Saturday, 6 October 2012

రంగమ్మ కథ


"ఒసే దరిద్రపుగొట్టు మొహమా! వయ్యారంగా ఎంతసేపు వూడిచ్చస్తావే? స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టవే ముండా!" రంగమ్మ గొంతు గాండ్రించింది.

"ఆ! వస్తన్నా, వస్తన్నా. అయిపోవచ్చింది." చిన్నగా, సన్నగా సమాధానం.

"గంట నించీ అదే మాట చెప్పి చస్తన్నావు గదే శనిద్రప్ముండా!" మళ్ళీ గాండ్రింపు.

రాంబాబుకి చిర్రెత్తింది. చదువుతున్న పుస్తకం విసిరికొట్టి, రెండు చెవులు మూసుక్కూర్చున్నాడు. రాంబాబు అవస్థకి అతని భార్య ఇందిరకి నవ్వొచ్చింది. ఆమెకిదంతా అలవాటైపోయింది.

రాంబాబు బ్యాంక్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు. ఆర్నెల్ల క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకొచ్చాడు. మేడపైన రెండు బెడ్రూముల పోర్షన్. పిల్లల స్కూలుకి బాగా దగ్గర. ఇల్లు కూడా సౌకర్యంగా ఉంది.

ఇల్లు క్రింద భాగం ఇంటి ఓనర్లు ఉంటారు. భార్యా, భర్త. ఆయనకి డెబ్భైయ్యేళ్ళు. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య రంగమ్మ. లావుగా, పొట్టిగా, గుండ్రంగా ఉంటుంది. వారి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.

రాంబాబుకి ఆ ఇల్లు నచ్చింది. పెరట్లో పెద్ద మామిడి చెట్టు. ఇంటి చుట్టూతా పిల్లలకి ఆడుకోడానికి కావలసినంత స్థలం. రాంబాబుకి పుస్తకాలు చదివే అలవాటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువ సమయం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తాడు.

ఒక ఆదివారం కింద కేకలు, అరుపులు వినిపించాయి. రాంబాబు కంగారుపడ్డాడు. ఇల్లుగలావిడ పనిమనిషిని అరుస్తుందని ఇందిర చెప్పింది.

"ఈ రోజుల్లో పనిమనుషుల్ని ఇంత భయంకరంగా కోప్పడితే ఊరుకుంటారా?" ఆశ్చర్యంగా అడిగాడు రాంబాబు.

"ఆ అమ్మాయి పనిమనిషి కాదుట. రంగమ్మగారికి పొలం చాలా ఉందిట. వాళ్ళ పాలేరు కూతురు కుమారిని పనికి సాయంగా, తోడు కోసం తెచ్చుకున్నార్ట. ఆ అమ్మాయి అన్ని పనులూ చేస్తుంది. రంగమ్మగారికి కొద్దిగా కోపం." అంది ఇందిర.

"కొద్దిగానా? చాలానే ఉంది!" అంటూ నవ్వాడు రాంబాబు.

కుమారి చీపురుపుల్లలా ఉంటుంది. ఇంటిపనులు చురుకుగా, చకచకా చేసేస్తుంది. తెల్లారక ముందే కసువు చిమ్మేస్తుంది. ముగ్గులు పెడుతుంది. స్నానానికి వేణ్ణీళ్ళ కోసం బాయిలర్ వెలిగిస్తుంది. అంట్లు తోముతుంది. వంట చేస్తుంది. బట్టలుతుకుతుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళకి తినడం, పడుకోవడం తప్ప పనేమీ లేకుండా మరమనిషిలా అన్ని పన్లూ తానే చేసేస్తుంది.

రాంబాబు అప్పుడప్పుడూ బ్యాంక్ నుండి మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడు. ఆ సమయంలో కూడా కుమారి కిటికీలు, గ్రిల్స్ శుభ్రం చేస్తూ కనపడేది. రాంబాబు ఆ అమ్మాయి కనీసం కూర్చునుండగా ఎప్పుడూ చూళ్ళేదు. ఆ అమ్మాయిని చూస్తూ జాలి పడుతూ తన వాటా మెట్లెక్కే వాడు.

రాన్రాను రాంబాబుకి దిగులుగా అనిపించసాగింది. అతనికి రంగమ్మ ఒక రాక్షసిగానూ, కుమారి ఆ రాక్షసి చేపట్టిన రామచిలకలా అనిపించసాగింది. ఏం చెయ్యాలో తోచక - మన సంఘంలో పనిమనిషి పేరున జరుగుతున్న మానవహక్కుల అణచివేత గూర్చి ఇందిరకి ఉపన్యాసం చెప్పడం మొదలెట్టాడు. ఇందిర వింటూనే విసుక్కునేది.

ఒకసారి ఇంటిగలాయనకి జ్వరం వచ్చిందని తెలిసి పలకరించడానికి వెళ్ళాడు. ఆయనసలే బక్కప్రాణి. దీనికితోడు నాలుగైదు లంఖణాలు చేసినట్లున్నాడు.. బల్లిలా మంచానికి అతుక్కుపోయున్నాడు. రాంబాబుని చూసి నీరసంగా నవ్వాడు.

మంచానికి తల దగ్గరున్న చెక్క కుర్చీలో కూర్చునుంది రంగమ్మ. పెద్ద గాజు గ్లాసు నిండా బత్తాయి రసం. చప్పరిస్తూ నిదానంగా తాగుతుంది. ఆ పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు రాంబాబు.

"ఇప్పుడెలా ఉందండి? నీరసంగా ఉందా? మాత్రలు వేసుకుంటున్నారా?" అంటూ అరిగిపోయిన ప్రశ్నలతో ఇంటి ఓనరు కుశలాన్ని తెలుసుకుంటున్నాడు రాంబాబు.

ఇంతలో ఫెడీల్మని పిడుగుపాటు.

"ఒసే దున్నపోతు ముండా! జ్యూసు తాగి గంటయ్యిందే. ఈ గ్లాసెక్కడ పెట్టాలే దేబ్యం మొహమా!" రంగమ్మ అరుపు.

రాంబాబు ఎగ్గిరిపడ్డాడు. కుమారి సైలెంట్‌గా వచ్చి ఖాళీ గ్లాసు తీసుకెళ్ళింది. కొద్దిసేపు నిశ్శబ్దం. రాంబాబు రంగమ్మని అంత దగ్గర్నుండి ఎప్పుడూ చూళ్ళేదు. అతనికి ఇబ్బందిగా ఉంది. రంగమ్మ రాంబాబుని పరీక్షగా చూసింది. కొంతసేపటికి తన కష్టాలు రాంబాబుతో చెప్పకోవడం మొదలెట్టింది.

"అందరికీ నా గొంతు వినిపిస్తుంటుంది. కానీ నేనీ దొంగముండతో ఎంత కష్టాలు పడుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ఒక్కపనీ సక్రమంగా చేసి చావదు. నాతో ఊరికే అరిపిస్తుంటుంది. నువ్వు చెప్పు బాబు! ఈ ముండని అరవటం నాకేమన్నా సరదానా? పని తెలీని సోంబేరి మొహాన్ని తీసుకొచ్చి నా మొహాన కొట్టాడు." అంటూ మొగుణ్ణి కొరకొర చూసింది రంగమ్మ.

రాంబాబుకి ఆవిడ ధోరణికి భయమేసింది. ఏదో గొణిగి పరుగుపరుగున ఇంట్లోకొచ్చి పడ్డాడు.

ఇల్లు సౌకర్యంగా ఉంది. కానీ రంగమ్మ దెబ్బకి రాంబాబు డీలా పడిపొయ్యాడు. తనకేమాత్రం సంబంధం లేని విషయంలో భర్త అంతలా ఇబ్బంది పడిపోతుండటం ఇందిరకి ఆశ్చర్యంగా అనిపించేది, జాలిగా కూడా అనిపించేది. అందుకే అతన్ని ఓదార్చడానికి అప్పుడప్పుడూ ఏవో నాలుగు మంచి మాటలు చెప్పేది.

"ఆ అమ్మాయీ ఏంతక్కువైందేమీ కాదు. ముంగిలా ఉండి సాధిస్తుంటుంది." అని ఒకసారీ -

"రంగమ్మగారు ఊరికే అలా అరుస్తుంది గానీ - ఆవిడది చాలా మంచి హృదయం. మొన్న మన బాచీగాడు ఆడుకుంటుంటే పిలిచి మరీ అరిశలు పెట్టారు." అని ఇంకోసారీ చెబుతుంటుంది.

కానీ రాంబాబు ఇందిర మాటలు నమ్మలేదు. ఆ కబుర్లన్నీ తన ఇబ్బంది తగ్గించడానికి ఇందిర చేస్తున్న బేలన్సింగ్ యాక్ట్‌గా అర్ధం చేసుకున్నాడు. క్రమేపి రాంబాబు మధ్యాహ్నం పూట ఇంటికి రావడం తగ్గించాడు. బ్యాంకులో ఏదో పనుందని ఇందిరకి చెప్పడం మొదలెట్టాడు. ఈ విషయంలో రాంబాబుకీ, ఇందిరకీ గొడవలు కూడా మొదలయ్యాయి.

ఆ రోజు ఆదివారం. కింద ఇంటికి ఉదయం నుండీ వచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు. కొంతసేపటికి ఆటోలో కొందరు రైతు కూలీలు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఆదివారం కావున అప్పటికి ఫిల్టర్ కాఫీ మూడోసారి తాగి, హిందూ పేపర్ చదువుతూ, అంతర్జాతీయ రాజకీయల పట్ల రాంబాబు తీవ్రంగా కలత చెందుచూ మధనపడుచుండగా - ఇందిర హడావుడిగా వచ్చింది.

"రాంబాబు! కుమారి ఆ ఎదురు ఇస్త్రీ పెట్టె బండివాడితో లేచిపోయింది. రంగమ్మగారి బంగారు గొలుసు, ఇరవై వేల రూపాయలు క్యాష్ కూడా కనబడట్లేదుట! ఇన్నాళ్ళూ నంగిలా, ముంగిలా కనబడుతూ భలే నమ్మించింది. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్ధమయి చావట్లేదమ్మా!" అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబుకి ఇందిర చెప్పేది అర్ధం కావటానికి రెండు క్షణాలు పట్టింది. క్రమంగా మనసంతా ఆనందంతో నిండిపోయింది. తనకి బ్యాంక్ ఉద్యోగం వచ్చినప్పుడు కూడా రాంబాబుకి అంత ఆనందం కలగలేదు.

హడావుడిగా లుంగీ నుండి ప్యాంటు, షర్టులోకి మారిపోయి కింద పోర్షన్లోకి వెళ్ళాడు. అక్కడంతా కోలాహలంగా ఉంది. గుమ్మానికివతల దిగాలుగా, తప్పు  చేసినవాళ్ళలా ఒక నడివయసు జంట నేల మీద కూర్చునుంది. బహుశా కుమారి తలిదండ్రులయ్యుంటారు.

రంగమ్మ హాలు మధ్యలో పడక్కుర్చీలో పడుకుని శోకాలు పెడుతుంది. చుట్టూతా చేరిన ఆడంగులు ఆవిడని ఓదారుస్తున్నారు.

"కన్నకూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా. ఏనాడూ ఏదీ తక్కువ చెయ్యలేదమ్మా. రోజుకి నాలుగుసార్లు నాలుగు కంచాలు తినేదమ్మా. చివరకి నా కొంపకే ఎసరు పెట్టిందమ్మా. జెర్రిపోతులాంటి గొలుసమ్మా! నా పుట్టింటి బంగారమమ్మా!" అంటూ చప్పట్లు కొడుతూ నుదురు కొట్టుకుంటూ రంగమ్మ ఏడుస్తుంది.

"పిన్నిగారు! కొంచెం ఎంగిలి పడండి. పొద్దున్నుండి పచ్చిమంచినీళ్ళయినా ముట్టలేదు. అసలే మీరు బీపీ పేషంటు." అంటూ ఎదురింటి శాస్త్రి భార్య రంగమ్మని బ్రతిమాలుతుంది.

అక్కడి వాతావరణం ఎవరో మనిషి చచ్చినట్లుంది. ఇంటి ఓనర్ పెరట్లో మామిడి చెట్టు కింద కుర్చీలో కూర్చునున్నాడు. ఆయన పక్కన కుర్చీ ఖాళాగా ఉంది. రాంబాబు ఆ కుర్చీలో కూలబడ్డాడు.

ఆయన ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయున్నాడు. కొద్దిసేపటికి గొణుగుతున్నట్లుగా అన్నాడు.

"పొద్దస్తమానం కాల్చుకు తింటుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు?"

రాంబాబు ఆశ్చర్యపోయాడు. నమ్మలేనట్లు ఆయన వైపు చూశాడు.

ఆయన నెమ్మదిగా నవ్వాడు. "నాకు తెలుసు మీరు ఇబ్బంది పడుతున్నారని. కానీ నే చెయ్యగలిగింది ఏముంది చెప్పండి? నే కలగజేసుకుంటే ఇంకా రెచ్చిపోతుంది. ఈ దొంగతనం వల్ల డబ్బు పరంగా నాకే నష్టమూ లేదు. ఆ అమ్మాయికి పెళ్ళి బాధ్యత నాదేనని మా పాలేరుకి మాటిచ్చి పన్లో పెట్టుకున్నాను. ఇప్పుడా బాధ్యత తప్పింది. మళ్ళీ ఇంకో మనిషి కోసం వేట మొదలెట్టాలి. మీకు కొన్నాళ్ళు రిలీఫ్." అన్నాడు.

రాంబాబు అక్కడ ఇంకొద్దిసేపు కూర్చుని, ఆయనతో యాంత్రికంగా నాలుగు సానుభూతి వచనాలు పలికి, ఇంటి దారి  పట్టాడు. హాల్లో రంగమ్మ శోకాలు నాన్ స్టాప్‌గా పెడుతూనే ఉంది. ఇప్పుడు ఇందిర కూడా అవిడని ఓదార్చే పటాలంలో చేరింది.

నిదానంగా, హుందాగా మేడ మెట్లెక్కాడు రాంబాబు, ఇంట్లోకి అడుగు పెట్టాడు, తలుపు దగ్గరకేశాడు. ఒక క్షణం ఆగాడు.

"యాహూ! జజ్జనకర జనారే! జనకజనా జనారే! జజ్జనకర జజ్జనకర.. " పెద్దగా అరుస్తూ, ఆనందంతో వికటాట్ఠాసం చేస్తూ - కోయ నృత్యం చెయ్యసాగాడు రాంబాబు. కొద్దిసేపటికి ఆయాసం వచ్చింది. రొప్పుతూ ఫ్రిడ్జ్ లోంచి ఐస్ వాటర్ బాటిల్ ఎత్తి గటగటా తాగేశాడు.

సోఫాలో కూర్చున్నాడు. ఆనందం తన్నుకొస్తుంది. మళ్ళీ పాటందుకున్నాడు.

"భలే మంచి రోజు.. పసందైన రోజు.. వసంతాలు పూచే నేటి రోజు.. "

"ఏదో అనుకున్నాను. నువ్వు పాటలు బాగానే పాడతావే!" అంటూ నవ్వుతూ వచ్చింది ఇందిర.

"ఓ మై డియర్ ఇందూ డార్లింగ్! ఐ లవ్ యూ! సాయంకాలం సినిమా కెళుతున్నాం. బీ రెడీ!" హుషారుగా అన్నాడు రాంబాబు.

ఇందిరా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. ఆమెకి తెలుసు - రాంబాబు ఎందుకంత సంతోషంగా ఉన్నాడో!

(picture courtesy : Google)