Friday, 30 June 2017

గోరక్షక దాడులు ఆగేనా?


రాజ్యంగం ప్రకారం భారద్దేశం సెక్యులర్ దేశం. అనగా రాజ్యానికి అన్ని మతాలూ సమానమని అర్ధం. ఈ దేశంలో అనేక మతాలున్నయ్. ఒక్కో మతానికి ఒక్కో జంతువు పవిత్రం లేదా అపవిత్రం. ఇవన్నీ ఆయా మతాల్ని తుచ తప్పకుండా అనుసరించేవారి సమస్య. సామాన్య ప్రజలకి విద్య, వైద్యం, ఉద్యోగం మొదలైనవి సమస్య (ఇవి ఒకదానికి ఇంకోటి interchangeable కాదు). 

మొన్న సార్వత్రిక యెన్నికల్లో సంఘపరివార్ శక్తులు అధికారంలోకి వచ్చాయి (ఇందుగ్గానూ వారు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి పాలనకి కృతజ్ఞులై వుండాలి). సంఘపరివార్‌కి ఈ దేశ ముస్లిములు శత్రువులు. ముస్లిముల్ని అణచడానికి వారికి దొరికిన చక్కని ఆయుధం 'గోరక్షణ'. ఇప్పుడు వారు చేస్తుంది - ఆవుగూర్చి విపరీతమైన హైప్ క్రియేట్ చెయ్యడం, గోరక్షక దళాల ద్వారా ముస్లిముల జీవించే హక్కు కాలరాయడం. ఈ వ్యవహారాలన్నీ పకడ్బందీ వ్యూహంతో నిరాటంకంగా అమలవుతున్న కుట్రపూరిత హత్యలు.

మన్ది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ప్రజలచే యెన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే పన్జెయ్యాలి, ప్రజలకి జవాబుదారీతనం వహిస్తూ పాలన సాగించాలి. మహమ్మద్ అఖ్లాక్ హత్య దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కొన్ని నెలల నిశ్శబ్దం తరవాత గోరక్షకులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని తీవ్రంగా హెచ్చరించారు. గోరక్షకులు నేరస్తులనీ, వారి గూర్చి రాష్ట్రాల నుండి నివేదిక తెప్పిస్తామని సెలవిచ్చారు. ఆనాడు ప్రధానమంత్రి కఠినంగా మాట్లాడ్డంతో నేను చాలా సంతోషించాను. ప్రధాని స్థాయి వ్యక్తి తల్చుకుంటే ఈ గోరక్షక హత్యలు చిటికెలో ఆగిపోతాయని ఆశించాను.

యే దేశంలోనైనా, దేశాధినేత స్థాయి వ్యక్తి హామీ ఇచ్చాక, ఆ దిశగా కొన్ని చర్యలు మొదలవుతాయి. అందువల్ల ప్రధాని ప్రసంగం తరవాత కేంద్రం రంగంలోకి దిగాలి. శాంతిభద్రతలు రాష్ట్రాల సబ్జక్ట్ అయినప్పటికీ కేంద్ర హోమ్ శాఖ రాష్ట్రాలకి సూచన జారీ చేసే అధికారం వుంటుంది. గోరక్షకుల కదలిక పట్ల నిఘా, ప్రజాసంఘాల యేర్పాటు తదితర చర్యలతో కూడిన పలు సూచనల్ని కేంద్రం యివ్వొచ్చు. కానీ కేంద్ర హోమ్ శాఖ ఆ దిశగా యెటువంటి చర్యలూ తీసుకోలేదు, సహజంగానే రాష్ట్రప్రభుత్వాలూ పట్టించుకోలేదు. ఆ విధంగా ప్రధాని దేశప్రజలకి ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోయింది.

ఇప్పుడు సబర్మతి ఆశ్రమంలో గోరక్షక ముఠాల హత్యల్ని ప్రధాని (మళ్లీ) తీవ్రంగా ఖండించారు. అందుగ్గానూ వారికి (మళ్లీ) ధన్యవాదాలు. అయ్యా! ఈ సారైనా మీ ఆగ్రహం నరహంతక గోరక్షక ముఠాల నిర్మూలనకి దారి తియ్యాలనీ, తద్వారా ఈ దేశంలో మరే యితర మూక దాడుల హత్యలు జరక్కుండా ఆగిపోవాలని కోరుకుంటున్నాను.

(fb post)

Wednesday, 28 June 2017

మిలిట్రీ బాబాయ్

ఈమధ్య యే టీవీ చానెల్ చూసినా మా మిలిట్రీ బాబాయే! పొడుగాటి ముక్కుతో, తీక్షణమైన కళ్ళతో, బొర్రమీసాల్తో - కోపానికి మనిషి వేషం వేసినట్లుంటాడు మా మిలిట్రీ బాబాయ్. రిటైరయ్యాక కాలక్షేపంగా వుంటుందని కొన్నాళ్లుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్నాడు. 

"కాశ్మీర్ లోయని కార్పెట్ బాంబింగ్ చెయ్యాలి."

"కాశ్మీరీ ప్రజల్ని థార్ యెడార్లో వదిలెయ్యాలి."

"స్టోన్ పెల్టర్స్‌ని బహిరంగంగా ఉరి తియ్యాలి."

"పాకిస్తాన్‌పై ఆటమ్ బాంబ్ పేల్చేందుకు ఇదే సరైన సమయం."

"కాశ్మీరీ స్త్రీల యాపిల్ బుగ్గల్ని పైనాపిల్ బుగ్గలుగా చేసెయ్యాలి."

మా మిలిట్రీ బాబాయ్ కోపం వణికిపోతున్నాడు.

పిన్నికి ఫోన్ చేశాను.

"పిన్నీ! ఈ వయసులో బాబాయ్ అరవకూడదు. ఆయనకసలే బీపీ, యెంత ప్రమాదమో తెలుసా?" అన్నాను.

"నేనేం చెయ్యను? అలా అరుస్తుంటే ఆయనకి సరిహద్దులో యుద్ధం చేసినంత మజా వస్తుందిట. ఆయనింట్లో వుంటే నన్నరుస్తాడు, ఆ టీవీ స్టూడియోల్లో వుంటేనే నాకు హాయి." అంది పిన్ని.  

(fb post)

Friday, 16 June 2017

సిన్మా లాజిక్

'సిన్మా ఎంజాయ్ చెయ్యాలంటే ప్రేక్షకుడు లాజిక్ అప్లై చెయ్యకూడదు' - వొప్పుకుంటున్నాను. కానీ లాజిక్‌ని అప్లై చెయ్యడం, చెయ్యకపోవడం ప్రేక్షకుడి చేతిలో వుండదని నా అభిప్రాయం. ఇక్కడ ప్రేక్షకుడు అంటే నేనే కనుక, నా సంగతే రాస్తాను.

నా లాజిక్ కండిషన్డ్‌గా, బయాస్డ్‌గా, సెలక్టివ్‌గా వుంటుంది. 

చార్లీ చాప్లిన్, రాజ్ కపూర్ సినిమాల్లో లాజిక్ నాతోపాటుగా (with rapt attention) సిన్మా చూస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్ సిన్మాలకి నిద్రపోతుంది.  కె.రాఘవేంద్రరావు BA సినిమాలకి లాజిక్ హాల్లోక్కూడా రాదు, బయట క్యాంటీన్ దగ్గర తచ్చాడుతుంటుంది.

అందువల్ల నా లాజిక్ కొన్ని సిన్మాల్లో డాక్టర్ పేషంట్ పల్స్ చూసి 'కంగ్రాచ్యులేషన్స్! మీరు తల్లి కాబోతున్నారు' అంటే నవ్వేసుకుంటుంది, ఇంకొన్ని సినిమాల్లో అదే సీన్ వుంటే వొప్పుకోదు - కోపం తెచ్చుకుంటుంది.  

'అమర్ అక్బర్ ఆంథోని'లో ఒకేసారి ముగ్గురు హీరోలు తల్లికి రక్తదానం చేస్తారు. మన్మోహన్ దేశాయ్ సిన్మా కాబట్టి లాజిక్‌గాడు పట్టించుకోలేదు. ఇదే సీన్ యే శ్యామ్ బెనెగల్ సిన్మాలోనో వుంటే లాజిక్‌గాడు చిందులేసేవాడు. 

అలాగే -

అందరూ సిన్మాల్ని ఒకేరకంగా చూడరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దృష్టికోణం వుంటుంది. 'ఆకుచాటు పిందె తడిసె' పాటలో తడిసిన శ్రీదేవి కోసం ఆరుసార్లు సినిమా చూశా (భరించా)! నా క్లాసమ్మాయిలు 'అసలు 'వేటగాడు' ఆరుసార్లు చూసే సినిమానేనా?' అంటూ నన్ను విసుక్కున్నారు, వాళ్ళకెలా చెప్పేది? 

నాకు నచ్చిన ప్రేక్షకుడు -

నా చిన్ననాటి స్నేహితుడు మాతోపాటు అన్ని సినిమాలకీ వచ్చేవాడు, సిన్మా మొదలవ్వంగాన్లే నిద్రపొయ్యేవాడు. 'శుభం' కార్డు పడ్డాక లేపుకొచ్చేవాళ్ళం. శంకరాభరణం సిన్మాక్కూడా నిద్రపోయిన ఘనత నా స్నేహితుడిది. మరప్పుడు సిన్మాకెందుకు రావడం? 'స్నేహధర్మం' అని సమాధానం చెప్పేవాడు!  

(fb post)

Wednesday, 14 June 2017

'ఖోపం మూడ్'


"ఆ ఏంకరబ్బాయ్ ఖోపంతో ఊగిపోతున్నాడు? బీపీ పెరిగి చస్తాడేమో!"

"డోంట్ వర్రీ! అది ఉత్తుత్తి ఖోపమే!"

"ఉత్తుత్తి ఖోపమా! యెందుకు?"

"అతను రోజూ న్యూస్ డిబేట్ చేస్తాడు, కానీ వాస్తవానికి అది న్యూస్ కాదు. యేదోక పనికిమాలిన విషయం తీసుకుని, అతిధులుగా పెయిడ్ ఆర్టిస్టుల్ని పిలిపించి, వారిపై అరుపులు కేకల్తో మనకో ఏక్షన్ సినిమా చూపిస్తాడు!"

"గ్రేట్."

"ఏం గ్రేటో ఏమో, పాపం - 'ఖోపం మూడ్' కోసం అతను చాలా ప్రిపేర్ అవుతాడు, అందుకోసం అతనికో స్పెషల్ స్టాఫ్ కూడా వుంది."

"స్పెషల్ స్టాఫ్! వాళ్ళేంచేస్తారు?"

"న్యూస్ డిబేట్‌కి ఓ అరగంట ముందు అతనికి ఒళ్ళంతా ఉప్పూకారం రాస్తారు, ముక్కులో నిమ్మరసం పిండుతారు. 'బాబోయ్ మంట' అంటూ అతనెంత మొత్తుకున్నా వాళ్ళపని వాళ్ళు చేసుకుపోతారు. ఆ విధంగా అతను 'ఖోపం మూడ్' తెచ్చేకుంటాడు."

"అప్పటికీ 'ఖోపం మూడ్' రాకపోతే?"

"నథింగ్ టు వర్రీ! పిచ్చికుక్కల్తో కరిపించుకుంటాడు, డ్యూటీ పట్ల అతని కమిట్మెంట్ అలాంటిది!"

"పిచ్చికుక్కలా? వార్నాయనో! రేబీస్ వస్తుందేమో?"

"నో, నో.. ఒక పిచ్చికుక్క ఇంకో పిచ్చికుక్కని కరిస్తే రేబీస్ యెలా వస్తుంది?! రాదు."

(fb post)

Tuesday, 13 June 2017

గర్భ విజ్ఞాన సంస్కారం

మీకు తెల్లగా, పొడుగ్గా వుండే పురుష సంతానం కావాలా? అట్లైన ఈ క్రింది సూత్రములు పాటించవలెను.  

- ముందుగా దంపతులు మూణ్నెళ్లపాటు 'శుద్ధికరణం' పాటించాలి (అంటే బ్రహ్మచర్యం).

- దంపతుల తమతమ జాతకరీత్యా గ్రహస్థితుల్ని అనుసరించి పండితుల్తో పెట్టబడిన ముహూర్త సమయాన ఒక్కటవ్వాలి ('సెక్స్' పదం అత్యంత అసభ్యకరం, అంచేత వాట్టానికి వీల్లేదు). 

- దంపతులు కలిసే ముహూర్తానికి ముందు ఒక మాసంపాటు బాబా రామ్ దేవ్ ఫార్మసీవారి  'దివ్యపుత్రజీవక్' ఔషధం సేవించాలి (లేనట్లైనా స్త్రీ సంతానం కలిగే ప్రమాదం కలదు). 

- గర్భం ధరించిన స్త్రీ యెట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టరాదు, శాకాహారం మాత్రమే తీసికొనవలెను (ఇంగ్లీషు వైద్యులు మాంసాహారంలో చక్కటి ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఉంటాయని చెత్తకబుర్లు చెబుతారు - వారిది విదేశీ అజ్ఞానం అని గ్రహించగలరు) 

- పురుషుని గూర్చి అసభ్య ఆలోచనలు (అనగా స్త్రీపురుష సంయోగ ఆలోచనలు) మనసులోకి రానివ్వరాదు, ఇందుకు భర్త అతీతుడు కాదు (ఇంగ్లీషు వైద్యులు గర్భం నాలుగో నెల నుండి సంయోగం చేసుకోవచ్చునని అంటారు - వారిది విదేశీ విచ్చలవిడి జ్ఞానం అని గ్రహించవలెను). 

- గర్భం సమయాన చెడ్డవారికి, ముఖ్యంగా భర్తకి, దూరంగా వుండవలెను (వాడు మిమ్మల్ని సంయోగం కొరకై కెలకవచ్చును). 

- గదినిండా రాముడు, కృష్ణుడు కేలండర్లు వేలాడదీసి వాటినే చూస్తుండవలెను (మహేశ్ బాబు, ప్రభాస్‌ల కేలండర్లు నిషిద్ధము). 

- ఎల్లప్పుడూ ఘంటసాల భగవద్గీత, సుబ్బులక్ష్మి సుప్రభాతంలను మాత్రమే వినవలెను (సినిమా పాటలు నిషిద్ధము). 

- నెలలు నిండాక మంత్రసానికి కబురంపండి. పవిత్రమైన మంత్రోచ్చరణ కావిస్తూ 'స్వదేశీ డెలివరీ' చేయించుకోండి. 

ఇప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి - దబ్బపండులా, తెల్లని మేనిఛాయలో కిలకిలా నవ్వుతున్న (పవిత్ర పసిపాపలు యేడవరాదు) మీ బిడ్డని గాంచండి. 

మేరా భారత్ మహాన్! భారత్ మాతా కీ జై!!

(fb post 14/6/2017)

Tuesday, 6 June 2017

బండబారిన బుర్రలు

మనుషులకి మెదడు వుంటుంది, బుర్ర వుంటుంది, ఆలోచనలుంటయ్. అయితే ఆ ఆలోచనల్ని యే స్థాయికి తీసుకెళ్ళాలనేది ఆ మనిషి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. బుర్రకి కత్తితో సారూప్యత వుంది. రెండూ కూడా సాను పెట్టిన కొలదీ పదును దేరుతాయి. వాడకం తగ్గిస్తే రెండూ తుప్పట్టి బండబారిపోతాయి.

ఈమధ్య బండబారిన బుర్రలు యెక్కువయ్యాయి. మన దేశం గొప్పది, మన సైన్యం గొప్పది, మన మతం గొప్పది, మన ప్రాంతం గొప్పది, మన భాష గొప్పది, మన కులం గొప్పది. 'మనది' అన్నది ప్రతిఒక్కటీ గొప్పదే! అన్నింటిలో బల్లగుద్ది మొహం మీద చరిచే 'స్పష్టమై'న భావాలు. ఈ అభిప్రాయాల్ని ప్రశ్నిస్తే ఖోపం వస్తుంది!

ఉదాహరణకి -

కాశ్మీర్ లోయలో రాళ్లు విసిరేవాళ్ళు టెర్రరిస్టులు, కాదన్నవాళ్ళు టెర్రరిస్ట్ సమర్ధకులు! హురియత్ నాయకుల్తో మాట్లాడాలనేవాళ్ళు దేశద్రోహులు (ఈ లెక్కన నెహ్రు నుండి వాజపేయి దాకా అందరూ దేశద్రోహులే)! సమస్యని అర్ధం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించుకుందామనే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు సూడో-సెక్యులరిస్టులు! కాశ్మీర్ సమస్యని క్రిటికల్/రేషనల్ గా ఆలోచించమన్నవాళ్ళు సూడో-మేధావులు!

ఒక క్లిష్టమైన సమస్యని yes or no స్థాయికి దించెయ్యడం రాజకీయ అవకాశవాదం. అధికారానికి మోకరిల్లి బాకాలూదే నేటి బ్రతక నేర్చిన మీడియా ప్రజల్ని దేశభక్తి మత్తులో ముంచి తన పబ్బం గడుపుకుంటుంది. ఇక్కడ కొందరికి బుర్ర ఉపయోగించడం తెలీదు, ఇంకొందరికి తెలిసినా చెప్పరు. మనమీ దుస్థితి నుండి బయటపడే అవకాశం ఇప్పుడప్పుడే లేదని అనుకుంటున్నాను.

(fb post 6/6/2017)

Sunday, 4 June 2017

మీడియా దొంగాట

యుద్ధం పాశవికమైనది, మానవాళికి నష్టదాయకమైనది. అనాదిగా ఈ ప్రపంచం యుద్ధాలకి పరిహారాన్ని చెల్లించుకుంటూనే వుంది. చిన్నపాటి పొలంగట్టు తగాదాలే వైరిపక్షాలకి కోలుకోలేని దెబ్బ తీసేస్తాయి. రెండుదేశాల మధ్య తగాదాలు ఆ రెండుదేశాల అభివృద్ధిని అడ్డుకుంటాయి, తీవ్రసంక్షోభంలోకి నెట్టేస్తాయి.

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని యెన్నుకుంటారు. ప్రభుత్వం ప్రజల తరఫున, ప్రజల కొరకు పనిచెయ్యాలి. ప్రభుత్వం పనిచెయ్యడంలో తేడాలు రాకుండా ప్రజల పక్షాన నిలబడ ప్రశ్నించాల్సిన బాధ్యతాయుతమైన పాత్ర మీడియాది. 

ఇవ్వాళ దేశప్రజలకి చాలా ప్రశ్నలకి సమాధానం దొరకట్లేదు. రైతు పంటలకు గిట్టుబాటు ధరలేదు, యెందుకు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యెందుకు? విద్యారంగంలో లోపాలు సవరించుకోలేకపోతున్నాం, యెందుకు? నిరుద్యోగాన్ని తగ్గించలేకపోతున్నాం, యెందుకు? వినిమయ వస్తువుల ధరలు తగ్గట్లేదు, యెందుకు? ఈ 'యెందుకు?'కి సమాధానం దిశగా మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి. మీడియా తన బాధ్యతని యెందుకు విస్మరిస్తుంది? 

టీవీ చర్చలు - ఒకప్పుడు రాత్రిళ్ళు మాత్రమే జరిగేవి, ఇప్పుడు డైలీ సీరియల్స్‌లాగా రోజంతా కొనసాగుతున్నయ్! యెక్కువ శాతం యెడతెగని ఊకదంపుడు కాశ్మీర్ చర్చలే! పోనీ చర్చల్లో 'కాశ్మీర్ సమస్యని పరిష్కరించేందుకు కేంద్ర హోమ్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలేంటి?' అంటూ చర్చించరు. యెంతసేపటికీ - 'దేశద్రోహ హురియత్', 'రాళ్లు విసుర్తున్న ముష్కర మూకలు' వంటి చౌకబారు టాగ్ లైన్లతో రెచ్చగొట్టే కేకలే!

'పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి, యుద్ధం చెయ్యాలి, అవసరమైతే అణుబాంబు పేల్చాలి!' ఇట్లాటి భీభత్సమైన ఆలోచనల్తో మిలిటరీ నిపుణుల సలహాలు! 'యుద్ధం వద్దు' అంటే - ఆర్మీ నైపుణ్యాన్ని కించపరుస్తున్నావంటూ హేళన! ప్రస్తుతం మన టీవీ చానెళ్ల పరిస్థితి ఇదీ!

ప్రజల రోజువారీ సమస్యలకి వందోవంతు ప్రాధాన్యతనిస్తూ, సరిహద్దు సమస్యని వందరెట్లు పెద్దదిగా చూపిస్తున్న మీడియా విశ్వాసనీయత ఏంటి? ప్రభుత్వం 'అసలు' సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొన్ని నకిలీ సమస్యల్ని సృష్టిస్తుంది. మీడియా ఈ అప్రధాన నకిలీ వార్తలకి వత్తాసు పలకడంలో బయటకి కనపడని కోణం ఇంకేదైనా వుందా? అసలు ఇండియా కాశ్మీర్‌లో అంతర్భాగమా? కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమా? 

ఆదివారం పదినిమిషాలు టీవీ చూస్తేనే ఇన్నేసి ప్రశ్నలొస్తున్నయ్! ఈ ప్రశ్నలకే కాదు, యే ప్రశ్నలకీ సమాధానం చెప్పాల్సినవాళ్ళు చెప్పరు. మనం మాత్రం రోజువారీ మీడియా తమాషాని గుడ్లప్పగించుకుని చూస్తూనే ఉంటాం, ఇంతకన్నా దురదృష్టమేముంది!

(fb post 4/6/2017)

Friday, 2 June 2017

గొప్పసినిమాకి నా క్రైటీరియా

సినిమాలు అన్నీ అందరికీ నచ్చవు. నచ్చిన సినిమాలోనూ అందరికీ ఒకే విషయం నచ్చదు. మృదువైన సింగిల్ మాల్ట్, ఘనమైన ఉప్మాపెసరట్టులు కూడా కొందరికే నచ్చుతాయి. నాకు 'డాక్టర్ చక్రవర్తి'లో జగ్గయ్య అర్ధమయ్యాడు, నాగేశ్వరరావు చిర్రెత్తించాడు. 'ముత్యాలముగ్గు'లో సంగీత బోరు కొట్టించింది, హలం భలేగా నచ్చింది! 

ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - మొన్నటిదాకా తెలుగు సినిమాలు భీభత్సంగా చూసేశానని అనుకున్నాను. కానీ - విశ్వనాథ్ ఫాల్కే ఎవార్డ్ సమయంలో, దాసరి మరణం సందర్బంగా నాకు అర్ధమైందేమనగా.. నేను గొప్ప సినిమాలు అతితక్కువ చూశానని!

సినిమా అనేది పూర్తిగా కాలక్షేపం వ్యవహారం - పన్లేనివారు అదేపనిగా చూస్తారు, లేకపోతే లేదు. కానీ - యెన్నో సినిమాలు చూసిన నేను గొప్ప సినిమాలకి కిలోమీటర్ల దూరంలో యెందుకుండిపొయ్యాను? నాకు వెంటనే తట్టిన సమాధానం.. 'నా సినిమా జానర్ వేరు' అని. 

గొప్పసినిమాకి నా క్రైటీరియా యేమనగా -

శ్రీదేవి సినిమాలన్నీ గొప్ప సినిమాలే! సినిమాలో జ్యోతిలక్ష్మి లేక జయమాలిని డ్యాన్స్ వుంటే అది మరింత గొప్ప సినిమా అవుతుంది. కథకి అవసరం కాబట్టి హీరో వుంటాడు గానీ నా దృష్టిలో హీరో విలువ పూచికపుల్ల కన్నా తక్కువ. అదీగాక - ఒక మగాడు ఒక మగ నటుణ్ని తీవ్రంగా అభిమానించి, ప్రేమించడం latent homosexuality అయ్యుండొచ్చనే అనుమానం నాకుంది.  

పచ్చని పారాణి, ఎర్రని కుంకుమ, ప్రాచీన సాంప్రదాయాలు, పవిత్ర కళలు నా వొంటికి సరిపడవు.. విశ్వనాథ్ ఔట్. పరిషత్తు నాటకాల్లా చాంతాడు డైలాగులంటే భయం.. దాసరి ఔట్! కుదిర్తే పౌరాణిక శ్రీరాముడు, కుదరకపోతే సాంఘిక శ్రీరాముడు - ఆసక్తి లేదు.. బాపు ఔట్!  

నేనిలా నాదైన exclusion criteria ఫాలో అయిపోవడం వల్ల ప్రజలు మెచ్చిన అనేక గొప్ప చిత్రరాజముల్ని మిస్సైతిని. ఇందుకు నేనేమీ చింతించడం లేదు, కారణం - నాక్కావాల్సిన సినిమాలు నే చూసుకున్నాను, అందుగ్గానూ మిక్కిలి సంతోషిస్తున్నాను!

(fb post .. )