Friday 29 November 2013

పి.లీల.. నాకు భలే ఇష్టం


నాకు చిన్నప్పట్నుండి చాలా ఇష్టాలున్నాయి, కొన్ని అయిష్టాలూ ఉన్నాయి. అయితే - ఇష్టమైనవి ఎందుకిష్టమో, ఇష్టం లేనివి ఎందుకయిష్టమో చెప్పగలిగే జ్ఞానం అప్పుడు లేదు.

'ఇప్పుడు చిన్నవాణ్ణి కదా! పెద్దయ్యాక అన్ని కారణాలు తెలుస్తాయిలే.' అని సరిపుచ్చుకునేవాణ్ని.

దురద్రుష్టం! పెద్దయ్యాక కూడా జ్ఞానానికి సంబంధించి నా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు.

నా జీవితంలో మొట్టమొదటగా నే విన్న పాట అమ్మ పాడింది. కావున నాకు తెలిసిన మొదటి గాయని అమ్మే. ఇదేమంత విశేషం కాదు. చాలామందికి వారి తల్లులే ప్రధమ గాయకులు. అయితే నే చెప్పేది 'చందమామ రావే! జాబిల్లి రావే!' టైపు పాట కాదు. చక్కటి సినిమా పాట. ఎలా? ఎప్పుడు?

చిన్నప్పుడు రోజూ అమ్మ పక్కలో పడుకునేవాణ్ని. అందుకొక బలమైన కారణం ఉంది. అమ్మ తప్ప ఇంట్లో ఎవరూ నన్ను తమ పక్కలో పడుకోబెట్టుకోడానికి సాహసించే వాళ్ళు కాదు. ఒకరకంగా నేను వారి పక్కలో పడుకునే హక్కుని కోల్పోయాను. ఇది నా స్వయంకృతాపరాధం. 

స్కూల్లో అవుట్ బెల్లు.. స్నేహితులతో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పాసు పోసుకునేవాణ్ణి. కొద్దిసేపటికి ఎక్కడో చల్లగా అనిపించి మెళకువ వచ్చేది. పక్క దుప్పటి, నిక్కరు ముద్దగా తడిసిపోయుండేవి. ఇది కలా? నిజం కాదా?!

ఈ కల నాకు రాకుండా చెయ్యాలని ప్రతి రాత్రి దేవుడికి దణ్ణం పెట్టుకుని పడుకునేవాణ్ని. కానీ కల నుండి మాత్రం తప్పించుకోలేకపొయ్యేవాణ్ని! ఈ విధంగా ఆ కల నన్ను ప్రతి రాత్రీ వెంటాడగా.. అర్ధరాత్రి, నిద్రలో పక్క తడిపే కార్యక్రమం క్రమబద్ధంగా, నిర్విఘ్నంగా కొనసాగించాను. ఘోరమైన ఈ అలవాటు నాకు ఇంట్లో ఎవరి పక్కలోనూ స్థానం లేకుండా చేసింది.

అక్కైతే నన్ను తిట్టిపోసేది.

'ఒరే దున్నపోతా! నీకు మంచం ఎందుకురా? వెళ్లి ఆ బాత్రూములోనే పడుకుని చావు. నీకదే సరైన ప్లేసు.' ఎంత దారుణం! ఒక అర్భకుణ్ని ఇంతగా ఆడి పోసుకోవాలా? అయితే అక్క కోపానిక్కూడా ఒక కారణం ఉంది. మర్నాడు ఆ కంపుకొట్టే బట్టలు బక్కెట్లో ముంచేది అక్కే. అదీ సంగతి!

నాకేమో ఒక్కణ్ణే పడుకోడానికి బయ్యం. తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకున్న ఓ ఆడమనిషి కిటికీలోంచి తొంగి చూస్తున్నట్లుగా అనిపించేది. అన్నట్లు ఆడదెయ్యాలు రంగు చీరలు ఎందుక్కట్టుకోవు? జడెందుకేసుకోవు? ఎందుకో ఇవ్వాల్టికీ నాకు తెలీదు.

ఈ విధంగా అందరి పక్కల నుండి బహిష్కృతుడనైన నేను.. నెమ్మదిగా అమ్మ పక్కలోకి చేరేవాణ్ని. అమ్మ నన్నెప్పుడూ ఏమీ అన్లేదు. 'కొన్నాళ్ళకి ఆ అలవాటు పోతుందిలే' అని ధైర్యం కూడా చెప్పేది. అమ్మ నాకు నిద్రోచ్చేదాకా పాట(లు) పాడేది. ఈ (లు) ఎందుకంటే .. మొదటి పాట పూర్తయ్యేలోపే నిద్ర పొయ్యేవాణ్ణి. కాబట్టి నేను నిద్ర పోయింతర్వాత అమ్మ ఇంకేమన్నా పాటలు పాడేదేమో నాకు తెలీదు.

అమ్మ రోజూ పాడే ఆ పాట - 'ఓహో మేఘమాల! నీలాల మేఘమాల! చల్లగా రావేలా, మెల్లగా రావేల'. అమ్మ గానం అద్భుతంగా అనిపించేది. పాట వింటూ నిద్రోలోకి జారుకునేవాణ్ని. రేడియోలో, సినిమాల్లో.. ఎక్కడా, ఎవరూ అమ్మ పాడినంత బాగా పాడేవాళ్ళు కాదని నా నిశ్చితాభిప్రాయం.

ఇక్కడో సందేహం. ఇంత బాగా పాడే అమ్మ మరి సినిమాల్లో ఎందుకు పాడట్లేదు? బహుశా వంటకి ఇబ్బందవుతుందని నాన్న వద్దనుంటాడు. అయినా అమ్మకి ఓసారి సలహా ఇచ్చాను. 'అమ్మా! నువ్వు సినిమాలకి పాడు.' అమ్మ చాలాసేపు చాలా సంతోషించింది. నన్ను మురిపెంగా ముద్దు పెట్టుకుని 'ఈ పాట సినిమాలో పి.లీల పాడింది. లీల అద్భుతమైన గాయని.' అన్నది.

అందువల్ల - అమ్మకి ఎంతగానో నచ్చిన 'ఓహో మేఘమాలా!' పాటంటే నాక్కూడా ఎంతో అభిమానం ఏర్పడిపోయింది. అమ్మకి ఇష్టమైన పి. లీల నాక్కూడా అభిమాన గాయని అయిపొయింది. నాకు లీల గొంతు మృదువుగా, దయగా, ఆత్మీయంగా, లోతుగా, మార్దవంగా వినబడుతుంది. ఒకే గొంతు ఇన్ని 'గా'లుగా ఎలా వినిపిస్తుంది అని అడక్కండి. నాదగ్గర సమాధానం లేదు.

సినిమా పాటల పండితులు తమ పాండిత్య ప్రావీణ్యంతో తూకం వేసి.. లతా మంగేష్కర్, ఎస్.జానకి వంటివారు లీల కన్నా గొప్పగా పాడతారని తేల్చినచో తేల్చుగాక. నేనస్సలు పట్టించుకొను. ఎందుకంటే నాకు సంగీతం తెలీదు. పాట గొప్పగా పాడటం అంటే ఏంటో కూడా తెలీదు. అంచేత లీల గొప్ప గాయని అని వాదించి ఒప్పించలేను. కానీ - లీల ఎక్కాల పుస్తకంలో రెండో ఎక్కాన్ని పాటగా పాడినా నాకిష్టమే!

నాకు ఇష్టమైన అమ్మకి లీల ఇష్టం. ఎవరికైనా ఇష్టమైన వారికి ఇష్టమైనది ఇష్టంగా కాకుండా ఎలా ఉంటుంది? నేను లీలని ఇష్టపడటంలో నా పసితనం, నా కుటుంబం, అమ్మ నాకోసం పడ్డ కష్టాలు.. వంటి ఆత్మీయ జ్ఞాపకాలు కలగలిపి ఉన్నాయి. అందుకే లీల గానం నాకో మధురమైన అనుభూతి.

నాకెంతో ఇష్టమైన పాట యూట్యూబులో ఇస్తున్నాను. విని ఆనందించండి.



(photos courtesy : Google)

Wednesday 27 November 2013

వేతనశర్మలు ఉద్యమకారులేనా?


(నేనింతకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఉద్యమం గూర్చి 'వేతనశర్మ' ఉద్యమం  అని ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు ఆ పోస్టుకి కొనసాగింపుగా రాస్తున్నాను.)

ప్రభుత్వోద్యోగులు 'సమైక్యాంధ్ర' అంటూ ఒక ఉద్యమాన్ని నడిపారు. నాకు పరిచయం ఉన్న చాలామంది ఆ ఉద్యమ నాయకుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనీ మధ్య మళ్ళీ సమైక్య ఉద్యమం మొదలెడుతున్నానని గాండ్రించాడు. ప్రజలు ఆ ఉద్యోగ నాయకుడిలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగుల్ని గాంచారు, పరవశించారు. నేను మాత్రం ఆ నాయకుళ్ళో ఓ పులిని వీక్షించాను. అందుకే నాకాయన గాండ్రించినట్లనిపించింది.

హిట్లర్ కన్నా దుర్మార్గుడు, ఘంటసాల కన్నా గొప్పగాయకుడు, రావిశాస్త్రి కన్నా గొప్ప రచయిత ఈ ప్రపంచంలో లేడని నా ప్రగాఢ నమ్మకం. అనేక ప్రాపంచిక విషయాల్ని రావిశాస్త్రి కథల దృక్పధం నుండే నేను అర్ధం చేసుకుంటుంటాను. ఇందుకు నేను బోల్డెంత సంతోషంగానూ, గర్వంగానూ ఫీలవుతుంటాను కూడా.

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన 'వేతనశర్మ కథ' చదవడం వల్ల నాకు ఉద్యోగుల పట్లా, వారి ఉద్యమాల పట్ల గొప్ప అవగాహన కలిగింది. అందుకే నాకెంతో ఇష్టమైన ఆ కథకి పరిచయం కూడా రాసుకున్నాను. రావిశాస్త్రి పుణ్యమాని.. నాకు ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తే పులులు గుర్తొస్తాయి. కొందరికి పులంటే భయం. ఇంకొందరికి పులిలో రాజసం, ఠీవి కనిపిస్తాయి. నాకు మాత్రం పులి ప్రమాదకరంగా కనిపిస్తుంది.

నాకు తెలిసిన చాలామందికి గవర్నమెంటు ఆఫీసుల్లో చేదు అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఉద్యోగులు సామాన్య మానవుణ్ని అమెరికావాడు ఇథియోపియా కరువు బాధితుణ్ణి చూసినట్లు అసహ్యించుకుంటారు. తప్పదు! వారి పని ఒత్తిడి అంత గొప్పగా ఉంటుంది! జీవితం మీద విరక్తి కలగాలంటే ఏదైనా పని మీద గవర్నమెంటు ఆఫీసుకి వెళ్తే చాలని అనేకమంది అభిప్రాయం. సామాన్య మానవులెవరైనా ఏ గవర్నమెంట్ డిపార్టమెంట్లోనైనా సరే.. సకాలంలో పని పూర్తి చేసుకుని, గౌరవప్రదంగా బయటపడ్డారంటే వారికి సన్మానం చెయ్యాల్సిందే.

ప్రభుత్వాలు ఉద్యోగస్తుల ద్వారా టాక్సులు వసూలు చేస్తాయి. ఆ మూలధనంతో ప్రజల అవసరాల కోసం ఎలా ఖర్చు చెయ్యాలో ప్లాన్లు వేస్తాయి. దీన్నే బడ్జెట్ అంటారు. అయితే మన బడ్జెట్లో సింహభాగం ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. మిగిలిన కొంత సొమ్ముని ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం మరియు పేదప్రజల సంక్షేమ పథకాల నిమిత్తం ఖర్చు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులదే ప్రధాన పాత్ర. అయితే వారు వారి పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా?

ఉద్యోగస్తులు సంఘటితంగా పోరాడి తమ డిమాండ్లు సాధించుకుంటున్నారు. మంచిది. అది వారి హక్కు. కాదనడానికి మనమెవరం? అయితే వీళ్ళని మనం కొన్ని ప్రశ్నలు వెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళకి జీతాలు వచ్చేది మనం కట్టే పన్నుల్లోంచి కావున. మరి వీళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధుల్ని నిర్వర్తిస్తున్నారా? 

ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాల్లో పదిరూపాయిలు తేడా వస్తే మెరుపు సమ్మె చేస్తారు. ఒకరోజు సీనియార్టీ తేడా తేల్చుకుందుకు సుప్రీం కోర్టు తలుపు కూడా తడతారు. 'మా జోలికి వచ్చారా? ఖబడ్దార్. మేం ఎన్టీఆర్ ని మట్టి కరిపించాం. చంద్రబాబుకి బుద్ధి చెప్పాం. ఆలోచించుకొండి.' అంటూ ప్రభుత్వాలకి మాఫియా టైపు వార్నింగులిస్తారు.

ప్రభుత్వ డాక్టర్లు కూడా 'సమైక్యాంధ్ర' అంటూ రోజుకో స్కిట్ తో వెరైటీ ప్రదర్శనలు నిర్వహించారు. మంచి వినోదాన్ని పంచారు. ప్రభుత్వ డాక్టర్లూ! మీకున్న సామాజిక స్పృహకి వందనాలు. కానీ మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు నెలకి ఎన్ని రోజులు వారి ఆస్పత్రికి వెళ్తున్నారు? మీ అందరికి ప్రైవేట్ నర్సింగ్ హోములు ఎందుకున్నాయి? లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటూ పేదప్రజలకి సరైన వైద్యం అందించడంలో మీ పాత్ర సక్రమంగా నిర్వహిస్తున్నారా? 

అసలు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఒక పేద దేశానికి అవసరమా? ఒకే కాయితం వివిధ సంతకాల కోసం అనేక సెక్షన్ల మధ్యన గిరిగీలు కొట్టించే ఈ ఉద్యోగుల వ్యవస్థ మన దేశ ఆర్ధిక ప్రగతికి అడ్డంకి కాదా? వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం కలిపించి.. వారిని చచ్చేదాకా టాక్స్ పేయర్స్ మనీతో పోషించే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ దేశానికి ఏ విధంగా మేలు చేస్తుంది?

ఈనాడు మన యువత అనేక రంగాల్లో దూసుకెళ్తుంది. మనకి ప్రతిభావంతుల కొదవ లేదు. కానీ వారి సేవల్ని ప్రభుత్వ స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండటం దురదృష్టం. సరైన వ్యవస్థని సృష్టించుకుని, మన యువతని సరీగ్గా వాడుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని నా అభిప్రాయం. అటువంటి పరిస్థితి రావాలని, వస్తుందని ఆశిద్దాం.

Monday 25 November 2013

పుట్టిన్రోజు పండగే! అందరికీనా?


"ఫలానా ఫంక్షన్ హాల్లో ఎల్లుండి మా అమ్మాయి పుట్టిన్రోజు ఫంక్షన్. ఆ ఫంక్షన్ హాలు వాళ్లకి సొంతంగా డెకరేషన్ చేసేవాళ్లు వున్నార్ట. వాళ్లు చూపించిన పుష్పాలంకరణ డిజైన్లు మాకు నచ్చలేదు. మా బామ్మర్ది కూతురి ఓణీల ఫంక్షనప్పటి డెకరేషన్ మాక్కావాలి. మా డిజైన్ని హాలువాళ్లు ఒప్పుకోడం లేదు. మీరు కొద్దిగా మాట సాయం చెయ్యాలి."

ఇంతటి తీవ్రమైన కష్టంలో ఉన్న అతగాడు నా స్నేహితుడికి స్నేహితుడు, పురుగు మందుల వ్యాపారం చేస్తాట్ట. నల్లగా, బొజ్జతో భారీగా ఉన్నాడు. అయితే ఆయనకి నేన్చేయగలిగిన సహాయం ఏంటో నాకర్ధం కాలేదు. నాకైతే మాత్రం పుష్పాలంకరణలో ప్రావీణ్యం లేదు, నా స్నేహితుడి వైపు క్వశ్చన్ మార్కు మొహంతో చూశాను.

"ఆ ఫంక్షన్ హాలు ఓనర్ కూతుర్ని నువ్వు ట్రీట్ చేస్తున్నావు. ఆయనకి ఫోన్లో ఓ మాట చెప్పు, చాలు." అన్నాడు నా స్నేహితుడు.

ఇంతలో ఓ ధర్మసందేహం.

"అవునూ.. అలంకరణ ఎట్లా వుంటే ఏంటి? అదంత ముఖ్యమైందా?" పురుగు మందులాయాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.

ఆయన నాకేసి క్షణకాలం క్రూరంగా చూశాడు.

"స్పెషల్ డెకరేషన్ ఫోటోలు బెజవాడ వెళ్లి మరీ తీయించుకొచ్చాను. ఇప్పుడీ డెకరేషన్ కుదర్దేమోనని ఇంట్లో ఆడాళ్ళందరూ అన్నం మానేసి శోకాలు పెడుతూ ఏడుస్తున్నారు.. అసలే నా భార్య హార్ట్ పేషంటు. ఖర్చు ఎగస్ట్రా ఎంతైనా పరవాలేదు, పుష్పాలంకరణలో మాత్రం తేడా రాకూడదు." స్థిరంగా అన్నాడాయన.

ఇప్పుడు మరో ధర్మసందేహం.

"మరి నే జెబితే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ వింటాడా?" నా స్నేహితుణ్ని అడిగాను.

"అన్నీ కనుక్కునే వచ్చాం, నువ్వొక మాట చెప్పు చాలు." అన్నాడు నా మిత్రుడు.

ఎంత ప్రయత్నించిన నా మొహంలోని చిరాకుని దాచుకోలేకపొయ్యాను. ఏమిటీ గోల? ఒక పుట్టిన్రోజు ఫంక్షను.. దానికో అలంకరణ.. మళ్ళీ ఓ స్పెషల్ డెకరేషన్ట! ఈ దిక్కుమాలిన దేశంలో ఒక్కోడిది ఒక్కోగోల. ఈ రోజుల్లో డాక్టర్ల మాట వినేవాడెవడు? వింటే గింటే పోలీసోళ్ల మాటో, టాక్సు డిపార్టుమెంటు వాళ్ల మాటో వింటారు గాని! అయినా నాదేం పోయింది? ఒక మాట చెబుతాను.. అతగాడెవరో వింటే వింటాడు, లేపోతే లేదు.

ఫోన్నంబరు వాళ్ళ దగ్గరే తీసుకుని.. ఆ ఫంక్షన్ హాల్ పెద్దమనిషికి ఫోన్ చేసి నా ఎదురుగా కూర్చున్న పురుగు మందుల పుష్పవిలాపాన్ని వివరించాను. అవతల ఆయన అత్యంత మర్యాదగా 'ఓహో అలాగే' అన్నాడు. ఆశ్చర్యపొయ్యాను. పోన్లే! నా పరువు నిలిపాడు. ఊళ్లో నాకింత పరపతి వుందని నాకిప్పటిదాకా తెలీదు! నాకు థాంక్సులు చెబుతూ వాళ్లిద్దరూ వెళ్ళిపోయారు.

వాళ్లు వెళ్లిన వైపే చూస్తుండిపొయ్యాను. ఇదంతా చేసింది నేనేనా! ఒకానొకప్పుడు నాకు నచ్చని విషయాల్ని  పురుగులా చూసేవాణ్ని. ఇప్పుడు నాకింత సహనం ఎక్కణ్ణుంచి వచ్చిందబ్బా! ఔరా! ఏమి ఈ వయసు మహిమ! మనుషుల్ని ఎంతగా నిర్వీర్యం చేసేస్తుంది!

అలా ఎందుకనుకోవాలి? ఇంకోలా అనుకుంటాను. నేనిప్పుడు పెద్దమనిషి నయినాను. అందుకే ఎదుటివారి దురదల్ని ఎంతో విశాల హృదయంతో అర్ధం చేసుకునే స్థాయికి ఎదిగాను. శభాష్ ఢింబకా! ఇలాగే అనుకుంటూ కంటిన్యూ అయిపో! నీకు తిరుగు లేదు.

మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఇక్కడే ఏదో తేడాగా వుంది. కానీ అదేంటో సరీగ్గా అర్ధం కాకున్నది. ఆ పురుగు మందులాయనా, నేనూ ఒకే ఊరి వాళ్ళం.. దాదాపు ఒకే వయసు వాళ్ళం. ఆయనకేమో ఇదో జీవన్మరణ సమస్య, నాకేమో ఒక భరింపరాని రోత. ఇద్దరి మనుషుల మధ్య మరీ ఇంత తేడానా! 

'ఓ ప్రభువా! పాపపంకిలమైన ఈ లోకంలో నీ శిశువుల్ని మరీ ఇంత దారుణమైన తేడాతో పుట్టించితి వేల?'

నేనెప్పుడూ పుట్టిన్రోజు జరుపుకోలేదు. అందుక్కారణం నా సింప్లిసిటీ కాదు. అదేంటో తెలీక! నా చిన్నతనంలో పుట్టిన్రోజు అంటే కుంకుడు కాయలు కొట్టుకుని తలంటు పోసుకోవటం (తలంటుకి 'షాంపూ' అనేదొకటుందని పెద్దయ్యేదాకా నాకు తెలీదు), (వుంటే గింటే) కొత్త బట్టలు తోడుక్కోవడం, దేవుడికి కొబ్బరికాయ కొట్టి (కొబ్బరికాయ ఇంట్లోనే కొట్టవలెను. గుళ్ళో కొట్టిన యెడల ఒక చిప్ప తగ్గును. తదుపరి ఇంట్లో కొబ్బరి పచ్చడి పరిమాణము కూడా తగ్గును), అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసేవాణ్ణి. అందుకు ప్రతిఫలంగా అమ్మ ఇచ్చిన పదిపైసల్తో సాయిబు కొట్లో నిమ్మతొనలు కొనుక్కుని చప్పరించేవాణ్ని. అదే నా పుట్టిన్రోజు పండగ!

అటుతరవాత హైస్కూల్ రోజులకి నా పుట్టిన్రోజు కానుక రూపాయి బిళ్ళగా ఎదిగింది. ఆ డబ్బుతో లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్లో సినిమా చూసేంతగా నా స్థాయి పెరిగింది. పుట్టిన్రోజు పండగలంటూ స్నేహితుల్ని ఇంటికి పిలవడం, కొవ్వొత్తులు ఆర్పి కేకు కత్తిరించడం సినిమాల్లో మాత్రమే చూశాను. నిజజీవితంలో ఎవరూ అలా జరుపుకోగా నేను చూళ్ళేదు. అంచేత పుట్టిన్రోజు నాకంత పట్టింపు లేకుండా పోయింది.

మెడిసిన్ చదివే రోజుల్లో జేబులో డబ్బులుండేవి. అయితే ఒంట్లో ఉడుకు రక్తం తీవ్రమైన వేగంతో ప్రవహిస్తుండేది. భావాలు, అభిప్రాయాలు అల్లూరి సీతారామరాజు స్థాయిలో ఉండేవి. నాకు నచ్చని ఏ విషయాన్నైనా 'ఆత్మవంచన రూదర్ ఫర్డ్' టైపులో సూపర్ స్టార్ కృష్ణలా గర్జిస్తూ వాదించేవాణ్ని. 'ఈ పుట్టిన్రోజు వేడుకలు, ఆర్భాటాలు డబ్బున్న వాళ్ళు తమ సంపదని సెలెబ్రేట్ చేసుకునే అసహ్యకర నిస్సిగ్గు ప్రదర్శన' అంటూ బల్ల గుద్దేవాణ్ణి.

పిమ్మట సలసల మరిగే నా రక్తం హ్యూమన్ బాడీ టెంపరేచర్ స్థాయికి పడిపోయింది. క్రమేణా నాలో 'ఎవడి దురద వాడిదే' అనే నిర్వేద తత్వం వచ్చేసింది. ఇవ్వాల్టి సంఘటనతో నా రక్తం టెంపరేచర్ ఫ్రిజ్జులో ఐస్ వాటర్ స్థాయికి దిగిపోయిందన్న సంగతి అవగతమైంది.

పెళ్ళైన కొత్తలో నా భార్య ఒక అర్ధరాత్రి సరీగ్గా పన్నెండు గంటల ఒక్క సెకండుకి నాకు పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెబితే మొహం చిట్లించాను, ఆవిడ బిత్తరపోయింది. తర్వాత్తర్వాత నా మనసెరింగిన అర్ధాంగియై నాకు విషెస్ చెప్పడం మానేసింది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ స్నేహితుల్తో పుట్టిన్రోజు పార్టీలు చేసుకుంటున్నారు. ఆ తతంగానికి నాది ప్రొడ్యూసర్ పాత్ర మాత్రమే కావున ఏనాడూ ఇబ్బంది పళ్ళేదు.

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అనడిగాడు మహాకవి శ్రీశ్రీ ('దేశచరిత్రలు' చదివాక నాలోని అనేక బూజు భ్రమలు తొలగిపోయ్యాయి). పుట్టిన్రోజు కేకులమ్మే బేకరీ కుర్రాళ్లెవరైనా, యేనాడైనా ఆ కేకుని కోసుకుని తమ పుట్టిన్రోజు జరుపుకున్నారా? ఐదునక్షత్రాల ఆస్పత్రిలోని వార్డు బాయ్ తనకి కొడుక్కి జొరమొస్తే ఎక్కడ వైద్యం చేయిస్తాడు?

ఇప్పుడింకో సందేహం. నాది మధ్యతరగతి నేపధ్యం, పుట్టిన్రోజులు జరుపుకోలేని స్థాయి. నా చిన్నతనంలో కూడా కొవ్వొత్తులు, కేకుల పుట్టిన్రోజులు జరపబడే వుంటాయి. కాపోతే నాకు ఆ స్థాయివాళ్ళతో పరిచయం వుండి వుండదు. హిమాలయాల్ని చూడని వాడికి బెజవాడ కనకదుర్గమ్మ కొండే హిమాలయం. బహుశా నాదీ ఆ కేసేనేమో!

'ఓయీ వెర్రి వైద్యాధమా! నిండుగా దుడ్డు గలవాడు ఏదైనా సెలెబ్రేట్ చేసుకుంటాడు. సరదా పుడితే తను వుంచుకున్న నారీ రత్నానికీ, పెంచుకున్న బొచ్చుకుక్కక్కూడా పుట్టిన్రోజు ఫంక్షన్ చేస్తాడు. మధ్యలో నీ ఏడుపేంటి? ఓపికుంటే వెళ్లి 'హ్యాపీ బర్త్‌డే' చెప్పేసి, ఫ్రీగా భోంచేసి వచ్చెయ్యి! అంతేగానీ - యెంత పన్లేకపొతే మాత్రం యిలా అల్పమైన విషయాలక్కూడా రీజనింగులు, లాజిక్కులు వెతక్కు.'

అయ్యా! ఎవరన్నా తమరు? తెలుగు సినిమా పోలీసులా ఈ రాత క్లైమేక్సులో వొచ్చి ఫెడీల్మని మొహం మీద కొట్టినట్లు భలే తీర్పు చెప్పారే! ఈ నాలుగు ముక్కలు ఇంకొంచెం ముందొచ్చి చెప్పినట్లైతే నాకీ రాత బాధ తప్పేదికదా!

updated and posted in fb on 30/1/2018)

Monday 18 November 2013

సచిన్ టెండూల్కర్ - ఆవకాయ


"సుబ్బూ! సచిన్ టెండూల్కర్ కి భారతరత్న రావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది, రిటైర్ అయినందుకు బాధగానూ ఉంది. దీన్నే కవుల భాషలో ఒక కంట కన్నీరు, ఇంకో కంట పన్నీరు అంటారనుకుంటా!" అన్నాను.

"ఈ యేడాది అమ్మ ఆవకాయ పట్టదుట. నా జీవితంలో ఆవకాయ లేని రోజు వస్తుందనుకోలేదు. నాకు మాత్రం రెండు కళ్ళల్లోనూ కన్నీళ్ళొస్తున్నాయి." కాఫీ సిప్ చేస్తూ భారంగా అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీతో ఇదే గోల. నేనిక్కడ ద గ్రేట్ టెండూల్కర్ గూర్చి చెబుతుంటే నువ్వు ఆవకాయ అంటూ ఏదో చెత్త మాట్లాడుతున్నావు." విసుక్కున్నాను.

"ఆవకాయ అనేది చెత్తా! నువ్వా ఆవకాయనే కుంభాలకి కుంభాలు లాగించావ్. ఇవ్వాళ ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నావ్. ఆవకాయ ద్రోహి. నీ కోసం నరకంలో సలసల కాగుతూ నూనె రెడీగా ఉందిలే." కసిగా అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! సుత్తి కొడుతున్నావ్."

"లేదు లేదు. నువ్వు ఆవకాయని అర్ధం చేసుకుంటేనే సచిన్ని కూడా ఈజీగా అర్ధం చేసుకుంటావు." అన్నాడు సుబ్బు.

"అదెలా?" కుతూహలంగా అడిగాను.

"ఆవకాయ. ఈ సబ్జక్టు మీద ఎంతైనా రాయొచ్చు. ఆవకాయని ఇష్టపడనివాడు డైరక్టుగా దున్నపోతుల లిస్టులోకి పోతాడని వేదాల్లో రాయబడి ఉంది. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుని లాగిస్తే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంటుంది. నీకు ఐశ్వర్యారాయ్ కావాలా? ఆవకాయ జాడీ కావాలా? అని నన్నడిగితే నూటికి నూరుసార్లూ ఆవకాయ జాడీనే కావాలంటాను." అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు సుబ్బు.

"హలో సుబ్బూ! కొద్దిగా ఆ ఆవకాయ జాడీలోంచి బయట పడి విషయంలోకి రా నాయనా!" అన్నాను.

"సారీ! ఆవకాయ ప్రస్తావనొస్తే ఒళ్ళు తెలీదు నాకు. ఒక్కసారి అమ్మ పట్టే ఆవకాయ గుర్తు తెచ్చుకో. ఆవకాయ పట్టిన మొదట్లో పచ్చడి ఆవఘాటుతో అద్భుతంగా ఉంటుంది. ఆ తరవాత గుజ్జుకి మామిడి ముక్కల పులుపు పట్టి రుచి మారుతుంది. ఆ సమయంలో ఆవఘాటు, పులుపు, కారం త్రివేణి సంగమంలా కలిసిపోయుంటాయి. ఆవకాయ తినడానికి బెస్ట్ టైం ఇదే."

"అవును. ఒకసారి ఆవకాయ దెబ్బకి నీ పొట్ట సోరకాయలా ఉబ్బింది. డాక్టర్ వాడపల్లి వెంకటేశ్వర రావు గారు నీ కడుపు కక్కుర్తికి బాగా తిట్టి మందిచ్చారు. గుర్తుంది కదూ?" నవ్వుతూ అన్నాను.

"ఆవకాయని ఆవురావురుమంటూ లాగించడం మన పని, కడుపునోప్పికి మందివ్వడం డాక్టర్ల పని. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. సరే, ఆవకాయలోకి వద్దాం. కొన్నాళ్ళ తర్వాత ఆవకాయలో ఘాటు తగ్గుతుంది, పులుపు తగ్గుతుంది, ముక్కలు మెత్తబడతాయి. పచ్చడి కొద్దిగా ఉప్పగా కూడా మారుతుంది. ఇట్లాంటి పచ్చడి ఇంట్లో ఉన్నా లేనట్లే. అదొక వెలిసిపోయిన బొమ్మ. చూడ్డానికి ఆయుర్వేద లేహ్యము వలే ఉంటుంది. ఈ వయసు మళ్ళిన ఆవకాయ నాకస్సలు ఇష్టం ఉండదు." మొహం వికారంగా పెట్టాడు సుబ్బు.

"అందుకే ఆ సమయానికి మాగాయ రెడీగా ఉంటుంది. ఇంతకీ నీ ఆవకాయ భాష మర్మమేమి?"

"ఇప్పుడు టెండూల్కర్ని ఆవకాయతో పోలుద్దాం. కుర్రాడు కెరీర్ మొదట్లో అద్భుతమైన ఆటతో అద్దరగొట్టాడు. నాకతని ఆటలో ఘాటైన ఆవ ఘుమఘుమలు కనిపించాయి. ఆ తరవాత స్పీడు తగ్గినా స్టడీగా చక్కగా ఆడాడు. ఆటలో కొంచెం ఘాటు తగ్గి పులుపెక్కాడు. ఆ రోజుల్లో సచిన్ ఆట ఒక అద్భుతం." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"నే చెప్పేది అదే కదా?" 

"పూర్తిగా విను. ఆవకాయ కొన్నాళ్ళకి రుచి తగ్గినట్లే.. సచిన్ ఆటలో కూడా పవర్ తగ్గిపోయింది.. వెలిసిపోయింది. చాలా యేళ్ళ క్రితమే సచిన్ ఆట ఆయుర్వేద లేహ్యంలా అయిపొయిందని నా అభిప్రాయం." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ఈమాట బయటెక్కడా అనకు. జనాలు నిన్ను సిక్సర్ కొడతారు."

"ఎందుకంటాను? నాకా మాత్రం జ్ఞానం లేదనుకున్నావా? మనవాళ్ళు సచిన్ని దేవుడి స్థానంలో కూర్చుండబెట్టారు. మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ. అక్షరాస్యులు ఉన్నా వారు కూడా దురభిమానంలో నిరక్షరాస్యుల్తో పోటీ పడుతుంటారు. ఈ దేశంలో నచ్చినవారికి వెర్రి అభిమానంతో గుడి కూడా కట్టిస్తారు. అందువల్ల ఇప్పుడు మిగిలింది సచిన్ కి గుడి కట్టి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడమే." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అవుననుకో. అట్లా చేస్తేగాని మనవాళ్ళకి తృప్తిగా ఉండదు. కానీ సచిన్ గొప్ప క్రికెటర్"

"కాదన్నదెవరు? కాకపొతే మన దేశంలో క్రికెట్ అనే ఆట ఒక వ్యాపారంగా మారి.. క్రమేణా ఒక కార్పోరేట్ స్థాయికి ఎదిగింది. అందువల్లనే సచిన్ అనేక బ్రాండ్లకి ఎండార్స్ చేసి గొప్ప సంపాదనపరుడిగా మారాడు. ఇక్కడ క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే అయినట్లైతే సచిన్ తన సమకాలికులతో ఎప్పుడో రిటైర్ అయ్యేవాడు. ఇందుకు కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనుకో." అన్నాడు సుబ్బు.

"రాజకీయాలా!" ఆశ్చర్యపోయాను.

"అవును. భారత క్రికెట్ బోర్డ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది, అత్యంత అవినీతిపరమైనది కూడా. అందుకే రాజకీయ నాయకులు బోర్డులో భాగస్వామ్యులవడానికి తహతహలాడతారు. వారికి సచిన్ లాంటి ఐకానిక్ ఫిగర్ ఉండటం కుషనింగ్ లాగా ఉపయోగపడుతుంది." అన్నాడు సుబ్బు.

"అవును. BCCI ఒక దొంగల ముఠా."

"ఇక దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అందుకే సచిన్ పాపులారిటీ క్యాష్ చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ సచిన్ కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. 'భారతరత్న'ని కూడా హడావుడిగా ఇచ్చేసింది. ఎంతైనా ఎన్నికల సమయం కదా! సచిన్ యువరాజావారికి స్నేహితుడు అన్న సంగతి కూడా మర్చిపోరాదు." అన్నాడు సుబ్బు.

"ఛ.. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు."

"నీకలా అనిపిస్తుందా? సర్లే - ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అంశమేమనగా.. ఇప్పటివరకూ ఎన్నడూ వ్యాపార ప్రకటనల్లో విచ్చలవిడిగా సంపాదిస్తున్న సెలెబ్రిటీకి భారతరత్న ఇవ్వబడలేదు. ఇప్పుడీ భారతరత్న పిల్లల్ని పెప్సీ త్రాగమని చెప్పవచ్చునా? క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత లాంటి డబ్బు సంపాదించుకునే ఉద్యోగాలు చేసుకోవచ్చునా? వీటికి సమాధానం వెండితెరపై చూడాలి." అన్నాడు సుబ్బు.

"అదంతా ఇప్పుడు అప్రస్తుతం. అయినా సుబ్బూ! దేశమంతా టెండూల్కర్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. నువ్వు మాత్రం చాలా నెగెటివ్ గా మాట్లాడుతున్నావ్." విసుగ్గా అన్నాను.

"అలాగా? అయాం సారీ. అసలీ గోలకి కారణం నువ్వే. తెలుగువాడికి తల్లి లాంటి ఆవకాయని తక్కువ చేశావ్. నా దృష్టిలో ఆవకాయని కాదన్నవాడు దేశద్రోహి. అంచేత మిత్రమా! నేరం నాది కాదు, ఆవకాయది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)

Saturday 16 November 2013

టెండూల్కరుని టెక్కునిక్కులు

గమనిక :

'భారతరత్న' సచిన్ టెండూల్కర్ కి అభినందనలు. ఇదే టాపిక్ మీద అక్టోబర్ 9, 2011 న ఒక పోస్ట్  రాశాను. ఇప్పుడది పునర్ముద్రిస్తున్నాను. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అక్తర్ ప్రస్తావన ఎందుకొచ్చిందో పూర్తిగా గుర్తు రావట్లేదు (కష్టపడి గుర్తు తెచ్చుకోవలసింత గొప్ప విషయం కాదు గనుక వదిలేస్తున్నాను). 
     
                              *                  *              *                *                *

అక్తర్ బంతులకి సచిన్ భయపడ్డాడా! నమ్మబుద్ధి కావట్లేదు కదూ! ఒకవేళ నిజంగానే అక్తర్ విసురుడుకి టెండూల్కర్ భయపడితే అందులో పరువు నష్టమేమి? 'బ్యాటుతో కాదురా. కంటిచూపుతో సిక్స్ కొట్టేస్తా.' అనే చౌకబారు తెలుగు సినిమా డైలాగ్ సచిన్ చెప్పడు. మరేం చేస్తాడు? అక్తర్ bowling video ని తన coach అధ్వర్యంలో అధ్యయనం చేస్తూ.. ఎలా ఎదుర్కోవాలో సాధన చేస్తూ.. ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఆడుతూ.. అక్తర్ bowling ని అద్భుతంగా ఎదుర్కొంటాడు. 

ఇది గొప్పఆటగాడి లక్షణం. భయపడటం అనేది బూతుమాట కాదు. అసలు ఆ భయమే చాలాసార్లు మనని కార్యసాధకుణ్ణి చేస్తుంది. కానీ.. మన హీరోగారు భయపడ్డాడంటే మనం తట్టుకోలేం. ఈ భయపడటం అనే పదం 'పిరివాడు' అనే ఒక negative sense లో వాడుతూ.. ధైర్యానికి వీరుడూ, శూరుడూ అంటూ లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. 
                  

అయినా.. అక్తర్ పశుబలంతో బంతులిసిరాడేగానీ.. బుర్ర తక్కువవాడిలా ఉన్నాడు. ముందు తన పుస్తకానికి ఏ దేశంలో market ఎలా ఉంటుందో అంచనావెయ్యాలి. ఆ దేశంలోని రాజకీయాలనీ, అభిమానుల మనోభావాలనీ అంచనా వెయ్యగలగాలి. ఇండియాలో పుస్తకం బాగా అమ్మాలనుకుంటే ఏ ఆస్ట్రేలియావాడినో, పాకిస్తాన్ వాడినో target చేస్తే మంచిది. అది మంచి వ్యాపారస్తుడి లక్షణం కూడా! 

ఈ వ్యాపారస్తులకి common sense కూడా ఎక్కువే! ప్రతి అంతర్జాతీయ క్రికెటర్ ఇండియాలోకి అడుగుపెట్టంగాన్లె ముందు సచిన్ని పొగుడుతారు. మనం క్రికెట్ ఆటకి మహారాజ పోషకులం. టెండూల్కర్ మన దేవుడు. దేవుణ్ణి పొగిడితే లాభం గానీ.. తెగిడితే ఏం లాభం? ఈమాత్రం తెలివిలేని అక్తర్ని చూస్తే నవ్వొస్తుంది. బహుశా పాకిస్తాన్లో అమ్మకాలు దృష్టిలో పెట్టుకుని సచిన్ భయపడ్డాడని రాశాడేమో! సైజు ప్రకారం ఇండియాది పెద్ద మార్కెట్ గదా! మరి ఈ తిక్కలోడు సచిన్ని టార్గెట్ చేసుకున్నాడేమి!               

సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు ఇల్లెక్కి కూస్తున్నారు. మంచిదే. అభీష్ట సిద్ధిరస్తు. క్రికెట్ ఆడటం public service క్రిందకి వస్తుందేమో మనకి తెలీదు. కానీ.. టెండూల్కర్ బూస్ట్ నించి బర్నాల్ దాకా కనీసం వంద బ్రాండ్లకి ambassador. ఆయనకి గొలుసు హోటళ్ళు (chain of hotels) కూడా ఉన్నాయి. 

రేపు 'Boost is the secret of my భారతరత్న' అనే కొత్త tagline తో కొత్త కాంట్రాక్టులు రాబట్టుకోవచ్చు.' వంద పెప్సీ మూతలు కలెక్ట్ చేసుకోండి. భారతరత్నతో shake hand పొందండి.' అనే కొత్త campaign మొదలుపెట్టొచ్చు. best of luck to సచిన్. అయినా.. ఎం.జీ.రామచంద్రన్ కిచ్చిన భారతరత్న ఎవరికిస్తే మాత్రమేంటి?       

బంగారు నగల వ్యాపారస్తుల్లాగా.. సామాన్య ప్రజలకి సంబంధంలేని రత్నాలు, ముత్యాల మీద ఎవార్డులు ఇవ్వడమే నవ్వొస్తుంది. భారతబొగ్గు, భారతఉప్పు లాంటి పేర్లు ఎవార్డులకి పెడితే ఇంకా అర్ధవంతంగా ఉంటుంది కదా! బొగ్గూ, ఉప్పు లేని మన బ్రతుకు ఊహించుకోలేం. మనకి ఏమాత్రం సంబంధంలేని రాళ్ళూ, రప్పల పేర్ల మీద ఎవార్డులు ఇస్తున్న గవర్నమెంట్ ఉద్దేశ్యం కూడా.. వీళ్ళని పట్టించుకోకండి అనేమో!  
                  

ఇన్ని సెంచరీలు కొట్టిన టెండూల్కర్ శరద్ పవార్ తో తన మాతృభాష మరాఠీలో.. "అంకుల్! నా అభిమానులు ఉల్లిపాయలు కొనలేక చస్తున్నారు. కనీసం ఒక రూపాయైనా ధర తగ్గించండి." అని చెప్పొచ్చు. వాళ్ళభాషలోనే అన్నా హజారేకి మద్దతూ పలకొచ్చు. అప్పుడు ఏమవుతుంది? భారతరత్న రావటం అటుంచి.. ఉన్న ఎవార్డులు, రివార్డులు పొయ్యే ప్రమాదం ఉంది. 
                  
సచిన్ గవాస్కర్ శిష్యుడు. డబ్బు సంపాదనలో ఆరితేరినవాడు. అట్లాంటి చెత్త ఆలోచనలని దగ్గరికి కూడా రానివ్వడు. 'పనికొచ్చే' ఆలోచనలు చెయ్యటంలో బొంబాయివారు సిద్ధహస్తులు. అందుకే.. 'బొంబాయి నడిబొడ్డున నాలుగెకరాలు ఫ్రీగా ఇవ్వండంకుల్. ఒక academy పెడతాను.' అంటూ గురువుగారిలా భోజన కార్యక్రమాల్లో ఆరితేరివుంటాడు. 
                  
సచిన్ అద్భుతమైన క్రికెటర్. కష్టపడి ఆడాడు. ఇంకా కష్టపడి బాగా సంపాదించుకున్నాడు. అందుకతను అనేక marketing టెక్కునిక్కులు ప్రయోగించాడు. మంచిదే. అయితే భారతరత్న ఇవ్వాలనుకుంటే ఇది సరిపోతుందా? అపార జనాకర్షణ కలిగిన ఒక ఆట ఆడి, తద్వారా కోట్లు వెనకేసుకోవటం, పుట్టపర్తి బాబావారి సేవలో తరించిపోవటం మించి public life లో సచిన్ సాధించింది ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది. కాబట్టే ఈ చర్చంతా. 
                  
'అసలిప్పుడు నోబెల్ ప్రైజులకే దిక్కు లేదు. అందరి దృష్టీ స్టీవ్ జాబ్స్, రతన్ టాటా, నారాయణమూర్తిల మీదే ఉంది. అట్లాంటిది ఈ రోజుల్లో భారతరత్నకి మాత్రం ఏపాటి విలువుంది?' అంటారా? అయితే గొడవే లేదు! 

(photos courtesy : Google)   

Wednesday 13 November 2013

బిచ్చగాళ్ళ బ్రతుకు


మొన్నామధ్య 'సమైక్యాంధ్ర' అంటూ ఒక భీభత్సమైన ఉద్యమం జరిగింది. అందులో బిచ్చగాళ్ళ సంఘం కూడా పాల్గొనడం నాకు ఆనందం కలిగించింది. లాభనష్టాల్ని అణా పైసల్తో సహా లెక్కలేసుకుని ఉద్యమాలు చేస్తున్న వేతనశర్మలున్న ఈ ఉద్యమాల కాలంలో.. సమాజంలో అట్టడుగున ఉన్నకటిక పేదవారు ఒక రాజకీయ కారణం కోసం ఉద్యమించడం.. నిజంగా నిస్వార్ధమే. ఈ రాజకీయ చైతన్యం నాకొక అద్భుతంగా తోస్తుంది.

ఇంతలో అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక అశరీరవాణి గద్దింపు.

'ఓయీ తుచ్ఛ బ్లాగవా (అనగా బ్లాగు రాసే మానవుడు అని యర్ధము)! సిగ్గుతో తల దించుకోవలసిన సందర్భంలో సంతోషిస్తున్నావా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళైన తరవాత కూడా ఇంతమంది బిచ్చగాళ్ళు ఉండటమేమిటి? మళ్ళీ వారికొక సంఘం.. పైగా దానికొక ఉద్యమ కార్యాచరణ! నిఖార్సైన దేశభక్తుడిగా నువ్వు బిచ్చాగాళ్ళ రహిత సమాజాన్ని కోరుకోవాలి. అంతేగానీ ఆ పేదరికాన్నే శ్లాఘిస్తావా?'

నిజమే. పొరబాటే. బిచ్చగాడు అనంగాన్లే.. చిన్నప్పుడు నాకు తెలిసిన 'అమ్మా! మాదాకబళం తల్లీ' అంటూ వీధులెంట తిరిగే అడుక్కునే వాళ్ళు గుర్తొస్తారు. మనం తినంగా మిగిలిన అన్నం, కూరలు వారి జోలెలో వేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటి సాంప్రదాయక బిక్షాటన కనుమరుగైంది. ఇందుకు ప్రధాన కారణం రిఫ్రెజిరేటర్. ఈ విధంగా కంప్యూటర్లొచ్చి టైపు మిషన్లని దెబ్బ తీసినట్లు ఫ్రిజ్జులొచ్చి మాదాకబళాన్ని దెబ్బ కొట్టాయి. ఇది మిక్కిలి శోచనీయం. కొత్త మార్పుని అంగీకరించని బూజు పట్టిన నా వృద్ధ మనస్సు బాధతో మూలిగింది.

సరే! 'బిచ్చగాళ్ళ రహిత సమాజం' లాంటి పెద్దపెద్ద మాటలు జగన్ బాబు, చంద్రబాబుల వంటి గొప్పనాయకులకి వదిలేద్దాం. లేకపోతే వాళ్ళు ఫీలవుతారు. అసలు సమాజానికి అవసరమైన వృత్తులేమి? సరుకుల లిస్టులాగా ఒక పద్దు రాద్దాం. ఏ సమాజానికైనా వైద్యులు (నాకు స్వార్ధ చింతన మెండు), ఉపాధ్యాయులు వంటి వృత్తులు అవసరం. బంకులు (పెట్రోలు), బ్యాంకులు కూడా అవసరమే. ఇట్లా ఎవరి వృత్తులు వారు రాసేసుకుంటూ ఒక లిస్టు రాసుకుంటూ పొతే.. అందులో చివరగానైనా బిక్షాటన పేరు ఉంటుందా? ఉండదా?

బిచ్చగాళ్ళకి సమాజం అవసరం ఉందా? లేక సమాజానికి బిచ్చగాళ్ళ అవసరం ఉందా? అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఏ వృత్తులైనా ఆయా సమాజ అవసరాలకి తగ్గట్లుగానే ఏర్పడతాయి. చదువుకునే రోజుల్లో ఓవర్ బ్రిడ్జి పక్కన నేను ఎంతో ఇష్టంగా తిన్న ముంతకింద పప్పు అమ్మే ఆసామి డొంక రోడ్లో మూడిళ్లు కట్టించాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అతన్ని అమెరికా పంపిస్తే రెక్కాడితేనే గాని డొక్కాడని ఓ చిన్న ఉద్యోగం చేసుకునే వాడేమో! అలాగే అమెరికా దేశంలో 'పాయిఖానా కాగితం' వ్యాపారం చేసేవాడు మనూళ్ళో నోటు బుక్కుల వ్యాపారం మాత్రమే చెయ్యగలడు. అనగా ఒక సమాజం అవసరాల నుండే వ్యాపారాలు, వృత్తులు పుట్టుకొస్తాయి. కస్టమర్లు లేకుండా వ్యభిచార వృత్తితో సహా ఏ వృత్తీ మనజాలదు. అదే విధంగా బిచ్చం వేసేవాడే లేకపోతే బిచ్చగాళ్ళు ఎలా ఉంటారు?

అసలు 'బిచ్చగాడు' అనగా ఎవరు? ఎదుటివాడిని అర్ధించి వాడి ఆస్తిలో కొంత భాగాన్ని (అది చిల్లరైనా ఆస్తి ఆస్తే) ఆయాచితంగా పొందడాన్ని 'బిచ్చం' అందురు. అంటే అడిగేవాడి దుస్థితికి కరిగిపోయి జాలితో తనదగ్గరున్నదాన్లో తృణమో, పణమో 'దానం' చెయ్యాలి. దానం ఒక పుణ్యకార్యం. నాకు తెలిసిన చాలామందిలో బిచ్చం వెయ్యడంలో దయాగుణం కన్నా దానగుణమే ఎక్కువ. ఇక్కడ దానం ఫ్రీగా చెయ్యబడదు.. అంతకి నాలుగింతలు పుణ్యం సంపాదించడం కోసమే చెయ్యబడుతుంది. అనగా ఇది ఓ రకంగా వస్తుమార్పిడి, ఇంకోరకంగా వ్యాపారం!

దానం ఒక గొప్ప గుణం, ఎంతో కీర్తి ప్రదాయకం కూడా. అందుకే దానం చేసి శిబి చక్రవర్తి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కర్ణుడికైతే దానగుణం వ్యసన స్థాయికి చేరింది. అంచేత మిత్రమా! నువ్వు విదిల్చే రూపాయికి బిచ్చగాడు ఎంత లబ్ది పొందుతాడో తెలీదు కానీ.. నీకు మాత్రం స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అక్కడ రంభా ఊర్వశి మేనకల సాంగత్యం లభిస్తుంది. దానం చెయ్యడమన్నది స్వర్గంలో ఒక సీటు మీద కర్చీఫ్ వేసి రిజర్వు చేసుకోవటం వంటిదని నీవు గ్రహింపుము.

బిచ్చగాళ్ళ వలన సమాజానికి ఇంకా ఎన్నో మేళ్ళు జరుగును. అభిమాన సంఘాల వారు తమ అభిమాన నటుడి పుట్టిన్రోజప్పుడూ, వాడి పెళ్ళాం నీళ్ళోసుకున్నప్పుడూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించెదరు. ఆ సమయమందు బిచ్చగాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. మరప్పుడు బిచ్చగాళ్ళు లేని సమాజంలో మన నటుడిపై అభిమానం ఎట్లా చూపించుకోగలం? అస్సలు చూపించుకోలేం. అందువల్ల బిక్షగాళ్ళ వల్ల సమాజానికి లాభమే చేకూరుతుందని చెప్పుకోవచ్చు.

బిచ్చగాళ్ళ వల్ల మనకి మానసిక ప్రశాంతత కూడా లభించును. వాళ్ళే లేకపోతే మన్నెవరూ ఏమీ అర్ధించరు. మనం ఎవరికీ ఏమీ ఇవ్వలేం. అప్పుడు ఈ సమాజంలో మనం దరిద్రులమో, ధనవంతులమో మనక్కూడా తెలీదు. విసుగ్గా కూడా ఉంటుంది. అడవిలో జింకలు, కుందేళ్ళని పులులు, సింహాలు ఆకలేసినప్పుడు హాయిగా భోంచేస్తాయి. ఆకలిగా లేని సమయాల్లో కూడా.. తమని చూసి ప్రాణభయంతో భీతిల్లుతున్న అర్భక ప్రాణుల్ని చూస్తుంటే వాటికి ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అదే అడవిలో అన్నీ పులులు, సింహాలే అయితే వాటికీ విసుగ్గా ఉంటుంది.

బిచ్చం అంటే ఇంకోరకంగా కూడా చెప్పొచ్చు. తనదగ్గర లేనిదాన్ని, ఎదుటివాడి దగ్గర మాత్రమే ఉన్నదాన్ని అర్ధించడం కూడా బిచ్చం అనొచ్చు. ఐదేళ్ళకోసారి వచ్చే ఎలక్షన్లలో ఓటెయ్యమని రాజకీయ నాయకులు బిచ్చం అడగట్లేదా? నువ్వేదో దయగల మారాజులాగా బ్యాలెటు బాక్సులో ఓటు దానం చెయ్యట్లేదా? అటు తరవాత ఐదేళ్ళపాటు వాడే నీకు బిచ్చం విదల్చట్లేదా?

అసలు దేశాలే బిక్షాటన చేస్తున్నాయి గదా! తమ దేశంలోని పేదరికాన్ని షో కేస్ చేసి ప్రపంచ బ్యాంకు దగ్గర బిక్షాటన చెయ్యట్లేదూ? ఆ నిధులన్నీ ఏలినవారి కంపెనీల్లో పెట్టుబడిగా మారి వారి జేబుల్ని భారంగా మార్చట్లేదూ? మన బిక్షగాడు మాత్రం నిరంతరంగా బిక్షాటనకి బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండిపోవట్లేదా?

మన దైనందిన జీవితం బిక్షగాళ్ళతో ఇంతగా మమేకమైపోయి ఉన్నందువల్లనే బిక్షాటన ఒక వృత్తిగా వెలుగొందుతుంది. దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ విషయం 'మిస్సమ్మ'లో రేలంగి కూడా చెప్పాడు. అంచేత మనం ఒప్పుకొని తీరాలి. కావున మిత్రులారా.. శ్రీశ్రీ అన్నట్లు 'హీనంగా చూడకు దేన్నీ' అని వాక్రుస్తూ.. 'బిచ్చగాళ్ళ సంఘం వర్ధిల్లాలి' అని నినదిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

Wednesday 6 November 2013

నేను రచయితనవడం ఎలా?


అన్నా! రచయితనవడం నా జీవితాశయం. నా ఆశయం కోసం గత కొన్నాళ్ళుగా పడరాని పాట్లు పడుతున్నా. కానీ రచయితని మాత్రం కాలేకపోతున్నా. కొంచెం సలహా చెప్పన్నా.

- గురజాడ అంతటి వాణ్నవ్వాలని నెత్తిన తలపాగా పెట్టుకు తిరిగాను. 'కన్యాశుల్కం' తలదన్నే నాటకం రాద్దామనుకున్నాను. తలకి గాలాడక బుర్ర హీటెక్కి జుట్టూడిపోయింది గానీ ఒక్క ఐడియా రాలేదు.

- చాసో కథని పట్టుకుందామని అదేపనిగా చుట్టలు కాల్చాను. నోరు చేదెక్కింది తప్పించి ఒక్క కథా పుట్టలేదు.

- శ్రీరంగం నారాయణ బాబుని మరిపిద్దామని జులపాల జుట్టు పెంచాను. చమురు ఖర్చు పెరిగిందే కానీ పన్జరగలేదు.

- రావూరి భరద్వాజ కన్నా పెద్దగెడ్డం పెంచేసి జ్ఞానపీఠాన్ని కొడదామనుకున్నా. మూతి దురద తప్పించి.. జ్ఞానపీఠం కాదుగదా.. కనీసం ముక్కాలి పీట కూడా కొట్టలేకపోయ్యా.

- కారా మాస్టార్లా కారా కిళ్ళీ దట్టించి 'యజ్ఞం'కి బాబులాంటి కథ రాద్దామనుకున్నా. నోరంతా పొక్కి కథాయజ్ఞ యత్నం కాస్తా భగ్నమైపోయింది.

- శ్రీశ్రీ కన్నా గొప్పకవిత్వం కోసం ఫుల్లుగా మందు కొట్టాను. 'మహాప్రస్థానం' సంగతేమో గానీ మహామైకం ఆవహించింది.

- రావిశాస్త్రి వచనం కోసం సిగరెట్టు పీల్చాను. దగ్గొచ్చి కళ్లె పడింది గానీ.. కథ పళ్ళేదు. డాక్టరు బిల్లు చెల్లించి 'సొమ్ములు పోనాయండి' అనుకోవాల్సివచ్చింది.

- శివారెడ్డిలా శాలువా కప్పుకుని 'మోహనా! ఓ మోహనా!!' అంటూ కవిత్వాన్ని ఆహ్వానించాను. ఉక్కపోత తప్పించి కవిత్వం రాలేదు. దేవుడా! ఓ దేవుడా!! అని ఏడ్చుకున్నాను.

- గద్దర్ పాట కోసం నల్ల గొంగళీ భుజం మీద వేసుకుని చిందులు వేశాను. గొంగళీ వల్ల దురద, గంతుల వల్ల కాళ్ళు నొప్పులు మిగిలాయి.. తప్పించి పాట పెగల్లేదు.

తమ్ముడూ! నువ్వు అన్నీ చేశావు గానీ అసలుది మర్చిపోయ్యావు. మంచి రచయితవవ్వాలంటే ముందు జీవితాన్ని చదవాలోయీ! నీకు శుభం కలుగు గాక.

- అవునా అన్నా? ఎంతైనా నువ్వు చాలా తెలివైనోడివి. అందుకే ఇంతమందున్నా నిన్నే సలహా అడిగా. ఇంతకీ ఆ 'జీవితం' పుస్తకం ఎక్కడ దొరుకుతుందన్నా? వెంకట్రామా అండ్ కో లోనా? విశాలాంధ్ర బుక్ హౌజ్ లోనా?

(picture courtesy : Google)

Monday 4 November 2013

ధనికుడు - పేదవాడు

మనుషులు రెండు రకములు.

ఒకటి ధనికుడు. రెండు పేదవాడు

ధనికుడు ఏమి చేయును?

చెప్పాలంటే చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని..

- గనులు త్రవ్వును.

- పరిశ్రమలు స్థాపించును.

- కాంట్రాక్టు పద్ధతిన డ్యాములు నిర్మించును.

- ప్రజాప్రతినిధిగా ఎన్నికవును, ప్రజాసేవ చేయును.

- ఉగాది పర్వదినాన తెలుగుదనం కోసం పంచె కట్టుకొనును.

- కూతురికి సాంప్రదాయ నృత్యమునందు తర్ఫీదు ఇప్పించును.

- తెలుగు భాషా రక్షణకై కార్యక్రమములు నిర్వహించును.

- పుట్టిన్రోజున వికలాంగులకి మూడు చక్రాల సైకిళ్ళు పంపిణీ చేయును.

- సాయంకాలం క్లబ్బులో టెన్నిస్ ఆడి.. స్కాచ్ విస్కీ చప్పరించుచూ.. దేశము గూర్చి బాధ పడును.

సరె సరే! ధనికుడి గూర్చి వివరంగానే చెప్పావ్.

మరి పేదవాడు ఏమి చేయును?

ఏదో మాట వరసకి, పోలిక కోసం పేదవాడి ఊసు తెచ్చానే గానీ..

వాడసలు మనిషే కాదు.

వాడి గూర్చి రాయడం శుద్ధ దండగ!

Saturday 2 November 2013

తెలుగు వ్యూస్ చానెల్స్


పరిచయం :

ఆ మధ్య ఆర్టీసీ వాళ్ళు సమైక్యాంధ్ర అంటూ కొన్నాళ్ళు సమ్మె చేశారు (అటు తరవాత ముఖ్యమంత్రితో బేరం మాట్లాడుకుని సమ్మె విరమించారనుకోండి). తదుపరి భోరున వర్షాలు. ఇన్ని సమస్యల మధ్య సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు, నలిగిపోయ్యాడు, అవసరాల్ని ఆపుకున్నాడు.

అడవిలో ఆహార ప్రాణులు (అనగా ఆకులు, అలములు ముప్పొద్దులా సుష్టుగా మేసి, బాగా కండపట్టి.. ఆపై తీరిగ్గా సింహాలకి, పులులకి ఆహారం అయిపొయ్యే అర్భక ప్రాణులు) కష్టాల్లో పడితే వాటిని భుజించే జంతువులక్కూడా కష్టాలొస్తాయి. అదే విధంగా సామాన్యుని కష్టాల వల్ల, వారిపై ఆధారపడ్డ అనేక వృత్తుల వారికి కూడా కొన్నాళ్ళపాటు పన్లేకుండా పొయ్యింది.

ఒక కుట్ర :

వివేకవంతుడు తీరిక దొరికినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని మాత్రం దుర్వినియోగం చేస్తాడు. నేను అజ్ఞానిని కాబట్టి (ఈ విషయంలో నాకెటువంటి సందేహమూ లేదు), ఆ తీరిక సమయంలో ఎడాపెడా తెలుగు టీవీ చానెళ్ళు చూశాను. తద్వారా ఎంతో విజ్ఞానాన్ని, మరెంతో అజ్ఞానాన్ని సంపాదించాను. అజ్ఞానమైనా, విజ్ఞానమైనా నలుగురితో పంచుకుంటేనే సార్ధకత!

అదీగాక ఆ దిక్కుమాలిన టీవీ చానెళ్ళని చూసి ఎంతో విలువైన సమయాన్ని, మరెంతో విలువైన మనశ్శాంతిని కోల్పోయాను. నాకు కలిగిన ఈ నష్టానికి దుఃఖము మరియూ ఉక్రోశమూ కలుగుతుంది. బురదలో కూరుకుపోయ్యేవాడు వీలయితే పక్కవాడిని కూడా బురదలోకి లాగుతాడు. అదో తుత్తి. అంచేత నా తెలుగు టీవీ చానెళ్ళ వీక్షణానుభవాలు మీతో చదివించి, మీక్కూడా మనశ్శాంతి లేకుండా చెయ్యాలనే కుట్రలో భాగంగా ఈ పోస్టు రాస్తున్నాను.

కులం.. ఎంతో కమ్మనైనది :

మనదేశంలోని ప్రాంతీయ భాషలన్నింటిలోకి తెలుగులోనే న్యూస్ చానెళ్ళు ఎక్కువ. ఇది మనకి గర్వకారణం. తెలుగువారికి ప్రాంతాల వారిగా, కులాల వారిగా న్యూస్ చానెళ్ళు ఉన్నాయి. వీటిలో ఎక్కువ చానెళ్ళు ఒక కులం వారివే. మన తెలుగు సమాజంలో అత్యంత ఎక్కువ డబ్బులు ఆ కులం వారి చెంతనే ఉండుట చేత ఇది సహజ పరిణామం. ఆ చానెళ్ళకి ఎడిటర్లు కూడా ఆ ఓనర్ గారి కులం వాళ్ళే. ఇది కూడా సహజమే.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు తెలుగువాడికి జనులందు సకుల జనుల పట్ల మిక్కిలి ప్రీతి. ఇది అనాదిగా కొనసాగుచున్న ఆచారము. అందువల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లాగా చానెళ్ళ ఓనర్లు, ఎడిటర్లు ఒకే కులంవాళ్ళయితేనే వ్యాపారము అభివృద్ధి చెందును. ఈ సంగతి రాష్ట్రం బయటి వాడికి ఆశ్చర్యం కలిగిస్తుందేమో గానీ.. మనకి మాత్రం ఇదసలు విశేషమే కాదు.

ఇచట వార్తలు వండబడును :

వెనకటి కాలంలో చాదస్తపు పత్రికా సంపాదకులు వార్తల్ని ప్రచురించేప్పుడు ప్రజాహితమే పరమావధిగా భావించేవాళ్ళు(ట). ఇప్పుడు కూడా వార్తా సంస్థలకి హితమే ప్రధానం. అయితే అది ప్రజలకి సంబంధం లేని యాజమాన్యం వారి హితం. ఇది చాలాసార్లు ప్రజలకి అహితం కూడా.

నేతిబీరకాయలో నెయ్యుండదు. వార్తా చానెల్లో వార్తుండదు. అసలు ఈ చానెళ్ళు పేరుకి మాత్రమే వార్తా చానెళ్ళు. వాస్తవానికి ఇవి సొంత దుకాణాలు. వారి యాజమాన్య వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా వార్తల్ని వండుతుంటాయి. తమ రాజకీయ ఎజండాని అమలుచెయ్యడానికి అలుపెరగని ప్రయత్నం చేస్తుంటాయి.

ఒక చానెల్ మాత్రం మళ్ళీ దేవుడి పాలన రావాలని కోరుకుంటూ.. అందుకొరకు అనునిత్యం ఒక నాయకుణ్ణి (ఆయనే ఆ చానెల్ ఓనర్ కూడా) ఫాలో అవుతుంది. దాన్నిండా ఓనర్ గారి అనుకూల వార్తలు మాత్రమే ఉంటాయి. ఇదొకరకంగా భక్తి చానెల్ వంటిది. ఈ చానెల్ గూర్చి ఎవరికీ ఏ భ్రమలూ లేవు. కావున నో కంప్లైంట్స్.

వార్తాపత్రికల్ని కూడా నడిపే రెండు న్యూస్ చానెళ్ళు రెండు విడతలు ముఖ్యమంత్రిగా పనిచేసినాయాన్ని మళ్ళీ గద్దె మీద కూర్చుండ పెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంటాయి. ఇది వారి అప్రకటిత ఎజెండా. కానీ వారు ఈ విషయాన్ని చెప్పరు. అయితే వారేదో గొప్ప 'వార్తావిశ్లేషణ' చేస్తున్నట్లు పోజు కొడుతూ పొద్దస్తమానం తమ నాయకునికి అనుకూలంగా వార్తలు వ్రాయుదురు, చూపించెదరు. దీన్నే 'ప్రజల్ని మోసం చేయుట' అందురు.

దురదలందు నోటిదురద వేరయా :

పార్లమెంటరీ డెమాక్రసీలో ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వం తరఫున మంత్రులు ప్రకటన చేస్తారు. ఒక రాజకీయ పార్టీ విధానం గూర్చి ఆ పార్టీ తరఫున బాధ్యులు (కార్యదర్శి, అధికార ప్రతినిధి మొదలైనవారు) మాట్లాడతారు. ఈ ప్రకటనలకి మాత్రమే విలువ ఉంటుంది. ఇంకెవరు ఏం మాట్లాడినా ఆ మాటలకి విలువుండదు.

అయితే తెలుగునాట వందల కొద్దీ ఎమ్మెల్యేలున్నారు. డజన్ల కొద్దీ ఎంపీలున్నారు. వీరుకాక వేల కొద్ది మాజీలు ఉన్నారు. వీళ్ళంతా ప్రజానాయకులు. వీళ్ళల్లో చాలామందికి నోటిదురద ఉంది. ఆ దురద నాలుకని తుప్పు రేకుతో గోక్కున్నా తగ్గేది కాదు. అది టీవీ వాళ్ళతో సొల్లు కబుర్లు వాగితేనే తగ్గుతుంది. చానెళ్ళవారిక్కూడా ఇరవై నాలుగ్గంటలూ మసాలా వార్తలు కావాలి.

మన నోటి దురద నాయకులు ఎదుటి పక్షం వాణ్ని తిడుతూ రోజువారీగా ఇంటర్వ్యూలిస్తారు. ఆ తిట్లని టీవీవాళ్ళు లైవ్ కవరేజ్ ఇస్తూ ఆనందిస్తారు. ఇదొరకంగా ఇద్దరు దొంగలు ఒకరినొకరు సహకరించుకునే కార్యక్రమం. ఒకడు ఇంకోడిని గజ్జికుక్క అంటాడు. వాడు ప్రతిగా బురద పంది అంటాడు. అటుపై ఫలానావాడు నిజంగానే గజ్జికుక్కా? లేక బురద పందా? అనే రోజువారీ SMS ప్రోగ్రాముల చర్చా కార్యక్రమం నడుస్తుంటాయి.

ఆయా చానెళ్ళ వారు ఎగస్పార్టీ వారిని తిట్టిన ఉన్న తిట్లని పదేపదే చూపిస్తారు. ఎదుటివాడు తమ నాయకుడిని విమర్శించిన వార్తని అస్సలు చూపించరు. పైగా ఆ విమర్శ చేసిన నాయకుడిని చాలా హీనంగా చూపిస్తూ ఒక స్టోరీ రన్ చేస్తారు. ఈ విషయాల్లో కనీస స్థాయి మర్యాద చూపించరు. ఈ కళలో మన చానెళ్ళకి ఎవరూ సాటి రారు.

చర్చలా అవి! కాదు కాదు.. అరుపులు, కేకలు :

ఇక టీవీ చర్చలు. అవి చూస్తుంటే కొద్దిసేపట్లోనే అక్కడున్నవారికి కనీస స్థాయిలో పరిజ్ఞానం లేదన్న వాస్తవం అర్ధమవుతుంది. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. అందుకే గందరగోళంగా ఒకేసారి మాట్లాడతారు. ఈ చర్చల్లో న్యూట్రల్ ఎంపైర్ లా పత్రికలకి సంబంధించిన ఒక పన్లేని వ్యక్తిని కూడా కూర్చోపెడతారు. కానీ ఆయనకి మాట్లాడే చాన్స్ ఎప్పుడో గానీ రాదు. వచ్చినా ఆయన ఏం చెబుతాడో మనకి అర్ధం కాదు.

ఈ టీవీల వాళ్ళకి అప్పుడప్పుడు ఏక్ దిన్ కా సుల్తాన్లు కూడా దొరుకుతుంటారు. మొన్నామధ్య అన్ని టీవీ చానెళ్ళ వాళ్ళు ఒక ఎన్జీవో నాయకుణ్ణి రోజువారీ, గంటల వారీ ఇంటర్వ్యూ చేసి పీల్చి పిప్పి చేశారు. ఆయన్ని మామిడి రసం పిండినట్లు పిండేశారు. ఇప్పుడాయనలో టెంక తప్ప ఏమీ మిగల్లేదు. ఇదీ టీవీల వాళ్ళ జగన్నాటాకం!

నా గోల :

నేన్రాసినవన్నీ అసలు విశేషాలే కాదు. ఇవన్నీ రోజువారీగా టీవీ చూసేవాళ్ళకి అనుభవమే. కాకపొతే 'ఈ గొప్ప అనుభవం' నాకు ఈ మధ్యనే అయ్యింది. పంటి నొప్పి గూర్చి రాయాలంటే పంటికి నొప్పి కలగాలి. వీపు దురద గూర్చి రాయాలంటే ఆ దురద అనుభవంలోకి రావాలి. అప్పుడే మనసులోని ఆవేదన, కసి రచన రూపంలో తన్నుకొస్తుంది. నాకీ చానెళ్ళ విశ్వరూప దర్శన భాగ్యం ఈమధ్యనే కలిగింది. ఇప్పటిదాకా ఈ చానెళ్ళ వీక్షణ ఇంతటి వ్యధాభరితమని తెలీదు.

అసలీ టీవీ లెందుకు? :

ఈ టీవీ చానెళ్ళ వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా?

అసలు చానెళ్ళు సమాజానికి సేవెందుకు చెయ్యాలి?

రియల్ ఎస్టేట్, విద్యావైద్య రంగ మాఫియాలు సంపాదించిన డబ్బుల్తో టీవీలు పెట్టింది సొమ్ము చేసుకోడానికీ, రాజకీయ ప్రాపకం కోసం మాత్రమే. ఇందులో ప్రజాశ్రేయస్సు లాంటి ఆలోచనలకి తావు లేదు.

ప్రజా సమూహంలో గొప్ప మేధావి నుండి నిఖార్సైన అజ్ఞాని దాకా అనేక రకాల వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ టీవీ రాజకీయ వీరుల గూర్చి రకరకాలైన అభిప్రాయాలున్నాయి.

1. ఈ టీవీల్లో కనిపించేవాడు పనిలేనివాడనీ, పనికిమాలిన వాడనీ చాలామందికి సరైన అవగాహనే ఉంది.

2. అతి తక్కువ మంది మాత్రం పొద్దస్తమానం టీవీలో కనిపించేవాడే ఓ మోస్తరు నాయకుడు అనుకుంటారు.

3. కొందరికి టీవీ రాజకీయ నాయకుల మీద సదభిప్రాయం ఉండదు. కానీ వారీ చర్చల్ని ఎంజాయ్ చేస్తారు. అదో టైపు మనస్తత్వం. వారికి పంపు దగ్గర తగాదాలు, టీ బడ్డీల దగ్గర బూతుల దండకం కూడా చాలా ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది.

జనాలు తెలివి మీరారు. కొన్నాళ్ళు సినిమాలు, ఇంకొన్నాళ్ళు క్రికెట్ మ్యాచులు, మరికొన్నాళ్ళు ఈ టీవీ చర్చల్ని సీజనల్ గా వీక్షిస్తుంటారు. చివరాఖరికి ఎలెక్షన్లప్పుడు బాగా ఆలోచించి తమ కులం పార్టీకో, డబ్బులిచ్చిన వాడికో ఓటేస్తారు.

ఏ పుట్టలో ఏ పాముందో! :

మరప్పుడు న్యూస్ చానెళ్ళు చెవి కోసిన మేకల్లా (మేకలూ! నన్ను మన్నించండి) అదే పనిగా తమ ప్రచారం ఎందుకు చేస్తుంటాయి? శ్రీకృష్ణుడు గీతలో ఏమని చెప్పాడు? నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు, ఫలితాన్ని నాకొదిలెయ్యి అన్నాడు. అందువల్ల - ఏమో! ఎవరు చెప్పొచ్చారు? తెలుగువాళ్ళంతా వెధవన్నర వెధవలై, బుర్ర చచ్చిపొయ్యి ఆ టీవీవాడు చెప్పిందే నిజమని నమ్మి గొర్రెల మందలా (గొర్రెలూ! నన్ను క్షమించండి) ఓట్లేస్తారేమో! ఏ పుట్టలో ఏ పాముందో కదా!

ఉపసంహారం :

మిత్రులారా! ఇంతటితో నా టీవీ చానెళ్ళ ఆలోచనలు రాయడం పూర్తయ్యింది. ఈ విధంగా సమ్మె సందర్భంగా, వర్ష కారణంగా  అనుకోకుండా దొరికిన తీరికని ఎంతో ఘోరంగా దుర్వినియోగం చేసుకున్నానని (కుంచెం సిగ్గుపడుతూ) తెలియజేసుకుంటున్నాను.

ఇష్టమైన విషయాలపై ఎంతైనా రాయొచ్చు. అది చాలా తేలిక కూడా. నచ్చని సంగతుల్ని రాయాలంటేనే బహుకష్టం. ఆ సంగతీ పోస్టు రాస్తున్నప్పుడు అర్ధమైంది. కానీ మీ సమయం కూడా వృధా చెయ్యాలనే తీవ్రమైన దురాలోచనే నాచేత ఈ పోస్టు రాయించింది. అమ్మయ్య! ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది.

(photo courtesy : Google)