Monday 11 February 2013

'యోగి వేమన' ఆలోచనలు - అభిప్రాయాలు


'యోగి వేమన' సినిమా CD  నాలుగుసార్లు చూశాను. చూసినప్పుడల్లా మండుటెండలో చల్లని మజ్జిగ తాగిన అనుభూతి. 'నేను మాత్రమే ఎంజాయ్ చేస్తున్న ఈ మధురానుభూతి గూర్చి ఎంతోకొంత రాసి నలుగురితో పంచుకుంటే బాగుండును కదా!' అనిపించి, 'యోగి వేమన' గూర్చి నా ఆలోచనల్ని రికార్ద్ చేస్తున్నాను. 

A.ప్రింట్ క్వాలిటీ బాగుంది. అరవైయ్యైదేళ్ళ క్రితం సినిమా ఈ క్వాలిటీలో ఉండటం ఆనందించదగిన విషయం. ఇందుకు ఎవరు కారకులో తెలీదు. CD లు మార్కెట్ చేసిన దివ్య విడియో వారు అభినందనీయులు. 

B.విజయా / వాహిని వారి అన్ని సినిమాలకి మల్లే ఈ సినిమాలో కూడా ఫొటోగ్రఫీ కాంతివంతంగా, బ్రైట్ గా ఉంది. (కొన్ని పాత సినిమాలు చీకట్లో చూస్తున్నట్లుంటాయి - 'జయభేరి' ఒక ఉదాహరణ.) ఇందుకు కారకుడైన ఛాయాగ్రహకుడు Marcus Bartley ని ఆభినందిద్దాం.

C.సినిమా టైటిల్స్ ఇంగ్లీషులో ఉన్నాయి. ఆ రోజుల్లో స్క్రిప్ట్ కూడా ఇంగ్లీషులోనే రాసుకునేవారని ఎక్కడో చదివాను. కె.వి.రెడ్డి ఎక్కువ ఇంగ్లీషులోనే సంభాషిస్తాడని కూడా చదివాను. CD కవరుపై నిర్మాత B.N.రెడ్డి అని ఉంది, టైటిల్ కార్డ్స్ లో produced and directed by K.V.Reddi అని వుంది.  

D.దర్శకుడు :- కె.వి.రెడ్డి

భోగలాలసుడైన వేమారెడ్డి, యోగి వేమనగా మారిన వైనం ఈ సినిమా సెంట్రల్ పాయింట్. కావున కథ పూర్తిగా వేమారెడ్డి వైపు నుండే నడుస్తుంది. వేమారెడ్డి విలాసపురుషుడు. అన్నగారు పెదవేమారెడ్డి (రామిరెడ్డి) రాచకార్యాలు చూస్తుంటాడు. వేమారెడ్డికి అన్న కూతురు జ్యోతి అంటే అంతులేని ప్రేమ. స్నేహితుడు అభిరాముడితో కలిసి బంగారం తయారుచేసే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. వేమారెడ్డి మోహనాంగి అనే వేశ్య మోజులో మునిగి తేలుతుంటాడు. మోహనాంగికి (కనకాభిషేకం చెయ్యడానికి) అన్నగారు వసూలు చేసిన శిస్తు సొమ్ము వాడేస్తాడు. ఫలితంగా పెదవేమారెడ్డి చెరసాల పాలవుతాడు. తనకెంతో ఇష్టమైన జ్యోతి జబ్బుచేసి 'చిన్నాన్న' అంటూ కలవరిస్తూ మరణిస్తుంది. విరక్తితో పిచ్చివాళ్ళా స్మశానాల వెంటా, గుళ్ళ వెంటా తిరుగుతాడు. శివయోగి (రాయప్రోలు) ఉపదేశంతో యోగిగా మారతాడు. చివరకి గుహప్రవేశం (సజీవ సమాధి?) చేస్తాడు. టూకీగా ఇదీ కథ.

సినిమా చూస్తుంటే ఒక నవల చదువుతున్నట్లుంటుంది. సన్నివేశాలు బిగువుగా, క్లుప్తంగా ఉంటాయి. సినిమా ప్రయాణం చాలా స్మూత్ గా, ఫోకస్డ్ గా ఉంటుంది, అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. నిడివి తగ్గిద్దామని ఎంత ప్రయత్నించినా, ఒక్క నిముషం కూడా ఎడిట్ చెయ్యలేం.

నాకు సినిమా గూర్చి సాంకేతిక పరిజ్ఞాం లేదు. అయితే ప్రతి సినిమా కథకి ఒక మూడ్ ఉంటుంది. సినిమా అసాంతం ఆ మూడ్ క్యారీ చెయ్యడం మంచి సినిమా లక్షణం అని నా అభిప్రాయం. ఆవారా, గాడ్ ఫాదర్ లాంటి క్లాసిక్స్ చూస్తున్నప్పుడు ఈ అభిప్రాయం బలపడింది. ఈ సినిమా కూడా ఆ కోవకి చెందిందే. 

వేమారెడ్డి మోహనాంగితో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటే మనక్కూడా హాయిగా ఉంటుంది. జ్యోతి మరణంతో ప్రేక్షకుడు కూడా వేమారెడ్డితో పాటు దుఃఖంలో కూరుకుపోతాడు. ఆపై హీరోతో పాటు మనకి కూడా జీవితం పట్ల అంతులేని విరక్తి, వైరాగ్యం కలుగుతాయి. ఈ విధంగా కె.వి.రెడ్డి మనల్ని తీసుకెళ్లి wholesale గా వేమనకి అప్పగించేస్తాడు.

ప్రేక్షకుణ్ని ఇలా గైడ్ చేస్తూ ప్రధానపాత్రతో మనని మనం ఐడెంటిఫై చేసుకునేట్లు చెయ్యడం గొప్ప దర్శకత్వ ప్రతిభకి తార్కాణం అని నా నమ్మకం. 'యోగి వేమన' గూర్చి ఆరున్నర దశాబ్దాల తరవాత కూడా నేను రాయడానికి ప్రధాన కారణం ఇదే.

సహకార దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత కమలాకర కామేశ్వరరావుకి కూడా అభినందనలు.

సందర్భం కనుక ప్రస్తావిస్తున్నాను, 'యోగి వేమన' సినిమా శ్రీశ్రీకి నచ్చలేదు (మాలి, మాసపత్రిక, మే 1947). 

"వేమన్న మూఢ విశ్వాసాలకి విరోధి. కానీ వేమన్న చిత్రాన్ని చూచిన తర్వాత మన ప్రజలలో మూఢవిశ్వసాలు మరింత పదిలమవుతాయి. వేమన జిజ్ఞాసి, సాధకుడు, మన అందరివంటి మానవుడు. అతనికి మానవాతీత శక్తులంటగట్టడం అనవసరం. గుడ్డిమనిషికి కళ్ళిచ్చాడని చూపించడం వల్ల వేమన్న ఆధిక్యం స్థాపించబడదు." (పేజీ నంబర్ 329, శ్రీశ్రీ వ్యాసాలు, విరసం ప్రచురణ, 1990.)

శ్రీశ్రీ వేమన తత్వం గూర్చి మంచి అవగాహన కలిగినవాడు. ఆయన కె.వి.రెడ్డి దగ్గర్నుండి ఊహించినంత గొప్పగా సినిమా లేకపోవడంవల్ల చికాకుతో ఈ రివ్యూ రాశాడనుకుంటున్నాను.

E.నటీనటులు.

1.చిత్తూరు నాగయ్య :- వేమారెడ్డి / యోగి వేమన.

ఇంతకుముందు ఈ సినిమా చూసినప్పుడు వేమారెడ్డిగా నాగయ్య నటన ఏవరేజిగా అనిపించింది. నాకెందుకో ఆయన మోహనాంగి ఇంటికి వెళ్ళేప్పుడల్లా ఏదో హోటల్లో కాఫీ తాగడానికి వెళ్తున్నట్లు అనిపించింది. వేశ్య దగ్గరకి వెళ్ళే వ్యక్తి విరహతాపంతో ఊగిపోవాలి, నాగయ్యలో నాకా ఫీలింగ్ కనబళ్ళేదు. 

వేమారెడ్డిగా నాగయ్య యాంత్రికంగా నటించాడనడానికి ఒక ఉదాహరణ.. కొలనులోంచి తడచిన దుస్తులతో బయటకొచ్చిన మోహనాంగి (M.V.రాజమ్మ) నుండి దృష్టి మరల్చుకోలేం. కానీ నాగయ్య ఆవిడని సరీగ్గా చూడడు! పట్టించుకోడు, పైగా చీర కట్టుకు రమ్మంటాడు, ఔరా! ఇదేమి రసికత్వం!!

మోహనాంగి దగ్గరకి హడావుడిగా బయల్దేరతాడు వేమారెడ్డి. 

అన్న కూతురు జ్యోతికి వళ్ళు బాగుండదు. 'నన్ను వదలి వెళ్ళకు చిన్నాయనా!' అంటుంది జ్యోతి. 

అంతే! చిన్నపిల్ల అడగంగాన్లే మోహనాంగిని మర్చిపోయి.. ఆనందంగా "అందాలు చిందేటి నా జ్యోతి.. " అంటూ మధురంగా పాడేస్తాడు. 

పాప పట్ల ఎంత ప్రేమున్నా, సౌందర్యవతి సాంగత్యం కోసం తపించిపొయ్యేవాడి ముఖంలో disappointment కనబడాలి. నాగయ్యలో నాకు లేశమాత్రమైనా ఆ భావం కనబడలేదు.

దాదాపు ఇవే సన్నివేశాలతో తీసిన ఎన్టీఆర్ 'పాండురంగ మహత్యం' గుర్తు తెచ్చుకోండి. బి.సరోజాదేవిపై మోహంతో ఎన్టీఆర్ తపించిపోతాడు. సినిమా మొదట్లో వేశ్యాసాంగత్యం కోసం ఎంతగా పరితపిస్తాడో.. తరవాత దైవభక్తిలో అంతగా చరితార్ధుడవుతాడు. మొదటి భాగంలో ఎంత నెగెటివ్ షేడ్స్ ఉంటే రెండో భాగం అంత బాగా పండుతుంది. ఇది సింపుల్ బ్యాలెన్సింగ్ యాక్ట్.

మళ్ళీ మనం 'యోగి వేమన' కి వచ్చేద్దాం. వేమారెడ్డి, మొహానాంగిల మీటింగ్స్ మరీ మెకానికల్ గా ఉండటానికి కారణం ఏమిటబ్బా! నాకు తోచిన కొన్ని కారణాలు.

a)బహుశా 1947 (స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం) లో స్త్రీ లోలత్వాన్ని నటించడానికి కొద్దిగా మొహమాటాలు / మోరల్ రీజన్స్ ఉండి ఉండొచ్చు.

b)ఈ సినిమా కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్యలది. వీళ్ళు మరీ సాత్వికులు, పెద్దమనుషులు. స్త్రీలోలుని చూపులు ఎలా ఉంటాయో నాగయ్యకి తెలీదు, చెప్పి చేయించుకోడానికి కె.వి.రెడ్డికీ తెలీదు. అందుకే నాగయ్యకి M.V.రాజమ్మని 'ఎలా చూస్తూ' నటించాలో తెలిసుండకపోవచ్చు!

c)ఇంకో కారణం. హీరో, దర్శకుడు.. ఇద్దరికీ పూర్తి ఫోకస్ వేమన మీదే. వేమన పార్ట్ కోసం వేమారెడ్డిని హడావుడిగా చుట్టేసినట్లు అనిపించింది.

ఈ సినిమాలోని ఇంత గొప్పలోపాన్ని కనుగొన్న నేను మిక్కిలి సంతసించాను. ఒక గొప్ప సినిమాలో అతి పెద్ద లోపాన్ని కనిపెట్టాను. శెభాష్! ఆలస్యమేలా? పోస్ట్ రాసేద్దాం. ఇంతలోనే ఒక అనుమానం. ఆపాటి ఆలోచన కె.వి.రెడ్డికి తట్టలేదా? నా అవగాహనలో ఎక్కడో ఏదో తేడా ఉంది! ఏమిటది? కావున, సినిమా మొత్తం మళ్ళీ చూశాను. పిమ్మట జ్ఞానోదయం కలిగింది.

'పాండురంగ మహత్యం' పుండరీకుడు వెధవన్నర వెధవ, అర్ధరాత్రి తలిదండ్రుల్ని వెళ్ళగొట్టిన కామాంధుడు. వాడికి కాళ్ళు పోయినప్పుడు మాత్రమే బుద్ధొస్తుంది. చేసిన పాపాలకి పశ్చాత్తాపంతో దహించుకుపోతాడు. కాళ్ళొచ్చిన తరవాత భక్తుడిగా కంటిన్యూ అయిపోతాడు. పుండరీకునికీ, వేమనకీ అస్సలు సామ్యం లేదు.

వేమారెడ్డి సౌమ్యుడు, అభ్యుదయవాది. దేవుడి వస్త్రం తీసుకెళ్ళి చలికి వణుకుతున్న పేదవృద్ధురాలికి కప్పిన మానవతావాది. మోహనాంగిని కూడా నిజాయితిగానే ప్రేమిస్తాడు. అతనికి రాళ్ళనీ, రప్పల్నీ కొలవడం ఇష్టముండదు. అతనిలో జ్యోతి మరణం అంతులేని ఆవేదనని కలుగజేస్తుంది. చావుపుటకల మర్మం గూర్చి నిర్వేదంలోకి వెళ్ళిపోతాడు. తను పాపాలు చేశాననే భావం అతనికుండదు. అసలు పాపపుణ్యాల అస్థిత్వాన్నే ప్రశ్నించే యోగస్థాయికి చేరుకుంటాడు.

మరి - మొన్న ఈ సినిమాలో గొప్పలోపం కనిపెట్టాననుకుని గర్వించానే! కారణమేమి? అనాదిగా తెలుగు సినిమాల్లో పాత్రలు black and white లో, stereotyped గా ఉంటున్నాయి. మనం వాటికే బాగా అలవాటయి ఉన్నాం. నేనూ ఆ trap లో పడ్డాను.

వేమారెడ్డి వేశ్యాలోలుడు. కాబట్టి చెడ్డవాడు. స్త్రీలోలులకి ఇంకే ప్రయారిటీస్ ఉండరాదు. నాకున్న ఈ చెత్త ఆలోచన మూలంగా.. వేమారెడ్డికి అన్నవదినల పట్ల గౌరవం, పసిదాని పట్ల అంతులేని ప్రేమ కలిగి ఉండటాన్ని అర్ధం చేసుకోలేకపొయ్యాను. వేమారెడ్డిలోని different shades ని దర్శకుడు చూపిస్తూనే ఉన్నాడు. నాకే సరీగ్గా అర్ధం అయ్యి చావలేదు.

నేను వేమారెడ్డి పాత్రని అర్ధం చేసుకోడంలో పప్పులో కాలేశాను. కావున పై విషయాలు రాయకూడదనుకున్నాను. కానీ - ఈ పోస్ట్ యోగి వేమన సినిమా గూర్చి నా ఆలోచనలు. కావున uncensored గా in toto రాద్దామని నిర్ణయించుకుని, రాస్తున్నాను.

చిన్నారి జ్యోతి చనిపోయిన తరవాత నాగయ్య నటన గూర్చి వర్ణించడానికి నాదగ్గర భాష లేదు. అంధ బిక్షకురాలి (అంజనీబాయి - సినిమాల్లో నటీమణులకి మేకప్ ఆర్టిస్ట్) బొచ్చెలోంచి అన్నం తింటూ నాగయ్య గొప్ప నటన ప్రదర్శించాడు. వేమన పద్యాలు ఆలపించేప్పుడు నాగయ్య అభినయం అద్భుతం. ఇక చివరి సీన్ తరవాత మహానటుడు నాగయ్య నటనా ప్రతిభకి చేతులెత్తి నమస్కరించడం మినహా చెయ్యగలిగిందేమీ లేదు. నేనదే చేశాను!

2.లింగమూర్తి :- అభిరామ్.

ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా అందరూ నాగయ్య గూర్చే చెబుతుంటారు. వంకాయకూర బాగుంటే నాణ్యమైన వంకాయల్నీ, వంటమనిషిని మెచ్చుకుంటాంగానీ - ఉప్పూ, కారాల్ని మెచ్చుకోం. కానీ అవి లేకుండా కూరే లేదు. కానీ వాటికి అంత గుర్తింపు ఉండదు. అందుకే - చిత్తూరు నాగయ్య అనే మర్రిచెట్టు ఇతర పాత్రధారుల ప్రతిభని కప్పెట్టేసిందని సినిమా రెండోసారి చూస్తేగానీ తెలీదు.

అభిరాముడిగా ముదిగొండ లింగమూర్తి నటన సూపర్బ్. చాలా సహజంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో నాగయ్యకి పోటీగా తట్టుకుని నిలబడ్డాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. నాకు మహామంత్రి తిమ్మరసు, పాండవ వనవాసం సినిమాల్లోని 'దుష్ట' లింగమూర్తి తెలుసు. 'సాత్విక' లింగమూర్తి తెలీదు.

'పెళ్లిచేసిచూడు' లో దొరస్వామి కూడా నాకిట్లాంటి షాకే ఇచ్చాడు. ఈ పాత సినిమాలు చూస్తుంటే క్రమంగా నాకొక విషయం అర్ధమవుతుంది. పాతతరం నటులైన లింగమూర్తి, దొరస్వామి వంటి గొప్ప ప్రతిభావంతులని మనకి తెలీదు. అందుకే సూపర్ హిట్టయిన సినిమాలు ఒకటో, రెండో చూసి ఏదో సాదాసీదా సపోర్టింగ్ ఆర్టిస్టుల్లే అనుకుంటాం.. కానీ కాదు.

3.M.V.రాజమ్మ :- మోహనాంగి.

రాజమ్మ గూర్చి ఎంత రాసినా తక్కువే! అందం, అభినయం, గానం, నాట్యం.. అన్నీ అద్భుతమే! ఐ యామ్ ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటీ! అయితే అప్పటికి నేనింకా పుట్టలేదు. అందువల్ల బి.ఆర్.పంతులు ఆ చాన్స్ కొట్టేశాడు. రాజమ్మ తన ఆటపాటలతో దుమ్ము దులిపేసింది.

రాజమ్మ గుళ్ళో ఆడిన పాటలో వెనక నల్లగా, పీలగా, నెత్తి మీద (తల కన్నా పెద్దదైన) పాగ పెట్టుకుని తాళం వేస్తూ ఒకాయన ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన మన ఘంటసాల మాస్టారు! ఘంటసాల పక్కన బక్కగా, పొట్టిగా ఉన్న అమ్మాయి సీత (దేవదాసులో పార్వతి స్నేహితురాలు మనోరమ). సినిమాలో మోహనాంగి చెల్లెలు 'కనకం' పాత్ర వేసింది.

4.కాంతామణి :- మోహనాంగి తల్లి.

ఈ సినిమాలో నన్ను ఆశ్చర్యపరచేంత సహజంగా నటించిన నటి. వేశ్యమాతగా నటించిన కాంతామణి సూర్యాకాంతం, చాయాదేవిలతో పోల్చదగినంతటి ప్రతిభావంతురాలు. ఆవిడ ఆంగికం, వాచకం గ్రేట్! ('దొంగరాముడు' లో 'నే చచ్చిపోతారా భద్రుడూ!' అంటూ రేలంగి తల్లిగా కూడా నటించింది.)

5.నరసమాంబ (వేమన వదిన) :- పార్వతీబాయి.

వేమారెడ్డి వదిన నరసమాంబగా పార్వతి బాయి చక్కగా ఉంది. వేమారెడ్డికి బాధ్యతల్ని గుర్తు చేస్తూ - ఒక పక్క అతనిపై ప్రేమ, అభిమానం.. ఇంకోవైపు చెడిపోతున్నాడన్న బాధ.. ఎంతో ఉదాత్తంగా, డిగ్నిఫైడ్ గా నటించింది.

6.జ్యోతి :- బేబీ కృష్ణవేణి.

ముద్దుగా చక్కగా చేసింది. ఈ పాపకి ఇప్పుడు డెబ్భైయ్యైదేళ్ళు దాటి ఉంటాయి. ఇప్పుడెవరైనా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు. 

F.నేపధ్య గానం :-

1.నాగయ్య :-

నాగయ్య గానం గూర్చి రాసేంత శక్తిమంతుణ్ని కాదు.. శిరసు వంచి పాదాభివందనం చేయడం తప్ప! అయితే చిన్న పాయింట్.. అందరూ 'అందాలు చిందేటి నా జ్యోతి.. ' పాటని మెచ్చుకుంటారు. నాకు మాత్రం శ్మశానంలో వచ్చే నేపధ్యగానం 'ఇదేనా.. ఇంతేనా.. ' పాట చాలా ఇష్టం. ఇంత మంద్రస్థాయిలో పాడటం నాగయ్యకే చెల్లింది. (ఈ పాట నన్నెంతగా ఏడిపించిందో ఇంతకు ముందు రాశాను.)

2.బెజవాడ రాజారత్నం :-

నాకు ఈ సినిమా చూసేదాకా బెజవాడ రాజారత్నం గూర్చి తెలీనందుకు సిగ్గుపడుతున్నాను. చాలా క్లీన్ వాయిస్. అద్భుత గానం. 'మాయలు పడకే మనసా.. ' అంటూ spontaneous గా, అలవోకగా పాడేసింది. నేను ఈవిడ గూర్చి తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది.

G.సంగీతం :- చిత్తూరు నాగయ్య

వేమన పద్యాలకి 'సంగీత దర్శకుడు' నాగయ్య చాలా భావయుక్తంగా ట్యూన్లు చేశాడు. 'గాయకుడు' నాగయ్యతో అద్భుతంగా పాడించాడు. ముఖ్యంగా 'గంగిగోవు పాలు చాలు.. ' సూపర్బ్.

సినిమా మూడ్ క్యారీ చెయ్యడానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర వహించిందని నా అభిప్రాయం.. ముఖ్యంగా చివరి సీన్లో.

H. మాటలు, పాటలు :- సముద్రాల రాఘవాచార్య

మాటలు మనం మన ఇంట్లో మాట్లాడుకున్నట్లుగానే ఉన్నాయి. ఏ పాత్రా ఒక్క వాక్యం కూడా 'అతి'గా మాట్లాడలేదు.నాకు మాటలు ఇలా పొదుపుగా ఉంటేనే ఇష్టం. ఇక పాటల సాహిత్యం గూర్చి ఇవ్వాళ నే కొత్తగా చెప్పేదేముంటుంది?!

I.మేకప్ :- హరిబాబు.

యోగసిద్ధి సాధించిన వేమనని కె.వి.రెడ్డి వేమన పద్యాలతో క్రమేపి వృద్ధుడిగా మార్చేస్తాడు. అసలీ ఐడియా వచ్చినందుకే కె.వి.రెడ్డిని మనం అభినందించాలి. ఇంకో దర్శకుడైతే కథని ముందుకు నెట్టడానికి ఏం చెయ్యాలో తోచక గిలగిల్లాడి చచ్చేవాడు. కె.వి.రెడ్డి మాత్రం ఈ ఫీట్  హరిబాబు మేకప్ (మార్కస్ బార్ట్లే ఫొటోగ్రఫీ కూడా) సాయంతో అవలీలగా చెయ్యగలిగాడు. ఈ మేకప్ హరిబాబు 1947 లోనే వండర్స్ చేశాడు.. అసాధ్యుడులాగున్నాడు.

ఇంతటితో యోగి వేమన సినిమా 'కంటెంట్' గూర్చి నా ఆలోచనలు రాయడం అయిపోయింది.

J.సినిమాతో సంబంధం లేని ఆలోచన.

ఈ సినిమా ఎప్పుడు చూసినా రెండ్రోజుల దాకా వైరాగ్యం నన్ను వదలదు.జీవితంపై విరక్తి కలుగుతుంది. 'రోగి ఎవ్వడు? డాక్టరెవ్వడు? భార్య ఎవరు? జీవితమంతయూ మిధ్యయే కాదా? మరప్పుడు ఈ వెధవ జీవితానికి అర్ధమేమిటో విశ్వదాభిరామ వినురవేమ!' అనే మూడ్ లో ఉండిపోతాను. (గుంటూరులో గుహలు లేవు కాబట్టి బ్రతికిపొయ్యాను. లేకపోతే నేనూ ముమ్మిడివరం బాలయోగిలా అయిపొయ్యేవాణ్ణేమో!)

అరవయ్యైదేళ్ళ తరవాత సినిమా చూసిన నాకే ఇంత వైరాగ్యం కలుగుతుందంటే, నటించిన నాగయ్యకి ఇంకెలా ఉండాలి? అందుకే నాగయ్య నిజజీవితంలో కూడా బైరాగి అయిపొయ్యాడు. కష్టాలు పడ్డాడు. నాగయ్య ఇలా అయిపోవడం occupational hazard క్రిందకి వస్తుందా?!

చివరి మాట :-

'యోగి వేమన' గూర్చి నా ఆలోచనలు మొత్తంగా మూట కట్టి దాచుకోవాలనే కోరికే నన్నీ పోస్ట్ రాయించింది. చదువుకోడానికి కొద్దిగా నిడివి ఎక్కువైందని తెలుసు. క్షమించగలరు.

(posted in fb on 3/9/2017)