Saturday, 27 May 2017

'సూపర్ కాప్'పంజాబ్ 'సూపర్ కాప్' గిల్ వృద్దాప్యంతో చనిపొయ్యాట్ట. ఈ సూపర్ కాప్‌ల పట్ల మధ్యతరగతి మేధావుల్లో ఆరాధనా భావం వుంది. అయితే వారి ఆరాధనలో కొంతభాగం సూపర్ కాప్ సృష్టించినవారికి చెందాలని డిమేండ్ చేస్తున్నాను. యెవరా సృష్టికర్తలు? యేమా కథ?

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగర్ బత్తీ అయితే పాలకులకీ ప్రజలకీ అనుసంధానమైనది పోలీసు వ్యవస్థ. కాబట్టే పోలీసు వ్యవస్థని పాలకులు తమ కనుసన్నల్లో నడుచుకునేట్లు చూసుకుంటారు. అప్పుడు పోలీసు వ్యవస్థ నేరాల్ని అదుపు చేస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' అదుపు అయ్యుంటుంది, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుంది - కానీ అది పాలకులకి 'అనుకూలమైన' నిస్పాక్షికత అయ్యుంటుంది.

రాజకీయ వ్యవస్థలో అధికార పక్షం, ప్రతిపక్షం వైరిపక్షాలని అనుకుంటాం గానీ, వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకటే! చదరంగంలో నలుపు తెలుపు పావులకున్న తేడా మాత్రమే వుంటుంది. అధికారంలో ఉన్నవారిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు అధికార పక్షం  రాజకీయ చదరంగం అడుతుంటాయి. ఇవన్నీ దాయాదుల మధ్య పొలం గట్టు తగాదాలు.. ప్రజలకి యే మాత్రం సంబంధం లేని వ్యవహారాలు.

ఇలా రాజకీయ పక్షాలు ఒకళ్ళకొకళ్ళు హేపీగా నిప్పెట్టుకొంటుండగా.. ఒక్కోసారి నిప్పు కాస్తా మంటగా మారి.. ఆపై అగ్నిప్రమాదంగా మారిపోయి.. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది (ఇందుకు ఇందిరా గాంధీ - భింద్రన్‌వాలె ఉదంతం ఒక ఉదాహరణ). 

అప్పుడు పాలకులు కొత్త ఎత్తుగడలేస్తారు. అగ్నిప్రమాదాన్ని అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్‌ని దించుతారు. ఆ ఫైర్ ఫైటరే కనిపించని నాలుగో సింహమైన సాయికుమార్! బోనులోంచి బయటకొచ్చిన ఈ నాలుగో సింహానికి సింహం హక్కుల పట్ల తప్పించి ఇతరుల హక్కుల పట్ల నమ్మకం వుండనందున.. మానవ హక్కుల్ని విచ్చలవిడిగా హరించేస్తూ.. యథేచ్ఛగా మారణ కాండ సాగిస్తూ.. పరిస్థితిని 'అదుపు'లోకి తెస్తుంది. 

ఇప్పుడో ధర్మసందేహం. అసలీ కనిపించని నాలుగో సింహం సాయికుమార్ దేనికి? పాలకులే ప్రత్యక్షంగా రంగంలోకి దిగొచ్చుగా? దిగొచ్చు, కానీ సాయికుమార్ పద్ధతుల్తో ప్రభుత్వాలకి ఇబ్బందులున్నాయ్, తేడా వొస్తే వ్యవహారం బెడిసికొడుతుంది. అలాంటి తేడానే వస్తే సాయికుమార్‌నే బలిపశువు చేసి ప్రజాస్వామ్య విలువల్ని 'కాపాడొచ్చు' - ఇదొక win win situation, అందుకని!

పాలకులకి పోలీసు వ్యవస్థని వాడటంలో ఖచ్చితమైన పద్దతులున్నాయి. పోలీసు వ్యవస్థ పద్ధతిగా - అస్మదీయుల పట్ల అక్కినేని నాగేశ్వరరావు కన్నా సున్నితంగా వుంటుంది, తస్మదీయుల పట్ల ఆర్.నాగేశ్వరావు కన్నా క్రూరంగా వుంటుంది. ఈ సూత్రం గుర్తుంచుకుంటే పోలీసు వ్యవస్థ - గోరక్షకులు, శ్రీరామసేన, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పట్ల వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

'సూపర్ కాప్' సాయి కుమార్ బోనులో సింహంలాంటివాడు, రాజ్యం అవసరమైనప్పుడు మాత్రమే బోను తలుపులు తెరుస్తుంది. అందుకే అతను 1984 లో ఢిల్లీలో కనపళ్లేదు, 2002 లో గుజరాత్‌లోనూ కనపళ్లేదు. ఎందుకు కనపళ్ళేదో ఈ పాటికే మీకు అర్ధం అయ్యుంటుంది, కాబట్టి విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.

(fb post 27/5/2017)

Friday, 26 May 2017

అరుంధతీ రాయ్


చూడమ్మాయ్ అరుంధతీ రాయ్!

చక్కటి పేరు, మొహంలో లక్ష్మీదేవి కళ, మొదటి రచనతోనే అంతర్జాతీయ గుర్తింపు. ఆడపిల్లకి ఇంతకన్నా ఇంకేం కావాలి?

బోల్డన్ని బుక్ రిలీజు ఫంక్షన్లు, శాలువా సన్మానాలు, సినిమా అవకాశాలు, పద్మ ఎవార్డులు నీకోసం యెదురుచూస్తుంటే.. నువ్వేం చేశావ్?

యేమాత్రం తెలివి లేకుండా -

నర్మదా బచావో అన్నావ్! నక్సలైట్లతో తిరిగావ్! ఆదివాసీ హక్కులన్నావ్! కాశ్మీర్ ప్రతిపత్తి అన్నావ్!

ఆహ్లాదకర జీవితాన్ని వద్దనుకుని రాజ్యానికి వ్యతిరేకంగా మారిపొయ్యావెందుకు?!

ఇప్పుడు నీకర్ధమైందా?

ఈ దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తాం, మాతృమూర్తిగా గౌరవిస్తాం.

కానీ -

స్త్రీ "అభిప్రాయాలు" కలిగుంటే మాత్రం తాట తీస్తాం, బూతులు తిడతాం, బెదిరిస్తాం, అణగదొక్కడానికి యెంత స్థాయికైనా దిగజారతాం!

(fb post 26/5/2017)

Wednesday, 24 May 2017

తీవ్రవాద గొట్టంగాళ్ళు


సినిమాలు తీసేవాళ్ళు అదృష్టవంతులు. సినిమాగా ఓ కథని అనుకుంటారు, నెలల తరబడి ప్రణాళికలేస్తారు, తరవాతే తాపీగా సినిమా తీస్తారు. ఈ సౌకర్యం టీవీల వాళ్లకి లేదు, ఎందుకంటే వాళ్లకి ప్రతిరోజూ ఒక సినిమానే! రోజూ ఏదొక juicy story పట్టుకోవాలి, దాన్నుండి రోజంతా జ్యూస్ పిండుతూ టెంపో maintain చెయ్యాలి.

వాస్తవానికి మనం న్యూస్ చానెల్స్ అని పిల్చుకుంటున్నవి న్యూస్ చానెల్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ - వీటిల్లో ఆవేశం ఉంటుంది గానీ వార్తలుండవు. న్యూస్ ఏంకర్లుగా మనం పీల్చుకుంటున్నవాళ్ళు ఏంకర్లు కాదు, బఫూన్లు!

యెలా చెప్పగలవ్? 

సింపుల్! ఈ దేశంలో యేటా వేలాదిమంది పిల్లలు పోషకాహార లోపాల్తో చనిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇవి చాలా పెద్దవార్తలు కావాలి. కానీ టీవీల వాళ్లకి ఇవసలు వార్తలే కాదు!

మరి వీరికి వార్తలేమిటి?

పేజ్ 3 వారి అసహజ మరణాలు! ఇవి మాత్రం వారాల తరబడి లాగుతారు. వీటితో ప్రజలకేం సంబంధం? తెలీదు!

శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చనిపోయింది. పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా టీవీల వాళ్ళు 'మర్డర్' మిస్టరీని తమదైన శైలిలో పీకి  పాకం పెట్టారు. తరవాత పోలీసులు కేసు కోర్టుకి పంపారు. విషయం అక్కడితో అయిపొయింది. 

ఈమధ్య అర్ణబ్ గోస్వామి అనే కేకాగ్రేసరుడు సొంతదుకాణం పెట్టాడు. ఈ దుకాణానికి అధిపతి ఎన్డీయే నాయకుడు, శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ సీటుపై కన్నేసినవాడు. అందువల్ల మన కేకల మాంత్రికుడు అర్జంటుగా సునంద పుష్కర్ కేసు యెత్తుకున్నాడు, ఆధారాలంటూ  యేవో పాత టేపులు వినిపించి శశి థరూర్ ఒక 'హంతకుడు' అని తేల్చేశాడు. 

తేల్చేసిన దరిమిలా - గోస్వామి తన తీవ్రవాద గొట్టం గాళ్లనీ థరూర్ మీదకి తోలాడు. గొట్టాలకి సమాధానం చెప్పకపోతే శశి థరూర్ పారిపోతున్నాడు అంటాడు! చెబితే మీడియాపై దాడి అంటాడు! అంటే ఇదో win-win situation అన్నమాట!

ప్రభుత్వ సేవలో పూర్తి స్థాయిలో పునీతం అయిపోడం, సైన్యాన్ని కీర్తించడమే దేశభక్తికి పరాకాష్టగా ప్రచారం చెయ్యడం కేకాధాముడి ఛానెల్ పాలసీ! అందుకే సంఘపరివార్ శక్తులు అరుంధతి రాయ్ ఇచ్చిందని ప్రచారం చేసిన (లేని) ఇంటర్వ్యూ ఆధారంగా, ఆమెపై తట్టల కొద్దీ బురద చల్లే ప్రోగ్రామ్ రోజువారీగా తలెత్తుకున్నాడు. 

అర్ణబ్ గోస్వామి వాచాలత్వాన్నీ, రౌడీయిజంనీ గొప్ప జర్నలిజంగా భావించేవాళ్లు.. ఈ చౌకబారు ట్రిక్కుల్ని ఆసక్తిగా చూసే చౌకబారు వీక్షకులు వున్నంతకాలం మనం ఈ చెత్తని భరించక తప్పదు. ఆలస్యంగానైనా ఈ చెత్త కొట్టుకుపోతుంది భావిస్తున్నాను.

(fb post 24/5/2017)

Sunday, 21 May 2017

కేరళ అమ్మాయి సర్జికల్ స్ట్రైక్


కేరళలో ఒక యువతి తనపై సంవత్సరాలుగా రేప్ చేస్తున్న ఒక దొంగసన్నాసి గాడి  penis ని కత్తిరించేసింది. ఇది సరైన చర్యనీ, ఈ అమ్మాయిని role model గా తీసుకుని దుష్టులైన అబ్బాయిలకి penis అనేదే లేకుండా కత్తిరించి పడెయ్యాలని టీవీల్లో 'మీడియా' సంఘ సంస్కర్తలు యెలుగెత్తి ఘోషించారు. వారి ఆవేశం చూసి ఆందోళన చెందాను.

ఎందుకు?

బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతుందంటారు. సిగ్మన్డ్ ఫ్రాయిడ్ చెప్పిందీ నిజమయ్యిందనిపిస్తుంది! ఫ్రాయిడ్ developmental psychology లో phallic stage గూర్చి చెబుతూ castration anxiety గూర్చి మాట్లాడాడు. ఆయన ఒకందుకు చెప్పినా, మనకి ఇంకొకందుకు నిజమవుతుంది!

ఇకపై - స్త్రీలు / అమ్మాయిలు మగవాడి penis కత్తిరించేసి, మాపై అత్యాచారం జరిగిందంటే అందరూ (ముఖ్యమంత్రితో సహా) చప్పట్లు కొడతారు. పైగా ఆ penis కోల్పోయినవాడు యేదో యాక్ట్ క్రింద జీవితాంతం జైల్లో మగ్గిపోతాడు (వాడి చావు వాడు చస్తాడు).

మన సమాజం ఈ 'మీడియా' సంఘసంస్కర్తల చప్పుడు సాయంతో, తొందర తొందరగా lynch-mob mentality ని adopt చేసుకుంటుందని అనుకుంటున్నాను.

సరే! అత్యాచారాలకి penis కత్తిరించెయ్యడం సరైన శిక్ష అన్నవారి అభిప్రాయాన్ని గౌరవిద్దాం.

ఈ దేశంలో అత్యాచారాలకి గురయ్యేవారిలో అత్యధికులు దళిత, ఆదివాసీ మహిళలు. ఈ బాధిత మహిళలు కత్తిరించడం మొదలెడితే చాలామంది 'అగ్రకుల' మగవాళ్ళకి, పోలీసులకి penises వుండవు! అప్పుడు కూడా వీరు ఇదే vehemence తో instant justice ని సమర్ధించాలని కోరుకుంటున్నాను!

(fb post 21/5/2017)

Saturday, 20 May 2017

అభిమానుల బానిసబుద్ధి

మనం ఇనుప వస్తువుల్ని వాడకపోతే అవి తుప్పట్టిపోతాయి. అలాగే - శరీరంలో యేదన్నా భాగాన్ని సరీగ్గా వాడకపోతే అది atrophy అయిపోతుంది. కొత్తవిషయాల్ని తెలుసుకోవడం, ఆలోచించడం, మనని మనం refine చేసుకోవడం.. ఇవన్నీ నిరంతర ప్రక్రియలు. ఇలా చెయ్యకపోతే మెదడుకి పని తక్కువవుతుంది.. బద్దకంగా అయిపోతుంది.. ఆలోచించడం మానేస్తుంది.

మన సినిమా హీరోల అభిమానులు మెదడు వాడటం మానేసిన శాపగ్రస్తులని నా నమ్మకం. బానిస వ్యవస్థ రద్దైనా, బుర్రలో కొండంత బానిసబుద్ధితో బ్రతికేసే ఈ అమాయకుల్ని చూసి జాలి పడదాం!

యెందుకు?

మనిషితో పోలిస్తే కుక్క మెదడు సైజ్ తక్కువ, అంచేత కుక్కకి బుర్ర తక్కువ, కాబట్టే అది తన యజమాని పట్ల విశ్వాసంగా వుంటుంది. ఇలా విశ్వాసంగా పడుండటం తప్ప కుక్కకి వేరే చాయిస్ లేదని మనం గుర్తుంచుకోవాలి. మెదడు సైజ్ పెద్దదిగా వుండి, ఆలోచించే చాయిస్ వుండికూడా కుక్కలా విశ్వాసపాత్రంగా జీవించడం దురదృష్టం కాక మరేమిటి?!

అంచేత ఈ సినిమా హీరోల అభిమానుల్ని చూసి మనం జాలిపడాలే తప్ప విసుక్కోకూడదని నా అభిప్రాయం.

(fb post 20/5/2017)

Friday, 5 May 2017

న్యూస్ చానెళ్ళ వ్యాపారతత్వం


ఇండియా టుడే టీవీలో రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్భయ తలిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. తన కూతురు కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష వెయ్యాలనేది బాధితుల డిమేండ్. నిర్భయ చనిపోవడం కన్నా చంపేసిన విధానం అత్యంత పాశవికం. ఒక వ్యక్తి మరణం యే కుటుంబానికైనా తీరని నష్టం, దాన్ని ఏం చేసినా భర్తీ చెయ్యలేం. కాబట్టి ఆ తలిదండ్రుల వేదనా, కోపం అర్ధం చేసుకోవచ్చు.  

కొద్దిసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. 

రాచరికాలు పొయ్యాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చాయి. ఫలానా నేరానికి ఫలానా శిక్ష అని రాజ్యాంగబద్దంగా రాసుకున్నాం. దీన్ని Code of Criminal Procedure (CrPC) అంటారు. ఒక నేరం జరుగుతుంది, అప్పుడు పోలీసు వ్యవస్థ రంగంలోకి దిగి నేరాన్ని పరిశోధిస్తుంది, నిందితులపై నేరారోపణ చేస్తూ ఛార్జ్ షీట్ తయారుచేసి జుడీషియరీ వ్యవస్థకి సమర్పిస్తుంది. కోర్టు సాక్ష్యాధారాలతో నేరవిచారణ చేస్తుంది. నేరం రుజువైతే నిందితుడు నేరస్తుడవుతాడు, ఆయా సెక్షన్లని బట్టి కోర్టు శిక్ష విధిస్తుంది. తాము నిరపరాధులమనో, శిక్ష మరీ యెక్కువనో పైకోర్టులో అప్పీల్ చేసుకునే అధికారం నేరస్తులకు ఉంటుంది. 

పోలీసుల కేసు పరిశోధన, కోర్టు విచారణ మొదలైన ప్రొసీజర్లు (డాక్టర్లు ఆపరేషన్ చేసినట్లుగా) పూర్తిగా సాంకేతికమైనవి. అవి ఆయా సంస్థలు మాత్రమే చెయ్యగలిన నిపుణతతో కూడుకున్న వ్యవహారం. యే వ్యవస్థా లోపాలకి అతీతం కాదు, ఆయా వ్యవస్థల్లోని లోపాలు కూడా రాజ్యాంగబద్ధంగానే సవరింపబడాలి, ఇంకే రకంగా కాదు. అంచేత CrPC లో కూడా దేశకాల పరిస్థితుల బట్టి, ప్రజాభిప్రాయం మేరకు రాజ్యాంగబద్ధంగా సవరణలు జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణ ఢిల్లీ ఆందోళన తరవాత వచ్చిన Nirbhaya Act

ఇప్పటిదాకా - నేను రాసింది చిన్నవిషయం, పురాతన విషయం. కానీ ఈ మాత్రం జ్ఞానం లేకుండా మన టీవీ చానెళ్లు వార్తల్నీ, చర్చల్నీ వినోదస్థాయికి దించేశాయి, కనీస బాధ్యత లేకుండా తయారయ్యాయి. చిల్లరకొట్టు వ్యాపారం లాగే టీవీ చానెళ్లదీ వ్యాపారమే, వ్యాపారం తప్పు కాదు. కానీ - పోటీతత్వం వ్యాపారతత్వాన్ని యెంత హీనానికైనా దిగజార్చేస్తుందా?!

కోర్టు నిర్భయ కేసు నిందితుల్ని దోషులుగా తేల్చింది. శిక్ష విషయంలో పైకోర్టు ఖరారు చేసింది. ఇది పూర్తిగా సాంకేతిక అంశం. ఈ సమయంలో నిర్భయ తలిదండ్రుల్ని టీవీ స్థూడియోల్లో కూర్చోబెట్టి రెచ్చగొట్టడం రాజదీప్ సర్దేశాయ్ ఆడుతున్న TRP నాటకం, మధ్యతరగతి మేధావుల కోసం వండిన మసాలా కూర. 

టీవీ స్థూడియోలో హత్యల్ని ప్రోత్సాహిస్తాయనేదానికి మన రాష్ట్రంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ మంచి ఉదాహరణ. ఇలాంటి విషయాల్ని అర్ధం చేసుకోవాలంటే కన్నాభిరాన్, బాలగోపాల్, బొజ్జా తారకం వంటి నిపుణులు రాసిన వ్యాసాలు చదవాలి. అయితే ఇవ్వాళ యెక్కువమందికి అభిప్రాయాలే ఉంటున్నాయి కానీ విషయాన్ని చదివి అర్ధం చేసుకునే ఓపిక ఉండట్లేదు. సరీగ్గా వీరికోసమే టీవీ చానెళ్లు చర్చావినోదాన్ని వండి వారిస్తున్నాయి.

'జబర్దస్త్' కామెడీ షో పట్ల ఎవరికీ భ్రమలు ఉండవు, కాబట్టి సమాజానికి హానికరం కాదు. అయితే ఈ టీవీ చానెళ్ల చర్చా కార్యక్రమాలు ఒక హిడెన్ ఎజెండాతో సాగుతుంటాయి, కాబట్టే ఇవి చాలా హానికరం. నాకీ టీవీ చర్చల పట్ల అప్పుడప్పుడూ కోపం వస్తుంటుంది. అలాంటప్పుడు నేను రెండు పన్లు చేస్తాను. ఒకటి - ఇట్లా నాలుగు వాక్యాలు కెలకడం, రెండు - చిత్తూరు నాగయ్యలా దీర్ఘంగా నిట్టూర్చడం!