Wednesday 27 August 2014

మారిపోవురా కాలము, మారుట దానికి సహజమురా!


షావుకారు సినిమా చూశారా? 

ఈ సినిమా చూస్తుంటే - సావిత్రి (మధుబాల అయినా పర్లేదు) మన భుజం మీద చెయ్యేసి ఒళ్లోకి తీసుకుని - ప్రేమగా, ముద్దుగా బెజవాడ బాబాయ్ హోటల్ నేతి ఇడ్లీల్ని తినిపిస్తున్నంత హాయిగా వుంటుంది. 

షావుకారు పాటలు విన్నవారికి తెలుగు సినిమా పాటల పట్ల గౌరవం పెరుగుతుంది. నాలుక్కాలాల పాటు నిలిచిపొయ్యేవే మంచిపాటలు అంటారు. షావుకారు పాటలు అంతకన్నా ఎక్కువే నిలిచిపొయ్యాయి.   

మా వయసువాళ్ళకి 'బీజేపి' అంటే పల్చటి పెదాలతో చిరునవ్వులు చిందించే వాజ్‌పాయి.. టూత్‌బ్రష్ మీసాలు, బట్టతలతో సీరియస్‌గా కనిపించే అద్వాని మాత్రమే. వీళ్ళిద్దర్నీ కొందరు కృష్ణార్జునులతో పోల్చేవాళ్ళు. బీజేపి రాజకీయ ప్రత్యర్ధులు వాజ్‌పాయి కన్నా అద్వానీనే ప్రమాదకారిగా భావించేవాళ్ళు. 

కాలం చిత్రమైనది, కఠినమైనది. అందుకే - మృదువుగా, కవితాత్మకంగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ - మరఫిరంగుల్నే పేల్చిన వాజ్‌పాయిని అనారోగ్యంతో కనుమరుగయ్యేలా చేసింది. కారణాలు ఏవైనప్పటికీ - లోహపురుషుడిగా పార్టీలో నీరాజనాలు అందుకున్న అద్వాని కూడా మనకి పెద్దగా కనిపించే అవసరం లేకుండా చేసింది. 

ఇప్పుడు నాకు షావుకారు పాట జ్ఞాపకం వస్తుంది. 'మారిపోవురా కాలము, మారుట దానికి సహజమురా!' అవును! ఎంత నిజం!

Monday 25 August 2014

బకెట్‌తో సవాల్? బీ కేర్‌ఫుల్!


సమయం సాయంకాలం ఆరుగంటలు. పిల్లల కోసం నూడిల్స్ చేస్తున్నాను. ఇంతలో నా సుపుత్రుడు స్టవ్ దగ్గరకొచ్చి ఒక యూట్యూబు వీడియో చూపించాడు. అదేదో ఐస్ బకెట్ ఛాలంజ్‌ట! నెత్తిన బకెట్లతో ఐస్ కుమ్మరించుకుంటున్నారు. 'ఇదంతా ఒక నరాల రోగానికి చందా వసూలు చెయ్యటానికి!' పిల్లాడు తన జ్ఞానాన్ని నాక్కొంత పంచాడు. ఏవిటో! కొందరికి సరదా, మరికొందరికి పబ్లిసిటీ పిచ్చి, ఇంకొందరికి రోగుల పట్ల ప్రేమ. సరే! ఎవరి గోల వారిది, కాదన్డానికి మనమెవరం?

అయినా మనకి ఈ సవాళ్ళు కొత్త కాదు. 'చెంచులక్ష్మి' సినిమాలో అంజలీదేవి జిక్కి కృష్ణవేణి స్టోన్లో 'చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?' అంటూ నాగేస్సర్రావుకి సవాల్ విసిరిందిగా! అయితే - మన దేశంలో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ కుదర్దనుకుంటున్నాను. కారణం - మనకి నీళ్ళ సమస్య వుంది. నీళ్ళున్నా ఫ్రిజ్జులుండవు. ఫ్రిజ్జులున్నా నీళ్ళు గడ్డకట్టేదాకా కరెంటుండదు. ఎవరన్నా మరీ ముచ్చట పడితే శవాల్ని పడుకోబెట్టే ఐస్ దిమ్మల్ని కొనుక్కుని, సుత్తితో ముక్కలుగా కొట్టుకుని, బకెట్లో పోసుకుని నెత్తిన కుమ్మరించుకోవాలి. అయినా మన మండుటెండలలో, ఉక్కపోతలో - నెత్తిన ఐస్ నీళ్ళు పోసుకోవడం ఛాలెంజ్ ఎలా అవుతుంది! అయితే గియితే వేణ్ణీళ్ళు గుమ్మరించుకోడం ఛాలెంజ్ అవ్వాలి గానీ!

వుంటానికి దేశాలన్నీ ఒక ప్రపంచ మేప్‌లోనే వున్నాయి. కానీ సమస్యలు మాత్రం వేరువేరు. ఆఫ్రికా ఖండం సమస్త రోగాలకి నిలయం. అమెరికావాడికి టీబీ, మలేరియా సమస్య లేదు. టైఫాయిడ్, కలరా అంటే ఏంటో తెలీదు. కాబట్టే వాళ్ళు నరాల రోగ స్పృహ కోసం ఐస్ బకెట్లు నెత్తిన కుమ్మరించుకుంటున్నారు. ఐస్ కుమ్మరించుకోటానికి రోగానికి సంబంధం ఏంటో తెలీదు.

తిండానికి తిండే లేనివాడికి చద్దన్నమే పరమాన్నం. తిండి సమస్య కానివాడికి - భోజనంలో ఎన్ని పదార్ధాలు వుండాలి? అవి యెలా వడ్డించుకోవాలి? అన్నదే సమస్యవుతుంది. అంటే మొదటి సమస్య తీరితే గాని, రెండో సమస్య రాదు. పేదదేశాలు మలేరియా, ఫైలేరియా సమస్యల్తో కునారిల్లుతుంటాయి. కాబట్టి వాళ్లకి నరాల రోగం సమస్యే కాదు. మనది పేదదేశం అంటే దేశభక్తులకి కోపం రావచ్చు గానీ, వైద్యారోగ్య విషయాల్లో మన్ది ఆఫ్రికా దేశాల స్థాయని నా అభిప్రాయం.

మనదేశంలో ఫేస్బుక్ యువత సంఖ్య భారీగానే వుంది. వీళ్ళకి సామాజిక అవగాహన (వున్నట్లే) వుంది. అందుకే బొంబాయి ఐదు నక్షత్రాల హోటల్ మీద దాడి జరిగినప్పుడూ, ఢిల్లీ రేప్ సంఘటన సమయంలోనూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సాధారణంగా వీళ్ళు అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళని అనుకరిస్తుంటారు. మరి మన దేశంలోని ఫేస్బుక్కులోళ్ళు నెత్తి మీద ఐస్ బకెట్లు కుమ్మరించుకునే కార్యక్రమం మొదలెట్టారో లేదో తెలీదు.

బకెట్ ఐసో, బూడిదో.. ఏదైతేనేం - నెత్తిన కుమ్మరించుకోడం సరదాగానే వుంటుంది. ఐతే - ఆ సరదా కోసం ఎంచుకోవలసిన కారణం మాత్రం ప్రభుత్వాలకి ఇబ్బంది కలగని విధంగా వుండాలి. ఉదాహరణకి - అమెరికాలో అమెరికావాడి యుద్ధాలకి వ్యతిరేకంగానో, చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలనో బకెట్ కాదు.. కప్పు ఐస్ గుమ్మరించుకున్నా చాలా ప్రమాదం!

ఏ సమాజంలోనైనా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేసినా అభినందనీయమే. మనకైతే నరాల జబ్బుల ఛాలెంజిలు అవసరం లేదనుకుంటున్నాను. అంటే - ఆ రోగాలకి వైద్యం అవసరం లేదని కాదు, అంతకన్నా ముఖ్యమైన సమస్యలే మనకున్నాయని నా అభిప్రాయం. 

అందువల్ల - మన ఛాలెంజిలు వేరుగా వుండాలి. మనకి చాలా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వున్నాయి. మీరు ఏ హాస్టల్లోనైనా సరే - ఒక ముద్ద అన్నం తినగలరా? ఛాలెంజ్! ఒక గుక్క నీళ్ళు తాగ్గలరా? ఛాలెంజ్! ఆ బాత్రూముల్లో (ముక్కు మూసుకునైనా సరే) ఒక నిమిషం ఉండగలరా? ఛాలెంజ్!

ఇట్లాంటి ఛాలెంజిలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే రెండురకాల ఫలితం రావచ్చు. ఒకటి - ప్రభుత్వాలకి బుద్ధొచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ స్థితిగతుల్ని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చెయ్యొచ్చు. రెండు - వాస్తవాల్ని ఎత్తి చూపినందుకు ప్రభుత్వానికి కోపం రావచ్చు, దీన్నో అవమానంగా భావించి మిమ్మల్ని ఏదోక కేసులో ఇరికించొచ్చు. నేనైతే మాత్రం రెండోదే జరుగుతుందని భావిస్తున్నాను.

అంచేత - ప్రభుత్వాలకి కోపం రాకుండా మన సరదా తీర్చుకునే మార్గం గూర్చి ఆలోచిద్దాం. 'గ్లోబల్ వార్మింగ్ పరిశోధన చందాల నిమిత్తం ఒక ఛాలెంజ్!', 'వీధికుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెయ్యాల్సిన ఆవశ్యకతని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు మరియూ అందు నిమిత్తం నిధుల కోసం ఒక ఛాలెంజ్!' ఇలాంటి ఛాలెంజిల్ని మనం ఎన్నైనా చేసుకోవచ్చు!

ప్రభుత్వాలకి ఇబ్బంది కలిగించని ఇటువంటి ఛాలెంజిల్ని ఎంచుకుంటే మన ఒంటికి మంచిది, పైగా మంత్రిగారు ముఖ్యఅతిథిగా వేంచేసి మన్ని అభినంధించొచ్చు. ఆ విధంగా మన సరదా తీరుతుంది, యూట్యూబులో వీడియో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే - బకెట్లతో నెత్తిన ఏం కుమ్మరించుకోవాలో తోచట్లేదు, ఈ విషయమై మీ సలహాలకి ఆహ్వానం. 

మిత్రులారా! ముందు మీరు మీమీ బకెట్లు రెడీ చేసుకోండి! మిగిలిన సంగతులు తరవాత ఆలోచిద్దాం!

(picture courtesy : Google)

Saturday 23 August 2014

సైకో


గత కొన్ని నెలలుగా తెలుగు వార్తా చానెళ్ళు, పత్రికలు, బ్లాగు ఎగ్రిగేటర్లని చూడ్డం మానేశాను. హాయిగా వుంది. ఈ సంగతి తెలిస్తే ఇంకా ముందే మానేసి వుందును. 

ఇవ్వాళ పొద్దున్న ఒక మిత్రుణ్నించి ఫోన్.

"నువ్వు 'సైకో' కేసులు చూస్తావా?" అడిగాడు. 

"ఎందుకు చూడను? మాకు సగం కేసులు అవే కదా?" నవ్వుతూ అన్నాను. 

"సైకో అంటే ఏవిటి?" కుతూహలంగా అడిగాడు నా మిత్రుడు. 

"అద్సర్లే గానీ - సైకో పేరుతొ హిచ్‌కాక్ సినిమా తీశాడు. చూశావా?" అడిగాను. 

"చూళ్ళేదు. ఇంతకీ 'సైకో' అంటే ఏవిటి?" మళ్ళీ అడిగాడతను. 

"సైకో అనేది 'సైకోసిస్' అనే మానసిక రోగానికి పొట్టి పేరు. డాక్టర్లెవరూ ఈ పదం వాడరు. సామాన్య జనంలో కొందరు - 'సైకో' అంటే తీవ్రంగా డిస్టర్బ్ అయ్యి ఎగ్రెసివ్‌గా ప్రవర్తించేవాళ్ళ పట్ల negative connotation తో వాడతారు. ఇది చాలా తప్పు. ఒక రోగాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడ్డం సంస్కారవంతుల లక్షణం కాదు. నువ్వీ పదం ఎప్పుడూ వాడకు." ఓపిగ్గా చెప్పాను.  

"పత్రికల్లో వాడుతున్నారు కదా?" అన్నాడతను. 

"తెలుగు పత్రికలకి సంస్కారం వుండదు, బాధ్యతా వుండదు. అందుకే - 'సైకో' అనే పదాన్ని చాలా అన్‌పాపులర్ చేశాయి. తెలుగు పత్రికలు సృష్టించిన 'సైకో' భయోత్పాదన వల్ల జనాలు మానసిక రోగుల్ని కొట్టి చంపుతున్నారు." అన్నాను.   

"మానసిక రోగులు తాము ఫలానా రోగులమని జనాలకి చెబితే ఎందుకు కొడతారు?" అడిగాడు. 

"చెప్పొచ్చు. కానీ - వాళ్ళకి తాము మానసిక రోగులమని తెలీదు! పేరనాయిడ్ స్కిజోఫ్రీనియా అనే జబ్బులో రోగులు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అడిగిన ప్రశ్నలకి సమాధానం సరీగ్గా చెప్పలేరు. గొణుగుతూ, భయంగా, అనుమానంగా ఏవో పొంతన లేని సమాధానాలు చెబుతారు. సామాన్య ప్రజలకి అతనే 'సైకో' అనుకోడానికి అంతకన్నా ఇంకేం ఋజువు కావాలి? అందుకే కొట్టి చంపేస్తున్నారు." అన్నాను. 

అంతలో నాకో సందేహం. 

"పొద్దున్నే ఫోన్ చేసి ఈ ధర్మసందేహాలేంటి?" అడిగాను. 

"ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 'సైకో' అనే పదం వినిపిస్తుంటే అడిగాన్లే." అన్నాడు నా మిత్రుడు. 

"ఓ అలాగా!" నిరాసక్తంగా అన్నాను. 

"ఓసారి మానసిక రోగులూ మనుషులే అంటూ ఆంధ్రజ్యోతిలో రాశావు కదా! ఇప్పుడేమన్నా రాయరాదా?" అడిగాడు నా స్నేహితుడు. 

"అప్పుడు నాకు బుద్ధి లేక అలా రాశాన్లే! అయినా - కొన్ని లక్షల మందిచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకి లేని సున్నితత్వం, రెండొందల మంది చదివే బ్లాగ్ పోస్టులు రాసుకునేవాణ్ని నాకెందుకు?" అంటూ ఫోన్ కట్ చేశాను. 

Friday 22 August 2014

'ఐరన్' షర్మిల


ఈ ఫోటోలో మీరు చూస్తున్న యువతి పేరు ఐరమ్ షర్మిల. గత పుష్కర కాలంగా నిరాహారదీక్ష చేస్తున్న ఈ  పౌరహక్కుల కార్యకర్త ఒక 'ఐరన్' లేడీ. 

హోల్డాన్! ఐరమ్.. ఐరన్! అద్దిరింది.. ఈ భాషా ప్రయోగం నీదేనా? 

అయ్యుండకపోవచ్చు. ఎక్కడో చదివుంటాను. ఎందుకంటే మన్దంతా కాపీ వ్యవహారం కదా! 

ఎలా చెప్పగలవ్? 

సింపుల్. అంత తెలివే వుంటే సైకియాట్రీ ప్రాక్టీసులో ఎందుకు మగ్గిపోతాను? హాయిగా ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారమో చేసుకునేవాణ్నిగా!

నిరాహారదీక్ష అనేది అయ్యప్పదీక్ష లాంటిది కాదు. ఒక అనువైన స్థలం చూసుకుని - అన్నం, నీళ్ళు తీసుకోకుండా కూర్చోడాన్నే నిరాహారదీక్ష అంటారు. మన జాతిపిత గాంధీగారు అనేక నిరాహారదీక్షలు చేసి బ్రిటీషువాడి గుండెల్లో నిద్రపొయ్యారు. అందుకే  నిరాహారదీక్షని గాంధేయ వాదం యొక్క ఆయుధం అంటారు. నాకు చిన్నప్పట్నుండి నిరాహార దీక్షలు చేసేవారి పట్ల టన్నుల కొద్దీ గౌరవం వుంది. 

నేను ఒక్కరోజుపాటు - భోజనం సంగతి అటుంచండి, కనీసం కాఫీ టిఫిన్లు మానేసిన జ్ఞాపకం లేదు. నేను చక్కగా తింటాను, ఆ తరవాత మాత్రమే ఏదైనా ఆలోచిస్తాను. బొగ్గు లేకుండా రైలైనా నడుస్తుందేమో గానీ, తిండి లేకుండా నా బుర్ర పన్జెయ్యదు. ఈ విషయం రాయడానికి నాకే మాత్రం సిగ్గుగా లేదు (నా నిరాహార దీక్ష ప్రహసనం గూర్చి గాంధీ.. నేను.. అన్నాహజారే అనే పోస్టులో రాశాను). ఐదు నిమిషాలు కాఫీ లేటైతేనే శోషొచ్చే నాకు.. కొందరు వ్యక్తులు వారివారి రాజకీయ ఎజండా కోసం తిండి మానేయడం పట్ల గౌరవం కాక మరేముంటుంది?

షర్మిల ముక్కులో గొట్టం చూడండి. దాన్ని రైల్స్ (ryles) ట్యూబ్ అంటారు. నేను హౌస్‌సర్జన్సీలో వుండగా కొందరు పేషంట్లకి ఈ రైల్స్ గొట్టం వేసిన అనుభవం వుంది. దీన్ని ముక్కులోంచి పొట్టలోకి దూర్చేప్పుడు పేషంట్లకి చాలా ఇబ్బందిగా వుంటుంది. అట్లాంటి గొట్టం ఈ షర్మిల ముక్కుకి - (మెళ్ళో గొలుసు, చేతికి గాజు వేసుకున్నట్లుగా) ఒక ఆభరణం లాగా మారిపోయింది. నేనైతే మాత్రం ఈ గొట్టాన్ని ఒక్క నిమిషం కూడా భరించలేను. అందుక్కూడా షర్మిల అంటే నాకు గౌరవం! 

షర్మిల సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నిస్తుందని ఒక కేసు నడిచింది. ఇప్పుడు కొంచెంసేపు నా భాషా పరిజ్ఞాన ప్రదర్శన. సూసైడ్‌ని తెలుగులో ఏమంటారు? మొన్నటిదాకా 'ఆత్మహత్య' అనేవాళ్ళు. నాకా పదం గమ్మత్తుగా అనిపించేది. ఆత్మకి చావు లేదంటారు గదా! మరా ఆత్మని ఎలా హత్య చెయ్యగలం? బరువైన నా ప్రశ్నకి సమాధానం దొరక్కముందే - సూసైడ్‌ని ఇప్పుడు 'బలవన్మరణం' అన్డం మొదలెట్టారు. ఇదింకా గమ్మత్తుగా వుంది. అప్పుడు హత్య కూడా బలవన్మరణమే అవుతుంది కదా! అందువల్ల - ఏ కన్ఫ్యూజన్ లేకుండా - మనందరికీ తెలిసిందీ, రాసుకోడానికి ఎంతో సుఖంగా వుండేదీ అయిన 'సూసైడ్' అన్న పదమే వాడుతున్నాను. అయినా - చావడానికి ఏ భాషైతే ఏముంది?!

సూసైడ్ కొన్ని దేశాల్లో నేరం కాదు, మన దేశంలో మాత్రం నేరం. కాబట్టి ఈ కేసులప్పుడు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పోలీసు వారి హడావుడి వుంటుంది. సూసైడ్ ఎందుకని నేరమో నాకు తెలీదు. సమాజంలో ఇమడలేక నిరాశతో సూసైడ్ చేసుకునేవారి కంటే, ఆ సమాజ పరిస్థితుల్ని చక్కదిద్దలేని ప్రభుత్వాలదే పెద్ద నేరం కదూ? అనేక మానసిక జబ్బుల్లొ పేషంట్లు సూసైడ్ చేసుకోటానికి ప్రయత్నిస్తారు. ఒకపక్క మానసిక జబ్బుల్ని చర్మవ్యాధి, కీళ్ళవ్యాధి లాంటివని చెబుతుంటారు. ఇంకోపక్క ఆ రోగ లక్షణమైన సూసైడ్ ప్రయత్నం మాత్రం శిక్షార్హమైన నేరం అంటారు! ఇదో వైరుధ్యం. 

సరే! షర్మిల గూర్చి రాయడం మొదలెట్టి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాను. చివరగా - నే చెప్పదల్చుకున్న పాయింటుని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తాను. మిత్రులారా! కడుపు నిండినవాడు (వారిలో ఈ బ్లాగరు కూడా ఒకడు) కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ - సంవత్సరాలు తరబడి ఏమీ తినకుండా, ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటూ జీవించడం అత్యంత ఇబ్బందికరం. అట్లాంటి ఇబ్బందిని భరిస్తున్న షర్మిలకి నా జేజేలు! 

ఐరమ్ షర్మిలా! యు ఆర్ గ్రేట్!

ముగింపు -

రాయడం ఇక్కడితో ఆపేస్తున్నాను (హడావుడిగా). 

ఎందుకు? 

నాకు ఆకలేస్తుంది, భోంచెయ్యాలి.

ఇవ్వాళ కూరలేంటి? ఏంటీ! తోటకూర పప్పు, బెండకాయ వేపుడా? ఇవి నాకిష్టం లేని కూరలని నీకు తెలీదా? పప్పుచారు, గుత్తొంకాయ చెయ్యమంటినే? 

హే భగవాన్! నేనెంత గొప్ప మేధావిని! ఎంత హెవీ థింకర్ని! నాకీ గతేంటి? ఇట్లాంటి దరిద్రపుగొట్టు భోజనం తినేకన్నా, షర్మిల లాగా ముక్కులో గొట్టం వేయించుకుని పాలు ఎక్కించుకోటం మేలేమో!

Thursday 21 August 2014

'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' కబుర్లు - మొదటి భాగం


ఒక నవలకి ఒకటికి మించి పేర్లు ఎప్పుడైనా విన్నారా? బీనాదేవి 'హేంగ్ మి క్విక్'కి పుణ్యభూమి కళ్ళుతెరు అనీ, కేశవరెడ్డి 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్'కి క్షుద్రదేవత అనీ మారుపేర్లు వున్నాయి. అయితే ఇవి సీరియల్‌గా వచ్చినప్పుడు ఒక పేరుతోనే వచ్చాయి. నవలగా అచ్చైనప్పుడు రెండోపేరు తగిలించుకున్నాయి. రాచకొండ విశ్వనాథశాస్త్రి మాత్రం రాసేప్పుడే తన నవలకి ఏకంగా 'గుర్రపుకళ్ళెం అను మరిడిమహాలక్ష్మి కథ (లేక) గోవులొస్తున్నాయి జాగ్రత్త!' అంటూ మూడు పేర్లు పెట్టేసుకున్నాడు!

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా అంటూ శ్రీశ్రీ 'ఋక్కులు' రాసుకున్నాడు. 'మహాప్రస్థానం'పై ఘోరమైన అభిమానంతో 'కుక్కపిల్ల' మొదలుకుని 'గుర్రపు కళ్ళెం' దాకా కథలు రాసేశాడు రావిశాస్త్రి. ఆయనీ కథని 'గుర్రపు కళ్ళెం' అన్నాడే గానీ - ఈ కథావస్తువుకి గుర్రపు కళ్ళెంతో సంబంధం లేదు. అందువల్లనే - ఉంటానికి మూడు పేర్లున్నా, ఈ నవల 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!'గానే ప్రసిద్ధి చెందింది.

అనాదిగా ఎందఱో మహానుభావులు ఈ నవలని చపాతీ పిండిలాగా పిసికేసి తీవ్రంగా విశ్లేషించారు, ఇంక విశ్లేషించడానికి ఎవరికీ ఏమీ మిగల్చలేదు. కావున - ఇప్పుడు మీరు చదువుతున్నది నవలా పరిచయమో, విశ్లేషణో కాదు. ఇవి నా 'గోవులొస్తున్నాయి జాగ్రత్త' ఆలోచనలు లేక కబుర్లుగా అనుకోవచ్చు.

"పేదలెవ్వరూ ఇది చదవరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు" - కిరీటిరావు.

అనే వాక్యంతో ఈ నవల మొదలవుతుంది. కిరీటిరావు అనే ఒక 'నెగెటివ్ క్యారెక్టర్' ద్వారా కథ చెప్పిస్తాడు రావిశాస్త్రి. కథ యావత్తు (పేదలని అసహ్యించుకుంటూ) బ్రిటీష్ ఇండియా జమీందార్ల దృష్టికోణం నుండి చెప్పబడింది.ఈ రకమైన ఎత్తుగడ చాలా తెలివైనది, గడుసైనది, క్లిష్టమైనది. కొత్తగా రావిశాస్త్రిని చదివేవాళ్లకి ఆశ్చర్యంగా వుండొచ్చు (అర్ధం కాకనూ పోవచ్చు)!

కిరీటిరావు 1917 జనవరి ఫస్టున పుట్టాడు. మెజిస్ట్రేట్‌గా పనిచేసి అర్లీగా రిటైరైపొయ్యాడు. ఈ కిరీటిరావు బంధువైన రాజయోగి పెదనాయనగారి చిన్నప్పటి జ్ఞాపకాలే ఈ నవల.

రాజయోగి పెదనాయనగారు తన జమీలో లచ్చయ్యమ్మ అనే ఒక పాలు పితికే స్త్రీ యొక్క కళ్ళు చెదిరే అందానికి తీవ్రంగా ఆకర్షితుడవుతాడు. ఆనక ఆ లచ్చయ్యమ్మ అనబడు మరిడి మహాలక్ష్మిని బలవంతంగా చెరబడతాడు. అందుకు సహకరించని ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. లచ్చయ్యమ్మని బంధించి లొంగదీసుకుంటాడు. ఆమెకి ఒక కొడుకుని కంటాడు. తన కొడుకు జమీకి హక్కుదారుడంటుంది లచ్చయ్యమ్మ. తక్కువ కులం స్త్రీకి పుట్టినవాణ్ణి వారసుడుగా ఒప్పుకోడానికి ఇష్టపడక, కిరీటిరావుని దత్తత తీసుకునే ఉద్దేశంతో జమీకి (సువర్ణసుందర పురం) పిలిపించుకుంటాడు రాజయోగి. అటు తరవాత అక్కడ జరిగే కథ ఈ నవలకి క్లైమేక్స్.

నవల మొదటి లైన్ దగ్గర్నుండి చివరదాకా ఒకేరకమైన మూడ్ కొనసాగుతుంది. ఇందుకు రావిశాస్త్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని అర్ధం అవుతుంది. తెలుగులో ఒక నవల ఆసాంతమూ వ్యంగ్యంగా ఇంకెవరన్నా రాశారా? నేనైతే ఎవరూ రాయలేదని అనుకుంటున్నాను. రావిశాస్త్రి కథ చెప్పే విధానం ఎంత విలక్షణంగా వుంటుందో పరిపూర్ణంగా కాంచవచ్చును.

కారణం - జమీందార్ల వంశానికి చెందిన కిరీటిరావు ఫస్ట్ పర్సన్‌లో కథ మొత్తం చెబుతాడు. 'మా రాజయోగి పెదనాయనగారు ఎంతో మంచివారు. లచ్చయ్యమ్మ మా పెదనాయనగారి మంచితనానికి లొంగని తక్కువ కులపు అలగా ముండ' అంటూ తీవ్రంగా విమర్శిస్తూ కథనం కొనసాగుతుంది!

డబ్బుతో, అధికారంతో బలిసిన ఒక దుర్మార్గపు కోణం నుండి (అమాయకంగా) కథని చెబుతున్నట్లుంటుంది. కథనంలో లోతైన వ్యంగ్యం వుంటుంది. అదే సమయంలో - రచన ఆద్యంతమూ అవతలి పక్షం యొక్క (పేదప్రజలు) అమాయకత్వం, మొండితనం, నిస్సహయాతల్ని హైలైట్ చేస్తూ వుంటుంది. రచయిత మాత్రం నిస్సందేహంగా లచ్చయ్యమ్మ పక్షమే. కానీ బయటకి మాత్రం రాజయోగి పార్టీ! 

ఇంతటితో మొదటి భాగం సమాప్తం.

నా ఘోష -

ఇదేంటి నాయనా? నువ్వేమన్నా సీరియల్ రాస్తున్నావా? ఈ భాగాల గోలేంటి?

'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' కబుర్లు రాయాలని ఒక సంవత్సరం నుండి అనుకుంటున్నాను. ఏవేవో పోస్టులు రాస్తున్నాను గానీ - 'గోవులొస్తున్నాయి జాగ్రత్త!' మాత్రం వెనక్కిపోతుంది. ఇందుకు నాకు కొంత గిల్టీగానూ, మరికొంత దిగులుగానూ వుంది.

కావున - ఇవ్వాళ రాయడం కొంచెం మొదలెట్టేసి మొదటి భాగంగా పోస్టుతున్నాను. ఈ పార్ట్స్ కిల్ బిల్ 1, 2 వంటివే గానీ - గాడ్‌ఫాదర్ 1, 2 వంటివి కాదని మనవి చేస్తున్నాను.

ఇలా ఎందుకు తిప్పలు పడటం? అసలంటూ రాయడం మొదలెడితే - కుక్కలాగా చచ్చినట్లు మిగిలిన భాగాలు పూర్తి చెయ్యగలననే దురాలోచన! అంతకు మించి మరేం లేదు. ఏది ఏమైనప్పటికీ - నా అభిమాన నవల గూర్చి ఇలా ముక్కలుగా రాస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాను!

Tuesday 19 August 2014

ద్వివేదుల విశాలాక్షి 'మారిన విలువలు'


సుబ్బారావు, రంగారావు బాల్యస్నేహితులు. సుబ్బారావు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు (మంచి చదువుకి మంచి ఉద్యోగం కన్నా పరమార్ధం వుండదు). డిగ్రీ పరీక్ష పాసవ్వడమే కనాకష్టంగా వుండి, అష్టకష్టాలు పడుతున్న రంగారావు ఆరోజు మిత్రుని వద్ద బావురుమని ఏడ్చాడు. సుబ్బారావు రంగారావుని ఓదార్చాడు.

అటుతరవాత రంగారావు ఏదో చిన్నపాటి వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారంలో కలిసొచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు. తెలుగు నేలపై ఒక స్థాయిని మించి ఆర్ధికంగా ఎదగాలంటే కులం అవసరం వుంటుంది. రంగారావు కోస్తాంధ్రలో రాజకీయంగా, సామాజికంగా బలం వున్న కులానికి చెందినవాడు. అంచేత - సాటి కులస్తుల సాయంతో అనేక వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసి ఆనతి కాలంలోనే అనేక కోట్లకి పడగెత్తాడు.

ఒక పెళ్ళి సందర్భంగా సొంతూరుకొచ్చిన సుబ్బారావు రంగారావు సిరిసంపదలు, స్టేటస్ చూసి దిగులు చెందాడు. పిమ్మట మిత్రుని వాటేసుకుని బావురుమన్నాడు. ఇప్పుడు రంగారావు సుబ్బారావుని ఓదార్చాడు. అలా ఓదార్చడంలో రంగారావు గర్వించాడు కూడా! పరీక్షల్లో ఓడిపోయినా, జీవితంలో గెలిచినవాడు అలాగే గర్విస్తాడు కాబోలు!

కొంచెంసేపు క్రితం ఈ పాయింట్‌ ఆధారంగా ఒక బుల్లికథ రాద్దామని కూర్చున్నాను. కానీ - ఈ ఐడియా నా సొంతం కాదని, ఇది చిన్నప్పట్నుండి నా బుర్రలో నిక్షిప్తమై వుందని రాయడం మొదలెట్టినప్పుడు స్పురించింది. తవ్వకాల్లో బయటపడే పంచలోహ విగ్రహంలా, నా బుర్రలోంచి బయటపడ్డ ఈ స్టోరీలైన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు సంక్షిప్తంగా రాస్తాను.

ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్‌బ్యాక్. నా చిన్నతనంలో మా ఇంటికి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వచ్చేవి. రెండూ సచిత్ర వారపత్రికలే! నాకు ఆ పత్రికల్లో ఏం రాశారో తెలుసుకోవాలని కుతూహలంగా వుండేది.. కానీ అప్పటికింకా నాకు తెలుగు చదవడం రాదు. అంచేత వాటిని చదవమని అమ్మని విసిగించేవాణ్ని. అప్పటికి 'అఆ'లు నేర్చుకుంటున్న నాకు, ఆల్రెడీ 'అఆ'లు నేర్చేసుకున్నా - వాక్యాల్ని సరీగ్గా చదవడం రాని అక్క సపోర్ట్ లభించేది. అంచేత - అమ్మ ఆ పత్రికల్లో కథలు, కబుర్లు మాకు చదివి వినిపించేది.

సాయంకాలాలు నవ్వారు మంచం మీద మధ్యలో అమ్మ. అమ్మకి నేను, అక్క చెరోవైపూ పడుకునే వాళ్ళం. అమ్మ డ్యూటీ - మాకు అర్ధమయ్యేట్లు నిదానంగా చదవాలి, చదివేప్పుడు మాకొచ్చే బోల్డన్ని డౌట్లకి సమాధానం చెప్పాలి. అమ్మ ఓపిక్కి ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా వుంది. ఆవిడ తన పని చాలా ప్రతిభావంతంగా నిర్వర్తించిందని చెప్పగలను. ఎందుకంటే - నాకావిడ చదివిన కథలు బాగా గుర్తుండిపొయ్యాయి.

గాడేపల్లి కుక్కుటేశ్వరరావు రాసిన 'రాలీ రాలని పువ్వు' ఆంధ్రప్రభలో వచ్చింది. ఇది నేను 'విన్న' మొట్టమొదటి నవల. ఆంధ్రప్రభలోనే వచ్చిన ద్వివేదుల విశాలాక్షి రాసిన 'వైకుంఠపాళి' నేను విన్న రెండో నవల. నేనప్పుడు ఆ కథలు నిజంగా జరిగినవేనని నమ్మేవాణ్ని. రచయితలు ఊహించి కథ రాస్తారని అక్క చెప్పినా నమ్మలేదు. అందుకే - 'వైకుంఠపాళి'లో సావిత్రమ్మ అనే ఒక పాత్ర చనిపోయినప్పుడు నాకు భలే ఏడుపొచ్చింది.

అటుతరవాత నాకు చదవడం వచ్చినా, అమ్మ చేతే చదివించుకునేవాణ్ని. ఎందుకంటే - అమ్మ కథ నాటకీయంగా చదివేది. కథలో ఒక పాత్ర ఇంకో పాత్రని 'నోర్ముయ్' అంటే - అమ్మ కూడా గద్దిస్తున్నట్లు పలికేది. ఒక పాత్ర కష్టాల్లో వున్నప్పుడు అమ్మ గొంతు రుద్దమయ్యేది. కాబట్టి - నా అంతట నేను చదివే కన్నా అమ్మ చదివితేనే నాకు బాగుండేది. నాకు చదవడం వచ్చినా కూడా అమ్మ చేతనే చదివించుకునే సమయంలో వచ్చిన నవలే - ద్వివేదుల విశాలాక్షి 'మారిన విలువలు'. ఈ నవల నాకు చాలా నచ్చింది. ఆ ఇతివృత్తం నాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం.

ఒక మధ్యతరగతి కుటుంబం. పెద్దవాడు బుద్ధిమంతుడు, చక్కగా చదువుతుంటాడు. రెండోవాడు మొరటు, అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. పెద్దవాడి మీద తలిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, రెండోవాణ్ని అసహ్యించుకుంటారు. ఇంటి వాతావరణంలో ఇమడలేక రెండోవాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. పెద్దవాడు పరీక్షలు సరీగ్గా రాయక నిరాశతో ఆత్మహత్య చేసుకుంటాడు (ఆత్మహత్య చేసుకునే వ్యక్తి మానసిక సంఘర్షణ విశాలాక్షి చాలా ప్రతిభావంతంగా రాశారు). రెండోవాడు ఒక కిళ్ళకొట్టు వ్యక్తితో వున్న సాన్నిహిత్యంతో అతని వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. అతని కూతుర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆర్ధికంగా నిలదొక్కుకుని పైకొస్తాడు. అతనే నిలబడి అక్క పెళ్ళి చేస్తాడు, తలితండ్రులకి ఆధారంగా నిలుస్తాడు. టూకీగా ఇదీ కథ (నాకు గుర్తున్నంత వరకు).

సో - ఇదీ నా సుబ్బారావు, రంగారావుల కథకి మూలకథ. 'మారిన విలువలు' ఇప్పుడు చదివినా నాకు మళ్ళీ నచ్చుతుందని నమ్ముతున్నాను. నేను తెలుగు పత్రికల్ని చదవడం మానేసి పాతికేళ్ళు దాటింది. కావున - ఇప్పటి పత్రికల కంటెంట్ గూర్చి నాకు అవగాహన లేదు. అయితే - నా బాగా చిన్నప్పుడు చందమామ, కొద్దిగా చిన్నప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు చదవడం వల్లనే నాకు 'చదివే అలవాటు' వచ్చిందని అనుకుంటుంటాను.

ముగింపు -

మొన్నామధ్య నా కూతురు ఫేస్బుక్కు లైకుల్తో, వాట్సప్పు మెసేజిల్తో కుస్తీ పడుతూ బిజీగా వుంది.

"ఏదైనా ఒక మంచి నవల చదువుకోరాదా?" ఆ పిల్ల బాధ చూళ్లేక తండ్రి హృదయం ఉప్పొంగి గుమ్మడిలా ఒక ఉచిత సలహా పడేశాను.

"ఎందుకు?" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి అంది.

"పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది." మొహమాటంగా గొణిగాను.

నా కూతురు చికాగ్గా మొహం తిప్పుకుంది. పక్కనే వున్న నా భార్య కిసుక్కున నవ్వింది. ఎందుకో తెలీదు!

Thursday 14 August 2014

జ్ఞాని


మొన్నొక డాక్టర్‌తో కబుర్లు చెబుతున్నాను. ఆయన హార్ట్ స్పెషలిస్ట్. 

నేను సాధారణంగా డాక్టర్లతో స్నేహానికి పెద్దగా ఆసక్తి చూపను. ఇందుకు కార్డియాలజిస్టులు మాత్రం మినహాయింపు. ఎందుకైనా మంచిదనే (భవిష్యత్తులో నాకేదన్నా గుండెజబ్బొస్తే ఉపయోగపడతారనే) ముందుచూపే ఇందుకు కారణం!

ఆ డాక్టర్‌తో మాట్లాడేప్పుడు నా చేతిలో ఒక పుస్తకం వుంది.

"ఆ పుస్తకమేంటి?" ఆ డాక్టర్ కుతూహలంగా అడిగాడు.

"ఇది జనులందరూ చదివి తరించాల్సిన పుస్తకరాజం. సగం చదివాను, మీక్కావాలంటే తీసుకోండి." అన్నాను.

"అబ్బే! చదివే టైం నాకెక్కడిది? ఊరికే తెలుసుకుందామని అడిగానంతే." అన్నాడాయన.

"మీరేమీ మొహమాట పడనక్కర్లేదు. చదువుతానంటే పుస్తకం వదిలేసి పోతాను." కావాలంటే ఇంకో రెండుచుక్కలు నెయ్యి వడ్డిస్తాననే స్టైల్లో అన్నాను.

"నాకు మీదగ్గర మొహమాటం లేదు. నాకు పుస్తకాలు చదివే టైమ్ లేదు, ఇంటరెస్టూ లేదు." స్థిరంగా, ఖచ్చితత్వంతో చెప్పాడాయన. 

నాకీ డాక్టర్ నచ్చాడు. బాగా పధ్ధతి గల మనిషిలాగున్నాడు. తన గూర్చి తనకి చక్కని అంచనా ఉన్నట్లుంది. నేనా డాక్టర్ వైపు ఈర్ష్యగా చూశాను!

నాకీ బుద్ధిలో సగమైనా ఉంటే బాగుణ్ణు! చాలా పుస్తకాలు చదవాలనే ప్రణాళిక వేసుకుంటాను. కానీ - భారతదేశ దారిద్య్ర నిర్మూలనా ప్రణాళికలా నా పుస్తక పఠనం ఒక్కంగుళం కూడా ముందుకు నడవదు. పోనీ - 'చదవలేను' అని ఒప్పుకోవచ్చుగా? లేదు - రాజకీయ నాయకులకి మల్లే నాకు అహం అడ్డొస్తుంది.

దేవుడి సృష్టిలో రకరకాల జీవులు. ఈ జీవుల్లో కొందరికి ఆత్రం ఎక్కువ. ఎన్నో పన్లు చేద్దామని ఆయాసపడుతుంటారు, ఏదీ చెయ్యలేక నీరసపడుతుంటారు. పోనీ - ఆ తర్వాతైనా రియలైజ్ అయ్యి వాస్తవిక దృక్పధం అలవరచుకుంటారా అంటే - అదీ వుండదు!

కావున - తన పరిమితులు గుర్తించిన వాడే అసలైనా జ్ఞాని అని అనుకుంటున్నాను. ఈ నిర్వచనం ప్రకారం నేను అజ్ఞానిని అయిపోతాను. కానీ - నా అజ్ఞానాన్ని ఒప్పుకోకపోతే పరమ అజ్ఞానిని మిగిలిపోతాననే శంకతో ఈ నిజాన్ని అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను!

Monday 11 August 2014

ఆరోగ్యమే మహాభాగ్యము


'ఆరోగ్యమే మహాభాగ్యము' - ఈ విషయం సుబ్బారావు మనసులో లోతుగా పాతుకుపోయింది. అందుకే అతను ఆ మహాభాగ్యానికి శాశ్వత చిరునామాగా ఉందామని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుంటాడు. అందుకతను చాలా గర్వపడతాడు కూడా.

సుబ్బారావుకి ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ. ఉదయాన్నే కోడికూత కన్నా ముందే లేస్తాడు. ఒక లీటరు గోరువెచ్చని నీరు తాగి - జాగింగ్ షూస్, ట్రాక్ సూట్ వేసుకుని నాలుగు మైళ్ళు పరిగెడతాడు. ఆపై గచ్చు మీద ఒక గుడ్డ పరుచుకుని కనీసం గంటపాటు యోగాసనాలు వేస్తాడు. ఆ తరవాత కొంతసేపు ధ్యానం చేసుకుంటాడు.

పిమ్మట మెలకెత్తిన గింజలు, కేరట్, కీరా దోసకాయ ముక్కలు బాగా నమిలి తింటాడు (వాటినలా నమలకపొతే సరీగ్గా జీర్ణం కావు). అతగాడి బ్రేక్‌ఫాస్ట్ రెండిడ్లీ, ఆపై ఒక కప్పు గోరువెచ్చని పాలు. అంతే! అంతకుమించి ఇంకేదీ తినడు. ఒకసారి అతని భార్య ప్రేమగా ప్లేట్లో మూడో ఇడ్లీ పెట్టిందని కోపం తెచ్చుకుని నెల్రోజుల పాటు ఆమెతో మాట్లాడ్డం మానేశాడు! అవును మరి - ఆహార నియమాల్లో అతనిది ఉక్కు క్రమశిక్షణ!

మధ్యాహ్నం భోజనంగా ఉప్పులేని కూరతో ఒక కప్పు అన్నం, కొంచెం పెరుగు. అంతకుమించి అతనెప్పుడూ తిన్లేదు. అతనికి కాఫీ, టీల్లాంటివి అలవాట్లు లేవు. వక్కపొడి రుచి తెలీదు. మరీ ఆకలనిపిస్తే అప్పుడప్పుడు ఒక యాపిల్లో నాలుగో భాగం తింటాడు. రాత్రి ఉప్పు లేని పప్పుతో ఒక పుల్కా, గ్లాసుడు పల్చని మజ్జిగ (ఉప్పు లేకుండా). గత కొన్నేళ్లుగా అతని ఆహారపు అలవాట్లు ఇవే.

ఉప్పు అనేది సమస్త రోగాలకి మూలం అని ఎవరో ఒకయాన పొద్దస్తమానం టీవీల్లో చెబుతుంటాట్ట. అందుకే సుబ్బారావు ఉప్పుని నిప్పులా చూస్తాడు. అతను అప్పుడప్పుడూ మెంతులు నముల్తుంటాడు! మెంతులు తింటే షుగర్రోగం దరిదాపులక్కూడా రాదుట! ఇలా ఆరోగ్యం గూర్చి అనేక పత్రికలు చదువుతూ, టీవీలో చూస్తూ తన జ్ఞానాన్ని మెరుగు పరుచుకుంటూ వుంటాడు.

అలా సంపాదించిన జ్ఞానంతో తన ఆరోగ్యం గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ వుంటాడు సుబ్బారావు.

'ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నానా? ఇకనుండి ఒకడ్లీ మాత్రమే తింటే బెటరేమో!'

'రోజూ నాలుగు మైళ్ళ పరుగు సరిపోదేమో? ఇంకో నాలుగు మైళ్ళు పరిగెత్తితే ఎలా వుంటుంది?'

'టమోటా తింటే కిడ్నీలో రాళ్ళొస్తాయా? అరెరే! ఈ సంగత్తెలీక నిన్ననే టమోటా పప్పు తిన్నానే! కొంపదీసి నాగ్గాని కిడ్నీలో రాళ్ళేర్పడవు కదా?'

'ఇవ్వాళ నాకు నాలుగు ఫర్లాంగుల దూరంలో ఒక దరిద్రుడు సిగరెట్టు కాల్చాడు. వాడి సిగరెట్టు పొగ గాలివాటున నా ముక్కుకి తగిలిందా? అది నా ఊపిరితిత్తుల్లోకి పోలేదు కదా?'

'మొన్న పెళ్ళిలో టెమ్టయ్యి చిటికెడు మైసూరు పాకం తిన్నాను. షుగరు బొగరు రాదు కదా?'


సుబ్బారావుకి ఒక చిన్ననాటి స్నేహితుడు వున్నాడు, పేరు రమణారావు. మనిషి మంచివాడు. అతనికి సుబ్బారావంటే చాలా అభిమానం. కానీ - రమణారావు సిగరెట్లు హెవీగా కాలుస్తాడు, మందు ఫుల్లుగా కొడతాడు, విపరీతంగా తింటాడు, వ్యాయామం అంటే ఏంటో అతనికి తెలీదు.

సుబ్బారావు తన మిత్రునికి ఆరోగ్య సూత్రాల గూర్చి అనేక విధాలుగా చెప్పి చూశాడు. రమణారావు నవ్వి ఊరుకునేవాడుకానీ స్నేహితుని సలహాలు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. సుబ్బారావు రమణారావు దగ్గర ఎక్కువసేపు వుండేవాడు కాదు. వున్న ఆ కొంచెంసేపు కూడా అతనెక్కడ సిగరెట్టు ముట్టిస్తాడోననే భయంతో వణికిపొయ్యేవాడు!

కాలచక్రం గిర్రుమంటూ తిరుగుతూనే వుంది. అలా - ఆరోగ్య నియమాల్తో సుబ్బారావు.. తన అలవాట్లతో రమణారావు సంతోషముగా జీవించుచుండగా -

విధి బలీయమైనది, క్రూరమైనది, విచక్షణ లేనిది. 'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?' అంటూ 'లవకుశ'లో ఘంటసాల పాడనే పాడాడు గదా! ఒకరోజు హఠాత్తుగా సుబ్బారావు దుర్మరణం చెందాడు! అతను పొద్దున్నే జాగింగ్ చేయుచుండగా వెనకనుండి స్పీడుగా వస్తున్న పాల వ్యాన్ గుద్దేసింది, స్పాట్ డెడ్.

రమణారావు మిత్రుని మృతి తట్టుకోలేకపొయ్యాడు, భోరున విలపించాడు. అతనిన్నాళ్ళూ - సుబ్బారావు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వందేళ్ళు బ్రతుకుతాడని, తనకేదైనా అయినా - తన కుటుంబానికి తన మిత్రుని అండ ఉంటుందని భరోసాగా వున్నాడు.

"అయ్యో మిత్రమా! తెల్లారుగట్ట రోడ్లెంట పడి పిచ్చికుక్కలా పరుగులెత్తావు. కాళ్ళూ చేతులు మెలికలు తిప్పేస్తూ ఆసనాలు వేశావు. ఆరోగ్య పరిరక్షణ అంటూ నాకు కర్ణకఠోరమైన క్లాసులు పీకావు. ఇన్ని చేసినవాడివి - వెనకనే వస్తున్న ఆ మాయదారి పాలవాన్‌ని మాత్రం ఎందుకు చూసుకోలేపొయ్యావు?

అయ్యో నా బాల్య మిత్రమా! జీవితంలో ఏదీ అనుభవించకుండానే పొయ్యావెందుకు? నీకు విస్కీ వాసన తెలీదు, గోల్డ్‌ఫ్లేక్ మజా తెలీదు, చికెన్ రుచి తెలీదు. ఎక్కువ రోజులు బ్రతకాలని పిల్లిలాగా, గోడ మీద బల్లిలాగా - రుచీపచీ లేని చప్పని జీవితాన్ని గడిపావు. ఇలా అయిపోతావని ముందే తెలిస్తే బలవంతంగానైనా నీ నోట్లో బకార్డి రమ్ము పోసేవాణ్నే, తందూరీ చికెన్ కుక్కేవాణ్నే!"

రమణారావుని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. పాపం రమణారావు!

ముగింపు -

జనన మరణములు దైవాధీనములు, లలాట లిఖితము. దేవుణ్ణి కాదండానికి నువ్వెవరు? నేనెవరు? భూమ్మీద నూకలున్నవాడు ఏది ఎంత తాగిననూ, అసలేది తాగకున్ననూ జీవించే యుండును. నూకల్లేనివాడు ఎంత పరిగెత్తిననూ, ఎంత ఒళ్ళు విరుచుకున్ననూ పరలోకప్రాప్తి తధ్యము! అంతా ఆ పైవాడి లీల!

నీతి -

ఆరోగ్యం మహాభాగ్యమే! అయితే - యాక్సిడెంట్లు తప్పించుకొనుట అంతకన్నా మహాభాగ్యము!

Saturday 9 August 2014

మా సచిన్బాబు బంగారుకొండ


ఏవిటో! దేశంలో రోజురోజుకీ పనికిమాలిన దొంగగాడ్దె కొడుకులు ఎక్కువైపోతున్నారు. బ్రహ్మంగారు ఈ వెధవల గూర్చి ఎప్పుడో చెప్పారు. లేకపోతే ఏవిటి? మన భారత రత్నం సచిన్ టెండూల్కర్‌పైనే విమర్శలా! అసలు వీళ్ళకి బుద్ధుందాని?

సచిన్బాబు మన దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం. ఈ దేశం గాంధీగారు లేకపోతే ఏమయ్యేదో తెలీదు, నెహ్రూగారు లేకపోతే ఏమయ్యేదో తెలీదు. కానీ - సచిన్బాబు లేకపోతే మాత్రం బావురుమనేదని నేను అనుకుంటుంటాను.

సచిన్! నువ్వు క్రికెట్ బ్యాటుతో గ్రౌండులోకి వస్తుంటే సాక్షాత్తు కరవాలం దూసిన ఆ ఛత్రపతి శివాజీనే దర్శించాం. నువ్వు బంతిని డ్రైవ్ చేసినప్పుడు లక్ష మరఫిరంగులు శత్రువు గుండెల్లో పేల్చినంత ఉద్వేగానికి గురయ్యాం. నువ్వు సెంచరీ సాధించినప్పుడల్లా - మనసు పడ్డ చిన్నదాని మెత్తని మత్తైన మకరందపు నవ్వు గాంచినట్లు - మా హృదయం ఆనందంతో పులకించిపోయింది.

నీకు 'భారతరత్న' కన్నా ఎక్కువ గౌరవం ఇవ్వలేకపోయినందుకు మమ్మల్ని క్షమించు. మాకు తెలుసు, నువ్వు భారతరత్నకే రత్నానివని! నీ స్నేహితుడు రాహుల్ గాంధీ మాట తీసెయ్యలేక రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించావే గానీ, నీకా బోడి రాజ్యసభో లెక్కా! నీ పవిత్ర పాదధూళితో రాజ్యసభ ధన్యమైంది సచిన్!

నీకెన్ని పన్లు! ఒక్క క్షణం కూడా ఊపిరి సలపదాయె! లెక్కలేనన్ని కమర్షియల్స్‌లో నటించాలి, అనేక బ్రాండ్లకి అంబాసిడర్‌వి కూడా. ఇంకా అనేక సోషల్ ఈవెంట్లలో ముఖ్య అతిధివి. ఆపై నీకిష్టమైన వింబుల్డన్ మ్యాచ్‌లు చూసుకోవాలి. నీ కష్టం ఆ పగ వాడిక్కూడా వద్దు సచిన్!

ఈ లోకం దొంగముండ కొడుకుల నిలయం, ఇక్కడ మంచితనానికి తావు లేదు. అందుకే - నీ ఘోర కష్టం గుర్తించని దొంగ రాస్కెల్స్ - నువ్వు రాజ్యసభకి ఈ సంవత్సరంలో అసలు హాజరే అవ్వలేదనీ, నీ ఎంపీ నిధుల్నుండి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని వాగుతున్నారు. ఈ విమర్శలకి నువ్వు నొచ్చుకుంటావని ఆందోళన చెందుతున్నాను. సచిన్బాబూ! నువ్వు ఈ పిచ్చి ప్రేలాపలని పట్టించుకోకు.

ఈ సృష్టి భగవంతుని నిర్మితము. కనులకి ఇంపుగా పురులు విప్పి నాట్యం చేసే నెమలిని దేవుడు సృష్టించాడు. బద్దకంగా బురదగుంటలో పడుకునే అసహ్యకరమైన పందిని కూడా అదే దేవుడు సృష్టించాడు. ఆ దేవుని లీలలు సామాన్యులకి అర్ధం కావు (నేను సామాన్యుణ్ని కావున ఈ విషయం ఇంతటితో వదిలేస్తాను). ఈ సృష్టిలో బురద పందులున్నట్లే బురద మనస్తత్వపు మనుషులుంటారు. వాళ్ళు నీ మీద నాలుగు రాళ్ళేసి తృప్తినొందుతారు.

సచిన్! నువ్వు అమూల్యమైన వజ్రానివి. వజ్రాన్ని భద్రంగా లాకర్లో పెట్టుకోవాలే గానీ - నెత్తిన ధరించి తిరగరాదు (అప్పుడు ఎవడోకడు కొట్టేస్తాడు). అంచేత నువ్వు రాజ్యసభకి రానవసరం లేదు, ఈ దుష్టప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదు. అర్ధం చేసుకోగలం - నువ్వు రాజ్యసభ సభ్యుడవైంది ఆ సభని ఉద్ధరించడానికే గానీ, అక్కడ జరిపే పనికిమాలిన చర్చల్లో పాల్గొండానికి కాదు.

మరొక్కసారి నిన్ను మనసారా పొగడనీ సచిన్! నువ్వు మా దేశంలో జన్మించడం మాకెంతో గర్వకారణం. ఈ దేశంలో ఏముంది సచిన్? దరిద్రం, ఆకలి చావులు, అవినీతి, మత ఘర్షణలు, మానభంగాలు తప్ప ఇంకేవీ లేవనుకుని విరక్తి చెందే మాలాంటి ఎందరికో నువ్వు ఆశాజ్యోతివి.

ఈ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు పెంచడానికి రాజకీయ మార్గాన్నెంచుకుని ఎందరో అశువులు బాశారు. వాళ్ళు అల్పులు. నువ్వు ఒక్క క్రికెట్ బ్యాటుతోనే ఈ దేశానికి వన్నె తెచ్చావు.

నువ్వు మా దేవుడివి, మా పెన్నిధివి, మా ఇలవేల్పువి, మా మనసుల్ని దోచుకున్న దొంగవి. అందుకే అంటాను -

"మా సచిన్బాబు బంగారుకొండ"

Friday 8 August 2014

మన ఎంపీగారి గొప్పసలహా


నిన్న పార్లమెంటులో మన తెలుగు ఎంపీగారు 'ఆడవాళ్ళు హుందాగా వుండే దుస్తులు ధరించాలని' గొప్ప సలహా ఇచ్చారు. సాధారణంగా ఇట్లాంటి అమూల్యమైన సలహాలు ఏ మతపెద్దల నుండో, మతతత్వ రాజకీయ పార్టీలవాళ్ళ నుండో వింటుంటాం. అయితే ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఈ విధమైన సలహా ఇవ్వడం ఆశ్చర్యమే. 

నాకయితే మన ఎంపీగారు పురుషాహంకారంతో మాట్లాడినట్లు అనిపించలేదు. ప్రసంగం ఆయనే రాసుకున్నాడో, ఎవరన్నా రాసిచ్చారో తెలీదు గానీ - చివర్లో కొంత గుమ్మడి మార్కు ఫినిషింగ్ టచ్ ఇద్దామనుకుని (గొప్ప కోసం) అలా చదివాడనిపిస్తుంది. మీడియావాళ్ళతో ఆయన తత్తరపాటు చూస్తే ఆయనకసలు తను మాట్లాడింది 'తప్పు' అనికూడా తెలిసినట్లుగా లేదు పాపం!

గత కొంతకాలంగా కోస్తాంధ్ర ఎంపీలుగా పారిశ్రామికవేత్తలే ఎన్నికవుతున్నారు. ఇది తెలుగువారికి గర్వకారణం. మనవాళ్ళు కొన్ని వందల కోట్లు సంపాదించిన తరవాత, ప్రజాసేవ చెయ్యాలనే ఉత్తమ తలంపు కలిగి, ఎంతో కష్టపడి తమ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఎంతో ఆనందదాయకం. వీరు ఎంపీలుగా అయ్యేది తమ వ్యాపార అభివృద్ధి కోసమేనని కొందరు గిట్టనివాళ్ళు అంటారు. ఇది కేవలం కుళ్ళుబోతు వాదన. 

'టు ఎర్ ఈజ్ హ్యూమన్' అన్నారు పెద్దలు. మనమందరం తప్పులు చేస్తూనే వుంటాం. చాలాసార్లు చేసేది తప్పు అని తెలీకే చేస్తుంటాం. అమెరికావాడు వరలక్ష్మి వ్రత మహత్యం గూర్చి, ఆఫ్రికావాడు ఆవకాయ గూర్చి మాట్లాడుతున్నప్పుడు వినడానికి బహుముచ్చటగా వుంటుంది. అందులో తప్పులున్నా అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదు. కారణం - వాళ్ళు ఆ మాత్రం మాట్లాడమే గొప్పవిషయం!

Monday 4 August 2014

ఆత్మకతలు


జంతువులు ఆలోచిస్తాయా? జంతువులకి ఆకలేస్తే ఆహారాన్ని వెతుక్కుంటాయి, కడుపు నిండిన తరవాత హాయిగా నిద్రపోతాయి. అంతేగానీ - అనవసరమైన ఆలోచనల్తో బుర్ర పాడుచేసుకోవని నా అభిప్రాయం. కానీ - మనిషికి జంతువులకున్నంత తెలివి ఉన్నట్లుగా అనిపించట్లేదు. ఎందుకంటే - మనిషి ఆలోచనాపరుడు!

మనిషి ఆలోచనల్ని బాహ్యప్రపంచం ప్రభావితం చేస్తుంటుంది. ఆకలితో ఉన్నవాడికి విప్లవ గీతం గుర్తొస్తుంది. కడుపు నిండినవాడికి కవి సార్వభౌముల కవిత్వం కమనీయంగా తోస్తుంది, మనసు మరింత వినోదాన్ని కోరుకుంటుంది. వినోదం నానా విధములు. కొందరికి వినోదం పేకాట క్లబ్బులో దొరికితే, మరికొందరు క్రికెట్ బెట్టింగుల్లో దొరుకుతుంది.

ఇట్లాంటి చౌకబారు వినోదానికి మేధావుల గుర్తింపు వుండదు. మరప్పుడు మేధావులు ఏ విధంగా వినోదం పొందుతారు? అసలు మేధావి అంటే ఎవరు? సరళమైన విషయాన్ని సంక్లిష్టంగా ఆలోచించేవాడే మేధావి అని నా నమ్మకం. అందువల్ల మేధావుల వినోదం కూడా సంక్లిష్టంగానే వుంటుంది!

కాఫ్కా శామ్సాని పురుగ్గానే ఎందుకు మార్చాడు? కుక్కగా ఎందుకు మార్చలేదు? శ్రీశ్రీ 'నేనొక యజ్ఞోపవితాన్ని' అని ఎందుకు రాశాడు? ఆయన కమ్యూనిస్టు బ్రాహ్మడా? లేక బ్రాహ్మణ కమ్యూనిస్టా? మేధావులు ఇట్లాంటి విషయాల్ని తీవ్రంగా ఆలోచించడమే కాక పుస్తకాలు కూడా రాస్తుంటారు!

ఇదే కోవకి చెందిన ఇంకో వినోదం ఆత్మకథలు. ఈ ఆత్మకథలు రాసేవారు అనేక రకాలు. హిట్లర్ కుక్కకి స్నానం చేయించినవాడు, ఇందిరాగాంధీ జుట్టుకి రంగేసినవాడు, మైఖేల్ జాక్సన్ చెఫ్.. ఇలా చాలామంది తమ బాసుల అలవాట్లు, ప్రవర్తనల గూర్చి పేజీల కొద్దీ రాశారు. ప్రజల జీవితాలకి ఏ మాత్రం సంబంధం లేని ఇట్లాంటి గాసిప్స్ చాలామంది ఇష్టపడతారు. తెలివైన పబ్లిషర్లు ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఇట్లాంటి పుస్తకాలు వండి వారుస్తూనే వున్నారు.

బాబ్రీ మసీదు కూల్చినప్పుడు పీవీ పూజామందిరంలో వున్నాడా? బెడ్రూములో వున్నాడా? బాత్రూములో వున్నాడా? అంటూ కొందరు పుస్తకాలు రాసి బాగానే అమ్ముకున్నారు. పీవీ ఏ రూములో వుంటే మాత్రమేంటి? మసీదు కూల్చివేతని అడ్డుకోలేకపోవటం పీవీ అసమర్ధతకి చిహ్నం. ప్రజలకి సంబంధించినంత మేరకు ఇదే ముఖ్యమైన పొలిటికల్ పాయింట్.

ఆత్మకథల్లో ఇంకోరకం (మాజీ) ప్రముఖులు రాసేవి. ఈ మాజీల ఆత్మకథలు చదివేవారు వుండరు. అంచేత వాళ్ళే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అంచేత వాళ్ళా పుస్తకంలో (బహుశా పబ్లిషర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం) కొన్ని వివాదాస్పద అంశాలు ఉండేట్లు రాసుకుంటారు. ఇంక బోల్డంత ఫ్రీ పబ్లిసిటీ. మొన్న సంజయ్ బారు అనే ఒక మాజీ మీడియా ఎడ్వైజర్ ఇట్లాంటి సూత్రాన్నే పాటించి పుస్తకాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు నట్వర్ సింగ్ వంతొచ్చింది! ఈ వరసలో రేపెవరో! అసలివన్నీ ఆత్మకథలు కావనీ, ఆత్మకతలు మాత్రమేనని మా సుబ్బు అంటాడు. 

నట్వర్ సింగ్ అనే ఒక మాజీ తన అనుభవాల్ని పుస్తకంగా రాసుకున్నాడు. సోనియా గాంధీ ప్రధాని కాకపోవటానికి రాహుల్ గాంధీ వత్తిడే కారణమట. అయితే ఏంటిట? ఇదేమంత వార్తని! అసలీ నట్వర్ సింగ్ ఎవరు? ఏదో ఉద్యోగం వెలగబెడుతూ, అవకాశం దొరగ్గానే కాంగ్రెస్ పార్టీలోకి దూకి, గాంధీ కుటుంబానికి సేవ చేసుకుంటూ ఏవో పదవులు అనుభవించాడు. అటు తరవాత సొనియమ్మ దయకి దూరమయ్యాడు. అప్పట్నుండి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, ఖాళీగా ఉండటం దేనికని ఒక పుస్తకం రాసుకున్నాడు.

మొన్న మధ్యాహ్నం భోజనంలో నేను దోసకాయ పప్పు, కాకరకాయ వేపుడుకీ బదులుగా పప్పుచారు, గుత్తొంకాయతో తినుంటే ఎలా వుండేది? నిన్న నేను తెల్లచొక్కా కాకుండా చారల చొక్కా వేసుకున్నట్లైతే ఎలా వుండేది? ఈ విషయాలకి ఎంతటి ప్రాధాన్యం వుందో - 'మన దేశానికి ప్రధానిగా మన్‌మోహన్ సింగు కాకుండా సోనియా గాంధీ అయినట్లైతే ఎలా వుండేది?' అన్న విషయానికీ అంతే ప్రాధాన్యం వుంది. చదవడానికి కాస్త కఠినంగా వున్నా ఇది వాస్తవం. 

అసలంటూ మన్‌మోహన్ సింగు తనంతతానుగా ప్రజలకి ఏదైనా కీడో మేలో చేస్తే, ఆ పని సోనియా గాంధీ అయితే చేసేదా లేదా అని ఆలోచించేవాళ్ళం. కానీ మన్‌మోహన్ సింగు ఎప్పుడూ చేసిందేమీ లేదు. అణుఒప్పందం లాంటి ముఖ్యమైన నిర్ణయాలు సోనియా గాంధీ అనుమతి లేకుండా జరిగినవీ కావు. పోనీ 2 జి, బొగ్గు కుంభకోణాలు సోనియా గాంధీ అయినట్లేతే ఆపేదా? ఖచ్చితంగా ఆపేది కాదు. అందుకే - ఇంతోటి పాలనకి ఎవరైతేనేం (పళ్ళూడగొట్టుకోడానికి ఏ రాయైతే నేం)? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

చెప్పినట్లు చెయ్యకపొతే ఇంటి ఇల్లాలు ఎక్కడ గృహహింస కేసు పెడుతుందేమోననే భయంతో ఇంట్లో అంట్లు తోముతాం, బట్టలుతుకుతాం! అంతమాత్రానికే ఆ విషయాన్ని బయటకి చెప్పుకోలేం గదా? మరప్పుడు బయటకి ఏమని చెబుతాం? ఆలుమగలు సంసారం అనే బండికి రెండు చక్రాల్లాంటివారని నమ్మబలుకుతాం. అట్లాగే - పాపం సోనియమ్మ తన ముద్దుల కొడుకు వత్తిడి వల్ల ప్రధానమంత్రి పదవిని తప్పించుకుని, దానికి 'త్యాగం' అనే పేరు పెట్టుకుంది. అలా చేయబట్టే ఆమె వందిమాగధులు తమ నాయకురాల్ని మదర్ థెరీసా అని కీర్తించగలిగారు!

'ఆత్మకథలని అధమంగా చూడకు. ప్రముఖులు ఎదిగిన వైనము కడు స్పూర్తిదాయకము.' అని కొందరు అమాయకులు నమ్మవచ్చుగాక! నేను మాత్రం నమ్మను. నా స్నేహితుడోకడు గైళ్ళు చదివి మంచి మార్కులు సంపాదించేవాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అతను మాత్రం అందరికీ తను చాలా కష్టపడి దిండ్లు లాంటి స్టాండర్డ్ టెక్స్టు బుక్కులు మాత్రమే చదువుతానని చెప్పుకునేవాడు. అంతేకాదు - గైళ్ళు చదవొద్దని జూనియర్లకి సలహా కూడా చెప్పేవాడు! ఎందుకు? అలా చెబితేకానీ తన ఇమేజ్ పెరగదని అతని అభిప్రాయం.

పోనీ ప్రతిభావంతుల అలవాట్లని స్పూర్తిదాయకంగా తీసుకుని, వాటిని అనుకరించి బాగుపడ్డవారున్నారా? మిగతావాళ్ళ సంగతేమో గానే - నేను మాత్రం లాభ పళ్ళేదు. మా గుంటూరు మెడికల్ కాలేజిలో చరిత్ర సృష్టించిన భీభత్సమైన గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఒకాయనున్నాడు. ఆయన మాకు మూడేళ్ళు సీనియర్. ఎట్టకేలకి మా సూర్యం ఆ గోల్డ్ మెడల్స్ రహస్యం చేధించాడు.

ఆ గోల్డ్ మెడల్స్ పెద్దమనిషి ప్రతిరోజూ సరీగ్గా అర్ధరాత్రి పన్నెండింటికి బలరాం హోటల్లో ప్లేటు పూరీ (అనగా రెండు పూరీలు అని అర్ధం) పూరీకూరతో కాకుండా చపాతికి ఇచ్చే కుర్మాతో నంజుకుని తింటాడు. ఆపై నిదానంగా ఒక టీ తాగి స్టైలుగా ఒక రెడ్ విల్స్ సిగరెట్ ముట్టిస్తాడు. మా సూర్యం డిటెక్టివ్ యుగంధర్ వలె ఆయనపై అనేక రాత్రులు నిశిత పరిశీలన జరిపి సేకరించిన భోగట్టా ఇది.

ఆ గోల్డ్ మెడలిస్ట్ విజయ రహస్యాన్ని గ్రహించిన మా మిత్రబృందం కూడా పూరీ కుర్మా విత్ రెడ్ విల్స్ సిగరెట్ ఫార్ములాని అమలు చెయ్యడం ప్రారంభించింది. మొక్కవోని దీక్షతో ఎన్ని పూరీకుర్మాలు తిన్నా, ఎన్ని సిగరెట్లు కాల్చినా మాకెవరికీ గోల్డ్ మెడల్ దక్కలేదని ప్రత్యేకించి రాయనక్కర్లేదని అనుకుంటాను.


ముగింపు -

నా జీవిత చరిత్ర (రాస్తే గీస్తే) ఈ విధంగా రాయబోతున్నాను.

నేను చాలా పేద కుటుంబం నుండి వచ్చాను (ఒట్టు! నన్ను నమ్మండి). అనేక కష్టాలు పడుతూ వీధి దీపాల కింద చదువుకుంటూ డాక్టర్నయ్యాను (ఇప్పుడు కొద్దిగా చెమట తుడుచుకోనివ్వండి). స్త్రీలందరినీ నా సోదరీమణులుగా భావించాను (అందుకే నాకు భార్య దొరకడం కష్టమైంది). ఏనాడూ అసత్యం పలక లేదు (మళ్ళీ ఇంకో ఒట్టు). పేదరోగుల కష్టాలకి చలించిపోతుంటాను, కన్నీరు కారుస్తుంటాను (బిల్లు మాత్రం ఠంచనుగా వసూలు చేస్తాను). అనుక్షణమూ ఈ దేశానికి నేనేమిచ్చాను అని తపన పడుతుంటాను (కొద్దిగా గంభీరంగా ఉంటుందని రాశానే గానీ ఈ వాక్యానికి అర్ధం నాకు తెలీదు).

అన్నట్లు పదో చాప్టర్లో బాలగోపాల్ గూర్చి రాయబోతున్నాను. 

కొన్ని సందర్భాల్లో విషయం అర్ధం కాక తల పట్టుక్కూర్చున్న బాలగోపాల్‌కి సలహాలు చెప్పి చైతన్యవంతుణ్ణి చేశాను. ఒక్కోసారి ఆయన నిరాశ చెందేవాడు. అప్పుడు నేను 'తెలుగువీర లేవరా! దీక్ష బూని సాగరా!' అంటూ ఆయన్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేసేవాణ్ణి. అందుకే బాలగోపాల్ ఎప్పుడూ అంటుండేవాడు 'రమణా! నువ్వు లేకపోతే నేను లేను' అని. అది వాస్తవమే అనుకోండి, కానీ - నాకు పొగడ్తలు గిట్టవు!

ప్రస్తుతానికి నా జీవిత చరిత్రలో ఈ విశేషాల శాంపిల్ చాలుననుకుంటున్నాను!


చివరి తోక -

'ట్రింగ్ ట్రింగ్' ఫోన్ అందుకున్నాను. 

"ఎందుకు? ఎందుకు నన్నంత మాట అన్నావ్? నా మనసు ఎంతలా గాయపడిందో తెలుసా?" మబ్బు లేని వర్షంలా నా స్నేహితుని వ్యధ.

"నేనేమన్నాను?" అయోమయంగా అడిగాను.

"అది తెలుసుకోవాలంటే త్వరలో రాబోయే నా ఆత్మకథ చదువుకో. నీకైతే ట్వెంటీ పర్సంట్ డిస్కౌంట్ కూడా!" అన్నాడు నా స్నేహితుడు.

"ఈ మాత్రం దానికి ఆత్మకథ ఎందుకు!" చికాగ్గా అన్నాను.

"ఏ? అదే సోనియా గాంధీ రాస్తానంటే ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తావు. నాకో నీతీ సోనియాకో నీతా?" ఫెడీల్మంటు ఫోన్ పెట్టేశాడు నా స్నేహితుడు.