగే పలకరిస్తున్నాడు.

నా సమాధానానికి అతను హర్టయ్యాడు. అంచేత తను చదవని నా బ్లాగ్వాపకం చెడ్డదని నిరూపించ నడుం కట్టాడు.

"అసలు నువ్వు బ్లాగులెందుకు రాస్తున్నావు?" సూటిగా చూస్తూ అన్నాడు.

"పని లేక.. " నాకీ సమాధానం చెప్పడం సంతోషాన్నిస్తుంది.

"నీకు పన్లేదంటే నేన్నమ్మను. చెప్పు. బ్లాగులెందుకు రాస్తున్నావు?" పోలీసువాడు 'లైసన్సుందా?' అనడిగినట్లు రెట్టించి అడిగాడు.

వదిలేట్టు లేడు. ఒక క్షణం ఆలోచించి "ఆనంద నిలయం!" అన్నాను.

"అంటే?" మొహం చిట్లించాడు.

"ఏం లేదు." అంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాను.


(photos courtesy : Google)

Monday 15 April 2013

"ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగులరాట్నం!"


ఒక ముఖ్యమైన పెళ్లి. తప్పకుండా వెళ్ళాలి, వెళ్లి తీరాలి. అంటే పెళ్ళి ముఖ్యమైనదని కాదు. వెళ్ళకపోతే ఆ పెళ్ళికి పిలిచినవాడు రక్తకన్నీరు కారుస్తాడు, ఆపై నాతో స్నేహం మానేస్తాడు, నన్నో శత్రువుగా చూస్తాడు. ఈ వయసులో కొత్త స్నేహాల్ని వెతుక్కునే ఓపిక లేదు. అందుకని చచ్చినట్లు వెళ్ళాలి. ఆ రకంగా ఇది చాలా ముఖ్యమైన పెళ్లి.

మా ఊళ్ళో ఆటో ప్రయాణం నాకు ఇష్టమని చెబుతూ "నా పులి సవారి (ఇది చాలా డేంజర్ గురూ!)" అంటూ ఒక టపా రాశాను. అయితే నా ఆటో ప్రయాణ సాహస యాత్రలతో.. నాకున్న డస్ట్ ఎలెర్జీ వల్ల.. ఎలెర్జిక్ రైనైటిస్ (అర్ధం కాలేదా? జలుబు!) తిరగబెడుతుండటం వల్ల.. నాకు కారే గతని నా ముక్కు వైద్యుడు హెచ్చరించాడు. ఆల్రెడీ ముక్కుకి రెండు ఆపరేషన్లు చేయించుకున్న కారణాన.. ఆయన మాట గౌరవిస్తూ.. కారుని ఆశ్రయించాను.

నా డ్రైవర్ వయసులో నాకన్నా పెద్దవాడు. మంచివాడు. నిదానమే ప్రధానం అని నమ్మిన వ్యక్తి. అందుకే కారు స్లో మోషన్లో నడుపుతుంటాడు. ఒకసారి కొద్దిగా స్పీడ్ పెంచమన్నాను. 'మేడమ్ గారు ఊరుకోరు సార్!' అన్నాడు. అప్పట్నుండి నేనతనికి ఏమీ చెప్పలేదు. మన్మోహన్ సింగ్ లా బుద్ధిగా కూర్చుంటున్నాను. ఇదీ ఒకందుకు మంచిదే! నా పురము, నా పురజనుల్ని నిశితంగా, ప్రశాంతంగా గమనించే అవకాశం కలుగుతుంది.

అసలు నాకు మా గుంటూర్లో కారు ప్రయాణం అంతగా నచ్చదు. కారణం.. ఈ ఊళ్ళోనే నేను ఎన్టీఆర్ సినిమాలు చూడ్డం కోసం మండుటెండలో గంటల తరబడి సినిమా క్యూల్లో నించున్నాను. 'ముల్కీ డౌన్ డౌన్!' (నాకప్పుడు ముల్కీ అంటే ఏంటో తెలీదు) అంటూ దుమ్ము కొట్టుకుంటూ రోడ్లన్నీ నడిచాను. ఇచ్చట రోడ్లు, ధుమ్ము, ధూళి, ఉమ్ములు, ఉచ్చలు.. అన్నీ నాకలవాటే!

అంచేత కార్లో వెళ్తూ పరిసరాల్ని పరికిస్తుంటే.. ఏదో శవపేటిక లాంటి డబ్బాలోంచి ఊరిని చూస్తున్న భావన కలుగుతుంటుంది. ప్రజలతో సంబంధాలు తెగిపోయిన రాజకీయ నాయకుళ్ళా ఫీలవుతాను. అయిననూ తప్పదు. వయసు, అనారోగ్యం.. దురదృష్టవశాత్తు.. నన్ను జయించాయి.

సరే! రోడ్లన్నీ ఆటోల సమూహం. చీమల్లా మందలు మందలుగా జనం. ఇరువైపులా తోరణాల్లా రంగుల ఫ్లెక్సీలు. ఏదో కొత్త సినిమా రిలీజనుకుంటా. అయితే నాకు ఆ ఫ్లెక్సీల్లో మొహాలు తెలీదు. ఒకడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇంకోడు నల్లకళ్ళజోడుతో.. చిత్రవిచిత్ర భంగిమలలో ఎవరెవరివో మొహాలు. వీళ్ళంతా కొత్త హీరోలా?

కాదు.. కాదు. పరిశీలనగా చూడగా.. ఆ మొహాలు హీరోలవి కాదు.. ఆ హీరోకి అభినందనలు చెబుతున్న అభిమానులవి! అయితే మరి మన హీరోగారెక్కడ? ఫ్లెక్సీలో ఓ మూలగా ఇరుక్కుని బేలగా చూస్తున్నాడు! అభిమానం హద్దులు దాటడం అంటే ఇదే కామోలు! డబ్బు పెట్టేవాడిదే ఫ్లెక్సీ.. ఫ్లెక్సీ పెట్టించినవాడే అభిమాని!

దార్లో అక్కడక్కడా.. కళ్యాణ మంటపాలు. మంటపాల ఎంట్రన్స్ వద్ద 'నేడే చూడండి' అన్నట్లు పెళ్లి చేసుకునేవాళ్ళ భారీ ఫ్లెక్సీలు! బరువైన నగలతో పెళ్ళికూతురు, శర్వాణిలో పెళ్ళికొడుకు.. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు పడిపోయి.. దాదాపు కౌగలించుకున్నట్లున్న పోజులతో ఫోటోలు. వాటిపై ఫోకస్ లైట్లు. కొంపదీసి ఈ జంటలకి ఇంతకుముందే పెళ్ళైపోయిందా!

ఓహ్! ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా పెళ్ళి తరహాలో చేస్తున్నారు కదూ! బహుశా అప్పటి ఫోటోలై ఉంటాయి. అయితే.. ఆ ఫోటోలతో ఇంత గ్రాండ్ గా ఫ్లెక్సీలెందుకు పెట్టారబ్బా! బహుశా.. నాలాంటి ఆబ్సెంట్ మైండెడ్ ఫెలో పొరబాటున ఒక పెళ్ళికి వెళ్ళబోయి ఇంకో పెళ్ళికి వెళ్ళకుండా ఆపడానికయ్యుంటుంది. సర్లే! పెళ్ళంటే నూరేళ్ళ మంట! ఈ ఒక్కరోజైనా ఆర్భాటంగా ఉండనిద్దాం. మన సొమ్మేం పోయింది!?
పెళ్ళి జరుగుతున్న హాల్లో అడుగెట్టాను. అది చాలా పెద్ద హాల్. ఎదురుగా పెళ్ళికొడుకు, కూతురు.. నమస్కారం పెడుతున్నట్లు చేతులు జోడించి.. శిలావిగ్రహాల్లా కూర్చునున్నారు. ఒకపక్క అక్షింతలు వెయ్యడానికి ఓ పెద్ద క్యూ ఉంది. నేను కూడా క్యూలో నిలబడి.. అక్షింతలు వేస్తూ విడియోలో హాజరు వేయించుకుని 'హమ్మయ్య' అనుకున్నాను. నా స్నేహం నిలబడింది. శీలపరీక్షలో నెగ్గాను!

పెళ్ళికొడుకు మరీ అమాయకుళ్ళా ఉన్నాడు. వీడికి ముందుంది ముసళ్ళ పండగ. వాణ్ణి పరీక్షగా చూస్తే.. అమ్మోరికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్న మేకపిల్లలా అనిపించాడు. ఏం చేస్తాం? ఈ వెధవల గూర్చి "దీపం పురుగుల అజ్ఞానం!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను. సమాజానికి నా సందేశమైతే ఇచ్చాను గానీ.. చదివేవాడేడి?

సరే! వచ్చిన పని అయిపోయింది. ఇవ్వాళ ఆదివారం. కొంపలు ముంచుకుపోయే పన్లేమి లేవు. తెలిసినవాడెవడూ కనబడ్డం లేదు. కొద్దిగా ఆ భోజనాల వైపు వెళ్ళి చూస్తే పోలా! అనుకుంటూ అటుగా నడిచా. అక్కడందరూ చేతిలో ప్లేట్లతో దర్సనమిచ్చారు. క్షణకాలం ముష్టివాళ్ళు సామూహికంగా బిక్షాపాత్రలతో తిరుగాడుతున్నట్లుగా అనిపించింది.

నాకా పెళ్ళిలో భోంచేసే ఉద్దేశ్యం లేదు.. అయినా ఆహార పదార్ధాలు చూట్టం మూలంగా జిహ్వాచాపల్యం కలుగుతుందేమోనని భోజన పదార్ధాల వైపు దృష్టి సారించాను. నాకు తెలిసిన వంకాయ, బీరకాయ, దొండకాయల కోసం వెదికాను. ఎక్కడా కాయగూరల అనవాళ్ళు లేవు. అక్కడున్నవన్నీ చూడ్డానికి తప్పితే తినేందుకు పనికొచ్చేట్లుగా లేవు. మంచిదే. తినేవాడు తింటాడు. లేపోతే లేదు. ఎవడి గోల వాడిది.

ఈలోగా.. మదీయ మిత్రుడొకడు కనిపించాడు. వాడి పక్కన నగలు, పట్టుచీర మోస్తూ ఒక నడివయసు మహిళ.. అతని భార్య అనుకుంటాను.. నన్ను చూస్తూ పలకరింపుగా నవ్వాడు. సన్నగా నవ్వుతూ ముందుకు సాగిపోయాను. భార్య పక్కన ఉన్నప్పుడు స్నేహితుల్తో మాట్లాడరాదనే నియమం నాకుంది. ఈ విషయంపై "నమస్కారం.. అన్నయ్యగారు!" అంటూ ఓ పోస్టు కూడా రాశాను.

ఫంక్షన్ హాల్ బయటకొచ్చి డ్రైవర్ కోసం ఫోన్ చేశాను. అతను భోంచేస్తున్నాట్ట. రోడ్డుపై నిలబడి ఫంక్షన్ హాల్ వైపు దృష్టి సారించాను. కళ్ళు చెదిరే లైటింగ్! పక్కనే చెవులు పగిలే మోతతో జెనరేటర్లు! కొంపలు మునిగిపోతున్నట్లు హడావుడిగా లోపలకెళ్ళేవాళ్ళు.. బయటకొచ్చేవాళ్ళు. ఎందుకో!

"ఇంతేరా ఈ జీవితం. తిరిగే రంగులరాట్నం.. " అనే ఘంటసాల పాట జ్ఞాపకం వచ్చింది. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్లు చేసుకుంటూనే ఉంటారు. ఇంకోపక్క చచ్చేవాళ్ళు చస్తూనే ఉంటారు! ఘంటసాల పాటలో ఎంత అర్ధం ఉంది!


(photos courtesy : Google)

Friday 12 April 2013

భార్యే మాయ! కాపురమే లోయ!!

హెచ్చరిక : ఈ టపా మగవారికి ప్రత్యేకం. ఆడవారు చదవరాదు.


అతనో చిరుద్యోగి. మంచివాడు. మృదుస్వభావి. పుస్తక ప్రియుడు. తెల్లనివన్ని పాలు, నల్లనివన్ని నీళ్ళనుకునే అమాయకుడు. సాధారణంగా ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఏదోక దుర్గుణం కలిగి ఉంటాడు. మనవాడి దుర్గుణం.. కవిత్వం పిచ్చి!

స్నేహితుడి చెల్లెల్ని చూసి ముచ్చటపడి ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో ప్రేమని పెళ్ళిగా మార్చుకున్నాడు. కొత్తగా కాపురానికొచ్చిన భార్యని చూసి 'జీవితమే సఫలము.. రాగ సుధా భరితము.. ' అనుకుంటూ తెగ ఆనంద పడిపొయ్యాడు.

భార్య కూడా భర్త కవిత్వానికి తీవ్రంగా మురిసిపోయింది. ఆవిడకి తన భర్త కవిత్వంలో శ్రీశ్రీ మెరుపు, దాశరధి విరుపు, ఆత్రేయ వలపు కనిపించాయి. ఆయనగారి కవితావేశానికి కాఫీలందిస్తూ తన వంతు సహకారం అందించింది.

ఆ విధంగా ఆవిడ అతనిలో విస్కీలో సోడాలా కలిసిపోయింది. ఇప్పుడు వారి జీవితం మల్లెల పానుపు, వెన్నెల వర్షం. ఆ విషయం ఈ పాట చూస్తే మీకే తెలుస్తుంది.




కొన్నాళ్ళకి.. భార్యకి భర్త తాలూకా కవితామైకం దిగిపోయింది. కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో పనికిమాలిన సాహిత్యపు పుస్తకాలు తప్పించి.. పనికొచ్చే ఒక్క వస్తువూ లేదన్న నగ్నసత్యాన్ని గ్రహించింది.

'ఏమిటీ కవితలు? ఎందుకీ పాటలు?' అని ఆలోచించడం మొదలెట్టింది. తత్ఫలితంగా ఆవిడకి దాహం వెయ్యసాగింది. అంచేత.. చల్లని నీటి కోసం లేటెస్ట్ మోడెల్ ఫ్రిజ్ కొందామని భర్తనడిగింది.

"ఫ్రిజ్ ఎందుకె చిన్నాదానా.. కష్టజీవుల మట్టికుండ లుండగా.. " అంటూ పాటెత్తుకున్నాడు మన భావుకుడు. భార్య నొసలు చిట్లించింది.

భర్త ఆఫీసుకెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. అంచేత లేటెస్ట్ మోడెల్ సోని LED టీవీ కొందామని భర్తనడిగింది..

"టీవీలెందుకె పిల్లాదానా.. పచ్చని ప్రకృతి పురులు విప్పి ఆడగా.. " అంటూ కవితాత్మకంగా చెప్పాడు మన కవి. భార్యకి చిరాకేసింది.

ఎండలు మండిపోతున్నాయ్. ఉక్కపోతగా ఉంది. లేటెస్ట్ మోడెల్ ఏసీ కొందామని భర్తనడిగింది.

"వట్టివేళ్ళ తడికెల తడిలో.. చెలి చల్లని చెక్కిలిపై నా మది సేద తీరగా.. " అంటూ లలితగీతం పాడాడు. భార్యకి మండిపోయింది. అన్నకి కబురు చేసింది.

అన్న పీకల్లోతు అప్పుల్లో, తీవ్రమైన కరువులో ఉన్నాడు. పీత కష్టాలు పీతవి! లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్, టీవీ, ఏసీ కొనటం లేదని.. అతనికి భార్య తిండి పెట్టకుండా వారం రోజులుగా కడుపు మాడ్చేస్తుంది. చెల్లి కబురందుకుని పరుగున వచ్చాడు. చెల్లి కష్టాలు విన్న అన్న గుండె తరుక్కుపోయింది. హృదయం కదిలిపోయింది. కడుపు మండిపోయింది.

హుటాహుటిన చెల్లిని బజారుకి తీసుకెళ్ళి పేద్ద ఫ్రిజ్, ఇంకా పెద్ద సోనీ LED టీవీ, అతి నిశ్శబ్దంగా పంజేసే అత్యంత ఖరీదైన ఏసీ.. ఇంకా చాలా.. 'జీరో' డౌన్ పేమెంట్, 'ఆల్ పేమెంట్ ఓన్లీ ఇన్ ఇన్స్టాల్మెంట్స్' అనబడే వాయిదాల పద్ధతి స్కీములో (దీన్నే ముద్దుగా EMI అంటారు).. బావగారి పేరు మీద కొనిపించాడు. పన్లోపనిగా చెల్లెలి ఖాతాలో అవన్నీ తనూ తీసేసుకున్నాడు ముద్దుల అన్న!

'ఏమిటివన్నీ?' అంటూ ఆశ్చర్యంగా అడిగిన భర్తకి కాఫీ ఇచ్చి.. "పయనించే మన వలపుల నావ.. " అంటూ పాడింది భార్యామణి. మొహం చిట్లించాడు కవి. ఏసీ ఆన్ చేస్తూ "నీ మది చల్లగా.. స్వామి నిదురపో.. " అంటూ ఇంకో పాటెత్తుకుంది భార్య. ఖిన్నుడైనాడు కవి! హృదయం మూగగా రోదించింది. గోలగా ఘోషించింది. ఘోరంగా ఘూర్ఘించింది.

తనకొచ్చే జీతంతో EMI లు, కరెంట్ బిల్లులు కట్టలేక విలవిలలాడిపొయ్యాడు మన కవి పుంగవుడు. దిక్కు తోచక అప్పులు చెయ్యసాగాడు. అప్పులు చెయ్యడమే కానీ.. తీర్చే మార్గం కనబడ్డం లేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. దిగులుతో చిక్కి.. చూడ్డానికి రోగిస్టివాడిలా కనిపించసాగాడు. సహజంగానే కవితా గానం గాయబ్ అయిపోయింది.

ఆర్ధిక బాధలు తట్టుకోలేక.. ఓ మంచిరోజు ఇంట్లోంచి వెళ్ళిపొయ్యాడు. ఊరవతల ఓ కుళ్ళు వీధిలో కరెంట్ స్థంభానికి అనుకుని.. వీధి కుక్కని నిమురుతూ తన దుస్థితికి కుమిలిపోసాగాడు. అరె! చాల్రోజులకి మళ్ళీ కవిత్వం పొంగింది! దిగులుగా, ఆవేదనగా, ఆర్తిగా, నిర్వేదంగా, నిస్సారంగా, నీరసంగా.. జీవత సారాన్ని నెమరు వేసుకుంటూ పాడటం మొదలెట్టాడు.. పాపం!

అతను పాడుకుంటున్న పాట చూడండి.

< />
భర్త కనపడక భార్య తల్లడిల్లింది. భయపడిపోయింది. 'తన భర్త లేకపోతే.. EMI కట్టేదెవరు? ఈ టీవీ, ఫ్రిజ్, ఏసీ.. మైగాడ్.. ఇవన్నీ ఏమైపోవాలి? షాపువాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే నే బ్రతికేదెట్లా? అయ్యో! భగవంతుడా! ఏ ఆడదానికీ రాని కష్టాన్ని నాకు కల్పించావేమయ్యా? ఇది నీకు న్యాయమా? ధర్మమా?' అంటూ దేవుణ్ని వేడుకుంది.

పిమ్మట తేరుకుంది. తదుపరి.. ఓ జట్కాబండి బాడుగకి మాట్లాడుకుని.. పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు వెతికినట్లు.. భర్త కోసం వీధులన్నీవెదకసాగింది. మొత్తానికి భర్త దొరికాడు. EMI కట్టించే నిమిత్తం.. అతగాణ్ణి బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళింది. కథ దుఃఖాంతం!

(photo courtesy : Google)

Tuesday 9 April 2013

వొంసె సంకరం.. ఎంత గోరం!


"ఎంతన్నాయం! గోరం జరిగిపోతంది."

"ఏందిరా?"

"ఆళ్ళెవళ్ళో ఎన్టీవోడి బొమ్మని వయ్యస్ బొమ్మతో కలిపేసారంట!"

"అయితే యేంది?"

"మడిసన్నాక మంచీసెబ్బర ఉండక్కర్లా? ఎన్టీవోడు బాలయ్య బాబు సొత్తు. వయ్యస్ జగన్ బాబు సొత్తు. యాడైనా అబ్బల సొత్తు కలిపేత్తారా?"

"కలిపేత్తే ఏవవుద్ది?"

"అరే యెదవా! నీ పొలం నా పొలంలో కలుపుకు దొబ్బితే నీక్కాలదు?"

"నాకెందుక్కాలుద్ది? నువ్వు కలిపేసుకొటాకి నాదెగ్గిరసలు పొలవుంటేగా!"

"ఓరి తిక్కల నాయాలా! ఎన్టీవోడి వొంసెం, వయ్యస్ వొంసెం యేరేరు. ఆళ్ళు సేసిన అబివుర్దులు యేరేరు. పెళ్ళిసమ్మందం కలుపుకున్నట్లు యాడైనా అబివుర్దులు కలిపేసుకుంటారా? అట్టా అడ్డగోలుగా వొంసాలు, అబివుర్దులు కలిపేస్తే రేపు ఓటేసేవోడికి అరదం కావొద్దా?"

"అరదం కాపోతే మానె! ఓట్ల మిసనీ యాడ నొక్కినా 'కుయ్' మంటది గదా! దానికి వొంసెంతో పనేంది?"

"ఒరే యెదవన్నర యెదవా! మడిసి కన్నా వొంసెం గొప్పదిరా సన్నాసి. నీ అయ్య పుటో నా ఇంట్లో పెడితే నేనూరుకుంటానా యేంది?"

"ఊరుకోమాక. అయినా నువ్వెట్టుకొటాకి నాదెగ్గిర మా అయ్య పుటో ఉంటేగదా!"

"వామ్మో! ఓర్నాయనో! నీకు దండాల్రా బాబూ! రెండు దినాల్నించి టీవీల్లో ఈ ఇసయం మీద సొక్కాలు సించుకుంటా అరుస్తా వుండారు. నీ యెదవ మొకానికి ఎంత సెప్పినా అరదం అయ్యి సావదు. నిన్ను ఆడికి పంపిస్తే ఆళ్ళకి మెంటలెక్కుద్ది."

"ఎక్కనీ! నాకేంది? అయినా మా ఇంట్లో టీవీ యాడుండాది? ఆ టీవీ బొమ్మలోళ్ళు సెప్పే పోసుకోలు కబుర్లు ఇంటా కూకోటానికి నేన్నీలాగా పనీపాటా లేని యెదవననుకున్నావా యేంది!"

"ఆఁ!"

(photos courtesy : Google)

Friday 5 April 2013

నందుని చరిత - ఘంటసాల ఘనత



నేను చిన్నప్పుడు ఘంటసాల పాటలు వింటూ పెరిగాను. అయితే ఆ పాటలు ఘంటసాల పాడినట్లు అప్పుడు నాకు తెలీదు. ఆ పాటలు రామారావు, నాగేశ్వరరావులే పాడుతుండే వాళ్ళనుకునేవాణ్ని. కొన్నాళ్ళకి ఆ గొంతు ఘంటసాలదని తెలుసుకున్నాను. ఇంకొన్నాళ్ళకి ఘంటసాల గొప్ప గాయకుడని అర్ధం చేసుకున్నాను. అయితే ఘంటసాల విశ్వరూప దర్శనం నాకు 'జయభేరి' సినిమా చూస్తుండగా కలిగింది.

సరే! 'జయభేరి' పాటల గొప్పదనాన్ని ఇవ్వాళ నేను ఇక్కడ రాసేదేమీ లేదు. దాదాపు అన్ని పాటలు బాగుంటాయి. బెస్ట్ ఆఫ్ జయభేరి? రకరకాల సమాధానాలు. క్లాసికల్ ప్రేమికులు 'రసికరాజ తగువారము కాదా.. ' చెబుతారు. ప్రేమికులు 'రాగమయి రావే.. ', 'యమునా తీరమున.. ' అంటుంటారు. నాకైతే 'నందుని చరితము.. ' పాట ఒక అద్భుతంగా తోస్తుంది.

'జయభేరి' చూడనివారి కోసం.. ఈ పాట సందర్భం సంక్షిప్తంగా రాస్తాను. హీరో పేరు కాశీనాథశాస్త్రి, గొప్ప సంగీత విద్వాంసుడు. కళకి క్లాస్ డిస్క్రిమినేషన్ ఉండరాదని నమ్ముతాడు. నమ్మిన సత్యాన్ని ఆచరించగలిగిన సాహసి. అందుకే గురువుని, అన్నావదినల్ని ఎదిరించి వీధి నాటాకాలాడే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.

మహారాజు కాశీనాథుని ప్రతిభని మెచ్చి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తాడు. అతను ఇంత స్థాయి పొందడాన్ని సహించలేని రాజగురువు, రాజనర్తకిలు కుట్ర పన్ని తాగుబోతుగా మార్చేస్తారు. ఒకనాడు మహారాజు అజ్ఞాపించినప్పుడు కూడా పాడటానికి నిరాకరించి రాజాగ్రహానికి గురై వీధిన పడతాడు కాశీనాథుడు.

గుళ్ళో హరికథ జరుగుతుంటుంది. ఒక 'అంటరానివాడు' జ్వరంతో తీసుకుంటున్న తన కూతురితో కలిసి గుడి బయట నుండే దేవునికి మొక్కుతాడు. ఆగ్రహించిన గుళ్లో బ్రాహ్మణులు అతన్ని నెట్టేస్తారు. మద్యం మత్తులో అటుగా వెళ్తున్న కాశీనాథశాస్త్రి ఆ తండ్రీకూతుళ్లకి దేవుని దర్శనం చేయించడానికి విఫలయత్నం చేసి.. తనూ గెంటివేయబడతాడు.

ఈ అరాచకానికి కాశీనాథశాస్త్రి కలత చెందుతాడు, ఆవేదన చెందుతాడు. మహారాజు కోరినా పాడనని మొరాయించిన ఆ స్వరం ఒక్కసారిగా జీవం పోసుకుంటుంది, ఆవేశంతో పరవళ్ళు తొక్కుతుంది, ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటుంది. వెంటనే గొంతెత్తి నందుని చరితాన్ని ఆలాపించడం మొదలెడతాడు. ఇదీ పాట సందర్భం. 



ఈ పాట సందర్భాన్ని పి.పుల్లయ్య పెండ్యాలకి వివరించి ఉంటాడు. పెండ్యాల నాగేశ్వరరావు వరసలు చక్కగా కట్టి ఉంటాడు. ఏ దర్శకుడికైనా, సంగీత దర్శకుడికైనా ఎన్నో కోరికలుంటాయి. కానీ గాయకుల ప్రతిభని దృష్టిలో వుంచుకుని కొన్ని పరిమితులు ఏర్పరచుకుంటారు. డొక్కుకారుని అతి వేగంతో నడపితే యాక్సిడెంటవదా మరి!

ఘంటసాల వాయిస్ రేంజ్ అప్పుడే షో రూమ్ డెలివరీ అయిన కొత్తకారు వంటిది. ఇక నడిపేవాడిదే ఓపిక, ఆకాశమే హద్దు. సంగీత దర్శకుడు ఏ బాణీనైనా, ఏ శృతిలోనైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 'ఘంటసాల లక్జరీ' ని ఎస్.రాజేశ్వరరావు దగ్గర్నుండీ అందరూ అనుభవించినవారే!

మళ్లీ 'అధికులనీ అధములనీ.. ' పాట దగ్గర కొద్దాం. ఈ పాట ఎత్తుగడే చాలా హై పిచ్‌లో ఉంటుంది. అన్యాయానికి స్పందించిన ఒక మహాగాయకుని ఆవేదన, ఆర్ద్రత, ధర్మాగ్రహం.. అంతటినీ ఘంటసాల గీతాలాపనలో వినవచ్చు.

నటించింది అక్కినేని నాగేశ్వరరావైనా.. సన్నివేశానికి ఘంటసాల గొంతు పదిరెట్లు ఊపునిస్తుంది. ఈ పాటని నేను చాలాసార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా.. నాకీ పాట ఒక అద్భుతంగా తోస్తుంది ('జయభేరి' మన మనసులో ఇవ్వాళ్టిక్కూడా మిగిలిపోడానికి ప్రధాన కారకుడు ఘంటసాల అని నా నిశ్చితాభిప్రాయం). 

అయితే - నాకు ఘంటసాల ఫోటోల్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. ఇంతటి అసమాన ప్రతిభావంతుడు అతి సామాన్యుడిలా, అమాయకంగా కనిపిస్తుంటాడు. ఘంటసాలకి తనెంతటి ప్రతిభాసంపన్నుడో తనకే తెలీనంత అమాయకుడని నా అనుమానం! ఘంటసాల తెలుగు పాటని హిమాలయాలంత ఎత్తున ప్రతిష్టించాడు, ఇది తెలుగువారి అదృష్టం.

నాకు మేనమామ వరసయ్యే ఒకాయనకి పెళ్లీపెటాకుల్లేవు, ఉద్యోగం సద్యోగం లేదు, పనీపాటా లేదు, ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. సాధారణంగా ఇట్లాంటివాళ్లకి ఏదొక హాబీ ఉంటుంది. మా మేనమామకి సినిమా పాటల హాబీ. అదో పిచ్చి. పొద్దస్తమానం ఏవో గ్రామ్ ఫోన్ రికార్డులు వింటూ, వాటిని తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. సినిమా పాటల పరిజ్ఞానం దండిగా వుంది.

ఓసారి ఆయనేదో పెళ్లిలో కనిపిస్తే అడిగాను. 

"కచేరీల్లో ప్రతి తలకి మాసిన వెధవ ఘంటసాలలా తెగ ఫీలైపోతూ.. 'రాగమయి రావే', 'నీలిమేఘాలలో' అంటూ సెలెక్టివ్‌గా కొన్నిపాటల్నే హత్య చేస్తారేమి! ఆ గార్ధభోత్తములు 'నందుని చరితము.. ' జోలికి ఎందుకు పోరు?" అని. 

ఆయన ఒక క్షణం ఆలోచించాడు, ఆపై విషయం తేల్చేశాడు.

"ఆ పాట పాడటం చాలాచాలా కష్టం, శృతి చాలదు. నా లెక్కప్రకారం 'నందుని చరితము' పాడ్డానికి ఎవడైనా సాహసించినా.. పాటయ్యేలోపు గిద్దెడు నెత్తురు కక్కుకుని చస్తాడు. చావుకి తెగించి ఎవడైనా ఎలా పాడతాడు?" అన్నాడు.

నిజమే కదా! ఎవరికైనా తమ గానంతో జనాల ప్రాణాలు తియ్యాలనే సరదా వుంటుందిగానీ.. తమ గానంతో తమ ప్రాణాలకే యెసరు ఎందుకు పెట్టుకుంటారు?! 

'మామా! నువ్వు కరెక్టుగానే చెప్పావు!'

(fb post on 15/ 1 / 2018)

Wednesday 3 April 2013

రావిశాస్త్రి పూజావిధానం


వర్షం జల్లుగా కురుస్తుంది. పేషంట్లని చూడ్డం అయిపోయింది. విసుగ్గా వుంది. ఏం చెయ్యాలి? తెలుగు టీవీ వార్తలు చూసే ధైర్యం లేదు. పోనీ ఏదైనా ఒక తెలుగు కథ చదివితే ఎలా వుంటుంది? ఏమో! కష్టపడి కథంతా చదివాక.. తీరా అదో చెత్త కథైతే? ఇప్పుడంత రిస్క్ తీసుకునే అవసరముందా? లేదు కదా! మరైతే ఈ విసుగుని అధిగమించుట ఎట్లు? సింపుల్! చదివిన రచయితనే మళ్ళీ చదివేద్దాం.

ఎదురుగా టేబుల్ మీద రావిశాస్త్రి నవ్వుతూ నన్నే చూస్తున్నట్లుగా అనిపించింది. 'బాకీ కథలు' తీసుకున్నాను. 'ద్వైతాద్వైతం' కథ చదవడం మొదలెట్టాను. ఇప్పటికీ కథ ఎన్నిసార్లు చదివుంటాను? గుర్తు లేదు. కథ మొదటి భాగం పులి చెబుతుంది. రెండో భాగం నల్లమేక చెబుతుంది. క్రమంగా కథలో లీనమైపోయ్యాను. రావిశాస్త్రి సిమిలీల వర్షంలో తడిసి ముద్దైపోసాగాను. రావిశాస్త్రి శిల్ప చాతుర్యానికి అబ్బురపడుతూ (ఇది నాకలవాటు).. హోరున ప్రవహిస్తున్న వాక్యాల సుడిగుండంలో గింగరాలు తిరుగుతూ మునిగిపోతూ (ఇదీ నాకలవాటే) -

'ఆహాహా! ఏమి ఈ రావిశాస్త్రి రచనా చాతుర్యము! అయ్యా శాస్త్రిబాబు! నువ్వేగనక రాయకపోయినట్లైతే - తెలుగు సాహిత్యం గుడి మెట్ల మీద అడుక్కు తింటుండేది! అరిగిపోయిన సైకిల్ ట్యూబులకి పంచర్లు వేసుకుంటుండేది! దెబ్బ తగిలిన గజ్జికుక్కలా బీదగా, దీనంగా, బాధగా ఏడుస్తుండేది! నువ్వు తెలుగు కథకి రాజువి, రాజాధిరాజువి. నువ్వు మనిషివా? కాదు, కానే కాదు. దేవుడవు, దేవదేవుడవు. పూర్వజన్మలో నువ్వు మోపాసావి! కాదు కాదు చెహోవ్‌వి! కాదు కాదు ఇంకా అంతకన్నా వందరెట్లు ఎక్కువగా.. " అనుకుంటూ ఆనందడోలికలలో తేలియాడుచుండగా -

"రవఁణమావా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బూ! సమయానికోచ్చావ్! రావిశాస్త్రి అక్షరాన్ని ఆనందంగా అనుభవించేస్తున్నాను, మనసారా మజా చేస్తున్నాను! రావిశాస్త్రి ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్! కాదన్నవాణ్ణి కత్తితో కసకసా పొడిచేస్తాను. ఔనన్నవాడిని హృదయానికి ఘాట్టిగా హత్తుకుంటాను." కవితాత్మకంగా అన్నాను.

రావిశాస్త్రి సుబ్బుక్కూడా ఇష్టం. అంచేత ఎప్పట్లా నాతో వాదనలకి దిగలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. నాలో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

"సుబ్బూ! మనం మన రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలి. ఒక సొవనీర్.. ఒక కథల వర్క్ షాప్.. ఒక శిలావిగ్రహం.. ఏదైనా పర్లేదు. ఏదోటి చేసేద్దాం. ఏవఁంటావ్?" ఎక్సైటింగ్‌గా అన్నాను.

"రవణ మావా! రావిశాస్త్రికి నువ్వు చేసేదేముంది? ఆయన పోయి చాలా కాలమైంది. బ్రతికున్నట్లయితే మన దినకర్ పంపించిన సింగిల్ మాల్ట్ సీసాలు ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, ఆ కాళ్ళకి నమస్కారం చేసి - 'మా రాచకొండకి మంగళారతులు! మా కథల తండ్రికి సీసాల దండలూ' అంటూ పాడి మన భక్తిని చాటుకునేవాళ్ళం." అన్నాడు సుబ్బు.

సుబ్బు మాటలకి నాకు నవ్వొచ్చింది.

"ఒరే నాయనా! రావిశాస్త్రికి ఏదైనా చెయ్యాలంటే ఆయనకి వ్యక్తిగతంగా చెయ్యాలని కాదు. ఆయన జ్ఞాపకార్ధం ఏదైనా చెయ్యాలని! అర్ధమైందా?" అన్నాను.

సుబ్బు నవ్వుతూ అన్నాడు.

"అంటే ఇష్టమైన వాళ్ళకి ఏదోటి చేసి ఋణం తీర్చుకోవాలంటావ్! అంతేనా? అప్పుడు మన లిస్టులో చాలా వచ్చి చేరతాయి. ఉప్మా పెసరట్టు, ఫిల్టర్ కాఫీ, సింగిల్ మాల్ట్.. ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇవేం పాపం చేశాయి?"

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"రుచిగా ఉండటం ఉప్మాపెసరట్టు ధర్మం. ఆ రుచికి మనం బానిసలం. ప్రతిరోజూ ఆ పెసరట్టు ముండని ప్రేమగా కొబ్బరిచట్నీతో నంజుకు తినుటయే దానికి నువ్విచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. అంతేగానీ ఉప్మా పెసరట్టుకి శిలావిగ్రహం పెట్టిస్తావా? పెట్టించవు గదా!"

"రావిశాస్త్రి రచనల్ని ఉప్మా పెసరట్టుతో పోలుస్తున్నావు. చాలించు నీ వితండ వాదం. నీతో ఇదే సమస్య. విషయాన్ని కాంప్లికేట్ చేసేస్తావు." విసుక్కున్నాను.

సుబ్బు నా మాట పట్టించుకోలేదు. చెప్పడం కొనసాగించాడు.

"రావిశాస్త్రి అత్యున్నత రచయిత. బుద్ధున్నవాడైనా కాదంటాడా? అంచేత ఆయన రాసి పడేసిన సాహిత్యం చదువుకో. తనివి తీరకపోతే మళ్ళీ చదువుకో, మళ్ళీమళ్ళీ చదువుకో, కళ్ళు నొప్పులు పుట్టేలా చదువుకో, కళ్ళజోడు అరిగిపొయ్యేలా చదువుకో! అయితే ఆయన ఎవరి కోసం, ఏ సమాజం కోసం రాశాడో వారి గూర్చి ఆలోచించు. అంతేగానీ - తెలుగు సినిమా హీరో అభిమానిలా వెర్రిగా ఆలోచించకు."

"ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?" డిజప్పాయింటింగ్‌గా అడిగాను.

"'ద్వైతాద్వైతం' చదవడం అయిపోయాక 'రాజు-మహిషి' చదువుకో. నా దృష్టిలో 'రాజు-మహిషి' రావిశాస్త్రి ఆల్ టైమ్ బెస్ట్." అన్నాడు సుబ్బు.

"కానీ - రావిశాస్త్రి 'రాజు-మహిషి' కథ పూర్తి చెయ్యలేదుగా?" నిరాశగా అన్నాను.

"కథ ఎవడిక్కావాలోయ్! కథలే కావాలనుకుంటే చందమామ చదువుకో! అసలు రావిశాస్త్రి కలం నుండి జాలువారిన ప్రతివాక్యం ఒక అద్భుతం. రావిశాస్త్రి రచనల్లో కథ వెతుక్కునే నీలాంటి నిర్భాగ్యులు ఉండటం మన తెలుగు సాహిత్య దౌర్భాగ్యం."

"నాకదంతా తెలీదు సుబ్బు! నేను రావిశాస్త్రికి నివాళులు అర్పించాల్సిందే. ఏదైనా మార్గం చెప్పు." పట్టుదలగా అన్నాను.

ఒకక్షణం ఆలోచించాడు సుబ్బు.

"ఓకే! రాత్రికి మళ్ళీ కలుద్దాం. ఈలోపు నీ దగ్గరున్న రావిశాస్త్రి పుస్తకాలన్నీ ఒకచోటకి చేర్చు. అ పుస్తకాలన్నింటికి పసుపు రాయించి కుంకుమతో బొట్లు పెట్టు. నీదగ్గర రావిశాస్త్రి పటం ఉందిగా! దానికో పేద్ద పూలదండ వేయించు, అంబికా దర్బార్ బత్తి వెలిగించి.. "

"అర్ధమైంది. కొబ్బరికాయలు కొట్టి గంట గణగణ లాడించి ప్రసాదం పంచాలి." విసుక్కున్నాను.

"చెప్పేది పూర్తిగా విను మిత్రమా! దేవుళ్ళకి నైవేద్యం పెడతాం. విఘ్నేశ్వరుడుకి ఉండ్రాళ్ళు, వెంకటేశ్వరుడుకి లడ్లు. అంటే ఏ దేవుడికి ఇష్టమైన పదార్ధం ఆ దేవుడికి నైవేద్యంగా పెడతాం. కదా? ఇక్కడ మన దేవుడెవరు? రావిశాస్త్రి. కదా? మరి రావిశాస్త్రికి నైవేద్యంగా ఏం పెడతావు?"

"నువ్వే చెప్పు."

"మనం రావిశాస్త్రికి నైవేద్యంగా 'గ్లెన్‌ఫెడిచ్' పెడదాం. ఆ పక్కనే బిస్లరీ సోడాలు, గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ సిగరెట్లు పెడదాం." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"తరవాత?" ఆసక్తిగా అడిగాను.

"ఇప్పుడు మనం వినాయక చవతి పూజ మోడల్‌ని ఫాలో అవుదాం! అయితే ఈ పూజలో మనం చదివబొయ్యేది రావిశాస్త్రి సాహిత్యం."

"నేను అల్పజీవి చదువుతాను." ఉత్సాహంగా అన్నాను.

"నీ ఇష్టం. అల్పజీవి కాకపొతే సారాకథలు చదువుకో! దీన్నే 'రావిశాస్త్రి పూజావిధానం' అందురు. పూజా సమయంలో గ్లెన్‌ఫెడిచ్ బాటిల్, సిగరెట్ పెట్టెలు రావిశాస్త్రి పటం ముందుంచాలి. చివర్లో - 'ఓం! గ్లెన్‌ఫెడిచ్ సమర్పయామి! ఓం! గోల్డ్‌ఫ్లేక్ సమర్పయామి!' అని మూడుసార్లు అనాలి. అప్పుడవి ఆటోమేటిగ్గా ప్రసాదంగా మారిపోతాయి."

"మారిపోతే?"

"పిచ్చివాడా! దేవుని ప్రసాదాన్ని ఏం చేస్తాం? అవతల పడేస్తామా? అది మహాపాపం. ఆరగిస్తేనే పూజాఫలం దక్కేది. అందునా ఆ ప్రసాదం ఎవరిది? మన ఇష్టదైవమైన శాస్త్రిబాబుది!"

"అంటే ఆ విస్కీ తాగేయ్యాలా?"

"అవును. విస్కీ తాగేయ్యాలి. సిగరెట్లు ఊదేయ్యాలి. ఆ విధంగా సుబ్బయ్య, ముత్యాలమ్మ, సార్వభౌమరావు, రత్తాలు-రాంబాబు, మరిడి మహాలక్ష్మి, వియత్నాం విమల-బంగారి గాడు, దూదిపులి, సూర్రావెడ్డు సాక్షిగా.. ఆ మహానుభావునికి నివాళులర్పిద్దాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! దీన్ని నివాళి అనరు. రావిశాస్త్రి పేరు చెప్పుకుని మందు కొట్టడం అంటారు. గ్లెన్‌ఫెడిచ్ వరకు ఓకే, కానీ సిగరెట్ మాత్రం నా వల్లకాదు. ఒక సిగరెట్ ఏడు రోజుల జీవితాన్ని తగ్గిస్తుంది."

"త్యాగయ్య, అన్నమయ్యలు జీవించిన కర్మభూమి మనది. ఏం? నీ దైవం కోసం ఓ మూణ్ణెల్లు ముందు చావలేవా? నువ్వసలు భక్తుడివేనా!? నేన్నీలా స్వార్ధపరుణ్ణి కాదు! ఎంత కష్టమైనా సరే! ఆ సిగెరెట్లన్నీ కాల్చిపడేస్తాను."

"ఈ నివాళి నాకు సమ్మతం కాదు. నీ ప్రపోజల్ నేనొప్పుకోను." స్థిరంగా అన్నాను.

సుబ్బు లేచాడు.

"నీ ఖర్మ! మంచి మాటలు నువ్వెప్పుడు ఆలకించావు గనక! ఇప్పటికే మాతృభాషా ప్రేమికుల సంఘం, గురజాడ భజన మండలి అంటూ పనికి మాలిన సంస్థలు చాలానే ఉన్నాయి. నువ్వు కూడా 'రావిశాస్త్రి అభిమాన సంఘం' అంటూ ఒకటి పెట్టుకో. ఆయన పుట్టిన్రోజు, పోయిన్రోజుల్ని పండగల్లా జరిపించు. ధర్మాసుపత్రిలో యాపిల్సు పంచు. రక్తదాన శిబిరం పెట్టు. నీలాంటి చౌకబారు అభిమాని రావిశాస్త్రికి ఉండటం ఆయన దురదృష్టం. ఏం చేస్తాం? పోయినవాళ్ళకి హక్కులుండవు గదా!" అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

విన్నపం -

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పూజలు వ్యక్తిగతం. ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు. రావిశాస్త్రిని తలచుకుంటూ సరదాగా రాసేశాను. సో.. టేకిట్ ఈజీ! 

(pictures courtesy : Google)