Wednesday 26 June 2013

ఇచట ఆటోగ్రాఫులు ఇవ్వబడును



"జీవితంలో ఆటోగ్రాఫులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలి." ఈ గొప్ప డైలాగ్ చాల్రోజులుగా వింటూనే ఉన్నాను. ఇట్లాంటి సుభాషితాలు 'గంటకి ఇంత' అంటూ వసూలు చేసుకునే 'ప్రొఫెషనల్' వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు.

ఈ ఆటోగ్రాఫుల డైలాగ్ విన్నప్పుడల్లా ఇట్లాంటివే ఇంకొన్ని డైలాగులు గుర్తొచ్చి నవ్వుకుంటాను. అప్పు తీసుకునేవాడు ఆప్పిచ్చే స్థాయికి ఎదగాలి. ఇంజక్షన్ చేయించుకునేవాడు ఇంజెక్షన్ చేసే స్థాయికి ఎదగాలి. ఆత్మహత్య చేసుకునేవాడు హత్య చేసే స్థాయికి ఎదగాలి.

ఈ మధ్య గుంటూర్లో భగవద్గీతకి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. ముఖ్య అతిథి CBI మాజీ అధికారి లక్ష్మీనారాయణ (వీరికి ఆధ్యాత్మిక ధ్యాస యెక్కువ). ఆయన కూడా పిల్లలకి ఈ అరిగిపోయిన ఆటోగ్రాఫ్ డైలాగ్ వినిపించాడు, ఆశ్చర్యపొయ్యాను. అంత పెద్ద పోలీసాయన చెప్పాడంటే.. ఇదేదో యోచించవలసిన సంగతే!

ముందుగా.. ఆ CBI మాజీ అధికారి ఆటోగ్రాఫులు ఇచ్చే స్థాయికి ఎదిగాడని మనం అర్ధం చేసుకోవాలి. మంచిది. ఆయన్ని ఆటోగ్రాఫ్ అడిగేవాడున్నాడు. చేతిలో పెన్నుంది. పెన్నులో ఇంకుంది. సంతకాలు పెట్టే ఉత్సాహం ఆయనలో ఉంది. కాదన్డానికి మనమెవరం? నిజాయితీపరులైన అధికారుల్ని మనం తప్పకుండా గౌరవించుకోవాల్సిందే.

ఈ దేశంలో నిజాయితీపరులైన ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. రాబర్ట్ వద్రా అనే ఒక పెద్దమనిషి చేసిన భూకుంభకోణాన్ని బయటపెట్టిన అశోక్ కెమ్కా అనే IAS అధికారి ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ములాయం, మాయావతిల అవినీతిపై దర్యాప్తు చేసిన అధికారులు.. వారిపై టన్నుల కొద్దీ చార్జ్ షీట్లు తయారుచేసి.. శ్రీకోర్టువారికి దాఖలు చేసేందుకు అనుమతి కోసం నిరంతరంగా పడిగాపులు కాస్తున్నారు.

వారెవ్వరికీ దొరకని అవకాశం మన లక్ష్మీనారాయణకి దక్కింది. కారణాలు ఏవైనప్పటికీ (అందరికీ తెలిసినవే).. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి పూర్తి స్వేచ్చనిచ్చింది. ఇందుకు మనం కాంగ్రెస్ హైకమాండుని అభినందించవలసి ఉంది. ఇదేంటి? ఆటోగ్రాఫుల గూర్చి మొదలెట్టి ఒక పోలీసు అధికారి గూర్చి రాసేస్తున్నాను!

అసలు ముందుగా నాకీ ఆటోగ్రాఫుల గూర్చి రాసే అర్హత ఉన్నదా? అని నన్ను నేను ప్రశ్నించుకోవలసి ఉంది. సినిమా తియ్యడం చేతకానివాడు సినిమాని విమర్శించరాదు. విస్కీ మజా తెలీనివాడు విస్కీని వ్యతిరేకించరాదు. ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి వాదనలు ఎప్పట్నుండో ఉన్నాయి.

ఈ వాదనల ప్రకారం - నాకు ఆటోగ్రాఫుల గూర్చి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నేనెప్పుడూ ఎవరిదగ్గరా ఆటోగ్రాఫ్ తీసుకోలేదు.. (ఆటోగ్రాఫ్ ఇవ్వమని నన్నెవరూ అడగని కారణాన) ఇచ్చిందీ లేదు. (నన్ను ఎవరూ ఆటోగ్రాఫ్ అడగనందున కుళ్లుకుంటూ ఈ టపా రాస్తున్నానని మీరనుకుంటే నాకభ్యంతరం లేదు).

సరే! అందరూ ఆటోగ్రాఫులు ఇచ్చే స్థాయికి ఎదిగినట్లైతే.. మరి వాటిని తీసుకునేదెవరు? ఫేస్బుక్కుల్లో అయితే స్నేహితులే చచ్చినట్లు (మొహమాటానికి) లైకులు పెడతారు. ఆటోగ్రాఫులకి ఆ సౌకర్యం ఉన్నట్లు లేదు. అసలు ఎవరైనా, ఎవరికైనా ఈ ఆటోగ్రాఫులు ఇవ్వడం ఎందుకు? తీసుకోవడం ఎందుకు?


మనిషి ఒక జంతువు. ('జంతువు' అంటున్నానని కోపం వలదు, మనం నిజంగా జంతువులమే). అడవిలో జంతువులు ఏం చేస్తాయి? ఆకలేస్తే కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని పొట్ట నింపుకుంటాయి. ఆపై నీడపట్టున కునుకు తీస్తాయి. ఆ తరవాత హాయిగా ఆడుకుంటాయి. ఒకేజాతి జంతువుల్లో IQ తేడాలు వుండవని నా అభిప్రాయం. అందుకే వాటన్నింటికీ సమానంగా కష్టపడితేగానీ పొట్ట గడవదు (ఈ 'సమానం' థియరీ ప్రకారం అడవి జంతువులన్నీ కమ్యూనిస్టులని చెప్పొచ్చు). 

కానీ మనిషి తెలివితేటల్లో తేడాలున్నాయి. కొందరు తెలివి తక్కువ వెధవలకి ఎంత కష్టపడ్డా పూట గడవదు. ఇంకొందరికి అసలు కష్టపడకుండానే పంచభక్ష్య పరమాన్నాలు రెడీగా ఉంటాయి. అంచేత ఈ కడుపు నిండినవారు ఏం చెయ్యాలో తోచక, తెగ ఇబ్బంది పడుతుంటారు. కావున వీరు తమ మానసికోల్లాసం కోసం ఏదొక వ్యాపకం పెట్టుకోవాలి.

'పొద్దస్తమానం తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఎటుంటాది?' అని ముళ్ళపూడి వెంకట్రవణ 'ముత్యాలముగ్గు'లో చెప్పాడు. అంచేత ఈ కడుపు నిండిన మనిషి 'హాబీ' అని ముద్దుగా పిలుచుకునే (పన్లేని) పన్లు కొన్ని కల్పించుకున్నాడు. ఈ హాబీల్లొ 'కలెక్షన్' అనేది ఒక ప్రముఖ వ్యాపకం. కాయిన్లు, స్టాంపులు, సీసాలు, సినిమా పాటల రికార్డులు, పురాతన వస్తువులు, ఆటోగ్రాఫులు.. ఇలా ఒక చాంతాడంత లిస్టుంది. దురదున్నవాడు బరబరా గోక్కుని వేణ్నీళ్ల స్నానం చేస్తే యెంత హాయిగా వుంటుందో ఈ కలెక్షన్ హాబీవాళ్లక్కూడా అట్లాంటి హాయిలుంటాయని నా అనుమానం. 

ఓయీ వైద్యాధమా! ఒక మహోన్నత వ్యక్తి ఆటోగ్రాఫుని సేకరించి జనులు స్పూర్తి నొందెదరోయీ! ఆటోగ్రాఫ్ ఇచ్చుట, తీసుకొనుట అనునది ఆనాదిగా ఆధునిక సంస్కృతికి చిహ్నం. ఒక అద్భుతవ్యక్తి ప్రతిభాపాటవాలు విద్యుత్తరంగాల వలె ఆటోగ్రాఫ్ ద్వారా ప్రసరింపబడి.. స్వీకరించినవాడి జన్మ ధన్యమగును. నీవంటి గుంటూరు కుగ్రామవాసికి దాని విలువ ఏమి తెలియును?

ఈ ఆటోగ్రాఫుల స్పూర్తితో విజయానికి వెయ్యి మెట్లు అవలీలగా ఎక్కెయ్యొచ్చు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీగారి ఆటొగ్రాఫులు తీసుకున్న బ్రాందీబాబులనేకులు గాంధీవాదానికి మళ్ళారు. ఆమధ్య చిరంజీవి ఆటోగ్రాఫు తీసుకున్న యువకులనేకులు ప్రస్తుతం సామాజిక న్యాయంలో తలమున్కలైయున్నారు.

ఓ! అలాగా! అయామ్ వెరీ సారీ. నాకీ ఆటోగ్రాఫులకింత పవరుందని తెలీదు. విషయం తెలీక ఏదేదో వాగాను. ఇప్పుడర్థమైంది - నా బుర్ర గజిబిజి గందరగోళంగా యెందుకుంటుందో! ఒక గొప్పవ్యక్తి ఆటోగ్రాఫ్ సంపాదించి బుర్రని సాఫీ చేసుకోవాలి. 

మరి నే వెళ్లాలి, వుంటాను! 

(updated & posted in fb on 23/3/2018)

Friday 21 June 2013

మధుబాల డార్లింగ్


"సుబ్బు!"

"ఆఁ!"

"ఈ వెన్నెల ఎంత హాయిగా యున్నది!"

"ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాల్సింది ప్రేమికులు. మనం కాదనుకుంటాను."

"ఈ చల్లని వెన్నెల సమయాన మధుబాల గుర్తోస్తుందోయి?"

"glenfiddich అడుగంటుతుంది. సరిపోదేమోనని భయంగా ఉందోయి."

"మొగలే ఆజమ్ లో మధుబాల ఎంతందంగా ఉంది! ఈ సృష్టిలో మధుబాల అద్భుత సౌందర్యానికి  గులాము కాని వెధవ ఎవడన్నా ఉంటాడా! మొగలే ఆజాం సినిమా చూడనివాడు గాడిద. మధుబాల అందాన్ని మెచ్చనివాడు పంది."

"సర్లే! ఇప్పుడు కాదన్నదెవరు? ఊరికే ఆయాసపడకు."

"పాపం! తొందరగా వెళ్ళిపోయింది సుబ్బు! అక్బర్ కొడుకేం ఖర్మ! సాక్షాత్తు బ్రహ్మదేవుడే తను సృష్టించిన అపరంజిబొమ్మ అందానికి దాసుడయ్యుంటాడు. అందుకనే తొందరగా తీసుకుపోయ్యాడు."

"అంతేనంటావా? పాపి చిరాయువు అన్నారు పెద్దలు. కాబట్టి మనం సేఫ్."




"ఆహాహా.. ఏం పాట సుబ్బు! 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అంటూ పంచరంగుల్లో మెరిసిపోయింది. నా కళ్ళల్లోకళ్ళు పెట్టి చూస్తూ 'ప్రేమిస్తే తప్పేంటి? ఈ లోకంలో ప్రేమని తప్ప దేన్నీ లెక్క చేయను.' అంటుంటే ఆనందంతో ఏడుపొచ్చేసింది."

"వచ్చే ఉంటుంది. ఇప్పుడు నీ ఎమోషన్ చూస్తుంటే అర్ధమౌతుందిలే."

"గుండెలనిండా నిఖార్సైన ప్రేమభావం నింపుకున్న నిజాయితీ.. ఎవ్వరినీ లెక్కచేయ్యనీదేమో! స్వచ్చమైన ప్రేమ ముందు చావు చాలా చిన్నది. ఏంటి సుబ్బూ! అలా చూస్తున్నావ్!"

"ఏం లేదు. glenfiddich ని హడావుడిగా సేవిస్తే కలిగే దుష్పరిణామాలు గాంచుతున్నాను. అందుకే నిదానం ప్రధానం అన్నారు పెద్దలు."
             
"పాటకి అర్ధం తెలుసా సుబ్బూ! ప్రేమించటానికి భయం దేనికి? ప్రేమ తప్పెలా అవుతుంది? తప్పవటానికి ఇది దొంగతనం కాదు. ఈరోజు నా గుండెకధ చెపుతా. నన్ను చంపినాసరే, నా ప్రేమజ్యొతి వెలుగుతూనే ఉంటుంది. ఈ పరదాల చాటున నా ప్రేమని దాచలేను."

"ప్రేమ విషయంలో నేను వీక్. హిందీలో ఇంకా వీక్. కాబట్టి నువ్వు  చెప్పింది ఒప్పుకోక తప్పదు."

"ఆహా లతా దీది! నమస్కార్. నౌషాద్ భయ్యా! అదా బర్సే. ఆసిఫ్ భాయ్! ధన్యవాద్."

"మధుబాలని మర్చిపోయ్యావ్."

"ఛ ఊరుకో సుబ్బు! ఇంట్లో మనుషులకి ఎవరైనా థాంక్సులు చెబుతారా? అలా చెబితే మధుబాల డార్లింగ్ ఫీలవదూ!"


(pictures courtesy : Google)

Wednesday 19 June 2013

ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి



"నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా కొడుకుని మాత్రం పెళ్ళికి ఒప్పించాలి." నా ప్రాణస్నేహితుని విన్నపం. పాపం! మరీమరీ అడుగుతుంటే కాదనలేకపొయ్యాను. అంచేత ఇవ్వాళ ఆఫీసు నుండి డైరక్టుగా స్నేహితుడి కొంపకే తగలడ్డాను.

మావాడి పుత్రరత్నం laptop లోకి తీవ్రంగా చూస్తూ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వీణ్ని చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాను, అంతలోనే ఎంతవాడైపొయ్యాడు!

"ఏవాఁయ్! పెళ్లి ఎందుకొద్దంటున్నావో తెలుసుకోవచ్చా?" అంటూ పలకరించాను.

"పెళ్లి చేసుకోవటం వల్ల లాభమేంటి?" కుర్రాడు క్విజ్ మాస్టర్లాగా ప్రశ్నించాడు.

"భలేవాడివే! అన్నీ లాభాలే. ఎలాగూ laptop ముందే ఉన్నావుగా. ఓసారి యూట్యూబులో నేచెప్పిన పాట పెట్టు." హుషారుగా అన్నాను.

"ఏ పాట?"

"దేవత అనే సినిమాలో 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' అని కొట్టు." అంటూ తొందరపెట్టాను.


"ఇదిగో కొడుతున్నా."

పాట మొదలైంది. కళ్ళు చిట్లించి, చెవులు రిక్కించి పాటని దీక్షగా చూశాడు. మొహంలో క్రమేపి కళ, ఆనందం!




"పాట బాగానే వుంది. కానీ ఈ పన్లన్నీ నాక్కాబోయే భార్య చేస్తుందా?" సందేహంగా అడిగాడు. 

"ఎందుకు చెయ్యదు! మా ఆవిడ ఈ రోజుకీ నాకివన్నీ చెయ్యట్లేదా? అసలావిడ ఈ పాటలో సావిత్రికిలాగ నా తలని రోజూ అదేపనిగా దువ్వడం వల్లనే నాకీ బట్టతలొచ్చింది తెలుసా?" అంటూ నా బట్టతల రహస్యం విప్పాను.

"నిజంగా!" కుర్రాడి మొహంలో మరింత వెలుగు.

"మరేంటనుకున్నావ్? రౌతు కొద్దీ గుర్రం, అంతా మన్లోనే ఉంది." రహస్యం చెబుతున్నట్లుగా అన్నాను.

"అయితే సరే, నేను పెళ్లి చేసుకుంటాను." సిగ్గుపడుతూ చెప్పాడు.

నా ప్రాణస్నేహితుడు గుమ్మడి స్టైల్లో నా రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను." డైలాక్కూడా గుమ్మడిదే!

టైమ్ చూసుకుని హడావుడిగా ఇంటికి బయల్దేరాను.

హాల్లో సోఫాకి నిండుగా కూర్చునుంది నా భార్యామణి. రిమోట్ ని పుర్రచేత్తో పట్టుకుని ఠపాఠపామంటూ చానెల్స్ మారుస్తుంది. నన్ను చూడంగాన్లే ఇంతెత్తున లేచింది.

"ఏవిటయ్యా ఇది? మనిషన్న తరవాత బుద్దీజ్ఞానం ఉండఖ్ఖర్లా? ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా మధ్యలో నీ బోడి పెత్తనాలేంటి? ఇంట్లో పన్లన్నీ నీ బాబుగాడు చేస్తాడనుకున్నావా? ఇంత లేటుగా వస్తే అంట్లెప్పుడు తోముతావ్? వంటెప్పుడు చేస్తావ్?" అంటూ సూర్యకాంతంలా గాండ్రించింది.

"ఆఁ.. ఆఁ.. వచ్చె.. వచ్చె.. అయిపోయింది. ఎంతలో పని? చిటికెలో అవగొట్టనూ!" అంటూ వంటింట్లోకి పరిగెత్తాను.

(fb post on 6/6/2017)

Monday 17 June 2013

వార్తలు - పత్రికలు



ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సైంటిఫిక్ పేపర్ స్క్రీన్ షాట్. ఇది 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ' అనే ఒక మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఒరిజినల్ ఆర్టికల్. ఈ స్టడీ చేసినవారి declaration of interest వివరాలు స్క్రీన్ షాట్ చివర్లో చదువుకోవచ్చు. ఈ వివరాలు ఇచ్చే ఆనవాయితీ సైంటిఫిక్ జర్నల్స్ కి ఉంది. ఇవ్వాలనే నియమం కూడా ఉంది.

అసలీ వివరాలు ఎందుకివ్వాలి? ఒక ఉదాహరణ రాస్తాను. నేను ఒక రోగంలో X అనే మందుని Y అనే ఇంకో మందుతో పోలుస్తూ పరిశోధన చేస్తాను. 'ఈ రోగంలో X అనే మందు Y అనే మందు కన్నా బాగా పనిచేసింది.' అనే ఫలితంతో నా పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తాను. అయితే నా పరిశోధనకి X అనే మందు తయారుచేసే కంపెనీవాడు ఆర్ధిక సహాయం చేశాడు. అంటే ఇక్కడ నాకు conflict of interest ఉంది. నా పరిశోధనా పత్రాన్ని చదివేవారికి ఈ సంగతి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది శాస్త్రీయం. ఇలా చెప్పకుండా ప్రచురిస్తే అది మోసం చేసినట్లే అవుతుంది.

ఇప్పుడు మనం కొద్దిసేపు వార్తాపత్రికల వ్యాపారం గూర్చి మాట్లాడుకుందాం. వార్తాపత్రికల సంస్థలు వార్తలతో వ్యాపారం చేస్తాయి. వార్తాపత్రికల సంస్థలకి ఆదాయంలో అధికభాగం ప్రకటనల ద్వారా వస్తుంది. ఈ ప్రకటనల రేట్లు ఆయా పత్రికల సర్క్యులేషన్ అనుసరించి ఉంటాయి. కాబట్టి ప్రకటనలిచ్చే వ్యాపార సంస్థల ఇంటరెస్ట్ కి ఎటువంటి నష్టం ఉండదు. పత్రికా సంస్థలు వార్తలతో ముద్రితమైన పత్రికల్ని పాఠకునికి అమ్ముకుని మరికొంత ఆదాయం చేసుకుంటాయి. ఇది ఫక్తు వ్యాపారం. అంతిమంగా వార్తల కోసం పత్రికని కొని చదివే పాఠకుడే వినియోగదారుడు.

ఒక వస్తువు కొన్నప్పుడు వినియోగదారుడిగా మనక్కొన్ని హక్కులుంటాయి. ఉదాహరణగా బిస్కెట్ పేకెట్ సంగతే తీసుకుందాం. బిస్కెట్ పేకెట్ కవరుపై సంబంధిత వివరాలు ముద్రించి ఉంటాయి. అవి చదువుకున్నవాడు ఆ బిస్కెట్లు కొనుక్కోవచ్చు లేదా మానుకోవచ్చు. వినియోగదారుడిగా ఆ స్వేచ్చ మనకి ఉంటుంది. ఇక్కడ బిస్కెట్ల తయారీలో వాడిన పదార్ధాల సమాచారం వాటిని కొనబొయ్యేవాడికి తెలియజెయ్యడం అనేది ప్రాధమిక వ్యాపార సూత్రం. ఇప్పుడు ఇదే లాజిక్ ని మన వార్తాపత్రికలకి అన్వయించి చూద్దాం.

మనం మార్కెట్లో ఒక వార్తాపత్రిక వార్తలు తెలుసుకుందుకు కొనుక్కుంటాం. కొనేప్పుడు ఆ వార్తాపత్రిక కంటెంట్ గూర్చి మనకి అవగాహన ఉండదు. ఉదాహరణకి ఒక పత్రిక ఫలానా నాయకుడు అవినీతిపరుడు అని ఒక కథనం ప్రచురిస్తుంది. ఆ కథనం ఆ ఒక్క పత్రికలో మాత్రమే ఉంటుంది. అంటే ఆ కథనం విశ్వసనీయత లేని అసత్య, అర్ధసత్యాల కలయిక, మాటల గారడీ, మోసం. కానీ ఆ విషయం వినియోగదారుడైన పాఠకుడికి తెలీదు. అప్పుడు ఆ కథనాన్ని నిజమనుకునే ప్రమాదం ఉంది.

తనని తప్పుదోవ పట్టించే వార్తల నుండి పాఠకుణ్ని రక్షించాలంటే.. ఆ పత్రికపై పాఠకుడికి పూర్తి సమాచారం ఉండాలి. 'ఈ వార్తాపత్రికలో ఫలానా రాజకీయ నాయకుడు లేదా పార్టీకి అనుకూల అంశాలని మాత్రమే ప్రచురిస్తాం. ప్రతికూల అంశాలని ప్రచురించం. ఈ పత్రిక సొంతదారుడు ఫలానా రాజకీయపార్టీకి పూర్తి అనుకూలుడు. ఈ పత్రిక ఓనర్ ఫలానా రాజకీయపార్టీ తరఫున ఫలానా చట్టసభలో సభ్యుడు.' అంటూ నిజాల్ని వెల్లడిస్తూ తమ వార్తాపత్రిక యొక్క డిక్లేర్డ్ పాలసీని ముందు పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి.

ఈ డిక్లరేషన్ లేనప్పుడు సహజంగానే వినియోగదారుడు నష్టపోతాడు. తెలుగు పత్రికలవాళ్ళు వార్తల విశ్లేషణ అంటూ చేటభారతాలు రాస్తుంటారు. మన పత్రికాధిపతులకి, ఎడిటర్లకి రాజకీయమైన లక్ష్యాలు ఉన్నాయి. కావున వారి విశ్లేషణలు.. వారిష్టం. కానీ తమ వివరాలు వెల్లడించకుండా తామేదో సత్యశోధన చేసి నిజాన్ని కనుగొన్నామనే ధోరణిలో విశ్లేషణ రాయడం ఖచ్చితంగా మోసం కిందకి వస్తుంది. ఎందుకంటే అవన్నీ తెలివిగా తమకి అనుకూలంగా రాసుకుంటున్న విశ్లేషణలు కాబట్టి.

కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యులు, అభిమానుల కోసం వార్తాపత్రికల్ని నడుపుతుంటాయి. సహజంగానే అవి తమ పార్టీ అభిప్రాయాల్ని మాత్రమే ప్రచురిస్తాయి. కావున ఆ పత్రికలు ఎవర్నీ చీటింగ్ చేస్తున్నట్లు కాదు. ఎందుకంటే ఆ ఆ పత్రికల నిస్పాక్షికత పట్ల ఎవరికీ ఏ భ్రమలు ఉండవు కావున.

ఇక జాతీయస్థాయి పత్రికలైతే వార్తల్ని కవర్ చేసే విధానంలో వారి వ్యాపార దృక్పధం, కార్పోరేట్ అనుకూలత స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. వారు ఒక వార్తని తమకి అనుకూలంగా మలచుకునే తెలివితేటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. వార్తని అవసరమైనదానికన్నా ఎక్కువతక్కువలు ఎలా చెయ్యాలో కూడా జాతీయస్థాయి వార్తాపత్రికలకి కొట్టిన పిండి.

ఎందుకనో మొదట్నుండి మన తెలుగువాడికి పత్రికల విశ్వసనీయత విషయంలో పెద్ద పట్టింపు లేదు. చల్లారిన ఇడ్లీ ఇచ్చినందుకో, పెసరట్టులో ఉప్మా తక్కువైనందుకో సర్వర్ మీద ఇంతెత్తున లేవడానికి మాత్రమే మన తెలుగువాడి పౌరుషం పరిమితం. వార్తాపత్రికలు తమ సొంత ఎజెండా ప్రచారం చేసుకుంటూ.. వారి ఎజండా చదవడానికి మనచేతనే మన సొమ్ము ఖర్చు పెట్టించడం అనే మోసాన్ని అంత ముఖ్యమైన విషయంగా భావించడు.

ఉపసంహారం :

ప్రస్తుతం రాజకీయ పార్టీల రాజకీయాల కన్నా వార్తాపత్రికల రాజకీయాలు ఎక్కువైపొయ్యాయి. ఈ ధోరణి మారాలనే ఆశ అయితే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు మారదు అనే వాస్తవిక దృక్పధమూ ఉంది. తెలుగు భాష మాట్లాడేవాళ్ళలో అక్షరాస్యత తక్కువ. అక్షరాస్యుల్లో కూడా రాజకీయ అక్షరాస్యత మరీ తక్కువ. వీరి సంఖ్య పెరిగేదాకా పత్రికలు తమ ధోరణి మార్చుకునే అనివార్యత ఏర్పడదు. అప్పటిదాకా మనకీ పక్షపాత వార్తలే శరణ్యం.

(photos courtesy : Google)

Wednesday 12 June 2013

కనకం


విజయ వారి 'షావుకారు' అనేక విధాలుగా విశిష్టమైనది. సినిమా చూస్తూ కథలో పూర్తిగా లీనమైపోతాం. ఈ సినిమాలో పల్లె వాతావరణాన్ని హాయిగా సహజంగా చిత్రీకరించారు. ఎంత సహజంగానంటే.. మనమే ఆ పల్లెటూరులో ఉన్నట్లుగాను, సినిమాలో పాత్రలు మన చుట్టూతా తిరుగుతూ మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఒక మంచి నవల చదువుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

షావుకారు సినిమాలో చాకలి రామి పాత్రని పోషించిన నటి పేరు కనకం. చాలా ఈజ్‌తో సరదాసరదాగా నటించేసింది.  సున్నం రంగడు (ఎస్వీరంగారావు) దగ్గర వగలు పోతుంటుంది. అతన్ని ఆట పట్టిస్తుంటుంది, రెచ్చగొడుతుంటుంది. అందుకే - అంత లావు రౌడీ రంగడు రామి దెబ్బకి పిల్లిలా అయిపోతుంటాడు.

పాత సినిమాల్లో నటులు చాలా ప్రతిభావంతులని నా నమ్మకం. ఇట్లా నమ్మటానికి నాక్కొన్ని కారణాలున్నాయి. ఉదాహరణకి కన్యాశుల్కం సినిమాలో నటించిన గోవిందరాజుల సుబ్బారావు నిజజీవితంలో పురోహితుడనుకుని భ్రమపడ్డాను. ఈ సంగతి ఇంతకుముందు "గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!"   అనే పోస్టులో రాశాను.

ఆరుద్ర రాసిన 'సినీ మినీ కబుర్లు'లో కనకం గూర్చి ఒక చాప్టర్ వుంది. కనకం హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నిస్తూనే చాలా సినిమాల్లో కామెడీ వేషాలు వేసిందని.. సినిమాల్లో అవకాశాలు తగ్గాక కాంట్రాక్టు నాటకాల్లో కృష్ణుడు వేషాలు వేసిందని.. వృద్దాప్యంలో పేదరికంతో విజయవాడలో జీవిస్తుందని.. ఇట్లాంటి విశేషాలు, వివరాలు ఆ పుస్తకంలో చాలానే వున్నాయి.  

దర్శకులు హీరోయిన్ పాత్ర గూర్చి చాలా శ్రద్ధ తీసుకుని, సపోర్ట్ కేరక్టర్ల గూర్చి తక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనుకునేవాణ్ని. ఈ సినిమా చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. దర్శకుడు ఎల్వీప్రసాద్ చాకలి రామి పాత్రని ఆకర్షణీయంగా, సహజంగా కన్సీవ్ చేశాడు. 

యూట్యూబ్ లో కనకం రేలంగిని పొగక్కాడ అడిగే సన్నివేశం కూడా ఉంది (ఆసక్తి కలవారు చూసుకోవచ్చు). రామి, రంగడు పాత్రల రూపకల్పనలో చక్రపాణి పాత్ర ఎంతో మనకి తెలీదు. కుటుంబరావు మాత్రం షావుకారు సినిమా మొత్తానికి చక్రపాణి కంట్రిబ్యూషన్ చాలానే ఉందంటాడు. కనకం తనే పాడుకుని నటించిన పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి.



(photo courtesy : Google)

Tuesday 11 June 2013

అద్వాని - ఆస్పత్రి


సమయం ఉదయం పది గంటలు. హిందు పేపర్లో అద్వానిపై రాసిన ఎడిటోరియల్ చదువుతున్నాను.

"రవణ మామా! కాఫీ." అంటూ హడావుడిగా లోపలకొచ్చాడు సుబ్బు.

చాలా రోజుల తరవాత వచ్చిన సుబ్బు రాక ఆనందం కలిగించింది.

"రా సుబ్బు! కూర్చో. పాపం! అద్వానికి ఎంత అవమానం జరిగిపోతుంది." దిగులుగా అన్నాను.

"ఇందులో నువ్వు బాధ పడేదేముంది? రాజకీయాలలో ఇది మామూలే. ఇక్కడ దయాదాక్షిణ్యాలు, మమతానురాగాలకి తావు లేదు మిత్రమా!" అన్నాడు సుబ్బు.

"సుబ్బు! అద్వాని భారత రాజకీయాల్ని దశాబ్దాలుగా ప్రభావితం చేసిన మహానాయకుడు." అన్నాను.

"కాదన్నదెవరు? ఆయన వాజపేయితో కలిసి ఒక గొప్ప ఆస్పత్రిని ఎంతో విజయవంతంగా నడిపిన మహానాయకుడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"ఏంటి! అద్వాని వాజపేయితో కలిసి ఆస్పత్రి నడిపాడా!" ఆశ్చర్యంగా అడిగాను.

"రవణ మావా! చాలా ఊళ్ళల్లో డాక్టర్లైన భార్యాభర్తలు ఆస్పత్రి నడుపుతుంటారు. ఇద్దర్లో ఒకరు పేషంట్ల పట్ల చాలా సౌమ్యంగా, స్నేహంగా ఉంటారు. ఇంకొకరు డబ్బు దగ్గర కఠినంగా, ఖచ్చితంగా ఉంటారు. 'డాక్టరయ్య దేవుడు! పేదోళ్ళంటే ఎంత కనికరం! డాక్టరమ్మకే ఎక్కళ్ళేని డబ్బాశ. నిలబెట్టి వసూలు చేస్తది.' అని పేషంట్లు అనుకుంటుంటారు."

ఇంతలో పొగలు గక్కుతూ వేడి కాఫీ వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.

"వాస్తవానికి ఫీజు వసూళ్లు డాక్టరయ్య కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. ఇదే వారి విజయ రహస్యం. ఇది చాలా సింపుల్ బిజినెస్ టెక్నిక్. ఆస్పత్రిలో డాక్టరయ్య మాత్రమే ఉంటే కనీస ఫీజులు కూడా వసూలు కాక ఆస్పత్రి మూత పడుతుంది. ఒక్క డాక్టరమ్మే ఉన్నా కూడా పేషంట్లు రాక మూత పడుతుంది."

"అవును సుబ్బు! మనూళ్ళో కూడా ఈ టెక్నిక్ నడుస్తుంది. నీ అబ్జర్వేషన్ కరెక్ట్." అన్నాను.

"ఒప్పుకుంటున్నావుగా? ఓకే! ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ గూర్చి మాట్లాడుకుందాం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడిచినప్పుడు వాజపేయి, అద్వానిలు డాక్టరయ్య, డాక్టరమ్మల పాత్రలు పోషించారు. హిందుత్వవాదులు అద్వానిలో తమ ప్రాతినిధ్యాన్ని చూసుకుని తృప్తినొందారు. చంద్రబాబు, నితీష్ లు వాజపేయిని చూపిస్తూ పని కానిచ్చుకున్నారు. వాస్తవానికి వాజపేయి, అద్వానిలు ఒకటే. వారిద్దరూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఇట్లాంటి సర్దుబాటు చేసుకున్నారు."

"ఇంటరెస్టింగ్ సుబ్బు!" అన్నాను.

"ఒకరకంగా ఇప్పుడు ప్రజలకి మంచే జరిగింది." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"ఎలా?" ఆసక్తిగా అడిగాను.

"ఇప్పుడు పేషంట్లకి ఏ కన్ఫ్యూజనూ లేదు. డాక్టరయ్య మంచాన పడ్డాడు. కావున ఆస్పత్రికి పేషంట్లు తగ్గారు. అందువల్ల ఆస్పత్రికి పూర్వవైభవం తెప్పించే పనిని మోడీ అనే కొత్త డాక్టరుకి అప్పజెప్పారు. ఇది నచ్చని డాక్టరమ్మ అలిగి వెళ్ళిపోయింది. ఈ కొత్త డాక్టరు అనుభవం లేనివాడేమీ కాదు. వాళ్ళ ఊరైన గుజరాత్ లో రాష్ట్రప్రభుత్వం అనే ఓ చిన్నఆస్పత్రిని లాభసాటిగా నడుపుతున్నాడు."

"మరి మోడీ ఇంత పెద్ద ఆస్పత్రిని నడపగలడంటావా?"

"అది మనం వెండి తెరపై చూడాలి. ఇప్పుడే ఎలా చెబుతాం? అయితే తన చిన్న ఆస్పత్రిలో మోడీ చేస్తున్న వైద్యం గూర్చి ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అంచేత ఇష్టమైతే మోడీ ఆస్పత్రిలోకి వెళ్తారు. లేకపోతే లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం." అంటూ టైం చూసుకుంటూ లేచాడు.

"మరిప్పుడు అద్వాని పరిస్థితేంటి సుబ్బు?"

"అద్వానికి పెద్దగా ఆప్షన్స్ లేవు. పార్టీవాళ్లు ఆయనకో ఉచితాసనం ఇచ్చి ధృతరాష్ట్రుడిలా కూర్చోమంటున్నారు. ఆయన అలా కూర్చోనైనా కూర్చోవాలి. లేదా బయటకి వెళ్లిపోవాలి. నిర్ణయించుకోవలసింది అద్వాని. మనం కాదు. వస్తాను. నాకు టైమైంది." అంటూ హడావుడిగా వెళ్ళాడు సుబ్బు.

దృఢచిత్తుడు


వారివురు భార్యాభర్తలు. అతనికి నలభైయ్యేళ్ళు ఉండొచ్చు. ఎర్రగా, ఎత్తుగా, బలంగా వున్నాడు. ఆవిడకో ముప్పైయ్యేళ్ళు వుండొచ్చు. నల్లగా, లావుగా, బాగా పొట్టిగా వుంది. ఎత్తుపళ్ళు, మందపాటి కళ్ళజోడు. నేను మనుషుల అందచందాలు పెద్దగా పట్టించుకోను, అయితే నాకీ జంట రూపంలో తేడా మరీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. 

కేస్ హిస్టరీ తీసుకుంటుండగా అర్ధమయినదేమనగా.. ఈయనగారికి ఈవిడగారు రెండో భార్య. ఈయన మొదటి భార్యగా ఓ 'అందమైన' యువతిని పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆవిడగారు కొద్దికాలానికి ఈయనగారి స్నేహితుడితో 'వెళ్ళిపోయింది'. అప్పుడీయన కొంతకాలం డిప్రెషన్లో మునిగిపొయ్యాడు. ఆ తరవాత తీవ్రంగా ఆలోచించాడు. భవిష్యత్తులో యిటువంటి ఇబ్బందులేమీ వుండరాదని ఒక గట్టి నిర్ణయం తీసుకుని.. ఏరికోరి ప్రస్తుత భార్యని పెళ్లి చేసుకున్నాడు.
     
"అందానికి ప్రాముఖ్యతనిచ్చి ఒకసారి దెబ్బ తిన్నాను. నాక్కావలిసింది నాతో జీవితాంతం కలిసి బ్రతికేమనిషి. ఇప్పుడు హాయిగా, ప్రశాంతంగా ఉన్నాను." స్థిరంగా, ధృఢంగా, గుళ్లో గంట కొట్టినంత ఖచ్చితత్వంతో చెప్పాడు.
           
ముప్పైయ్యేళ్ల క్రితం చదివాను.. జీవితంలో మనకి మనం ఓ రెండు ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవాలి. అవి కష్టమైన ప్రశ్నలు, కానీ ముఖ్యమైనవి.

1.'నేనెవర్ని?'

2.'నాకేం కావాలి?'

ఈ రెండు ప్రశ్నలకి మనమిచ్చుకునే సమాధానం స్పష్టతకి ఎంత దగ్గరగా వుంటే అంత సుఖంగా వుంటాం. స్పష్టతకి ఎంత దూరంగా వుంటే అంత అశాంతిగా వుంటామని మళ్లీ ప్రత్యేకించి రాయనవసరం లేదనుకుంటా.

మనగూర్చి మనం ఫలానా అని అనుకుంటాం, కానీ కాదు. మనకి లేని తెలివితేటల్ని, సుగుణాల్ని ఆపాదించుకుని.. థియరీకి ప్రాక్టీస్ కి దూరం పెరిగిపోయి సతమవుతుంటాం, గందరగోళ పడిపోతుంటాం. మనకేం కావాలో సరైన అవగాహనా వుండదు. ఫలానాది బాగుంటుందనిపిస్తుంది, కానీ ఎందులోనూ సుఖం అనిపించదు. ఎత్తు, బరువులాగా మానసిక అపరిపక్వతని, అజ్ఞానాన్ని కొలిచే మీటర్లుంటే యెంత బాగుండు!

'నువ్వు అనవసరపు చెత్త చాలా చదువుతున్నావ్, తెలుసుకుంటున్నావ్. ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తున్నవారు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు.' అంటాడు మా సుబ్బు.

'అసలు రచయితల్లోనే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఏదీ తిన్నగా చెప్పి చావరు, ప్రతిదీ తీవ్రంగా ఆలోచిస్తారు.. విషయాన్ని జటిలం చేసుకుంటారు. జాక్ లండన్, హెమింగ్వేలు అందుకే ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు జాగ్రత్త.' అంటూ భయపెడతాడు కూడా.

నన్ను గొప్పరచయితలతో పోల్చినందుకు ఆనందించాలో, వాళ్ల చావుతో నన్ను ముడిపెట్టినందుకు ఏడవాలో అర్ధం కాలేదు!

ఈ ఎర్రటి పోడుగాయన తన భార్య సమస్య గూర్చి ఇంకా చెబుతూనే ఉన్నాడు. నేను ఆయన్ని ఈర్ష్యగా, ఎడ్మైరింగ్‌గా చూస్తూనే ఉన్నాను. జీవితంలో తనకి ఏం కావాలో యితనికి తెలుసు. కష్టమైన రెండు ప్రశ్నలకి సులభమైన సమాధానాలు చెప్పుకున్నాడు, హాయిగా ఉన్నాడు.

అయితే ఈయన ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో ఈయనకే తెలిసినట్టుగా లేదు. ఈ ప్రపంచంలో సాధారణ మానవులే అసాధారణ నిర్ణయాలు తీసుకోగలరని కొడవటిగంటి కుటుంబరావు అంటాడు, ఇది నిజంగా నిజం.

Friday 7 June 2013

తెలుగు ఉన్మాదం

"ఉన్మాదం రోగుల కోసం మానసిక వైద్యుల అవగాహన సదస్సు."

ఒక తెలుగు పేపర్ జిల్లా ఎడిషన్లో ఈ వార్త చదవంగాన్లే కంగారుపడ్డాను. సైకియాట్రీ వైద్యంలో 'ఉన్మాదం' అనే జబ్బు ఉన్నట్లు నాకు తెలీదు. కొద్దిసేపటి తరవాత నాకర్ధమైందేమనగా - 'స్కిజోఫ్రీనియా'కి తెలుగు అనువాదం 'ఉన్మాదం' అని. మనసు దిగులుగా అయిపొయింది.

నాకెందుకో 'ఉన్మాదం' అంటే ఉగ్రవాదం టైపులో తిట్టులాగా అనిపించింది. తలపెట్టిందేమో స్కిజోఫ్రీనియా పట్ల అవగాహన, కార్యక్రమానికి వచ్చినవారిని ఉన్మాదులు అంటే.. పిలిచి మరీ అవమానించినట్లవుతుందేమో! ఉన్మాదం అనే అనువాద పదం తెలుగు నిఘంటువు ప్రకారం కరెక్టే ఆవ్వచ్చు, కానీ విండానికి యేమాత్రం బాలేదు.

మన భాషాభిమానులు రోగాల పేర్ల విషయంలో కొంత నిబద్ధత పాటించాల్సిన అవసరం ఉంది. స్కిజోఫ్రీనియా పదం జర్మన్ భాషకి చెందింది, ఇంగ్లీషువాడు దాన్ని స్కిజోఫ్రీనియాగానే ఉంచేశాడు గానీ తన భాషలోకి అనువదింప పూనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా రొగాలకి ఒకటే పేరుంటే మంచిది, అందువల్ల ఎవరికీ నష్టం లేదు.

'అతిసారం' అంటే కలరా అన్నసంగతి నాకు మొన్నటిదాకా తెలీదు. హైపర్‌టెన్షన్‌ని ఇంగ్లీషులో బ్లడ్ ప్రెషర్ (BP) అంటారు. బిపి అంటే చదువుకోనివారిక్కూడా సులభంగా అర్ధమౌతుంది. కానీ తెలుగులో 'రక్తపోటు' అంటూ భయాందోళనకి గురిచేస్తారు. డయాబిటిస్ అంటే 'మధుమేహం', టైఫాయిడ్ అంటే విషజ్వరంట!

తెలుగు భాషాభిమానం అంటే విషయాన్ని సంక్లిష్టం చేసుకోవటం కాకూడదు. ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పదాల్ని (అది ఏ భాషైనా పరవాలేదు) అలా వదిలేస్తేనే ఉత్తమం. ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలం అంటూ ఏదో మాయాజాలం చెయ్యనేల! ఇలా అంటే మన ప్రొఫెషనల్ భాషాభిమానులు వొప్పుకోరు. వారికి కృతకమైన తెలుగు అనువాద పదాలంటేనే భలే ఇష్టం.

నాకు మొదట్నుండి మాతృభాషపై గొప్ప మమకారం లేదు, భాష అనేది కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే అని నా అభిప్రాయం. అందువల్లనేనేమో 'తెలుగు భాషని పసిబిడ్డలా సాకుదాం' అనే నినాదం వింటే నవ్వొస్తుంది! ఈ రోజుల్లో ఇళ్లల్లో మాతృమూర్తులకి దిక్కుండదు.. మాతృభాషకి మాత్రం అంతులేని పవిత్రత!

నేను ఆంధ్రప్రాంతంలో పుట్టాను కావున తెలుగు రాస్తున్నాను. కేరళలో పుట్టినట్లైతే మలయాళం రాసేవాణ్ని. నా భాష తెలుగు కావటం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే, ఈ యాక్సిడెంట్లకి పవిత్రత అంటగట్టడం మూర్ఖత్వం. ఆ మాటకొస్తే కుక్కలక్కూడా కుక్కభాష వుంటుంది కదా!

మనం సాధ్యమైనంతవరకు ఈ ధూమశకట యంత్రాలకీ, అంతర్జాలలకీ దూరంగా జరిగితే మంచిది. భాష అనేది ఎవణ్నో ఉద్ధరించడానిక్కాదు. మన ఆలోచనల్ని చెప్పుకోడానికి, రాసుకోడానికి మాత్రమే. అంతకుమించి యే భాషక్కూడా ప్రయోజనం లేదు.

రేప్పొద్దున భాషలన్నీ అంతరించిపోయి సైగలు చేసుకుంటూ బ్రతికే రోజులొస్తే మనం కూడా ఇంచక్కా సైగలు చేసుకుంటూనే బ్రతికేద్దాం. నాకైతే అది కూడా హాయిగానే ఉంటుంది.

అంకితం -

తెలుగుభాషలో 'అనువాద పదాలు' అంటూ కంకర్రాళ్ళ భాషని మనపై రుద్దడానికి ప్రయత్నించే విజ్ఞులకి.

(fb post on 16 Dec 2017)

Thursday 6 June 2013

అంతా ఇంతే


"మనం మావోయిస్టు సమస్యకి పరిష్కారం వెతకాలంటే సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. మావోయిజం అంతానికి అభివృద్ధే మందు. ప్రభుత్వం ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించాలి. వారికి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక షెడ్యూల్స్ అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పోరేట్ శక్తుల్ని కట్టడి చెయ్యాలి. ఆదివాసీలకి విద్య, ఆరోగ్యం, ఉపాథి పథకాలు చేరువ కావాలి. ఇవన్నీ ఆదివాసీల ప్రాధమిక హక్కుగా.... " 

ఒక కళ్ళజోడు గడ్డపాయన ఆవేశంగా చెబుతున్నాడు. అది చత్తీస్ గఢ్ మావోయిస్టుల మీద ఒక తెలుగు టీవీ చానెల్లో చర్చాకార్యక్రమం. నాకాయన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. అమాయకత్వమూ కనిపిస్తుంది.

ఇట్లాంటి మాటలు ఇంతకు ముందు ఎక్కడో విన్నానే. ఎక్కడ? ఎక్కడబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఇవి ఒకప్పుడు మా ప్రొఫెసర్ మాటలు. ఈ కళ్ళజోడు గడ్డం మాటలకి మా ప్రొఫెసర్ గారికీ లింకేమిటి చెప్మా!

ఎవరికీ ఏదీ అసందర్భంగా గుర్తుకు రాదు. ఇక్కడ కూడా ఈ జ్ఞాపకానికి లింకుంది. నాకు రాజకీయాలు పెద్దగా తెలీదు. వాటి గూర్చి లోతుల్లోకి వెళ్లి అర్ధం చేసుకునే ఓపికా లేదు. అందుకే నా అనుభవాల ఆధారంగా రాజకీయాల్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తుంటాను.

ఇప్పుడు కొద్దిసేపు ఫ్లాష్ బ్యాక్. అవి నా గుంటూరు మెడికల్ కాలేజ్ రోజులు. పరీక్షలు ముంచుకొస్తున్నాయి. స్నేహితులం పడీపడీ చదువుతున్నాం. విపరీతమైన టెన్షన్. ఆ రోజుల్లో మాకో పాలసీ ఉండేది. పరీక్షలు కూతవేటు దూరంలోకి వచ్చేదాకా సినిమాలు, కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసేవాళ్ళం. పరీక్షలప్పుడు నిద్రాహారాలేం ఖర్మ? స్నానం, గడ్డం కూడా మానేసి చదివేవాళ్ళం.

పరీక్షలకి తీవ్రంగా ప్రిపేర్ అవుతూ వడలిపోయి, పాలిపోయి, డస్సిపోయి, నలిగిపోయున్న మమ్మల్నిచూసి మా ప్రొఫెసర్ గారొకాయన బోల్డు జాలి పడ్డాడు. కారణం కనుక్కుని మమ్మల్ని ఓదార్చుటయే తన కర్తవ్యంగా భావించారు.

ఆయన చాలా నిదానస్తుడు. ఉత్తముడు. మంచి టీచర్. గొప్ప సర్జన్. వారు చక్కటి ఆంగ్లంలో మమ్మల్నీ విధంగా ఓదార్చారు (ఆయన ఆంగ్లాన్ని నా తెలుగు అనువాదంలో చదువుకోండి).

"సంవత్సరం పొడుగుతా రోజూ తొమ్మిదింటికల్లా ఆస్పత్రికి వచ్చేయ్యాలి. కేసులు థరోగా ఎక్జామిన్ చేసి డీటైల్డ్ గా ప్రెజెంట్ చెయ్యాలి. క్లాస్రూం లెక్చర్స్ శ్రద్ధగా వినాలి. ఏ రోజు టాపిక్ ఆ రోజు చదివెయ్యాలి. అంటే రోజూ లైబ్రరీలో కనీసం నాలుగ్గంటలు చదవాలి. వెరీ సింపుల్! ఇంక భయం దేనికి?"

"అయినా భయమేస్తుంది సర్!" ఒకడు నసిగాడు.

"అస్సలు భయపడొద్దు. థియరీ వివరంగా, నీట్ గా, పాయింట్లవారిగా రాయండి. లాంగ్ కేస్ బాగా చెయ్యండి. షార్ట్ కేస్ చక్కగా చెయ్యండి. వైవాలో ఎక్జామినర్స్ అడిగిన ప్రశ్నలకి కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పండి. అంతే! వెరీ సింపుల్! ఇంక భయం దేనికి?" అంటూ మా వాడి భుజం ఆప్యాయంగా తట్టారు.

'మా కళ్ళు తెరిపించారు సర్!' అన్నట్లు ఓ వెధవ నవ్వొకటి పడేసి బయటపడ్డాం. ఐదు నిమిషాల తర్వాత క్యాంటీన్లో తేలాం. ఒక మంచి కాఫీ తాగుతుంటే గానీ ప్రొఫెసర్ చెప్పింది అర్ధం కాలేదు. అర్ధమయ్యాక అందరం పెద్దగా నవ్వుకున్నాం.

"పాపం. పెద్దాయన మరీ మంచివాడు. అందుకే మనకి చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్పాడు. సంవత్సరం అంతా చదివితే పాసేం ఖర్మ. గోల్డ్ మెడలే వస్తుంది. ఆ మాత్రం మనకి తెలీదా? ఇక్కడ మనకెన్ని పన్లున్నయ్! సినిమాలెవరు చూస్తారు? అందమైన అమ్మాయిలకి లైనెవరేస్తారు? ఒకటా రెండా? ఎన్నిపన్లు! ఇన్ని పన్ల మధ్యన చదువుకోటానికి టైముండొద్దు! అయినా ఆయన అంత గొప్ప ప్రొఫెసర్ గదా! మరీ ఇంత అమాయకంగా, ఛాదస్తంగా మాట్లాడాడేంటబ్బా!"

ఆయన సుభాషితాలు అప్పుడే కాదు.. తరవాత కూడా గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం.

ఇన్నాళ్ళకి మళ్ళీ మా ప్రొఫెసర్ వంటి ఉత్తముణ్ని టీవీలో చూస్తున్నాను. మన టీవీ పెద్దమనిషి మాటలు వింటే రాహుల్ గాంధీ, రమణ్ సింగ్ లు ఏమనుకుంటారు? బహుశా మేం ఆ రోజు క్యాంటీన్లో కాఫీ తాగుతూ నవ్వుకున్నట్లు విరగబడి నవ్వుకుంటారు. తర్వాత ఇలాగనుకుంటారు (వారి హిందీని నా తెలుగు అనువాదంలో చదువుకోండి).

"ఎవడీ వెర్రిబాగులవాడు? వీడెవడో ఓ పనికిమాలిన మధ్యతరగతి మేధావి వలే ఉన్నాడు. వాళ్ళు మాత్రమే ఇంత అమాయకత్వంలో బ్రతికేస్తుంటారు.. టీవీ డిబేట్లలో ఆవేశపడుతుంటారు. ఆదివాసీల జీవితాల్ని ఉద్ధరించాలట! ఆ మాత్రం మనకి తెలీదా!" అన్నాడు చికాగ్గా రాహుల్ గాంధీ.

"మనం ఎన్నెన్ని స్కాములు చెయ్యాలి? ఎన్నెన్ని కోట్లు వెనకేసుకోవాలి. మనం ఉద్ధరించాల్సింది మైనింగ్ కార్పోరేట్లని.. ఆదివాసీల్ని కాదు. వీడెంతుకింత గొంతు చించుకుంటున్నాడు? పాపం! ఈ వెర్రిబాగులవాడి వల్ల వీడి భార్యాపిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారోగదా!" జాలిగా అన్నాడు రమణ్ సింగ్.

(photo courtesy : Google)

Saturday 1 June 2013

గాడీజ్ గ్రేట్


అతగాడు యువకుడు. ఉత్సాహవంతుడు. మొదటిసారిగా ప్రజాప్రతినిధి (ప్ర.ప్ర.) గా ఎన్నికయ్యాడు. రాష్ట్రాన్ని సింగపూర్ లా మార్చెయ్యాలనేది తన పార్టీ అగ్రనాయకుల కల, చిరకాల వాంఛ. తదనుగుణంగా ప్ర.ప్ర. కూడా తన నియోజకవర్గాన్ని సింగపూర్ గా మార్చెయ్యాలని నడుం కట్టాడు.

అయితే ప్ర.ప్ర.కి ఓ తలనొప్పొచ్చిపడింది. తన నియోజకవర్గంలో ఎక్కువమంది కొంపాగోడూ లేని దరిద్రులు. వారిలో ఎక్కువమంది రోడ్ల పక్కనే నివసిస్తున్నారే. వారిని వదిలించుకోవటం ఎలాగో అర్ధం కావట్లేదు. వారి వోట్లతోనే తను ప్ర.ప్ర. అయ్యాడు మరి.

వీళ్ళకి తోడు కొందరు ముష్టివాళ్ళు. కనీసం ఆ ముష్టివాళ్ళనైనా తరిమేద్దామని ప్రయత్నించాడు. అప్పోజిషన్ వాళ్ళు 'ఇదన్యాయం. ఈ దేశానికి ముష్టివాళ్ళే ముద్దుబిడ్డలు.' అంటూ గొంతు చించుకున్నారు. వారి విమర్శలకి జంకిన ప్ర.ప్ర. ఏం చెయ్యాలో తోచక తల పట్టుకున్నాడు. ఏ దిక్కూ లేనివాడికి దేవుడే దిక్కు.

"భగవాన్! ఏమిటి నాకీ దుస్థితి? ఏదోక దారి చూపవయ్యా." అని దేవుణ్ని వేడుకున్నాడు.

దేవుడు కరుణించాడు. ఆ యేడాది ఒకటే వర్షాలు. ఎన్నడూ లేనిది వరదలొచ్చాయి. కాలవలు, రోడ్లూ ఏకమై ఉప్పొంగిపొయ్యాయి. మర్నాటికల్లా గతుకుల రోడ్లు, అతుకుల గుడిశలు కొట్టుకుపొయ్యాయి. ఆ తరవాత ఒకటే దోమలు, ఈగలు, బురద, కుళ్ళు, దుర్గంధం.

తద్వారా విషజ్వరాలు, విరోచనాలు. ఆ దెబ్బకి మూడోవంతు 'దరిద్రపుగొట్టు జనాభా' చచ్చింది. ప్ర.ప్ర. చచ్చినవారికి యాభైవేలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి మరీ సాధించాడు (ధర్మప్రభువు).

తన నియోజక వర్గ అభివృద్దే ఊపిరిగా బ్రతుకుతున్న ప్ర.ప్ర. కొట్టుకు పోయిన గతుకుల రోడ్ల స్థానంలో వెడల్పాటి కొత్త రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాడు (పది పర్సెంట్ కమిషన్ బేసిస్ మీద). వరదలోస్తే వచ్చాయి గానీ.. ఇప్పుడీ వెడల్పాటి విశాలమైన రోడ్లు ఎంత ముద్దొస్తున్నాయో! ఒక పావలా సింగపూర్ వచ్చేసినట్లే.

కొత్త రోడ్డు వేసేదాకా ఓపిగ్గా నక్కిన దరిద్రులు.. రాత్రికిరాత్రే రోడ్ల మార్జిన్లని మళ్ళీ ఆక్రమించారు. ఆ విధంగా సమస్య తీవ్రత తగ్గింది గానీ.. అసలు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ప్ర.ప్ర. సమస్య పరిష్కారం కోసం తీవ్రస్థాయిలో పూజలు, పునస్కారాలు చేయించాడు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు (పుణ్యాత్ముడు).

ఆ యేడాది ఎప్పుడూ లేనంతగా విపరీతమైన చలి. ఊరంతటినీ డీప్ ఫ్రీజ్ లో పెట్టి డోర్ మూసినట్లుగా గజగజా వణికిపోయింది. బిక్షగాళ్ళు ఆ చలికి ఎముకలు కోరుక్కుపోయ్యి చచ్చారు. పూరిపాకల పూర్ పీపుల్ వెన్నులోంచి చలి కమ్మి నీలుక్కుపోయ్యి చచ్చారు. ప్ర.ప్ర. మళ్ళీ దీక్ష చేసి చచ్చినవారికి ప్రభుత్వం నుండి ఈమారు లక్ష రూపాయిలు ఇప్పించాడు (ధర్మప్రభువు).

ఆ విధంగా చలికాలం వెళ్లేసరికి రోడ్డు మార్జిన్లు ఖాళీ అయ్యాయి. ఆ మార్జిన్లని మరింతగా విస్తరింపజేసి అభివృద్ధి చెయ్యడానికి నిధులు శాంక్షన్ చేయించుకున్నాడు (ఈసారి ఇరవై పర్సెంట్ కమిషన్). లాన్లు వేయించాడు. లారీల్లో తెప్పించిన పూల మొక్కల్ని దగ్గరుండి మరీ నాటించాడు (మంచి టేస్టున్న మనిషి).

పచ్చని పచ్చికలో రంగురంగుల పూల మొక్కలు సుతారంగా, వయ్యారంగా కబుర్లాడుకున్నాయి. అవన్నీ నర్సరీ నుండి వచ్చాయి కావున ఇంగ్లీషు మీడియం విద్యార్ధుల్లా ఠీవీగా, గర్వంగా కూడా ఉన్నాయి. ప్రకృతి ఎంత అందముగా యుండును!

ప్రతి దేశంలోనూ మొండిప్రాణాలుంటయ్. వాళ్ళు ప్రకృతిని, దేవుణ్ణి కూడా జయిస్తారు. కానీ తమ దరిద్రాన్ని మాత్రం జయించలేరు. అంచేత అక్కడక్కడా ఇంకా కొందరు మొండి ముదనష్టపు వెధవలు దిష్టిపిడతల్లా మిగిలే (బ్రతికే) ఉన్నారు. వాళ్ళు ఆ ముద్దులొలికే మొక్కల మధ్యనే స్నానపానాదులు, ఆశుద్ధ విసర్జన కార్యక్రమాలు నిర్లజ్జగా కానిస్తున్నారు. వాళ్ళసలు మనుషులేనా! ప్ర.ప్ర.కి గుండె బరువెక్కింది.

నా నియోజక వర్గానికి ఈ దరిద్రుల దరిద్రం వదలదా? తన సింగపూరు కల ఇక నెరవేరదా? నా ఆశ అడియాశయేనా? ప్ర.ప్ర.కి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఈసారి పట్టుదలగా గొప్పయాగం చేయించాడు. అదేమన్నా సామాన్యమైన యాగమా! అలనాడు పిల్లల కోసం దశరధ మహారాజు కూడా ఇంత భీకర యజ్ఞం చేసి ఉండడు. దేశంలో ఉన్న వేదపండితులు ప్ర.ప్ర.ని మెచ్చుకున్నారు. దీవించారు.

తన భక్తుని పూజలకి భగవంతుడు మిక్కిలి సంతసించాడు. అతగాడి కష్టాలకి కారణమైన దౌర్భాగ్య దరిద్రుల పట్ల కన్నెర్ర చేశాడు. ఫలితంగా ఆ యేడాది ఎండాకాలం నిప్పుల కొలిమిలా భగభగా మండిపోయింది. సూర్యుడి భీకర ప్రతాపానికి సశేషంగా ఉంటున్న దరిద్రులంతా మలమలా మాడి చచ్చి నిశ్శేషం అయిపోయ్యారు. ఒక్కడూ మిగలని కారణాన ప్ర.ప్ర.కి నష్టపరిహార దీక్ష కూడా అవసరం లేకుండా పోయింది.

ఇప్పడు ప్ర.ప్ర. కల నెరవేరింది. ఒక్కసారి అటుగా వెళ్లి చూడండి. విశాలమైన రోడ్లు. సుందర నందనవనంలాంటి పార్కులు. కళ్ళు చెదిరే షాపింగ్ మాల్స్. స్విమ్మింగ్ పూల్స్. టెన్నిస్ కోర్టులు. హెల్త్ స్పాలు. క్లబ్బులు. పబ్బులు. సింగపూర్ని కాదు.. లాస్ వేగాస్ నే దించేశాడు ప్ర.ప్ర.

ఈ అభివృద్ధికి కళ్ళు చెదరగా, కళ్ళు చెమర్చగా.. ఇదే మోడల్ని రాష్ట్ర ప్ర.ప్ర.లందరూ అనుసరించాలని పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. ప్ర.ప్ర. మిక్కిలి సంతసించెను. తన జన్మ ధన్యమైనది. ఇదంతా ఆ భగవానుడు తనకి ప్రసాదించిన వరం. గాడీజ్ గ్రేట్!

(కథ అయిపొయింది.)

epilogue 

ఇదేం కథ! ప్ర.ప్ర. ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. పైగా నియోజక వర్గాన్ని మొక్కవోని దీక్షతో అభివృద్ధి చేశాడు. ఆ దరిద్రులపై ప్రకృతి వికృతంగా పగబట్టింది. అంతే! అసలు నిజానికి మనం ప్ర.ప్ర.ని అభినందించాలి.

అన్నట్లు ఇందాక ఒక ముఖ్యమైన సంగతి చెప్పడం మరచితిని.

ఏమది?

ఆ మాల్స్, మల్టిప్లెక్సులు, క్లబ్బులు, పబ్బులు మన ప్ర.ప్ర. సొంత ఆస్తి. తన నియోజక వర్గం గుడిసెల్తో, గుంటలతో దరిద్రంగా ఉండే రోజుల్లో చవగ్గా ఆ స్థలాలు కొనేశాడు. అమ్మనివారిని బెదిరించి మరీ కొన్నాడు. వీలైన చోట కబ్జా చేశాడు.

ఆక్రమణల అలగా వెధవలు 'ప్రకృతి ధర్మం'గా చచ్చుచుండగా.. భూముల విలువ పెరగుచుండగా.. ప్ర.ప్ర. తన స్థలం ఒక్కోదాన్ని ఒక్కొరకంగా డెవలప్మెంట్ కి ఇవ్వసాగెను. అందుకే అంత తొందరగా తన సింగపూర్ కలని సాకారం చేసుకోగలిగెను.

(ఇప్పుడు నిజంగానే కథ అయిపోయింది.)

(photo courtesy : Google)