Monday, 30 December 2013

అన్యోన్య దాంపత్యం


గజలక్ష్మి, గజరాజులు భార్యాభర్తలు. వారిది విశాలమైన ఇల్లు. ఆ ఇంట్లో ఓ విశాలమైన హాలు. ఆ హాల్లో ఓ విశాలమైన సోఫా. ఆ సోఫాలో తమ విశాలమైన శరీరాల్ని ఇరుకిరుగ్గా సర్దుక్కూర్చునున్నారు.

గజరాజు ఓ రాజకీయ నేత. ప్రజాప్రతినిధి. కొన్నేళ్లుగా తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశాడు.

ఫలితంగా ఓ పది ఫేక్టరీలు, వెయ్యెకరాల భూమిని సమకూర్చుకోగలిగాడు.

ప్రస్తుతం భార్యాభార్తలిరువురూ ఒక టీవీ వారికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

గత కొన్నేళ్లుగా తెలుగు టీవీ చానెళ్ళకి క్రియేటివిటీ కరువైపోయ్యి.. ఏవేవో దిక్కుమాలిన కాన్సెప్టుల్తో ప్రోగ్రాములు చుట్టేస్తున్నారు.

'చిలకా గోరింకల అన్యోన్య దాంపత్యం' అనే ప్రోగ్రాం గత కొన్నాళ్ళుగా టీవీ 420 లో విశేష ప్రజాదరణ పొందింది.

ప్రోగ్రాంలో ప్రతివారం ఒక 'ప్రముఖ జంట'ని పనీపాటా లేని వీక్షకులకు పరిచయం చేస్తుంటారు.

గజలక్ష్మి అత్యంత బరువైన పట్టుచీర, మరింత బరువైన నగలతో కళకళలాడుతుంది.

గజరాజు తెల్లబట్టల్లో అచ్చు గోరింకలా మెరిసిపోతున్నాడు.

ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి వచ్చీరాని తెలుగులో ఏవో ప్రశ్నలడుగుతూ.. వారిచ్చే సమాధానాల్ని బోల్డంత ఆసక్తిగా వింటుంది.

"మా ఆయన బంగారం. అహోరాత్రులు కుటుంబం గూర్చే ఆలోచిస్తుంటారు. అప్పటికీ చెబుతూనే ఉంటాను.. మరీ తీవ్రంగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుందని. ఏదీ వింటేనా?" గజలక్ష్మి మురిపెంగా చెప్పింది.

"నా భార్య ఉత్తమురాలు. అనుక్షణం నా అవసరాలు కనిపెడుతూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది నా అదృష్టం." అపురూపంగా భార్యని చూసుకుంటూ అన్నాడు గజరాజు.

"రాబోయే వంద జన్మలక్కూడా ఈయనే నాకు భర్తగా లభించాలని రోజుకి వందసార్లు దణ్ణం పెట్టుకుంటాను." భక్తిగా అంది గజలక్ష్మి.

ఇలా అనేక ముచ్చట్లతో ఇంటర్వ్యూ ముగిసింది.

బుల్లితెరపై వచ్చేవారం మీ ఇంటర్వ్యూ చూసుకోండని చెప్పి టీవీ వాళ్ళు సర్దుకున్నారు.

ఓ రెండు నిముషాలు నిశ్శబ్దం.

సిగరెట్ వెలిగించాడు గజరాజు.

"ఈ జన్మకి పెట్టే హింస చాలదా? రాబోయే వంద జన్మలకి నీ దరిద్రపు మొహమేనా?" వెటకారంగా అన్నాడు గజరాజు.

గజలక్ష్మి గయ్యిమంది.

"మాటలు జాగ్రత్తగా రానీ. నీగూర్చి నాలుగు మంచి ముక్కలు చెప్పినందుకు సంతోషించు. నీ తిరుగుళ్ళ గూర్చి చెప్పానా? దందాల గూర్చి చెప్పానా?"

"ఛీపో! నీలాంటి దరిద్రప్ముండతో నాకు మాటలేంటి!" ఈసడించుకున్నాడు గజరాజు.

"ఛీఛీ పొప్పో! నీలాంటి పోరంబోకుల్తో మాట్లాడేదేంటి?" అసహ్యించుకుంది గజలక్ష్మి.

అయ్యా! అదీ సంగతి!

మీరందరూ వచ్చేవారం ఈ అన్యోన్య దంపతుల ప్రోగ్రాం చూసి తమ విలువైన అభిప్రాయం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

(picture courtesy : Google)

Friday, 27 December 2013

సన్మానాలు - శాలువాలు

ఈ సంవత్సరం 'కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం' ప్రముఖ రచయిత డాక్టర్ వి.చంద్రశేఖరరావుకి లభించిందని చదివి సంతోషించాను.

డాక్టర్ చంద్రశేఖరరావు గుంటూరు మెడికల్ కాలేజిలో నాకు క్లాస్మేట్. ఎనాటమీ డిసెక్షన్లో నా బాడీమేట్ (ఇద్దరం ఒకే శవాన్ని పంచుకున్నాం). ఆరోజుల్లో మంచి స్నేహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడీ ముక్కలు ఇక్కడ రాయడం 'చంద్రబాబు నాయుడు నా స్నేహితుడు' అని చెప్పుకోవడం వంటిదని నాకు తెలుసు.

చదువైపొయ్యాక ఆతను రైల్వే ఉద్యోగంలో చేరాడు (రైల్వే భాషలో చెప్పాలంటే - లూప్ లైన్లోకి వెళ్ళాడు). కనుక నాకు అతన్ని కలిసే సందర్భాలు పెద్దగా రాలేదు. ఎప్పుడన్నా కలిసినా మా సంభాషణ 'బాగున్నావా?' మించి పెద్దగా ముందుకు సాగలేదు.

మొన్నామధ్య 'నీ బ్లాగులు చదువుతున్నాను. బాగున్నాయి.' అన్నాడు. నేనైతే నమ్మలేదు. అతనికి నా బ్లాగు చదివేంత తీరిక ఉండదు, పొరబాటున చదివినా నచ్చే అవకాశం లేదని నా నమ్మకం. ఈ పోస్టు చంద్రశేఖరరావు గూర్చి కాదు కనుక అతని ప్రస్తావన ఇంతటితో ఆపేస్తాను.

'అరసం' (అభ్యుదయ రచయితల సంఘం) వారు ఈ నెల 28 న జరిగే పురస్కార సభలో డాక్టర్ వి.చంద్రశేఖరరావుని 10,116 నగదుతో సత్కరిస్తార్ట, శాలువా కూడా కప్పుతార్ట. నాకు ఆశ్చర్యం వేసింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి - 116 అంకె పవిత్రతపై కమ్యూనిస్టులక్కూడా మోజు ఉండటం. రెండు - శాలువాల సంస్కృతి ఇంకా కొనసాగుతుండటం. ఏవిటో.. 'అరసం' పేరులో అభ్యుదయం.. ఆచరణలో మాత్రం సనాతనం.

ఇప్పుడు కొద్దిసేపు శాలువా కబుర్లు చెప్పుకుందాం. పెళ్ళిలో మంగళ సూత్రం ఎంత ముఖ్యమో సన్మానానికి శాలువా కూడా అంతే ముఖ్యం. అసలీ సన్మానాలల్లో శాలువాలెందుకనేది నాకు అర్ధం కాదు. బహుశా శాలువాల వ్యాపారం చేసేవాళ్ళని బాగుచెయ్యడానికేమో!

(ఏదో రాసేసుకుంటూ పోతున్నాను. ఈ శాలువాకి ఏదైనా ఘనచరిత్ర, పరమ పవిత్రత ఉందేమో నాకు తెలీదు. ఉన్నట్లైతే శాలువా ప్రేమికులు నాపై కోపం చేసుకోరాదని విజ్ఞప్తి.)

అసలీ శాలువాల వల్ల ఉపయోగమేమీ?

మా ఊళ్ళో సంవత్సరానికి ఒక్కరోజు కూడా చలి ఉండదు. కావున శాలువా కప్పుకునే అవసరం రానేరాదు. పోనీ రాత్రిళ్ళు నిద్ర పోయేప్పుడు దుప్పటిలాగా కప్పుకుందామా అంటే.. శాలువా గరుగ్గా ఉంటూ.. గుచ్చుకుంటుంది.

స్టైల్ కోసం చోక్కాపై కప్పుకుందామా అంటే.. జనాలు మనని రోగిష్టివాడనుకునే ప్రమాదం తీవ్రంగా ఉంది (థాంక్స్ టు అక్కినేని నాగేశ్వర్రావ్). సినిమా వాళ్ళు జమీందార్ పాత్రలకి శాలువా కప్పుతుంటారు (జమీందార్లకి చలి ఎక్కువని సినిమావాళ్ళ అభిప్రాయం కావచ్చు).  

పరుచూరి గోపాలకృష్ణ అనే పేరుగల సినిమా రచయిత ఒకాయన కరుడుగట్టిన కమ్యూనిస్టుట. కాబట్టే ఎప్పుడూ ఎర్ర శాలువా భుజంపై వేసుకుని కనబడుతుంటాట్ట. మరి కమ్యూనిస్టు కానివాడి పరిస్థితితేంటో తెలీదు.

ప్రముఖ సాహిత్యకారుల్ని ఎన్నో సంస్థలు పోటీపడి మరీ శాలువాల్తో సత్కరిస్తుంటాయి. వారికి కప్పిన శాలువాల్ని దాచిపెట్టాలంటే బట్టల బీరువాలు సరిపోవు. పోనీ - ఎవరికన్నా ఫ్రీగా ఇద్దామన్నా తీసుకునే వాడుండడు. రోలింగ్ షీల్డులా రోలింగ్ శాలువాని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది?

ఇట్లాంటి అనేక కారణాల వల్ల ఒక ప్రతిభావంతుణ్ని సత్కరించాలంటే శాలువా కప్పాలనే ఆలోచన మంచిది కాదని తోస్తుంది. సన్మానంలో కప్పే శాలువా ఎందుకూ పనికిరాదు కాబట్టి ఇదో నేషనల్ వేస్ట్ అనుకోవచ్చు. కావున మనం శాలువాల సంస్కృతిని విడనాడాలని బల్లగుద్ది వాదిస్తున్నాను.

ఊరికే విమర్శించడం కాదు, నీ ప్రతిపాదన ఏమిటి?

వేరే భాషల వాళ్ళ సంగతి తెలీదు గానీ.. తెలుగులో ఎక్కువమంది రచయితలు, కవులు మధ్యతరగతికి చెందినవారు. ఈ మధ్యతరగతి రచయితలు రాతల్లో మునిగి ఉండటం మూలానా తమ ఆర్ధికస్థాయిని పెంచుకోలేకపోయ్యారా? లేక మధ్యతరగతి వారవడం మూలానే చక్కగా రాస్తున్నారా? (ఇది వేరే చర్చ).

ఓ శాలువా కప్పే బదులుగా.. కొన్ని కిలోల (ఎన్నికిలోలో సన్మానించేవారి ఆర్ధిక స్థితి నిర్ణయిస్తుంది) కందిపప్పు, చింతపండు వంటి పనికొచ్చే రోజువారీ కిరాణా వస్తువులు బహుమతిగా ఇవ్వడం ఉత్తమం అని నా అభిప్రాయం. శాలువా కప్పేకన్నా ఇలా వస్తువులివ్వడమే సముచిత పురస్కారం కూడా. ఇది ఆ రచయితకి నూతనోత్తేజాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను.

ఎందుకు? ఎలా?

ఒక రచయిత తన వ్యాసంగానికి ఎంతో విలువైన తన వ్యక్తిగత సమయం వెచ్చిస్తాడు. ఇందువల్ల కుటుంబ సభ్యులు (ముఖ్యంగా భార్య) నష్టపోతారు. వారు ఆ మేరకు కొంత అసంతృప్తిగా (బయటకి చెప్పుకోరు గానీ) ఉంటారు. భర్త ప్రపంచాన్ని పట్టించుకోకుండా రచనలో మునిగి తేలుతుంటే.. ఆ వ్యాపకానికి ఏ మాత్రం సంబంధం లేని భార్య 'ఇది నా ఖర్మ' అని బాధ పడుతూ పిల్లల్ని, ఇంటినీ చూసుకుంటుంది.

అందువల్ల - నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో అరుదుగా మాత్రమే రచయితలకి భార్య సహకారం ఉంటుంది. ఎందుకంటే - భర్త రాయడం వల్ల వారు జీవితంలో చాలా కోల్పోతారు. విషయం ఇంతుంది కాబట్టే పాశ్చాత్య దేశాల్లో పుస్తకం ముందుమాటలో భార్యలకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రముఖంగా తెలిపే సంప్రదాయం ఉంది.

అసలే భర్త రాతల వల్ల శిరోభారంతో ఉన్న రచయితగారి భార్యకి, సన్మానం తాలూకా 'శాలువా' అనే ఇంకో బరువుని ఇవ్వడం ఉచితం కాదు. అంచేత రచయిత కుటుంబానికి పనికొచ్చే బహుమతి ఇవ్వడం సముచితం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో కందిపప్పు, చింతపండుల లాంటి వస్తువుల కన్నా విలువైందేదీ లేదు.

ఇట్లాంటి వస్తువుల పురస్కారం వల్ల భార్యకి ఆనందం కలుగుతుంది. ఉత్సాహం వస్తుంది. తన భర్త మరిన్ని మంచి రచనలు చెయ్యాలనీ, మరిన్ని కిరాణా వస్తువుల్ని పురస్కారంగా పొందాలనీ రచయితల భార్యలు కోరుకుంటారు. భర్తల్ని మరింత ప్రోత్సాహిస్తారు (రాసేప్పుడు సణగటం మాని ప్రేమతో కాఫీ, టీలు సప్లై చేస్తారు)

రచయితల్ని నేనేదో తక్కువ చేసి రాస్తున్నానని మీకు అనిపించవచ్చు. కానీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కొందరు రచయితలు నాకు తెలుసు. ఈ కరువు రోజుల్లో శాలువాలు చేసుకున్న పుణ్యమేంటి? కందిపప్పు చేసుకున్న పాపమేంటి?

నువ్వు చెప్పింది బానే ఉంది కానీ.. అలా ఇవ్వడం నిషేధం. పైగా నేత కార్మికుల్ని నిరుత్సాహ పరిచినట్లవుతుంది.

మీ ఆచారం తగలెయ్యా! పోనీ బెడ్ షీట్లు, దిండు గలీబులైనా ఇవ్వండి స్వామీ!

(picture courtesy : Google)

Monday, 23 December 2013

ఆడలేడీసుల రాజకీయ కష్టాలు


సమాజ మనుగడ, పురోగతిని రాజకీయ రంగం ప్రభావితం చేసినంతగా ఇంకే రంగమూ చెయ్యలేదు. అందుకే రాజకీయ కార్యాచరణ అత్యంత పవిత్రమైనది (ఈ పవిత్రతకి, కె.విశ్వనాథ్ సినిమాల పవిత్రతకీ సంబంధం లేదు). ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రంగంలో సమాజంలో కనపించే అసమానతలు కూడా ప్రతిబింబించడం సహజం. వీటిల్లో లింగ వివక్షత ముఖ్యమైనది.

మన రాజకీయ నాయకుల్లో ఆడవారితో పోలిస్తే మగవారు చాలా ప్రశాంతంగా ఉంటారు (వారు టీవీ సీరియల్స్ చూడకపోవటం ఈ ప్రశాంతతకి ఒక కారణం కావచ్చు). మీడియావారు అడిగిన ప్రశ్నలకి, అడగని ప్రశ్నలక్కూడా అలవోకగా సమాధానాలు చెప్పేస్తుంటారు. అందుకే కేశవరావు, జానారెడ్డిలు బిట్ క్వశ్చన్కి ఎస్సే ఆన్సర్లు చెప్పేస్తారు (చిరంజీవి, బాలకృష్ణల సమస్య ). అదే లేడీ పోలిటీషయన్లైతే ముక్తసరిగా సమాధానాలు చెబుతారు.. కొద్దిగా టెన్షన్తో ఉన్నట్లుగా కూడా కనిపిస్తారు.

మన దేశానికి సంబంధించి ఒకప్పుడు ఇందిరా గాంధీ.. ఇప్పుడు సోనియా గాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్.. అత్యంత ప్రముఖులైన నాయకురాళ్ళు (రాజకుమారి, గంగాభవాని అక్కయ్యలు నన్ను మన్నించాలి). వీరు గంభీరంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, హడావుడిగా కూడా ఉంటారు.

ఈ రకమైన ప్రవర్తన వెనుక మీడియా ప్రశ్నల్ని తప్పించుకునే వ్యూహం దాగి ఉందా? (ఉందో లేదో నాకు తెలీదు. అయితే ఇప్పుడీ టాపిక్ పై నేనో పోస్టు రాయాలి కాబట్టి.. వ్యూహం ఉందనే నమ్ముతున్నాను). ఉన్నట్లయితే.. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? అవేంటో ఆలోచన చేద్దాం ('చేద్దాం' అని మాటవరసకి అన్నాను గానీ.. ఆలోచన చేస్తుంది మాత్రం నేనే).

సైకలాజికల్ కారణాలు :  

సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక గడ్డం సైకాలజిస్టు మనోవిశ్లేషణ సూత్రాలు ప్రతిపాదించాడు (గడ్డం ఉంటే గానీ మేధావి కాదు - 'అసూబా'ల ఆహార్యం ). మన రాజకీయ నాయకులు, సినిమా హీరోలు ఈమధ్య తమ కుటుంబ వారసుల్ని తెస్తున్నారు గానీ.. ఆపని ఫ్రాయిడ్ ఎప్పుడో చేశాడు. తండ్రి ఆశిస్సులతో ఫ్రాయిడ్ కూతురు అన్నా ఫ్రాయిడ్ కూడా సైకాలజీలోనే సెటిలయ్యింది.

సిగ్మండ్ ఫ్రాయిడ్ కూతురు తమ ఫ్రాయిడ్ వారి వంశం పేరు (నేను అచ్చమైన తెలుగు వాణ్ని. అందుకే వంశాల పేరెత్తితేనే ఒళ్ళు పులకరిస్తుంది) తోడగొట్టి (అన్నా ఫ్రాయిడ్ నిజంగా తోడ గొట్టిందో లేదో నాకు తెలీదు.. ఇది మాత్రం మసాలా) మరీ నిలబెట్టింది. తండ్రి సిద్ధాంతాలకి మరింత ప్రాచుర్యం కలిపించింది. (అన్నా ఫ్రాయిడ్ చాలా తెలివైందనడానికి మరో నిదర్శనం.. ఆవిడ పెళ్లి చేసుకోలేదు).

తండ్రీకూతుళ్ళ సిద్ధాంతాల్లో డిఫెన్స్ మెకానిజమ్స్ ముఖ్యమైనవి. వీటిల్లో 'రియాక్షన్ ఫార్మేషన్' అనేది ఒక ఆసక్తికరమైన డిఫెన్స్ మెకానిజం. ఒక వ్యక్తికి అభద్రతా భావం ఉంటుంది. భయపడిపోతుంటాడు. ఆ భయం నుండి బయటకి రావడానికి అందుకు సరీగ్గా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అంటే లేని ధైర్యాన్ని అతిగా ప్రదర్శిస్తాడు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి పిరికివాడు. మరి మన ఆడలేడీసు గాంభీర్యం కూడా ఒక రియాక్షన్ ఫార్మేషనేనా? (కత్తిలాంటి ప్రశ్న.. మీలో బాకులా దిగింది కదూ).

బయలాజికల్ కారణాలు :

స్త్రీకి మెనోపాజ్ శత్రువు (ఈ వాక్యానికి స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న వాక్యం ప్రేరణ). ఆడవాళ్ళలో menstrual cycle కి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్ల ఎక్కువతక్కువలు కారణం (ఆడవాళ్ళ మనసులాగే ఈ హార్మోన్లు కూడా అస్థిరంగా ఉంటాయి). చివరాఖరికి ఈ హార్మోన్లలో సమతుల్యత లోపించడం మూలానా మెనోపాజ్ వస్తుంది.

స్త్రీలలో థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువ. థైరాయిడ్ హార్మోన్ తక్కువవడంతో (Hypothyroidism) అధిక బరువుకి లోనవుతారు. ఈ హార్మోన్ల సమస్యలు ఆడవారిని శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకి గురిచేస్తాయి. కొందరిలో దిగులు, దుఃఖం, నిరాసక్తత, నిర్వేదన వంటి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.

సర్లే! ఏదో ఒక హార్మోన్.. ఈ హార్మోన్ల తేడా వల్ల చిరాకు, అసహనం, అనుమానం.. సహచరులు తమకి హాని చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారనే తీవ్రమైన భయాందోళనలకి గురౌతారు. ఈ ఆలోచనలని 'పేరనాయిడ్ థాట్స్' అంటారు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ సమయంలో ఇలాంటి ఆలోచనలతో ఇబ్బంది పడిందని చెబుతారు.

ఆగక్కడ! చేతిలో కీ బోర్డుందని ఓ కొట్టేసుకుంటూ పోతున్నావ్! నువ్వు చెప్పే లక్షణాలు చంద్రబాబుక్కూడా ఉన్నాయి. మరి దానికేం సమాధానం చెబుతావ్?

అయ్యా! మగవాళ్ళక్కూడా 'మేల్ మెనోపాజ్' ఉంటుందని విజ్ఞులు సెలవిస్తున్నారు.

(ఇంక ఈ టాపిక్ ఆపేస్తాను.. ఇప్పటికే నాకు 'డాక్టర్ సమరం ఫీలింగ్' వచ్చేసి చిరాగ్గా ఉంది.)

సాంఘిక కారణాలు :

సమాజంలో ఉన్న లింగ వివక్షతే రాజకీయ రంగంలో కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు వివాహేతర సంబంధాలని పరిశీలిద్దాం. వివాహేతర సంబంధాలు పూర్తిగా వ్యక్తిగతం. మన సమాజం రాజకీయ నాయకుడి 'అక్రమ' సంబంధం పట్టించుకోదు (మా నాయకుడు స్త్రీ జనోద్ధారకుడు. అందువల్ల రాత్రుళ్ళు ఒంటరిగా నారీమణుల కష్టాల్ని దగ్గరగా పరిశీలించెదరు.. ఆపై వారితో సుఖించెదరు).

కానీ రాజకీయ నాయకురాళ్ళకి అంత 'వెసులుబాటు' లేదు. అంచేత రాజకీయ నాయకురాళ్ళు తమపై ఎవరూ 'నింద' వెయ్యకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి (మన మీడియా జయలలిత, శశికళల గూర్చి కూడా ఎంత గొప్పగా రాసిందో గుర్తుంది కదూ) .ఇది వారిపై మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కారణం వల్ల కూడా ఆడవారు ప్రజాజీవితంలో గంభీరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వృత్తిగతమైన కారణాలు :

మన నాయకుల ప్రజాసేవకి (తెలుగు టీవీ తాయెత్తు ప్రోగ్రాముల్లా) వేళాపాడూ ఉండదు. వారి జీవితం (జేబులు కొట్టేవాడి ఓటు కూడా కాపాడుకుంటూ) ఎక్కువ సమయం ప్రజల మధ్యనే గడిచిపోతుంది. పగలంతా ప్రజాసేవలో అలసి సొలసిన మగ రాజకీయులకి రాత్రికి తగినంత 'మందోబస్తు' (ఈ పదానికి కాపీరైట్ ముళ్ళపూడి వెంకట్రవణది) ఉంటుంది.

సహచరులతో రాజకీయాలు, అరాచకీయాలు మాట్లాడుకుంటూ కులాసాగా రిలాక్స్ అవుతారు. పాపం! ఈ లక్జరీ రాజకీయ నాయకురాళ్ళకి మాత్రం లేదు (ఏం రాస్తున్నావ్ నువ్వు? ఇది భారత దేశం. స్త్రీ సర్వశక్తి స్వరూపిణి. నీ కళ్ళు సీమటపాకాయల్లా పేలిపోగలవ్ జాగ్రత్త).

వ్యక్తిగత కారణాలు :

మన సమాజంలో అందచందాలకి ప్రాధాన్యం ఎక్కువ. తెల్లదొరలూ మనని వదిలేసి చాలా కాలమైనా.. మనకి మాత్రం తెల్లరంగుపై మోజు తగ్గలేదు. చాలామందికి అందం అంటే తెల్లగా ఉండటమే. అందువల్లనే సినిమా హీరోయిన్లు, న్యూస్ రీడర్లు ఎల్లప్పుడూ తెల్లతోలువారు మాత్రమే ఉందురు (తెల్లతోలు 'తెలుగు' హీరోయిన్లు.. ఒక పిచ్చిథియరీ!).

కావున మన దేశంలో 'సోనియా గాంధీ భలే తెల్లగా ఉంటుంది' అని మురిసిపోయే సౌందర్యారాధకులకి కొదవ లేదు. వారిలో మా అమ్మ కూడా ఉంది (అమ్మ.. నేను.. కొన్ని పెళ్ళికబుర్లు ). అంచేత రాజకీయ రంగంలో అందం (అనగా చర్మం రంగు) తక్కువగా ఉన్న నాయకురాళ్ళు ఆత్మన్యూనతకి (low self esteem కి వచ్చిన తెలుగు తిప్పలు) లోనవుతారు.

(మగవాళ్ళకి ఈ సమస్య లేదు. చంద్రబాబు పొడుగ్గా ఉంటాడనో, రాజశేఖర్రెడ్డి బట్టతల బాగుందనో ఎవడూ ఓటు వేసిన దాఖలా లేదు.)

మీడియా పక్షపాత ధోరణి :

మన దేశంలో పత్రికా రంగం మగవారి చేతిలోనే ఉంది. మెజారిటీ రిపోర్టర్లు, ఎడిటర్లు, పత్రికాధిపతులు మగవారు. వీరి మనసులో ఒక అజ్ఞాత 'పురుష పుంగవుడు' (వీడికింకో పేరు గిరీశం) దాగి యుండును. అదీగాక మీడియా మగవాళ్ళు భార్య మీద కోపం స్త్రీజాతి మీద హోల్సేల్ గా చూపిచ్చేస్తుంటారు. అందుకే వీరు ప్రతిభావంతురాలైన స్త్రీ కనబడితో పక్షపాతంతో పక్షవాతం వచ్చినట్లైపోతారు (ఈ వాక్యం మాత్రం ప్రాస కోసమే రాశాను).

కాబట్టి సహజంగానే వీరికి రాజకీయ నాయకురాళ్ళల్లో అజ్ఞానం ఎక్కువగానూ, విజ్ఞానం తక్కువగానూ కనిపిస్తుంటుంది. అందుకే వీరికి నరేంద్ర మోడీలో ఆత్మవిశ్వాసం కనబడితే.. మమతా బెనర్జీలో అహంభావం కనిపిస్తుంది (తెలుగు మీడియాలో వార్తా కథనాల కన్నా వార్తా కతలు ఎక్కువ).

చివరిగా..

రాజకీయ రంగంలో విజయవంతమైన వ్యక్తుల ప్రతిభాపాటవాలని అంచనా వెయ్యాలంటే ఈ విధంగా పలు కారణాలని పరిగణనలోకి తీసుకుంటూ భిన్నకోణంలో ఆలోచించాలి (నేనెప్పుడూ అంతేనండి, వెరైటీగా ఆలోచిస్తుంటాను).

నే రాసిన ఈ కారణాలు అందరికి వర్తించవు. కొన్ని పాయింట్లు కొందరికి వర్తించవచ్చు.. అసలు వర్తించకపోవచ్చును కూడా (ఈ ముక్క పోస్టులో ముందే చెప్పేస్తే మీరిక్కడదాకా చదవరని చెప్పలేదు). ఎందుకంటే ఇదంతా హైపొథెటికల్ రీజనింగ్ (ఇది మాత్రం తప్పించుకోటానికి దొడ్డిదోవ తలుపు తెరిచి ఉంచుకోవడమే).

కానీ స్త్రీలు రాజకీయ రంగంలో రాణించడానికి (పురుషులతో పోలిస్తే) ఎంతగానో శ్రమించాలన్నది మాత్రం నిజం. అంచేత ఈ 'అదనపు' ఒత్తిడే (కార్ల్ మార్క్స్ చెప్పిన అదనపు విలువతో ఈ అదనపు ఒత్తిడికి సంబంధం లేదు) వారిని గంభీర స్వరూపులుగా మార్చేస్తుందనిపిస్తుంది.

నా ఎనాలిసిస్ ఒప్పుకుంటే మీరు తెలివైనవారుగా పరిగణించబడతారు. ఆపై మీ ఇష్టం!

(pictures courtesy : Google)

Monday, 16 December 2013

అపరిచితురాలు

వారిద్దరు భార్యాభర్తలు. అతనికి నలభైకి పైన, ఆవిడకి నలభైకి  లోపుగా వయసుంటుంది. అతనేదో కాలేజిలో పని చేస్తున్నాట్ట. ఆవిడ ఇంటి భార్య ('హౌస్ వైఫ్' కి అచ్చ తెలుగు.. అనగా డబ్బు సంపాదన లేని భార్య అని అర్ధం). పదో క్లాసు పాసైందిట. బొద్దుగా, పొట్టిగా, ఎర్రగా ఉంది. సంప్రదింపు రుసుము (కన్సల్టేషన్ ఫీజ్) రసీదు ఆవిడ పేర ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఆవిడ నా పేషంట్.

ఇద్దరూ గదిలోకి వచ్చాడు. భర్త మాట్లాడ్డం మొదలెట్టాడు. భార్యని తనెంత అపురూపంగా చూసుకుంటున్నది.. పెళ్ళైన తరవాత ఒక్కరోజు కూడా భార్యని వదలకుండా ఏవిధంగా ఉండలేనిదీ.. కాలేజిలో ఉన్నాకూడా అనుక్షణం భార్య గూర్చే ఎంత తీవ్రంగా ఆలోచించేదీ.. వైనంగా చెబుతున్నాడు.

భర్త ప్రేమని అపారంగా పొందుతున్న ఆ భార్యామణి అసలు తలే పైకెత్తట్లేదు. బహుశా రోజూ భర్త చూపిస్తున్న టన్నుల కొద్దీ ప్రేమ బరువు మొయ్యలేక మెడ ఒంగిపోయ్యుంటుంది. నాకు చికాకేసింది. ఆయన భార్యని ఆయన ప్రేమించుకోవడంలో విశేషమేముంది! అదీగాక నాకెందుకో భార్య పట్ల బహిరంగంగా ప్రేమ ప్రకటించేవాళ్ళు నమ్మదగ్గ వ్యక్తులుగా అనిపించరు. అటువంటివాళ్ళు అమాయకులైనా అయ్యుండాలి లేదా అబద్దమైనా చెబుతుండాలి అంటాడు మా సుబ్బు. 

"ఇంత ప్రేమగా చూసుకుంటున్నా ఎందుకనో నా భార్య దిగులుగా ఉంటుంది. అప్పుడప్పుడూ ఏడుస్తుంటుంది." అంటూ దిగులు చెందుచూ తన వాక్ప్రవాహాన్ని ఆపాడు. అమ్మయ్య! వర్షం వెలిసినట్లైంది.

ఆవిడ తల పైకెత్తలేదు. పాపం! మరీ మొహమాటస్తురాల్లా ఉంది. నేనావిడ బిడియం పోగొట్టడానికి కొన్ని జెనరల్ ప్రశ్నలు అడిగాను. ఆవిడ తల దించుకునే ముక్తసరిగా సమాధానాలు చెప్పింది.

గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం.

"మావారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అయినా.. ఎందుకో దిగులు." ఉన్నట్లుంది అన్నది.

వెంటనే భర్త అందుకున్నాడు.

"అదీ అలా చెప్పు. భయపడకుండా చెప్పాలి. చెప్పు. ఇంకా చెప్పు. డాక్టర్ల దగ్గర ఏదీ దాచకూడదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పు.. చెప్పెయ్యి.. చెప్పు" అంటూ ఆవిడని హడావుడి చెయ్యసాగాడు.

నాకు అతని ధోరణి చికాగ్గా అనిపించింది. తెలుగు సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టులా ఒకటే మాట్లాడేస్తున్నాడు. ఇతగాడు గదిలో ఉండగా మరొకళ్ళకి మాట్లాడే చాన్స్ ఇవ్వడని అర్ధమైపోయింది.

"మీ భార్యతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓ రెండు నిమిషాలు బయట వెయిట్ చేస్తారా?" అన్నాను భర్తతో.

భర్త షాక్ తిన్నాడు. నమ్మశక్యం కానట్లుగా మొహం పెట్టాడు. కేబినేట్ మీటింగు మధ్యలో ముఖ్యమంత్రిని బయటకి పొమ్మన్నప్పుడు కూడా ఇంతలా ఫీలవ్వడేమో!

ఆవిడ కంగారు పడిపోసాగింది.

"ఏవండీ! మీరు బయటకి వెళ్ళకండి. డాక్టరు గారు! మా ఆయన దేవుడు. నా దిగులు తగ్గడానికి మందు రాయండి. చాలు. అంతేగానీ వారిని బయటకి పంపకండి." అని దీనంగా బ్రతిమాలుతున్నట్లుగా అంది.

భార్య దీనావస్థకి భర్త మిక్కిలిగా సంతోషించసాగాడు.

"నా పద్ధతులు నాకున్నాయ్. మీ ఆయన బయటకెళ్ళేది రెణ్ణిమిషాలే కదా. మీరు సహకరించాలి." అన్నాను.

అతను ఒక క్షణం ఆలోచించాడు. తరవాత ఆవిడ చేతిని మృదువుగా నొక్కాడు.

"భయపడకు. డాక్టరు గారు అడిగినవాటికి ధైర్యంగా చెప్పు. బయట వెయిట్ చేస్తాను." అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు. 

నాకేసి అదోరకంగా చూస్తూ తలుపు తెరుచుకుని బయటకి వెళ్ళిపొయ్యాడు. స్ప్రింగ్ డోర్ అతని వెనక మూసుకుపోయింది.

ఆవిడ ఒక క్షణం ఆగి డోర్ వైపు అనుమానంగా చూస్తూ లోగొంతుకతో అడిగింది.

"మన మాటలు బయటకి వినబడతాయా?"

"మీరు గట్టిగానే మాట్లాడవచ్చు. మన మాటలు బయటకి అస్సలు వినబడవు." అభయ హస్తం ఇచ్చాను.

ఆవిడ ధోరణి ఒక్కసారిగా మారిపోయింది.

"డాక్టరు గారు, నాలాంటిది బ్రతికి ప్రయోజనం లేదు.. భూమికి భారం తప్ప. ఏదో పిల్లలు అన్యాయం అయిపోతారని చావలేక బతుకుతున్నా. నేనేదో మహా పాపం చేసుకునుంటాను.. ఈ దరిద్రుడు భర్తగా దొరికాడు. నేను నిల్చున్నా అనుమానమే, కూర్చున్నా అనుమానమే. నీడలాగా వెంటే తిరుగుతుంటాడు. మెత్తగానే మాట్లాడతాడు.. కత్తితో కండ కోసినంత బాధగా ఉంటుంది. కనీసం ఒక మంచి చీర కట్టుకున్నా ఓర్చుకోలేడు. నాకు అమ్మానాన్న లేరు. ఉన్న ఒక్క అన్నయ్య పరిస్థితి అంతంత మాత్రం. గతిలేక రోజూ ఏడ్చుకుంటూ కాపురం చేస్తున్నాను." అంటూ నిశ్సబ్దంగా రోదించసాగింది.

నేనావిడని కొద్దిసేపు అలాగే ఏడవనిచ్చాను.

"అర్ధమైంది. మరి మీ ఆయన ముందు అలా చెప్పారేం?"

"అలా చెప్పకపొతే ఇంటికెళ్ళాక విపరీతంగా సాధిస్తాడండి. ఇప్పుడైనా తన గూర్చి మీకేమైనా చెప్పేస్తున్నానేమోనని వణికి చస్తుంటాడు. మీకు దణ్ణం పెడతాను. నేనిలా చెప్పానని మాత్రం ఆయనకి చెప్పకండి." అర్దిస్తున్నట్లుగా అంది.

"డోంట్ వర్రీ. మీరు చెప్పినవన్నీ మనిద్దరి మధ్యే ఉండిపోతాయి. అతన్నిప్పుడు పిలుస్తున్నాను." కాలింగ్ బెల్ మీద వేలు ఉంచి అన్నాను.

"ఒక్క క్షణం." అంటూ కర్చీఫ్ తో కళ్ళు, ముక్కు తుడుచుకుని, జుట్టు సరిచేసుకుంది. పిమ్మట 'ఓకే' అన్నట్లు సైగ చేస్తూ తల దించుకుంది.

కాలింగ్ బెల్ నొక్కాను. నర్స్ భర్తని లోపలకి పంపింది.

భర్తని చూడంగాన్లే భార్య భయం భయంగా బిత్తర చూపులు చూస్తూ బేలగా "ఏమండి! వద్దంటున్నా బయటకి ఎందుకెళ్ళారండీ? మీకు తెలీకుండా చెప్పడానికి నాదగ్గరేముంటుందండి?" అన్నది.

తన భార్య అమాకత్వాన్ని చూసి భర్త తృప్తిగా, సంతోషంగా తలాడించాడు.

"మనిద్దరి మధ్యా ప్రేమ తప్ప మరేదీ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు.. కానీ - డాక్టర్లకి తెలీదుగా! అందుకే నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్లాను. నువ్వేం ఫీలవకు." అంటూ మళ్ళీ మృదువుగా భార్య చెయ్యి నొక్కుతూ నావైపు విజయ గర్వంతో చూశాడు.

చిన్నగా నవ్వుకున్నాను. ఇతగాడికి అసలు సంగతి తెలిస్తే గుండాగి ఛస్తాడేమో! ఆవిడ నటనా కౌశలాన్ని మనసులోనే మెచ్చుకున్నాను. నాకిప్పుడు శంకర్ తీసిన 'అపరిచితుడు' సినిమా జ్ఞాపకం వస్తుంది. నా ఎదురుగా కూర్చునున్నది ఒక అపరిచితురాలు!

చివరి తోక :

ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. 100% కల్పితం.

(picture courtesy : Google) 

Tuesday, 10 December 2013

జ్ఞానాంధకారం

"ముళ్ళపూడి వెంకట్రవణ భలే రాస్తాడు గదా!"

"అలాగా! ఆయన రాసినవాటిల్లో నీకు బాగా నచ్చిందేమిటి?"

"శ్రీరామరాజ్యం"

"ఇంకా?"

"అది కాకుండా ఆయనింకేమన్నా రాశాడా?"

"ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు, జనతా ఎక్స్ ప్రెస్, ఋణానందలహరి, రాజకీయ భేతాళ... "

"అలాగా! అయితే అవన్నీ కూడా భలే రాసుంటాడు."

ఇక్కడ ముళ్ళపూడి అభిమానం తప్ప విషయం లేదని అర్ధమైపోయింది.


"hmtv లో వందేళ్ళ తెలుగుకథ ప్రోగ్రాం చూడు. బాగుంది."

(ఈ విషయంపై ఇంతకుముందొక పోస్ట్ రాశాను.)

"నీకు నచ్చిందా?"

"ఎందుకు నచ్చదు? గొల్లపూడి కథల గూర్చి చెబుతున్నాడుగా!"

"తెలుగులో నీకు నచ్చిన రచయితల పేరు చెప్పు."

"పరుచూరి బ్రదర్స్."

ఇంకానయం! చందనా బ్రదర్స్ అన్లేదు.


"విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' చదువు. బాగుంటుంది."

"నాకైతే ప్రస్తుతానికి ఒక్క పడగ కూడా చదివే ఓపిక లేదు. ఎందుకు చదవాలో నువ్వు చెప్పు.. చదవడానికి ప్రయత్నిస్తాను."

"భలే బాగుంది. ఎందుకు చదవాలో నాకేం తెలుసు? ఊరికే చెప్పాను. నీకు తెలుసుగా.. నేను చాలా బిజీ."

"మరెందుకు చెప్పావ్?"

"వదిలెయ్యి బాసూ! వేయిపడగలు బాగుంటుందని మొన్నెవడో అన్నాడు. నీకా ఫీల్డులో ఇంటరెస్ట్ ఉందని.. ఆ విషయం నీ చెవిలో ఊదా."

పాపం! నేనన్ని ప్రశ్నలడుగుతానని ఊహించలేదు. ఏదో గొప్ప కోసం చెప్పాడు. అతగాడు బిజీట.. అక్కడికి నేనేదో పనీపాట లేకుండా ఉన్నట్లు!


"ఛస్తే తెలంగాణా రాదు."

"ఎలా?"

"అశోక్బాబు తెలంగాణా రాకుండా అడ్డుకుంటాడు."

"రాష్ట్రవిభజన అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం. విభజన విషయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా పట్టుదలగా ఉంది. కేంద్రస్థాయిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని రివర్స్ చేసుకుంటే గాని రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం లేదు."

"నీకు తెలీదులే. మధ్యలో కొన్ని చోట్ల బ్రేకులెయ్యొచ్చు."

"అప్పుడు విభజన కొద్దిగా ఆలస్యం అవుతుంది గానీ.. ఆగిపోదు కదా!"

"చూస్తూ ఉండు. మనకి స్టార్ batsman కిరణ్బాబు ఉన్నాడు."

"నే రాజకీయాలు మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ మాట్లాడతావేం?"

"పిచ్చివాడా! ఈ రోజుల్లో రాజకీయాలే క్రికెట్, క్రికెట్టే రాజకీయం."

అతనికి కొందరు వ్యక్తుల పట్ల గుడ్డినమ్మకమే గానీ, రాజకీయంగా పెద్ద జ్ఞానం లేదని అర్ధమైంది. తెలుగు వార్తల్ని మాత్రమే ఫాలో అయ్యేవారి జ్ఞానం ఇలాగే ఉంటుంది.


"నరేంద్ర మోడియే కాబోయే ప్రధానమంత్రి. బుద్ధున్నవాడెవడైనా మోడీకే ఓటేస్తాడు."

"మంచిది. అలాగే వేసేద్దాం. మరి 2002 మారణకాండ గూర్చి ఆలోచించావా?"

"అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారం."

"మరి ముస్లిముల్ని దారుణంగా చంపేసింది ఎవరు?"

"ఎవరో? నాకేం తెలుసు? నరేంద్ర మోడీ మాత్రం కాదు."

"అంటే ఆనాడు ముస్లిములందరూ సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారంటావా?"

"అవన్నీ నాకు తెలీదు. నరేంద్ర మోడీ మాత్రం మహాత్ముడు."

మోడీకి అనుకూలంగా చాలా విషయంతో వాదిస్తాడనుకున్నాను. కానీ అతనికి మోడీ గూర్చి పెద్దగా తెలీదు!


పరిచయస్తులతో మాట్లడేప్పుడు ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. చాలామందికి చాలా విషయాలపై గట్టి అభిప్రాయాలుంటాయి. అయితే వారికెందుకా అభిప్రాయం ఏర్పడిందో వారిక్కూడా తెలీదు!

సాధారణంగా ఒక విషయం పట్ల అభిప్రాయం కలిగినవారు రెండు కేటగిరీలుగా ఉంటారు.

కేటగిరీ 1. వీళ్ళు ఒక విషయం పట్ల కొద్దోగొప్పో అధ్యయనం చేస్తారు. కొంత అవగాహన ఏర్పరచుకుంటారు. ఆపై విషయాన్ని విశ్లేషిస్తూ సమర్ధిస్తారు లేదా వ్యతిరేకిస్తారు. వీరితో చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కొత్త సంగతులు తెలుస్తాయి కాబట్టి.. మన జ్ఞానం, అజ్ఞానం కూడా ఏ స్థాయిలో ఉన్నాయో బేరీజు వేసుకోవచ్చు.. మార్పుచేర్పులు చేసుకోవచ్చు.

కేటగిరీ 2. వీళ్ళు ఏ విషయాన్నీ తెలుసుకోటానికి ఆసక్తి చూపరు. కనీసస్థాయిలో కూడా విషయం పట్ల అవగాహన ఉండదు. కానీ రాకెట్ సైన్స్ దగ్గర్నుండి రిజర్వ్ బేంక్ వ్యవహారాల దాకా అనర్గళంగా మాట్లాడతారు. ఒక్కోసారి తీవ్రంగా ఆవేశపడుతుంటారు. చాలాసార్లు వీళ్ళ అభిప్రాయాలు అరువు తెచ్చుకున్నవి.

మనం మొదటి కేటగిరీలో లేకపోయినా పర్లేదు.. కానీ రెండో కేటగిరీలోమాత్రం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండగలిగే స్పృహ డెవలప్ చేసుకోవాలి. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈమాత్రం అవగాహన కలిగుంటే చాలాసార్లు మర్యాదగా బయటపడొచ్చు.


"ఈ పాడు కాంగ్రెస్ విధానాల వల్ల ద్రవ్యోల్పణం పెరిగిపోతుందోయ్. ఏవంటావ్?"

"నాకు ద్రవ్యోల్పణం అంటే తెలీదు గానీ.. నాదగ్గర మాత్రం ద్రవ్యం ఎప్పుడూ అల్పంగానే ఉంటుంది."

"టెన్త్ లో చదువుకున్నావుగా! గుర్తు లేదూ?"

"నాకు నిన్న చదివినవే గుర్తుండవు. అదేదో నువ్వే చెప్పి నా అజ్ఞానాన్ని పారద్రోలరాదా?"

"నాయనా! నీకు ద్రవ్యోల్పణం గూర్చి తెలీకపోతే దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. ఈ వయోజన విద్యా కార్యక్రమం నా వల్ల కాదు."

ఏవిటో ఈ లోకం! విషయం తెలీదని నిజాయితీగా ఒప్పుకున్నా హర్షించదు గదా!


"పొద్దున్నే చిన్నుల్లిపాయ టీ తాగితే బీపీ, షుగర్లు రావని రాస్తున్నారు తెలుసా?"

"నాకు తెలీదు. నేను పొద్దున్నే ఇడ్లీలు, దోసెలు తింటాను. పగలు కాఫీ, రాత్రి సింగిల్ మాల్టు తాగుతాను. ఖాళీసమయంలో బ్లాగులు రాస్తాను. ఇవి చేస్తే ఛస్తారని ఎక్కడైనా రాస్తే చెప్పు. ఆలోచిస్తాను."

"లేదులేదు. ఇకనుండి నువ్వు కూడా చిన్నుల్లిపాయ టీ తాగు."

"చెప్పాను కదా. నాకు తాజ్ మహల్ టీ తెలుసు.. తాగుతాను. చిన్నుల్లి టీ తెలీదు.. తాగను."


ప్రతి వ్యక్తికి అన్నీ తెలిసుండాలని లేదు. ఏదీ కూడా తెలుసుకోకుండానే హాయిగా బ్రతికెయ్యొచ్చు. అసలేదీ తెలుసుకోకుండా నోరు మూసుకుని బ్రతికేసేవాడే ఉత్తముడని నా అభిప్రాయం. 

(picture courtesy : Google)

Saturday, 7 December 2013

అనాధరక్షకా! పాహిమాం పాహిమాం!!


(ఉపాధ్యాయులు ఈ పోస్టు చదవరాదు. చదివినచో వారి హృదయము గాయపడును.)

"చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా పాస్ మార్కులు కూడా రావట్లేదు. నేను ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి?" అడిగాడు ఎంబీయే చదువుతున్న విద్యాధమరావు.

అప్పుడప్పుడు నేను నా పోస్టుల్ని పేషంట్ల సంభాషణతో మొదలెడుతుంటాను. కారణం.. నా ఆలోచనలకి ఫస్ట్ గేర్ వేస్తుంది వాళ్ళే కాబట్టి. ఒక ఆలోచనకి క్రెడిట్ ఇవ్వకపోవడానికి నేనేమీ తెలుగు సినీరచయితని కాను. ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్నివిషయాల్లోనూ నైతికతకి ప్రాణం పణంగా పెడతాను.

"బాగా చదువుతున్నానని మీరు అనుకుంటే కుదరదు. హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ కీ ఫర్ సక్సెస్. రీడ్ అండ్ ఫర్గెట్. రీడ్ అండ్ ఫర్గెట్. బట్ డు నాట్ ఫర్గెట్ టు రీడ్......." సడన్ గా మూడాఫ్ అయిపోయింది. మాట్లాడాలనిపించలేదు. విద్యాధమరావుకి ఏదో చెప్పి పంపించేశాను.

నామీద నాకే చికాగ్గా అనిపించింది. అసలింతకీ నే చెప్పేది నేన్నమ్ముతున్నానా? లేదు కదా! మనకి నమ్మకం లేని విషయాల్ని ఎదుటివారికి చెప్పడం ఆత్మవంచన కాదూ? పేజీల కొద్దీ పాఠాల్ని బట్టీయం వేసి పరీక్షలు రాసే విధానానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఈ దేశానికి పట్టిన ఈ దరిద్రపు గొట్టు పరీక్షల పధ్ధతి వదిలేదెప్పుడో గదా!

ఇప్పుడు విద్యార్ధుల ప్రతిభని టన్నుల్లెక్కన పెంచి పరీక్షల్లో ప్రధమ స్థానంలోకి నెట్టడానికి వీధికో వ్యక్తిత్వ వికాస నిపుణుడున్నాడు. కానీ పుస్తకాలు వల్లెవేసి పరీక్షల్లో గొప్ప మార్కులు సాధించడం అసలు ప్రతిభే కాదని నా అభిప్రాయం. ఆ విషయం గొంతు పోయ్యేలా అరిచి చెప్పినా వినే వెధవెవ్వడూ కనబడట్లేదు. ఈ రోజుల్లో సుభాషితాలు బోధించడం కూడా ఒక వృత్తిగా మారింది.

నాకు మొదట్నుండీ నీతులు చేప్పేవాళ్ళంటే ఎలర్జీ. ఎదుటి వాడికి నీతులు చెప్పేవాడు వాటిని పాటించడని నా నమ్మకం. తాము పాటించని నీతులు చెప్పడం నీతిబాహ్యమైన విషయం కూడా. యండమూరిని చదివి గురజాడ కబుర్లు చెప్పరాదు. ప్రస్తుతం మన తెలుగు దేశంలో సుభాషితాలు బోధిస్తున్నవారికి కొరత లేదు. విని ఏడవడం మించి మనం చేయగలిగింది లేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే నా 'కౌన్సెలింగు' కూడా ఆ కోవకే చెందుతుంది కాబట్టి.

సరే! అదలా ఉంచుదాం. అందరూ 'ప్రధమ స్థానం పొందడం ఎలా?' అనే రాస్తున్నారు. కానీ అధమ స్థానం వారిని పట్టించుకునేవాడేడి? ఎందుకు లేడు? నేనున్నాను! అందువల్ల ఇప్పుడు నేను 'వెంట్రుక వాసిలో పరీక్ష పాసవ్వడం ఎలా?' అన్న సబ్జక్టుపై కొన్ని టిప్స్ ఇస్తాను. చదివి బొటాబొటి మార్కుల్తో పాసైపోయి చరితార్ధులు కండి.
              
పరీక్షలు రాయటంలో ఒక్కోడిది ఒక్కో స్టైల్. బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకునేవాడి గూర్చి మనకనవసరం. వాణ్ని అవతల పెడదాం.ఇప్పుడు మూరెడు చదువుకి బారెడు మార్కులు కొట్టేయ్యడం ఎలా? అన్నది విషయం. అసలిదో ఆర్ట్. పాసుకీ, ఫైలుకీ వెంట్రుకవాశిలో ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తూ.. టి ట్వెంటీ మ్యాచిలోలా చివరి బంతికి గెలిచినట్లు.. చివరాఖరికి పాసై బయటపడటం అనేది ఒక గొప్ప విద్య.

మనం ముందుగా అధ్యాపకుల సైకాలజీ విశ్లేషించుకోవాలి. ఎక్కువమంది అధ్యాపకుల మనస్సు చిత్తూరు నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావుల మేలు కలయిక. అత్యంత ఉదార స్వభావులు. కలలో కూడా ఎవరికీ అపకారం తలపెట్టని బుద్ధిజీవులు. ఈ విధంగా టీచర్ల సైకాలజీ గుర్తుంచుకునిన యెడల తలపెట్టిన కార్యము విజయవంతంగా ముగించ వచ్చును. 
                            
వెనకటొకడు ఆవు పాఠం మాత్రమే చదువుకుని పరీక్షల కెళ్ళేవాట్ట. ఏ ప్రశ్నకైనా తనకి తెలిసిన ఆవుపాఠం మాత్రమే రాయాలని డిసైడయిపొయ్యాడు. రైలు గూర్చి రాయమంటే.. రైలు, రైలు పక్కన ఆవు, ఆవు తెల్లగానుండును, ఆవు పాలిచ్చును. అని ఆవు పాఠం రాసేసేవాడు. వృక్ష ప్రయోజనాలు రాయమంటే.. 'వృక్షము, పక్కనే ఆవు, ఆవు తెల్లగానుండును.' అంటూ మళ్ళీ తన ఆవు పాఠం రాసేవాడు. అనగా.. ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం ఒకటే!

చాలామంది ఈ ఆవుకథని ఒక జోకుగా భావిస్తారు. కానీ నాకు ఈ కథలో ఒక గొప్ప జీవితసత్యం కనిపిస్తుంది. ఇప్పుడు మీ సబ్జక్టులో మీకు నచ్చిన ఏవైనా నాలుగైదు ప్రశ్నలకి సమాధానాలు క్షుణ్ణంగా చదువుకోండి. ఓపికుంటే ఒకట్రెండు స్లిప్పులు రాసుకుని దాచుకోండి. ఇన్విజిలేటర్ కరుణామయుడైనట్లైతే ఈ స్లిప్పులే ఆదుకోగలవు. ఇప్పుడిక మీ ఆవు పాఠం రెడీ!
                    
మీరు ప్రశాంత చిత్తంతో పరీక్షా హాల్లోకి అడుగు పెట్టవలెను. పెద్దగా చదివి చచ్చింది లేదు కాబట్టి ఎలాగూ టెన్షన్ ఉండే అవకాశం లేదు. ప్రశ్నాపత్రాన్ని ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదవవలెను. ఇప్పుడు చంద్రబాబు ఇంకుడు గుంట, రాజన్న జలయజ్ఞం స్థాయిలో ఒక ప్రణాళిక వేసుకోవాలి. రాయాల్సిన సమాధానాల్ని మనసులోనే మూడు సెక్షన్లుగా విభజించుకోవాలి.

సెక్షన్ 1.

ఇది సమాధానాలు బాగా తెలిసి చక్కగా ఆన్సర్లు రాయగలిగిన సెక్షన్. ఈ సెక్షన్లో చక్కగా, నీటుగా రాసెయ్యాలి. ఎప్పుడు కూడా మనకి బాగా తెలిసిన ఆన్సర్లతోనే పరీక్ష రాయడం మొదలెట్టాలని గుర్తుంచుకోవాలి. దురద్రుష్టవశాత్తు.. మనకీ సెక్షన్ అతి చిన్నది. దిగులు చెందకు. సాహసమే నీ ఊపిరిగా ముందుకు (తరవాత ప్రశ్నకి) సాగిపొమ్ము. ఒక్క ప్రశ్నకి సమాధానం తెలిసినా చాలు. కానీ ఓపెనింగ్ మాత్రం అద్దిరిపోవాలి.   
                    
సెక్షన్ 2.

ప్రశ్న అర్ధమవుతుంది. ఆన్సర్ మాత్రం పూర్తిగా గుర్తు రాదు. గుర్తొచ్చినా.. అది పరిమాణంలో తెలుగు సినిమా కథలా కొంచెంగా మాత్రమే ఉంటుంది. అందువల్ల ఆన్సర్లు కూడా.. కాళ్ళు, కళ్ళు లేని మనిషి బొమ్మ గీసినట్లుగా రాసెయ్యాలి. అయితే పేపర్ కరెక్ట్ చేయు పెద్దమనిషి అమాయకుడు. 'పాపం! ఈ కుర్రాడెవడో క్వశ్చన్ సరీగ్గా అర్ధం చేసుకోలేకపొయ్యాడు. కానీ వీడికి ఆన్సర్ తెలుసు. తెలిసినా ఎందుకో సరీగ్గా రాయలేకపోయాడు.' అనే భావనతో మార్కులు వేసేస్తారు.

ఈ రకంగా రాయడం పేపర్ దిద్దే వ్యక్తిని మోసం చెయ్యడం అవదూ? ఆహా! ఎందుకవదు? ఇది ఖచ్చితంగా మోసం చెయ్యడమే. కానీ.. అట్లాంటి గిల్ట్ ఫీలింగ్స్ మనసులోకి రానీయకు. నథింగ్ పెర్సనల్. ఇదంతా ఆటలో భాగం. పరీక్ష పాసవ్వడమే నీ తక్షణ కర్తవ్యం. అంతలోనే మర్చిపోయ్యావా? 
                              
సెక్షన్ 3.

ఈ సెక్షన్ అతి ముఖ్యమైనది. అస్సలు అర్ధం కాని ప్రశ్నలు ఈ సెక్షన్లోనే ఉంటాయి. ఈ సెక్షన్ విడియో గేమ్ లో లాస్ట్ స్టేజ్ వంటిది. ప్రశ్నకి సమాధానం కనీసం ఏ చాప్టర్లో ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు మనం అతి జాగ్రత్తగా మన ఆవుకధని బయటకి తీసి రాయటం మొదలెట్టండి. సాలెపురుగు దారం మందాన సమాధానానికి, ప్రశ్నకి లంగరు వెయ్యండి. 
                            
ఈ ఆవుకధ సమాధానం రాయటంలో అండర్ కరెంట్ గా 'బాంచెన్! కాల్మొక్తా', 'అనాధ రక్షకా! పాహిమాం పాహిమాం' అని ఆర్తనాదాలు చేస్తూ మన దీనావస్థని ప్రదర్శిస్తున్నట్లుగానూ.. 'అయ్యా! మాదాకబళం తండ్రీ' అంటూ ముష్టెత్తుతున్నట్లుగానూ ద్వనింపచేయటం మంచిది. ఇక్కడ మన దురవస్థని ఎంత బాగా ప్రజంట్ చెయ్యగలిగితే అంత గిట్టుబాటు. అందుకే ఈ మూడో సెక్షన్ రాసేముందు మూడ్ కోసం 'నడిపించు నా నావా' మరియూ 'గాలివానలో వాననీటిలో' వంటి స్పూర్తిదాయకమైన పాటలు మనసులో పాడుకోండి.  
                    
ఆచార్యులవారు మన పేపర్దిద్దటం మొదలెట్టిన మొదట్లో ఎవడో distinction గాడి పేపేర్ దిద్దుతున్నానుకుంటారు. వారినలా అనుకోనిద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆయనగారి దిద్దుడు సెకండ్సెక్షన్లోకి వచ్చినప్పుడు 'పాపం చాలా మంచి స్టూడెంట్ ఇలా తికమక పడ్డాడేమిటి?' అనే అశ్చర్యంతో మార్కులు వేస్తారు. చివరి సెక్షన్ కొచ్చేసరికి మన అసలు రంగు బయట పడుతుంది. మన సినేమా కబుర్లు చదివి.. ఈ దరిద్రుడికి సత్తా లేదనీ, సత్తు రూపాయ్ గాడనీ అర్ధమైపోతుంది. కానీ అప్పటికే రెండోసెక్షన్లో ఉదారంగా మార్కులేసేసి ఉండటం చేత.. తను మోసపోయినందుకు పిచ్చికోపం వస్తుంది .  
                          
మిత్రులారా! మరొక్కసారి చెబుతున్నాను. అనాదిగా ఉపాధ్యాయులు ఉత్తములు, దయామయులు, కరుణా స్వరూపులు, సహృదయులు, ధర్మప్రభువులు. వారి కోపం పాలపొంగు. వీడి ఆవుకధకి గుండుసున్నా వేసి విసిరికొడదాం అనుకుంటూనే.. అప్పటిదాకా మనం స్కోర్ చేసిన మార్కులు చూస్తారు. పాసుమార్కులకి కూతవేటు దూరంలో.. సరిహద్దు గాంధీ వలే పారాడుతూ ఉండుట గమనించి ఆలోచనలో పడతారు.

'ఇంకొన్ని మార్కులు.. తృణమో, పణమో' అంటూ జిడ్డుమొహంతో, బిక్షాపాత్రతో వీధులంట తిరిగే దీనబిక్షువు వలే తచ్చాడుతున్న మన దురవస్థకి జాలిపడి 'యూజ్ లెస్ ఫెలో, ఈడియట్, యు డొంట్ డిజర్వ్ టు బి పాస్డ్' అని విసుక్కుంటూ పాసుకి అవసరమయ్యే దోసెడు మార్కులు.. మన ఆవుకధకి వేస్తారు.  
                      
ఏం పర్లేదు, ఫీలవ్వకండి. మనని వాళ్ళెంత తిట్టినా మనక్కావాల్సింది పాసవ్వటం. పైగా.. మనకి వాళ్ళ తిట్లు అర్దమయ్యేంత ఇంగ్లీషు రాదు కాబట్టి.. వాళ్ళ తిట్లు వాళ్ళదగ్గరే ఉండిపోతాయి, మన మార్కులు మనకి పడిపోతాయి. అమ్మయ్య! ఇప్పుడు మీరు పాసైపొయ్యారు. రిలాక్స్! హాయిగా సెకండు షో సినిమాకెళ్లి, అన్నం తిని బబ్బొండి.

ఉపసంహారం :

'భలే చెప్పావు. నీ జ్ఞానాన్ని బిందెల కొద్దీ బోర్లించావు. టిప్పులు బానే ఉన్నాయి. థాంక్స్! ఇన్ని నీతులు చెప్పిన నువ్వు, విద్యాధమరావుకి ఫీజు వాపసు ఎందుకివ్వలేదు?'

'అయ్యా! నేనిందాకే మనవి చేసుకున్నాను. ఒక్క డబ్బు విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను నిప్పులాంటి మనిషినని. పోస్టు ముందొక మాటా, వెనకొక మాట చెప్పే నిలకడలేని మనిషిని కాదు. ఫీజు వాపసిచ్చేసి నా కఠోర నియమాన్ని వదుకోలేను.'  
(pictures courtesy : Google) 

Friday, 29 November 2013

పి.లీల.. నాకు భలే ఇష్టం


నాకు చిన్నప్పట్నుండి చాలా ఇష్టాలున్నాయి, కొన్ని అయిష్టాలూ ఉన్నాయి. అయితే - ఇష్టమైనవి ఎందుకిష్టమో, ఇష్టం లేనివి ఎందుకయిష్టమో చెప్పగలిగే జ్ఞానం అప్పుడు లేదు.

'ఇప్పుడు చిన్నవాణ్ణి కదా! పెద్దయ్యాక అన్ని కారణాలు తెలుస్తాయిలే.' అని సరిపుచ్చుకునేవాణ్ని.

దురద్రుష్టం! పెద్దయ్యాక కూడా జ్ఞానానికి సంబంధించి నా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు.

నా జీవితంలో మొట్టమొదటగా నే విన్న పాట అమ్మ పాడింది. కావున నాకు తెలిసిన మొదటి గాయని అమ్మే. ఇదేమంత విశేషం కాదు. చాలామందికి వారి తల్లులే ప్రధమ గాయకులు. అయితే నే చెప్పేది 'చందమామ రావే! జాబిల్లి రావే!' టైపు పాట కాదు. చక్కటి సినిమా పాట. ఎలా? ఎప్పుడు?

చిన్నప్పుడు రోజూ అమ్మ పక్కలో పడుకునేవాణ్ని. అందుకొక బలమైన కారణం ఉంది. అమ్మ తప్ప ఇంట్లో ఎవరూ నన్ను తమ పక్కలో పడుకోబెట్టుకోడానికి సాహసించే వాళ్ళు కాదు. ఒకరకంగా నేను వారి పక్కలో పడుకునే హక్కుని కోల్పోయాను. ఇది నా స్వయంకృతాపరాధం. 

స్కూల్లో అవుట్ బెల్లు.. స్నేహితులతో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన పాసు పోసుకునేవాణ్ణి. కొద్దిసేపటికి ఎక్కడో చల్లగా అనిపించి మెళకువ వచ్చేది. పక్క దుప్పటి, నిక్కరు ముద్దగా తడిసిపోయుండేవి. ఇది కలా? నిజం కాదా?!

ఈ కల నాకు రాకుండా చెయ్యాలని ప్రతి రాత్రి దేవుడికి దణ్ణం పెట్టుకుని పడుకునేవాణ్ని. కానీ కల నుండి మాత్రం తప్పించుకోలేకపొయ్యేవాణ్ని! ఈ విధంగా ఆ కల నన్ను ప్రతి రాత్రీ వెంటాడగా.. అర్ధరాత్రి, నిద్రలో పక్క తడిపే కార్యక్రమం క్రమబద్ధంగా, నిర్విఘ్నంగా కొనసాగించాను. ఘోరమైన ఈ అలవాటు నాకు ఇంట్లో ఎవరి పక్కలోనూ స్థానం లేకుండా చేసింది.

అక్కైతే నన్ను తిట్టిపోసేది.

'ఒరే దున్నపోతా! నీకు మంచం ఎందుకురా? వెళ్లి ఆ బాత్రూములోనే పడుకుని చావు. నీకదే సరైన ప్లేసు.' ఎంత దారుణం! ఒక అర్భకుణ్ని ఇంతగా ఆడి పోసుకోవాలా? అయితే అక్క కోపానిక్కూడా ఒక కారణం ఉంది. మర్నాడు ఆ కంపుకొట్టే బట్టలు బక్కెట్లో ముంచేది అక్కే. అదీ సంగతి!

నాకేమో ఒక్కణ్ణే పడుకోడానికి బయ్యం. తెల్లచీర కట్టుకుని, జుట్టు విరబోసుకున్న ఓ ఆడమనిషి కిటికీలోంచి తొంగి చూస్తున్నట్లుగా అనిపించేది. అన్నట్లు ఆడదెయ్యాలు రంగు చీరలు ఎందుక్కట్టుకోవు? జడెందుకేసుకోవు? ఎందుకో ఇవ్వాల్టికీ నాకు తెలీదు.

ఈ విధంగా అందరి పక్కల నుండి బహిష్కృతుడనైన నేను.. నెమ్మదిగా అమ్మ పక్కలోకి చేరేవాణ్ని. అమ్మ నన్నెప్పుడూ ఏమీ అన్లేదు. 'కొన్నాళ్ళకి ఆ అలవాటు పోతుందిలే' అని ధైర్యం కూడా చెప్పేది. అమ్మ నాకు నిద్రోచ్చేదాకా పాట(లు) పాడేది. ఈ (లు) ఎందుకంటే .. మొదటి పాట పూర్తయ్యేలోపే నిద్ర పొయ్యేవాణ్ణి. కాబట్టి నేను నిద్ర పోయింతర్వాత అమ్మ ఇంకేమన్నా పాటలు పాడేదేమో నాకు తెలీదు.

అమ్మ రోజూ పాడే ఆ పాట - 'ఓహో మేఘమాల! నీలాల మేఘమాల! చల్లగా రావేలా, మెల్లగా రావేల'. అమ్మ గానం అద్భుతంగా అనిపించేది. పాట వింటూ నిద్రోలోకి జారుకునేవాణ్ని. రేడియోలో, సినిమాల్లో.. ఎక్కడా, ఎవరూ అమ్మ పాడినంత బాగా పాడేవాళ్ళు కాదని నా నిశ్చితాభిప్రాయం.

ఇక్కడో సందేహం. ఇంత బాగా పాడే అమ్మ మరి సినిమాల్లో ఎందుకు పాడట్లేదు? బహుశా వంటకి ఇబ్బందవుతుందని నాన్న వద్దనుంటాడు. అయినా అమ్మకి ఓసారి సలహా ఇచ్చాను. 'అమ్మా! నువ్వు సినిమాలకి పాడు.' అమ్మ చాలాసేపు చాలా సంతోషించింది. నన్ను మురిపెంగా ముద్దు పెట్టుకుని 'ఈ పాట సినిమాలో పి.లీల పాడింది. లీల అద్భుతమైన గాయని.' అన్నది.

అందువల్ల - అమ్మకి ఎంతగానో నచ్చిన 'ఓహో మేఘమాలా!' పాటంటే నాక్కూడా ఎంతో అభిమానం ఏర్పడిపోయింది. అమ్మకి ఇష్టమైన పి. లీల నాక్కూడా అభిమాన గాయని అయిపొయింది. నాకు లీల గొంతు మృదువుగా, దయగా, ఆత్మీయంగా, లోతుగా, మార్దవంగా వినబడుతుంది. ఒకే గొంతు ఇన్ని 'గా'లుగా ఎలా వినిపిస్తుంది అని అడక్కండి. నాదగ్గర సమాధానం లేదు.

సినిమా పాటల పండితులు తమ పాండిత్య ప్రావీణ్యంతో తూకం వేసి.. లతా మంగేష్కర్, ఎస్.జానకి వంటివారు లీల కన్నా గొప్పగా పాడతారని తేల్చినచో తేల్చుగాక. నేనస్సలు పట్టించుకొను. ఎందుకంటే నాకు సంగీతం తెలీదు. పాట గొప్పగా పాడటం అంటే ఏంటో కూడా తెలీదు. అంచేత లీల గొప్ప గాయని అని వాదించి ఒప్పించలేను. కానీ - లీల ఎక్కాల పుస్తకంలో రెండో ఎక్కాన్ని పాటగా పాడినా నాకిష్టమే!

నాకు ఇష్టమైన అమ్మకి లీల ఇష్టం. ఎవరికైనా ఇష్టమైన వారికి ఇష్టమైనది ఇష్టంగా కాకుండా ఎలా ఉంటుంది? నేను లీలని ఇష్టపడటంలో నా పసితనం, నా కుటుంబం, అమ్మ నాకోసం పడ్డ కష్టాలు.. వంటి ఆత్మీయ జ్ఞాపకాలు కలగలిపి ఉన్నాయి. అందుకే లీల గానం నాకో మధురమైన అనుభూతి.

నాకెంతో ఇష్టమైన పాట యూట్యూబులో ఇస్తున్నాను. విని ఆనందించండి.(photos courtesy : Google)

Wednesday, 27 November 2013

వేతనశర్మలు ఉద్యమకారులేనా?


(నేనింతకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఉద్యమం గూర్చి 'వేతనశర్మ' ఉద్యమం  అని ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు ఆ పోస్టుకి కొనసాగింపుగా రాస్తున్నాను.)

ప్రభుత్వోద్యోగులు 'సమైక్యాంధ్ర' అంటూ ఒక ఉద్యమాన్ని నడిపారు. నాకు పరిచయం ఉన్న చాలామంది ఆ ఉద్యమ నాయకుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనీ మధ్య మళ్ళీ సమైక్య ఉద్యమం మొదలెడుతున్నానని గాండ్రించాడు. ప్రజలు ఆ ఉద్యోగ నాయకుడిలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగుల్ని గాంచారు, పరవశించారు. నేను మాత్రం ఆ నాయకుళ్ళో ఓ పులిని వీక్షించాను. అందుకే నాకాయన గాండ్రించినట్లనిపించింది.

హిట్లర్ కన్నా దుర్మార్గుడు, ఘంటసాల కన్నా గొప్పగాయకుడు, రావిశాస్త్రి కన్నా గొప్ప రచయిత ఈ ప్రపంచంలో లేడని నా ప్రగాఢ నమ్మకం. అనేక ప్రాపంచిక విషయాల్ని రావిశాస్త్రి కథల దృక్పధం నుండే నేను అర్ధం చేసుకుంటుంటాను. ఇందుకు నేను బోల్డెంత సంతోషంగానూ, గర్వంగానూ ఫీలవుతుంటాను కూడా.

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన 'వేతనశర్మ కథ' చదవడం వల్ల నాకు ఉద్యోగుల పట్లా, వారి ఉద్యమాల పట్ల గొప్ప అవగాహన కలిగింది. అందుకే నాకెంతో ఇష్టమైన ఆ కథకి పరిచయం కూడా రాసుకున్నాను. రావిశాస్త్రి పుణ్యమాని.. నాకు ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తే పులులు గుర్తొస్తాయి. కొందరికి పులంటే భయం. ఇంకొందరికి పులిలో రాజసం, ఠీవి కనిపిస్తాయి. నాకు మాత్రం పులి ప్రమాదకరంగా కనిపిస్తుంది.

నాకు తెలిసిన చాలామందికి గవర్నమెంటు ఆఫీసుల్లో చేదు అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఉద్యోగులు సామాన్య మానవుణ్ని అమెరికావాడు ఇథియోపియా కరువు బాధితుణ్ణి చూసినట్లు అసహ్యించుకుంటారు. తప్పదు! వారి పని ఒత్తిడి అంత గొప్పగా ఉంటుంది! జీవితం మీద విరక్తి కలగాలంటే ఏదైనా పని మీద గవర్నమెంటు ఆఫీసుకి వెళ్తే చాలని అనేకమంది అభిప్రాయం. సామాన్య మానవులెవరైనా ఏ గవర్నమెంట్ డిపార్టమెంట్లోనైనా సరే.. సకాలంలో పని పూర్తి చేసుకుని, గౌరవప్రదంగా బయటపడ్డారంటే వారికి సన్మానం చెయ్యాల్సిందే.

ప్రభుత్వాలు ఉద్యోగస్తుల ద్వారా టాక్సులు వసూలు చేస్తాయి. ఆ మూలధనంతో ప్రజల అవసరాల కోసం ఎలా ఖర్చు చెయ్యాలో ప్లాన్లు వేస్తాయి. దీన్నే బడ్జెట్ అంటారు. అయితే మన బడ్జెట్లో సింహభాగం ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. మిగిలిన కొంత సొమ్ముని ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం మరియు పేదప్రజల సంక్షేమ పథకాల నిమిత్తం ఖర్చు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులదే ప్రధాన పాత్ర. అయితే వారు వారి పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా?

ఉద్యోగస్తులు సంఘటితంగా పోరాడి తమ డిమాండ్లు సాధించుకుంటున్నారు. మంచిది. అది వారి హక్కు. కాదనడానికి మనమెవరం? అయితే వీళ్ళని మనం కొన్ని ప్రశ్నలు వెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళకి జీతాలు వచ్చేది మనం కట్టే పన్నుల్లోంచి కావున. మరి వీళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధుల్ని నిర్వర్తిస్తున్నారా? 

ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాల్లో పదిరూపాయిలు తేడా వస్తే మెరుపు సమ్మె చేస్తారు. ఒకరోజు సీనియార్టీ తేడా తేల్చుకుందుకు సుప్రీం కోర్టు తలుపు కూడా తడతారు. 'మా జోలికి వచ్చారా? ఖబడ్దార్. మేం ఎన్టీఆర్ ని మట్టి కరిపించాం. చంద్రబాబుకి బుద్ధి చెప్పాం. ఆలోచించుకొండి.' అంటూ ప్రభుత్వాలకి మాఫియా టైపు వార్నింగులిస్తారు.

ప్రభుత్వ డాక్టర్లు కూడా 'సమైక్యాంధ్ర' అంటూ రోజుకో స్కిట్ తో వెరైటీ ప్రదర్శనలు నిర్వహించారు. మంచి వినోదాన్ని పంచారు. ప్రభుత్వ డాక్టర్లూ! మీకున్న సామాజిక స్పృహకి వందనాలు. కానీ మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు నెలకి ఎన్ని రోజులు వారి ఆస్పత్రికి వెళ్తున్నారు? మీ అందరికి ప్రైవేట్ నర్సింగ్ హోములు ఎందుకున్నాయి? లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటూ పేదప్రజలకి సరైన వైద్యం అందించడంలో మీ పాత్ర సక్రమంగా నిర్వహిస్తున్నారా? 

అసలు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఒక పేద దేశానికి అవసరమా? ఒకే కాయితం వివిధ సంతకాల కోసం అనేక సెక్షన్ల మధ్యన గిరిగీలు కొట్టించే ఈ ఉద్యోగుల వ్యవస్థ మన దేశ ఆర్ధిక ప్రగతికి అడ్డంకి కాదా? వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం కలిపించి.. వారిని చచ్చేదాకా టాక్స్ పేయర్స్ మనీతో పోషించే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ దేశానికి ఏ విధంగా మేలు చేస్తుంది?

ఈనాడు మన యువత అనేక రంగాల్లో దూసుకెళ్తుంది. మనకి ప్రతిభావంతుల కొదవ లేదు. కానీ వారి సేవల్ని ప్రభుత్వ స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండటం దురదృష్టం. సరైన వ్యవస్థని సృష్టించుకుని, మన యువతని సరీగ్గా వాడుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని నా అభిప్రాయం. అటువంటి పరిస్థితి రావాలని, వస్తుందని ఆశిద్దాం.

Monday, 25 November 2013

పుట్టిన్రోజు పండగే! అందరికీనా?


"ఫలానా ఫంక్షన్ హాల్లో ఎల్లుండి మా అమ్మాయి పుట్టిన్రోజు ఫంక్షన్. ఆ ఫంక్షన్ హాలు వాళ్లకి సొంతంగా డెకరేషన్ చేసేవాళ్లు వున్నార్ట. వాళ్లు చూపించిన పుష్పాలంకరణ డిజైన్లు మాకు నచ్చలేదు. మా బామ్మర్ది కూతురి ఓణీల ఫంక్షనప్పటి డెకరేషన్ మాక్కావాలి. మా డిజైన్ని హాలువాళ్లు ఒప్పుకోడం లేదు. మీరు కొద్దిగా మాట సాయం చెయ్యాలి."

ఇంతటి తీవ్రమైన కష్టంలో ఉన్న అతగాడు నా స్నేహితుడికి స్నేహితుడు, పురుగు మందుల వ్యాపారం చేస్తాట్ట. నల్లగా, బొజ్జతో భారీగా ఉన్నాడు. అయితే ఆయనకి నేన్చేయగలిగిన సహాయం ఏంటో నాకర్ధం కాలేదు. నాకైతే మాత్రం పుష్పాలంకరణలో ప్రావీణ్యం లేదు, నా స్నేహితుడి వైపు క్వశ్చన్ మార్కు మొహంతో చూశాను.

"ఆ ఫంక్షన్ హాలు ఓనర్ కూతుర్ని నువ్వు ట్రీట్ చేస్తున్నావు. ఆయనకి ఫోన్లో ఓ మాట చెప్పు, చాలు." అన్నాడు నా స్నేహితుడు.

ఇంతలో ఓ ధర్మసందేహం.

"అవునూ.. అలంకరణ ఎట్లా వుంటే ఏంటి? అదంత ముఖ్యమైందా?" పురుగు మందులాయాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.

ఆయన నాకేసి క్షణకాలం క్రూరంగా చూశాడు.

"స్పెషల్ డెకరేషన్ ఫోటోలు బెజవాడ వెళ్లి మరీ తీయించుకొచ్చాను. ఇప్పుడీ డెకరేషన్ కుదర్దేమోనని ఇంట్లో ఆడాళ్ళందరూ అన్నం మానేసి శోకాలు పెడుతూ ఏడుస్తున్నారు.. అసలే నా భార్య హార్ట్ పేషంటు. ఖర్చు ఎగస్ట్రా ఎంతైనా పరవాలేదు, పుష్పాలంకరణలో మాత్రం తేడా రాకూడదు." స్థిరంగా అన్నాడాయన.

ఇప్పుడు మరో ధర్మసందేహం.

"మరి నే జెబితే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ వింటాడా?" నా స్నేహితుణ్ని అడిగాను.

"అన్నీ కనుక్కునే వచ్చాం, నువ్వొక మాట చెప్పు చాలు." అన్నాడు నా మిత్రుడు.

ఎంత ప్రయత్నించిన నా మొహంలోని చిరాకుని దాచుకోలేకపొయ్యాను. ఏమిటీ గోల? ఒక పుట్టిన్రోజు ఫంక్షను.. దానికో అలంకరణ.. మళ్ళీ ఓ స్పెషల్ డెకరేషన్ట! ఈ దిక్కుమాలిన దేశంలో ఒక్కోడిది ఒక్కోగోల. ఈ రోజుల్లో డాక్టర్ల మాట వినేవాడెవడు? వింటే గింటే పోలీసోళ్ల మాటో, టాక్సు డిపార్టుమెంటు వాళ్ల మాటో వింటారు గాని! అయినా నాదేం పోయింది? ఒక మాట చెబుతాను.. అతగాడెవరో వింటే వింటాడు, లేపోతే లేదు.

ఫోన్నంబరు వాళ్ళ దగ్గరే తీసుకుని.. ఆ ఫంక్షన్ హాల్ పెద్దమనిషికి ఫోన్ చేసి నా ఎదురుగా కూర్చున్న పురుగు మందుల పుష్పవిలాపాన్ని వివరించాను. అవతల ఆయన అత్యంత మర్యాదగా 'ఓహో అలాగే' అన్నాడు. ఆశ్చర్యపొయ్యాను. పోన్లే! నా పరువు నిలిపాడు. ఊళ్లో నాకింత పరపతి వుందని నాకిప్పటిదాకా తెలీదు! నాకు థాంక్సులు చెబుతూ వాళ్లిద్దరూ వెళ్ళిపోయారు.

వాళ్లు వెళ్లిన వైపే చూస్తుండిపొయ్యాను. ఇదంతా చేసింది నేనేనా! ఒకానొకప్పుడు నాకు నచ్చని విషయాల్ని  పురుగులా చూసేవాణ్ని. ఇప్పుడు నాకింత సహనం ఎక్కణ్ణుంచి వచ్చిందబ్బా! ఔరా! ఏమి ఈ వయసు మహిమ! మనుషుల్ని ఎంతగా నిర్వీర్యం చేసేస్తుంది!

అలా ఎందుకనుకోవాలి? ఇంకోలా అనుకుంటాను. నేనిప్పుడు పెద్దమనిషి నయినాను. అందుకే ఎదుటివారి దురదల్ని ఎంతో విశాల హృదయంతో అర్ధం చేసుకునే స్థాయికి ఎదిగాను. శభాష్ ఢింబకా! ఇలాగే అనుకుంటూ కంటిన్యూ అయిపో! నీకు తిరుగు లేదు.

మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఇక్కడే ఏదో తేడాగా వుంది. కానీ అదేంటో సరీగ్గా అర్ధం కాకున్నది. ఆ పురుగు మందులాయనా, నేనూ ఒకే ఊరి వాళ్ళం.. దాదాపు ఒకే వయసు వాళ్ళం. ఆయనకేమో ఇదో జీవన్మరణ సమస్య, నాకేమో ఒక భరింపరాని రోత. ఇద్దరి మనుషుల మధ్య మరీ ఇంత తేడానా! 

'ఓ ప్రభువా! పాపపంకిలమైన ఈ లోకంలో నీ శిశువుల్ని మరీ ఇంత దారుణమైన తేడాతో పుట్టించితి వేల?'

నేనెప్పుడూ పుట్టిన్రోజు జరుపుకోలేదు. అందుక్కారణం నా సింప్లిసిటీ కాదు. అదేంటో తెలీక! నా చిన్నతనంలో పుట్టిన్రోజు అంటే కుంకుడు కాయలు కొట్టుకుని తలంటు పోసుకోవటం (తలంటుకి 'షాంపూ' అనేదొకటుందని పెద్దయ్యేదాకా నాకు తెలీదు), (వుంటే గింటే) కొత్త బట్టలు తోడుక్కోవడం, దేవుడికి కొబ్బరికాయ కొట్టి (కొబ్బరికాయ ఇంట్లోనే కొట్టవలెను. గుళ్ళో కొట్టిన యెడల ఒక చిప్ప తగ్గును. తదుపరి ఇంట్లో కొబ్బరి పచ్చడి పరిమాణము కూడా తగ్గును), అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసేవాణ్ణి. అందుకు ప్రతిఫలంగా అమ్మ ఇచ్చిన పదిపైసల్తో సాయిబు కొట్లో నిమ్మతొనలు కొనుక్కుని చప్పరించేవాణ్ని. అదే నా పుట్టిన్రోజు పండగ!

అటుతరవాత హైస్కూల్ రోజులకి నా పుట్టిన్రోజు కానుక రూపాయి బిళ్ళగా ఎదిగింది. ఆ డబ్బుతో లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్లో సినిమా చూసేంతగా నా స్థాయి పెరిగింది. పుట్టిన్రోజు పండగలంటూ స్నేహితుల్ని ఇంటికి పిలవడం, కొవ్వొత్తులు ఆర్పి కేకు కత్తిరించడం సినిమాల్లో మాత్రమే చూశాను. నిజజీవితంలో ఎవరూ అలా జరుపుకోగా నేను చూళ్ళేదు. అంచేత పుట్టిన్రోజు నాకంత పట్టింపు లేకుండా పోయింది.

మెడిసిన్ చదివే రోజుల్లో జేబులో డబ్బులుండేవి. అయితే ఒంట్లో ఉడుకు రక్తం తీవ్రమైన వేగంతో ప్రవహిస్తుండేది. భావాలు, అభిప్రాయాలు అల్లూరి సీతారామరాజు స్థాయిలో ఉండేవి. నాకు నచ్చని ఏ విషయాన్నైనా 'ఆత్మవంచన రూదర్ ఫర్డ్' టైపులో సూపర్ స్టార్ కృష్ణలా గర్జిస్తూ వాదించేవాణ్ని. 'ఈ పుట్టిన్రోజు వేడుకలు, ఆర్భాటాలు డబ్బున్న వాళ్ళు తమ సంపదని సెలెబ్రేట్ చేసుకునే అసహ్యకర నిస్సిగ్గు ప్రదర్శన' అంటూ బల్ల గుద్దేవాణ్ణి.

పిమ్మట సలసల మరిగే నా రక్తం హ్యూమన్ బాడీ టెంపరేచర్ స్థాయికి పడిపోయింది. క్రమేణా నాలో 'ఎవడి దురద వాడిదే' అనే నిర్వేద తత్వం వచ్చేసింది. ఇవ్వాల్టి సంఘటనతో నా రక్తం టెంపరేచర్ ఫ్రిజ్జులో ఐస్ వాటర్ స్థాయికి దిగిపోయిందన్న సంగతి అవగతమైంది.

పెళ్ళైన కొత్తలో నా భార్య ఒక అర్ధరాత్రి సరీగ్గా పన్నెండు గంటల ఒక్క సెకండుకి నాకు పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెబితే మొహం చిట్లించాను, ఆవిడ బిత్తరపోయింది. తర్వాత్తర్వాత నా మనసెరింగిన అర్ధాంగియై నాకు విషెస్ చెప్పడం మానేసింది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ స్నేహితుల్తో పుట్టిన్రోజు పార్టీలు చేసుకుంటున్నారు. ఆ తతంగానికి నాది ప్రొడ్యూసర్ పాత్ర మాత్రమే కావున ఏనాడూ ఇబ్బంది పళ్ళేదు.

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అనడిగాడు మహాకవి శ్రీశ్రీ ('దేశచరిత్రలు' చదివాక నాలోని అనేక బూజు భ్రమలు తొలగిపోయ్యాయి). పుట్టిన్రోజు కేకులమ్మే బేకరీ కుర్రాళ్లెవరైనా, యేనాడైనా ఆ కేకుని కోసుకుని తమ పుట్టిన్రోజు జరుపుకున్నారా? ఐదునక్షత్రాల ఆస్పత్రిలోని వార్డు బాయ్ తనకి కొడుక్కి జొరమొస్తే ఎక్కడ వైద్యం చేయిస్తాడు?

ఇప్పుడింకో సందేహం. నాది మధ్యతరగతి నేపధ్యం, పుట్టిన్రోజులు జరుపుకోలేని స్థాయి. నా చిన్నతనంలో కూడా కొవ్వొత్తులు, కేకుల పుట్టిన్రోజులు జరపబడే వుంటాయి. కాపోతే నాకు ఆ స్థాయివాళ్ళతో పరిచయం వుండి వుండదు. హిమాలయాల్ని చూడని వాడికి బెజవాడ కనకదుర్గమ్మ కొండే హిమాలయం. బహుశా నాదీ ఆ కేసేనేమో!

'ఓయీ వెర్రి వైద్యాధమా! నిండుగా దుడ్డు గలవాడు ఏదైనా సెలెబ్రేట్ చేసుకుంటాడు. సరదా పుడితే తను వుంచుకున్న నారీ రత్నానికీ, పెంచుకున్న బొచ్చుకుక్కక్కూడా పుట్టిన్రోజు ఫంక్షన్ చేస్తాడు. మధ్యలో నీ ఏడుపేంటి? ఓపికుంటే వెళ్లి 'హ్యాపీ బర్త్‌డే' చెప్పేసి, ఫ్రీగా భోంచేసి వచ్చెయ్యి! అంతేగానీ - యెంత పన్లేకపొతే మాత్రం యిలా అల్పమైన విషయాలక్కూడా రీజనింగులు, లాజిక్కులు వెతక్కు.'

అయ్యా! ఎవరన్నా తమరు? తెలుగు సినిమా పోలీసులా ఈ రాత క్లైమేక్సులో వొచ్చి ఫెడీల్మని మొహం మీద కొట్టినట్లు భలే తీర్పు చెప్పారే! ఈ నాలుగు ముక్కలు ఇంకొంచెం ముందొచ్చి చెప్పినట్లైతే నాకీ రాత బాధ తప్పేదికదా!

updated and posted in fb on 30/1/2018)