Thursday 31 August 2017

బానిసలు మళ్లీ పుట్టారు

అది అబ్రహం లింకన్ కాలం -

బానిసత్వంపై అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది. బానిసలు స్వతంత్రులవుతున్నారు. అయితే - అన్ని రంగాల్లో dissent వున్నట్లే, బానిసల్లో కూడా కొందరికి బానిసత్వ విముక్తి నచ్చలేదు.

వారిలో - "మనకి బానిసత్వం బాగానే వుంది కదా! ఇప్పుడు దీన్ని వదులుకోడం దేనికి?" అనే వాదన మొదలైంది.

ఈ వాదనకారుల్లో ఒకడు యాభై సంవత్సరాలు బానిసత్వంలో పండిపోయినవాడు. అతను ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్పాడు.

"ఉరే బానిసబ్బాయిలూ! అమెరికా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి, బానిసత్వం అంతరించిపోయే ప్రమాదం కనుచూపు మేరలోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం 'మేం బానిసలుగానే మిగిలిపోతాం' అంటే మన తోటి బానిసలే మన్ని బ్రతకనివ్వరు." అంటూ నిట్టూర్చాడు.

"అంతేనా, మనం మన అమూల్యమైన బానిసత్వాన్ని వదులుకోవాల్సిందేనా? అయ్యో!" అంటూ బానిసలు సామూహికంగా పెడబొబ్బలు పెడుతూ రోదించసాగారు.

'ఇంక చాలు, ఆపండి' అన్నట్లు కుడిచెయ్యి పైకెత్తి వారిని వారించాడు సీనియర్ బానిస.

"మనం ఇంతలా రోదించనవసరం లేదు. నిన్నరాత్రి అంజనం వేసి చూశాను. అక్కడెక్కడో 'భారద్దేశం' అనే దేశం వుందిట, అందులో 'తెలుగు' అనే భాష మాట్లాడే జనులున్నారట! వాళ్లదీ అచ్చు మనలాంటి బానిసబుద్ధేట! మనం పునర్జన్మలో మళ్లీ అక్కడ పుడతాం. తెలుగు సినిమాలకి అభిమానులుగా వుంటాం. హీరోలకీ, వారి కుటుంబాలకీ, వంశాలకీ సేవ చేసుకుంటూ.. ఇంచక్కా బానిసల్లా బ్రతికేస్తాం." అంటూ కఫం అడ్డొచ్చి దగ్గాడు.

బానిసలకి వొళ్ళు పులకరించింది, ఆనందంతో గెంతులు వేసుకుంటూ - "బానిసత్వం వర్ధిల్లాలి, బానిసలూ జిందాబాద్!" అంటూ నినాదాలు చేశారు.

(రావిశాస్త్రి 'వేతనశర్మ' సౌజన్యంతో)

(fb post)

Wednesday 30 August 2017

అభిమానుల దురభిమానం

నా చిన్నప్పుడు NTR, ANR అభిమాన సంఘాల మధ్య భీభత్సమైన వైరం వుండేది. అభిమానులు యెదుటి హీరో సినిమా పోస్టర్ మీద పేడసుద్దలు కొట్టి ఆనందించేవాళ్లు. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత చదువు లేదు, టెక్నాలజీ లేదు.. కాబట్టి సినిమా హీరోల వీరాభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఇవ్వాళ టెక్నాలజీ పెరిగింది. సమాజంలో చదువులు/ఉద్యోగాలు/డబ్బులు పెరిగాయే గానీ సినీహీరోల అభిమానుల బుర్ర మాత్రం అలాగే వుండిపోయింది (ఈ బుర్ర తక్కువతనం కార్పొరేట్ చదువుల నిర్వాకం). ఆనాటి పేడసుద్దలు ఈనాడు online abuses గా రూపాంతరం చెందాయి.

ఈ మనస్తత్వం కలిగున్నవాళ్లే - గోవధ/sexual offences/దొంగతనం సమయాల్లో దొరికిన నిందితుల్ని తీవ్రంగా హింసించి చంపేస్తున్నారు. దీన్ని సైకాలజిలో lynch mob mentality అంటారు. ఇందుక్కారణం సమాజంలో హింస పెరిగిపోవడం, అది యే చిన్న అవకాశం దొరికినా ఇలా ventilate అవుతుంది. గాంధీ పుట్టిన దేశం ఇలా మారిపోవడం ఒక విషాదం.

తమ హీరోని/బాబాని విమర్శించినవారిపై మూకుమ్మడి దాడి చెయ్యడం ఒక సామాజిక రుగ్మత. ఈ జబ్బు యెంత తొందరగా తగ్గితే సమాజానికి అంత మంచిది (లేకపోతే multi organ failure తో చచ్చిపోతుంది). ఈ మూకలు అనాగరికులనీ, అందుకే వారిని తాము దూరంగా పెట్టేస్తామనే పెద్దమనుషులు.. తాము safe zone లో వుండొచ్చు గాక.. కానీ - వారూ ఈ రోగం పెరగడానికి కారకులే!

(fb post)

అంతులేని అజ్ఞానం

కొందరు వ్యక్తులు వయసొచ్చి పరిమాణంలో మాత్రమే పెరుగుతారు. విషయం తెలుసుకోవాలని ప్రయత్నించరు, చెప్పినా అర్ధం చేసుకోరు, పుస్తకం చదివే ఓపిక వుండదు. పూర్తిస్థాయి ఆజ్ఞాని మాత్రమే తన కులం/మతం/ప్రాంతం/భాష/దేశం గొప్పదని విర్రవీగుతాడు.

అందువల్ల - సాధారణంగానే వీళ్లు తమ కులానికి చెందిన రాజకీయ పార్టీనో/సినిమా నటుడినో వెర్రిగా అభిమానిస్తూ బ్రతుకు వెళ్ళమారుస్తుంటారు. ఇలా ఆలోచించే అవసరం లేకుండా బ్రతికేస్తుండటం వల్ల, వీరికి మెదడులో language centers కూడా సరీగ్గా develop అవ్వవు. అందుకే కోపాన్ని వ్యక్తీకరించడానికి బూతుభాషనీ, బెదిరింపుల్నీ ఎంచుకుంటారు.

భారతదేశ ప్రజాస్వామిక విలువల్నీ, భావప్రకటనా స్వేచ్చనీ అర్ధం చేసుకోవడం వీరికి శక్తికి మించిన పని. ఒకప్పుడు ఆధునిక భావజాలంతో కళకళ్లాడిన యువత, నేడు ఆలోచించే శక్తిని కోల్పోయి.. బానిస భావజాలంతో కునారిల్లడం నవీన భారద్దేశంలో ఒక విషాద సమయం.

(ఈ కారణాన, ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతూ తీవ్రంగా దుఃఖిస్తున్నాను)

(fb post)

Friday 25 August 2017

గోరఖ్‌పూర్ విషాదం


మనకి స్వతంత్రం వచ్చి డెబ్భైయ్యేళ్ళైంది, గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో డెబ్భైమంది చిన్నారులు పీల్చుకోడానికి ఆక్సిజన్ లేక మరణించారు. What an irony!

మనం అభివృద్ధి పేరుతో ఎత్తైన బిల్డింగులు కడుతున్నాం, వెడల్పాటి రోడ్లని వేస్తున్నాం, రికార్డ్ నంబర్లో శాటిల్లైట్స్ పైకి పంపిస్తున్నాం.. జబ్బుతో తీసుకుంటున్న పసిపిల్లలకి మాత్రం ఆక్సిజన్ అందేలా మాత్రం చెయ్యలేకపోతున్నాం!

Poor living conditions లో జీవిస్తున్న పేదవారికి దోమలు బంధువులు! అంచేత అవి యెడాపెడా వారిని కుట్టేసి vector borne diseases తెప్పించేస్తయ్, నీళ్ళు కలుషితమై water borne diseases వచ్చేస్తయ్.

మనం public health delivary system ని పటిష్టపరచాలంటే మరిన్ని ఆస్పత్రులు కావాలి.. trained personnel కావాలి.. మందులు కావాలి.. వసతులు కావాలి.. రీసెర్చ్ జరగాలి.. వీటన్నింటికీ నిధులు కావాలి.

అందువల్ల తగినంత నిధులు వెచ్చిస్తూ.. అవి సద్వినియోగం అయ్యెలా పర్వవేక్షణ చేస్తూ.. పరిస్థితి మెరుగయ్యేలా చేసుకోవడం బాధ్యత కల ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని.

కానీ - మన దేశం health budget allocation అభివృద్ధి చెందిన దేశాల్తో పోలిస్తే చాలా చాలా తక్కువ. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల్తో పోల్చినా తక్కువే.

అంచేత - ప్రభుత్వాలు health budget allocation ని తక్షణమే పెంచి, public health delivery system ని మెరుగు పరచాలి. లేకపోతే గోరఖ్ పూర్ సంఘటన పునరావృతం అయ్యే ప్రమాదం వుంది.

కాబట్టి - కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంపై war foot basis న దృష్టి సారించి పరిస్థితుల్ని మెరుగు పర్చాలని కోరుకుంటున్నాను.

(fb post)

Wednesday 16 August 2017

రోజులు మారాయి


సినిమాలు అనేక రకాలు. ఒక్కొక్కళ్లకి ఒక్కోసినిమా ఒకందుకు నచ్చుతుంది/నచ్చదు. చిన్నప్పుడు హాల్లో ఎక్కువగా ఫైటింగ్ సినిమాలు చూశాను, ఆ సినిమాలన్నీ తరవాత చూస్తే విసుగ్గా అనిపిస్తుంటాయి. ఇదొక పరిణామ క్రమం.

తెలుగులో నచ్చిన సినిమాల గూర్చి రాద్దామంటే నాకిప్పుడో భయం పట్టుకుంది. కారణం - వాటి ఇంగ్లీష్ మూలం చెప్పేస్తున్నారు. కాపీ ఐడియాతో సినిమా యెంత గొప్పగా తీసినా, అది మంచి సినిమా అవ్వొచ్చేమోగానీ.. గొప్ప సినిమా మాత్రం అవ్వదని నా అభిప్రాయం.

'తెలుగు సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా యేది?' అని అడగంగాన్లే గత కొన్నేళ్లుగా ఠక్కున 'రోజులు మారాయి' అని చెబుతున్నాను. ఈ సినిమా గూర్చి వివరంగా రాద్దామనే కోరిక తీరలేదు, ఇక తీరే అవకాశమూ లేదని అర్ధమైంది.

'రోజులు మారాయి' పూర్తిగా గ్రామీణ జీవితం. సినిమాలో రైతు జీవితం వుంటుంది, ఇంకేదీ వుండదు. రైతుల భూమిసమస్య, భుక్తి సమస్య, బ్రతుకు సమస్య.. వారి దృష్టికోణంలో చూపిస్తుంది. కులాల కట్టుబాట్లు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తీరు సూటిగా చెబుతుంది. సన్నివేశాల చిత్రీకరణ, కథ మనమధ్యే జరుగుతున్నంత సహజంగా వుంటుంది.

మీరు చూడకపోయినట్లైతే, ఒకసారి చూడదగ్గ సినిమా 'రోజులు మారాయి'. మీకీ సినిమా నాకు నచ్చినంత గొప్పగా నచ్చకపోయినా.. ఎంతోకొంత నచ్చుతుందని నమ్ముతున్నాను.

'రోజులు మారాయి'లోంచి ఒక ముఖ్యమైన సీన్ ఇక్కడ ఇస్తున్నాను (ఆ రోజుల్లో కలెక్టర్లు నిజాయితీ, నిబద్దత కలిగిన మంచి ఆఫీసర్లు - ఈ రోజుల్లోలా కాదు). 

(fb post)

Monday 7 August 2017

విగ్రహాల దుస్థితి


ఈమధ్య మాజీరాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం చూశాను, విగ్రహం వీణ మీటుతుంది! కలాం పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ శాకాహారాన్నే భజిస్తూ, వీణ మీటుతూ, భగవద్గీత పారాయణం చేస్తూ, హిందూ సన్యాసుల కాళ్లకి మొక్కుతూ.. ఆచరణలో బ్రాహ్మణవాదిగా ప్రచారం పొందాడు. కాబట్టి ఆయన విగ్రహంలో వీణ వుండటం politically correct అనుకుంటాను. 

ఇప్పుడు ఘంటసాల విగ్రహం చూద్దాం - 

ఘంటసాల విగ్రహం తంబురా మీటుతూ వుంటుంది! నాకు తెలిసి ఘటసాల శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందినా, ఆ రంగంలో కచేరీలు చెయ్యలేదు. ఒక professional singer గా - సినిమా సన్నివేశాలకి తగ్గట్టు తాగుబోతు పాటలూ, యెట్టాగో ఉన్నాది ఓలమ్మీ! అంటూ గంతులేసే పాటలూ పాడుకున్నాడు. మరి ఘంటసాల విగ్రహంతో తంబురాకేం పనో మనకి తెలీదు.

నాకు తోచిన కారణం - సినిమా పాటల ఘంటసాలకి శాస్త్రీయ సంగీత ఘంటసాలగా ప్రమోషన్ కల్పించడంలో భాగంగా తంబురా వచ్చి చేరింది. అవ్విధముగా ఘంటసాలవారికి పవిత్రత చేకూరింది! ఇదో cultural identity issue.

ఈవిధంగా - విగ్రహాల ద్వారా కూడా వర్తమాన స్థితిగతుల్ని అంచనా వెయ్యొచ్చని నా అభిప్రాయం. 

(fb post)

ఉసైన్ బోల్ట్


ఉసైన్ బోల్ట్ రిటైర్ అయిపొయ్యాడు. 'ఆయనో గొప్ప క్రీడాకారుడు, ఒక శకం ముగిసింది' అంటూ అరిగిపోయిన వాక్యాలు రాయను కానీ.. ఈ సందర్భంగా మన క్రీడాకారుల గూర్చి నాలుగు ముక్కలు.

వంకాయకూర యెంత బాగున్నా మర్నాడు తిండానికి పనికిరాదు. క్రీడాకారులూ అంతే! యెంత గొప్ప క్రీడాకారుడైనా, యెప్పుడోకప్పుడు రిటైర్ అవ్వాల్సిందే. ఈ రిటైర్‌మెంటుల్లో ఒక్కక్కళ్లది ఒక్కోబాణి. కొందరు క్రీడాకారుల రిటైర్‌మెంట్ 'అప్పుడేనా!' అనిపిస్తే, ఇంకొందరు 'యెప్పుడు?' అనిపిస్తారు. ఈ 'యెప్పుడు?' బ్యాచ్‌లో యెప్పుడూ మనవాళ్లే వుంటారు.

గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, టెండూల్కర్.. షెల్ఫ్ లైఫ్ అయిపోయినా టీముని పట్టుకు వేళ్లాడిన ఈ లిస్టు పెద్దది (లేటెస్ట్ ఉదాహరణ ధోనీ). అభిమానులకి రోతపుట్టి 'యాక్' అనేదాకా వీళ్లు రిటైర్ అవ్వలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెలక్టర్లు వీళ్లని చాలా ముందుగానే ఇంటికి పంపేవారు. కానీ మనదేశంలో వీళ్లు సూపర్ స్టార్లు, తీసేసే ధైర్యం సెలక్టర్లకి వుండదు.

మనవాళ్లకీ వేళ్లాడే తత్వం యెందుకు? అందుకు ప్రధాన కారణం "డబ్బు" అని అనుకుంటున్నాను. పేదదేశాల్లో భవిష్యత్తు గూర్చి అబద్రత వుంటుంది, అందువల్ల సంపాదించే అవకాశం వున్నచోట గ్రీడీగా వుంటారు. సంపాదనలో 'చివరి రూపాయిదాకా పిండుకుందాం' అనే కక్కుర్తిలోంచి పుట్టిందే ఈ కెరీర్ పొడిగింపు. 

నా అభిమాన క్రీడాకారుడు ఉసైన్ బోల్ట్ రిటైర్డ్ జీవితం సరదాగా, హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. 

(fb post) 

Saturday 5 August 2017

రెండుకోరికలు


"దశరధ మహారాజా! ఆనాడు మీరు నాకు రెండుకోరికలు ప్రసాదించారు, ఇప్పుడు కోరవచ్చునా?"

"నీదే ఆలస్యం కైకా!"

"అయితే వినండి. మొదటి కోరిక - అర్నబ్ గోస్వామిగాడి నోరు మూతబడాలి. రెండో కోరిక - పెట్రోల్ రేట్లు GST పరిధిలోకి రావాలి."

"కైకా! నీకిది న్యాయం కాదు. నువ్వు కోరాల్సింది రాముణ్ని అడవులకి పంపించమని, భరతుడికి పట్టాభిషేకం చేయించమని."

"రాత్రి 'సంపూర్ణ రామాయణం' సినిమా చూశాను. కైకేయిని విలన్‌గా చూపించారు, నాకు నచ్చలేదు. అందుకే స్వార్ధం వీడి ప్రజాక్షేమం కోసం అడుగుతున్నాను. ఇంతకీ నా కోరికలు తీరుస్తారా? తీర్చరా?"

"హయ్యో! యెంత పన్జేశావు కైకా! అసాధ్యమైన కోరికలు కోరి మన రఘవంశం పరువు తీసేశావు. భగవాన్! ఇప్పుడు నాకేది దారి?"

(fb post)

Wednesday 2 August 2017

యేవితల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు!

కాఫీ ఆలోచన (కాఫీ తాగేప్పుడు వచ్చిన ఆలోచన) :

నేను చదూకునే రోజుల్లో మెడికల్ కాలేజిలో చెట్లు, క్రోటన్స్‌తో అందమైన తోట వుండేది. ఆ తోటలో సిమెంట్ బెంచీఅ మీద కూచుని రకరకాల కబుర్లు, చర్చలు. ఆరోజు థియరీ క్లాసులో ముఖ్యమైన పాయింట్లు.. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ దురాగతాలు.. వియత్నాంలో అమెరికా దుర్మార్గాలు.. అయోధ్యలో రామాలయం తలుపులు.. అమెరికా సోవియట్ల కోల్ద్ వార్.. అదొక ఓపెన్ ఫోరం.

1970 లలో యెంతో చైతన్యంతో కళకళ్లాడిన విద్యార్ధిలోకం ఆ తరవాత అనేక ఆటుపోట్లకి గురైంది.

టీవీలొచ్చేశాయ్, లైవ్ ప్రసారాలతో వల్ల క్రికెట్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింద్. టీవీలో వార్తలు వస్తుంటే న్యూస్‌పేపరెందుకు దండగ అనే ఆలోచన మొదలైంది. ఇంకొన్నాళ్లకి కార్పొరేట్ విద్యాసంస్థలొచ్చేశాయ్, కేజీల చదువులు మొదలైనయ్. విద్యార్ధిలోకం చదువుల్తో, క్రికెట్‌తో బిజీబిజీ.. పుస్తకాలు చదవడం తగ్గిపోయింది.

"ఇరాక్ మీద అమెరికా యుద్ధం సరికాదు!"

"యెక్కడోవున్న ఇరాక్ గూర్చి నీకెందుకు? చదువుకో, బాగుపడతావ్!"

సెల్ ఫోన్లొచ్చేశాయ్!

"గుజరాత్ మారణకాండ దారుణం!"

"గుజరాత్ గూర్చి మనకెందుకు బ్రదర్? సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చుగా!"

స్మార్ట్ ఫోన్లొచ్చేశాయ్!

"పాకిస్తాన్ తన దేశప్రజల్ని యేమార్చడానికి మతరాజకీయాల్ని ప్రమోట్ చేస్తుంది."

"పాకిస్తాన్‌ ముస్లిం దేశం, ఒక ఆటం బాంబ్ వేసేస్తే పీడా విరగడవుతుంది."

ఇవ్వాళ యెవరికీ యెవర్తో సంబంధాల్లేవ్. సమాజం గూర్చి కాదు, పక్కింటివాడి గూర్చి ఆలోచించే ఆసక్తి లేకుండాపోయింది.

ఆధిపత్య కులాల ఆరాటం, వారి అణచివేత ఆలోచనలూ మర్యాదస్తుల భావజాలంగా మారిపోయింది. రాజకీయ పార్టీ నాయకులు, సినిమా హీరోలు కులాలవారిగా తమవారిని ప్రమోట్ చేసుకోడం మొదలెట్టారు.

ఫలితంగా -

యువత సినిమా హీరోల వెంట పడ్డారు. తమ హీరో రాజకీయాల్లోకొచ్చి తమని ఉద్ధరించాలనే పనికిమాలిన వాదం మొదలైంది. బహుశా రాజకీయ భావజాలంలో ఇంతకుమించిన భ్రష్టత్వం మరేదీ లేదు.

తెలుగునాట తెలుగు తగ్గుతుందని బాధపడుతున్నారు కొందరు. అసలు ఆలోచించే సమాజమే కుంచించుకుపోయిందని నా ఆవేదన.

'యేవితల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు!'

(fb post)