Saturday, 25 February 2017

ప్రొఫెసర్ కోదండరాం


'Appearances are deceptive' అన్నారు పెద్దలు. అందుకు మంచి ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం! ఈయన చూడ్డానికి ఎవర్నైనా సులువుగా నమ్మేసే అమాయకుళ్లా అగుపిస్తాడు. యెదుటివాడు చెప్పేది ఓపిగ్గా వింటాడు. యెంత ప్రవోక్ చేసినా ఆ మొహంలో కోపం కనపడదు. క్లిష్టమైన ప్రశ్నలక్కూడా క్లాస్ రూములో పాఠం చెప్తున్నట్లు ప్రశాంతంగా, నిదానంగా మృదువుగా, చక్కటి పదాలతో సమాధానం చెబుతాడు! కోదండరాంలో ఎడ్రినలిన్ లెవెల్స్ తక్కువని నా అనుమానం.

నాకు కోదండరాం పరిచయం టీవీ ద్వారానే. ఈ మందపాటి కళ్ళజోడు వ్యక్తి మెత్తగా కనిపించే గట్టివాడు అని అప్పుడే గ్రహించాను. సరే! అటు తరవాత తెలంగాణా ఉద్యమంలో కోదండరాం నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే.

తెలంగాణా వచ్చాక - కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణా మేధావుల్లో అధికుల్ని పదవుల్లో నింపేసింది. మిగిలిన కొందర్ని అవార్డులు, రివార్డుల్తో ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. కేసీఆర్‌కి వీరవిధేయత చూపించకపోవడమో మరేదో తెలీదు కానీ కోదండరాం మాత్రం పదవుల్లేకుండా తెలంగాణా రాష్ట్రంలో అలా మిగిలిపొయ్యాడు.

రాజకీయ పార్టీలు గెలవడానికి అడ్డగోలు వాగ్దానాలు చేస్తుంటాయి (అలా చెయ్యటం అనైతికం అని ఎన్నికల కమిషన్ కూడా అనుకోవట్లేదు). తెలివైన ప్రజలు డబ్బులో, బ్రాందీసీసానో తీసుకుని ఓట్లేస్తారు (దేశంలో వీళ్ళే ఎక్కువ అని నా అనుమానం). తెలివి తక్కువ్వాళ్లు నాయకుల మాటలు నమ్మి ఓట్లేస్తారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చేముందు బోల్డన్ని ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మా ఉద్యోగాల సంగతేంటని తెలంగాణా యువత అడుగుతుంది. అసలు మాకు సమైక్య ఆంధ్ర రాష్ట్రానికీ, తెలంగాణా రాష్ట్రానికి తేడా తెలీటల్లేదని ఉస్మానియా విద్యార్థులు వాపోతున్నారు. రోహిత్ వేముల సంఘటనతో దళితులకీ తెలంగాణలో తమ స్థానం అర్ధమైంది.

కొన్నాళ్లుగా ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తున్న కోదండరాం ఇప్పుడు స్పీడు పెంచాడు. నిరుద్యోగుల తరఫున గళం విప్పాడు. నా చిన్నప్పుడు ఈ అసంతృప్తుల్ని ప్రభుత్వాలు పట్టించుకునేవి, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించేవి. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అగత్యం తప్పింది. అధికారంలో ఉన్నవాళ్లు రాజులు, వారి కొడుకులు యువరాజులుగా చలామణి అయిపోతున్నారు.

అంచేత సహజంగానే ప్రభువుల్లో అసహనం పెరిగింది. ఈ అసహనంలో రాష్ట్రప్రభుత్వాలకీ, కేంద్రప్రభుత్వానికీ పోటీ వుంది. ప్రభుత్వాలకి ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులుగా కనపడసాగాయి. తమని ప్రశ్నించేవారు ఉగ్రవాదులుగా నమ్మసాగాయి. కాబట్టి నిరసన తలపెట్టిన కోదండరాంని ఇంట్లోనే అరెస్ట్ చేసేసి, తెలంగాణా ప్రభుత్వం తన ప్రజానీకాన్ని 'కోదండరాం' అనే పెనుప్రమాదం నుండి రక్షించింది.

ఇందుకు ప్రభుత్వం చెపుతున్న కారణాలు గమ్మత్తుగా ఉన్నాయి.

"ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగాలు ఇస్తుంటే కోదండరాం నిరుద్యోగుల్ని రెచ్చకొడుతున్నాడు!"

అంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తే ఇక కోదండరాం మాట నిరుద్యోగులు మాత్రం ఎందుకు వింటారు? కోదండరాం వెనక్కి తిరిగి చూసుకుని, తన వెనుక యెవరూ లేకపోతే ఇంట్లోనే వుండిపోతాడు కదా! అప్పుడు ప్రభుత్వానికి ఇంకా హాయి కదా!

"కోదండరాం కాంగ్రెస్ ఏజంట్!"

అయితే ఏంటీ? అదేమన్నా నేరమా? కాంగ్రెస్ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ ఏజంట్లకి నిరసన తెలిపే హక్కు ఉండదా?!

"కోదండరాం సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది, అందుగ్గానూ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు."

సో వాట్? ఈ దేశంలో అందర్లాగానే ఆయనకీ పార్టీ పెట్టుకునే హక్కుంది! ఆ పార్టీ పెట్టుకునేందుకు ఒక ప్లాట్‌ఫాం యేర్పాటు చేసుకుంటున్నాడు! చేసుకోనీండి, ఎవరైనా పార్టీ పెట్టేముందు చేసేదదే కదా!

ప్రస్తుతం తెలంగాణాలో మీడియా అధికారానికి దాసోహం అంటుంది. అందుక్కారణం మీడియా ఆస్తులు హైదరాబాద్‌లో ఉండటం, ఆ హైదరాబాద్ తెలంగాణలో ఉండటం కావచ్చు. యేదియేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కెయ్యడం ప్రభుత్వాలకి ఒక విధానంగా మారిపోయింది.

తెలంగాణా ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న పాటగాళ్లు, రాతగాళ్ళు, గీతగాళ్ల ఎడ్రెస్ ఎక్కడుందో కూడా తెలీడం లేదు. ఇటువంటి సమయంలో కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీయడం సాహసోపేతమైన చర్యగా భావించాలి.

నా ఉద్దేశం - అసలు కోదండరామ్ అవసరం తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యెక్కువగా వుంది. కానీ - మొదట్నుండీ ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు సంపాదనపరులు తప్ప మేధావులు లేరు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల దురదృష్టం!

(picture courtesy : Google)

Friday, 17 February 2017

శశికళ చేసిన తప్పు


కాఫీ తాగుతూ ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నాను. కొన్నాళ్లుగా జాతీయ మీడియా తమిళనాడు వార్తల్ని వేడివేడిగా వండి వారుస్తుంది. 

"మిత్రమా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"రా సుబ్బూ! ముఖ్యమంత్రి అవుదామనుకున్న శశికళ జైలు పక్షి అయింది. ఆమె జైల్లోకి వెళ్లడం చూస్తుంటేనే భలే హేపీగా ఉంది. చివరాఖరికి చట్టం ముందు అవినీతి ఓడిపోయింది." సినిమాటిక్ గా అన్నాను.

ఒకక్షణం ఆలోచించి అన్నాడు సుబ్బు - "నేనలా అనుకోవట్లేదు. జాతీయ మీడియా శశికళని విలన్‌గా ప్రచారం చేస్తుంది, అలా చూపించడంలో వారికి కొన్ని ప్రయోజనాలున్నయ్! కొద్దిసేపు తెలుగు సినిమా టైపు ఆలోచనల్ని పక్కనబెట్టి విషయాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు." 

"సరే! ఎలా అర్ధం చేసుకోవాలో నువ్వే చెప్పు." అడిగాను.

"చాలామంది శశికళ జయలలితని వశబర్చుకుందనీ, ఆమెకి తెలీకుండా భర్తతో కలిసి తెర వెనక చాలా అక్రమాలు చేసిందనీ నమ్ముతున్నారు. అసలు సంగతి - వాళ్లిద్దరూ ఒకర్నొకరు సహకరించుకున్నారు. జయలలితకి ఎమ్జీఆర్ వారసత్వం, సినిమా గ్లామర్ పుష్కలంగా ఉన్నాయి. అయితే కరుణానిధి వంటి బలమైన నాయకుణ్ని ఎదుర్కోడానికి ఇవి మాత్రమే సరిపోవు, నమ్మకమైన 'బ్యాక్ రూమ్ ఆపరేటర్' కావాలి. ఆ బాధ్యతని శశికళ చక్కగా నిర్వహించింది. అంటే జయలలిత అనే మొక్కకి శశికళ అనే యెరువు తోడై చక్కటి ఫలసాయం దక్కింది!" అన్నాడు సుబ్బు. 

వేడివేడి కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు -

"జయలలిత శశికళలది - శంకర్ జైకిషన్, సలీం జావేద్ టైపు హిట్ కాంబినేషన్. ఇప్పుడు జయలలిత చనిపోయింది, అధికారం నాలుగేళ్లపాటు ఉంటుంది. పార్టీకి ముప్పయ్యేడు మంది లోకసభ సభ్యులు, పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళ సహకారం కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. అందుకే కేంద్రం తన చెప్పుచేతల్లో ఉండే తమిళ ప్రభుత్వం కోసం పావులు కదుపుతుంది. ఇక్కడే శశికళ కొంత హోమ్ వర్క్ చేసుండాల్సింది."

"యెలా?" అడిగాను.

"రాజ్యాంగం ప్రకారం మనది ఫెడరల్ స్ట్రక్చర్. కానీ కేంద్రప్రభుత్వానికి విపరీతమైన అధికారాలున్నయ్. రాజకీయంగా తమకి నచ్చని వాళ్ళని తొక్కెయ్యడానికి గవర్నర్ల వ్యవస్థని వాడుకోడం కేంద్రప్రభుత్వాలకి అనాదిగా అలవాటు. ఇది కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చెయ్యడంతో మొదలయింది. రామారావు, నాదెండ్ల భాస్కర్రావుల ఎపిసోడ్ గుర్తుంది కదా?" అడిగాడు సుబ్బు. 

"కానీ రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చాడుగా?" అన్నాను. 

"వచ్చాడు, ప్రజల్లో అతనికున్న విపరీతమైన ఫాలోయింగ్ మూలంగా గట్టెక్కాడు గానీ.. లేకపోతే ఆ దెబ్బకి కోలుకునేవాడు కాదు. ఆ తరవాత రాష్ట్రప్రభుత్వాల్ని కూల్చడం, ఆయా నాయకుల్ని సీబీఐ సాయంతో అవినీతి కేసుల్లో ఇరికించడం కేంద్ర ప్రభుత్వాలకి చాలా సాధారణ విషయంగా అయిపోయింది." అన్నాడు సుబ్బు. 

"అవును." అన్నాను.

"ఈ మర్మం తెలీని జగన్ కేంద్రంతో ఢీకొని జైలు పాలయ్యాడు. కేంద్రం పవర్ గూర్చి అంచనా ఉన్నందునే చంద్రబాబు, కేసీఆర్ బయటకెన్ని కబుర్లు చెప్పినా లోపల లోపాయికారీగా ఉంటున్నారు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు. 

"అవును." 

"శశికళకి పొలిటికల్ మేనేజ్మెంట్ తెలీలేదు. కేంద్రప్రభుత్వానికి భేషరతు మద్దతు ఇస్తానని, దాని కనుసన్నల్లో ఉంటాననీ సిగ్నల్స్ పంపలేదు. శేఖర్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీల ద్వారా కేంద్రం శశికళని 'హెచ్చరించి'నప్పటికీ ఆమె పట్టించుకోలేదు. కేంద్రానికున్న శక్తిని అంచనా వెయ్యడంలో శశికళ పొరపడింది." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు. 

"ఒప్పుకుంటున్నాను. కానీ తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు కదా?" ఆసక్తిగా అడిగాను. 

"ఇక్కడ నువ్వొక విషయం మిస్ అవుతున్నావ్! ట్రయల్ కోర్టులో శిక్ష పడ్డ కేసుని హైకోర్టు కొట్టేసింది. ఇంత ముఖ్యమైన కేసు అప్పీలుకి వచ్చినప్పుడు సుప్రీం కోర్టు దాన్ని రెండేళ్లుగా నాన్చడం ఆశ్చర్యం! ఫలితంగా - జైల్లో కూర్చోవాల్సిన ఒక వ్యక్తి కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉండగలిగింది! అబ్సర్డ్ గా లేదూ? కోర్టు ఇన్నేళ్లు తీర్పుని ఎందుకు పెండింగ్ లో పెట్టింది? శశికళ ముఖ్యమంత్రి అయ్యే సమయంలోనే తీర్పు ఇస్తున్నానని ఎందుకు చెప్పింది?" అన్నాడు సుబ్బు. 

"అంటే?"

"అంటే - శశికళకి ఈ దేశంలో కోర్టుల గూర్చి కూడా అవగాహన లేదని అర్ధం!" నవ్వుతూ అన్నాడు సుబ్బు. 

"నీకున్న తెలివి శశికళకి లేదంటావా?" అడిగాను. 

"లేదని నేనెందుకు అంటాను! ఒక్కోసారి చాలా మంచి క్రికెటర్ కూడా సిల్లీ షాట్ కొట్టి అవుటయిపోతాడు. ఆ విషయం అతనికీ అవుటయ్యాకే తెలుస్తుంది. రాజకీయాలూ అంతే! నేవెళ్తాను." అంటూ నిలబడ్డాడు సుబ్బు. 

"పదిరోజుల్లో తమిళ రాజకీయాలు ఒక కొలిక్కి వస్తాయిలే!" అన్నాను. 

"రావు, రాజశేఖరరెడ్డి మరణం తరవాత కాంగ్రెస్ పార్టీ గతి యేమైందో గుర్తుందిగా? ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా యెవరున్నా కిరణ్ కుమార్ రెడ్డిలా వ్యక్తులకీ, వారి ఆస్తులకీ ఉపయోగం తప్ప పార్టీకి ప్రయోజనం ఉండదు." వెళ్ళబోతూ అన్నాడు సుబ్బు. 

"ప్రజాస్వామ్యంలో ఒక బలమైన నాయకుడు హఠాత్తుగా చనిపోతే అంతే!" అన్నాను. 

"ముందు నువ్వా పుస్తక భాష వదిలేసి వాస్తవ ప్రపంచంలోకి రా! మనం ఇప్పుడున్నది 'ప్రజాస్వామ్యం' అని పిలుచుకుంటున్న రాచరిక పాలనలో! ఆ మాత్రం తెలీదా నీకు?" పెద్దగా నవ్వుతూ నిష్క్రమించాడు సుబ్బు.  

(picture courtesy : Google)