Thursday 3 July 2014

బాలగోపాల్ చెప్పిన 'జలపాఠాలు'


టి.యం.సి. / క్యూసెక్ అంటే ఏంటి?

నదీజలాల మీద ప్రజలకి హక్కులు ఉంటాయా?

జలవివాదాల పరిష్కారానికి చట్టం ఏం చెబుతుంది?

నికర జలాలు / మిగులు జలాల లెక్కలు ఎలా వేస్తారు?

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కె.ఎల్.రావు 'ఘనత' ఏమిటి?

బచావత్ అనే సుప్రీం కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు (బచావత్ అవార్డు) మనకే ఎందుకు అనుకూలం?

రాష్టాలు సెంట్రల్ ట్రైబ్యునల్ దగ్గర ఎలాంటి (ఏడుపు) వాదనలు చేస్తాయి?

ప్రిస్క్రిప్టివ్ రైట్ అంటే ఏమిటి?

'తెలుగు గంగ'తో మొదలైన మన అక్రమ ప్రాజెక్టుల పరంపర ఎలా కొనసాగింది?

పోతులపాడు గ్రామం పోతిరెడ్డిపాడుగా ఎలా మారింది?

బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ దగ్గర రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వినిపించిన (అసంబద్ధ) వాదన ఏమిటి?

జలయజ్ఞం రైతుల కోసమా? కడప కాంట్రాక్టర్ల కోసమా?

పులిచింతలకి నికర జలాల కేటాయింపు ఎందుకు? అందువల్ల నల్గొండకి జరుగుతున్న నష్టం ఏమిటి?

పోలవరం ప్రాజెక్టు ఆలోచన సరైనదేనా?

కృష్ణాజల 'పునఃపంపిణీ' జరక్కుండా రాయలసీమ కరువు సమస్య తీరుతుందా?


మొన్నామధ్య విజయవాడ బుక్ ఎక్జిబిషన్లో బాలగోపాల్ పుస్తకం 'జలపాఠాలు' కొన్నాను. ఆ తరవాత చదువుదామని తెరిస్తే - పుస్తకంలో చాలా మ్యాపులు, టేబుల్స్, అంకెలు! భయపడిపోయాను. చిన్నప్పటి సోషల్ సబ్జక్టు గుర్తొచ్చింది. నేనేమీ నీటి పారుదల శాఖలో ఇంజనీర్ని కాను, కనీసం రైతుని కూడా కాను. నాకీ విషయాలు తెలీకపోయినా కొంపలేవీ మునిగిపోవు. కావున - పుస్తకాన్ని భద్రంగా బీరువాలో (చదవాల్సిన పుస్తకాల మధ్యన) పెట్టేశాను.

నాల్రోజుల క్రితం నా భార్యతో నాగార్జున సాగర్ గూర్చి మాట్లాడుతున్నప్పుడు తడబడ్డాను, కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ సాగునీరు టాపిక్ నాకెంత సంబంధం లేని విషయమైనా, నా పాండిత్యం అజ్ఞానం కన్నా అధమస్థాయిలో వున్నట్లుగా తోచి.. కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

అప్పుడు నాకు బాలగోపాల్ 'జలపాఠాలు' పుస్తకం గుర్తొచ్చింది. పుస్తకం అట్టమీద బొమ్మ - బాలగోపాల్ ఏదో వయోజన విద్యాకేంద్రంలో పాఠం చెబుతున్నట్లుగా వుంది. కావున - వయోజనుడనైన నేను కూడా విషయం అర్ధం చేసుకునేందుకు ఒక ప్రయత్నం చేద్దామనిపించింది. 'పుస్తకం ఎక్కడ విసుగు పుడితే అక్కడ మూసేసి, మళ్ళీ బీరువాలోకి నెట్టేస్తే సరి!' అని గట్టిగా నిర్ణయించుకుని 'జలపాఠాలు' పుస్తకం తెరిచి - చదవడం మొదలెట్టాను.

'క్లిష్టమైన విషయాన్ని సరళంగా రాసేవాడు ఉత్తముడు, క్లిష్టాన్ని సంక్లిష్టం చేసేవాడు మధ్యముడు, సరళాన్ని క్లిష్టం చేసేవాడు అధముడు' అని ఇంతకుముందోసారి రాశాను. ఆ లెక్కన చూస్తే బాలగోపాల్ అత్యుత్తముడు! ఎంతో బద్దకంగా పుస్తకం చదవడం మొదలెట్టిన నాచేత పుస్తకం మొత్తాన్ని ఏకబిగిన చదివించేశాడు.

ఈ పుస్తకం చదివిన తరవాత మనం (చదవక ముందు కన్నా) చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాం. నదులు, నీళ్ళు, ప్రాజెక్టులు, డ్యాములు, కాలువలు, ఆయకట్టు సాగులెక్కలు, రాష్ట్రాల మధ్య నీళ్ళ తగాదాలు.. ఇదంతా చాలా డ్రై సబ్జక్ట్. అయితే - ఈ సబ్జక్ట్ బాలగోపాల్ చేతిలో పడి చందమామ కథలా మారిపోయింది. పిల్లలక్కూడా అర్ధమయ్యేంత సులభమైన భాషలో రాసిన బాలగోపాల్ శైలి (దీన్ని కొడవటిగంటి కుటుంబరావు శైలి అనవచ్చునేమో) చాలా హాయిగా వుంది.

దాదాపు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్దకి వెళ్ళి అక్కడి స్థానిక ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ (బాలగోపాల్ పనిరాక్షసుడు).. ప్రభుత్వం చెప్పే లెక్కలతో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేసుకుని అవగాహన చేసుకుంటూ అధ్యయనం చేసి.. సాధికారంగా, సవివరంగా (వివిధ సందర్భాల్లో) రాసిన వ్యాసాల సంపుటి ఇది. 

బాలగోపాల్ 'లెక్కల పండితుడు'. సాధారణంగా లెక్కల మనుషులకి మనకన్నా బుర్ర ఎక్కువ అని నా అభిప్రాయం. అందుకే బాలగోపాల్ విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, విశ్లేషణా సామర్ధ్యం - సాహిత్యం గూర్చి రాసినా (రూపం - సారం), మానవ హక్కుల గూర్చి రాసినా.. నన్ను అబ్బుర పరుస్తుంది. ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ ఇరిగేషన్ ఇంజనీర్‌లాగా ఈ పుస్తకం! (బాలగోపాల్ గూర్చి తెలీనివాళ్ళు ఆయన్నొక ఇంజనీరుగా భావించే ప్రమాదముంది!)

తెలుగునాట ఈమధ్య మేధావులు ఎక్కువైపొయ్యారు. ఆంధ్రా మేధావులు, తెలంగాణా మేధావులు అంటూ ప్రాంతీయ మేధావులు కూడా ప్రాచుర్యంలోకి వచ్చారు. మేధావులకి ఈ స్థానికత ఏంటో మనబోటి సామాన్యులకి అర్ధం కాదు. ప్రాంతం, భాష వంటి సంకుచిత పరిమితి గీతలు లేని అసలు సిసలు మేధావి బాలగోపాల్. అందుకే ఆయన మన రాష్ట్రం వల్ల మహారాష్ట్ర, కర్ణాటకలకి జరిగిన నష్టాన్ని కూడా నిర్భయంగా, నిజాయితీగా రాయగలిగాడు.

బాలగోపాల్ అభిప్రాయాల్తో అందరూ ఏకీభవించాలని లేదు, అలా ఏకీభవించాలని బహుశా బాలగోపాల్ కూడా అనుకోకపోవచ్చు. కానీ - ఇది ప్రజల ముందు కఠోర వాస్తవాలు ఉంచి ఆలోచింపజేసే పుస్తకం. బ్రిటీషువాడి ఆనకట్టల నిర్మాణం దగ్గర్నుండి పోలవరం దాకా చాలా నిక్కచ్చిగా నిజాల్ని మనముందు వుంచిన 'విషయం వున్న' పుస్తకం. రాజకీయ నాయకులు ప్రజల్ని ఏవిధంగా మోసం చేస్తారో బట్టబయలు చేసే పుస్తకం.

చివరగా - 

మొదట్లో మ్యాపులు, టేబుల్స్ చూసి భయపడ్డాను. కానీ - అవీ పుస్తకానికి చాలా అవసరం, అవే లేకపోతే నాకీ పుస్తకం ఇంత సులభంగా అర్ధమయ్యేది కాదు. అందుకు కారకులైన వేమన వసంతలక్ష్మి, మన్నం బ్రహ్మయ్యలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.