Tuesday 8 July 2014

వెలుగునీడల శ్రీశ్రీ


'వెలుగు నీడలు' అని ఒక పాత తెలుగు సినిమా వుంది. ఆ సినిమాని - నేను హైస్కూల్లో వుండగా రీరిలీజులో చూశాను. అందులో 'కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు' అనే పాట నాకు చాలా నచ్చింది. ఘంటసాల గానం కూడా సందర్భానికి తగినట్లు హృద్యంగా వుంది (అలా పాట్టం ఘంటసాల బలహీనత). ఎవరో శ్రీశ్రీ అనే ఆయన ఈ పాట రాశాట్ట. పేరు గమ్మత్తుగా వున్నా పాట మాత్రం చక్కగా రాశాడనుకున్నాను.

సినిమా మాత్రం టన్నుల కొద్ది సెంటిమెంటుతో కడు భారంగా వుంటుంది. అందులో ఈ పాట సందర్భం ఇంకా బరువైనది. నాగేశ్వరరావు సావిత్రిని ప్రేమిస్తాడు. అతనికేదో రోగం వస్తుంది. అంతట నాగేశ్వరరావు తన ప్రేమని త్యాగం చేసి (ప్రేమ త్యాగాన్ని కోరుతుంది) సావిత్రికి జగ్గయ్యతో పెళ్లి జరిపిస్తాడు (ఇట్లాంటి stand by పెళ్ళికొడుకు వేషాలు జగ్గయ్య చక్కగా వేస్తాడు). జగ్గయ్య చాలా మంచివాడు కూడా! ఎందుకంటే - కథని ముందుకు నెట్టడానికి హఠాత్తుగా చచ్చిపోతుంటాడు.

తెలుగు సినిమా హీరోయిన్ కారణం లేకుండానే ఏడుస్తుంటుంది! అట్లాంటిది, భర్త పోయి - బాగా ఏడ్చేందుకు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది? అంచేత - కసిదీరా కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది (ఒక స్త్రీకి మొగుడు చచ్చినా, చావకపోయినా ఏడ్చే హక్కుంది. కాదండానికి నువ్వెవరివి?) అది చూసిన మహిళా ప్రేక్షకమణులు భోరున విలపించేవారు! మా చుట్టం ఒకావిడ 'చీపాడు! అదేం సినిమా? ఆ సినిమాలో అసలు ఏడుపే లేదు.' అనేది. అంటే - పిల్లలకి ఫైటింగ్ సీన్లు ఎంతిష్టమో, మహిళలకి ఏడుపు సీన్లు అంతిష్టం అని అర్ధమవుతుంది!

'ఇంతకీ భర్త చచ్చిపోతే అన్నిరోజులు పడీపడీ ఏడవటం దేనికి?' 

నా కూతురు అప్పుడప్పుడు పాత తెలుగు సినిమాలు కొంచెం సేపు చూస్తుంది, హఠాత్తుగా నన్నిట్లాంటి ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతుంటుంది. 

అప్పుడు నేను తల్లడిల్లిపోతాను - 

'అయ్యో! ఎంతమాటన్నావు తల్లీ? భగవంతుడా! నా కూతుర్ని క్షమించు. స్త్రీకి ఐదోతనమే (ఐదోక్లాసు కాదు) తరగని పెన్నిధి! భారతనారికి భర్తే దైవం (ఈ విషయాన్ని నా భార్యకి చెప్పమని దయగల పాఠకుల్ని అర్ధిస్తున్నాను)! ఆడదానికి భర్త లేని జీవితం సాంబారు లేని ఇడ్లీ వంటిది! ఇంకు లేని పెన్ను వంటిది! బొత్తాల్లేని చొక్కా వంటిది!' అనుకుంటూ గుమ్మడిలా మధన పడతాను, ఆపై - చిత్తూరు నాగయ్యలా నిట్టూరిస్తాను.

సరే! చనిపోయిన భర్త జ్ఞాపకాలతో రోదిస్తున్న సావిత్రిని ఓదార్చడానికి నాగేశ్వరరావు ఘంటసాల స్టోన్లో హెవీగా పాడతాడు. పాపం! నాగేశ్వరరావుకి సినిమాలు మారినా - భర్త చచ్చిన సావిత్రిని ఓదార్చడం మాత్రం తప్పదు (ఆ తరవాత వచ్చిన మూగమనసుల్లో కూడా నాగేశ్వరరావుకిదే డ్యూటీ)! ఎన్టీఆర్ పిండి రుబ్బాడు, రాజనాలతో కత్తియుద్ధాలు చేశాడు. కానీ - ఆయన ఆడవాళ్ళని ఓదార్చినట్లు నాకు జ్ఞాపకం లేదు. అసలీ రోగాలు, రొస్టులకి ఎన్టీఆర్ ఎప్పుడూ ఆమడ దూరం.

'కలకానిది, విలువైనది' పాట చాలా మీనింగ్‌ఫుల్లుగా వుంటుంది. దుఃఖంలో వున్న స్నేహితురాల్ని ఓదార్చడానికి హీరో వాడిన పదాలు, ఉపమానాలు, ఆలోచనలు చాలా అర్ధవంతంగా, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ చేసేంత స్థాయిలో చాలా ఎఫెక్టివ్‌గా వుంటాయి. పాట చూడనివాళ్ళ కోసం, చూసినా - మళ్ళీ చూద్దామనుకునేవాళ్ళ కోసం ఆ పాట యూట్యూబ్ లింక్  ఇస్తున్నాను.

నా చిన్నప్పుడు శ్రీశ్రీని 'మహాకవి' అని అంటుండగా వినేవాణ్ణి. సినిమా పాటలు అందరికన్నా బాగా రాస్తాడు కాబట్టి మహాకవి అంటున్నారేమోనని అనుకున్నాను. అలా అనుకోవడంలో నా తప్పేమీ లేదు.. అప్పటికి నాకు 'మహాప్రస్థానం' తెలీదు. అటు తరవాత శ్రీశ్రీని చదివాను. శ్రీశ్రీని 'మహాకవి' అని ఎందుకన్నారో అర్ధం చేసుకున్నాను.

శ్రీశ్రీ డబ్బునెప్పుడూ లెక్క చెయ్యలేదు. కానీ - ఆయనెప్పుడూ ద్రవ్యోల్పణంలో వుండేవాడు. ఎమర్జన్సీలో ఇందిరమ్మ పథకాల్ని కీర్తించాడు. ఎమర్జన్సీతో ఇందిరాగాంధీ దేశానికే కాదు, శ్రీశ్రీ వ్యక్తిత్వానిక్కూడా చీకటి రోజులు తెప్పించింది. అటుతరవాత శ్రీశ్రీ తన తప్పుకి భేషరతుగా క్షమాపణ చెప్పాడు. నాకిప్పుడనిపిస్తుంది - శ్రీశ్రీ అంతటివాడు క్షమాపణ చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ కలవాడు కాబట్టే క్షమించమన్నాడు. ఇది చాలా అభినందనీయం.

కొడవటిగంటి కుటుంబరావుకి దొరికిన 'చందమామ' నీడ గూర్చి శ్రీశ్రీ ఈర్ష్య పడ్డాడు. అయితే కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు, చక్రపాణిలది 'మీది తెనాలే! మాది తెనాలే!' బంధమని నా అనుమానం. అయినా - కుటుంబరావులా ఒకేచోట దశాబ్దాల తరబడి పనిచేసే మనస్తత్వం శ్రీశ్రీకి లేదనుకుంటున్నాను. శ్రీశ్రీతో చెడిన ఆరుద్ర శ్రీరంగం నారాయణబాబుని ప్రమోట్ చేద్దామని చూశాడు గానీ - వల్ల కాలేదు.

నాకో స్నేహితుడున్నాడు, అతనో బ్యాంక్ ఉద్యోగి. అతగాడికి జీవితం అంటే ఉద్యోగం, కుటుంబం మాత్రమే. పొద్దున్నే యోగాసనాలు వేస్తూ ఆయుష్షు పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. క్రమశిక్షణ లేని జీవితం బ్రేకుల్లేని కారు వంటిదని అతని నమ్మకం. అందువల్ల అతనికి శ్రీశ్రీ అంటే చిరాకు.

'శ్రీశ్రీ స్త్రీలోలుడు, అన్నపానముల కన్నా ధూమపానము, సురాపానమే మిన్న అని నమ్మినవాడు. తన అలవాట్లనే నియంత్రణ చేసుకోలేని కవి, ఇంక ప్రజలకి ఏం చెబుతాడు?' అనేది అతని లాజిక్. ఈ రకమైన లాజిక్‌తో - శ్రీశ్రీ 'దురలవాట్ల' మీద జరిగిన దాడి తెలుగు భాష కన్నా పురాతనమైనది!

నిజమే! శ్రీశ్రీ యోగాసనాలు వెయ్యడు, ఉద్యోగం చెయ్యడు, అది ఆయన ఇష్టం. నాకు తెలిసి శ్రీశ్రీ ఎక్కడా, ఎవరికీ వ్యక్తిగతమైన అలవాట్ల మీద సుద్దులు బోధించలేదు. శ్రీశ్రీ తన మందు తనే తాగాడు, తన సిగరెట్లు తనే (గుప్పిలి బిగించి మరీ) తాగాడు. తన ఆలోచనలతో తనే కవిత్వం రాసుకున్నాడు, అది చదివిన తెలుగు పాఠకులు వెర్రెక్కిపొయ్యారు.. ఊగిపొయ్యారు. అది శ్రీశ్రీ నేరం కాదు, అందుకు శ్రీశ్రీ బాధ్యుడు కూడా కాదు. ఇంకా నయం! శ్రీశ్రీ కూడా నా స్నేహితుళ్ళా ఆలోచించినట్లైతే 'మహాప్రస్థానం' రాయకుండా యోగాసనాలు వేసుకుంటూ మిగిలిపొయ్యేవాడు. నో డౌట్! అప్పుడు తెలుగు సాహిత్యం కుంటిదీ, గుడ్డిదీ అయిపొయ్యేది!

సినిమా రచనలకి సాహిత్య స్థాయి గానీ, గౌరవం గానీ ఉండనవసరం లేదని నా అభిప్రాయం. దర్శకుడు ఏదో సందర్భం చెబ్తాడు, సంగీత దర్శకుడు ఇంకేదో ట్యూను చెబ్తాడు. వారి అభిరుచికి తగ్గట్టుగా నాలుగు ముక్కలు కెలికితే అదే సినిమా పాట! కొందరు ప్రముఖ కవులు భుక్తి కోసం ఏవో కొన్ని సినిమా రచనలు చేశారు. ఎందుకంటే - వారికి కవిత్వం తిండి పెట్టలేదు, ఆ లోటు సినిమా పాట తీర్చింది.

ఈ మధ్య సమగ్ర సాహిత్యం అంటూ ఒక రచయిత రాసిన ('నాకు జలుబు చేసింది, నా భార్యకి దగ్గొస్తుంది' లాంటి వ్యక్తిగతమైన లేఖలతో సహా) ప్రతి అక్షరాన్ని పబ్లిష్ చెయ్యడమే మహత్కార్యంగా కొందరు పబ్లిషర్లు పూనుకున్నారు (ఎందుకో తెలీదు). తత్కారణంగా శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు కూడా ఆయన సమగ్ర సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఈ కంప్లీట్ వర్క్స్ పట్ల నా అభిప్రాయం 'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే! అంటూ ఇంతకుముందొకసారి రాశాను.  సరే! పబ్లిషర్ల దగ్గర డబ్బులున్నాయి, ముద్రణా యంత్రాలున్నాయి. వాళ్ళిష్టం! వద్దంటానికి మనమెవరం?

నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరినప్పుడు అక్కడి ప్రొఫెసర్ చెప్పే రోగి మంచం పక్కన పాఠాలు (bedside teaching) విని చాలా ఇంప్రెస్ అయిపొయ్యాను. చిన్న సంగతిక్కూడా ఎన్నో జర్నల్స్‌ని రిఫరెన్సులుగా అలవోకగా కోట్ చేస్తూ ఆయన పాఠాలు చెప్పే విధానం బహు ముచ్చటగా అనిపించింది. అటు తరవాత ఆయనకి సైకియాట్రీ జ్ఞానం టన్నుల కొద్దీ వుందనీ, నేను మొదట్లో విన్నది కొన్ని గ్రాములు మాత్రమేననీ తెలుసుకున్నాను. అంతేకాదు - ఆయన ఆ జ్ఞానంతోనే మన తాట తీస్తాడనీ, డొక్కా చించి డోలు వాయిస్తాడని కూడా అనుభవ పూర్వకంగా అర్ధం చేసుకున్నాను ( ఆయన నా థీసిస్ గైడ్ కూడా - అందువల్ల).

అట్లాగే శ్రీశ్రీ సినిమా పాటలు కూడా శ్రీశ్రీ సాహిత్యంలో టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అనీ, అవి శ్రీశ్రీ బ్రతువు తెరువు కోసం రాసిన అద్దె పంక్తులే (దర్శకుడి ఆలోచనల మేరకు రాసిన) తప్ప, శ్రీశ్రీ సాహిత్యస్థాయికి ఏ మాత్రం సరితూగవని అనుకుంటున్నాను. అంతేకాదు - ఆ పాటల్ని పబ్లిష్ చెయ్యడం (శ్రీశ్రీ అభిమానుల్ని తృప్తి పరచడం తప్పించి) తెలుగు సాహిత్యానికి పెద్దగా ప్రయోజనం లేదని నా అభిప్రాయం. 'నా అభిప్రాయం' అంటూ ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నానంటే - శ్రీశ్రీ అభిమానులు, సినీప్రేమికులు నామీద 'గయ్యి'మనకుండా వుండటానికి (ముందు జాగ్రత్త చర్యన్నమాట)!

గొప్పరచయితలు అన్నీ గొప్పగా రాయరు, ఒక్కోసారి చెత్తగా కూడా రాస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రచయితలందరికీ వర్తిస్తుంది. తెలుగు రచయితలకి మరీ వర్తిస్తుంది. చలం, కుటుంబరావు, గోపీచంద్, పద్మరాజు, అడవి బాపిరాజు, కాళీపట్నం రామారావుల రచనలు కొన్ని చదువుతుంటే అమృతాంజనం ఎడ్వర్టైజ్‌మెంట్ కోసం రాసినట్లుంటాయి!

మరప్పుడు ఈ సమగ్ర సాహిత్యాల వల్ల కలుగు ప్రయోజనమేమి? పోతన పద్యాల్లో పదవిన్యాసము, గురజాడ రచనల్లో గురుత్వాకర్షణశక్తి అంటూ డాక్టరేట్ల కోసం యూనివర్సిటీల్లో జరిగే పరిశోధకులకి ఉపయుక్తంగా ఉండటం ఒక ప్రయోజనం. లబ్దప్రతిష్టులైన రచయితలు కూడా - మనకి తెలిసిన మంచి రచనలతో పాటు మనకి తెలీని (చదవాల్సిన అవసరం లేని) రచనలు కూడా చాలా చేశారని తెలుకోవటం మరో ప్రయోజనం. భగవంతుని సృష్టిలో ఉపయోగపడని వస్తువంటూ ఏదీ లేదని ఎవరో చెప్పగా విన్నాను.. నిజమే అయ్యుంటుంది!

ముగింపు -

ఈ మధ్య ఫలానా తెలుగు కవి లేక రచయిత 'వందేళ్ళ జయంతి' అంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు గవర్నమెంటు డబ్బుల్తో జాతరలు నిర్వహిస్తున్నారు. ఇదోరకంగా కుటీర పరిశ్రమ, ఇంకోరకంగా గిట్టుబాటు వ్యవహారం. అయినా ఊరుకోలేక 'గురజాడ మహాశయా! మీకు ప్రమోషనొచ్చింది' అంటూ రాశాను (నాకు బుద్ధి లేదు). 

అయితే - శ్రీశ్రీ వందేళ్ళ పండగని సీపీఐ పార్టీ వారు ఘనంగా నిర్వహించారు! సీపీఐ వారికి శ్రీశ్రీతో కనెక్షనేంటబ్బా? అర్ధం కాక, నాకు తెలిసిన కొంతమందిని అడిగాను. పాపం! వాళ్ళూ తెల్లమొహం వేశారు.

ఇందుకు నా బ్యాంక్ స్నేహితుడు (బ్యాంకు ఉద్యోగస్తులకి లాభనష్టాల లెక్కలు బాగా తెలుసు) చెప్పిన సమాధానం - 'ఇందులో ఆలోచించడానికేముంది? విశాలాంధ్ర వారు శ్రీశ్రీ చేతిలో పదోపరకో పెట్టి ఆయన మహాప్రస్థానాన్ని లెక్కలేనన్ని ఎడిషన్లు వేసుకుని విపరీతంగా అమ్ముకున్నారు. బహుశా ఆ కృతజ్ఞతతో ఈ శ్రీశ్రీ పండగ చేసుకుంటున్నారేమో!'

ఏమో - అయ్యుండొచ్చు! నాకైతే తెలీదు!