Monday, 25 February 2013

'చంద్ర' జ్ఞాపకాలు - ఆలోచనలు"నాన్నతో చివరిసారిగా మాట్లాడాలనుకుంటే అర్జంటుగా హైదరాబాద్ బయలుదేరి వచ్చెయ్యి." రాత్రి ఎనిమిదింటికి శశాంక్ (చంద్ర కొడుకు) ఫోన్ వినంగాన్లే కాళ్ళూ, చేతులు వణికిపొయ్యాయి. విపరీతమైన ఆందోళనకి గురయ్యాను.

ఆ రోజు నా భార్య జనరల్ హాస్పిటల్లో డ్యూటీ ఫిజీషియన్‌గా నైట్ డ్యూటీలో ఉంది. ఇంట్లో పిల్లల్ని వదిలేసి అప్పటికప్పుడు బయల్దేరే అవకాశం లేదు. ఉదయం తొమ్మిదింటికి బయల్దేరి హైదరాబాద్ వెళ్దామని డ్రైవర్‌కి ఫోన్ చేసి చెప్పాను.

ఇంతలోనే మిత్రుల నుండి వరస ఫొన్లు. భారతి.. సాహితి.. 'చంద్ర కండిషన్ సడన్‌గా బ్యాడ్ అయిపోయిందట. నిజమేనా?' అంటూ. కొద్దిసేపట్లోనే గోపరాజు రవి ఫోన్.. 'రమణా! చంద్రా ఈజ్ నో మోర్.'

మెదడు మొద్దుబారిపోయింది. అచేతన స్థితిలో అలాగే ఉండిపోయాను. కంట్లో కన్నీళ్లు. పిల్లలు నన్నే చూస్తున్నారు. బెడ్రూంలోకి వెళ్లి దిండులో తల దూర్చేశాను. నా భార్య ఓదారుస్తున్నట్లుగా వీపు మీద చెయ్యి వేసింది. 

మానవుడికి పుట్టుక ఒక యాక్సిడెంట్. జీవనగమనంలో అనేకమందిని కలుస్తుంటాం. ఆ కలయికలన్నీ కూడా యాక్సిడెంట్లే! కొందరి స్నేహం హాయిగా ఉంటుంది. వారిలోని ప్రతిభ, కమిట్మెంట్, శక్తిసామర్ధ్యాల్ని చూస్తూంటే ఆశ్చర్యంగా ఉంటుంది, ముచ్చటేస్తుంది. అటువంటి అరుదైన వారిలో నా మిత్రుడు భువనగిరి చంద్రశేఖర్ ఒకడు. నాకు 'చంద్ర'.
చంద్ర మనతో ఉంటే హుషారుగా ఉంటుంది. ఉత్తేజం కలుగుతుంది. చంద్ర ఓ హైవోల్టేజ్ ఎలెక్ట్రిక్ వైర్. చాలా డైనమిక్ గా ఉంటాడు. అతని రూపం, మాట తీరు విలక్షణమైనది. మన కామిక్స్‌లో సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉన్నారు. ఆ పరిభాషలో చంద్రని మేగ్నెట్ మ్యాన్ అనొచ్చు.

చంద్ర నాకు ఎనభైలలో గోపరాజు రవి ఇంట్లో పరిచయం. మా పరిచయం సిగరెట్లు, కాఫీలతో  దినదినాభివృద్ధి చెందింది. చంద్రాకి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. వాటిని చాలా స్పష్టంగా, సూటిగా చెప్తాడు. ఒక్కోసారి తీవ్రంగా వాదిస్తాడు. అయితే - ఈ లక్షణం కొందరికి ఇబ్బందిగా ఉండేది.

చంద్రా అప్పుడు లా స్టూడెంట్. అరండల్ పేట మేడపై ఒక చిన్న రూంలో ఉండేవాడు. అటు తరవాత అదే లైన్లో ఎదురుగా ఒక మూడు గదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అందరి ప్లీడర్లకి లాగే ఇంటి ముందు గదిలో ఆఫీస్ ఉండేది. ఒక పాత టేబుల్, కుర్చీ, కొన్ని లా పుస్తకాలు - అదీ చంద్ర ఆఫీస్. ఆ ఆఫిసులోనే బాలగోపాల్, చంద్ర మాట్లాడుకుంటుంటే వింటూ వుండేవాణ్ని.  అవి నేను పీజి పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న రోజులు. ఒక ఆస్పత్రిలో పన్జేస్తున్న నర్స్ మూడోనెల ప్రెగ్నెసీతో ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకుంది. కేసులో డాక్టర్ ప్రధాన నిందితుడు. ఆ నర్స్ కుటుంబానికి చంద్ర ఎడ్వొకేట్. కేస్ ట్రయల్ కొచ్చింది.

ఒకరోజు తాలూకా ఆఫీస్ ఎదురు టీ స్టాల్లో నేను, మా శరత్ (ఆ తర్వాత కాలంలో సైకియాట్రిస్ట్.. ఇప్పుడు లేడు) టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. నాకు కొద్దిగా పరిచయం ఉన్న ఒక డాక్టర్ మాతో మాటలు కలిపి నెమ్మదిగా విషయం చెప్పాడు. ఆయన చంద్రకి లంచం ఇవ్వడానికి మమ్మల్ని వాడుకోదల్చుకున్నాడు. నాకు తరవాత తెలిసింది.. ఆ కేసులో చంద్రాని ప్రలోభ పెట్టడానికి అనేక ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయని.

మనం ఎన్ని పుస్తకాలన్నా రాయొచ్చు. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. కానీ.. డబ్బు అవసరం ఉండి (డబ్బు వచ్చే అవకాశం ఉండి కూడా) డబ్బుని లెక్కజెయ్యనివాడు నిజాయితీపరుడని నా అభిప్రాయం. ఆ సంఘటనతో చంద్ర నిజాయితీ నాకు అర్ధమైంది. కబుర్లు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు. ఆవేశంతో ఊగిపోతూ నీతులు వల్లె వేసి.. ఆ నీతుల్నే పెట్టుబడిగా సొమ్ము సంపాదించుకున్న మేధావులు నాకు తెలుసు.చంద్రలో కొందరికి యారోగెన్స్ కనిపిస్తుంది. ఇంకొందరికి ధిక్కార ధోరణి కనిపిస్తుంది. నాకైతే ఆ లేత మొహంలో పిల్లతనపు చాయలు కనిపించేవి! ఫలానా పోలీసు ఆఫీసర్ ఫలానాప్పుడు భయపడి చచ్చాడని నవ్వుతూ చెప్పేవాడు. 'పోలీసోడితో జాగ్రత్త! యెప్పుడో యే రౌడీ షీటర్‌తోనో వేయించేస్తాడు.' అనేవాణ్ని. 
చంద్రా చుండూరు కేసుతో వృత్తి రీత్యా ప్రసిద్ధుడయ్యాడు. చుండూరు కేసులో చంద్రా శ్రమ తీవ్రమైనది. అతనికి ఈ కేసు ద్వారా వచ్చిన పేరుప్రతిష్టలు.. అతని శ్రమ, తపనతో పోలిస్తే తక్కువేనని అని నా అభిప్రాయం.
చంద్రా బాలగోపాల్ అభిమాని. బాలగోపాల్ పట్ల చాలా ఇష్టంగా, గొప్పగా మాట్లాడేవాడు. బాలగోపాల్ మరణం చంద్రాని ఎంతో కృంగదీసింది. బాలగోపాల్ మరణించినప్పుడు చంద్రా పసిపిల్లాళ్ళా తెల్లవార్లూ యేడ్చాడు (ఈ సంగతి నాకు చంద్రిక చెప్పింది). అంతకు చాలాకాలం ముందే బాలగోపాల్‌తో విబేధించి 'మానవ హక్కుల వేదిక' నుండి బయటకొచ్చేశాడు. కానీ - బాలగోపాల్ పట్ల ప్రేమా, గౌరవం అలానే వుంచేసుకున్నాడు!చంద్రా హీరో కన్నాభిరాన్! ఆయన గూర్చి చెబుతుంటే.. నాకా కళ్ళల్లో 'గ్లో' కనిపించేది. చంద్రాకి కన్నాభిరాన్ అంటే భక్తి, భయం, ఆరాధన. వినేవాడికి ఓపికుండాలే గాని.. కన్నాభిరాన్ గూర్చి యెంత సేపైనా చెబుతూనే ఉంటాడు. కన్నాభిరాన్ ప్రస్తావన లేకుండా చంద్ర గూర్చి ఎంత రాసినా అది అసంపూర్ణమే అని నా అభిప్రాయం. 

ఓ సందర్భంలో త్రిపురనేని మధుసూధనరావు ఉపన్యాసం గూర్చి చాలా నోస్టాల్జిక్‌గా గుర్తు చేసుకున్నాడు. 'విరసం'తో విబేధం, త్రిపురనేని అంటే ఎనలేని గౌరవం! దటీజ్ చంద్రా! 

ఆ మధ్య ఉరిశిక్షపై సాక్షి టీవీ వారి చర్చా కార్యక్రమంలో చంద్రాని చూసి ఫోన్ చేశాను.

"చంద్రా! నిన్నిప్పుడే టీవీలో చూశాను. సబ్జక్ట్ గూర్చి చెప్పేదేమీ లేదు. జుట్టు పెంచుకోడంలో బాలగోపాల్‌తో పోటీ పడకు. నువ్వు అర్జంటుగా సెలూన్‌కి వెళ్ళాలి."

ఒక క్షణం చంద్రాకి నేచెప్పింది అర్ధం కాలేదు. తరవాత పెద్దగా నవ్వాడు.

చంద్రాతో నా స్నేహం పునశ్చరణ చేసుకుంటే నాకొక విషయం అర్ధమవుతుంది. మొదటి నుండి మా స్నేహం మా వృత్తులకి అతీతంగానే కొనసాగింది. నేనతన్నొక ప్లీడరుగా చూళ్ళేదు, నాకతను 'చంద్ర' - అంతే! నేనో సైకియాట్రీ స్పెషలిస్టుగా చంద్రా కూడా గుర్తించలేదు.. నన్ను 'రమణ'గానే భావించాడు. ఒకసారి ఏదో సందర్భంలో 'నీ వృత్తి ఒక గ్లోరిఫైడ్ భూతవైద్యం.' అన్నాడు. 'భూతవైద్యుడితో జాగర్త!' అంటూ నవ్వేశాను. 

చంద్రా శవమై గుంటూరు తిరిగొచ్చాడు. 'చంద్రాకి సెకండరీస్ అన్న విషయం అక్టోబర్ ఎనిమిదినే తెలుసు.' అని చంద్రా గురువు ప్రొఫెసర్ A.సుబ్రహ్మణ్యంగారు చెప్పారు, ఆశ్చర్యపోయాను!

అంటే ఆ రోజు తరవాత.. చంద్రా ఆరోగ్య పరిస్థితి గూర్చి తెలీకుండానే.. ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడాను. బహుశా అక్టోబర్ చివర్లో అనుకుంటాను. 'రాణి శివశంకరశర్మ గారు వచ్చారు, కొద్దిసేపు రాకూడదు?' అడిగాడు. బ్యాడ్ లక్, వెళ్ళడానికి కుదర్లేదు.డిసెంబర్లో ఒక అజ్ఞాత ఫోన్ కాల్. ఎవడో ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. "నాకు పిచ్చా? నాకు నిద్రమాత్రలిచ్చి చంపేస్తావా? నీ సంగతి తేలుస్తాను. దమ్ముంటే ఆస్పత్రిలోంచి బయటకి రా! ఇవ్వాళ నువ్వు నా చేతిలో.... " ఇంకా యేదో వాగుతుంటే ఫోన్ కట్ చేశాను.

ఎవడో పేషంట్ అయ్యుంటుంది! నర్సుని పిలిచి రోడ్డు మీద ఎవడన్నా ఉన్నాడేమో చూడమని చెప్పబోతుండగా.. మళ్ళీ ఫోన్.

"ఏంటి రమణా! మరీ అంత భయపడ్డావ్? నా గొంతు కూడా గుర్తు పట్టలేకపొయ్యావే!" ఫోన్లో పెద్దగా నవ్వుతూ చంద్రా! అంత అనారోగ్యంలో ప్రాంక్ కాల్!

జనవరి మూడున ఫోన్ చేసి 'దామూకి చెప్పాను, పదిహేనున గురజాడ సాహిత్యం పంపిస్తాను. నేను గురజాడ మీద రాయాల్సింది చాలా ఉంది.' అన్నాడు, పంపలేదు. పదిహేడున ఫోన్ చేశాను.

'యెవరు?" నీరసంగా చంద్రా.


'నువ్వు పంపిన గురజాడ సాహిత్యం అందింది, థాంక్స్!' వ్యంగ్యంగా అన్నాను.


ఇంతలో కొడుకు శశాంక్ ఫోన్ అందుకుని 'నాన్నకి నడుం నొప్పి, వంట్లో బాగా లేదు.' అన్నాడు.


తరవాత పెద్దగా రాయడానికి ఏమీ లేదు. నాలాంటి ఎందరో స్నేహితుల్ని దుఃఖసాగరంలో ముంచేసి చంద్ర వెళ్లిపోయాడు.

భారతి మాటలు నన్ను కదిలించాయి.

"నువ్వు అదృష్టవంతుడువి రమణా! చంద్రాని చివరి స్థితిలో నువ్వు చూళ్ళేదు. అతను సరదాగా కబుర్లు చెప్పడం మాత్రమే నీకు గుర్తుండిపోతుంది. ఐసీయూలో చంద్రాని చూసిన తరవాత.. డెడ్ బాడీలోనే చంద్ర ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. మనందరికీ నవ్వుతూ, హడావుడిగా, సరదాగా కనిపించిన చంద్రా వేరు.. హాస్పిటల్లో నొప్పితో నరకయాతన పడుతూ.. జీవం లేని కళ్ళతో.. మైగాడ్! నిమ్స్‌కి ఎందుకెళ్ళానా అనిపించింది."యాభై వసంతాలు కూడా చూడకుండానే వెళ్ళిపొయ్యాడు చంద్ర. పౌరహక్కుల ఉద్యమకర్తలు బాలగోపాల్, కన్నాభిరాన్, చంద్రశేఖర్.. స్వల్పవ్యవధిలోనే నిష్క్రమించారు. వీళ్ళమధ్య ఏదైనా సీక్రెట్ అవగాహన ఉందా!? వీరి నిష్క్రమణతో పౌరసమాజానికి తీవ్రనష్టం కలిగిందని నా నమ్మకం. 

ఏంటి చంద్రా! ఎందుకింత హడావుడిగా వెళ్లిపోయ్యావ్? అన్నిట్లోనూ హడావుడేనా? నాకు ఏ ఇబ్బంది కలిగినా ముందు నీకే ఫోన్ చేశాను. నీమాట నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేది. నువ్వులేని ఈ ప్రపంచం చాలా వెలితిగా, ఇరుగ్గా ఉంది మిత్రమా! ఐ మిస్ యూ మై బాయ్!

'మీ ఇంగ్లీష్ వైద్యం ఒక బోగస్. ఇది ఒక వ్యవస్థీకృతమైన దోపిడీ. దీని మూలాలు... కొలనైజేషన్.. గ్లోబలైజేషన్.. అనార్కిజమ్.. మార్క్సిజం.. పోస్ట్ మోడర్నిజం.. ఏంటి మోడర్నిటి.. ఫ్రాయిడ్.. ఫూకు.. బౌమన్.. నీషే.. రస్సెల్.. ' హఠాత్తుగా మెళకువొచ్చింది.

అయ్యో! ఇదంతా కలా! ఇక నాకు చంద్రా కనిపించడా! వినిపించడా! ఈ కల నిజమైతే ఎంత బాగుణ్ను!('Chandra' photos courtesy : బి.శశాంక్)