Monday, 2 February 2015

ఉపన్యాసాలకి మోసపోదామా?


"మొన్న ఒబామా ప్రసంగం విన్నావా? వినేప్పుడు భావోద్వేగంతో నా కళ్ళు చెమర్చాయి." అంటూ నా స్నేహితుడు కర్చీఫ్‌తో (మళ్ళీ) కళ్ళు తుడుచుకున్నాడు. అమెరికా అధ్యక్షుడంతటివాడు మన్దేశానికొచ్చి మనని తమతో సమానంగా కలుపేసుకుని మాట్లాడ్డం ఆయన ఉదారత, మన అదృష్టం! అంతటి గొప్ప ప్రసంగాన్ని విన్లేకపోడం నా దురదృష్టం!

ఈ లోకంలో సమస్త జీవరాసులూ భగవంతుని సృష్టేనని అంటారు! అది నల్లైనా, నక్కైనా! పులైనా, పిల్లైనా - ఏదైనా కావచ్చు. కావున - దేవుడు సృష్టించిన ఈ జీవరాసుల మంచిచెడ్డలు ఎంచి చూడ్డం సరికాదని విజ్ఞుల అభిప్రాయం. నేను విజ్ఞుణ్ని కాదు, నాకు పామంటే అసహ్యం. కారణం - ఒకపాము ఇంకో పాముని తింటుంది. నాకిది మిక్కిలి రోతగానూ, అన్యాయంగానూ తోస్తుంది. స్వజాతిని హననం చేసే ఏ జీవైనా అసహ్యించుకోదగ్గదని నేను భావిస్తాను.

నేను డిస్కవరీ, ఏనిమల్ ప్లానెట్ లాంటి టీవీ చానెళ్ళు చూడను, భయం! ఆలోచించగా - నాలో భయం కన్నా బాధే ఎక్కువగా వుందనిపిస్తుంది! పులులు గుంపుగా జింకల్ని తరుముతూ వేటాడ్డం, వాటి నోటబడిన ఆ జింకల నిస్సహాయ దృక్కులు - నా గుండెని కలచివేస్తాయి. దేవుడు పాపుల్ని మాత్రమే శిక్షిస్తాడని విన్నాను. మరి - జింకలు చేసే పాపం ఏమిటి? అవెందుకలా కౄరంగా చంపబడతున్నాయ్?

(ఓయీ అజ్ఞానీ! భగవంతుని సృష్టిరహస్యాల్ని మిడిమిడి జ్ఞానంతో ప్రశ్నించరాదు. ఆయా జంతువులు తమ పూర్వజన్మ సుకృతం వల్లనో, వికృతం వల్లనో ఆ విధంగా చావాలని బ్రహ్మదేవుడు ముందే రాసిపెట్టాడు. కాదనుటకు నువ్వెవరివి? ఇవన్నీ సృష్టి రహస్యాలు! నీకిష్టం లేపోతే టీవీ చూడ్డం మానెయ్, అంతేగానీ అధిక ప్రసంగం చెయ్యకు!)

ఈ ప్రపంచంలో అమాయకులు, అర్భకులు, పేదవారు తమ తప్పేమీ లేకుండానే - నిప్పులు కురిపించే కాలనాగులు కూడా సిగ్గు పడేంత కర్కశత్వం వల్లా, అగ్నిపర్వతాల్ని సైతం బ్రద్దలు కొట్టే కౄరత్వం వల్లా - రోజువారిగా, గంటలవారిగా, నిమిషాలవారిగా నిస్సహాయంగా బలైపోతున్నారు, మలమలా మాడిపోతున్నారు! ఇదీ సృష్టిరహస్యమేనా?

జింకపిల్ల పీక కొరికే ముందు పులి ప్రార్ధన చెయ్యవచ్చు గాక! అంతమాత్రము చేత ఆ పులిని మానవతావాదిగా నీవు భ్రమింపరాదు! అది కేవలం దొంగ ప్రార్ధన మాత్రమే! ఆ ప్రార్ధన - ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన పిడుగు ఫెడేల్మంటూ నెత్తిన పడేముందు కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు వంటిది మాత్రమే! ప్రార్ధనలు, ప్రవచనాలు మనసుని ప్రశాంతంగా వుంచగలిగేట్లైతే ఈ లోకంలో ఇంతటి దుర్మార్గాలు వుండకపోను! ఇదంతా కేవలం తెరముందు కనిపించే నాటకం మాత్రమే!

'అధ్యక్షా! చమురు కోసం మీరు ఇన్నేసి యుద్ధాలు చేయనేల? మీ ఆయుధ కంపెనీల ప్రయోజనాల కోసం మేమెందుకు కొట్టుకు చావాలి? మీకు పనికిరాని ఆయుధాలు మాకు మాత్రం ఎందుకు?' మొదలైన ప్రశ్నలు మనం అడగరాదు. ఎందుకనగా - అదికూడా సృష్టి రహస్యమే! అక్కడ దేవుడు అన్యాయం చేశాడు, ఇక్కడ అగ్రరాజ్యంగారు అన్యాయం చేస్తున్నారు (అన్యాయం మాత్రం కామన్).

ఇక్కడంతా మోసపు ముసుగులే! అందరూ వంచనా శిల్పులే! అందమైన ఈ ప్రపంచాన్ని పెంటపెంట చేసిన హిట్లర్ అంటే నాకసహ్యం (హిట్లర్‌గాణ్ని అసహ్యించుకోనివాళ్ళన్నా కూడా నాకసహ్యం). ఎందుకంటే - హిట్లర్ చాలా కమిటెడ్ హంతకుడు, గోబెల్స్‌ హిట్లర్‌కి చాలా కమిటెడ్ అనుచరుడు. ఇవ్వాళ హిట్లర్, గోబెల్స్‌గాళ్ళ కమిట్‌మెంట్‌కి అబ్బురపడే ప్రబుద్ధులు తయారయ్యారు!

రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలమంది యూదుల్ని చంపడానికి హిట్లర్ చాలా తిప్పలు పడాల్సొచ్చింది. అమెరికావాడు ఒక్క అణుబాంబుతో చులాగ్గా లక్షలాదిమందిని లేపేశాడు. హిట్లర్ అమానుష నేరాలకి జర్మనీ జాతి భారీమూల్యాన్నే చెల్లించుకుంది. కానీ - పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారంగా అమాయకులైన జపాన్ సంతతిని దారుణంగా జైళ్ళల్లో కుక్కిన రూజ్‌వెల్ట్‌ నేరానిగ్గానీ, అణుబాంబుని జనావాస పట్టణాలపై వేయించిన హేరీ ట్రూమన్ నేరానిగ్గానీ శిక్ష పడ్డట్టు నాకు తెలీదు. ఇవన్నీ సృష్టి రహస్యాలు - మనం ప్రశ్నించరాదు!

అటుతర్వాత అమెరికా కులాసాగా వియత్నాంలో యుద్ధం చేసుకుంది. అలా - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అమెరికా ఎన్నో దేశాలపై యుద్ధం చేస్తూనే వుంది (ఈ లిస్టు పెద్దది). పాపం అమెరికా! లోకకల్యాణం కోసం బాధతో, దుఃఖంతో, తప్పనిసరి పరిస్థితుల్లో పళ్ళ బిగువున యుద్ధాలు చెయ్యాల్సొస్తుంది! కానీ - వారికెందుకో క్రూరమైన సౌదీ అరేబియా రాచరికం మాత్రం పరమ పవిత్రం. ఇది కూడా సృష్టి రహస్యమే!

ఇవన్నీ రక్తచరిత్రలు. ఫక్తు ఫ్యాక్షనిస్టు రాజకీయాలు. పులి చంపిన లేడి నెత్తురు చిక్కగా, వెచ్చగా సింగిల్ మాల్ట్ విస్కీలా గొంతులో జారుతుండగా - అర్ధ నిమీలి నేత్రాలతో పులిగారు నీతులు చెప్పబూనడం వినేవాళ్ళకి బాగానే వుండొచ్చు. ఆ స్వరం వెనుక దాగున్న రాయిలాంటి హృదయం కనిపించకపోవచ్చు. అందుకే ఆ నీతులు నా స్నేహితుడిలాంటివారి చేత కన్నీరు కార్పించవచ్చు.

ఇప్పుడు చైనా చాలా వేగంగా ముందుకెళ్తుందనీ, చైనా భయం అమెరికాని వణికిస్తుందనీ, అందుకే అమెరికా తన వ్యాపార ప్రయోజనాల నిమిత్తం భారత మార్కెట్ కోసం ఆత్ర పడుతుందని ప్రపంచ రాజకీయాల్ని మాట్లాడే నా స్నేహితుడు చెబుతుంటాడు. అంటే - అధ్యక్షులవారు ఎంత తియ్యగా మాట్లాడినప్పటికీ - అది వ్యాపార ప్రయోజనం తప్ప మరేదీ కాదన్న మాట! అవును - ఆయనకి ఓట్లేసి గెలిపించుకుంది అమెరికా పౌరులు కాని భారత పౌరులు కాదు గదా! మరప్పుడు నా మిత్రుడికి ఉద్వేగం ఎందుకు!?

ప్రపంచానికిప్పుడు చైనా అనే కొత్త విలన్‌గాడు చాప కింద నీరులా విస్తరిస్తున్నాడన్నమాట! వీడి చరిత్రా హీనమే - తియనాన్మెన్ మారణ కాండ గుర్తుంది కదూ! నాకీ ప్రపంచ రాజకీయాల కన్నా పురాణాలే నయమనిపిస్తుంది. పురాణాల్లో రకరకాల రాక్షసులు చివరాకరికి విష్ణుమూర్తి అవతారాల చేతిలో వధించబడతారు. కానీ - రాజకీయాల్లో మాత్రం రాక్షసుల్దే రాజ్యం! రక్షిస్తామని చెప్పేవాడు కూడా - విష్ణుమూర్తి మాస్కుతో వచ్చే డ్రామా కంపెనీవాడే అయ్యుంటాడు గానీ - నిజమైన దేవుడు కాడు! ఇవన్నీ సృష్టి రహస్యాలు! మనం ప్రశ్నించరాదు!

రాక్షసులు నల్లటి చర్మం, చింపిరిజుట్టు, కోరమీసం, బానకడుపుల్తో చూడ్డానికి భయంకరంగానూ, అసహ్యంగానూ వుంటారు. పులులకి పచ్చని చర్మంపై నల్లని చారలుంటాయి, నోట్లో పదునైన కోరలుంటాయి. మనమీ శత్రువుల్ని తేలిగ్గానే గుర్తు పట్టేస్తాం. కానీ - ఈ ఆధునిక ప్రపంచంలో రాక్షసులు, పులులు కూడా టిప్‌టాప్‌గా దర్జాగా విమానాల్లో తిరుగుతుంటారు. మెత్తగా, తియ్యగా, మృదువుగా కబుర్లు చెబుతుంటారు. వాడు మన శత్రువో, మిత్రుడో అర్ధం చేసుకోడం కష్టం!

ఉపన్యాసం ఒక కళ. ఉపన్యాస కళాకారులకి పద్మ ఎవార్డులిచ్చి గౌరవించుకునే సంస్కృతి మనది! చక్కగా ఉపన్యసించేవారి కబుర్లు నిజమనుకుని మురిసిపొయ్యేవారికి నా సానుభూతి. నేనైతే - ఆ కబుర్లు చెప్పేవాడి గతచరిత్ర, వర్తమాన ఆచరణ అన్నీ గమనించాలంటాను. అప్రమత్తంగా లేకపోతే - హంతకుడు అహింస గూర్చి, దుర్మార్గుడు మంచితనం గూర్చి ఉపన్యాసం ఇస్తారు. నక్కలు నిజాయితీ గూర్చి, సింహం శాకాహారం గూర్చి పాఠాలు చెబ్తాయి! అంచేత - మనం ఉపన్యాసాలకి మోసపోరాదు! తస్మాత్ జాగ్రత్త!!