Friday 13 February 2015

డాక్టర్ కేశవరెడ్డి


ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ కేశవరెడ్డి ఇవ్వాల్టినుండి ఇకలేరు. ఆయన నాన్ హాడ్జికిన్స్ లింఫోమాతో ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు, ఎక్కువ బాధ పడకుండా పోవాలని కోరుకున్నాను. మరణం ఎవరికైనా, ఎప్పటికైనా తప్పదు. నేనెప్పుడూ నాకు ఇష్టమైనవాళ్ళు హాయిగా, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ వుంటాను. ఇది మీకు సిల్లీగా అనిపించొచ్చు. నాకు మాత్రం - ఐసియుల్లో మృత్యువుతో పోరాడే అభాగ్యుల్ని చూసినప్పుడు అలాగే అనిపిస్తుంటుంది.

ప్రపంచవ్యాప్తంగా రచనలు రకరకాలు. సరదా రచనలు, వ్యంగ్య రచనలు, వాస్తవిక రచనలు, అధివాస్తవిక రచనలు, అర్ధం కాని రచనలు, అర్ధం పర్ధం లేని రచనలు - ఇలా. తెలుగు సాహిత్యం చెప్పుకోదగ్గంత స్థాయిలో లేదనేది నా అభిప్రాయం. అందుక్కారణం - భారద్దేశంలో, అందునా తెలుగు దేశంలో అక్షరాస్యులు బహుకొద్ది. ఆ కొద్దిలో ఎక్కువమంది ఉద్యోగం కోసం ఉపయోగపడే చదువులకి పరిమితం. కాబట్టి - తెలుగులో సాహిత్యం చదివేవాళ్ళు అతి తక్కువ. ఆ తక్కువ్వాళ్ళల్లో పుస్తకం కొని చదివేవాళ్ళు మరీ తక్కువ. అందువల్ల మనకి పత్రికలు తక్కువ, పుస్తకాలు తక్కువ, పబ్లిషర్లు తక్కువ. కావున - (సహజంగానే) రచయితలకి సంపాదన తక్కువ!

తెలుగులో అనేక రకాల రచనలు. వాటిలో ఎక్కువ రచనలు బజ్జీలు, పునుగులు పొట్లాలుగా కట్టుకోడానికి తప్ప ఇంకెందుకూ పనికిరావు. అతితక్కువ రచనలు మాత్రమే నాలుక్కాలాల పాటు భద్రంగా దాచుకోదగ్గవి. కొందరి రచనలు చదవడం బ్రాండెడ్ చికెన్ తిండంతో సమానం - తినేప్పుడు బాగుంటుంది కానీ, తిన్నాక కడుపు పాడవుతుంది! కేశవరెడ్డిది యే కేటగిరీయో ఆయన్ని చదివిన పాఠకులే నిర్ణయించుకోవాలి. 

నేను మాత్రం కేశవరెడ్డిని తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ రచయితగా భావిస్తున్నాను. నా ఈ భావనకి కొన్ని దశాబ్దాల చరిత్ర వుంది. ఆయన అప్పుడెప్పుడో ఆంధ్రపత్రికలో సీరియల్‌గా రాసిన 'ఇన్‌క్రెడిబుల్ గాడెస్' చదివి అర్జంటుగా కేశవరెడ్డి అభిమానిగా మారిపొయ్యాను. 'సిటీ బ్యూటిఫుల్' చదివాకా ఆ అభిమానం అమాంతంగా పెరిగిపోయింది!

గురజాడ అప్పారావు బ్రతికున్నప్పుడు - భవిష్యత్తరాలు తన రచనల గూర్చి (ఈ 'గూర్చి' పరిమాణంలో ఆయన రాసిన సాహిత్యం కన్నా ఎక్కువ) అంతకాలం మాట్లాడుకుంటారని ఆయనకి తెలీదు, తెలిసే అవకాశమూ లేదు. అలాగే కేశవరెడ్డి రచనలు కూడా వయసు ఎక్కువవుతున్న కొద్దీ (సింగిల్ మాల్ట్ విస్కీలాగా) మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంటాయనే నమ్మకం నాకుంది.

తెలుగువాళ్లకో దురలవాటు వుంది. గొప్ప రచయితల్ని దేవుళ్ళుగా, వారి రచనల్ని పవిత్ర గ్రంధాలుగా చేసేస్తారు. ఇది తెలుగుజాతికున్న రోగం! వారీ రోగాన్ని వదిలించుకుని  కేశవరెడ్డి రచనలపై విశ్లేషణాత్మక, వివరణాత్మక చర్చలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 

అయ్యా కేశవరెడ్డిగారూ! మా తెలుగుజాతికి మీ వంతుగా గొప్పసాహిత్యాన్ని సృష్టించి (మా మొహాన కొట్టి) తాపీగా వెళ్ళిపొయ్యారు. అందుగ్గానూ - మీకు మేం మిక్కిలిగా ఋణపడిపొయ్యాం. తెలుగుజాతి ఏం చేసినా ఈ ఋణం తీరేది కాదు కావున - అదలా వుంచేసుకుంటాం!

అన్నట్లు - శ్రీశ్రీ, రావిశాస్త్రి బోల్డన్ని సిగెరెట్లు తగలేస్తూ పైన మీకోసం ఎదురు చూస్తున్నారని అభిజ్ఞువర్గాల భోగట్టా! వాళ్ళు మీతో చాలా విషయాలు మాట్లాడాల్ట! పైన మీకు మంచి కంపెనీ వుందబ్బా! ఎంజాయ్!!

(photo courtesy : Google)