Sunday, 24 July 2016

టూత్ఏక్.. టూ మెనీ డౌట్స్


సుబ్బు నా చిన్ననాటి స్నేహితుడు. మా స్నేహం ఇప్పటికీ మూడు మసాలా దోసెలు, ఆరు కాఫీలుగా వర్ధిల్లుతుంది. సుబ్బుకి ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్ళీపెటాకుల్లేవు. వుండడానికో కొంపా, వండి పెట్టడానికో తల్లీ వున్నారు. మావాడు కబుర్ల పుట్ట, వార్తల దిట్ట.
ప్రస్తుతం నా కన్సల్టేషన్ చాంబర్లో సోఫాలో కూలబడి వున్నాడు సుబ్బు. కుడిబుగ్గ మీద అరచెయ్యి ఆనించుకుని, ఏసీబీ రైడ్సులో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగిలా దిగాలుగా వున్నాడు సుబ్బు.
“సుబ్బూ! సిగరెట్లు మానెయ్యమని మొత్తుకుంటూనే వున్నాను, విన్నావు కాదు – అనుభవించు.” అన్నాను.
“ఆ చెప్పేదేదో సరీగ్గా చెప్పొచ్చుగా! ‘సత్యము పలుకుము, పెద్దలని గౌరవింపుము’ టైపులో నీతివాక్య బోధన చేస్తే నేనెందుకు వినాలి?” అన్నాడు సుబ్బు.
“ఇంకెట్లా చెప్పాలోయ్! ‘సిగరెట్లు తాగితే ఛస్తావ్’ అని చెబుతూనే వున్నాగా!?” ఆశ్చర్యపొయ్యాను.
“సిగరెట్లు తాగేవాడు సిగరెట్ల వల్లే చావాలని రూలేమన్నా వుందా? ఈ దేశంలో దోమతో కుట్టించుకుని చావొచ్చు, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని చావొచ్చు, ఫ్రిజ్జులో మాంసం వున్నందుకు తన్నించుకుని చావొచ్చు, మునిసిపాలిటీ మేన్‌హోల్లో పడి చావొచ్చు. అసలెలా చస్తామో తెలిసి చస్తేనే కదా, అలా చావకుండా ముందు జాగర్తలు తీసుకునేది?” అన్నాడు సుబ్బు.
“అంతేగాని సిగరెట్లు తాగితే చస్తారన్న సంగతి మాత్రం ఒప్పుకోవు.” అన్నాను.
“ఒప్పుకుంటాను. ఈ లోకంలో సిగరెట్ల వల్ల చచ్చేది ఇద్దరైతే, ఇతర కారణాల్తో వెయ్యిమంది చస్తున్నారు. ఇటు సిగరెట్టు మానేసి, రేపింకేదో కారణంతో చస్తే దానికన్నా దారుణం మరోటుంటుందా?” నవ్వుతూ అన్నాడు సుబ్బు.
కొందరు విషయం తమకి అనుకూలంగా వుండేట్లు వితండవాదం చేస్తారు, అందులో మా సుబ్బు గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు సిగరెట్లు ఆరోగ్యానికి మంచిదని ఇంకో లెక్చర్ ఇవ్వగల సమర్ధుడు. సుబ్బు ధోరణి నాకలవాటే.
ఇవ్వాళ సుబ్బుని చూస్తుంటే జాలేస్తుంది. అసలు విషయం – రెండ్రోజులుగా మా సుబ్బు పంటినొప్పితో బాధ పడుతున్నాడు.
నిన్న ఫోన్ చేశాడు సుబ్బు.
“పన్ను నొప్పిగా వుంది.”
“పెయిన్ కిల్లర్స్ వాడి చూడు. తగ్గకపోతే అప్పుడు చూద్దాం.” అన్నాను.
“నేను ఇంగ్లీషు మందులు వాడను, సైడ్ ఎఫెక్టులుంటయ్.” అన్నాడు సుబ్బు.
“మందులకి ఇంగ్లీషు, తెలుగు అంటూ భాషాబేధం వుండదోయ్. నీకు రోగం తగ్గాలా వద్దా?” నవ్వుతూ అన్నాను.
“ఇంగ్లీషు మందులు వాడితే వున్న రోగం పొయ్యి కొత్త రోగం పట్టుకుంటుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.
“అట్లాగా! మరి ఫోనెందుకు చేశావ్?” విసుగ్గా అన్నాను.
“ఊరికే! నువ్వేం చెబుతావో విందామని!” నవ్వాడు సుబ్బు.
‘వీడీ జన్మకి మారడు.’ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను.
ఇవ్వాళ నొప్పి బాగా ఎక్కువైందిట, నా దగ్గరకొచ్చేశాడు – అదీ విషయం.
“ఇంగ్లీషు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి, నువ్వు వాడవుగా!” వ్యంగ్యంగా అన్నాను.
“అవును, కానీ వాడాలని నువ్వు ముచ్చట పడుతున్నావుగా! ఒక స్నేహితుడిగా నీ కోరిక తీర్చడం నా ధర్మం. కాబట్టి నిన్న చెప్పిన ఆ మందులేవో రాసివ్వు, వాడి పెడతాను.” అన్నాడు సుబ్బు.
“బుగ్గ కూడా వాచింది సుబ్బూ! ఇదేదో పెద్దదయ్యేట్లుంది. డెంటల్ డాక్టర్ దగ్గరకి వెళ్దాం పద.” టైమ్ చూసుకుంటూ లేచాను.
సుబ్బు కుర్చీలోంచి లేవలేదు.
“నీతో నేన్రాను. నువ్వూ, ఆ డాక్టరు నా పంటి గూర్చి డిసైడ్ చేసేసి ఏదో చేస్తారు. హడావుడిలో పన్ను పీకించినా పీకేంచేస్తావు, నీదేం పోయింది.” నిదానంగా అన్నాడు సుబ్బు.
“అంటే – నీకు నామీద నమ్మకం లేదా?” కోపంగా అన్నాను.
“ఎంతమాట! నువ్వు నా ప్రాణస్నేహితుడివి. కావాలంటే నీ కోసం నా ప్రాణాన్నిచ్చేస్తాను, కానీ పన్నుని మాత్రం ఇవ్వలేను.” నొప్పిగా నవ్వుతూ అన్నాడు సుబ్బు.
“సుబ్బు! ఎక్కువ మాట్లాడకు. న్యాయంగా మాట్లాడితే నీమీదసలు జాలి చూపకూడదు.” చిరాగ్గా అన్నాను.
“చూడబోతే నా టూత్ఏక్ నీకు సంతోషంగా వున్నట్లుంది.” నిష్టూరంగా అంటూ అరచెయ్యి దవడపై ఆనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు.
పాపం! బిడ్డడికి బాగా నొప్పిగా వున్నట్లుంది.
“సరే. నా ఫ్రెండ్ డాక్టర్ సుబ్రమణ్యంకి ఫోన్ చేసి చెబుతాను. సిటీలో ఇప్పుడతనే టాప్ డాక్టర్. నువ్వే వెళ్లి చూపించుకో.” అన్నాను.
“నేను బిజీ డాక్టర్ల దగ్గరకి పోను. వాళ్ళు హడావుడిగా పైపైన చూస్తారు.” అన్నాడు సుబ్బు.
“పోనీ – నీ పంటిని నిదానంగా, స్పెషల్‌గా చూడమని చెబుతాను. సరేనా?” అన్నాను.
“సరే గానీ – నాకో అనుమానం వుంది.” గుడ్లు మిటకరించాడు సుబ్బు.
“యేంటది?” అడిగాను.
“డెంటల్ డాక్టర్లు అవే ఇన్‌స్ట్రుమెంట్లు అందరి నోట్లో పెడుతుంటారు కదా! సరీగ్గా కడుగుతారంటావా?” అన్నాడు సుబ్బు.
“కడుగుతార్లే సుబ్బూ! అయినా ఇన్ని డౌట్లు సర్జరీ చేయించుకునే వాడిక్కూడా రావు.” అసహనంగా అన్నాను.
“పన్ను నాది, నొప్పి కూడా నాదే. అన్ని నొప్పుల్లోకి తీవ్రమైనది పన్నునొప్పి అని నీవు గ్రహింపుము.” నీరసంగా నవ్వాడు సుబ్బు.
“గ్రహించాన్లే, పోనీ డాక్టర్ రంగారావు దగ్గరకి వెళ్తావా?” అడిగాను.
“ఎవరు? బ్రాడీపేట మెయిన్ రోడ్డులో వుంటాడు, ఆయనేనా?”
“అవును, ఆయనే.”
“రోజూ అటువైపుగా వెళ్తుంటాను. యేనాడూ ఒక్కడంటే ఒక్క పేషంటు కూడా నాక్కనపళ్ళేదు.” అన్నాడు సుబ్బు.
“నీక్కావల్సిందీ అదేగా సుబ్బూ! ఆయన దగ్గర జనం తక్కువగా ఉంటారు. శ్రద్ధగా ఎక్కువసేపు చూస్తాడు, ఇన్‌స్ట్రుమెంట్లూ శుభ్రంగా వుంటాయి.” అన్నాను.
“అంత శ్రద్ధగా చూసేవాడైతే ప్రాక్టీసు లేకుండా ఖాళీగా ఎందుకున్నాడంటావ్?” అడిగాడు సుబ్బు.
“యేమో! నాకేం తెలుసు?”
“నీకే తెలీదంటే – ఆయన వైద్యంలో ఏదో లోపం వుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.
“నీకు నీ పంటినొప్పికి ట్రీట్మెంట్ కావాలా? డాక్టర్ల బయోడేటా కావాలా?” విసుక్కున్నాను.
“పేషంటన్నాక అన్నీ విచారించుకోవాలి.”
“వొప్పుకుంటాను. కానీ నీక్కావలసింది పంటి వైద్యం, గుండె వైద్యం కాదు.”
“గుండె ఒక్కటే వుంటుంది. అదే నోట్లో పళ్ళైతే? ముప్పైరెండు! డాక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఎక్కువ. పొరబాటున ఒకదాని బదులు ఇంకోటి పీకేస్తే!” అన్నాడు సుబ్బు.
“నాయనా! నీకో నమస్కారం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు.” అన్నాను.
“నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు. ఆసనాల బాబా పళ్ళపొడి వేసి పసపసా తోమితే పంటినొప్పి ఇట్టే మాయమౌతుందని టీవీల్లో చెబుతున్నారు.” అంటూ లేచాడు సుబ్బు.
“సుబ్బూ! శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందిట! ఇన్ని కబుర్లు చెబుతావ్, చివరాకరికి నువ్వు చేసే పని ఇదా!” అన్నాను.
“ఈ దేహం భారతీయం, ఈ పన్నూ భారతీయమే. తరతరాలుగా మన పూర్వీకులు ప్రసాదించిన ప్రకృతి వైద్యం గొప్పదనాన్ని నేను నమ్ముతాను. ఆసనాల బాబా పళ్ళపొడిని వాడి మన భారతీయ సాంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచానికి యెలుగెత్తి చాటుతాను. ఇంగ్లీషు డాక్టర్లు డౌన్ డౌన్, ఆసనాల బాబా జిందాబాద్!” అంటూ నిష్క్రమించాడు సుబ్బు.
నాకు విషయం బోధపడింది! సుబ్బుకి డాక్టర్లంటే భయం. దాన్ని కప్పిపుచ్చుకోడానికి యేదేదో మాట్లాడాడు.
కొద్దిసేపటికి నా పనిలో నేను బిజీ అయిపొయ్యాను.
సాయంకాలం సుబ్బు మదర్ ఫోన్.
“ఒరే నాయనా! ఇక్కడ సుబ్బు పరిస్థితి ఏమీ బాగాలేదు. అదేదో పళ్ళపొడి తెచ్చుకుని మధ్యాహ్నం నించి పళ్ళకేసి ఒకటే రుద్దుడు. నోరంతా పోక్కిపొయింది, మూతి వాచిపోయింది. మాట్లాళ్ళేకపోతున్నాడు, సైగలు చేస్తున్నాడు.” అన్నారావిడ.
“అమ్మా! వాణ్ని నోరు మూసుకుని నే చెప్పినట్లు చెయ్యమను.” అన్నాను.
“వాడిప్పుడు నోరు మూసుకునే వున్నాడు, తెరవలేడు. మళ్ళీ మూసుకొమ్మని చెప్పడం దేనికి?” ఆశ్చర్యపొయ్యారావిడ.
ఈవిడ అన్నివిధాలా సుబ్బుకి తల్లే!
“సరేనమ్మా, కారు పంపిస్తున్నాను. ఆ వెధవని అర్జంటుగా నా దగ్గరకి రమ్మను. వెళ్ళనంటే కర్ర తీసుకుని నాలుగు బాది కార్లోకి నెట్టు.” అంటూ ఫోన్ పెట్టేసి డ్రైవర్ కోసం కాలింగ్ బెల్ నొక్కాను.
కృతజ్ఞత –
ఈ రచన ప్రధాన పాయింట్‌కి ఆధారం – చాలాయేళ్ళ క్రితం ‘హిందు’ చివరిపేజిలో వచ్చిన ఆర్ట్ బక్‌వాళ్ (Art Buchwald) కాలమ్.
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 జులై 20)

పేదవాడి కుట్ర

ఇది పవిత్ర భారద్దేశం. ఈ దేశం అటు ప్రాచీన సంస్కృతికీ ఇటు ఆధునికతకీ నిలయం. అలనాడు గంధర్వులు పుష్పక విమానంలో మబ్బుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ‘మనవాళ్ళొట్టి వెధవాయిలు’ కాబట్టి ఆ పుష్పక విమానం ఫార్ములానీ రైట్ బ్రదర్స్ ఎగరేసుకుపొయ్యారు. ఇంకో విషయం – మనం కొన్ని యుగాల క్రితమే వినాయకుడి తలని హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజితో మార్చేసుకున్నాం. ఇవ్వాల్టికీ అదెలా చెయ్యాలో అర్ధంగాక తల పట్టుకుంటున్నారు పాశ్చాత్య వైద్యాధములు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ప్రధానమంత్రిగారు అనుక్షణం తపన పడుతూ యెక్కే విమానం, దిగే విమానంగా క్షణం తీరిక లేకుండా వున్నారు. ఫలితంగా – ఒకప్పుడు ప్రపంచ పటంలో ఎక్కడుందో తెలీని భారద్దేశం ఒక గొప్పదేశంగా అందరికీ తెలిసిపోయింది. త్వరలోనే అమెరికా, చైనాల్ని తలదన్నేంతగా తయారవబోతుంది. రండి – మన ప్రధానమంత్రులవారి కృషిని అభినందిద్దాం, వారి చేతులు బలోపేతం చేద్దాం.
మంచివారు మంచిపన్లే చేస్తారు, చెడ్డవారు చెడ్డపన్లే చేస్తారు. అలాగే – ఒక మంచిపనికి అడ్డుపడే దుర్మార్గులు అన్ని యుగాల్లోనూ వుంటూనే వున్నారు. అలనాడు ఉత్తములైన ఋషుల చేసే యజ్ఞాల్ని భగ్నం చెయ్యడానికి దుష్టులైన రాక్షసులు అనేక కుట్రలు పన్నారు. ఆ రాక్షస సంతితే ఇవ్వాళ మరోరూపంలో దేశాభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకొడానికి కుట్ర చేస్తుంది.
ఇదంతా యెందుకు చెబుతున్నానంటే – ఈమధ్య గుజరాత్‌లో నలుగురు కుర్రాళ్ళని కారుకి కట్టేసి ఇనప రాడ్లతో చావగొట్టార్ట. దేశంలో మరే వార్తలు లేనట్లు మీడియా ఈ విషయాన్ని చిలవలు పలవలు చేసి చెబుతుంది. నేను శాంతికపోతాన్ని, హింసని ఖండిస్తాను. కానీ – ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో హింసని సమర్ధించక తప్పదు. ఇప్పుడు ఆ కుర్రాళ్ళని కొట్టిన సంఘటన వెనుక కారణాల్ని విశ్లేషించుకుందాం.
ఈ దేశంలో పుట్టిన ప్రతివారూ హిందువులే, అందరికీ దైవం ఆ శ్రీరాముడే. ఇందులో ఎటువంటి వాదప్రతివాదాలకి తావు లేదు. మన ప్రభుత్వం పేదవారికి అనేక పథకాల ద్వారా సహాయం చేస్తోంది. తద్వారా అనేకమంది తమ జీవితాల్ని మెరుగు పర్చుకుంటున్నారు. అయితే – కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పథకాలకి దూరంగా వుంటున్నారు. చదువుకొమ్మంటే చదువుకోరు, ఉద్యోగం వున్నా చెయ్యరు, ఆహారం వున్నా తినరు. యెందుకు?
యెందుకంటే – కుళ్లుకంపు కొడుతూ డొక్కలు యెండిన తమ పేదరికాన్ని ప్రపంచం ముందు దీనంగా ప్రదర్శించుకోవాలి, అంతర్జాతీయంగా మన దేశం పరువు పోగొట్టాలి. ఇది ఖచ్చితంగా కుట్రే! అందుకు ఋజువు – ఆ దెబ్బలు తిన్న కుర్రాళ్లే. చావుకు అంగుళం దూరంలో వున్నట్లు, దరిద్రానికి దుస్తులు వేసినట్లు.. జాలిజాలిగా, నిస్సహాయంగా, బాధతో అరుస్తూ, భయంతో వణికిపోతూ యెంత అసహ్యంగా వున్నారో కదా! గుండెని కలచివేసే వారి పేదరిక ప్రదర్శనకి ప్రపంచం కదిలిపోవచ్చు గాక, కానీ మన్లాంటి మేధావులు మోసపోరాదు.
ఈ దేశంలో అందరూ సమానమే. మనం కష్టపడ్డాం, అవకాశాలు అంది పుచ్చుకున్నాం, జీవితంలో స్థిరపడ్డాం, సుఖంగా బ్రతికేస్తున్నాం. ఇవ్వాళ మనకి గాలి యెలా పీల్చుకోవాలో చెప్పేందుకు బాబా రాందేవ్‌గారు వున్నారు, యెలా జీవించాలో చెప్పేందుకు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌గారు వున్నారు, యెలా ఆసనాలు వెయ్యాలో చెప్పేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రిగారే వున్నారు. ‘ఇవన్నీ మాకు అక్కర్లేదు, మేం మా పేదరికంలోనే మగ్గిపొతాం’ అని మొరాయించేవాళ్ళని యెవరు మాత్రం యేం చెయ్యగలరు!?
మనది పుణ్యభూమి, కర్మభూమి. అన్నిరకాల ఆహారాల్లోకి శాకాహరం మాత్రమే అత్యున్నతమైనదని వేదాలు ఘోషిస్తున్నయ్. అసలు ఆహారం కోసం ఇంకో ప్రాణిని చంపడమే దారుణం, అంచేత మాంసాహారం నీచమైనది. ఈ మహాసత్యాన్ని గుర్తించని కొందరు ‘మా ఆహారం, మా అలవాటు, మా ఇష్టం’ అంటూ వితండ వాదం చేస్తున్నారు.
మనం శాంతి కాముకులం, ఇతరుల అలవాట్లని గౌరవించే సంస్కారం వున్నవాళ్ళం. కాబట్టే అత్యంత దయతో – “వురేయ్ అబ్బాయిలూ! మాంసాహారం మహాపాపం. ఈ విషయాన్ని ముందుముందు మీరే తెలుసుకుంటారు. సరే! కోళ్ళు, కుక్కలు.. మీ ఇష్టం.. మీరేవైఁనా తినండి, మాకనవసరం. కానీ – గోవు మా తల్లి, దయచేసి మా తల్లి జోలికి మాత్రం రాకండి.” అని చిలక్కి చెప్పినట్లు చెప్పాం.
నేను ముందే మనవి చేసినట్లు వీళ్ళు పేదరికం ముసుగేసుకున్న అరాచకవాదులు. మనం యేది వద్దంటామో అదే చేస్తారు, యెంత సౌమ్యంగా చెబుతామో అంతగా రెచ్చిపోతారు. మన మంచితనాన్ని అసమర్ధతగా భావిస్తారు. అందుకే గుజరాత్‌లో మన తల్లి చర్మం వలిచేందుకు తెగబడ్డారు. మీరే చెప్పండి, మీ మాతృమూర్తి చర్మం వలిచేవాళ్ళని మీరైతే యేం చేస్తారు?
“మీరు వాళ్ళని గొడ్డుని బాదినట్లు బాదడం తప్పు.”
“అయ్యా! మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఆ నలుగురు కుర్రాళ్ళు తప్పుడు పని చేశారు. చెడుమార్గం పట్టిన కొడుకుని తండ్రి శిక్షించకుండా ఉపేక్షిస్తాడా? యెంత కొట్టినా దాని వెనుక ప్రేమ తప్ప ఇంకేమీ వుండదు కదా? ఇదీ అంతే! వాళ్ళు చేసింది హత్య, మానభంగం లాంటి సాధారణ నేరం కాదు – అత్యంత హేయమైన నేరం. నేరానికి తగ్గ శిక్ష పడాలి కదా! అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో (యెంతో బాధ పడుతూ) ఇనప రాడ్లతో బాదాల్సి వచ్చింది. ఇది మన దేశ సాంప్రదాయతని కాపాడ్డానికి చేసిన పుణ్యకార్యంగా మీరు భావించాలి.”
“నిందితుల్ని పట్టుకుని పోలీసులకి అప్పజెప్పాలి. వాళ్ళు నేరస్తులని చట్టబద్దంగా నిరూపణ కావాలి. మీరిలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అన్యాయం.”
“ఊరుకోండి సార్! మీరు మరీ అమాయకుల్లా వున్నారు. నేరం, చట్టం లాంటి పదాలు లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకే గానీ సాధారణ ప్రజానీకానిక్కాదు. వాళ్ళు నీచులు, నీచులకి నీచభాషలోనే చెప్పాలి. అందుకే తాట వూడేట్లు బాది పడేశాం. అయినా మనకెందుకు భయం!? స్టేట్‌లో మనవేఁ, సెంటర్లో మనవేఁ. ఈ హడావుడి రెండ్రోజులే. ఆ తరవాత మళ్ళీ మామూలే.”
“ఆవుని చంపడం నేరం అని దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేసే చర్యలు చేపడదాం. అవసరమైతే రాజ్యంగ సవరణ చేయిద్దాం. ఆ కుర్రాళ్లని చావగొట్టడం.. ”
“ఎళ్ళెళ్ళవయ్యా! పెద్ద చెప్పొచ్చావ్! నీ మాత్రం మాకు తెలీదనుకున్నావా? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మేం మా పని చేసుకుంటూ పోతాం. కాబట్టే మేం గోరక్షక ముఠాలుగా యేర్పడ్డాం.”
“కానీ, చట్టబద్ద పాలన.. ”
“అసలెవడ్రా నువ్వు? ఇందాకట్నించీ ఒకటే లెక్చర్లిస్తున్నావ్! ఎవర్రా అక్కడ? ముందీ గాడ్దె కొడుకుని ఆ కారుకి కట్టేయ్యండి. మొన్న మనం వాడి పడేసిన ఆ ఇనప రాడ్లు తీసుకురండి.”
“హెల్ప్.. హెల్ప్.. ”
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 జులై 24)

Thursday, 7 July 2016

మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!


“ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్‌వ్యూ చూశావా?” అడిగాడు నా స్నేహితుడు.
“చూళ్ళేదు.” అన్నాను.
“అదృష్టవంతుడివి. నాకా ఇంటర్‌వ్యూ ఉప్మా లేని పెసరట్టులా చప్పగా అనిపించింది. అర్నబ్ గోస్వామికి బుద్ధిమంతుడి వేషం నప్పలేదు. థాంక్స్ టు మోడీ, అర్నబ్ నోర్మూసుకుంటే యెలా వుంటాడో మొదటిసారి చూశాను.” అంటూ నవ్వాడు నా స్నేహితుడు.
గత కొన్నేళ్లుగా టీవీ మీడియంలో అర్నబ్ గోస్వామి పేరు మోగిపోతుంది. మోడెస్టీ కోసం తానో జర్నలిస్టునని చెప్పుకుంటాడు కానీ, అర్నబ్ జర్నలిస్టు స్థాయి ఎప్పుడో దాటిపొయ్యాడు! అతను ఒక షోమేన్, ఒక పెర్ఫామర్! సినిమా నటులు పాత్రోచితంగా అనేక రసాలు పండిస్తారు. అర్నబ్ ‘చర్చో’చితంగా కోపావేశాల్ని పండిస్తాడు. సినిమావాళ్ళది బాక్సాఫీస్ దృష్టైతే, అర్నబ్‌ది టీఆర్పీ దృష్టి!
అర్నబ్ గోస్వామి పాపులారిటీకి కారణం యేమిటి? యే దేశంలోనైనా సుఖమయ జీవనం సాగిస్తూ కులాసాగా ఆలోచించే వర్గం ఒకటి వుంటుంది. వీళ్లు రాజకీయంగా కలర్ బ్లైండెడ్‌. అంటే – ప్రతి సమస్యనీ బ్లాక్ వైట్‌లోనే ఆలోచిస్తారు, అధికారిక (ప్రభుత్వ) వెర్షన్‌ని సమర్ధించేందుకు రెడీగా వుంటారు, ప్రభుత్వ అభివృద్ధి నమూనాల పట్ల విశ్వాసం కలిగుంటారు (తమకీ ఓ రవ్వంత వాటా దొరక్కపోదా అన్న ఆశ కూడా వుంటుందనుకోండి). వీరిలో ఎక్కువమంది వేతనశర్మలు (చూడుము – రావిశాస్త్రి ‘వేతనశర్మ కథ’).
ఈ అర్నబ్ గోస్వామి వీక్షక వర్గం సోషల్ మీడియాని ప్రతిభావంతంగా వాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ గూర్చి కేంద్ర హోమ్ శాఖ చెప్పింది కరెక్ట్. వ్యతిరేకించావా? – నువ్వు ‘మావోయిస్టు టెర్రరిస్టువి’.  కల్బుర్గి హంతకుల కోసం ప్రభుత్వం ఇంకా వెదుకుతూనే వుంది. ప్రశ్నించావా? – నువ్వు ‘సూడో సెక్యులరిస్టువి’. రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్రాన్ని కలచివేసింది! సందేహించావా? – నువ్వు ‘దేశద్రోహివి’.
ఈ వర్గంవారి అభిప్రాయాల పట్ల ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆసక్తికర అంశం యేమంటే – ‘రాజకీయాలు చెత్త, అవి మాట్లాడ్డం టైమ్ వేస్ట్’ అన్న లైన్ తీసుకున్న ‘న్యూట్రల్’ వ్యక్తులు కొన్నాళ్లుగా ఘాటైన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం! అవి అచ్చు అర్నబ్ గోస్వామి అభిప్రాయాలే! ప్రతి అంశాన్నీ సింప్లిఫై చేసి బ్లాక్ ఎండ్ వైట్‌లో ప్రెజెంట్ చేసే అర్నబ్ గోస్వామి స్టైల్ వీళ్ళకి బాగా నచ్చింది.
మర్నాడు న్యూస్‌పేపర్లలో పదోపేజీలో కూడా రిపోర్ట్ కాని అంశాన్ని కొంపలు మునిగిపొయ్యే సమస్యలా చిత్రించ గలగడం అర్నబ్ గోస్వామి ప్రతిభ. అతని డిబేట్లు WWE కుస్తీ పోటీల్లా స్క్రిప్టెడ్ కేకలు, అరుపుల్తో గందరగోళంగా వుంటాయి. చూసేవాళ్ళకి ‘ఈ వీధిపోరాటంలో ఎవరు గెలుస్తారు’ లాంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి చౌకబారు ఆసక్తిని రేకెత్తించి వ్యూయర్‌షిప్ పెంచుకోవటమే టైమ్స్ నౌ చానెల్ వారి ఎజెండా. ప్రతిభావంతులైన నటుల్ని అభినందించినట్లుగానే అర్నబ్ గోస్వామిని కూడా అభినందిద్దాం.
టీవీల్లో వార్తల్ని విశ్లేషించే చర్చా కార్యక్రమాలకి కొంత ప్రాముఖ్యత వుంటుంది. వీక్షకులకి ఎదుటివారి వాదన యేమిటనేది తెలుసుకోడానికీ, తమకంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడానికి ఈ చర్చలు ఉపయోగకరంగా వుంటాయి. కానీ – అర్నబ్ గోస్వామి స్టూడియోలో కూర్చుని ప్రతి సబ్జక్టు పైనా ముందుగానే ఒక ఖచ్చితమైన అభిప్రాయం యేర్పరచుకుని వుంటాడు. ఆ అభిప్రాయంలో తీవ్రమైన దేశభక్తీ, భీభత్సమైన ధర్మాగ్రహం వుంటాయి. ఈ కారణాన – తన అభిప్రాయాన్ని వొప్పుకోనివారికి తిట్లు తినే సదుపాయం తప్ప, మాట్లాడే హక్కుండదు. ఈ సంగతి తెలుసుకోకుండా అర్నబ్ షోలో పాల్గొన్న JNU విద్యార్ధులకి యేమైందో మనకి తెలుసు.
“టీఆర్పీ రేటింగ్ కోసం చర్చా కార్యక్రమాన్ని వినోద స్థాయికి దించడం దుర్మార్గం.” ఒక సందర్భంలో నా స్నేహితుడితో అన్నాను.
“నీకు మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు. అది సరేగానీ, అర్నబ్ డిబేట్లలో స్క్రీన్ మీద మంటలు మండుతుంటాయి. ఎందుకో తెలుసా?” అడిగాడు నా స్నేహితుడు.
“తెలీదు.” ఒప్పేసుకున్నాను.
“అరుంధతి రాయ్, తీస్తా సెటిల్వాడ్ లాంటి దేశద్రోహుల్ని అందులో పడేసి రోస్ట్ చేసెయ్యడానికి.” కసిగా అన్నాడతను.
ఈ విధంగా ప్రజలు ప్రశాంతంగా టీవీ చూసేస్తూ చాలా విషయాల పట్ల చక్కటి అవగాహన యేర్పరచుకుంటున్నారు! ‘ముఖ్యమైన’ సమాచారం ప్రజలకి చేరే విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. తమకి ఇబ్బందిగా ఉండే విషయాల్లో (రాజకీయాలకి బయటనున్న ప్రజల) ఒపీనియన్ మేకింగ్ అన్నది అధికారంలో వున్నవాళ్ళకి చాలా అవసరం. ఈ వ్యవహారం సాఫీగా సాగడానికి అనేకమంది స్టేక్‌హోల్డర్స్‌ పాటుపడుతుంటారు (చూడుము – Noam Chomsky ‘Media Control’).
ఇంతటితో నేను చెబ్దామనుకున్న విషయం అయిపోయింది. అయితే – చెప్పుల షాపులో పన్జేసే వ్యక్తి దృష్టి తనకి తెలీకుండానే ఎదుటివారి చెప్పుల వైపు పోతుంది. దీన్ని occupational weakness అనుకోవచ్చు. వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని కాబట్టి చాలా అంశాల్లో సైకలాజికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచిస్తాను. అంచేత కొద్దిసేపు – సైకాలజీ బిహైండ్ అర్నబ్ గోస్వామి సక్సెస్.
ఒక వ్యక్తి ‘చర్చా కార్యక్రమం’ అంటూ గెస్టుల్ని పిలిచి మరీ చెడామడా తిట్టేస్తుంటే, చూసేవారికి ఎందుకంత ఆనందం? సైకాలజీలో Frustration-Aggression అని ఒక థియరీ వుంది. సగటు మనిషికి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, చిరాకు.. ఇవన్నీ frustration కలిగిస్తాయి. ఈ frustration ఒక స్టీమ్ ఇంజన్ లాంటిదని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంజన్ స్టీమ్ వదలాలి, లేకపోతే పేలిపోతుంది. అంచేత frustration అనేది తప్పనిసరిగా aggression కి దారితీస్తుంది. సగటు మనిషిలో వున్న ఈ aggression కి అర్నబ్ గోస్వామి కార్యక్రమం ఒక విండోగా ఉపయోగపడుతుంది. అందుకే చూసేవారిలో అంత ఆనందం!
అన్ని వృత్తుల్లాగే – జర్నలిస్టులకీ వృత్తి ధర్మం వుంటుంది. వాళ్ళు అధికారంలో వున్నవాళ్ళని ప్రజల తరఫున ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టాలి. మరప్పుడు అర్నబ్ గోస్వామి – “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చే విషయం ఎందాకా వచ్చింది? NSG కి చైనా అడ్డుపడకుండా ఎందుకు ఆపలేకపొయ్యారు? అదానీ వ్యాపారానికి అన్నేసి రాయితీలు ఎందుకిస్తున్నారు?” అని అడగాలి. అతనికి ప్రధాన మంత్రి ఆఫీసు నుండి ఫలానా ప్రశ్నల్ని అడక్కూడదనే ఆదేశాలు వొచ్చి వుండొచ్చు. అయితే చండప్రచండులైన గోస్వాములువారు ప్రధాన మంత్రి ఆఫీసు ఆదేశబద్దులై వుంటారా? వుండకూడదు కదా! స్టూడియోలో కూర్చుని కేకలేస్తూ గెస్టుల్ని తిట్టేసే అర్నబ్ గోస్వామి, ప్రధానమంత్రి దగ్గర వినయపూర్వకంగా ఎందుకు వొదిగిపొయ్యాడు?
సోషల్ సైకాలజీలో Obedience to Authority అని ఒక థియరీ వుంది. ఇది ‘పైనుండి’ వచ్చే అదేశాల్ని తుచ తప్పకుండా పాటించేవారి మనస్తత్వాన్ని చర్చిస్తుంది. లక్షలమంది యూదుల్ని హిట్లర్ వొక్కడే చంపలేదు, చంపలేడు. అతనికి తన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసిన నాజీ అధికారులు తోడయ్యారు. మన సివిల్ పోలీసులు పై ఆధికారుల ఆదేశాలని పాటిస్తూ నిరసన చేస్తున్న వికలాంగులు, వృద్ధులు, స్త్రీలని చావ చితక్కొడతారు. ఈ పోలీసులే పోలీసు అధికారుల ఇళ్లల్లో ఆర్దర్లీలుగా మగ్గిపోతుంటారు (చూడుము – పతంజలి ‘ఖాకీవనం’, స్పార్టకస్ ‘ఖాకీబ్రతుకులు’).
అర్నబ్ గోస్వామి టీఆర్పీ కోసం aggression చూపిస్తాడు, తన కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తాడు. స్టూడియోలో కూర్చుని చిన్నాచితకా నాయకుల్ని మందలిస్తూ, దేశభక్తిపై లెక్చర్లిచ్చే అర్నబ్ గోస్వామి బ్రతక నేర్చినవాడు. అందుకే ఎక్కడ ఎలా వుండాలో అర్ధం చేసుకుని సెలబ్రిటీ జర్నలిస్టయ్యాడు. ఇతగాడి విజయ యాత్ర యెందాకా సాగుతుందో తెలీదు గానీ, అది ఎంత తొందరగా ముగిసిపోతే దేశానికీ, ప్రజలకీ అంత మంచిదని నమ్ముతూ –
“మిస్టర్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!”
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 జులై 7)