Friday, 1 May 2015

బాబాగారికో విన్నపం


వారు యోగాసనాల గురువు. ఆయన ఉన్నత వర్గాల వారికి గుండెల నిండుగా గాలి ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తారు. ఆపై కాళ్ళూ చేతులతో అనేక విన్యాసాలు చేయిస్తారు. మంచిది, సుఖమయ జీవనానికి అలవాటైనవారికి కూసింత కొవ్వు కరిగించుకోడానికి గురువుగారు సాయం చేస్తుంటే ఎవరికి మాత్రం అభ్యంతరం?

వారికి రాజకీయ రంగం పట్ల ఆసక్తి వుంది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావాలని తెగ తాపత్రయ పడ్డారు. అందుకోసం గొప్ప ఉద్యమం కూడా చేశారు. మంచిది, ప్రజలకి సేవ చెయ్యాలంటే రాజకీయ రంగాన్ని మించింది మరేదీ లేదు. ఇప్పుడెందుకో ఆయన తను డిమాండ్ చేసిన నల్లదనం ఇంకా మన్దేశానికి రాలేదన్న విషయం మర్చిపొయ్యారు. బహుశా పని వొత్తిడి కారణం కావచ్చు!

వారికి ఆయుర్వేద మందుల వ్యాపారం వుంది. మంచిది, వ్యాపారం టాటా బిర్లాల సొత్తు మాత్రమే కాదు. 'కృషి వుంటే మనుషులు ఋషులౌతారు' అని ఏదో సినిమా ఒక పాట కూడా వుంది కదా! అంచేత - ఋషులు కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నందుకు సంతోషిద్దాం. 

వందల కోట్ల విలువ చేసే వారి ఫార్మసీలో మగపిల్లల్ని పుట్టించడానికి ఆయుర్వేద మందులు అమ్ముతున్నారు. ఇది నేరం అని కొందరు గిట్టనివాళ్ళు ప్రచారం చెయ్యొచ్చు. కానీ, సమాజంలో మగబిడ్డల కోసం ఆరాటం ఇప్పటిది కాదు. దశరథుడి కాలం నుండే వుంది. దశరథ మహారాజు పుత్రుల కోసం యజ్ఞం చేశాడే గానీ పుత్రికల కోసం చెయ్యలేదు. 

మెడికల్ సైన్సు క్షుద్రమైనది. అది - మన పవిత్ర తాళపత్ర గ్రంధాల్ని, అందుగల అమోఘమైన శాస్త్రీయ విషయాల్ని తొక్కిపట్టడానికి పాశ్చాత్యులు పన్నిన కుట్రలో భాగం. అందుకే పిల్లలు కావాలన్నప్పుడు పొటెన్సీ, మోటిలిటీ, ఫెర్టిలిటీ అంటూ ఏదో చెత్త చెబుతుంటారు. అబ్బాయే కావాలంటే క్రోమోజోముల లెక్క చెబుతారు. అవన్నీ మనం పట్టించుకోరాదు. 

మగపిల్లాణ్ని పుట్టించుకోడం కోసం యజ్ఞం చెయ్యడం అనేది ఖరీదైన వ్యవహారం, అందుకే అది ప్రజల సొమ్ముతో సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే రాజులకి మాత్రమే పరిమితమైంది. ఇవ్వాళ మనకి అంత ఆర్భాటం, ఆయాసం లేకుండా ఇన్స్టంట్ ఫుడ్ మాదిరిగా మగపిల్లల్ని పుట్టించే మందుని యోగాసనాల స్వామిగారు సరసమైన ధరకి మార్కెట్లో అమ్మిస్తున్నారు. అందుకు మనం బాబాగార్ని అభినందించాలి. 

బాబాగారికో విన్నపం. అయ్యా! తమరు మీ రీసెర్చిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సామాన్య మానవులకి మరింత మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. అందువల్ల మీ మందుల్తో పుట్టబొయ్యే మగబిడ్డ భవిష్యత్తు గూర్చి తలిదండ్రులు ఆందోళన చెందకుండా - ఆ పుట్టినవాడు అయ్యేఎస్ అయ్యేందుకు అయ్యేఎస్ లేహ్యం, అమెరికాలో స్థిరపడేందుకు అమెరికా తైలం లాంటి మందుల్ని కూడా జనబాహుళ్యంలోకి తేవాలని కోరుకుంటున్నాను!