Sunday 24 July 2016

పేదవాడి కుట్ర

ఇది పవిత్ర భారద్దేశం. ఈ దేశం అటు ప్రాచీన సంస్కృతికీ ఇటు ఆధునికతకీ నిలయం. అలనాడు గంధర్వులు పుష్పక విమానంలో మబ్బుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ‘మనవాళ్ళొట్టి వెధవాయిలు’ కాబట్టి ఆ పుష్పక విమానం ఫార్ములానీ రైట్ బ్రదర్స్ ఎగరేసుకుపొయ్యారు. ఇంకో విషయం – మనం కొన్ని యుగాల క్రితమే వినాయకుడి తలని హెడ్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజితో మార్చేసుకున్నాం. ఇవ్వాల్టికీ అదెలా చెయ్యాలో అర్ధంగాక తల పట్టుకుంటున్నారు పాశ్చాత్య వైద్యాధములు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ప్రధానమంత్రిగారు అనుక్షణం తపన పడుతూ యెక్కే విమానం, దిగే విమానంగా క్షణం తీరిక లేకుండా వున్నారు. ఫలితంగా – ఒకప్పుడు ప్రపంచ పటంలో ఎక్కడుందో తెలీని భారద్దేశం ఒక గొప్పదేశంగా అందరికీ తెలిసిపోయింది. త్వరలోనే అమెరికా, చైనాల్ని తలదన్నేంతగా తయారవబోతుంది. రండి – మన ప్రధానమంత్రులవారి కృషిని అభినందిద్దాం, వారి చేతులు బలోపేతం చేద్దాం.
మంచివారు మంచిపన్లే చేస్తారు, చెడ్డవారు చెడ్డపన్లే చేస్తారు. అలాగే – ఒక మంచిపనికి అడ్డుపడే దుర్మార్గులు అన్ని యుగాల్లోనూ వుంటూనే వున్నారు. అలనాడు ఉత్తములైన ఋషుల చేసే యజ్ఞాల్ని భగ్నం చెయ్యడానికి దుష్టులైన రాక్షసులు అనేక కుట్రలు పన్నారు. ఆ రాక్షస సంతితే ఇవ్వాళ మరోరూపంలో దేశాభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకొడానికి కుట్ర చేస్తుంది.
ఇదంతా యెందుకు చెబుతున్నానంటే – ఈమధ్య గుజరాత్‌లో నలుగురు కుర్రాళ్ళని కారుకి కట్టేసి ఇనప రాడ్లతో చావగొట్టార్ట. దేశంలో మరే వార్తలు లేనట్లు మీడియా ఈ విషయాన్ని చిలవలు పలవలు చేసి చెబుతుంది. నేను శాంతికపోతాన్ని, హింసని ఖండిస్తాను. కానీ – ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో హింసని సమర్ధించక తప్పదు. ఇప్పుడు ఆ కుర్రాళ్ళని కొట్టిన సంఘటన వెనుక కారణాల్ని విశ్లేషించుకుందాం.
ఈ దేశంలో పుట్టిన ప్రతివారూ హిందువులే, అందరికీ దైవం ఆ శ్రీరాముడే. ఇందులో ఎటువంటి వాదప్రతివాదాలకి తావు లేదు. మన ప్రభుత్వం పేదవారికి అనేక పథకాల ద్వారా సహాయం చేస్తోంది. తద్వారా అనేకమంది తమ జీవితాల్ని మెరుగు పర్చుకుంటున్నారు. అయితే – కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పథకాలకి దూరంగా వుంటున్నారు. చదువుకొమ్మంటే చదువుకోరు, ఉద్యోగం వున్నా చెయ్యరు, ఆహారం వున్నా తినరు. యెందుకు?
యెందుకంటే – కుళ్లుకంపు కొడుతూ డొక్కలు యెండిన తమ పేదరికాన్ని ప్రపంచం ముందు దీనంగా ప్రదర్శించుకోవాలి, అంతర్జాతీయంగా మన దేశం పరువు పోగొట్టాలి. ఇది ఖచ్చితంగా కుట్రే! అందుకు ఋజువు – ఆ దెబ్బలు తిన్న కుర్రాళ్లే. చావుకు అంగుళం దూరంలో వున్నట్లు, దరిద్రానికి దుస్తులు వేసినట్లు.. జాలిజాలిగా, నిస్సహాయంగా, బాధతో అరుస్తూ, భయంతో వణికిపోతూ యెంత అసహ్యంగా వున్నారో కదా! గుండెని కలచివేసే వారి పేదరిక ప్రదర్శనకి ప్రపంచం కదిలిపోవచ్చు గాక, కానీ మన్లాంటి మేధావులు మోసపోరాదు.
ఈ దేశంలో అందరూ సమానమే. మనం కష్టపడ్డాం, అవకాశాలు అంది పుచ్చుకున్నాం, జీవితంలో స్థిరపడ్డాం, సుఖంగా బ్రతికేస్తున్నాం. ఇవ్వాళ మనకి గాలి యెలా పీల్చుకోవాలో చెప్పేందుకు బాబా రాందేవ్‌గారు వున్నారు, యెలా జీవించాలో చెప్పేందుకు శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌గారు వున్నారు, యెలా ఆసనాలు వెయ్యాలో చెప్పేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రిగారే వున్నారు. ‘ఇవన్నీ మాకు అక్కర్లేదు, మేం మా పేదరికంలోనే మగ్గిపొతాం’ అని మొరాయించేవాళ్ళని యెవరు మాత్రం యేం చెయ్యగలరు!?
మనది పుణ్యభూమి, కర్మభూమి. అన్నిరకాల ఆహారాల్లోకి శాకాహరం మాత్రమే అత్యున్నతమైనదని వేదాలు ఘోషిస్తున్నయ్. అసలు ఆహారం కోసం ఇంకో ప్రాణిని చంపడమే దారుణం, అంచేత మాంసాహారం నీచమైనది. ఈ మహాసత్యాన్ని గుర్తించని కొందరు ‘మా ఆహారం, మా అలవాటు, మా ఇష్టం’ అంటూ వితండ వాదం చేస్తున్నారు.
మనం శాంతి కాముకులం, ఇతరుల అలవాట్లని గౌరవించే సంస్కారం వున్నవాళ్ళం. కాబట్టే అత్యంత దయతో – “వురేయ్ అబ్బాయిలూ! మాంసాహారం మహాపాపం. ఈ విషయాన్ని ముందుముందు మీరే తెలుసుకుంటారు. సరే! కోళ్ళు, కుక్కలు.. మీ ఇష్టం.. మీరేవైఁనా తినండి, మాకనవసరం. కానీ – గోవు మా తల్లి, దయచేసి మా తల్లి జోలికి మాత్రం రాకండి.” అని చిలక్కి చెప్పినట్లు చెప్పాం.
నేను ముందే మనవి చేసినట్లు వీళ్ళు పేదరికం ముసుగేసుకున్న అరాచకవాదులు. మనం యేది వద్దంటామో అదే చేస్తారు, యెంత సౌమ్యంగా చెబుతామో అంతగా రెచ్చిపోతారు. మన మంచితనాన్ని అసమర్ధతగా భావిస్తారు. అందుకే గుజరాత్‌లో మన తల్లి చర్మం వలిచేందుకు తెగబడ్డారు. మీరే చెప్పండి, మీ మాతృమూర్తి చర్మం వలిచేవాళ్ళని మీరైతే యేం చేస్తారు?
“మీరు వాళ్ళని గొడ్డుని బాదినట్లు బాదడం తప్పు.”
“అయ్యా! మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఆ నలుగురు కుర్రాళ్ళు తప్పుడు పని చేశారు. చెడుమార్గం పట్టిన కొడుకుని తండ్రి శిక్షించకుండా ఉపేక్షిస్తాడా? యెంత కొట్టినా దాని వెనుక ప్రేమ తప్ప ఇంకేమీ వుండదు కదా? ఇదీ అంతే! వాళ్ళు చేసింది హత్య, మానభంగం లాంటి సాధారణ నేరం కాదు – అత్యంత హేయమైన నేరం. నేరానికి తగ్గ శిక్ష పడాలి కదా! అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో (యెంతో బాధ పడుతూ) ఇనప రాడ్లతో బాదాల్సి వచ్చింది. ఇది మన దేశ సాంప్రదాయతని కాపాడ్డానికి చేసిన పుణ్యకార్యంగా మీరు భావించాలి.”
“నిందితుల్ని పట్టుకుని పోలీసులకి అప్పజెప్పాలి. వాళ్ళు నేరస్తులని చట్టబద్దంగా నిరూపణ కావాలి. మీరిలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అన్యాయం.”
“ఊరుకోండి సార్! మీరు మరీ అమాయకుల్లా వున్నారు. నేరం, చట్టం లాంటి పదాలు లలిత్ మోడీ, విజయ్ మాల్యాలకే గానీ సాధారణ ప్రజానీకానిక్కాదు. వాళ్ళు నీచులు, నీచులకి నీచభాషలోనే చెప్పాలి. అందుకే తాట వూడేట్లు బాది పడేశాం. అయినా మనకెందుకు భయం!? స్టేట్‌లో మనవేఁ, సెంటర్లో మనవేఁ. ఈ హడావుడి రెండ్రోజులే. ఆ తరవాత మళ్ళీ మామూలే.”
“ఆవుని చంపడం నేరం అని దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేసే చర్యలు చేపడదాం. అవసరమైతే రాజ్యంగ సవరణ చేయిద్దాం. ఆ కుర్రాళ్లని చావగొట్టడం.. ”
“ఎళ్ళెళ్ళవయ్యా! పెద్ద చెప్పొచ్చావ్! నీ మాత్రం మాకు తెలీదనుకున్నావా? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మేం మా పని చేసుకుంటూ పోతాం. కాబట్టే మేం గోరక్షక ముఠాలుగా యేర్పడ్డాం.”
“కానీ, చట్టబద్ద పాలన.. ”
“అసలెవడ్రా నువ్వు? ఇందాకట్నించీ ఒకటే లెక్చర్లిస్తున్నావ్! ఎవర్రా అక్కడ? ముందీ గాడ్దె కొడుకుని ఆ కారుకి కట్టేయ్యండి. మొన్న మనం వాడి పడేసిన ఆ ఇనప రాడ్లు తీసుకురండి.”
“హెల్ప్.. హెల్ప్.. ”
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 జులై 24)