Friday 18 March 2016

దొంగ


అది ఆంధ్రదేశంలో ఒక పట్టణం. ఆ వీధి ఎప్పుడూ రద్దీగానే వుంటుంది గానీ – ఇప్పుడు మిట్టమధ్యాహ్నం కావడం వల్ల ఆట్టే సందడి లేదు. ఇద్దరు కుర్రాళ్ళు నడుచుకుంటూ అటుగా వెళ్తున్నారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు, చిన్నప్పట్నుండీ స్నేహితులు. కొన్నాళ్లుగా వారిద్దరు రాజకీయంగా గొడవలు పడుతున్నారు. కారణం – ఆంధ్రరాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (ఎవరెన్ని కబుర్లు చెప్పినా) రెండు కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నయ్. దురదృష్టవశాత్తు – స్నేహితులిద్దరూ చెరోకులానికి చెందినవారైపోయినందున అనివార్యంగా తమతమ కులపార్టీల తరఫున వాదించుకోవాల్సి వస్తుంది!
ఇవ్వాళకూడా (రోజూలాగే) ఇద్దరి మధ్యా చర్చ చిన్నపాటి వాదనగా మొదలైంది. ఆ తరవాత ఇద్దరిలో ఆవేశం ఉప్పొంగింది. ఫలితంగా పెద్దపాటి కేకలు, అరుచుకునే స్థాయిదాకా వెళ్ళింది.
“మీ నాయకుడు రాజధాని పేరు చెప్పి వేల కోట్లు కాజేస్తున్నాడు.”
“మీ నాయకుడు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు కాజెయ్యొచ్చు.”
“మీ నాయకుడి కొడుకు మాత్రం తక్కువా? ఇప్పటికే రెండు లక్షల కోట్లు కాజేశాడు.”
“మా నాయకుడికి అభివృద్దే ఊపిరి. మీ నాయకుడు అడ్డు పడకపొతే ఈ పాటికి మన రాష్ట్రం సింగపూరుని మించిపొయ్యేది.”
“అవును, మా నాయకుడు అడ్డు పడకపొతే  ఈ పాటికి రాష్ట్రం అమ్ముడుపొయ్యేది.”
స్నేహితులిద్దరూ బుసలు కొట్టారు, ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకున్నారు.
ఇంతలో –
“దొంగ! దొంగ!” అంటూ పెద్దగా అరిచారెవరో. స్నేహితులిద్దరూ తలతిప్పి అటుగా చూశారు.
ఎదురుగా – బడ్డీకొట్ట్టు ముందు కూల్ డ్రింక్ తాగుతున్నాడో నడివయసు బట్టతల పెద్దమనిషి. అతని జేబులోంచి పర్స్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడో కుర్రాడు. చెరుకు రసం బట్టతలాయన తన జేబులో చెయ్యి పెట్టిన ఆ కుర్రాడి చెయ్యి చటుక్కున పట్టేసుకుని ‘దొంగ దొంగ’ అంటూ అరుస్తున్నాడు.
స్నేహితులిద్దరూ సింహాల్లా లంఘించారు, క్షణంలో దొంగని దొరకబుచ్చుకున్నారు. ఆ కుర్రాడికి సుమారు పదహారేళ్ళు ఉండొచ్చు. నల్లగా, సన్నగా వెదురుబద్దలా ఉన్నాడు. మాసిన బట్టలు, చింపిరి జుట్టు. మన స్నేహితుల పట్టు విడిపించుకోడానికి గిలిగిలలాడుతూ మెలికలు తిరిగిపోతున్నాడా కుర్రాడు.
స్నేహితులిద్దరూ ఆ దొంగ కుర్రాణ్ణి బోర్లా పడేసి మోకాళ్ళతో తొక్కిపట్టి కదలకుండా చేశారు. ఆ పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి దగ్గర కొబ్బరితాడు తీసుకున్నారు. తాడుతో ఆ కుర్రాడి పెడరెక్కలు బలంగా వెనక్కి విరిచి కట్టేశారు. ఆపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రోడ్డు వారాగా ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.
ఇంక విడిపించుకోలేనని గ్రహించాడా కుర్రాడు. “అన్నా! వదిలెయ్యన్నా! ఇంకెప్పుడూ చెయ్యనన్నా! నీ కాల్మొక్తా అన్నా!” అంటూ ఏడవసాగాడు. ఈలోపు చుట్టూతా పెద్ద గుంపు తయారయ్యింది.
ఎర్రటి ఎండ. తారు రోడ్డు పెనంలా కాలిపోతుంది. కరెంటు స్తంభం నిప్పుల కొలిమిలో కాల్చి తీసినట్లు మండిపోతుంది. గుంపులో ఒకరు అతని చొక్కాని, పేంటుని చింపేసారు. చిరుగుల డ్రాయర్ అతగాడి నగ్నత్వాన్ని కప్పలేకపోతుంది.
స్నేహితులిద్దరూ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దిసేపటికి చేతులు నొప్పెట్టాయి. మోకాళ్ళతో డొక్కల్లో కుమ్మారు. కొద్దిసేపటికి మోకాళ్ళు నొప్పెట్టాయి. అంచేత ఎగిరెగిరి కడుపులో తన్నారు.
ఈ ‘నేరము – శిక్ష’ దృశ్యానికి ఉత్తేజితులైన ఇంకొందరు యువకులు వారికి జత కూడారు. వంతులవారీగా దొంగని తన్నటం మొదలెట్టారు. తరవాత దొంగని తన్నే పవిత్ర కార్యానికి వారిలో పోటీ మొదలైంది. అటు తరవాత గుంపుగా తన్నారు.
కొద్దిసేపటికి దొంగ కళ్ళు తేలేశాడు. నోట్లోంచి నెత్తురు కారసాగింది. శరీరం మాంసం ముద్దలా మారిపోయింది. ఇంకొద్దిసేపటికి తల వాల్చేశాడు.
రొప్పుతూ రోజుతూ చెమటలు గక్కుతూ శ్రమిస్తున్న ప్రజానీకం ఓ క్షణం ఆగింది.
“మాస్టారు! ఈ మధ్యన తన్నులు తప్పించుకోడానికి దొంగలు దొంగేషాలేస్తున్నారండీ! అదంతా యాక్షన్ సార్! కుమ్మండి కొడుకుని!”
మళ్ళీ తన్నులు మొదలు. ఈసారి కర్రలు వచ్చి చేరాయి. ధనా.. ధన్ .. ఫటా.. ఫట్.. దొంగవేషాలు వేసే దొంగలూ, అసలు యే వేషాలు వెయ్యలేని దొంగలూ.. వందసార్లు చచ్చేంతగా నిరంతరాయంగా కొనసాగిందా హింసాకాండ.
ఇది పుణ్యభూమి, ఇక్కడ చట్టం తనపని తను చేసుకుపోతూనే ఉంటుంది. అంచేత కొంతసేపటికి చట్టబద్దులైన పోలీసులొచ్చారు. దొంగ కట్లిప్పదీశారు. దొంగ రోడ్డుమీదగా వాలిపోయ్యాడు. తల పగిలింది, దవడలు విచ్చిపొయ్యాయి. నెత్తురు కమ్మిన ఎర్రటి కళ్ళు ఈ ప్రపంచాన్ని అసహ్యంగా, కోపంగా చూస్తున్నట్లు వికృతంగా వున్నాయి.
చచ్చాడా? చచ్చే ఉంటాళ్ళే, దొంగ ముండాకొడుకు. మురికిలో పుట్టి మురికిలోనే కలిసిపొయ్యాడు. మాస్టారూ! ఎందుకలా ఫీలవుతున్నారు!? మీరెవరో మరీ అమాయకుల్లా వున్నారే! యేదీ – ఓ సిగరెట్టిలా పడెయ్యండి. థాంక్యూ! పరాయి సొత్తు నిప్పుతో సమానం. నన్ను చూడండి! ఆకలేస్తే చావనైనా చస్తాగానీ, దొంగతనం చేస్తానా? ఈ నేరస్తుల్ని జైల్లో వెయ్యడం, వాళ్ళు బయటకొచ్చి మళ్ళీ నేరం చెయ్యడం – మన టాక్స్ పేయర్స్ మనీ ఎంత వృధా! అంచేత దొంగతనం చేసే లమ్డీకొడుకుల్ని ఇలా చావ చితక్కొట్టేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏవఁంటారు?
రాష్ట్ర రాజకీయాల పట్ల వైరుధ్యం వున్నా, దొంగని శిక్షించే విషయంలో ఒకటవ్వడం స్నేహితులకి సంతోషం కలిగించింది. బాధ్యత కలిగిన పౌరులుగా సమాజానికి మొదటిసారిగా సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. ‘ఈ దేశంలో అందరూ తమలా నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను!’
స్నేహితులిద్దరు మళ్ళీ కబుర్లలో పడ్డారు.
“మా నాయకుడి ప్రజాసేవకి అబ్బురపడి మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారు.”
“అది మీ నాయకుడి ప్రతిభ కాదు, అధికారం అనే బెల్లం!”
ఈ విధంగా తమ కబుర్లు కొనసాగిస్తూ ఇంటిదోవ పట్టారు.
(ప్రచురణ - సారంగ 2016 మార్చ్ 17)

Monday 14 March 2016

'దేశభక్త' మనోజ్ కుమార్‌కి అభినందనలు!


మన్దేశంలో ఆనేక రంగాల్లో కృషి చేసిన (చేస్తున్న) వారికి ప్రభుత్వాలు పద్మ అవార్డులులిస్తాయి. సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిస్తాయి. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్‌కి ఈ యేడాది ఫాల్కే అవార్డు లభించింది, అందుగ్గాను మనోజ్ కుమార్‌కి అభినందనలు. గత కొన్నేళ్లుగా ఈ అవార్డులు అనేవి ప్రతిభకి చిహ్నంగా కాకుండా పలుకుబడికి నిదర్శనంగా మారిపొయ్యాయి. ఇందుగ్గానూ ప్రజలు మిక్కిలి చింతించి ఈ అవార్డుల గూర్చి పట్టించుకోవడం మానేశారు.
సినిమా వాళ్లకి ఒక ప్రత్యేకత వుంది. డాక్టర్లు స్పెషాలిటీ కోర్సులు చదువుకుని స్పెషలిస్టులు అవుతారు. సినిమావాళ్ళకి అలా కోర్సులేమీ వుండవు కానీ, వారు ఒకే మూసలో సినిమాలు తీసి స్పెషలిస్టులు అవుతారు. పౌరాణిక జానపదాలు, భక్తి సినిమాలు, ఫైటింగు సినిమాలు, ప్రేమ సినిమాలు, హాస్య సినిమాలు, బూతు సినిమాలు.. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్పెషాలిటీ. అలాగే మనోజ్ కుమార్ స్పెషాలిటీ దేశభక్తి!
షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్.. మనోజ్ కుమార్ ఇలా అనేక దేశభక్తి సినిమాలు తీశాడు, విజయాలు సాధించాడు. అందుకే అభిమానులు ఆయన్ని ‘భారత్ కుమార్’ అని పిలిచుకున్నారు. మా మేనమామ ఒకాయనకి సినిమాల పిచ్చి. వరసపెట్టి సినిమాలు చూసీచూసీ సినీ పండితుడైపొయ్యాడు. మనోజ్ కుమార్ తన కెరీర్ అంతా ఒకటే ఎక్స్పెషన్‌తో లాగించేశాడనీ, ఆ వొక్కటైనా దిలీప్ కుమార్ దగ్గర అరువు తెచ్చుకున్నదనీ చెబుతుండేవాడు. నాకైతే నిజానిజాలు తెలీదు.
ఇవ్వాళంటే ‘మేం స్వచ్చమైన దేశభక్తులం’ అని మన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం యేర్పడింది గానీ – నా చిన్నతనంలో ఈ సమస్య లేదు. ఆగస్టు పదిహేనో తారీకున ఒక స్వతంత్ర సమర యోధుడితో స్కూల్లో జాతీయ జెండా ఎగరేయించేవాళ్ళు, బిస్కట్లు పంచేవాళ్ళు. చాలా సినిమాల్లో యేదోక సందర్భంలో ఒక దేశభక్తి పాట వుండేది. ఆ పాటలో కనిపించే గాంధీ తాత, నెహ్రూ చాచా క్లిప్పింగులకి చప్పట్లు కొట్టేవాణ్ని. సినిమా అయిపొయ్యాక తెరమీద ‘జనగణమన’ వేసేవాళ్ళు, చివర్లో ‘జైహింద్’ అంటూ సెల్యూట్ చేసేవాణ్ని. ఈ విధమైన నా దేశభక్తికి నేను చాలా సంతోషించేవాణ్ని.
 ఎందుకంటే – నాకు తెలిసిన చాలామందికి నా మాత్రం దేశభక్తి కూడా వుండేది కాదు! పదో క్లాసు తప్పి పెళ్లి కోసం ఎదురు చూసే అక్కా, ‘ఫలానా ముండమోసినావిడ (సిగ్గు లేకుండా) ఫలానా వాడితో యికయికలు, పకపకలు’ అనే వార్తల్ని అందించే మా రంగమ్మత్తా, ఉద్యోగం కోసం తిరిగి తిరిగి బక్కచిక్కిన మా సూరిమామా – వీళ్ళెవరూ యేనాడూ దేశభక్తి గూర్చి మాట్లాడిన గుర్తులేదు. అంతేనా? సోడాబండి తిరుపాలు, పాచిపని చేసే బతకమ్మ, పాకీపని చేసే పుల్లాయ్ గాడు.. వీళ్ళందరికీ దేశభక్తి సంగతి అటుంచండి, కనీసం దేశం అంటే ఏంటో తెలీదని నాకు తెలుసు.
స్కూల్లో సైన్స్ టీచర్ గారు – మనం భారద్దేశంలో పుట్టినందుకు తీవ్రంగా గర్వించాలనీ, మనమందరం భారతమాత సేవలో తరించిపోవాలనీ గంభీరంగా చెప్పేవారు. మన ఉన్నతిని వోర్వలేని పాకిస్తాన్ సాయిబులూ, చైనా కమ్యూనిస్టులూ మన్దేశాన్ని కబళించడానికి నిరంతరం కుట్రలూ, కుతంత్రాలు పన్నుతున్నారని కూడా చెప్పేవారు. ఆయన చెప్పింది సరీగ్గా అర్ధం కాకపోయినా.. ప్రపంచ దేశాల్లో మన భారద్దేశ సంస్కృతి మాత్రమే పవిత్రమైనదీ, గొప్పదీ అనీ.. మిగిలిన దేశాలన్నీ భ్రష్ట సంస్కృతికి, దుర్మార్గాలకీ మాత్రమే నిలయమన్న సంగతి నాకు బాగా గుర్తుండిపోయింది.
దేశభక్తి విషయాల్లో మా సుబ్బు వాదన వేరుగా వుంటుంది. ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ తన అమూల్యమైన అభిప్రాయాల్ని అలవోకగా చెబుతుంటాడు.
“యే దేశంలోనైనా ‘దేశభక్తి’ అనేది రాజకీయ పార్టీల నినాదం మాత్రమే. ఈ నినాదం ఆయా రాజకీయ పార్టీల మెరుగైన భవిష్యత్తు కోసమే గానీ సామాన్య మానవుడి భవిష్యత్తు మెరుగు పడేందుకు మాత్రం కాదు. యే దేశచరిత్రలోనైనా ‘దేశభక్తి’ అనే భావన అణగారిన వర్గాల కష్టాలు కడగళ్ళు తీర్చినట్లుగా గానీ, సామాన్య మానవుడి జీవన స్థితిగతులు మెరుగు పరచినట్లుగా గానీ ఋజువుల్లేవు.” అంటాడు మా సుబ్బు.
“గురజాడ గారు ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!’ అన్నారు. మనం, మన తోటి మనుషులు – అందరం ఈ దేశంలో భాగమే కదా! మరప్పుడు ఒక దేశపౌరుడు ఇంకో దేశపౌరుణ్ని మోసం చెయ్యకూడదు. భారతీయ పోలీసులు భారతీయ నిందితుల్ని లాకప్ డెత్ చెయ్యకూడదు, భారతీయ అగ్రకులాలు భారతీయ దళితుల్ని హీనంగా చూడకూడదు, భారతీయ సైనికులు భారతీయ ఆదివాసీల అణచివేతకి పాల్పడకూడదు. మరి – ఇవన్నీ జరుగుతున్నయ్యా?” అంటూ ప్రశ్నిస్తాడు మా సుబ్బు.
“గురజాడ వారే ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా!’ అని చెప్పారు. అయితే వాస్తవానికి ఈ సూక్తి ఎవరికి వర్తిస్తుంది? ప్రజల్ని నిలువునా ముంచేస్తున్న రాజకీయ నాయకులకి వర్తిస్తుంది, పబ్లిక్ బ్యాంకుల్ని పబ్లిగ్గా దివాళా తీయిస్తున్న కార్పోరేట్ సంస్థలకి వర్తిస్తుంది. కానీ ఈ ఉన్నత వర్గాల వారే స్వతంత్ర దినం నాడు భారతమాత విగ్రహానికి దండేసి, జాతీయ జెండాకి దణ్ణం పెట్టి దేశభక్తులైపోతారు! దేశభక్తి గూర్చి ఉపన్యాసాలు దంచుతారు.” అంటూ నవ్వుతాడు మా సుబ్బు.
“ఒక దేశానికి అన్నిరకాల వృత్తులూ అవసరం. కర్షకులు, కార్మికులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశుధ్య పనివారు, సైనికులు.. ఇలా అనేకమంది కలిస్తే గానీ ‘దేశం’ అనే బండి నడవదు. వీరిలో యే ఒక్కరూ ఇంకొకరికన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. పొలం దున్నుతూ పాము కరిచి చనిపొయ్యే రైతూ, ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో చనిపోయ్యే కార్మికుడూ, రోగి నుండి సంక్రమించిన ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయ్యే వైద్యుడూ, మేన్‌హోల్లో కుళ్ళు కంపుకి ఊపిరాడక చనిపోయ్యే పారిశుధ్య కార్మికుడూ, సరిహద్దులో శత్రువు దాడికి చనిపోయ్యే సైనికుడూ.. అందరూ సమానంగా అమరులే (దీని అర్ధం యేమైనప్పటికీ)!” అంటూ బల్ల గుద్దుతాడు మా సుబ్బు.
ప్రస్తుతం దేశ పరిస్థితులు బాగాలేవు. దేశభక్తి టాపిక్ చాలా కాంప్లికేట్ అయిపొయింది. ఏదైనా కొంచెం అటూఇటుగా మాట్లాడితే దేశద్రోహులం అయిపొయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మా సుబ్బు అభిప్రాయాల్తో నాకస్సలు సంబంధం లేదని విన్నవించుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు కొండ వెంకటప్పయ్యగారికి ‘దేశభక్త’ అనే టైటిల్ వుంది. వెంకటప్పయ్యగారి ‘దేశభక్త’ టైటిల్ సినిమావాళ్ళల్లో ఎవరికైనా యివ్వాలంటే మన మనోజ్ కుమార్‌ని మించిన యోగ్యుడు లేడని నా అభిప్రాయం.
చివరగా –
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 మార్చ్ 11)