Saturday 27 June 2015

సుడిగుండాలు


ఈ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు వుంటారు. అంతకంటే ఎక్కువగా సినిమాల్ని పోలిన సినిమాలూ వుంటాయి. ఇది కేవలం కాకతాళీయం మాత్రమేనని సినీజీవులు అంటారు. కొందరు తెలివైనవాళ్ళు 'స్పూర్తి' పొందామని గడుసుగా చెప్పుకుంటారు. చాలాసార్లు ఈ స్పూర్తికీ, కాపీకీ మధ్యన విభజనరేఖ సూదిలో దారంలా కనపడీ కనపడనట్లు వుంటుంది. 

1959 లో 'కంపల్షన్' అనే ఆంగ్ల సినిమా వచ్చింది. ముఖ్యపాత్రని ఆర్సన్ వెల్స్ పోషించాడు (ఈయన పేరు వినంగాన్లే చప్పున గుర్తొచ్చేది 'సిటిజెన్ కేన్'). కథ టూకీగా - అనగనగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒకే కాలేజిలో చదువుకుంటున్నారు, బాగా ధనవంతుల బిడ్డలు. సరదా కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. థ్రిల్ కోసం - పోలీసులకి అంతుపట్టని విధంగా ఒక నేరం చేద్దామనుకుంటారు. 'పెర్ఫెక్ట్ మర్డర్' కోసం ఒక పిల్లాణ్ణి కిడ్నాప్ చేసి హత్య చేస్తారు. అన్నీ పెర్ఫెక్టుగానే చేస్తారు గానీ - ఒక ముఖ్యమైన ఆధారాన్ని హత్య జరిగిన ప్రదేశంలో వదిలేస్తారు. ఆ ఆధారంతోనే వారికి శిక్ష పడే సమయం వస్తుంది. అప్పుడు ఆర్సన్ వెల్స్ నటించిన న్యాయవాది పాత్ర కోర్టు రూములోకి ప్రవేశించి ముద్దాయిల తరఫున తీవ్రంగా వాదిస్తుంది. చివరాకరికి ముద్దాయిలకి పడాల్సిన ఉరిశిక్ష తప్పిపోతుంది! 

ఈ కథ చదువుతుంటే మీకో ప్రముఖమైన తెలుగు సినిమా గుర్తుకు రావాలి. 1969 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'సుడిగుండాలు' అనే సినిమా కథాంశం కూడా ఇదే. ఈ సినిమా కథ 'కంపల్షన్' సినిమాని ఇంతగా పోలి వుండటం 'యాదృచ్చికం' అనుకోవాలంటే కొంచెం ఇబ్బందే! ఆ సినిమా తీసిన వాళ్ళెవరూ ఇప్పుడు లేరు, వున్నా మనకి చెబుతారో లేదో తెలీదు. ఆంగ్ల సాహిత్యం చదువుకుని లేదా ఆంగ్ల చిత్రం చూసుకుని - ఆ స్పూర్తితో కథలు వండటం అనేది ఒక పురాతన విద్య. 

ఏ సినిమాకైనా ప్రధాన కథాంశం ఫలానా అని ముందో ముక్క అనుకుంటారు. ఈ ముక్క చపాతీ ముద్దలాంటిది. అప్పడాల కర్రని ఒడుపుగా తిప్పుతూ ఆ ముద్దకే వెడల్పుగా, గుండ్రంగా చపాతీ షేపు తెప్పిస్తారు. అంటే ఒక సినిమా మంచిచెడ్డలు పిండిముద్దతో మొదలవుతాయి. అట్లాంటి ప్రధాన కథాంశాన్ని కాపీ కొట్టేసి మాది 'స్పూర్తి' మాత్రమే అంటారు సినిమావాళ్ళు. సరే! ఎవరి దృష్టికోణం వారిది!

'సుడిగుండాలు' సినిమా పెద్దగా ఆడకపోయినా, సినీప్రేమికుల్ని అలరించింది. ఒక గొప్ప సినిమాగా కీర్తి నొందింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డునీ పొందింది. ఈ సినిమా తీసి బోల్డంత సొమ్ము నష్టపొయ్యామని దర్శక నిర్మాతలు పలుమార్లు వాపొయ్యారు. అయితే - ఈ సినిమా మాతృక గూర్చి ఎక్కడా (నాకు తెలిసినంత మటుకూ) ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యకరం. బహుశా ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు!

'సుడిగుండాలు'ని నేను మా గుంటూరు లక్ష్మీ పిక్చర్ పేలెస్‌లో చూశాను. అప్పట్లో నేను - ఫైటింగు లేని సినిమా మిరపకాయ లేని బజ్జీ వంటిదనే నమ్మకంతో వుండేవాణ్ని. అంచేత సినిమా నాకు చప్పగా అనిపించింది. చివర్లో న్యాయవాది నాగేశ్వరరావు 'ఈ దేశం ఏమవుతుంది? ఏమవుతుంది?' అంటూ మనకి బరువైన ప్రశ్నలు వేస్తూ, అందుగ్గానూ ఆయన కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ కోర్ట్ రూంలోనే పడిపోతాడు. 'గంటలకొద్దీ వాదించినందున అలసిపొయ్యి కళ్ళు తిరిగి పడ్డాడా? లేక చనిపొయ్యాడా?' అన్నది నాకు అర్ధం కాలేదు. ఆయన అలా పడిపొయ్యి అనేక దశాబ్దాలు దాటినందున - ఇప్పుడు తెలుసుకుని చెయ్యగలిగిందీ ఏం లేనందున, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం!


No comments:

Post a Comment