Thursday, 24 November 2016

అసంతృప్తి

                                        art : satya sufi
అతనంటే నాకిష్టం లేదు, నాకతన్ని చూసినప్పుడు భగభగమండే ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నంత మంటగా వుంటుంది. అతనంటే నాకిష్టం లేదు, అతను నా పక్కనుంటే, నాకు – పులి పక్కన వినయంగా నడుస్తున్న దొంగనక్కలా, మంత్రిగారికి ఒంగొంగి నమస్కారాలు పెడుతున్న అవినీతి ఆఫీసర్లా, ఎస్పీ దొరగారికి సెల్యూట్ చేస్తున్న సస్పెండైన ఎస్సైలాగా, అమెరికా సూటుబాబు పక్కన సిగ్గుతో చితికిపోతూ నించున్న ఆఫ్రికా గోచిగాళ్ళా చిన్నతనంగా వుంటుంది. యెందుకు? అతను నాకన్నా చదువుకున్నాడా? లేదు. నాకన్నా ధనవంతుడా? కాదు. నాకన్నా పైస్థాయిలో ఉన్నాడా? కాదు.. కాదా? లేదు.. లేదా? ఏమో!
అతను నా చిన్ననాటి స్నేహితుడు. మా ఇద్దరిదీ వొకే వీధి, వొకే స్కూలు. ఆ వీధిలోకెల్లా మా ఇల్లే అతిపెద్ద ఇల్లు, ఆ వీధిలోకెల్లా అతన్దే అతిచిన్న ఇల్లు. మేం ధనవంతులం, నా తండ్రి నగరంలో టాప్ క్రిమినల్ లాయర్. అతని తండ్రి వారానికోసారి మాత్రమే అన్నం తినేవాళ్ళా బక్కగా, బలహీనంగా వుండేవాడు. ఆయనకేదో చిన్నఉద్యోగంట, జీతం కూడా సరీగ్గా ఇవ్వర్ట. ఆయన అస్తమానం దగ్గుతూ, మూలుగుతూ ఉండేవాడు. నీరసంగా కూడా ఉండేవాడు.. ఆయనకేదో జబ్బుట!
స్కూలు లేనప్పుడు విశాలమైన మా ఇంటి ఆవరణలో ఆడుకునేవాళ్ళం. అతను బిడియస్తుడు, భయస్తుడు, తనదికాని ఈ ప్రపంచంలో టిక్కెట్టులేని రైలు ప్రయాణికుళ్ళా బెరుగ్గా వుండేవాడు. నేనెక్కువగా నాకిష్టమైన క్రికెట్ ఆట ఆడేవాణ్ని, అతను నేను షాట్లు కొట్టేందుకు వీలుగా బౌలింగ్ చేసేవాడు. అతను నాతో క్రికెట్ ఆడటమే గొప్ప ఎచీవ్మెంట్లా భావించేవాడు. అతను నేనడక్కుండానే నాకో ఉన్నత స్థానం ఇచ్చేశాడు.
అతను మా ఇంటిని కలలో కనబడే ఇంద్రభవనంలా ఆశ్చర్యంగా చూసేవాడు. ‘భౌ’మనే మా టామీని చూసి భయపడ్డాడు, కయ్యిమంటూ మోగే మర్ఫీ రేడియో చూసి ఆనందపడ్డాడు. భొయ్యిమని చల్లగాలి వెదజల్లే ఎయిర్ కూలర్ చూసి ముచ్చటపడ్డాడు. ఫోన్ ‘ట్రింగ్ ట్రింగ్’ మన్నప్పుడు సంబరపడ్డాడు. ఇలా – నన్నూ, నా ఐశ్వర్యాన్నీ అతను ఎడ్మైరింగ్గా చూడ్డం నాకు చాలా ఆనందం కలిగించేది.
కానీ – నా ఆనందం, నా ఈగో అంతలోనే ఆవిరైపొయ్యేవి. అందుక్కారణం – చదువులో అతని ప్రతిభ. మునిసిపాలిటీ కుళాయి నీళ్ళుపట్టి మోసుకెళ్ళడం, వంట చెయ్యడం, బట్టలుతకడం.. ఇలా అన్నిపనుల్లో తల్లికి సాయం చెయ్యడంలో అతను బిజీగా వుండేవాడు. పరీక్షల్లో మార్కులు మాత్రం అన్నీ ఫస్ట్ మార్కులే. నేను కష్టపడి ఒక్కోమార్కు సంపాదిస్తే, అతను అలవోకగా పుంజీడు మార్కులు తెచ్చేసుకునేవాడు – యెలా సాధ్యం!
అతను మంచివాడు. అతని మాట నిదానం, మనిషి నిదానం. చదువు తప్ప మిగిలిన విషయాల్ని పట్టించుకునేవాడు కాదు. నాకు కష్టంగా అనిపించిన పాఠాల్ని అర్ధమయ్యేలా చక్కగా వివరించేవాడు. ఆ రకంగా అతని వల్ల నేను చాలా లాభపడ్డాను. కష్టమైన పాఠ్యాంశాల్ని కూడా సులువుగా అర్ధం చేసుకునే అతని ప్రతిభకి ఆశ్చర్యపొయ్యేవాణ్ని, లోలోపల రగిలిపొయ్యేవాణ్ని. అతను నాతో యెంత స్నేహంగా వున్నా, అతని చదువు మాత్రం నాకు ముల్లులా గుచ్చుకుంటూనే వుండేది.
మన్చేతిలో ఏదీ ఉండదు. అరిచేత్తో సూర్యకాంతిని ఆపలేం, నదీప్రవాహాన్నీ ఆపలేం. జనన మరణాలు ఆగవు, అన్యాయాలు ఆగవు, మానభంగాలు ఆగవు, రాజకీయ నాయకుల అవినీతీ ఆగదు. ఇవేవీ ఆగకపోయినా, కుటుంబ సమస్యల్తో చదువు మాత్రం ఆగిపోతుంది. ఈ విషయం నాకతని తండ్రి మరణంతో అర్ధమైంది. కుటుంబాన్ని పోషించడం కోసం అతను స్కూల్ ఫైనల్తో చదువాపేసి ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతున్న నా జీవితానికి అతని గూర్చి పట్టించుకునే తీరిక లేకపోయింది.
ఆ తరవాత నా చదువు చక్కగా ‘కొన’సాగింది. ఈ ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొన్లేమంటారు గానీ చదువుని మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. కేవలం డబ్బువల్లే ఉన్నత చదువులకి గోడమీద బల్లిలా ఎగబాకాను. నా ఉన్నత చదువులకి, ఉన్నత సిఫార్సులు కూడా జతవడం చేత, ఉన్నత ఉద్యోగం కూడా వచ్చింది. ఇన్ని ఉన్నతమైన అర్హతలున్నందున, ఉన్నతమైన కుటుంబం నుండి ఉన్నతమైన ఆస్తిపాస్తుల్తో భార్య కూడా వచ్చి చేరింది.
ఇప్పుడు నాకేం తక్కువ? ఏదీ తక్కువ కాదు, అన్నీ ఎక్కువే! పెద్దకంపెనీలో పెద్దకొలువు, తెల్లటి మొహం మీద ఎర్రటి లిప్స్టిక్తో అందమైన భార్య, కాంప్లాన్ బాయ్ల్లాంటి ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆడుకోడానికి రెండు బొచ్చుకుక్కలు. మూడు కార్లు, నాలుగు బిల్డింగులు, పెద్దవ్యాపారాల్లో భారీపెట్టుబళ్ళు, ఏడాదికి రెండు ఫారిన్ ట్రిప్పులు, పెద్దవాళ్ళ స్నేహాలు.. నా జీవితం వడ్డించిన విస్తరి.. కాదు కాదు.. బంగారు పళ్ళెంలో పోసిన వజ్రాలరాశి. కానీ – అతను నాకు గుర్తొస్తూనే ఉంటాడు. అతని జ్ఞాపకాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
మా ఊళ్ళో మా కుటుంబానికున్న పొలాలు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపొయ్యాయి. కొన్నికోట్ల విలువైన ఒక స్థలం రిజిస్ట్రేషన్ కోసం నేను యెన్నో యేళ్ళ తరవాత మా ఊరికి వెళ్ళాల్సివచ్చింది. వెళ్ళేప్పుడు అతన్ని పలకరించడం కూడా ఒక పనిగా పెట్టుకున్నాను. రిజిస్ట్రేషన్ పని లంచ్ సమయానికి పూర్తైపోయింది. కారు వెనుక సీట్లో కూలబడి డ్రైవర్కి అతని ఇంటి ఎడ్రెస్ చెప్పాను.
మా ఊరు ఒకవైపు అందంగా సుందరంగా పొడవాటి బిల్డింగుల్తో ‘అభివృద్ధి’ చెంది కుర్రకళతో తళతళల్లాడుతున్నా, పాత ఊరు మాత్రం ముసలి పేదరాశి పెద్దమ్మలా అలాగే వుండిపోయింది. అతనా ముసలి ప్రాంతంలో వొక ఇరుకు వీధిలో అద్దెకున్నాడు. ఇంతకీ నే వెళ్తుంది అతన్ని పలకరిద్దామనేనా? కాకపోవచ్చు, ఇన్నేళ్ళ తరవాత అతని యోగక్షేమాలు కనుక్కోవడం ద్వారా నేను సాధించేదేమీ లేదు. అతన్ని చూడటం ద్వారా నాలో గూడు కట్టుకున్న అసంతృప్తి కొంతైనా తగ్గచ్చొనే ఆశతో వెళ్తున్నాను.
ఆ వీధి ఇరుగ్గా వుంది, మురిగ్గా వుంది. అమెరికావాడి అప్పుకోసం ఇండియావాడు షోకేస్ చేసే దరిద్రపుగొట్టు వీధిలా వుంది. అంతర్జాతీయ అవార్డు కోసం ఆర్ట్ సినిమాల డైరక్టర్ వేసిన అందమైన పేదవాడి వీధిలా వుంది. నా లక్జరీ కారు ఆ ఇరుకువీధిని ముప్పాతిక భాగం ఆక్రమించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఖరీదైన కారుని అందమైన దయ్యప్పిల్లని చూసినట్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అది రెండుగదుల పెంకుటిల్లు. రోడ్డువైపుకు ఓ చిన్నగది, లోపల ఇంకో చిన్నగది. ఆ ఇంటి గోడల వయసు షుమారు వందేళ్ళుండొచ్చు, ఆ గోడలకి సున్నం వేసి ఓ అరవయ్యేళ్ళు అయ్యుండొచ్చు. కింద నాపరాళ్ళ ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా అసహ్యంగా ఉంది. ఆ మూల దండెంమీద నలిగిన, మాసిన బట్టలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో వొక పాతకుర్చీ, మూలగా ఒక చింకిచాప. మై గాడ్! వొక ఇల్లు ఇంత పేదగా కూడా వుండగలదా! ఈ కొంప కన్నా ఆ వీధే కొద్దిగా అందంగా, రిచ్చిగా ఉంది!
ఆ కుర్చీలో ఎవరో పెద్దాయన కూర్చునున్నాడు. పాత కళ్ళజోడూ, మాసిన గడ్డం, నెత్తిన నాలుగు తెల్ల వెంట్రుకలు.. వార్ధక్యంలో, పేదరికంలో ఆ గదికి అతికినట్లు సరిపోయ్యాడు. ఆయన బక్కగా ఉన్నాడు, ముందుకు ఒంగిపోయున్నాడు. పొట్ట లోపలకి, బాగా లోపలకి పోయుంది. ఎప్పుడో ఏదో జబ్బు చేస్తే డాక్టర్లు పొట్టకోసి పేగులన్నీ తీసేసి ఖాళీపొట్టని మళ్ళీ కుట్టేసినట్లున్నారు. ఆయన వాలకం చూస్తుంటే చాలాకాలంగా ఈ ప్రపంచాన్ని పట్టించుకోటం మానేసినట్లుంది.
ఆయన.. ఆయనకాదు.. అతను! అతను.. నా స్నేహితుడు! ఇలా అయిపొయ్యాడేంటి! నా అలికిడి విని నిదానంగా తలెత్తి నావైపు చూశాడు. నన్ను పోల్చుకున్నట్లుగా లేదు. మళ్ళీ తల దించుకుని మౌనంగా, శూన్యంలోకి చూస్తున్నట్లుగా అలా వుండిపొయ్యాడు. యేంచెయ్యాలో తెలీక పొడిగా దగ్గాను. తలెత్తి మళ్ళీ నావైపు చూశాడు. అతనికి నేనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నట్లు లేదు.
“నేనెవరో గుర్తు పట్టావా?” ముందుకు వొంగి అడిగాను.
“క్షమించాలి, నాకు చూపు సరీగ్గా ఆనదు.” నెమ్మదిగా అన్నాడు.
“నేను.. నీ చిన్ననాటి స్నేహితుణ్ణి.” అన్నాను.
కళ్ళు చిలికించి చూస్తూ నన్ను పోల్చుకున్నాడు. అతని కళ్ళల్లో కనీసం వొక చిన్నమెరుపైనా కనిపిస్తుందని ఆశించాను, కానీ – అతని చూపులో జీవం లేదు. నెమ్మదిగా లేచి యెదురుగానున్న చాపమీద కూర్చున్నాడు. నేనా డొక్కుకుర్చీలో కూలబడ్డాను. నా ప్రశ్నలకి అతను నెమ్మదిగా, అతిచిన్నగా సమాధానం చెప్పాడు. కొద్దిసేపు మాట్లాడాక అతని గూర్చి కొద్దివివరాలు తెలిశాయి.
తండ్రి చనిపొయేప్పటికి అప్పులు తప్పితే ఆస్తులేమి లేవు. అతని కొద్దిపాటి జీతంతోనే అప్పుల్ని నిదానంగా తీరుస్తూ, అప్పులకి మళ్ళీ అప్పులు చేసి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేశాడు. కొన్నాళ్ళకి తల్లి చనిపోయింది. అతనికి జీతం తప్ప వేరే ఆధారం లేదు, దరిద్రం తప్ప వేరే సంతోషాల్లేవు. అతని జీతం అప్పుల మాయం, జీవితం దుఃఖమయం. అంచేత భార్య అతన్ని అతని పేదరికానికి వదిలేసి కొడుకుని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక్కడే ఇలా జీవితాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాడు. నాకతను దిగాలుగా భారంగా జీవిస్తూ, చావు కోసం ఆశగా ఎదురుచూసే నిరాశాజీవిలా కనిపించాడు.
నాకు ఆ వాతావరణం చాలా ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించసాగింది.
ఒక్కక్షణం ఆలోచించి అడిగాను – “నీకిన్ని ఇబ్బందులున్నప్పుడు నాకెందుకు చెప్పలేదు?”
సమాధానం లేదు.
“నీకు తెలుసా? ఇప్పుడు నేను నీకు యే సహాయమైనా చెయ్యగల స్థాయిలో వున్నాను.” అన్నాను.
అతనొక క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చిన్నప్పుడు నాకర్ధం కాని పాఠాలు చెప్పేప్పుడు కూడా నన్నలాగే చూసేవాడు. నాకు సిగ్గుగా అనిపించి తల దించుకున్నాను. ఆ తరవాత కూడా అతనేమీ మాట్లాడలేదు. అతనికి నాతో మాట్లాడే ఆసక్తి లేదని గ్రహించాను. ఆ గదిలో ఆ డొక్కుకుర్చీకీ, అతనికి పెద్ద తేడాలేదు. ఇక అక్కడ వుండటం అనవసరం అనిపించి లేచి బయటకి వచ్చేశాను.
నన్ను గమనించిన డ్రైవర్ హడావుడిగా కారు వెనుక డోర్ తీసి వినయంగా నించున్నాడు, నిట్టూరుస్తూ కార్లో కూలబడ్డాను. ఇప్పుడు నాకు మరింత అసంతృప్తిగా వుంది. నాదికాని రాజ్యంలో ముసలి రాజుని చంపి ఆ సింహాసనంపై అక్రమంగా కూర్చున్న కుట్రదారుగా.. సింహం తినగా మిగిలిన వేటలో ఎముకలు కొరికే నక్కలాగా.. ఆకలితో ఏడుస్తున్న పాపడి పాలు తాగేసిన దొంగపిల్లిలాగా.. యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల పొట్టగొట్టిన కార్మిక నాయకుళ్ళాగా.. తీవ్రమైన అసంతృప్తి.
నా అసంతృప్తి క్రమేపి కోపంగా మారింది. అతని పరిస్థితి బొత్తిగా బాలేదు, నేను చాలా ఉన్నత స్థానంలో వున్నాను. నాగూర్చి అతనికి తెలీకుండా యెలా వుంటుంది? అతనికి నా ఎడ్రెస్ తెలుసుకోవడం క్షణం పని. నా దగ్గరకొచ్చి – ‘మిత్రమా! నా పరిస్థితేం బాలేదు, సాయం చెయ్యి.’ అని అడగొచ్చుగా? అతనికి యేదోక కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించడం నాకెంతసేపు పని! కానీ.. అతను నన్నడగడు. అతనిది మొహమాటం కాదు – పొగరు, నా పొజిషన్ చూసి ఈర్ష్య! శ్రీకృష్ణుణ్ణి కలవడానికి కుచేలుడికి అహం అడ్డు రాలేదు, తన స్నేహితుడి ఉన్నతిని కుచేలుడు మనస్పూర్తిగా కొనియాడాడు. మరి అతనో? శ్రీకృష్ణుణ్ణే తిరస్కరించాడు!
నేనెంత స్థాయిలో వున్నాను? యెంతో బిజీగా వుంటాను? అయినా కూడా నా చిన్ననాటి స్నేహితుడి పట్ల అభిమానంతో వెతుక్కుంటూ వచ్చాను, కానీ అతను నా ఉనికినే గుర్తించకుండా పోజు కొట్టాడు! ఇంతకీ అసలతను తెలివైనవాడేనా? అయితే ఆ జానాబెత్తెడు జీవితంతో యెందుకు మిగిలిపొయ్యాడు? చిన్నప్పుడు యేవో నాలుగు పాఠాలు గుర్తుంచుకున్నంత మాత్రాన నాకన్నా తెలివైనవాడైపోతాడా?
యుద్ధరంగంలో యుద్ధం కడదాకా చేస్తేనే గెలుపోటములు తెలిసొచ్చేవి. కానీ – అతను మధ్యలోనే తప్పుకున్నాడు. కడదాకా యుద్ధం చేసినట్లైతే నేనతన్ని ఓడించేవాణ్నేమో! యేమో కాదు.. ఖచ్చితంగా ఓడించేవాణ్ని. శత్రువుని యుద్ధరంగంలో ఓడిస్తే ఆ గెలుపు సంతృప్తినిస్తుంది, కానీ – శత్రువుకి ఏదో రోగమొచ్చి ఆస్పత్రిలో రోగిష్టివాడిలా మిగిలిపోతే యెంత అసంతృప్తి!
జీవితంలో గెలుపోటములు నిర్ణయించేది చదువు, తెలివితేటలే కాదు.. అదృష్టం, అవకాశాలు కూడా. అక్కరకు రాని తెలివి అడవి గాచిన వెన్నెల వంటిది. నేను అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నాను. నేనిలా ఆలోచించడం నాలోని మంచితనానికి మాత్రమే నిదర్శనం. నన్నిలా ఇబ్బంది పెడుతున్న నా సున్నితత్వాన్నీ, ఉదారగుణాన్నీ తగ్గించుకోవాలి.
ఇలా నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నంలో యేదో వొకరోజు విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ – ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 నవంబర్ 24)

Monday, 7 November 2016

శబరిమలై సంప్రదాయ గోడలు


మన ఇంటికి కొందరు స్నేహితులు వచ్చారనుకుందాం. అందరికీ కాఫీ ఇచ్చి, ఒకాయనకి ఇవ్వలేదనుకుందాం. ఆ  ఒకాయన చిన్నబుచ్చుకుంటాడు, కోపంతో మండిపడతాడు. 'బాబూ! కాఫీ నీ ఆరోగ్యానికి హాని, అందుకే ఇవ్వలేదు' అన్నా ఒప్పుకోడు (వాస్తవానికి అతనికి కాఫీ తాగే అలవాటు లేదు). ఎందుకంటే - తను కాఫీ త్రాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవల్సింది అతడే గానీ మనం కాదు. 

కేరళలో శబరిమలై అనేచోట అయ్యప్ప అనే దేవుడు వున్నాడు. నల్లదుస్తుల్తో (సీనియర్లు కాషాయ దుస్తుల్తో) 'దీక్ష' తీసుకుని దేవుణ్ణి దర్శించుకుంటారు. సంక్రాంతినాడు జ్యోతి 'కనబడుతుంది'ట! కానీ - ఆ జ్యోతిని దేవస్థానం బోర్డు ఉద్యోగులే ఎంతో 'వ్యయప్రయాసల'తో వెలిగిస్తారని కేరళ ప్రభుత్వమే కోర్టులో వొప్పుకుంది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. కారణం యేమనగా - ఈ వయసు ఆడవాళ్ళు menstruate అవుతారు. 

మతములన్నీ మిక్కిలి సనాతనమైనవి. వీటికి వందల, వేల సంవత్సరాల చరిత్ర వుంది. కాలం సమాజంలో అనేక మార్పులు తెస్తుంటుంది. ఆ మార్పుల్లో ఒకటి 'విద్య'. ఈ విద్య వల్ల ప్రజల జ్ఞానం పెరుగుతుంది (కొందరికి తరుగుతుంది - అది వేరే సంగతి). సహజంగానే వారికి అప్పటిదాకా తాము అనుసరించిన 'ఆచారాల' పట్ల సందేహాలు పుట్టుకొస్తయ్. ఆ సందేహాల నుండి ప్రశ్నలు పుట్టుకొస్తయ్.   

ఇందుకొక ఉదాహరణ - 'menstrual bleeding'. కొన్నాళ్ళక్రితం - అంటు, మైల, ముట్టు - అనే ముద్దుపేర్లతో menstrual bleed ని అపవిత్రంగా భావించేవాళ్ళు. ఆడవారిని ఆ 'నాలుగు రోజులు' ఇంట్లో కాకుండా బయట కూచోబెట్టేవాళ్ళు. చదువుకున్నవాళ్ళు పెరగడంతో - menstrual bleed అపవిత్రం కాదనీ, పిల్లల్ని కనే జంతువులన్నింటిలో చాలా సహజంగా జరిగిపోతుండే ఒక బయలాజికల్ ప్రక్రియ అనీ అర్ధం చేసుకున్నారు. ఇలా అర్ధం చేసుకున్నాక - sanitary napkins వాడటం ద్వారా తమకి కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చని తెలుసుకున్నారు. ఆవిధంగా ఆ 'నాలుగు రోజుల'నీ స్త్రీలు జయించారు. ఇదంతా కూడా నేను పుట్టాక జరిగిన నిన్నమొన్నటి పరిణామ క్రమం. 

జ్ఞానం అడవిలో నిప్పుకణిక లాంటిది. అది ఒకచోటతో ఆగిపోకుండా కొంతమేరకు విస్తరిస్తుంది. కాబట్టి జ్ఞానం మతపరమైన ఆచారవ్యవహారాల్ని ప్రశ్నిస్తుంది. అయితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేంత జ్ఞానం గానీ, ఓపిక గానీ మతానికి వుండదు. ఫలితంగా - menstrual bleed ని చీదరించుకునేవాళ్ళని చీదరించుకుంటూ కొందరు అమ్మాయిలు happy to bleed అనడం మొదలెట్టారు (పిదప కాలం, పిదప బుద్ధులు).    

ఆ అమ్మాయిలు - 'ఉరే భక్తస్వాములూ! మగ ఆడ sexual intercourse చేసుకున్న ఫలితంగా గర్భాశయంలో పిండం యేర్పడుతుంది. అక్కడే తొమ్మిది నెలలు గడిపి, మా జననాంగం ద్వారా మీరు బయటకొచ్చారు. మరప్పుడు మీ పుట్టుక మాత్రం అపవిత్రం కాదా?' అనడిగారు. అంతటితో వూరుకోకుండా - 'అయ్యప్పని దర్శించుకునే హక్కు menstruating women అయిన మాకూ వుంది' అంటూ ఎన్నాళ్ళనుండో వస్తున్న 'పవిత్రమైన' ఆనవాయితీని ప్రశ్నిస్తూ కోర్టుకెక్కారు.

కోర్టుక్కూడా న్యాయదేవత వుంది (యెక్కడికెళ్ళినా దేవతలు మాత్రం కామన్). పాపం! ఆ దేవత చూడ్డానికి వీల్లేకుండా కళ్ళకి గుడ్డ కట్టేసి వుంటుంది. గౌరవనీయులైన కోర్టువారు చట్టాల దుమ్ము దులిపి నిశితంగా పరిశీలించారు. తదుపరి వారికి menstruating women కి వ్యతిరేకంగా యే ఆధారమూ కనబడక - 'bleeding women దేవుణ్ణి ఎందుకు చూడకూడదు?' అని తీవ్రంగా హాశ్చర్యపొయ్యారు. 'ట్రావన్కూరు దేవస్థానం వాళ్ళు రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారా?' అంటూ కించిత్తు మధనపడుతూ సందేహాన్ని వ్యక్తం చేశారు. అంతిమ తీర్పు ఇంకా రావలసి వుంది. 

శబరిమల గుడిని యే వయసు స్త్రీలైనా దర్శించుకోవచ్చుననీ, తమకి అభ్యంతరం లేదనీ కేరళ ప్రభుత్వం కోర్టుకి సమాధానం చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం happy to bleed కేంపులో ఉత్సాహాన్ని నింపగా, sad to bleed కేంపుకి పుట్టెడు దుఃఖాన్ని ఇచ్చింది. అయ్యప్పస్వామి భక్తుల సంఖ్యలో మన తెలుగువారిదే అగ్రస్థానం. కాబట్టి కేరళ ప్రభుత్వ నిర్ణయం మన తెలుగు భక్తుల్ని ప్రభావితం చెయ్యొచ్చు.

కావున మిత్రోత్తములారా! మనం అర్ధం చేసుకోవాల్సిందేమనగా - 

సమాజం నిశ్చలంగా వుండదు, మార్పు దాని గుణం. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి నిలబడనిదేదైనా కాలగర్భంలో కలిసిపోతుంది. 'ఎందుకు?' అన్న ప్రశ్నకి తావులేని సమాజం నిస్సారమైనది, అనాగరికమైనది. అందుకే - 'ఎందుకు?' అన్న ప్రశ్న చాలా ప్రమాదకరమైనది కూడా! ఈ ప్రశ్న వినపడ్డప్పుడల్లా కొందరు గుండెలు బాదుకుంటూనే వున్నా, వాళ్ళు గుండె పగిలి చచ్చేలా సమాజం ముందుకు పురోగమిస్తూనే వుంటుంది. ఇవ్వాళ శబరిమలైలో అగ్గిపుల్ల రాజుకుంది. ఈ అగ్గి - అగ్గిపుల్లతోనే ఆరిపోదనీ, ఇది ఇంకెన్నో మంటల్ని రాజేస్తుందనీ ఆశిద్దాం.

(picture courtesy : Google)

Sunday, 6 November 2016

సైకియాట్రిస్టుకి జట్కాబండి అవసరమా?


సినిమా యాక్టర్లు టీవీల్లో 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' చేస్తున్నారని కొన్నాళ్లుగా వింటున్నాను. ఇవ్వాళ ఆదివారం, పెద్దగా పనుండదు. అంచేత - కౌన్సెలింగ్ 'జట్కాబండి'ని యూట్యూబులో అక్కడక్కడా కొద్దికొద్దిగా చూశాను. ఆశ్చర్యంగా జట్కాబండి ఫ్యామిలీలన్నీ పేదవర్గాల వారివే! సంపన్న వర్గాలకి కుటుంబ సమస్యలు వుండవనీ, వున్నా అందులో పేదవాడి కుటుంబంలో ఉన్నంత వినోదం వుండదనీ టీవీ వాళ్ళ అభిప్రాయం కావచ్చు. 

పేదవారి జీవితంలో వినోదం ఉండదు కానీ వారి జీవితం ఇంకొందరికి వినోదం కావడం ఒక ఐరనీ. అక్కడకొచ్చే కుటుంబాలు చాలా పేదగా, బీదగా, మురికిగా ఉంటాయి. కౌన్సెలింగ్ భామలు తాము మాత్రమే దట్టంగా మేకప్ కొట్టుకుని బాధిత మహిళలకి మాత్రం కనీసం పౌడర్ కూడా పూయనియ్యరా? వాళ్ళనలా జిడ్డుమొహంతో చూపిస్తేనే సన్నివేశం పండుతుందని క్రియేటివ్ హెడ్డుగారి ఆలోచనా? 

సరే! టీవీ అనేది వున్నదే వినోదం కోసం. వినోదం అన్నాక - అందులో అర్నబ్ గోస్వామి టీవీ డిబేట్ల నుండి అర్ధరాత్రి బూతుపాటల దాకా అనేక ప్రోగ్రాములు వస్తుంటాయి. ఛానెల్ నిర్వహణ వ్యాపారం కాబట్టి,  రేటింగ్స్ కోసం అనేకరకాల ప్రోగ్రాముల్ని వండుతుంటారు. అంచేత - టీవీవాళ్ళ బాధల్ని అర్ధం చేసుకోవచ్చు.

సినిమా నటులకి ఉద్యోగస్తుల్లా స్థిరాదాయం వుండదు, వారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంచేత సినిమా బుక్కింగులు తగ్గినప్పుడు - ఆరిపొయ్యే దీపంలో నూనె పోసినట్లు.. తమ కెరీర్‌ని ఇంకొంత పొడిగించుకోడం కోసం టీవీ ప్రోగ్రాముల్లోకి వస్తుంటారు. సైకియాట్రిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు చెయ్యాల్సిన 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' అంటే యేమిటో సినిమా నటులకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి - వాళ్ళు తమకు తోచిందేదో చెప్పి, ఆపై ప్రొడ్యూసర్లకి 'థాంక్స్' చెప్పి, పేమెంట్ చెక్కు తీసుకుని వెళ్ళిపోతారు. అవసరమైతే ప్రోగ్రామ్ హెడ్ 'సూచన' మేరకు (TRP కోసం), ఆవేశపడ్డట్లు నటించి నాలుగు తిట్లు తిట్టేసి పోతారు. కావున - ఇట్లాంటి షోలు చేస్తున్న సినిమా నటుల్ని విమర్శించడం అనవసరం.  

అయితే - ఫ్యామిలీ కౌన్సెలింగ్ అనే 'రియాలిటీ షో'లో హైదరాబాదుకి చెందిన సైకియాట్రిస్టులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా అనైతికం. మనం టీవీవాళ్ళ వ్యాపార యావ అర్ధం చేసుకోవచ్చు, సంపాదన కోసం మాజీనటుల అవసరమూ అర్ధం చేసుకోవచ్చు. కానీ - ఒక పాపులర్ షోలో సైకియాట్రిస్టులు కూడా ఉండడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఆ డాక్టర్ల ప్రచార యావా, డబ్బు కక్కుర్తీ! 

ఇలా టీవీల్లో బహిరంగంగా జరిగే 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' అనే వినోద కార్యకమంలో సైకియాట్రిస్టులు సైకియాట్రిస్ట్ 'వేషం' వెయ్యడం MCI కి రిపోర్ట్ చెయ్యదగ్గ నేరం. డాక్టర్లు కానివాళ్ళు అర్ధం చేసుకోవాల్సింది యేమనగా - మన తెలుగునాట ఇలా పబ్లిసిటీ కోసం, appearance money కోసం తమ వృత్తిని తాకట్టు పెట్టే చౌకబారు డాక్టర్లు ఉన్నారని. వీళ్ళు డబ్బుజబ్బు పట్టిన రోగిష్టి వైద్యులు, అసలంటూ కౌన్సెలింగ్ కావాల్సింది వీరికే! 

మిత్రులారా! టీవీల్లో కనపడే roguish డాక్టర్ల పట్ల - తస్మాత్ జాగ్రత్త!

(picture courtesy : Google)