Tuesday 21 June 2016

యోగాసనాలు


"యోగాసనాల వల్ల ఉపయోగం వుందా?" పేషంట్లు తరచుగా అడిగే ప్రశ్న ఇది. 

"చేస్తే చెయ్యండి. చేసినందువల్ల నష్టం లేదు." ఇది నా స్టాండర్డ్ సమాధానం. 

నేనెప్పుడూ ఆసనాలు వెయ్యలేదు. అప్పుడెప్పుడో టీవీలో ఒకసారి చూశాను. ఒక వృద్ధుడు వివిధభంగిమల్లో కాళ్ళూ చేతులూ మడత పెడుతూ, ఘాట్టిగా గాలిపీల్చి వదుల్తున్నాడు. ఆయన అలా చేయడాన్ని ఆసనాలు అన్నాడు గానీ, అవి కేవలం స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు మాత్రమే!

బరువు తగ్గాలంటే రోజువారీగా కేలరీలని ఖర్చు పెట్టాలి. కొంత డైటింగ్ ద్వారా, ఇంకొంత వ్యాయామం ద్వారా కేలరీల్ని మైనస్ చెయ్యొచ్చు. నడవడం, పరిగెత్తడం, టెన్నిస్, స్విమ్మింగ్ మొదలగు ఏరోబిక్ ఎక్సర్సైజుల ద్వారా కేలరీల్ని ఖర్చు చెయ్యొచ్చు.

యోగాసనాలు చేస్తే ఎక్కువరోజులు బ్రతుకుతారా? ఇందుకు ఋజువుల్లేవు, చాలామంది యోగా గురువులే రోగగ్రస్తులై వున్నారు. ముప్పైయేళ్ళగా క్రమం తప్పకుండా యోగాసనాల్ని వేస్తున్న మా మేనమామ, ఆసనాల వల్ల తన మనస్సు ప్రశాంతంగా ఉందంటాడు. ఏనాడూ ఆసనం వెయ్యని నా మనసు కూడా ప్రశాంతంగానే ఉంటుంది!
       
మనది పేదదేశం. అత్యధికులకి తింటానికి తిండి లేదు. పోషకాహార లోపాల్తో మన పిల్లలు ఆఫ్రికా దేశస్తులతో పోటీ పడుతుంటారు. మెజారిటీ ప్రజలు పొలం పనులు చేసుకుంటారు. పన్లేనప్పుడు బీడీలో, చుట్టలో కాల్చుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి ఆసనాలు అనవసరం.

డబ్బున్నవాడు ట్రాక్ సూట్ వేసుకుని రోజూ జిమ్ముతుంటాడు, ఏరోబిక్సంటూ ఎగురుతుంటాడు. కొందరు తెలివైనవాళ్ళు డబ్బు ఖర్చు కాకుండా వ్యాయామం చేసే ఆలోచన చేస్తారు. దాని ఫలితమే ఉచిత యోగాసనాల క్యాంపులు. ఈ యోగా క్యాంపుల్లో ఎంట్రీ ఫీజు ఒక్కరూపాయి పెట్టినా ఎవరూ వెళ్ళరని మా సుబ్బు చెబుతుంటాడు. 

యోగాసనాలు శరీరానికి చాలా మంచిది అని శాస్త్రబద్దంగా స్టడీ చేశారని కొందరు వాదిస్తారు. అవును, ఆసనాల గూర్చి కొన్ని స్టడీస్ వున్నాయి. నాకయితే అవి 'చేసినట్లు'గా అనిపించలేదు. 'రాసినట్లు'గా తోస్తుంది.  ఇక సైకాలజీ విషయానికొస్తే జాకబ్సన్ అనే ఆయన PMR (progressive muscle relaxation) అనే టెక్నిక్ చెప్పి ఉన్నాడు. కానీ ఆ టెక్నిక్కీ, మన ఆసనాలకీ సంబంధం లేదు. 

ఆసనాలని తెల్లతోలు దేశాలవాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనీ, ఇదొక అంతర్జాతీయ గుర్తింపనీ చంకలు కొట్టుకోనక్కర్లేదు. అజ్ఞానం అంతర్జాతీయం, కానీ మనకి మాత్రం తెల్లతోలు జ్ఞానానికి చిహ్నం! ఈ సంగతి గ్రహించిన ఆధ్యాత్మిక వ్యాపారంగాళ్ళు తెల్లతోలుగాళ్ళని భక్తులుగా ముందు వరసలో కూర్చోబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

నన్ను నా పేషంట్లు అడిగేది 'వైద్యుడి'గా నా అభిప్రాయం మాత్రమే. నా సమాధానం కూడా వైద్యుడిగానే వుండాలి గానీ, నాకు నమ్మకం లేని ఆసనాల గూర్చి సలహా ఎలా ఇవ్వాలి? ఏం ఇవ్వాలి? మన్దేశంలో డాక్టర్లకి 'తెలీదు' అని చెప్పే సదుపాయం లేదు. 

"డోంట్ వర్రీ, వాళ్ళలా అడిగేది మన సమాధానం వినాలనే కుతూహలంతోనే. మందులతో సరైన రెస్పాన్స్ రాకపోతే, ఆ నెపం ఆసనాల మీదకి నెట్టేసే సౌలభ్యం కూడా మనకి వస్తుంది. కాబట్టి ఆసనాలు వేసుకొమ్మని చెబితేనే మనకి సేఫ్." అని నా వైద్యమిత్రులు అంటుంటారు. నిజమే! 

"ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో యోగాసనాలు వెయ్యకపోతే వచ్చే ప్రమాదం కన్నా యోగాసనాల గూర్చి సందేహం వ్యక్తం చెయ్యడం వల్ల వచ్చే ప్రమాదమే ఎక్కువ." అంటాడు సుబ్బు. ఇదీ నిజమే!

(edited version of an earlier post)