Wednesday 3 October 2012

అంతా.. ఈ జగమంతా.. రాజకీయమయం!


"రా సుబ్బూ! భలే సమయానికొచ్చావు. రాజకీయ కారణాలతో రాష్ట్రం విడిపోదట. మన ముఖ్యమంత్రిగారు చెప్పారు. ఇప్పుడే చదువుతున్నాను." అప్పుడే లోపలకొస్తున్న సుబ్బుని చూస్తూ అన్నాను.

సుబ్బు ఎదురుగానున్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.

"మరి ఏ కారణాల వల్ల విడిపోతుందిట?"

"ఆ సంగతి చెప్పలేదు." అన్నాను.

"ఐతే ఇప్పుడు మనం ముఖ్యమంత్రిని చాలా ప్రశ్నలడగాలి. రాజకీయ కారణాలు లేకుండా ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఒక సంఘటన, ఒక పరిణామం చోటు చేసుకుందా? రెండు ప్రపంచ యుద్ధాలు, మన దేశస్వాతంత్ర్యం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ, ఇందిరా రాజీవ్ గాంధీల హత్య.. అన్నీ రాజకీయాలే కదా! అసలు ఈ సృష్టిలో రాజకీయం కానిదేదన్నా ఉందా?" అడిగాడు సుబ్బు.

"ఉంది. నా  సైకియాట్రీ  ప్రాక్టీస్!" నవ్వుతూ అన్నాను.

"నీ ప్రాక్టీస్ కూడా రాజకీయమే బ్రదర్. నీవంటి దిగువ మధ్యతరగతివాడు చదువు ద్వారా డాక్టర్ అయ్యే రాజకీయ వాతావరణం మనదేశంలో ఉంది. కొన్నిదేశాల్లో ఈ అవకాశం లేదు. కాబట్టి ఆదేశాల్లో నువ్వు ఇంకేదో చేస్తుండేవాడివి."

ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది.

"రవణ మావా! చాలామంది చదువుకున్నవాళ్ళు కూడా రాజకీయాలంటే చంద్రబాబు, కెసియార్ల రోజువారీ తిట్టుడు కార్యక్రమాలు, ఎన్నికలు మాత్రమేనని అనుకుంటారు. కానీ కాదు. రాజకీయ ఆలోచన అనేది ఒక నిరంతర ప్రక్రియ. మంచి రాజకీయాల వల్ల ప్రజాజీవితం బాగుపడుతుంది. చెడ్డ రాజకీయాల వల్ల భ్రష్టు పడుతుంది. ఏది మంచి రాజకీయం అనేదాన్లోనే రకరకాల అభిప్రాయాలున్నాయి." అన్నాడు సుబ్బు.

"అంటే చంద్రబాబుకీ, జగన్ బాబుకీ కల అభిప్రాయబేధాలా?" అడిగాను.

"కాదు. నా దృష్టిలో వాళ్ళిద్దరూ ఒక్కటే. ఇక్కడ మనం 'ఇజం' గూర్చి చెప్పుకోవాలి. కేపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం మొదలైన పొలిటికల్ ఫిలాసఫీలున్నాయి. యిదంతా చాలా కాంప్లికేటెడ్ ఏరియా. ఒక్కోదేశానికి ఒక్కోరకమైన సమస్యలు, పరిస్థితులు. జలుబు, దగ్గులకి అన్నిదేశాల్లో ఒకటే మందు. కానీ రాజకీయాలు చాలా సంక్లిష్టమైనవి. ఒక దేశ ఉన్నతికి కారణమైన పొలిటికల్ మోడెల్ ఇంకోదేశంలో ఘోరంగా విఫలమవుతుంది. అలా అనుకరించబోయిన చాలామంది రాజకీయ నాయకులు బోర్లాపడ్డారు." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నావు." విసుక్కున్నాను.

"సారీ! అయితే సింప్లిఫై చేస్తాను. విను. కొన్నిదేశాల్లో అక్కడి రాజకీయ నాయకులు అనుసరిస్తున్న రాజకీయ విధానాల వల్ల ఆదేశ ప్రజలు సుఖమయ జీవనం గడుపుతుండగా.. ఇంకొన్ని దేశాల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కొన్ని దేశాల్లో అదీ కుదరక ఆకలితోనో, బాంబు దాడుల్లోనో చస్తున్నారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ పై పెట్టాడు.

"అవును." అన్నాను.

"ఇక్కడ ప్రజలు హాయిగా సినిమాలు చూసుకుంటున్నారు. టీ స్టాల్లో సింగిల్ టీ తాగుతూ నచ్చని రాజకీయపార్టీని నోరారా తిట్టుకుంటున్నారు. పట్టపగలే మందుకొట్టి రోడ్లెమ్మడ పడిపోతున్నారు. కొన్నిదేశాల్లో ఈ లక్జరీ లేదు. ఇలా మన దైనందిన జీవితంలో రాజకీయ ప్రభావం లేని అంశమంటూ లేదు." అన్నాడు సుబ్బు.

"ఒక్క నీ ఉప్మాపెసరట్టు తప్ప." నవ్వుతూ అన్నాను.

"నో! నేనలా అనుకోవడం లేదు. మన రాజకీయ నాయకులు అభివృద్ధి పేరుతో పెసరట్టు పేటెన్సీని ఒక MNC కి కట్టబెట్టొచ్చు. అప్పుడు మనకి ఉప్మాపెసరట్టు ఏ KFC లోనో మాత్రమే లభ్యమవుతుంది. ఆనంద భవన్ వంటి హోటళ్ళు రోగాల్ని వ్యాప్తి చేస్తున్నాయని ఒక రిపోర్ట్ ఇంటర్నేషనల్ మేగజైన్ లో పబ్లిష్ అవుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన 'ఆరోగ్య పరిరక్షణ' నిమిత్తం ఆనంద భవన్ మూయించబడుతుంది. ఆ స్థానంలో ఒక ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్, ఫుడ్ కోర్ట్ వస్తుంది. ఆవిధంగా 'శుచికరమైన' ఆహారం తినడం మనకి అలవాటవుతుంది. ఫలితంగా మన భవిష్యత్ తరాలవారికి ఆనంద భవన్ అంటే ఏంటో తెలీకుండా పోతుంది." అంటూ వాచ్ చూసుకుంటూ లేచాడు సుబ్బు.

"మరి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ మాత్రం తెలీదంటావా?" అడిగాను.

"అతను క్రికెట్ ఆడుకుంటూ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలీకపోవచ్చు. తెలిసినా ఏం చెప్పినా చెల్లుబాటయిపోతుందనుకోవచ్చు. అతను ఎందుకలా చెప్పాడో మనమెలా నిర్ణయిస్తాం? ఇవన్నీ ఎలెక్షన్లప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. వస్తా!" అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)