Sunday 11 December 2016

ఈ విగ్రహం ఘంటసాలదేనా?!


మా గుంటూరు నాజ్ సెంటర్లో పంచరంగుల్లో ఒక విగ్రహం ఉంది. ఒళ్ళో వీణతో కూర్చుని సంగీత సాధన చేస్తున్న యెవరో పెద్దమనిషి విగ్రహం అది. చాలాసార్లు ఆ విగ్రహం యెవరో తెలిసిన వ్యక్తిదిలా అనిపించేది. ఆవిధంగా అనేకసార్లు చూశాక, చివరాకరికి ఆ విగ్రహం యెవర్దో గుర్తుపట్టాను. అది ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం!

నేను ఘంటసాల పాటల్ని ఇష్టంగా వింటాను. ఘంటసాల ఫోటోలు చాలానే చూశాను. నాకు కంటిచూపు బానే ఉంది, బుర్రా బానే పన్జేస్తుంది. అయినా - ఘంటసాల విగ్రహాన్ని ఎందుకు గుర్తు పట్టలేకపొయ్యాను! 

సినిమా ఒక 'కళ' అంటారు గానీ, వాటిని తీసేవాళ్ళు మాత్రం 'మాది వ్యాపారం మాత్రమే' అనే అరిచి మరీ చెబుతుంటారు. సినిమా అనేది పూర్తిగా దర్శకుడి మీడియం. దర్శకుడి సూచనల మేరకు సన్నివేశానికి తగ్గట్టు పాటని ట్యూన్ చేసుకున్న సంగీత దర్శకుడు.. ఆ పాటని గాయకుల్తో పాడిస్తాడు.  

నువ్వు గొప్ప గాయకుడివి కావచ్చు. కానీ సినిమాకి పాడాలంటే ఆ సినిమాలో పాత్ర త్రాగుబోతో, తిరుగుబోతో, దొంగో.. ఇలా యెవరైనా కావచ్చు.. వారి కంఠం నుండి వస్తున్నట్లుగా పాడాలి. ఇదే సినిమా టెక్నిక్. ఈ కారణాన - రఫీ, కిశోర్, ఘంటసాల వంటివారు మాత్రమే గొప్ప సినిమా గాయకులు కాగలిగారు.  

సినిమా సంగీతానికీ, శాస్త్రీయ సంగీతానికీ చాలా తేడా ఉంటుంది. శాస్త్రీయ సంగీతం వన్ మ్యాన్ షో లాంటిది. అక్కడ ఆ గాయకుడే ఒక బ్రాండ్. నాలాంటి అజ్ఞానికి ఆ పాడే వ్యక్తి చలికి గజగజా వణుకుతున్నట్లుగా, జీళ్ళపాకంలా సాగదీస్తూ పాడుతున్నట్లుగా అనిపించినా.. అక్కడ వినేవాళ్ళు వేళ్ళతో యేవో లెక్కలు వేసుకుంటూ, తల ఊపుతూ ఆనందిస్తుంటారు. మంచిది, యెవరి ఆనందం వారిది!  

సినిమా సంగీతానికి సన్నివేశం ప్రాణం. మంచి గాయకుడు గొప్పగా పాడి - సన్నివేశాన్ని, సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తాడు. ఘంటసాల పాడిన పాటలు, కూర్చిన బాణీల వల్లే కొన్ని సాధారణ సినిమాలు అసాధారణ విజయం సాధించాయి. 

షావుకారు, పెళ్ళిచేసిచూడు, దేవదాసు, మాయాబజార్, లవకుశ, జయభేరి, మూగమనసులు.. ఇలా అనేక సినిమాల్లో ఘంటసాల పాటలే గొప్పబలం. త్రాగుబోతు పాడుకున్న 'కుడియెడమైతే పొరబాటు లేదోయ్', ఉత్తర కుమారుడు పాడిన 'సుందరి నీవంటి దివ్యస్వరూపము' వంటి పాటలు ఘంటసాల కెరీర్లో చాలా ముఖ్యమైనవి. 

అయితే - మన తెలుగువాళ్ళల్లో ఒక జబ్బుంది. వీళ్ళు సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతం వెతుకుతుంటారు. అందుకే వీళ్ళకి 'రసికరాజ తగువారము కాదా', 'శివశంకరి శివానందలహరి' వంటి శాస్త్రీయ సంగీతాన్ని ఆధారం చేసుకున్న పాటల్ని గొప్పపాటలుగా మెచ్చుకుంటారు. కానీ - సినిమా పాటల పర్పస్ ఇదికాదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా పాడటమే సినిమా సంగీతం. 

ఘంటసాల యేవో కొన్ని ప్రైవేట్ సాంగులు, భగవద్గీత లాంటివేవో పాడినా.. నాకవేవీ నచ్చలేదు. నాకు సినిమాలో హీరో ఇష్టం, ఆ హీరోకి పాడిన ఘంటసాల ఇష్టం. నేను ఘంటసాలని 100% సినిమా పాటల గాయకుడు మాత్రమే అభిమానిస్తాను! 

తన సినిమా పాటలతో ఎందరో అభిమానాన్ని సంపాదించిన ఘంటసాలకి ఒక విగ్రహం పెడదామనుకున్నప్పుడు.. ఆయన విగ్రహం యెలా ఉండాలి? ఘంటసాలలాగే ఉండాలి. కానీ - మన తెలుగువాళ్ళు త్యాగయ్య, అన్నమయ్యల విగ్రహాల టైపులో ఘంటసాలకి చేతిలో వీణా, తంబురా పెట్టేసి గౌరవించేశారు! అంటే వీళ్లు సినిమా పాటలు పాడిన ఘంటసాల్ని శాస్త్రీయ సంగీత విద్వాంసుడిగా మార్చేశారు!

సరే! ఈ విగ్రహాలు యేర్పాటు చేసేవాళ్లూ, మీటింగులు పెట్టి ఘంటసాలని పొగిడేవాళ్ళూ 'బోఫోర్స్ బ్యాచ్' అని మా సుబ్బు అంటాడు. కాబట్టి ఘంటసాల విగ్రహం చేతిలో తంబూరా వున్నా లేకపోయినా ఘంటసాల పాడిన సినిమా పాటలకి అభిమానినైన నాలాంటివాళ్ళకీ పొయ్యేదేం లేదు. కాబట్టి ఆ విషయం 'శాస్త్రీయ సంగీత ఘంటసాల' అభిమాన సంఘాలకి వదిలేద్దాం. 

నాకు నచ్చిన ఘంటసాల పాటొకటి ఇస్తున్నాను, ఎంజాయ్ చెయ్యండి. 

(picture courtesy : Google)