Monday 4 May 2015

మారిపోవురా కాలము..




"ఏవిఁటో! ఆ రోజులే వేరు. పెళ్ళంటే పదిరోజులపాటు చుట్టపక్కాల్తో ఇల్లు కళకళ్లాడిపొయ్యేది. ఇవ్వాళ పెళ్లంటే తూతూమంత్రంగా ఒక్కరోజు తతంగం అయిపోయింది." కాఫీ చప్పరిస్తూ గొప్ప జీవితసత్యాన్ని కనుక్కున్నట్లు గంభీరంగా అంది అమ్మ.

నాకు నవ్వొచ్చింది. 'పాతరోజులు అంత మంచివా? పెళ్లి పదిరోజులు జరిగితే గొప్పేంటి? అయినా పనీపాటా లేకుండా ఆఫ్టరాల్ ఒక పెళ్లి కోసం అన్నేసి రోజులు వృధా చెయ్యాలా? ' అనుకుని మనసులోనే నవ్వుకున్నాను!

'మా రోజుల్లో అయితేనా.. ' అంటూ ఉత్సాహంగా జ్ఞాపకాలు నెమరేసుకునే వృద్ధాప్యం బ్యాచ్ చాలా ఇళ్లల్లో వుంటుంది. నోస్టాల్జియాని ప్రేమిస్తూ.. సంస్కృతి, సాంప్రదాయం, అలవాట్లు, భాష అంతరించిపోతున్నాయని బాధపడేవాళ్లని 'గతం' ప్రేమికులు అనవచ్చునేమో! కాలంతో పాటు సమాజం కూడా నిత్యం మారుతూనే వుంటుంది. కొత్తని గ్రహిస్తూ పాతని వదిలించుకోవడం దాని లక్షణం. ఈ సంగతి 'గతం' ప్రేమికులకి తెలీదు, తెలిసినా బయటకి రాలేరు.

ఇందుకు నా చిన్నప్పటి పౌరాణిక నాటకాల్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కడ తెల్లవార్లు పద్యాలే పద్యాలు! ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు.. వరసపెట్టి గంటలకొద్దీ రాగాలు తీస్తూ పద్యాలు పాడుతూనే వుండేవాళ్ళు, 'వన్స్ మోర్' అనిపించుకునేవాళ్ళు. క్రమేపి ఈ 'వన్స్ మోర్' నాటకాలు మూలబడ్డాయి. వీటిని మళ్ళీ బ్రతికించడం కోసం కొందరు ఔత్సాహికులు నడుం బిగించారు గానీ - అరకొరగా ప్రభుత్వ నిధులు పొందడం మించి వారేమీ సాధించినట్లు లేదు.

అందరికీ అన్నీ ఇష్టం వుండవు, కొందరికి కొన్నే ఇష్టం. తరాల అంతరం పూడ్చలేం. ఒకప్పటి మన ఇష్టాల్ని వర్తమానంలోకి తెద్దామనుకోవడం అత్యాశ. నా పిల్లలకి సావిత్రి సినిమా చూపిద్దామనీ, ఘంటసాల పాట వినిపిద్దామనీ విఫల యత్నాలు చేసిన పిమ్మట - 'ఇష్టాయిష్టాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి, మన ఆలోచనలు ఇంకోళ్ల మీద రుద్దరాదు' అనే జ్ఞానోదయం కలిగింది. ఆపై నా ఆలోచనని మార్చేసుకుని - నేనూ నా ఇష్టాల చుట్టూ గిరి గీసుకున్నాను.

నాకు మసాలా దోసె ఇష్టం, ఫిల్టర్ కాఫీ ఇష్టం, సింగిల్ మాల్ట్ ఇష్టం, రావిశాస్త్రి ఇష్టం. ఈ ఇష్టాలన్నీ పూర్తిగా నాకు మాత్రమే సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. ఇవన్నీ ఇంకా ఎంతమందికి ఇష్టమో తెలీదు, ఇవి నాకుతప్ప ఇంకెవరికీ ఇష్టం లేకపోయినా నేను పట్టించుకోను. నా ఇష్టాలన్నీ చట్టవిరుద్ధమైపోయి, సౌదీ అరేబియాలోలా కౄరంగా శిక్షించే ప్రమాదం వస్తేతప్ప - వాటిని రివ్యూ చేసుకునే ఉద్దేశం కూడా లేదు!

ఇలా నా ఇష్టాల్ని నేను మాత్రమే అనుభవించేస్తూ, వాటిలోని "గొప్పదనాన్నీ", "మంచితనాన్నీ" నలుగురికీ పంచని యెడల కొన్నాళ్ళకి అవి అంతరించపోవచ్చును గదా? పోవచ్చు! నేను పొయ్యాక నా ఇష్టాలు ఏమైపోతే మాత్రం నాకెందుకు? నేను చచ్చి పిశాచాన్నయ్యాక ఏం చేస్తానో నాకు తెలీదు కదా!

అన్నట్లు - 

పిశాచం మనిషిగా వున్నప్పటి అలవాట్లనే కంటిన్యూ చేస్తుందా? సమాధానం తెలిసినవారు చెప్పగలరు. 

(posted in fb on 25/1/2018)